
‘ఏరా తమ్ముడూ.. ఏంటి విషయం? పొద్దుటే ఫోన్ చేశావు?’ అంటూ హుషారుగా అడిగాడు రాజారావు. ‘సారీ అండి. నేను ఎస్సై అంబరీష్‌ని. కృష్ణ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను’ అన్న సమాధానం వినపడగానే షాక్ అయ్యాడు.
‘ఎస్సై గారా? ఏమయింది మా తమ్ముడికి? వాడి ఫోన్ మీకెలా..?’ అని అడుగుతుండగానే..‘చాలా దారుణం జరిగిపోయింది. కృష్ణను ఎవరో హత్య చేశారు’ అని చెప్పాడు ఎస్సై అంబరీష్. అంతే నెత్తిన పిడుగు పడినట్లయింది రాజారావుకి. కాస్సేపటివరకూ అతని నోటమ్మట మాట రాలేదు. కష్టం మీద గొంతుపెగల్చుకొని నీరసంగా అడిగాడు ‘ఎక్కడ? ఎప్పుడు?’ అంటూ.
‘నిన్న రాత్రి. టోల్‌గేట్‌కి అగనంపూడికి మధ్యలో సైడ్ రూట్లో’ అని సమాధానం ఇచ్చాడు ఎస్సై.
‘నేను స్టీల్‌ప్లాంట్‌లో ఉన్నాను. అరగంటలో వస్తాను’ చెప్పాడు రాజారావు తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ.
∙∙
కత్తిపోటుకి గురైన కృష్ణ్ణ ఒళ్ళంతా నెత్తురుతో తడిసిపోయి ఉంది. చూస్తూనే బిగ్గరగా ఏడుస్తూ మృతదేహంపై పడబోతున్న రాజారావుని ఆపి ‘సారీ.. ఏమీ అనుకోకండి. పంచనామా పూర్తికాలేదు. ఈ లోగా ఎవరూ శవాన్ని ముట్టుకోకూడదు’ అంటూ అపాలజీ చెప్పాడు అంబరీష్. చాలాసేపటి వరకూ తేరుకోలేకపోయాడు రాజారావు.
అప్పటివరకూ ఓపిగ్గా వేచిఉన్న అంబరీష్, ‘సారీ.. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. మీ తమ్ముడు ఎలాంటివాడు? అతనికి ఎవరయినా శత్రువులు ఉన్నారా?’ అంటూ రొటీన్ ప్రశ్నలు వేశాడు.
‘చాలా మంచివాడు సార్. చాలా చాలా నెమ్మదస్తుడు. నేనే కాస్త దూకుడుగా ఉంటాను. నాకు కోపం ఎక్కువ. అంత మంచి వాడిని ఇంత క్రూరంగా చంపడానికి, ఆ దుర్మార్గుడికి చేతులెలా వచ్చాయి?’ అని భోరున ఏడ్చాడు రాజారావు.
అతనుచెప్పిన వివరాలను బట్టి, అన్నదమ్ములిద్దరూ ఆరేళ్ల క్రితం వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యారని, చెరో టాక్సీ నడుపుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిసింది. అన్నదమ్ముల స్వభావాలు పూర్తిగా భిన్నమని వాళ్ళను.. వాళ్ళ టాక్సీలను చూస్తూనే తెలుస్తోంది.
కృష్ణకి శుభ్రత ఎక్కువ. రోజుకి మూడు నాలుగు సార్లయినా టాక్సీని రుద్ది రుద్ది శుభ్రం చేసుకుంటాడు. రాజారావుకి శుభ్రత బాగా తక్కువ. కృష్ణ చక్కగా షేవ్ చేసుకొని మంచి బట్టలు వేసుకుని నీట్‌గా తయారయితే, ఇతను మాత్రం మాసిన గెడ్డంతో, పెరిగిపోయిన చింపిరి జుట్టుతో, మాసిపోయిన చౌకబారు బట్టలు వేసుకొని ఉన్నాడు.
అంబరీష్, రాజారావు మాట్లాడుకుంటుండగా సీఐ మహంకాళి అక్కడికి వచ్చాడు. ఎస్సై అతనికి సెల్యూట్ చేసి కేసు వివరాలు తెలియజేశాడు. ఆ తర్వాత కాళి తనదయిన శైలిలో దర్యాప్తు ప్రారంభించాడు. ఏదీ వదలకుండా అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాడు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. ఫోరెన్సిక్ టీమ్‌కి సహాయపడడం, శవాన్ని పోస్ట్ మార్టమ్‌కి పంపడం వగైరా బాధ్యతలను ఏఎస్సైకి అప్పజెప్పి స్టేషన్‌కి బయల్దేరారు కాళి, అంబరీష్‌లు. మధ్యాహ్నానికి గానీ కేసు ఒక కొలిక్కి రాలేదు.
అప్పుడు చెప్పాడు సీఐ కాళి.. ‘నా అంచనా ప్రకారం సుమారు పదిగంటల ప్రాంతంలో ముగ్గురు పాసింజర్లను ఎక్కించుకొని, వైజాగ్ నుంచి బయల్దేరాడు కృష్ణ. ఒకడు డ్రైవర్ పక్కన సీట్లో, మిగిలిన ఇద్దరూ వెనుక సీట్లో కూర్చున్నారు. వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. నేషనల్ హైవే మీదుగా కారు నడుపుతున్న కృష్ణను బెదిరించి, పక్కదారికి మళ్ళించి ఉంటారు.
హత్య.. రాత్రి పదకొండున్నర తర్వాత జరిగింది. హత్యకు ముందు పెద్ద గొడవే జరిగింది. అయితే శాంత స్వభావుడు అయిన కృష్ణను వాళ్లు ఎందుకు చంపవలసి వచ్చింది? ఆవిషయం తేలవలసి ఉంది’ అంటూ అతను ఒక నిమిషం ఆగగానే అందుకున్నాడు అంబరీష్ ‘మరోసారి మీరు గ్రేట్ అని రుజువు చేశారు సార్. హత్యకు ముందు గొడవ జరిగిందన్న విషయం ఊహించగలిగాను.
ఎందుకంటే కృష్ణ బట్టలు అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి. శవం పక్కన అతని షర్ట్ బటన్స్ పడి ఉన్నాయి. అతని ఒంటి మీద గాయాలూ ఉన్నాయి. కానీ మిగతా వివరాలు ఎలా తెలుసుకున్నారో నాకు తట్టడం లేదు’ అన్నాడు.
‘దర్యాప్తు చేయడంలో నువ్వు మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఏ ఒక్క క్లూలనూ వదలకుండా తీవ్రంగా గాలించాలి. కృష్ణ.. టాక్సీ లోపల నాకు ఖాళీ గుట్కా పేకెట్, రెండు న్యూస్ పేపర్ ముక్కలు దొరికాయి. వాటిని నువ్వూ చూసే ఉంటావు. కానీ వాటిని పట్టించుకోలేదు. ఆ పేకెట్ తమిళనాడులో తయారయ్యింది. మన రాష్ట్రంలో ఆ పేకెట్లు దొరకవని, మన వాళ్ళ ఎంక్వైరీలో తేలింది.
ఇక న్యూస్ పేపర్ ముక్కలు తమిళ పేపర్‌కి సంబంధించినవి. వాటిని వాసన చూస్తే కరక్కాయ పొడి కలిపిన మందేదో పొట్లం కట్టడానికి వాటిని వాడారని తెలుస్తోంది. అది దగ్గుకు సంబంధించిన మందు కావచ్చు. కేవలం గంట, గంటన్నర ప్రయాణంలో రెండు సార్లు ఆ మందు వేసుకున్నాడంటే ఆ మనిషికి దగ్గు ఎక్కువగా వస్తుందని భావించవచ్చు.
అది అల్లోపతీ మందు కాదు, ఇక్కడ దొరక్కపోవచ్చు. కాబట్టి అది వాడుతున్న వాడు సొంత ఊరి నుంచే తెచ్చుకొని ఉండాలి. ఆ సొంత ఊరు తమిళనాడులోనే ఉండాలి. కారులో ఉన్న మేట్ మీద అస్పష్టంగా స్టోన్ క్రషర్ పౌడర్ కనిపిస్తోంది. వాళ్ళ చెప్పులకు అంటిన ఆ పౌడర్ అక్కడ రాలిందన్నమాట. ఆపౌడర్ ఉన్న చోట్లను బట్టి వాళ్ళెక్కడ కూర్చున్నారో ఊహించాను.
రాజారావు చెప్పినదాన్ని బట్టి కృష్ణకు శుభ్రత ఎక్కువని తెలిసింది కదా? టాక్సీలో కనిపించిన గుట్కా పేకెట్, పేపర్ ముక్కలు, స్టోన్ క్రషర్ పౌడర్లకు కారణం పాత పాసింజర్లు కాదు. కచ్చితంగా ఆ ముగ్గురే వాటికి కారణం ’ అని చెప్పగానే కాళి సునిశిత పరిశీలనకు అబ్బురపడ్డాడు అంబరీష్.
అదేమీ పట్టించుకోకుండా తన ధోరణిలో కొనసాగించాడు కాళి.. ‘కృష్ణ, లీలామహల్ దగ్గరున్న టాక్సీ స్టాండ్‌లో ఉండేవాడని చెప్పావు కదా? తమిళనాడు నుంచి వచ్చిన ముగ్గురు మనుషులు.. అక్కడికి దగ్గరలో ఉన్న ఏ లాడ్జ్‌లోనయినా దిగారేమో మనవాళ్ళను కనుక్కోమను. ఏదయినా లాడ్జ్ ముందున్న రోడ్డు మీద గుంతలను పూడ్చడానికి స్టోన్ క్రషర్ పౌడర్ వాడారేమో చూడమను.
వాళ్ళను సులువుగా పట్టుకోవడానికి అదొక క్లూ. వాళ్ళు తమిళంలో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అది మరో క్లూ. పదకొండు ఇరవైకి కృష్ణ తన భార్యతో మూడు నిమిషాలు మాట్లాడాడని, అతని సెల్‌ఫోన్‌లో కాల్ హిస్టరీ చూస్తే తెలిసింది. అతని భార్యతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాను. దాన్ని బట్టే హత్య పదకొండున్నర తర్వాతే జరిగి ఉండాలని ఊహించాను. అయితే కృష్ణ హత్య అనుకోకుండా జరిగి ఉండొచ్చు.
అతన్ని చంపాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదని, అతని చరిత్ర చెబుతోంది. అంతేకాక కేవలం అతన్ని హత్య చేయడం కోసం వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారని అనుకోను. వాళ్ళ ప్లాన్ వేరే ఏదో ఉంది. మరెవరినయినా హత్య చేయడానికో లేదా బ్యాంక్ కొల్లగొట్టడానికో వచ్చి ఉంటారు. నా ఉద్దేశం ప్రకారం కొన్ని రోజులు, ఎక్కడయినా నక్కి ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమం చూసుకునుంటారు.
అప్పటివరకూ వైజాగ్‌లో గానీ, పరిసరాలలోగానీ దాక్కునుంటారు. మనం గట్టిగా ప్రయత్నిస్తే దొరక్కపోరు. తప్పని పరిస్థితిలో వాళ్ళు అనుకున్న నేరం చేయడాన్ని వాయిదా వేసుకొని ఉంటారు. దానికి కారణాలు రెండు. మొదటిది.. చేతిలో వాహనం లేకపోవడం. రెండవది.. అప్పుడే హత్య చేసి తప్పించుకోవడం. హత్య జరిగిన తర్వాత, వాళ్ళు రోడ్డెక్కేసరికి పన్నెండు దాటి ఉంటుంది.
తిరిగి వైజాగ్ వెళ్ళడానికి ఆ సమయంలో బస్సులేవీ ఉండవు కనుక ఏ లారీయో పట్టుకొని ఉంటారు. టోల్‌గేట్ సీసీ ఫుటేజ్ చూస్తే కొన్ని క్లూలు దొరకొచ్చు. ఆ ఫుటేజ్ తెప్పించు’ అని ఆర్డర్ వేసి, ఆ కేసు గురించే ఆలోచిస్తూ వెనక్కి వాలాడు కాళి.. కాస్తరిలాక్స్ అవడానికి. అతను అప్పజెప్పిన పనిని పూర్తి చేయడానికి బయల్దేరాడు అంబరీష్.
∙∙
అంబరీష్ తెచ్చిన సీసీ ఫుటేజ్ చూడగానే కాళి కళ్ళు మెరిశాయి.. ‘నా ఊహ నిజమయింది. ఇక్కడ చూడూ.. సుమారు ఒంటిగంట ప్రాంతంలో రికార్డ్ అయిన సీన్ ఇది. దీని ప్రకారం ముగ్గురు కుర్రాళ్ళు లారీలో ఇరుక్కొని కూర్చున్నారు. వారిలో నల్లగా ఉన్న వాడొకడు నోటికి చేయి అడ్డుపెట్టుకొని దగ్గుతున్నాడు. రెండవ వాడు తెల్లగా ఉన్నాడు. జుట్టు పూర్తిగా ఊడిపోయి దాదాపు గుండులా తయారయ్యింది. మూడో వాడు సన్నగా పొడవుగా ఉన్నాడు.
అయితే ఈ ఫుటేజ్ సహాయంతో వాళ్ళను గుర్తుపట్టడం అంత సులువేమీ కాదు. మన ఆర్టిస్టుని పిలిపించి అన్ని ఏంగిల్స్‌లో వాళ్ళ ఊహా చిత్రాలను గీయమని చెప్పు. ఆ బొమ్మలను అన్ని స్టేషన్లకు పంపి, అందరినీ గాలించమని చెప్పు. వాళ్ళు ఎక్కిన లారీని ట్రేస్ చేయండి. ఆ డ్రైవర్‌ను పట్టుకుంటే వాళ్ళ పోలికలు తెలిసిపోతాయి. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొదలయినవి అర్థమైపోతాయి’ అన్నాడు హుషారుగా.
అంబరీష్‌లోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. కేసు త్వరగానే సాల్వ్ అయిపోతుందనే ఆశ కలిగింది. తొందరగానే లారీని ట్రేస్ చేశారు పోలీసులు. డ్రైవర్ ద్వారా ఆ ముగ్గురి వివరాలూ తెలిశాయి. వాళ్ళను వైజాగ్‌లో ఎక్కడ దించాడో కూడా తెలిసింది. ‘ఇంకేముంది? వాళ్ళు దొరికిపోయినట్లే. నేరస్తులను పట్టుకోవడానికి బోలెడు క్లూలు ఉన్నాయి’ అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో గాలింపు మొదలుపెట్టారు పోలీసులు.
వాళ్ళను పట్టుకున్నారన్న వార్తను వినడానికి అసహనంగా వెయిట్ చేస్తున్నారు ఇన్‌స్పెక్టర్లు. కానీ రోజులు గడుస్తున్నా ఏ ప్రోగ్రెస్ కనబడటం లేదు. వాళ్ళు దిగిన లాడ్జ్‌ను కనిపెట్టారు గానీ, అప్పటికే వాళ్ళు గది ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. రాజారావు రోజూ స్టేషన్‌కి వచ్చి కేసు విషయంలో ప్రోగ్రెస్ ఏమీ లేదని తెలుసుకొని బాధ పడుతూ తిరిగి వెళ్ళిపోతున్నాడు.
∙∙
ఒకరోజు రాత్రి పదిగంటలు దాటిన తర్వాత రాజారావు నుంచి అంబరీష్‌కు ఫోన్ రావడంతో ఒక్కసారిగా కేసు మలుపు తిరిగింది. ‘సర్.. ఆ ముగ్గురూ ఇప్పుడు నా టాక్సీలోనే ఉన్నారు. అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్ళాలని చెప్పి సులభ్ కాంప్లెక్స్‌కి వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. అనకాపల్లి వెళ్లి రావడానికి ఐదువేలిస్తామని నాతో బేరం కుదుర్చుకున్నారు.
ఇద్దరు తమిళంలోనే మాట్లాడు కుంటున్నారు. వాళ్ళలో ఒకడు దగ్గుతున్నాడు. మరొకడిది బట్టతల. బేరం ఆడినవాడు సన్నగా పొడవుగా ఉన్నాడు. కచ్చితంగా వాళ్ళే సార్’ అని చెప్పాడు గబగబా. ‘వెరీ గుడ్. మనకి ఇలా కలిసి వచ్చిందన్న మాట. నీ ఫోన్‌ని ట్రాక్ చేస్తూ, వాళ్లకు అనుమానం రాకుండా మిమ్మల్ని ఫాలో అవుతాం. నువ్వేమీ భయపడకు’ అంటూ అభయాన్ని ఇచ్చి ఫోన్ కట్ చేశాడు అంబరీష్.
∙∙
‘సర్.. నేనిప్పుడు అనకాపల్లిలో ఉన్నాను. లొకేషన్ షేర్ చేశాను. నన్ను ఇక్కడే ఉండమని వాళ్ళు ముందుకు నడిచి వెళ్తున్నారు. ఎడమ వైపు నాలుగవ వీధిలోకి తిరిగారు’ అని వివరం అందించాడు రాజారావు.
‘మేం దగ్గరలోనే ఉన్నాం. రెండు నిమిషాల్లో చేరుకుంటాం’ అని ఫోన్ పెట్టేశాడు అంబరీష్. అన్నట్టుగానే రెండు నిమిషాల్లో పోలీసు జీపు అక్కడికి వచ్చింది. అంబరీష్‌తో సాయుధులయిన ఇద్దరు పోలీసు ఆఫీసర్లు, ఇద్దరు పోలీసులు నాలుగవ వీధి వైపు నడిచారు. రాజారావు అక్కడే ఉండిపోయి ఏం జరగబోతుందోనన్న ఉత్సుకతతో ఎదురుచూడసాగాడు.
దాదాపు అరగంట దాటినా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోయేసరికి రాజారావులో టెన్షన్ మొదలయింది. గాభరా పడుతూ అటువైపే చూడసాగాడు. అక్కడికి వెళ్లి చూడ్డానికి అతనికి ధైర్యం సరిపోవడం లేదు. కాస్సేపటికి పోలీసులు తిరిగిరావడం చూసి అతని మనసు కుదుటపడింది. వాళ్ళతో పాటు నడుస్తున్న ముగ్గురు నేరస్తులు, వాళ్ళ చేతికి తగిలించిన బేడీలు చూడగానే ఆనందం పట్టలేకపోయాడు రాజారావు.
గబగబా అంబరీష్‌కు ఎదురెళ్ళి..‘ఏమయింది సార్? మా తమ్ముడిని ఎందుకు చంపారు ఈ దుర్మార్గులు?’ అంటూ ఆత్రుతగా ప్రశ్నిస్తున్న రాజారావు వైపు నవ్వుతూ చూస్తూ, ‘అన్ని వివరాలూ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాతే. అంతవరకూ సస్పెన్స్ అని చెప్పాడు అంబరీష్. చేసేదేమీలేక తల ఊపాడు రాజారావు.
స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత అంబరీష్ చెప్పడం మొదలుపెట్టాడు.. కాళితో సహా అందరూ శ్రద్ధగా వినసాగారు.. ‘సన్నగా పొడవుగా ఉన్నవాడి పేరు రాహుల్.. తెలుగువాడే. వాడే అసలు నేరస్తుడు. రాహుల్‌కి పన్నెండేళ్ల వయసప్పుడు తండ్రి చనిపోతే, తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని కలకత్తా వెళ్ళిపోతూ కొడుకును తన తండ్రి జానకిరామ్‌కు అప్పగించింది.
అప్పటినుంచి ఆయనే వీడిని గొప్ప క్రమశిక్షణతో పెంచి పెద్ద చేశాడు. అదే కొంప ముంచింది. తల్లితండ్రుల ప్రేమకు దూరమయిన రాహుల్.. తాతగారి స్ట్రిక్ట్ డిసిప్లిన్‌తో విసిగిపోయి, తాత అంటే అయిష్టాన్ని పెంచుకున్నాడు. అది కక్షగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. తనకు స్వేచ్ఛను ఇవ్వడం లేదని, కనీస అవసరాలకు కూడా డబ్బు ఇవ్వడం లేదని తల్లికి తరచూ ఫిర్యాదు చేసేవాడు.
‘నీ మంచి కోసమే తాతగారు అలా చేస్తున్నారు’ అంటూ తల్లి.. జానకిరామ్‌ను సమర్థిస్తూ రావడంతో తాత మీద కక్ష ఇంకా పెరిగింది. ఇంటర్ అత్తెసరు మార్కులతో పాస్ అయిన రాహుల్‌ను చెన్నైలో ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేర్చారు భారీ డొనేషన్ కట్టి. అక్కడ మిగిలిన ఇద్దరు నేరస్తులు రామన్, రాఘవన్‌లు పరిచయం అయ్యారు. వాళ్ళ సహవాసంతో రాహుల్‌కు అన్ని వ్యసనాలు అబ్బాయి.
ఇంటి దగ్గర నుంచి పంపే డబ్బు సరిపోక అప్పులు పెరిగిపోయి అతని పరిస్థితి దుర్భరం అయింది. తాత దగ్గర తల్లి నగలు, బోలెడంత డబ్బు ఉన్నట్లు రాహుల్ పసిగట్టాడు. తాతను చంపేసి డబ్బు, నగలు పట్టుకుపోవాలని ప్లాన్ వేసి ఇద్దరినీ తోడు తెచ్చుకున్నాడు. హత్య జరిగిన రోజు రాత్రి కృష్ణ టాక్సీలో ఎక్కిన ఆ ముగ్గురు జానకిరామ్‌ను ఎలా చంపాలో చర్చించుకోవడం మొదలుపెట్టారు.
తాము మాట్లాడేది తమిళం కాబట్టి వాళ్లు కృష్ణని పట్టించుకోలేదు. కానీ కృష్ణకు తమిళం వచ్చు. వాళ్ళ ప్లాన్ అర్థమైయిపోయింది అతనికి. కారు ఆపి వాళ్ళను దిగిపోమని, పోలీసులకు ఈ విషయం చెప్తానని బెదిరించాడు కృష్ణ. దాంతో రాఘవన్.. కృష్ణ మెడపై కత్తి పెట్టి, కారుని పక్కదారి పట్టించాడు. అక్కడ కారు ఆపించి కృష్ణను దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి చంపేశారు. రెండవ ప్రయత్నంలో వాళ్ళు రాజారావు కారు ఎక్కడం యాదృచ్ఛికం. అలాకలిసొచ్చి వాళ్లు దొరికి నిజాలు బయటపడ్డాయి’ అంటూ ముగించాడు అంబరీష్.
(సుమారు నాలుగు దశాబ్దాల కిందట విశాఖ జిల్లాలో జరిగినయదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ)
చదవండి👉🏾కథ: ‘నేను’... సుందర్‌ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment