కథ: తండ్రి ఋణం నుంచి పిల్లలు తప్పుకోగలరా? | Funday: Sethu Malayalam Story Translated To Telugu By LR Swamy | Sakshi
Sakshi News home page

కథ: ఋణం.. తండ్రి ఋణం నుంచి పిల్లలు తప్పుకోగలరా?

Published Mon, Jul 18 2022 3:38 PM | Last Updated on Mon, Jul 18 2022 3:49 PM

Funday: Sethu Malayalam Story Translated To Telugu By LR Swamy - Sakshi

రేపటినుంచి నాన్న సంవత్సరీకాలు. సంవత్సరీకాలకు ముందు రోజు కనుక, నాన్న కచ్చితంగా వస్తారని అనుకుంటూనే వున్నాను. అనుకుంటున్నట్లుగానే నా పడక గది కిటికీ అవతల, చీకట్లో.. పొగాకు కంపు కొట్టే ఒక నీడగా, నాన్న  నిలబడి వున్నారని గమనించాను. మరో ప్రపంచం నుంచి వచ్చే వ్యక్తావ్యక్త  మాటలతో కిటికీ ఊచలకు దగ్గరగా వచ్చి నిలబడి వున్నారు నాన్న .   

‘నేను వస్తానని నువ్వు అనుకోలేదు కదూ?’ నాన్న అడిగారు. ‘వస్తారు.. వస్తారనే అనుకున్నాను’ చీకటితో చెప్పాను నేను.   ‘మరేమీటీ ఇలా చేశావు? రాత్రి హాయిగా తినేశావు.. ఫలహారం తీసుకోకుండా?’ ‘ఈ  రాత్రికి ఫలహారం తిని వుండాలని అనిపించలేదు’

‘తద్దినం ముందు రోజు రాత్రి.. ఈ ఒక్క పూటే కదా! ఈ ఒక్క పూట కూడా భోజనం చేయకుండా .. ఫలహారం తిని ఉండాలని అనిపించలేదు కదూ! పొట్ట నిండా తినేశావు’
‘తినాలని అనుకోలేదు నాన్నా..! మిత్రుడొక్కడు వచ్చాడు, అనుకోకుండా. నెలల తరువాత కలిశాం కదా! హోటల్‌కు వెళ్దాం రా.. అన్నాడు. వెళ్ళాను. వెళ్ళాక.. రెండు పెగ్గులు తాగాను. కొంత మటన్‌ కూడా తిన్నాను’

‘బాగుంది.. చాలా బాగుంది. తద్దినం ముందు రోజు రాత్రి  చేసిన భోజనం ఇదన్న మాట’ అర్థవంతంగా మూలిగారు నాన్న.  ‘సంవత్సరానికోసారైనా నాన్నగురించి నీ చిన్న చిన్న సరదాలు కూడా వదులోకోలేవన్న మాట’

చీకట్లో నాన్న ముఖం కనబడలేదు. లేకపోయినా నాన్నకి ఇప్పుడు ముఖం అంటూ ఒకటుందా? ఇప్పుడు నాన్న పొగాకు తాలూకు చిక్కని కంపుతో కూడిన ఒక జ్ఞాపకం మాత్రం కదా! జిగురుగా వున్న చీకట్లో కొబ్బరి పీచుతో చేసిన తాడు నేలను రాసుకున్నప్పుడు వచ్చే సవ్వడితో కదిలే నీడ కదా! నాన్న అంటే అంతకు మించి ఏమిటి ఇప్పుడు? కాదు, కాదు మరొకటి కూడా వుంది.

కొంతకాలంగా మమ్మల్ని వేధిస్తున్న ఒక సంతకం తాలూకు జ్ఞాపకం కూడా వుంది, నాన్న అంటే! కాసేపు ఇద్దరం మాట్లాడుకోలేదు. కాసేపు పోయాక నేనే ఊరకనే అడిగాను ..‘అక్కడ కుశలమేనా, మీకు?’

‘కుశలమే’ నాన్న చిన్నగా నవ్వారని తోచింది నాకు.  
‘ఇప్పుడు నేను స్వర్గంలో వున్నానా? నరకంలో వున్నానా? అని అనుకుంటూ వుంటారు కదూ మీరంతా! నాకు తెలుసు, మీకు తెలిసిన.. లేకపోతే మీరు విన్న, నా పనులన్నిటినీ ఏరి విడదీసి త్రాసులో తూకం చూసి లెక్కవేసి చూసి అనుకుంటారు మీరు.. నేను స్వర్గంలో వున్నానా.. నరకంలో వున్నానా అని. అలా తేల్చేస్తారు ఆ విషయం.

నువ్వు చెప్తావు స్వర్గానికి వేళ్లారని. నీ తమ్ముడు చెప్తాడు నరకంలో వున్నారని. మీ అక్క ఏం చెప్తుందనేది నాకు కచ్చితంగా తెలుసు. స్వర్గానికన్నా ఉన్నతమైన చోటు ఏదైనా ఒకటి వుంటే,  నాన్న అక్కడ ఉన్నారని చెప్తుంది అది’

‘మేం అలా ఏం ఆలోచించడం లేదు నాన్నా!’
‘అలా ఆలోచించకపోతే చాలా మంచిది. ఆ రోజుల్లో కాలానుగుణంగా నేను చేసినవి లెక్క వేసి బేరీజు వెయ్యకపోవడమే మంచిది. బతికి వున్నప్పుడు, ప్రతి ఒకడూ ఏదేదో చేస్తాడు. చెడ్డ పనులు చేస్తాడు. కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు. ఇప్పుడు చనిపోయాక, ఇక్కడ వున్నప్పుడు ఆ మంచీచెడుల లెక్క చూడడం అనవసరం.

ప్రతి ఒకడికి తనదైన దృక్పథం ఒకటి వుంటుంది కదా. అందువల్ల చూసేవీ.. తెలుసుకునేవీ భిన్నంగా వుంటాయి. లాంగ్‌ సైటు, షార్ట్‌ సైటు అనేది  కేవలం వైద్యుల మాటే కాదూ. కేవలం కనులకు సంబంధించినదీ కాదు. కళ్లెదుట వున్నవి కూడా చూడలేకపోతున్నారు కొందరు. కానీ దూరంగా వున్నవాటి గురించి కచ్చితంగా చెప్పగలం అని అనుకుంటున్నారు.

కళ్ళద్దాలు మార్చుకుంటే మార్చగలిగేది కాదు కదా, మనుషుల దృక్పథం’
‘మేం మీ గురించి మాట్లాడుకుంటూ వుంటాం. మిమ్మల్ని తలచుకుంటూ వుంటాం’ మధ్యన దూరి అన్నాను నేను.

‘మంచిది. కానీ కేవలం జన్మనిచ్చిన ఒక వ్యక్తిగా వద్దు. నేను లేకపోయినా మీరు ముగ్గురూ పుట్టేవారు.. ఎక్కడెక్కడో. నాకు ఆ నమ్మకం వుంది. బహుశా ఈ పోలికలతో, ఈ రూపులతో ఇక్కడ పుట్టకపోయివుండవచ్చు. ఒక పువ్వుగా.. చెట్టుగా.. జంతువుగా అదీ కాకపోతే మనిషిగా కూడా పుట్టివుండవచ్చు. వీటి మధ్య అంతరాలేమిటీ? అన్నిటిలోనూ ఒక ప్రాణం కొట్టుకుంటుంది కదా. మానవజన్మ అనేది పుణ్యం చేసినవాళ్ళకు మాత్రం దక్కేదని నేను నమ్మటంలేదు బాబూ’

‘మీ పిల్లలుగా పుట్టడం వల్ల మాకు మంచే జరిగింది. చెప్పుకోదగ్గ ఇబ్బందులేం ఎదుర్కొలేదు మేం’ నా గొంతులో పూర్తి నమ్మకం తొణకిసలాడిందని నాకే అనిపించలేదు.  
నాన్న నవ్వారు. నవ్వే అలవాటు లేదు అతనికి. అది తెచ్చిపెట్టుకున్న నవ్వేనని అనిపించింది. 

కిటికీ అవతల మందారాకులు కదిలాయి. జిగురు నిండిన చీకటి వాటికి అంటుకుంటున్నాయి. 
‘తద్దినం ముందు రోజు రాత్రి భోజనమైనా త్యాగం చేయలేని నువ్వేనా బాబూ .. ఈ మాటలంటున్నది? వద్దులే. పిల్లలను ఏదైనా అడిగి పుచ్చుకోవటమూ, వాళ్ళ వద్దనుంచి ఏదైనా ఆశించటమూ సరికాదు. మీరు ఎలా  ప్రవర్తించాలో చెప్పడానికి నేను ఎవరినీ? చచ్చి మట్టిలో కలిశాక నేనెవరినీ?’

ఆ మాటలు పరుషంగా తోచాయి నాకు. సాధారణంగా నాన్న అంత పరుషంగా మాట్లాడరు. 
‘కావాలని చేయలేదు నాన్నా..!’ నా గొంతు జీరబోయింది. ‘చాలా దూరం నుంచి వచ్చాడు వాడు. నా మిత్రుడు. ఒకసారి కలుద్దాం అంటే వెళ్ళాను. సంవత్సరాలు గడిచాక వచ్చాడు. కానీ వాడు వచ్చిన రోజు..’

‘అందువల్లనేం కాదు బాబూ.. అది అలా రాసిపెట్టి వుంది అంతే. అందుకే అలా జరిగింది. ఇదంతా ఒకొక్కరి మనస్తత్వాన్ని బట్టి కదా . అయినా ఏడాదికోసారి రెండు రోజులు పెద్దల కోసం కొన్నిటితో రాజీ పడడం మంచిది. ఆ రెండు రోజులైనా చేయవలసినదేముంది? వారిని మనసులో తలచుకొని నాలుగు మెతుకులు సమర్పించడం. అంతే కదా!’

నేను మాట్లాడలేదు. నాన్న నన్ను దోషిగా నిలబెట్టే విధంగా మాట్లాడడం నాకు నచ్చలేదు. గాటుగా జవాబు చెప్పడం తెలియక కాదు. కానీ వద్దనుకున్నాను. ఇలా ఎప్పుడూ మాట్లాడేవారు కాదు నాన్న. ఈ రోజు.. ఈ రోజు గత సంవత్సర కాలంగా ఏరి సేకరించి కట్టిన మాటల మూట ఇప్పుడు ఇక్కడ విప్పుతున్నారు  కాబోలు!
‘అనవసరమైన విషయాలు మాట్లాడి మీ సమయమంతా వృథా చేశాను కదూ?’

నాన్న చెప్పడం విన్నాను. ‘పోనీ అందరూ కులాసేనా?’
‘ఓ, అలా అలా గడుపుతున్నాం’
‘కొన్ని విషయాలు నాకూ తెలిశాయనుకో’ ఒక చిరునవ్వు నవ్వారు నాన్న. అంటే, నాన్నకి అది కూడా తెలిసిందనా ఉద్దేశం! కొంత కాలంగా మమ్మల్ని వేధిస్తున్న ఆ సంతకం గురించి కూడా తెలిసి వుండాలి. గట్టి నీలి రంగు కాగితం మీద వున్న ఆ సంతకం!

‘బాబూ.. నువ్వు నా పెద్ద కొడుకువి కనుక, ఈ మాట చెప్పడం లేదు. నువ్వు మంచివాడివి అనుకొని చెప్తున్నాను. బతకడం కోసం మీరు తీసే ఈ పరుగు చూస్తున్నప్పుడు నాకు, అప్పుడప్పుడు బాధ కలుగుతోంది. బల్లిలా పైకి పాకి ఇతరులను పడకొట్టి డబ్బు సంపాదించడం అంత అవసరమా? ఉన్నదాంట్లో సంతృప్తిగా గడుపుకోవచ్చుగా? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపైనా  ప్రశాంతంగా, అందరితో కలసి కూర్చోవటం కుదురుతోందా మీకు?’

‘నాన్నా.. నువ్వు  అలాగే మాట్లాడుతావు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఇవి పోటీ రోజులు. నాలుగు డబ్బులు, డబ్బులుగా చేతిలో లేకపోతే మనిషికి విలువ లేదు. అక్కడ కొంత, ఇక్కడ కొంత భూమి ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏమీలేదు’

‘భూమి తాలూకు ప్రయోజనం తెలిసేది భూమిలేని రోజుల్లోనే. జనాభా పెరిగిన కొద్ది వాటా వేసి వాటా వేసి ఒకరికి అడుగు మట్టి కూడా లేని స్థితికి వస్తే , భవిష్యత్తులో పిల్లలకు గుప్పెడు మట్టి కూడా వుండదు ఆడుకోవడానికి’

మాటలు అటు వైపు మళ్లడం నచ్చలేదు నాకు. నేను చెప్పేవి అర్థం చేసుకోలేరు నాన్న. నాన్న చెప్పేది నేను కూడా! ‘అమ్మ పెందరాడే పడుకుంది’ విషయం మార్చడం కోసం అన్నాను నేను. 

‘చూశాను. కానీ ఈ రాత్రి అంత సుళువుగా నిద్రపోదు అది’
‘అక్క, బావ, తమ్ముడు.. అందరూ అవతల వున్నారు’
‘అదీ చూశాను’
‘మీ కోసం ఎదురు చూస్తూ వున్నారు వాళ్ళు’

‘ఏమిటీ! ఎదురు చూస్తున్నారా? ఎందుకు?’
ఒక క్షణం మాట్లాడలేక పోయాను. ఎలా మొదలుపెట్టాలో తెలియక .. చీకట్లోని నీడల కదలికలను చూస్తూ మెల్లగా చెప్పాను ‘ఒక సంతకం గురించి’
‘సంతకమా? ఏ సంతకం?’

‘నాన్నా.. మీరు బ్యాంకులో అప్పుతీసుకున్నారు కదా! మూడేళ్లు గడిచాయి కనుక ఋణపత్రం తిరిగి రాయించాలి. అలా చేయాలంటే హక్కుదారులైన మేమందరం సంతకం చేయాలని చెప్తున్నారు బ్యాంకు వాళ్ళు’
‘దానికేముంది? సంతకం చేయండి. సంతకం చేయకపోయినా.. ఆ బాధ్యత నుంచి మీరు తప్పించుకోలేరు కదా! తాకట్టు పెట్టిన వస్తువు సంగతి... ’

‘అది తెలుసు. అయినా అలా గుడ్డిగా సంతకం పెట్టడమంటే.. నాకు అభ్యంతరం లేదనుకో’
‘అయితే, అభ్యంతరం ఎవరికి?’
‘బావగారికి’ చెప్పలేక చెప్పాను నేను.‘ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా ఒప్పుకోవడం లేదు అతను. అతను ఒప్పుకోనిదే అక్క సంతకం పెట్టదు కదా ’

‘అలాగా?’ గట్టిగా ఒకసారి మూలిగారు నాన్న. మందారాకులు ఒకసారి కదిలాయి. పొగాకు కంపు వచ్చింది మరీ ఘాటుగా. కిటికీ ఊచల పై ముఖం ఆనించి నన్ను ఉరిమి ఉరిమి చూస్తూ నిలబడి వుండవచ్చు నాన్న. అపరిచితమైన ఒక వేడి నా ముఖానికి తగిలింది.
‘ఎందుకు ఆ అప్పు చేశానని నీకు తెలుసుగా’

‘తెలుసు.. తమ్ముడి సీటు కోసం’
 ‘ఆ తరువాత..’ ‘తీర్చలేకపోయారు’
‘తీర్చవద్దని అనుకోలేదు కదా! ఎంత ప్రయత్నించినా తీర్చడం కుదరలేదు’ నాన్న అన్నారు . 

‘నాకు తెలుసు నాన్నా. నేను రెడీయే సంతకం పెట్టడానికి. కానీ బావగారు ఒప్పుకోవటం లేదు. అక్క సంతకం పెట్టాలి కదా’
‘తమ్ముడుకి ఇంజినీర్‌ ఉద్యోగం వస్తే, అప్పు తీర్చడానికి ఎంతోకాలం పట్టదుగా’

‘అది సరే.. కానీ ఇప్పుడు సంతకం పెట్టాలి కదా అందరూ. లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు’
‘అవును.. సంతకం పెట్టాలి. లేకపోతే ఎలాగా?’
‘కానీ బావ..’
‘ ఏం చేస్తాడట?’

‘వస్తువు వాళ్ళను తీసుకొమంటున్నాడు’
‘బాగుంది. వస్తువు అంటే ఈ ఇల్లూ.. ఈ జాగా కదా!’ తరతరాలు బతికిన మన తరవాడు (మాతృసామ్యవ్యవస్థలోని ఉమ్మడి కుటుంబ నివాసం) వేలం వేస్తే ఇతర కులస్తులు లాగేస్కోరూ..! అది అతనికి తెలియదా?’

‘అలా చెప్పడంలేదు బావ. ఇది అతని పద్ధతట. ఎవరు చేసిన అప్పు వారే తీర్చాలట. అతను ఎవరినీ అప్పు అడగడు. ఎవరికీ అప్పు ఇవ్వడు కూడా. అందువల్ల ఇంకొకరి అప్పు తీర్చడం ఇష్టంలేదు అతనికి’
‘అంటే..?’

‘నాన్నా.. నీకు తెలుసుగా అతని స్వభావం. అతనికి మొండిపట్టుదల ఎక్కువ. ఎన్నో రకాలుగా చెప్పి చూశాను’
‘అయితే..’ నాన్న నిట్టూర్చడం వినబడింది నాకు. ‘అయితే ఇక ఒకటే మార్గం. ఈ అప్పుకోసం నేను మరో జన్మ ఎత్తాలి. ఇప్పుడు మరో సంతకం పెట్టాలంటే నాకు వేళ్ళు లేవుగా. అంతే కాదు చనిపోయినవాళ్ళ సంతకాలు తీసుకోరు బ్యాంకువాళ్లు’

నేనేమీ అనలేదు. 
‘ఈ అప్పుతాలూకు బాధ్యత ఒక శృంఖలంగా వుండిపోతుందని ఆ రోజు అనుకోలేదు. ఇప్పుడు తీర్చక తప్పించుకోలేను. దానికోసం ఎన్ని జన్మలు ఎత్తవలసి వస్తుందో.. ఏమో! ఆ లోగా వడ్డీ పెరిగి పెరిగి మోయలేనంత అవుతుంది. బ్యాంకువాళ్ళు అనుకుంటే నా జన్మలను అలా అలా పొడిగించుకుంటూ పోవచ్చు’

‘నాన్నా.. నేనిప్పుడు ఏం చేయాలి?’
నాన్నకు నా మాటలు వినబడలేదేమో! తన మాటలే కొనసాగించారు .. ‘మానవ జన్మలోని తీరని గొప్ప ఋణం పూర్వీకులదని పురాణాల్లో చెప్పారు కదా! సాధారణంగా ఆలోచిస్తే ఇది తల్లిదండ్రుల రుణమే. ఆ ఋణబాధ్యత నుంచి తప్పించుకోగలమని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ సంపద అయినా అప్పు అయినా ఒకేలాంటి బాధ్యతయే.

అవి పంచుకొని బతకవలసిందే. దురదృష్టవంతులకు బహుశా అప్పు మాత్రమే బాధ్యతగా మిగులుతుందేమో! వాళ్ళని బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో కాదుగా, అప్పు చేసి తీర్చక పోవడం. చాలా ప్రయత్నించాను నేను. అప్పు తీర్చడానికి. కుదరలేదు. గొప్ప చదువు చెప్పించాను మీకు. అక్క పెళ్ళి గొప్పగా చేశాను. నాలాంటి బడి పంతులు ఇంతకన్నా ఏం చేయగలడు?’

‘నేను మరోసారి చెప్పి చూస్తాను. మీరు చెప్పారని కూడా చెప్తాను. అయినా ప్రయోజనం వుండదేమో’
ఏదో గుర్తుకొచ్చి నిట్టూర్చారు నాన్న. ‘మీ నెత్తి మీద ఇంత పెద్ద బరువు ఒకటి వేసి పోయాను కదా! నేనిప్పుడు మీకు అప్పు పడ్డాను. ఆ అప్పు ఎలా తీర్చగలను? ఇప్పుడు పని చేసి నాలుగు డబ్బులు సంపాదించలేను కదా.

నాకు తెలిసిన పని ఒకటే.. ట్యూషన్‌ చెప్పటం. నన్ను చూస్తే ఇప్పుడు పిల్లలు పరిగెత్తి  పారిపోతారు కదరా’
కాసేపు మాట్లాడలేదు నాన్న. కిటికీ అవతల నుంచి గట్టిగా ఊపిరిపీల్చే సవ్వడి వినబడింది. నాన్న ముఖం కనబడకపోవడం మంచిదేనని అనుకున్నేను. బాధ కలిగినప్పుడు ఆ ముఖం పరుషంగా మారేది. అప్పుడు ఆ ముఖం చూస్తే భయం వేసేది. హఠాత్తుగా కోపం బుసకొడుతుంది. అప్పుడు నోటికి వచ్చినట్లు తిడుతారు. ఒక నిమిషంలో చల్లారి పోతుంది కోపం. ఆ తరువాత తిట్లు తిన్నవాళ్లను పిలిచి బుజ్జగిస్తారు 

‘పెరట్లో పశ్చిమాన ఒక పనస చెట్టు వుండేది కదా నరికేశారా?’ నాన్న అడిగారు విషయం మార్చడం కోసం అన్నట్లు.  
‘కాపు తగ్గిపోయింది. మంచి రేటు వచ్చింది. నరికేయమని పట్టుపట్టాడు తమ్ముడు’ చెప్పాను.  
‘నేను వున్నప్పుడే అడిగారు ఎందరో! పనస చెట్టు విలువ, బంగారం విలువ కన్నా తక్కువ ఏం కాదు. అయినా ఇవ్వలేదు నేను. నరికిపారేయడం సుళువే. మీరంతట మీరు

ఒక మొక్కైనా నాట లేదుకదా. ఉన్నవి నరికి పారేస్తారా?’
‘ముందు నేనొప్పుకోలేదు నాన్నా.. అయినా ఖర్చులు..’
‘పెరట్లో కొబ్బరిచెట్లకు పాదు తీయడం వగైరాలు ఆపేశావా? అక్కడ బోలెడు జాగా వుందిగా. కొత్త మొక్కలు నాటవచ్చుగా. ఎవరూ  అటువైపు తొంగి చూడడం కూడా లేదు కాబోలు’

‘అన్నిటికీ నేనొకడినే కదా’ మనసులో అనుకున్నాను.. ‘చెప్పడం సుళువే. ఆఫీసు పనులూ సొంత పనులూ చూసుకొని నెలకోసారి ఇక్కడకి పరిగెత్తుకురావడానికి పడే ఇబ్బంది నాకేగా తెలుసు! అమ్మ ఇక్కడ వుంది కనుకనే ఈ మాత్రమైనా’

కాసేపు మాట్లాడలేదు నాన్న. ఆ తరువాత గొంతు తగ్గించి అన్నారు.. ‘సంవత్సరానికి ఒకసారే కదా నా రాక. అది ఇలా యాంత్రికం  కావడం నాకూ నచ్చడం లేదు. బాబూ.. మీకు ఇది కేవలం ఒక తతంగం మాత్రమే. కొంత నువ్వులూ నీరూ వదిలి పిండం పెట్టేస్తే అయిపోతుంది. కానీ నాకు ఇదొక గొప్ప వరం. ఒకసారి రావడం, కాసేపు ఇక్కడిక్కడే తచ్చాడడం.. మీ అందరినీ చూడడం.. మీరు పెట్టినది స్వీకరించడం అంతా ఒక గొప్ప అనుభూతి’

సంవత్సరానికి ఒకసారి రావడం..ఆ మాట విని హడలిపోయాను. సంవత్సరీకాలు తరువాత ఈ తతంగం కొనసాగించాలని అనుకోవడం లేదుగా. ఇక ప్రతి సంవత్సరం రావల్సిన అవసరం వుండదు . 

ఆ విషయం గురించి కచ్చితంగానే చెప్పింది అక్క. తద్దినం పేరు చెప్పుకొని ప్రతి సంవత్సరం రావడం కుదరదని ఎప్పుడో రాసింది. డబ్బు ఖర్చు మాత్రమే కాదు బావగారి సెలవు.. తన సెలవు.. పిల్లల పరీక్షలు.. అన్నీ సమస్యలే! అక్క, బావ బొంబాయిలో వుంటారు. వాళ్ళతో పోలిస్తే నేను దగ్గరలోనే ఉన్నాను. అయినా సెలవు దొరకటం నాకూ కష్టమే. తమ్ముడికి ఎక్కడ ఉద్యోగం వస్తుందో తెలియదుగా.

సమస్య వినగానే పరిష్కార మార్గం చెప్పాడు మేనమామ ..‘ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం తద్దినం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అంత తీరిక ఎవరికుంది? అందరూ ‘బిజీ’ కదా. అందువల్ల శాశ్వతంగా ఒక పని చేయవచ్చు. దానికి తగిన విధానాలు కూడా వున్నాయి కదా. వాటి వల్ల మీనాన్నకి మాత్రమే కాదు. మీ  పూర్వీకులందరి ఆత్మలకు కూడా శాంతి లభిస్తుంది’

‘ఏమిటి ఆలోచిస్తున్నావు బాబూ’ నాన్న గొంతు గట్టిగా వినబడినట్లు తోచింది నాకు. తుళ్లి పడ్డాను. నా మనసులోని ఆలోచన నాన్నతో పంచుకోవడానికి ధైర్యం చాలలేదు. మేనమామ చెప్పినట్లు చేస్తే అంతా ముగిసిపోతుంది. బంధాలన్నిటినీ నరికిపారేసి  ఆత్మను మోక్షానికి  పంపే పని అది! 

‘ఈ రోజు గురించే నేను ఎదురు చూస్తూ వున్నాను బాబూ’ గంట మోగినట్లు వినబడింది నాన్న గొంతు. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు అసలు లేదు. కానీ ఈ రెండు రోజులైనా నాకు ఇక్కడ.. ఈ ఇంట్లో.. మీ గుండెల్లో నిండి వుండాలనే ఒక కోరిక.. ఆ తరువాత వచ్చినట్లే తిరిగి వెళ్లిపోతాను. ఎవరికీ ఇబ్బందిగా వుండను’
మొద్దుబారిపోయాను నేను. 

‘బాబూ.. నీకు నిద్ర వస్తోంది కాబోలు. చాలా సేపు మాట్లాడాను కదా. అయినా సమయం గురించిన లెక్కలు ఇప్పుడు నన్ను వేధించడం లేదు. ఇప్పుడు అలా అలా ప్రవహించి వెళ్లిపోతోంది నా సమయం. తగిలీ తగలకుండా.. కొలవలేని విధంగా ఏ చలనమూ కలిగించకుండా అలా వెళ్లిపోతోంది. ఎవరికీ అందని ఆద్యంతాలు లేని సమయం. బాబూ నువ్వు వెళ్ళు.  నువ్వు వెళ్ళి పడుకో ’

మౌనంగా వుండిపోయాను నేను. 
‘వెళ్ళు. రేపు పొద్దున నేనిక్కడే వుంటాను.. ఒక కాకిగా. కాకుల గుంపులో కొంత పొడుగాటి ముక్కుతో కూడిన ఒక కాకిగా. కొంత లావుగా వున్న కాకిగా. నన్ను సుళువుగానే పోల్చగలవు నువ్వు’

బయట ఒక చిరుగాలి కదులుతూ వుంది. మందారకొమ్మలు గట్టిగా ఊగాయి. చీకట్లో ఎక్కడనుంచో ఒక కుక్క మొరిగింది. 
‘కిటికీ రెక్కలు వేసేయి’ నాన్న గొంతు వినబడింది. ‘వాన పడేలా వుంది’ 
కిటికీ తలుపులు మూయడానికి చేయి జాపాను. ఆలోగా అవే మూసుకున్నాయి. ఎవరో వేసినట్లు 

గులకరాళ్ళు పోసినట్లు ఇంటి పైకప్పు మీద వాన చినుకులు రాలే సవ్వడి వినబడింది. నిద్ర పట్టలేదు. తొలకరికి లేచిన వేడి వల్ల నిద్ర పట్టక అటూ ఇటూ తిరిగి పడుకున్నప్పుడు గుర్తుకొచ్చింది..         

పిండం పెట్టినప్పుడు కాకిగా నాన్న వస్తారా? అంత తొందరగా లోంగే మనిషి కాదు నాన్న. మొండి. తెలతెల్ల వారుతుండగా మైకంలోకి జారుతున్నప్పుడు అనుకున్నాను.. రాబోయే రెండు మూడు సంవత్సరాలైనా తద్దినం పెట్టాలి. అక్కకి తమ్ముడికీ కచ్చితంగా చెప్పాలి.. మామయ్య చెప్పినట్లు చేయకూడదని.  
మరీ ఆ సంతకం గురించి.. సంతకం పెట్టడమే. తండ్రి ఋణం నుంచి పిల్లలు తప్పుకోగలరా ?

--మలయాళ మూలం : సేతు
--తెలుగు సేత : ఎల్‌.ఆర్‌.స్వామి  
(రచనా కాలం –1992)
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement