కథ: అద్దం.. అప్పుడు అసహ్యంగా కనిపించింది.. ఇప్పుడేమో! | Funday Magazine: Sheelam Bhadrayya Addam Telugu Story | Sakshi
Sakshi News home page

కథ: అద్దం.. అప్పుడు అసహ్యంగా కనిపించింది.. ఇప్పుడేమో!

Published Mon, Jul 11 2022 4:01 PM | Last Updated on Mon, Jul 11 2022 4:06 PM

Funday Magazine: Sheelam Bhadrayya Addam Telugu Story - Sakshi

ఇవ్వాళ పదవీ విరమణ. పోలీసుశాఖలో ఉద్యోగం. అలవాటు కొద్దీ త్వరగా నిద్రలేచాను. నాలుగింటికే వచ్చే పేపరు బాయ్‌ ఇంకా రాలేదు. సీనియర్లు రిటైరైయినప్పుడు మా ఆఫీసులో పెద్ద అట్టహాసమే జరుగుతుంది. ఆలోచిస్తూ బ్రష్‌ చేసుకొని స్నానానికని బాత్రూమ్‌లోకి వెళ్లా. యాథాలాపంగా చిన్నలైట్‌కు బదులు పెద్దలైట్‌ వేశాను.

అద్దంలో నెరిసిన జుట్టు  వెండిలా తెల్లగా మెరుస్తోంది. రిటైర్మెంట్‌ ఆలోచనల్లోనున్న నాకు, హఠాత్తుగా ఓ విషయం గుర్తుకొచ్చింది. అదే.. నాకు అద్దమంటే చాలా భయం. అద్దం నాకు నచ్చదు. ఈరోజు నాకు విచిత్రంగా తోచింది. భయం పోయిందా? నిజమా! కలా? గిల్లి చూసుకున్నాను. ‘పేపర్‌..’ బయట పేపర్‌ బాయ్‌ అరుపు వినబడింది. ‘కల కాదు నిజమే!’

అద్దమంటే నాకున్న అయిష్టం, భయం ఇప్పటిది కాదు. నాన్న దూరమైనప్పటిది. చానాళ్ల తరువాత ఈరోజు అద్దాన్ని ఇలా ధైర్యంగా చూస్తున్నా. ‘అద్దం మసకగా కన్పిస్తోంది.  నిజంగా మసకబారిందా? లేక నా కంటిచూపు మందగించిందా? తెలియలేదు. అద్దంలో మరకలున్నాయేమోనని శ్రద్ధగా టవల్‌ బెట్టి తుడిచాను. అయినా అవి పోలేదు. అవి నా మనసుపై పడిన మరకలు. రవి గుర్తుకొచ్చాడు. 

నాన్న గుర్తుకొచ్చినపుడల్లా రవి గుర్తుకొస్తాడు. అద్దంలాగే వాళ్ళు నిజానికి ప్రతిబింబాలు. వాళ్ళ జ్ఞాపకాలు నా మనసు మీద బలంగా నాటుకుపోయిన అద్దానికి సాక్ష్యాలు. వాళ్ళు గుర్తుకురాగానే నా ముఖం వివర్ణమైంది. క్రమంగా వికృతమైంది. ఇంతకు ముందయితే ఇలాంటప్పుడు అద్దం పగలగొట్టాలనే కోరిక బలంగా ఉండేది.

‘ముఖం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నట్టు’ సామెత గుర్తుకొచ్చింది. వైరాగ్యం ఆవహించింది. అద్దంలో నిజమే కన్పిస్తుందంటారు.. మరి ఇది నా ముఖం కాదుకదా. నా ముఖం ఎక్కడ? అద్దాన్ని మనసు ప్రశ్నిస్తూనే ఉంది. ఎంత అహంకారం.

అది జవాబివ్వదు. నాకెప్పుడూ అద్దం అందంగా కనపడదు. అలాంటప్పుడు ఈ అద్దాన్ని నేనెందుకు చూడాలి? నాన్న, రవి ఆలోచనలతో మనసంతా సంతలో మనుషుల్లా గజిబిజిగా మారింది. 
∙∙ 
ముప్పై సంవత్సరాలుగా ఉద్యోగ జీవితంలో పోలీసు యూనిఫామ్‌ భాగమైంది. ఆఫీసరు హోదా, దర్జా ఎప్పుడూ నా వెంటే ఉండేవి. వాటికోసం నేను అద్దం ముందు నిలబడక తప్పేది కాదు. నిలబడ్డప్పుడు ప్రపంచం చూసే ముఖం అందంగా కన్పించేది. కాసేపట్లో గతం గుర్తుకొచ్చి అద్దంలో రంగులు మారేవి. అద్దానికి జీవగుణం ఉందనిపించేది. ఊసరవెల్లిలా దానికిన్ని రంగులు ఎలా అబ్బాయో?

ఎంత ఆలోచించినా అర్థంకాదు. అద్దం అబద్ధం చెప్పదు అంటారు కదా. మరి నాకెందుకు అబద్ధం చెబుతోంది. నా నిజరూపాన్ని ఎందుకు చూపడం లేదు? చాలాసార్లు నిలదీశా! లక్ష్యపెట్టలేదు. దానిపని దానిది, నా పని నాదే అయింది. కాలం గడిచిపోయింది. నా సర్వీసు మొత్తం ఆ జ్ఞాపకాలను మోయలేక, వర్తమానాన్ని భరించలేక.. అదో అవస్థ. 
∙∙ 
బొడ్డుతాడు ఊడిపడక ముందే బస్టాండులో వదిలేసిన రవిని పుణ్యాత్ములెవరో అనాథాశ్రమంలో చేర్చారు. గాంధీజయంతికి ఒకసారక్కడికి వెళ్లాను. అక్కడ నూటా యాభైమందికి పైగా పిల్లలున్నారు. ముందువరుసలో చురుగ్గానున్న ఆ పిల్లవాడు నన్ను ఆకర్షించాడు. గళ్లచొక్కా, పొట్టి నిక్కరు. చందమామవంటి మోము. పెద్ద కళ్ళు. నల్లటి ఉంగరాల జుత్తు. చక్కని కంఠం. దర్జా ఉట్టిపడేలా రూపురేఖలు. అతనే రవి.

వేదికమీదున్న అందరి దృష్టి రవిపైనే. ప్రసంగాలు పూర్తయి బహుమతి ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఆటలు, పాటలు, చదువు అన్నింటిలోనూ రవే మొదటి బహుమతి విజేత. కార్యక్రమం చివరలో రవి కీబోర్డును వాయిస్తూ అమ్మానాన్నపై ఎంత అద్భుతంగా పాడాడు?! అందరూ ముచ్చటపడ్డారు. వచ్చిన అతిథులంతా తమకు తోచిన సాయం ప్రకటించారు.

నేను మాత్రం బయటపడలేదు. నా మనసు నన్ను ప్రశ్నించింది. దాని గొంతును అధికారంతో నోక్కేశాను. వెళ్తూ వెళ్తూ రవిని దగ్గరికి పిలిచి ‘ఏం చదువుతున్నావ’ని అడిగాను. ‘పదోతరగతి సార్‌’ చేతులు కట్టుకుని వినయంగా చెప్పాడు. జీప్‌లో స్టేషనుకు బయల్దేరాను. ఆశ్రమం వదిలినా, మనసులో రవి టాలెంట్‌ చెదిరిపోలేదు. 
∙∙ 
డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్నాను. ‘అంత టాలెంట్‌ నా పిల్లలలో కూడా లేదాయే’. రవి మీద అసూయ కలిగింది. రవి ఆలోచనలతో ఉన్న నేను అప్రయత్నంగా ఇంట్లోనున్న అద్దంలో నా మొఖాన్ని చూశాను. అద్దం దాని బుద్ధి చూపింది. ఛ.. అసహ్యంగా కన్పించింది. అద్దాన్ని తుడవమని నా శ్రీమతికి చెప్పాను. ఈ అద్దం నాకు నచ్చలేదు.

అద్దం మార్చమనీ చెప్పాను. పడుకునేటప్పుడు ఆలోచించాను. కొంపదీసి అద్దం నన్ను పగబట్టిందా? ఆ ఊహకే నాకు నవ్వొచ్చింది. అద్దం నాకు శత్రువా? మిత్రువా? అద్దాన్ని చిన్నప్పుడు నా మిత్రుడిలా భావించాను. రహస్యాలు చెప్పుకున్నాను. నా భాధలు, ఆనందాలను పంచుకున్నాను.

నా మాటలన్నీ అద్దానికే ముందు విన్పించే వాడిని. ఈ అద్దానికి విశ్వాసం లేదు. దానిదంతా మనిషిలాగే వక్రబుద్ధి. స్వార్థబుద్ధి్ద. అద్దం అబద్ధం. అద్దంతో నాకు ఏ బంధుత్వం లేదనిపించింది. అప్పుడప్పుడూ చూసే అద్దాన్ని ఇకపై మొత్తానికే చూడొద్దని తీర్మానించుకున్నాను. హాయిగా నిద్రపట్టింది.
∙∙ 
ఈలోగా కరెంటు పోయొచ్చింది. చీకటిలోనున్న గతంపైకి వెలుగొచ్చింది. అద్దం తేటగా ఉంది. రవి ఆలోచనల నుండి బయటకొచ్చాను. ఎందుకో అద్దం ఈరోజు బాత్రూమ్‌లో గురువులా కన్పిస్తోంది. నాతో ఏదో చెప్పాలని సిద్ధమైనట్టుంది. ఉద్యోగంలో చేరిన మొదటిరోజు సినిమా రీలులా జ్ఞాపకానికి వచ్చింది.

ఉద్యోగం సాధించడానికి ఎంత శ్రమ పడ్డాను. ఉద్యోగంలో చేరిన ఆరోజు అమ్మ ఎంతో సంతోషించింది. నాన్న గుర్తుకొచ్చాడు. నా భావాన్ని అర్థం చేసుకున్న అద్దం కన్నీరు కారుస్తోంది. కొంపదీసి అద్దానిది మొసలి కన్నీరు కాదుకదా? పోలీసోడిని. నీడను సైతం నమ్మరాదని శిక్షణలో ఉగ్గుపాలతో రంగరించి చెబుతారు. అద్దంపై జాలి కలిగింది.

ఆర్తితో అద్దం కన్నీళ్లు తుడిచాను. తేటగయ్యింది. ఇప్పుడు ముఖం తేటగా కనపడుతోంది. అద్దానికి కూడా హృదయం ఉన్నట్టుంది. ఆలోచనలు నా మదిని నింపినట్టే.. వదిలిన ట్యాప్‌.. బకెట్‌ను నింపింది. నీళ్ళచప్పుడుకు ఈలోకంలోకి వచ్చాను.

నీళ్ళు మగ్గులో తీసుకొని వంటిపై పోసుకున్నాను. కమ్మని మట్టిపరిమళం. ఆశ్చర్యపోయాను. అరె! కాంక్రీటు జంగిల్లో మట్టివాసనా? ఎక్కడినుండి వస్తుందని చుట్టూ వెదికాను. అది నా శరీరం నుండేనని కాసేపటికి తెలిసింది. తృప్తిగా పీల్చాను. మట్టివాసనతో నా ఆలోచనలు క్షణాల్లో ఊరికి పరిగెత్తాయి.
∙∙ 
నాది నకిరేకల్‌ దగ్గర ఒగోడు. మొదట పోలీసుశాఖలో నేను ఎస్‌.ఐగా జాయిన్‌ అయ్యాను. అంచెలంచెలుగా డీఎస్పీ స్థాయి వరకు పదోన్నతి పొందాను. మాది సాధారణ రైతు కుటుంబం. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న తాత అమరవీరుడు.

నికార్సయిన నిజాం విముక్తి పోరాటానికి గెరిల్లా దళాన్ని చాకచక్యంగా నడిపిన తాత గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. చూడటానికి తాత, నాన్న అన్నదమ్ములవలె ఉండేవారట. తాత రూపు, భావాలకు నాన్న అద్దంలో  ప్రతిబింబంలా ఉండేవాడు. తాత అభ్యుదయ భావాలను నాన్న జీవితాంతం బాధ్యతగా మోశారు.  

ఆరోజుల్లో నాన్న ఉర్దూ మీడియంలో నాలుగు వరకు చదువుకున్నాడు. మంచి వక్త. చైతన్యం కలిగిన వాడు మాత్రమే కాదు. మాటలను నిప్పురవ్వలా మార్చి చైతన్య కాగడాలను వెలిగించే మనిషి. దాంతో ఉన్నోళ్లకు శత్రువయ్యాడు.

లేనోళ్లకు బంధువయ్యాడు. ‘దున్నేవానిదే భూమి’. ఈమాట నాన్న నోటినుండి ప్రతిరోజూ పాఠంలా వినేవాణ్ణి. అలాగని నాన్న హింసావాది కాదు. గాంధీని చాలా ఇష్టపడేవాడు. దేశానికి ‘గాంధేయ కమ్యూనిజం’  కావాలనేవాడు. ఆమాట విన్న కమ్యూనిస్టులు నాన్నను విచిత్రంగా చూసేవారు.

నాన్న భావజాలం, ఆలోచనలు నా ఆలోచనా పరిధిని పెంచాయి. నాకు బడి ఎంతో, ఇల్లూ అంతే. రెండు చోట్లా బోధనే జరిగేది. అప్పుడు నేను ఆరోతరగతిలో ఉన్నాను. సాంఘికశాస్త్రం మాస్టారు ‘భూమి నిలకడగా ఉండదు. ఆకర్షణతో ఎల్లప్పుడూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది’ అని చెప్పారు.

ఆశ్చర్యమేసి ‘భూమి.. సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతుంది నాన్న?’ అని అడిగాను. నాన్న మాత్రం ‘భూమి ఎల్లప్పుడూ ఉన్నోడి చుట్టూ తిరుగుతుంది. పేదోని కష్టం చుట్టూ ఉన్నోళ్ళ ఆశలు తిరుగుతాయి’ అన్నాడు. ఆ రెండు విషయాలు నా మనసులో బలంగా ముద్రించుకుపోయాయి. ఒకటి శాస్త్రీయత, రెండవది అనుభవం. ఏదేమైనా భూమి స్థిరంగా ఉండదని మాత్రం అర్థమయింది. 

నాకు చిన్నప్పుడు మాట్లాడడమంటే చాలా భయం. నాన్న అది  గమనించి ‘ప్రశ్నించే వాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మనిషి’ అని చెప్పాడు. టౌనుకు పోయి పెద్ద నిలువుటద్దం తెచ్చాడు. ఆ అద్దం ముందు నిలబడి, నన్ను మాట్లాడమని ప్రోత్సహించాడు.

క్రమంగా కొంతకాలానికి నాకున్న భయం పోయింది. ధైర్యంగా మాట్లాడసాగాను. ‘మీ నాన్నలాగే మాట్లాడుతున్నావు’ అనే అమ్మ పొగడ్తలు ఉత్సాహాన్నిచ్చేవి. నన్ను అద్దం కూడా అలాగే చూసేది. 
∙∙ 
అద్దం మీద కోపం వచ్చిన ఆరోజు.. నా జీవితంలో మర్చిపోలేను. ఆరోజు బడికి సెలవు. అద్దం ముందున్నాను. పంద్రాగస్టు ఉపన్యాసం కోసం సాధన చేస్తున్నాను. నాన్నకు విన్పించి మెప్పు పొందాలని ఉత్సాహంతో ఉన్నాను. చీకటి పడింది. ఇంకా నాన్న రాలేదు. పిడుగు పడ్డట్టు నాన్న చావు కబురొచ్చింది.

శవాన్ని వెతుక్కుంటూ నన్ను, దీపాన్ని తీసుకొని అమ్మ ఊరవతలి అడవికి నడిచింది. చిమ్మచీకటి. అమ్మ వెక్కివెక్కి ఏడ్చింది. నడుస్తూ నడుస్తూ నేలమీద కుప్పకూలిపోయింది. చీరకొంగును నోట్లో కుక్కుకుని ఏడ్పును అదుముకుంది. చీకటంతా ఆ అడవిలోనే ఉన్నట్టుంది. అంతచీకటిని మొదటిసారి చూసేసరికి భయం వేసింది. భయంతో మెదడు గడ్డకట్టుకుంది. చాలాసేపటిదాక వెతికినా గుడ్డి దీపానికి నాన్న చిక్కలేదు.

ఏ అర్ధరాత్రో మా వెదుకులాటకు కాలం తీరింది. వాగు దగ్గర రాళ్ళమధ్య చలనం లేకుండా పడున్నాడు నాన్న. ఒంటినిండా తూటాల గాయాలు. నెత్తుటి మడుగులో ఒంటిపై అడవిచీమలు పట్టి ఉన్నాయి. అమ్మ ధైర్యం పారే వాగులా కన్నీరయింది. ఆరాత్రి మా దుఃఖం చీకటినేమీ మార్చలేకపోయింది. పొద్దు పొడిచింది.

జనం జాతరలా కదిలారు. నాన్నను పొద్దు ఇష్టపడింది కాబోలు. వెంటే తీసుకుపోయింది. నాన్నపోయాక  ఇంటికి పోలీసులొచ్చేవారు. వాళ్ళను చూసి అమ్మ గజగజ వణికిపోయేది. తరువాత ఆ ఊరొదిలేశాం. ఇంత జరిగినా అద్దం ఏమీ పట్టనట్టుగా ఉన్నట్టనిపించింది. దాంతో అద్దం మీద కోపం, పోలీసుద్యోగం మీద ఇష్టం పెరిగింది.  
∙∙ 
నాన్న ఆలోచనలతో స్నానం ముగించాను. బయటకు వచ్చి కాసేపు ధ్యానం చేశాను. తరువాత పేపరును పూర్తిగా చదివాను. ఈ పాతికేళ్ళు ఉద్యోగంలో ఎన్నో తప్పులు, ఒప్పులు, చీత్కారాలు, సత్కారాలు. మారుతున్న కాలాన్ని గమనించనేలేదు. నేను కాలాన్ని నడిపాననుకున్నాను.

కానీ కాలమే నన్ను నడిపిందని ఈరోజు అర్థమైంది. హడావుడిగా కాలంతో పరుగెత్తే అలవాటున్న నేను ఈ రోజు మాత్రం నింపాదిగా ఉన్నాను. కాలం కూడా నాలాగే ముసలిదైపోయిందా? ఎందుకో కాలం నెమ్మదిగానే నడుస్తోంది మరి.  

శ్రీమతి టిఫిన్‌ తయారుచేసి టేబుల్‌ మీదకు పిలిచింది. టిఫిన్, కాఫీలయ్యాక ఒక లెటరు తెచ్చి నా చేతికిచ్చింది. క్వార్టర్‌ ఖాళీ చేయమని దాని సారాంశం. ఇన్నాళ్ళు పోలీసుశాఖలో పనిచేసిన నాకు సొంత ఇల్లు కూడా లేదు. ‘నిజాయితీ నీకు నిలువ నీడలేకుండా చేసిందిరా’ అని మిత్రులు సరదాగా అన్నా, అద్దం చెప్తున్నంత నిజంగా తోచింది. మనసు భారంగా మారింది.

డ్రైవరొచ్చాడు. సెల్యూట్‌ చేశాడు. అందులో భయంకంటే గౌరవం ఎక్కువగా కనబడింది. అద్దంలో వచ్చిన మార్పు స్పష్టంగానే తెలుస్తోంది. ‘పదినిముషాలు వెయిట్‌ చేయమని’ చెప్పాను. యూనిఫాం వేసుకున్నాను. భయంభయంగానే అద్దం ముందుకు చేరుకున్నాను. నన్ను ఈవేళ నా శ్రీమతి కొత్తగా చూస్తోంది. ఆమెకు నా గురించి బాగా తెలుసు. అందుకే ఆసక్తిగా నన్నే గమనిస్తోంది. 

అద్దంలో ఏ భావమూ లేదు. అద్దం ఈ పోలీసును చూసి భయపడిందా? నిజానికి అది నిజమే చూపింది. అద్దానికి నాకు మిత్రత్వము, శత్రుత్వమూ లేదు. ఏ బంధమూ లేదు. తయారై గబాగబా బయటకు నడిచాను. డ్రైవరు కారు డోరు తీశాడు. ఎక్కి కూర్చున్నా. కారు కదిలింది. కారుపై ఎర్రబుగ్గ కాలంలా వేగంగా తిరుగుతూ జనాన్ని హెచ్చరిస్తోంది.

కారు దర్జాను  రోడ్డుపొడవునా పరచుకుంటూ రివ్వున వాయువేగంతో దూసుకుపోతోంది. అనాథాశ్రమం వేగంగా వెనక్కిపోయింది. రవి గుర్తుకొచ్చాడు. కారులోనున్న అద్దంలో రంగులు మారాయి. రవి ఆలోచనలతో బాటు, అద్దం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నాకు అద్దమంటే అంత భయం. వెనుక ఆలోచనలు తిరిగి ముసురుకున్నాయి.
∙∙ 
ఆశ్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రవి టాలెంట్‌ గురించి మరచిపోతున్న సమయమది. పై అధికారి పోలీస్టేషన్‌ పర్యవేక్షణకు వస్తున్నాడు. సిబ్బంది మొత్తం హడావుడిగా ఉన్నారు. ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ ఫైళ్ళను తీసుకొని నా రూమ్‌కు వచ్చాడు. నాతో వాటి గురించి సీరియస్‌గా చర్చిస్తున్నాడు. ఈలోగా అక్కడికి అనాథాశ్రమం నిర్వహణాధికారి, వెంట రవిని తీసుకొని ఆఫీసుకు వచ్చాడు. కిటికీ అద్దంలో గమనించాను.

ముఖ్యమైన పనికావడంతో దృష్టి్టని పనిపైకి మళ్ళించాను. అరగంట తరువాత ఫైళ్ళు పరిష్కారమయ్యాక విక్రం బయటకు వెళ్ళాడు. కానిస్టేబుల్‌ లోపలికి వచ్చి సెల్యూట్‌ చేస్తూ రవి వచ్చిన విషయం గుర్తుచేశాడు. లోపలికి పంపమని సైగ చేశాను.

లోపలికి రాగానే ‘ఆ... ! చెప్పండి. ఏం కావాలి?’ అడిగాను. మా హడావుడి తెలుసుకొని, ‘రవి పైచదువులకు మీ సాయం కావాలి సార్‌’ క్లుప్తంగా చెప్పాడు ఆశ్రమ నిర్వాహకుడు. ‘సర్టిఫికేట్లను సిద్ధం చేసుకో రవి. ఖర్చులు నేను చూసుకుంటాను. రేపు మీ ఆశ్రమం వస్తానని’ చెప్పాను. చెప్పినట్టే మరునాడు ఆశ్రమం దగ్గర రవిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి పెద్దకాలేజీలో చేర్పించాను.

హాస్టల్‌ ఖర్చులన్నీ కలిపి ఫీజును ముందుగానే కట్టేశాను. రవిని జాయిన్‌ చేసి, మళ్లోసారి వస్తానని చెప్పి కారు దగ్గరకు నడిచాను. మనసు దూదిపింజలా తేలిపోతోంది. రవి కళ్ళల్లో ఆనందం కన్నీళ్ళలో మెరుస్తుంది. ఆ దృశ్యం కారు అద్దంలో ఎదురైంది. హమ్మయ్య! అద్దం నన్ను కనికరించింది. సంతోషాన్నిచ్చింది.

రవిపై నాకున్న నమ్మకం వృథాకాలేదు. ఇంటర్లో మంచి మార్కులొచ్చాయి. తరువాత ఇంజనీరింగ్‌. నా సాయం కొనసాగుతూనే ఉంది. ఆఫీసులో నాకు ఆత్మీయుడుగానున్న విక్రమ్‌ కూడా ప్రమోషన్‌ మీద హైదరాబాదు వెళ్ళాడు. రవి బాగోగులు తానే చూసుకుంటున్నాడు. నాకు ప్రమోషన్‌ వచ్చినా స్థానబదిలీ జరగలేదు. 
∙∙ 
ఈలోగా కారు ఆఫీసు ముందాగింది. వాస్తవంలోకి వచ్చాను. ఎర్రబుగ్గ సైరను ఆగిపోయింది. కారు దిగాక పూలమాలలతో మా పోలీసు సిబ్బంది ఆఫీసులోకి నన్ను ఆహ్వానించారు. అటెండెన్స్‌ రిజిస్టరులో చివరిరోజు సంతకంచేసి నా కుర్చీలో కూర్చున్నాను. ఉద్విగ్నంగా ఉంది.  ‘పోలీసు ఆడిటోరియంలో పదవీవిరమణ కార్యక్రమం ఏర్పాటు చేశాం సార్‌’ విక్రమ్‌ సెల్యూట్‌ చేస్తూ చెప్పాడు.

నేను ఊహించలేదు. విక్రం తానే చెప్పాడు. ట్రాన్స్ఫర్‌  మీద ఈరోజే ఇక్కడ జాయిన్‌ అయినట్టు. నా సీట్లో అతను రేపటి నుండి పనిచేస్తాడు. అతని ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. కారణం విక్రమ్‌ అంటే నాకిష్టం లేదు. కారణం మళ్ళీ రవినే. నా ఆలోచనలను పసిగట్టాడు కాబోలు. ఈసారి తన సిబ్బందిని ముందుకు తోశాడు. 

జీపును పూలతో అలంకరించారు. పొడవాటి తాళ్ళు. వాటికి పూల అలంకరణ ఉంది. ఇవన్నీ విక్రమ్‌ ఏర్పాట్లు. తెలుస్తూనే ఉంది. విక్రమ్‌కు నేనంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. కానీ రవి విషయంలో విక్రమ్‌ చేసిన ద్రోహం మరువలేను. ఆడిటోరియం ఆఫీసు పక్కనే ఉంటుంది.

జీపులో నన్ను కూర్చోబెట్టి తాళ్ళతో ముందుకులాగుతున్నారు. సిబ్బంది హడావుడి మద్య నా ఇబ్బంది చిన్నది. కెమెరాలు, ఫొటోలు, విలేఖరులు, స్టాఫ్‌ అట్టహాసం మద్య జీపు ముందుకుపోతుంటే విక్రమ్‌ను చూశాక నా ఆలోచనలు మాత్రం వెనక్కు మళ్ళాయి. 
∙∙ 
రవి ఇంజనీరింగ్‌ కళాశాలలో చేర్పించాక బాగోగులు చూసుకోమని విక్రమ్‌కు చెప్పాను. అవసరమైన ఆర్థికసహాయం చేస్తూనే ఉన్నాను. కాలేజీలో ఏవో గొడవలు. చిలికి చిలికి గాలివానైంది. మంత్రి కొడుకు ఆ గొడవకు కారణం. అతను ఆవేశంలో కొట్టిన దెబ్బలకు సహవిద్యార్ధి తలపగిలి చనిపోయాడు. ఆ కేసులో సాక్ష్యం చెప్పడానికి అందరూ భయపడ్డారు.

విక్రమ్‌ రవిని బలవంతంగా ప్రత్యక్షసాక్షిగా చేర్చాడు. నిజం నిర్ధారణ కావడంతో శిక్ష ఖరారైంది. ఇదంతా నాకు తెలియకుండా విక్రమ్‌ జాగ్రత్తపడ్డాడు. తరువాత మంత్రి అధికారాన్ని ఉపయోగించి రవిని కనబడకుండా చేశాడు. అడవిలో సగంకాలిన రవి శవం దొరికిందని ఆశ్రమం ద్వారా కబురొచ్చింది. తరువాత నా ఎంక్వయిరీలో విక్రమ్‌ నిర్లక్ష్యం తెలిసి అసహ్యం కలిగింది.

అందుకే అద్దం ముందుకు పోయినప్పుడల్లా నాన్న.. ఆ వెంటనే రవి జ్ఞాపకం వస్తారు. అద్దం కూడా వాళ్ళలాగే నిజం చెబుతుంది కాబోలు. అద్దం వేసే ప్రశ్నకు నా దగ్గర ఏ సమాధానం లేక భయం వేసేది. అందుకే ఇన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాను.

నేను పోలీసును. నాకు తెలుసు. అద్దంలో నా గతం ఉంది. అదెప్పుడూ ప్రశ్నిస్తుంది. నిజం నిగ్గుదేల్చమంటుంది. అద్దం పెట్టే యాతన భరించలేక ఇన్నాళ్ళు దూరం పెట్టాను.  అప్పుడప్పుడూ చూడకతప్పేది కాదు. 
∙∙ 
ఆడిటోరియం వచ్చింది. ఆలోచనలు ఆగిపోయాయి. హాలునిండా డిపార్ట్‌మెంట్‌ వాళ్ళున్నారు. ఆత్మీయులున్నారు. సహాయం పొందినవారూ ఉన్నారు. అప్పటికే నా శ్రీమతి అక్కడకు వచ్చింది. మమ్మల్ని వేదిక మీదకు ఆహ్వానించారు. సభ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీగారు ఇంకా రాలేదు. కొత్త ఎస్పీ చార్జ్‌ తీసుకోవాల్సిఉంది. నేరుగా ఇక్కడికే వస్తున్నారని విక్రమ్‌ వేదిక మీద అనౌన్స్‌ చేశాడు.

ప్రసంగాలు నడుస్తున్నాయి. విక్రమ్‌ హడావుడి గమనిస్తూనే ఉన్నాను. కాని పట్టనట్టున్నాను. ఈలోగా ఎస్సై వేదికపైకి వచ్చాడు. అంతా లేచారు. నేనూ లేచి సెల్యూట్‌ పెట్టాను. విచిత్రం. అద్దంలో చూస్తున్నట్టు చూశాను. భ్రమ పడుతున్నానా? తర్కించుకున్నాను.  కొత్త ఎస్సై హోదాతో రవి వచ్చాడు. మీడియా అంతా ఎస్సైగారి మీద ఫోకస్‌ బెట్టింది. రవి నేరుగా వచ్చి నా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ కళ్ళల్లో అదే కృతజ్ఞత.

రవి బతికి ఉండడం సంతోషమైతే, పోలీసు అధికారిగా రావడం రెట్టింపు ఆనందాన్నిచ్చింది. సభ ముగిశాక రవితోబాటు విక్రమ్‌ నా వెనుకే హాలు బయటకు నడిచాడు. ఇంటికి చేరుకున్నాక  విక్రం తన బ్యాచ్‌మేట్‌ సాయంతో రవిని కాపాడిన విషయం చెప్పాడు. రవి భద్రత కోసం ఇన్నాళ్ళు ఈ విషయం దాచిపెట్టాల్సి వచ్చిందని చెప్పాడు.

ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని ఇదే రోజు ఇక్కడ పోస్టింగ్‌ తీసుకుంటున్నాడని తెలిసి ఈ విషయం నాకు సర్‌ప్రైజ్‌ చేద్దామని చెప్పలేదన్నాడు. మనసులో భారం దిగిపోయింది. కాసేపు ఉండి కాఫీ తాగి వెళ్ళారు. ఇక అద్దం ముందు ధైర్యంగా నిలబడ్డాను. నాన్న గుర్తుకొచ్చాడు. వెంటనే రవి స్థానంలో అనాథాశ్రమానికొచ్చిన సగం కాలిన శవం గుర్తుకొచ్చింది. ఎవరిది ఆ అనాథ శవం? అద్దం మళ్ళీ నన్ను ప్రశ్నించింది. 

చదవండి: క్రైమ్‌ స్టోరీ: క్లూస్‌... కాల్చిపారేసిన చుట్టముక్క.. ఊహించని ట్విస్ట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement