అనగనగా ఒక ముద్దు కథ | Summary Of Chinta Dikshitulu Muddu Story | Sakshi
Sakshi News home page

అనగనగా ఒక ముద్దు కథ

Published Mon, Jun 8 2020 1:20 AM | Last Updated on Mon, Jun 8 2020 1:20 AM

Summary Of Chinta Dikshitulu Muddu Story - Sakshi

ఈ బుద్ధి పుట్టివుంటే ఏ బాధ లేకపోను. పుట్టకపోబట్టే నేను కథ చెప్పడమూ, నీకు వినడమూ తటస్థించింది. 

‘‘అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు..’’
‘‘నాకు తెలుసులెండి ఆ కథ, మీరు చెప్పనక్కరలేదు.’’
రాత్రి భోజనము చేసి, ఆఫీసు కాగితాలు చూచుకొంటూ కూర్చున్నాను. నా భార్య తమలపాకులు చుట్టిస్తూ కథ చెప్పమన్నది. జరూరు కాగితాలు చూచుకొంటూ ఉండడము మూలాన మంచి కథ తోచకపోతే అమ్మమ్మ కథ ఒకటి మొదలు పెట్టినాను. మా అమ్మమ్మ బతికివున్న కాలములో ఎన్నో కథలు చెప్పింది. చాలా మరిచిపోయినాను. ఇప్పుడంతా కలెక్టరాఫీసు తప్ప మరే కథా లేదు. అయితే నా భార్య ఎప్పుడేది కోరితే అప్పుడది చెల్లించడము నా మతము. నా భార్యకు చిన్నతనము; ఆ కారణము చేత వేళాపాళా లేకుండా అది చెప్పమనీ, ఇది చెప్పమనీ యక్ష ప్రశ్నలు వేస్తుంటుంది. ఒకనాడు నా దగ్గికికి వచ్చి, ‘‘రైలుబండి పరిగెత్తుతుంది గదా, దానికి గుర్రాలు కడతారా, ఎద్దులు కడతారా లాగడానికి?’’ 
‘‘గుర్రాలనూ కట్టరు, ఏనుగులనూ కట్టరు. ఆవిరి శక్తి వల్ల నడుస్తుంది.’’
‘‘మీరు చెప్పక్కర లేదు. దానికి ముందర సింహాలనూ పెద్దపులులనూ కట్టుతారు.’’
‘‘అయితే అవి లాగుతున్నట్టు కనపడవేమి?’’
‘‘ఇంజనులో వుంటే ఎలా అవుపడతవి?’’
వట్టి వెర్రిపిల్ల! నేను చెప్పబోయే కథ గ్రహించి మీరు చెప్పక్కరలేదన్నది. అయినా కాదని బొంకి తప్పించుకొనవలెనని, ముందున్న కాగితములు దూరముగా పెట్టి, ‘‘కథ నీకు తెలుసునన్నావు గదా, ఏమిటో చెప్పు?’’
‘‘చెప్పనా? అనగా అనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు...’’
‘‘ఆగు, ఆగు. అదికాదు నేను చెప్పబోయేది.’’
‘‘అదే. కావలిస్తే పందెం వెయ్యండి.’’
రూపాయల పందెము ఒకమాటూ, నగ చేయించే పందెము మరోమాటూ అయినవి. ఈమాటు కొత్తరకము పందెము వేయవలెననుకొని, ‘‘నేను గెలిస్తే ఏ మడిగితే అది నీవు నా కియ్యవలె. మరి తిరగకూడదు!’’
‘‘సరే, చెప్పండి కథ.’’
తప్పనిసరి గదా అని అల్లడము ప్రారంభించాను. నేను పడ్డపాట్లు ఆ పరమాత్ముడికే ఎరుక!
∙∙ 
‘‘అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు భార్యలు. చిన్నభార్య అంటే ఆయనకు ఇష్టము. ఎప్పుడూ చిన్న భార్య అంతఃపురములోనే వుండేవాడు. అన్నట్టు, ఏడుగురు భార్యలకూ ఏడు మేడలు కట్టించినాడు. చిన్న భార్యకు ఒంటిస్తంభము మేడ. మేడ చుట్టూ తోట, తోటలో పక్షులూ లేళ్లూ. పెద్ద సరస్సు తవ్వించినాడు. దానికి నాలుగు వైపులా రాతిమెట్లు. నీటినిండా ఎర్ర తామరలు, తెల్ల తామరలు, పచ్చ తామరలు.’’
‘‘అదేమిటి? పచ్చతామరలుంటవా?’’
‘‘కాశ్మీర దేశము నుంచి తెప్పించి వేశారట. అవి బంగారములాగు వుంటవి.’’
‘‘అవన్నీ ఎందుకు? కథ చెప్పుదురు’’
‘‘ఇది కథ కాదూ! చిన్న రాణి చెలికత్తెలతో జలక్రీడలూ, దండలు గుచ్చడమూ, ఈ విధముగా హాయిగా కాలము గడుపుతున్నది. ఒకనాడు ఒక బ్రాహ్మడు మేడలోకి వచ్చినాడు. ఆయన పెద్ద జ్యోతిష్కుడట. తన మీద రాజుగారికి ఎప్పుడు దయ కలుగుతుందో చెప్పమని చిన్నరాణీ దాసీ ద్వారా బ్రాహ్మడికి కబురు పంపింది.’’
‘‘అదేమిటి? రాజుగారికి చిన్న భార్యమీద మమకారమని చెప్పినారు.’’
‘‘అవును, అన్నట్టు మరిచిపోయినాను.’’
‘‘కథ చెప్పమంటే ఏమిటో కల్పించి చెపుతున్నారు. ఇది నిజం కథ కాదు.’’
‘‘నిద్రమత్తున ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పినాను. చిన్నభార్య మేడ గోడల మీద చెక్కినారుట రకరకాల బొమ్మలు. మాణిక్యాలతో! మిగిలిన ఆరుగురికీ కోపం వచ్చింది. పట్టపు రాణికి అసూయ కూడా. ఓరవలేనితనం అంటువ్యాధి. చెవిలో నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఈ పురుగు చెలికత్తెల మాటల ద్వారా మనస్సులో ప్రవేశించి తొలవడం ప్రారంభిస్తుంది.’’
‘‘ఏమిటి, కథ మానివేసి జబ్బుల సంగతి చెపుతారు!’’
‘‘పట్టపురాణికి క్రోధం పుట్టింది. కసి ఎలాగు తీర్చుకొనడము?’’ తరువాత తోచింది కాదు. కొంచెము గడుసుతనం చేసి, ‘‘కసి ఎలా తీర్చుకుంటుందో నీవు చెప్పు?’’
‘‘చంపించవలెనని ప్రయత్నం చేసింది.’’
‘‘కాదు, మళ్లీ చెప్పు.’’
‘‘మీరు చెపుదురూ!’’
‘‘కసి తీర్చుకోవడం తన వొక్కర్తె వల్ల కాదనుకుంది. కుట్ర చెయ్యడానికి ఇద్దరు మనుషులుండవలె. ఒకడు చెప్పినదానికి రెండోవాడు తల వూపితేనే గాని మొదటివాడికి వుషారీ పుట్టదు. ఒద్దరూ ఒక మోస్తరు మనుషులే కావలె. దొంగకు దొంగవాడే స్నేహితుడు. దుర్మార్గుడికి మంచివాడితో స్నేహము పొసగదు, పైగా విషమిస్తుంది.’’
‘‘ఏమిటీ వేదాంతం, మీరు కథ నడపడం లేదు.’’
‘‘వూరికే అన్నారు, ఆడవాళ్లకు చపలచిత్తమని! రవ్వంత సేపు ఓపిక పట్టలేవు కదా!’’
‘‘ఔను, ఆడవాళ్లకి చపలచిత్తమే– మొగవాళ్ల మోస్తరే. మీరు వెళ్లే దారిని వెళ్లనియ్యకపోతే తిరగబడతారు. నాకు నిద్ర వస్తుంది. వెళ్లి పడుకుంటాను.’’
‘‘పందెం వేశానన్న మాట మరిచిపోయినావు కాబోలు’’
‘‘నిజం కథ అయితే పందెం.’’
‘‘నిజమో, కల్పనో నీకెలా తెలిసింది? పెద్దరాణీ, దాసీది కుట్ర పన్నారు. రాజుగారు తీర్పులు చెబుతూ వుండే సమయానికి సభలోకి వెళ్లదలుచుకున్నారు.’’
‘‘వెళ్లితే నలుగురూ ఏమయినా అనుకుంటారని వుండదూ?’’
‘‘పట్టు వచ్చిందంటే ఆడవాళ్లు ఎంతపనైనా చేస్తారు. అయినా నలుగురికీ తెలిసేలాగు వెళ్లుతారా ఏమిటి? మారువేషం వేసుకొని...’’
‘‘రాజు ఆనవాలు పట్టలేడు కామోసు.’’
‘‘కాపుదానిలాగు వేషం వేసుకుంటే ఎలా గుర్తుపడతాడు?’’
‘‘ఎప్పుడూ ఇలా సాధిస్తూవుంటారు. కథ కానియ్యండి’’
‘‘వాళ్లిద్దరూ చిన్నరాణికి జాబు కూడా వ్రాద్దామనుకున్నారు. ఆ, దేవుడు వెంకటేశ్వర్లు పేరు పెట్టి.’’
‘‘ఉత్తరం ఏమని?’’
‘‘చెప్పుతున్నాను కాదూ? పట్టపురాణీ దాసి ఒకనాడు చిన్నరాణీ దాసీ యింటికి వెళ్లింది. పెద్దరాణీగారు నీ దగ్గరికి పంపించినారు, నీకు కాసులపేరు బహుమతి ఇమ్మన్నారు అన్నది.’’
‘‘ఏదీ అక్కా! ఎంత బాగుంది!’’
‘‘ఇదే, నీవు పుచ్చుకోవలె. ఇదిగో చూడు, ఈ ఉత్తరం చిన్నరాణీ గారి పరుపు మీద ఉంచాలి.’’
‘‘అదెంతసేపు?’’
‘‘తర్వాత పెద్దరాణీ, దాసీ కలిసి, అదివరకనుకొన్నట్టు సభలోకి వెళ్లినారు. రాజుగారితో మొరబెట్టుకున్నారు.’’
‘‘ఇద్దరూ వకమాటే మొరబెట్టుకున్నారా?’’
‘‘లేదు, పెద్దరాణీ మొరబెట్టుకుంది. దాసీ సాక్ష్యం పలికింది.’’
‘‘ఏమని మొర?’’
‘‘భర్త తన్ను ఒల్లడం లేదనిన్నీ, ఎవర్తెనో వలిచినాడనీ. ఎందుకు వల్లడం లేదని రాజుగారు అడిగినారు. తన తప్పు ఏమీ లేదనీ, ఇంకో చిన్న పెళ్లాము దొరకడమే కారణమనీ చెప్పింది. అప్పుడు రాజుగారు అన్నారు: ఇద్దరు భార్యలను పెండ్లాడటము బట్టీ ఇద్దరినీ వకవిధంగానే చూడవలసి వుంటుందనీ, పెద్దదాన్ని ఏలకపోవడం తప్పనీ, వాడిని దండిస్తాననీ. ‘బంగారానికే తుప్పు పట్టితే ఇనుము గతి ఏమి కావలసింది’ అని వాళ్లు వెళ్లిపోయినారు. రాజుకు అప్పుడు కొంచెం అనుమానం కలిగింది.’’
‘‘నే చెప్పలేదూ, ఆనవాలు పడతాడని.’’
‘‘చెప్పావు. అయితే ఎక్కడ చెప్పవలసింది అక్కడే చెప్పవలె. కాపువాడిని తాను దండిస్తా నన్నట్లే తన్ను దైవం దండిస్తాడేమో అనుకొన్నాడు రాజు.’’
‘‘అదివరకు పుట్టింది కాదు కాబోలు ఈ బుద్ధి?’’
‘‘పుట్టివుంటే ఏ బాధ లేకపోను. పుట్టకపోబట్టే నేను కథ చెప్పడమూ, నీకు వినడమూ తటస్థించింది. తరువాత చిన్నరాణీ పక్కమీద పడివున్న ఉత్తరం చదివింది. నా భక్తురాలైన చిన్నరాణీని తిరుపతి వెంకటేశ్వర్లు దీవించి వ్రాసేది యేమనగా. రాజు నీ మూలాన పెద్దరాణీని నిర్లక్ష్యము చేస్తూవున్నాడు. ఆవిడ ఉసురుకొట్టి నీవు చెడిపోతావు... ఉత్తరము చదివేటప్పటికి చిన్నరాణి పై ప్రాణాలు పైనే పోయినవి. వింటున్నావూ? కునికిపాట్లు పడుతున్నావు.’’
‘‘కునికిపాట్లూ లేవు గినికిపాట్లూ లేవు. మా బాగాపన్నారు కుట్ర.’’
‘‘ఆడవాళ్లు గట్టివాళ్లు కారూ మరి?’’
‘‘కానిస్తురూ కథ. ఎప్పుడూ ఆడవాళ్లను దెప్పడమే మీ పని.’’
‘‘అంతే. ఆ రోజు మొదలుకొని రాజు తన భార్యలందరినీ వక్క మోస్తరుగా’’
‘‘అమ్మయ్యా, నిద్దర వస్తున్నది, వెళ్లి పడుకోవలె.’’
‘‘పందెం గెలుచుకొన్నాను. నేనడిగింది యిచ్చి మరీ కదులు.’’
‘‘ఎలా గెల్చారేమిటి?’’
‘‘నీ వనుకొన్న కథనే చెప్పింది?’’
‘‘కాకపోతే మాత్రం, నిజం కథా యేమిటి?’’
‘‘నిజం కథ కాదూ, పుస్తకాల్లో కథలలాగు లేదూ?’’
‘‘దీన్ని మీరు కల్పించారు. నే నోడినట్టు ఒప్పుకోను.’’
‘‘ఒప్పుకోకపోతే సరా?’’
‘‘బాగానే వుంది. నే నియ్యనంటూ వుంటే మీరెలా పుచ్చుకుంటారు?’’
‘‘అదో పెద్ద బ్రహ్మాండమా! ఇదుగో నీవు ఇవ్వనంటున్నా నేను పుచ్చుకొంటున్న దేమిటో చూశావా...’’             


(చింతా దీక్షితులు) 

చింతా దీక్షితులు కథ ‘ముద్దు’కు ఇది సంక్షిప్త రూపం. రచనా కాలం: 1920. సౌజన్యం: నవచేతన పబ్లిషింగ్‌ హౌజ్‌. చింతా దీక్షితులు (1891– 28 ఆగస్ట్‌ 1960) తూర్పు గోదావరి జిల్లా దంగేరులో జన్మించారు. తొలుత తన బంధువైన చింతా శంకరదీక్షితులతో కలిసి జంటకవిత్వం చెప్పారు. బాలల కోసం విశేషంగా గేయాలు రాసి, ‘బాలవాఙ్మయ బ్రహ్మ’ అనిపించుకున్నారు. కథలు, నాటకాలు రాశారు. అపరాధ పరిశోధక రచనలు చేశారు. ఏకాదశి కథలు, హాస్య కథలు, మిసెస్‌ వటీరావు కథలు, దాసరిపాట ఆయన కథాసంపుటాలు. చలంతో ఆయనకు బాగా స్నేహం. చింతా దీక్షితులు గారికి చలం రాసిన లేఖలు పుస్తక రూపంలో వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement