రెండు ఝాముల పొద్దు తిరిగింది. వీధరుగు మీద పడక్కుర్చీలో మేను వాల్చిన మునసబుగారు వార్తాపత్రికను పడేసి కన్నులరమూసి చింతాలు ఖూనీ కేసు గురించి లీలగా ఆలోచిస్తూ సన్నగా గుర్రుపెడుతున్నారు.
∙∙
చుక్క వొగరుస్తూ తూలి పడబోతూ తిట్టుకుంటూ పరుగెడుతోంది. ‘‘నా దేవుడోయ్! నా కొంపదీశావురోయ్. సందేళకి నివ్వింక నేవురోయ్ నాయనోయ్’’ అంటోంది. మాట మాటకీ వొగరుస్తోంది. మగతనిద్రలో ఉన్న మునసబుగారికి చింతాలు కేసులో తలుపుల్నురిదీయబోతున్నట్టు కలొచ్చింది. సంకెళ్ల చప్పుడు గూడా వినబడినట్టయి గతుక్కుమని కళ్లు తెరిచారు. వీధిలో చుక్క పరుగెడుతోంది. శివాలెత్తినట్టు ఊగిపోతోంది.
‘‘ఏవిటే చుక్కా?’’ అన్నారు మునసబుగారు. ‘‘నాయనోయ్ నా కొంప ముంచాడయ్యోయ్’’ అంది చుక్క వెనక్కి తిరక్కుండానే పరుగు సాగించింది కాలవొడ్డువైపుకి. సుడిగాలి వెనకాల ఆకులలముల్లా వస్తున్నాడు చుక్క తమ్ముడు. చింపిరిజుట్టు, బాన బొజ్జా ఎగరేసుకుంటూ చిన్న చిన్న అంగలతో అడుగులేస్తూ–
‘‘ఈరిగా ఇల్రా. ఆగు. చుక్కేవిటిలా పరుగెడు...’’
‘‘పకీర్నొగ్గేశారంటండీ పోలీసోళ్లు. ఆడు మూడు గంటల కారుకొచ్చెత్తన్నాడు. తలుపులు మావని సంపేత్తాడంటండి’’ అని ఏడుస్తూ పరుగెత్తాడు ఈరిగాడు అక్క చుక్క వెనుక. మునసబుగారు పూర్తిగా మేలుకున్నారు.
ఫకీర్నెవరొగ్గేశారు? ఎలా ఒగ్గేశారు? కేసు పూర్తికాందే ఇది ఎలా జరిగింది? ఫకీరుగాడు ఊళ్లో వచ్చిపడితే ఈసారి ఊరు వల్లకాడవడం ఖాయం. అందరికన్నా ముందు తలుపుల్ని కాలికిందేసి నల్లిని నలిపినట్టు నలిపేస్తాడు వాడు. రెండేళ్ల క్రితం సంకురాత్రి పండగలికి కోడిపందాల్లో ఓడినందుకు ఉక్కురోషం వేసుకొచ్చి చూస్తూ ఉండగా నరసయ్యని అట్టే పీక నులిమి చంపేశాడు. అంతా అట్టే గుడ్లప్పగించి నిలబడిపోయారు. ఒక్కడికీ అదేమనడానికి దమ్ములు చాలకపాయే. సాక్ష్యానికి మనుషుల్ని పోగేసుకు రాబోయేసరికి ప్రాణం సాలొచ్చింది. ఫకీరుగాడు పరమ కిరాతకుడు.
‘‘బాబోయ్ కొంపలు ముణిగినయ్యండి’’ అంటూ వచ్చాడు ముత్యాలు. ‘‘ఫకీర్నొగ్గేశారంటగా, తలుపులెదవ ఒణుకుతో సచ్చేట్టున్నాడండి. ఏందారి?’’ అన్నాడు. మునసబుగారు గయ్‌మన్నారు ఒక్కసారి.
‘‘ఏవుంది. ఒకటేదారి...అసలాణ్ణి సాక్షానికెళ్లమన్నదెవడంట. యదవలు. ఒక్కడు ముందర చెప్పినట్టినడు. ఆ మాత్రం మగసిరి ఇంకోడికి లేదనే బయల్దేరాడేం యదవ. ఇప్పుడేడిచేం లాభం?’’ అన్నారాయన.
ముత్యాలు మాటాడలేదు. తలొంచుకు నిలబడ్డాడు. మునసబుగారు కండువా బుజానేసుకుని కరణంగారింటికి బయల్దేరారు. ‘‘నరిసిరెడ్డిని కేకేసుకురా. కరణం గారింటికాడుంటానన్జెప్పు’’ అన్నారు.
‘‘ఆరక్కడే ఉన్నారండి’’ అన్నాడు ముత్యాలు. ముత్యాలమ్మ గుడిమలుపులోనే శివాలు వినిపించాయి మునసబుగారికి. ఇంకో అడుగేసేవరకూ గుడి దగ్గర గణాచారి ఉగ్రంగా ఊగిపోతోంది. తలుపులు నేలబారుగా సాగిలబడి దండాలెడుతున్నాడు. చుక్క చతికిలబడి, నెత్తి కొట్టుకుంటూ శోకన్నాలెడుతోంది.
తలుపులు పెద్దపెళ్లాం సావాలు ధైర్యం చిక్కబట్టుకు గణాచారిని ప్రశ్నడుగుతోంది. మునసబుగారు ఆగదల్చుకోలేదు కాని, అంతకితం వరకు గణాచారి గాబోలు బాగుచేస్తున్న కందుల్ని కాకులు దినిపోతుంటే, ‘‘హుష్ కాకీ!’’ అన్నాడు. సాగిలపడున్న తలుపులు తలిటు దిప్పి చూసి, బావురుమని ఏడుస్తూ మునసబుగారి కాళ్లు చుట్టేసుకున్నాడు. ‘‘నాన్నగారోయ్ నను సంపేత్తాడండోయ్. ఆడొచ్చేత్తన్నాడండోయ్’’ అని భోరున ఏడవసాగాడు. గణాచారి ప్రశ్న చెబుతూనే ఉంది.
∙∙
సావిట్లో అంతా సందడిగా ఉంది. కరణంగారూ, వారి పట్నపల్లుడూ, ప్రెసిడెంటు సర్సిరెడ్డి, ఇంకిద్దరు మెంబర్లు, జనాభా లెక్కలు రాసుకోడానికొచ్చిన ఓ దొరటోపీ మనిషీ రెండుభాషల్లో మూకుమ్మడిగా ఏకటాకీన ఖూనీ కథలూ బ్రెమ్మరాతా కర్మ సిద్ధాంతం, ఆ బాపతు వేదాంతం వాళ్ల చిన్ననాటి ముచ్చట్లు, నేతి బీరకాయలో నెయ్యి ఉండని వైనం, అమెరికాలో గాంగ్‌స్టర్లు ఖూనీలు చేసే శిల్పం, ఫకీరుగాడి పుట్టు పూర్వాలూ, తలుపులుగాడి రెండో పెళ్లాం చుక్కకీ మధుర శిల్పాలలో అచ్చరలకీ కొట్టొచ్చినట్టు కనబడే పోలికలు (ఎవరో తెలీదు) ఖూనీలు కామాపుజేసే వాళ్ల కథలూ చెప్పుకుంటూ, హఠాత్తుగా దయచెయ్యండి అన్న ఒకమాటని మాత్రం ఏకగ్రీవంగా అన్నారు. తర్వాత, జరిగిన కథను సమీక్షించి కర్తవ్యం గురించి నిశ్శబ్దం తీవ్రంగా ఉపన్యసించింది. కరణంగారు గొంతు సవరించుకున్నారు. ప్రెసిడెంటుగారు అనుకరించారు. ‘‘అసలు వాణ్ణెలా వదిలేశారూ అంట?’’ అన్నారు మునసబుగారు.
‘‘మరే కేసు పూర్తిగాందే...అసలూ?’’ అన్నారు కరణంగారు. ‘‘పారిపోయుండాల’’ అన్నారు ప్రెసిడెంటుగారు.
‘‘ఇంఫాసిబుల్’’ అన్నాడు దొర టోపీ ఆయన. కరణంగారి అల్లుడు సాహసించి కలగజేసుకున్నాడు. ‘‘వైనాట్. అమెరికాలో జైళ్లలాంటి వాటినే తప్పించుకుంటారు. అక్కడ...’’ ప్రెసిడెంటుగారి చూపు చూసి ఆగిపోయాడు కరణంగారల్లుడు. ‘‘నే సెలవు దీసుకుంటానండీ’’ అన్నాడు దొరటోపీ ఆయన.
‘‘తలుపులుగాడి పాణానికి ముప్పే’’ అన్నాడు ముత్యాలు. ‘‘వాడి పెళ్లాం ఒకటే ఏడుపు పాపం. కట్టుకుని ఆర్నెల్లు కూడా తిరగలేదింకా’’ అన్నాడు ఏదో పెద్ద ఆర్నెల్లు తిరిగితే ఫర్వాలేదన్నట్టు.
‘‘సార్ జనాభా లెక్కలో జనసంఖ్య ఎంత రాసుకున్నారో గాని, ఒకటి తగ్గించి ఖర్చు రాయొచ్చు’’ అన్నాడు అల్లుడుగారు విట్టీగా..అని చుట్టూ చూసి నవ్వబోయి కొయ్యబారిపోయాడు.
∙∙
ప్రెసిడెంటుగారు జనాభా లెక్కలాయన్తో మాటాడుతూ సాగనంపబోయారు. మిగతా వాళ్లు ఆలోచనలో పడిపోయారు. ఫకీరు మూడుగంటల మెయిలు కారుకి దిగుతాడన్న వార్త అందరికీ తెలుసు. ఐదు నిమిషాలయ్యే సరికి చుక్కా, తలుపులూ వచ్చారు. ‘‘నాన్నగారోయ్ నాకేం దారి చెప్పండ’’న్నాడు తలుపులు ఏడుస్తూ. ఏ నాన్నగారూ ఏ దారీ చెప్పలేదు.
‘‘అసలు నీకెందుకురా గోల, నువ్వెందుకు సాక్ష్యమిచ్చావు? ఫకీరుతో చెలగాటవేవిటి? అదీ ఖూనీ కేసులో! మాకా మాత్రం దమ్ముల్లేకనే!?’’ అన్నారు కరణంగారు. ‘‘సర్లెండి అదంతా ఎందుకిప్పుడు. ఆడి మొఖానలా రాసిపడేసుంది గావాల. కుదురుగా ఇంటికాడెలాగుండగల్డూ..’’ అన్నారు మునసబుగారు.
ఊళ్లో ఇందరున్నారు జెమాజెట్టీల్లాంటి వాళ్లు. ఇందరు కలిసి పట్టపగలు ఒక్క ఫకీరుగాడికి అడ్డుపళ్లేరా అనిపించింది. ఎవరి మటుకు వాళ్లకి. ఆ మాటే చుక్క పైకి అనేసింది. ‘‘అవున్నాన్నగోరు. ఆడు రాగానే బెడిత్తిరగేసీ..’’ అన్నాడు తలుపులు. ‘‘ఛస్ నువ్వూర్కో. ఇలాటెదవాలోచన్లు జేసే ఇంతకి దెచ్చుకున్నావు’’ అన్నారు మునసబుగారు. మునసబుగారి మనసు ఆయనకన్నా ముత్యాలుకు బాగా తెలుసు. ఇలాటి సమయాల్లో అతనే టీకా తాత్పర్యాలు భాష్యాలు చెబుతాడు. ఇప్పుడూ నమ్మినబంటుగా ఆ పని చేశాడు. ఫకీరుది పాము పగ అని వెల్లడించాడు.
‘‘మరిపుడేటి చేదారి ఏటి దారీ?’’ అన్నాడు తలుపులు. ‘‘దారికేటుంది. ఎవిడిదారాడిదే. నన్నడిగితే ఆడలా మెయిలు కారు దిగేతలికి నువ్విట్నించిలా పొలాలకడ్డంబడి పో. లేదా పడవెక్కి పట్నానికెళ్లిపో. ఆనక మేవంతా ఆడికి నచ్చచెబుతాం. సల్లబడ్డాక మెల్లగా రావచ్చు’’ అన్నాడు ముత్యాలు.
‘‘వాడు శాంతించకపోతే అదే పాయని, పట్నంలోనే స్థిరపడిపోవచ్చున’’ని కూడా ఆశపెట్టారు.
తలుపులికి మనసు కొద్దిగా స్థిమిత పడుతోంది. కొంచెం కుడి ఎడమా ఆలోచిస్తున్నాడు. ముత్యాల్లాంటి వాళ్లిద్దరు తనకెడాపెడా నిలబడి, కర్నం మునసబులూ పంచాయితీ ప్రెసిడెంటూ వెనక నిలబడితే చాలు. ఫకీరుగాడికి దర్జాగా ఎదురుపడవచ్చు. ‘‘ఎటేస్ పల్లకుండావు. ఎల్ల దల్చుకుంటే బేగీ లగెత్తు’’ అన్నాడు ముత్యాలు తమాషాగా చుక్క వంక చూసి నవ్వి. తలుపులు చుక్క వంక చూశాడు. తల కొట్టేసినట్టయింది.
‘‘బతికుంటే బలుసాకేరుకు దినొచ్చన్నా’’రు కరణంగారు. ‘‘అవును మావా’’ అంది చుక్క కళ్లు చెంగుతో వత్తుకుంటూ. తలుపులు చుట్టూ చూసి, ‘‘ఎదవ నాయాళ్లు. యదవ కళ్లెదవ నోళ్లు’’ అనుకున్నాడు.
కరణంగారు, మునసబుగారు ఒక్క మారే బరువుగా నిట్టూర్చారు. అనిందికేముంది గనక, ఫకీరు పరమ దుర్మార్గుడు. అన్నిటికీ తెగించినవాడు. వాడికి అడ్డపడిందికి ఆలుబిడ్డలున్న వాడెవడూ ముందుకు రాడు. అంచేత తలుపులు, ప్రాణాల మీద ఆశ ఉంటే తక్షణం వెళ్లిపోవడం మంచిదని వారభిప్రాయపడ్డారు.
తలుపులు మరోసారి ఆలోచించుకున్నా ఊరొదిలి పోబుద్ధికాలేదు. ప్రాణభయం ఎంత పీకుతున్నా కొంపా గోడూ వదులుకుని పారిపోవడం వాడికి అవమానంగా తోచింది.
‘‘నా బాబు, నా బాబు బాబు ఈడనే పుట్టి ఈణ్ణే మట్టిలో గలిశారు. నేనెందుకు పోవాల నేనేం కూనీల్జేశానా?’’ అన్నాడు. కరణంగారు నవ్వారు. ‘‘ఇదెప్పట్నించిరోయ్ దేశభక్తి. ప్రాణమ్మీదికి ముంచుకొస్తూ ఉంటే ఈ వేదాంతం ఏమిటి? నీ బాబూ ఆడి బాబూ ఖూనీ కేసులో సాక్షాలిచ్చి పీకల మీదికి...’’
‘‘ఎవరదీ?’’ అన్నారు మునసబుగారు వాకిట్లోకొచ్చిన మనిషిని చూసి. ‘‘నేనండి ఎర్రెంకన్నని. తలుపులుగాడింకా ఈణ్ణే ఉన్నాడండీ, అయిబాబో! ఫకీర్నొగ్గేశారండి. ఆడొచ్చి సంపేత్తాడండియ్యాల... ఊరంతా..’’
‘‘అదేనోయ్, పారిపొమ్మంటే అవునుగాని నీకెవరు జెప్తారిది. వదల్డం నిజమేనా అని..’’
‘‘ఎవరేటండి దాన్నడగండి. ఆ చుక్కకే తెల్సు. ఇందాక పన్నెండు గంటల కారుకి డైవోరు రెడ్నాయుడే సెప్పాడంటండి..’’
‘‘అదే మేం ఊరొదిలి పొమ్మంటున్నాం. వాడు శాంతించాకా..’’
‘‘ఇంకేడికి పోతాడండి. కబురపుడే అందరికీ తెల్సిపోయింది. ఆడి మనుసులు ఈడు ఊరొదిలిపోకుండా కాలవకాడ తోపుకాడ వుంతినకాడా కాపేశారంటండి. ఆడు మూడుగంటల కారుకొచ్చేత్తన్నాడంట..’’
‘‘నాయనోయ్’’ అంటూ చుక్క ఏడుపు లంకించుకుంది. చూస్తుండగానే తలుపులికీ ముచ్చెమటలు పోసేశాయి. గజ గజ వణికిపోయాడు. రెండు చేతుల్లో తల పట్టుకు కూలబడిపోయాడు. కళ్లు తిరిగిపోయాయి. ‘‘నా తల్లి ముత్తేలమ్మో..’’ అంటూ చుక్క వొళ్లోకి ఒరిగిపోయాడు.
∙∙
‘‘అయితే ఏం చేదాం?’’ అన్నారు కరణంగారు. మునసబుగారు మాటాడలేదు.
‘‘చేసేదేముంది, ఎవడి ఖర్మకెవరు కర్తలు. అటు కోరటు వాళ్లలా మంచీ చెడ్డా లేకుండా ఖూనీకోర్లని దేశం మీదకొదిలేస్తుంటే చేసేదేవుంది?’’ అన్నారాయనే మళ్లీ. మునసబుగారు గొంతు సవరించుకున్నారు. ‘‘చిన్నా పెద్దా మనమంతా కల్సి ఆడూళ్లో దిగ్గానే అడ్డం పడితే..?’’ అన్నారు. కరణంగారు తల తాటించారు. ‘‘మీరేమన్నా అనుకోండన్నగారూ, నాకా సాహసం లేదు. కొంప దుంపనాశనం చేసుకోదలిస్తే తప్ప...’’
మునసబుగారు ముత్యాలుకేసి చూశారు.
‘‘దారుణం, ఇది ఊరో అడివో నాకు తెలీటం లేదు. ఇందరం ఉండి ఒక్కడి ప్రాణానికి అడ్డు పళ్లేకున్నాం’’ అన్నారు మునసబుగారు లేస్తూ. ‘‘ఏం చేస్తాం...పోనీ పోలీసు ఠాణాకి కబురంపండి మనిషినిచ్చి..వస్తా. అల్లుడూ అమ్మాయి సినిమాకోయ్ అని గోలబెడుతున్నారు. మాయాబజారుట...మీరూ వస్తారా?’’ అన్నాడు కరణంగారు. ‘‘రాను...’’ అంటూ వెళ్లిపోయారు మునసబుగారు. కరణంగారు, చుక్కకి ధైర్యం చెప్పారు. తలుపులికి స్పృహే ఉన్నట్టు లేదు. ‘‘రాగానే మీ సవుతులిద్దరు వాడి కాళ్ల మీద పడండి. అంతకన్న మార్గం తోచట్లేదు’’ అన్నారాయన.
∙∙
చుక్క తలుపుల్ని లేవదీసి నెమ్మదిగా ఇంటికి బయల్దేరింది. నెత్తిన ఎండ పేలిపోతోంది. తలుపులికి ఒళ్లు మసిలిపోతోంది. కళ్లు మూసుకునే చుక్కనానుకు నడుస్తున్నాడు. అమ్మవారి గుడి దగ్గర ఆగి, ‘‘గండం గడిచి తెల్లారితే ఉపారాలెత్తుతాను తల్లీ పెట్ట నేయిత్తానమ్మా’’ అని దండమెట్టుకుంది.
ఇల్లు చేరి గుమ్మంలో అడుగెడుతుండగా, ‘‘ఆడు తొడిగింది కరణంగారి కమీజంట గాదూ, ఎందుకన్నా మంచిది ఇప్పించేసేయ్’’ అని చెప్పి వెళ్లిపోయాడు కరణంగారింటి పాలేరు. ‘‘థూ...’’ అని ఉమ్మేసింది చుక్క. లోపల సవితి చామాలు పడుకుని ఉంది. అంపకం పాలతో జ్వరం వచ్చేసింది సావాలుకు. కలవరింతలు, కేకలు. చుక్కకి దుఃఖం పొంగి వచ్చేసింది. తలుపుల్ని మంచాన పడుకోబెట్టి దుప్పటి కప్పింది. సావాలు కణతలంటి చూసింది. ‘‘నా కొంప ముంచాడే నాయనో’’ అంటూ గొల్లుమంది సావాలు. ‘‘ఏం సేత్తాం అన్నిటికా సల్లన్తల్లుండాది. ఈ గండం గడిత్తే రేపు పారాలెత్తించి పెట్టనేద్దాం. నువ్వు కూడా మొక్కుకో’’ అంది చుక్క. ‘‘మల్లిద్దరవెందుకులే’’ అంది సావాలు. ‘‘నీ జిమ్మడ బుద్ధి పోనిచ్చుకున్నావు గాదు’’ అంది చుక్క.
తలుపులికి గంజినీళ్లు పోసి, గుడిసివతలికొచ్చింది చుక్క. ‘‘మూడు గంటల కారొచ్చుండాలి. ఆడీ పాటికి దిగుండాలి. నా తల్లో! నివ్వే దిక్కు’’ అనుకుంటూ నించుంది. ఫకీరొస్తే ఎందుకేనా ఉంటుందని రెండు బడితెలూ ఓ పెద్దగెడా రెండు కొరకంచులూ తీసి ఓ పక్కన అట్టే పెట్టింది.
చుక్క తమ్ముడు పరుగున వచ్చి, ‘‘అక్కా అక్కా కారొచ్చేసింది గాని ఆడురానేదు. నాను చూశా నాను చూశా, కిళ్లీ బడ్డీ రంగన్నక్కూడా ఒకిటే ఆచ్చిరం! ఫకీరుగాడు రానేదని’’ అన్నాడు. చుక్క ఒక్క లగువున లోపలికెళ్లింది. ‘‘ఆడు రానేదు మావో. ఆడు రానేదు. అంతా అబద్ధం’’ అంటూ తలుపుల్ని కావలించుకుంది. తలుపులు మెల్లిగా కళ్లు తెరిచి ‘‘ఆ..’’ అన్నాడు.
‘‘గండం గడిచింది మావా ఆడు రానేదు. మద్దినేళ డైవోరు పరాసికం ఆడుండాల యదవ సచ్చినోడు మల్లీపాల్రానీ సెప్తా..’’ అంది. తలుపులు అమాంతం చుక్కని గాఢంగా కౌగిలించుకున్నాడు. తలుపులు కళ్లంట బొటబొట కన్నీళ్లు కారాయి. జ్వరం దిగిపోయింది.
‘‘ఎందుకన్న మంచిదిగాని, మావా, ఇపుడే నావకెల్లి, పట్నంలో పోలీసోళ్లకి సెప్పరాదా సింతాలు ఖూనీ కేసులో ఫకీరుగాడికి జేలు కాయమయేదాకా ఈడ కాపలా ఉండాలనీ’’ అంది చుక్క.
తలుపులు చుక్కని దగ్గరకి తీసుకుని వీపు తట్టాడు. జుట్టు సరిచేశాడు. ‘‘ఎర్రిమొకవా మనకోసం పోలీసోళ్లొత్తార్టే యెర్రిమొకవాని మొకం చూడు’’ అన్నాడు. అంటూనే చుక్క మొహం చూశాడు. ‘‘ఎంత సక్కని మొకం. కళ్లుబ్బిపోనాయి గాని, పాపం ఎంతేడిశావో నాకోసం’’ అన్నాడు.
‘‘సర్లే బాగుండాయి సరసాలు. కాత్తుంటే ఆడొచ్చి ఈప్మీన రేవెట్టుండేవోడే గందా’’ అంది సావాలు నీరసంగా నవ్వుతూ. చుక్క పకపక నవ్వింది. ‘‘బుద్ధి పోనిచ్చుగున్నావుగాదప్పా. ఫకీరుగాదు, యములాడొచ్చినా సరే మావిలాగే కాయిలించుకు సరసాలాడుతూనే సచ్చిపోతాం. నియ్యల్లే నాకు జెరం రాదు ఆపదలొత్తే’’ అంది.
‘‘అలాగే అలాగే ఊసులాడ్డానికేవి. మద్దినాల మతిసెడి శోకాన్నాలెట్టినాళ్లెవరో.. సూద్దారి, ఆడు మూడుగంట్ల కారుకి రాపోతే ఆ తరవాద్దానికి రాడని కరాటి? కాపీ నీల్లో కల్లునీల్లో దాగుతంటే కారు తిప్పుండచ్చుగా’’ అంది సావాలు. తలుపులు పట్టు దప్పినట్టయి తలెత్తి చూసింది చుక్క. మళ్లీ వెర్రిచూపు పడిపోయింది.
‘‘ఆ! ఏటేటీ ఎలాగెలాగా!?’’ అంటూ కొయ్యబారిపోయాడు తలుపులు.‘‘నీ జిమ్మడ. యదవనోరు నివ్వూను’’ అంటూ లేవబోయింది చుక్క. తలుపులే చుక్కని పక్కకి తోసేసి లేచి నిలబడ్డాడు. ‘‘ఆ మాట రైటే ఆ మాట రైటే’’ అంటూ గుడిశవతలకి వెళ్ళిపోయాడు. ‘‘యాడకయ్యోవ్ స్వామి!’’ అంటూ వెంటబడింది చుక్క. ‘‘మల్తొత్తా మల్తొత్తా’’ అంటూ గబగబా వెళ్ళిపోయాడు తలుపులు.
∙∙
పొద్దు వాటారింది. ముత్యాలమ్మ గుడి దగ్గర రావిచెట్టు కింద కూర్చున్నాడు తలుపులు చిత్తుగా తాగేసి. ‘‘నా సావిరంగా, రారా ఇయ్యాల నువ్వే నేనో తేలిపోవాలా. పుచ్చెలెగిరిపోవాల’’ అని గొణుక్కుంటున్నాడు. అరమైలు అసింటా అప్పుడే బస్సు దిగిన జమాజెట్టీ పకీరు కూడా అదేమాట అనుకున్నాడు కసిగా. దిగుతూనే ఎదర కిళ్ళీ బడ్డీ లోపలికెళ్ళి కూర్చున్నాడు. ‘‘కాసినీ సోడానీల్లియ్యవో’’ అన్నాడు పకీరు. బడ్డీవాడు ఖాళీసోడా కాయపట్టుకు లోపలికి వెళ్ళి ‘నీళ్ళు’నింపి ఇచ్చాడు. పకీరు గడగడ తాగేసి, ‘‘ఇంతకన్నా వుట్టినీల్లే ఇత్తే సరిపోయేదిగా యదవా’’ అన్నాడు. ఈవల ఒకటే జట్కా వుంది. అందులో ఇందాకటి ఇస్తోకులో రాణి కూర్చుని వుంది. రాజా బడ్డీ దగ్గరికొచ్చి సిగరెట్టు కొంటున్నాడు. పకీరు బండి దగ్గర కొచ్చి, ‘‘దిగండమ్మా, ఈ బండెల్లదు’’ అన్నాడు. రాజా విసురుగా వచ్చాడు ‘‘ఎవడ్రా నువ్వు ఆడవాళ్లని దబాయిస్తున్నావు బ్లడిఫూల్’’ అంటూ. పకీరు వెనక్కి తిరుగుతూనే ఎడం చేయి తిరగేసి వెనక్కి విసిరాడు. ‘‘అమ్మో’’ అని ఒక్క కేక పెట్టి చెంపని తడుముకున్నాడు రాజా. మళ్ళీ మాటడలేదు. అమ్మాయి మాట్లాడకుండా బండి దిగిపోయి తనే పెట్టి కిందకి దించేసింది. అతను చెంపని చెయ్యి తియ్యలేదు. కన్నార్పలేదు. పన్నెత్తి పలకలేదు. పకీరు బండిలోకెక్కి కూర్చున్నాడు. ‘‘రోడ్డు బావులేదు’’ అన్నాడు బండివాడు. ‘‘పోనీ’’ అన్నాడు పకీరు. బండి కదిలింది. తూము మలుపు దగ్గరేనే జట్కా ఆపేశాడు బండతను.
రావిచెట్టు దగ్గిర బండకానుకుని వెల్లకిలా పడుకుని కాలు మీద కాలు ఏసుకుని వెకిలి ధైర్యంతో ఏడుపులాంటి నవ్వుతో లొల్లాయి పాటలు పాడుతున్నాడు తలుపులు గట్టిగా. కరణంగారు సకుటుంబంగా సినిమాకెళ్ళిపోయారు. ఎందుకేనా మంచిదని ప్రెసిడెంటుగారూ వారికి తోడుగా వెళ్ళారు. ఎక్కడా సందడి లేదు. ఊరందరికీ ప్రాణం ఖంగారుగా వుంది. చుక్క రెండుమార్లొచ్చి తలుపుల్ని బతిమాలింది కొంపకి రమ్మని. ‘‘నా సామిరంగా ఇయ్యాల ఆడో నేనో తేలిపోవాల’’ అన్నాడు తలుపులు.
మునసబుగారు పెందలాడే భోంచేసి అరుగు మీద కూర్చున్నారు చుట్ట ముట్టించి. ఆయనకి ప్రాణం కుతకుత ఉడికిపోతుంది. చూస్తూ చూస్తూ ఓ మనిషిని మరోడు ఖూనీ చేస్తు వుంటే దిక్కుమాలినట్టు ఊరుకోవడం ఆయనకి నచ్చలేదు. వొంటో ఓపిగున్న వాడికి లేని బెడదలు నాకేల అనుకున్నాడు కాని సావిట్లో కెళ్ళబోతూ ఉండగా చుక్క తమ్ముడు ఎక్కణ్ణించో తుర్రున వచ్చి ‘‘బాబూగోరూ పకీరుగోడు బండిదిగి వచ్చేత్తాన్నాడండీ. మా మావని సంపేత్తాడు’’ అనేసి పరుగెత్తాడు ఆయన జవాబు కూడా వినకుండా. మునసబుగారు ఓ నిమిషం మేనువాల్చారుగాని ఉండబట్టలేక చివాల్న లేచి చితికర్ర పట్టుకొని ఇవతలికొచ్చారు. పకీరు తలుపులు కొంపకెళ్ళాలంటే ముత్యాలమ్మ గుడి మీదుగానే దారి. గుడికి ఎడమవైపున పదిగజాల్లో అవతల వేపచెట్టుంది. మునసబుగారు నెమ్మదిగా వెళ్ళి చెట్టు మొదట్లో బండిచాటు చేసుకుని కుదురుగా నిలబడ్డారు.
∙∙
తలుపులు నానా గోలాచేస్తున్నాడు. వెల్లకిలా పడుకుని వెకిలిగా నానా కూతలు కూస్తున్నాడు. పాడుతున్నాడు. హఠాత్తుగా తలుపులు పాట ఆపేశాడు. మునసబుగారి గుండె ఝల్లుమందీ. కొంచెం ముందుకు వంగి తొంగి చూశాడు. అల్లంత దూరాన యముడిలా పకీరు. తలుపులికి వొళ్ళంతా చెమట పోసేసి, బిగించుకు పోయిన శరీరం పట్టు సడలింది. కెవ్వున అరవబోయాడుగాని అంతలో తిరిగి ఒళ్ళు బిగించుపోయింది. చేతులు నేలకి వాలి పిడికిళ్ళు బిగించుకుపోయాయి. గొంతు ఎవరో నొక్కేస్తున్నట్లయింది. వెంట్రుకలతో దిట్టంగా ఉన్న చెయ్యి ఒకటి ముందుకు వచ్చి తలుపులు కమీజు కాలరు పట్టుకోంటోంది. గేదెకొమ్ములాటి మీసాలు, మీసాల్లాటి కనుబొమలూ ఉన్న మొహం, ఇవన్నీ చూస్తే సాక్ష్యం ఇవ్వాల్సివస్తుందనీ మళ్ళీ ఈ రాక్షసుడు ఏంచేస్తాడోననీ దూరం ఆలోచించి చంద్రుడు మొహం మబ్బు చాటు చేసుకున్నాడు. సినిమా కెళ్ళిన కరణంగారిలా, తప్పుకున్న ముత్యాలులా, ఊరుకున్న ప్రెసిడెంటులా, మునసబులా...
తలుపులు తొడుక్కున్న కరణంగారి కమీజు కాలర్ని పిడికిలి బిగించి పట్టుకున్నాడు పకీరు. కొయ్యబారి నోరు తెరచి గుడ్లు తేలవేసి చూస్తున్న తలుపులు ఒక్కసారి ‘‘బాబోయ్’’ అని పెద్దగావు కేక పెట్టాడు. అతనిలో అణిగిపోయిన మగసిరి తిరగబడి మేలుకుంది. భయం మొండితనమైంది. అతని పక్కన నీరసంగా ఎండిన తోటకూర కాడలా పడున్న రెండు చేతులూ గుప్పెళ్ళలో దుమ్ము తీసుకుని, ముందుకు వాలిన పకీరు మొహంలోకి కొట్టాయి. పకీరు పట్టు వదిలి ‘ఛా’ అంటూ రెండు చేతులా మొహం మూసుకొని కళ్ళు వత్తుకోబోయాడు. విలాసముద్రలో ఉన్న తలుపులు కాళ్ళు రెండూ తెగిన స్ప్రింగ్‌లా తన్నుకుని విడిపడ్డాయి. ముడుచుకుని ముందుకురికి పకీరును పొత్తికడుపు మీద తన్నాయి. పకీరు వెనక్కి తూలి తమాయించుకొని పెద్దకేక వేయబోయాడు గాని తలుపులు శరీరం మట్టగిడసలా తన్నుకుని బంతిలా పైకెగిరింది. తలుపులు తల పొట్టేలు మల్లె ముందుకు వంగింది.
సన్నగా రివటాల ఉండే తలుపులు తాలూకు శరీరం దాన్ని తీసుకువెళ్ళి సరాసరి తూలి తమాయించుకోబోతున్న పకీరు పొట్ట మీదకు గురిపెట్టి కొట్టింది. బాణంలా వెళ్ళి తగిలాడు తలుపులు. పకీరు వెనక్కి పడుతూనే రెండు చేతులా తలుపులు జెబ్బలు పట్టుకున్నాడు. పడీపడగానే పక్కగా ఒరిగి, ఒక జెబ్బ వదిలి ఆ చేత్తో తలుపులు రొమ్ము మీద గాఢంగా పొడిచాడు. తలుపులు కిక్కురుమనలేకపోయాడు గాని ఆ బాధలో అప్రయత్రంగా అతని అరచేతి కింది భాగం పకీరు కింది పెదిమకు కొట్టుకుంది. పెదిమ చితికి, హడావుడిగా పకీరు కుడిచేతిని ఓదార్పుకు పిలిచింది. ఎడమచెయ్యి అతని అనుమతి తీసుకోకుండానే, సగంలో వదిలేసిన కళ్లకు సేవ చేయబోయింది. ఈ విధంగా ఊపిరి తీసుకోవటానికి సదుపాయం సంపాదించిన తలుపులు ఆ పని పూర్తికాగానే ఇంకొ దొర్లు దొర్లి లేచి ఉట్ల సంబరాలకి అలవాటైన ఒడుపుతో ఎగిరి శక్తి కొద్దీ రెండు మడమలతోటీ పకీరు ఎదురురొమ్ము మీదకి దిగాడు తలుపులు కాళ్ళు పట్టుకులాగబోయే లోగా, తలుపులు ఒక కాలుతో పకీరు గడ్డం మీద తన్ని తూలి ముందుకుపడిపోయాడు. తలుపులు లేచి కూర్చొని వెనక్కి చూశాడు. పకీరు నోటివెంట ఎర్రటి రక్తం తెల్లటి వెన్నెలలో నల్లగా మిలమిల మెరుస్తూ చెంప మీదుగా నేలకి జారుతుంది. అమాంతం తలుపులికి బలం, ధైర్యం తొలిసారి ఆవేశించాయి. కూర్చున్న పళంగానే ముందుకు వంగి రెండు పిడికిళ్ళూ బిగించి పకీరు రెండు చెంపల మీదా ముక్కు మీదా మూడు గుద్దులు గుద్దాడు.
‘‘బాబోయ్!’’ అని పెద్ద కేక పెట్టాడు పకీరు. ఊరు మారు మోగిపోయింది. లోకంలో మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ, బలవంతులు, బలహీనులూ, హింసాప్రియులు, అహింసాపరులూ ఎవరెవరెన్న భేదాలకు అతీతమైన అరిచిన బాధ అది. తలుపులు ఈసారి బలమంతా పూన్చిన పిడికిలితో నారి సారించినట్టు చెయ్యి వెనక్కిలాగి ఒక్క ఊపున పకీరు మెడనరం మీద పోటు పొడిచాడు. ‘‘బాబోయ్’’ అని మరో పొలికేక వేసి గిలగిల తనుకున్నాడు పకీరు. ఇంకో దెబ్బకి తలుపులు సన్నాహం చేస్తు ఉండగా పకీరు పిడికిట పొదిగి బిగించిన బొటనవేలుతో అతని డొక్కలో గాఢంగా పొడిచాడు.
అర్బకుడు తలుపులు, జాతరలో కోడిపెట్టెలా తన్నుకుని లేచి చెట్టు దగ్గిరకు పరుగెత్తాడు. అక్కడ నక్కపిల్లి కర్ర ఉందన్న సంగతి అప్పుడు తట్టింది. కర్ర తీసుకొని గిరుక్కున వెనక్కి తిరిగాడు తలుపులు. ఆరడుగుల పకీరు గాయపడ్డ పులిలా తూచి, చూచి వొడుపుగా అడుగులేస్తున్నాడు తన వేపు. పకీరు చేతిలో నాలుగంగుళాల బాకుంది. దగ్గరకు వచ్చాడు పకీరు. ‘‘ద్దొంగ.’’.
‘‘పకీరూ’’ అని హఠాత్తుగా పెద్ద గర్జన వినబడింది. తుళ్ళిపడి కేక వేపు చూడబోయి ఇటు తిరిగేలోగా పకీరు నెత్తిన తలుపులు శక్తి వంచనలేని దెబ్బ కొట్టాడు చేవగల కర్రతో. ‘‘బోబోయ్’’ అని ముత్యం మూడోసారి కేకవేసి కూలిపోయాడు పకీరు. తలుపులు తీరికగా కుడివైపు చూశాడు. అందాక చెట్టు చాటున ఉన్న ముసబుగారు ఇవతలికి వచ్చి వెన్నెలలో నిల్చున్నారు చేతికర్ర పట్టుకొని గంభీరంగా.
తలుపులు మళ్ళీ ఇటు తిరిగి కళ్ళు మూసుకుని కసీతీరా పకీరును బడితెతో బాదుతున్నాడు. ‘‘ఇక చాలు తులుపులూ’’ అన్నారు మునసబుగారు.
∙∙
పంచాయితీ ఆఫీసు అరుగు దగ్గిర జనం చాలామంది చేరారు. ఆఫీసువారి మూడు హరికేను దీపాలు ధర్మవిజయంలా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. పకీరు కాళ్ళూ చేతులూ కట్టేసి అరుగు మీద పడేశారు. ముత్యాలు అతని గాయాలు కడిగి మంచినీళ్ళు పడుతున్నాడు. చుక్క పసుపుకుంకాలనీ, తలుపులు తాకతునూ మెచ్చుకుంటున్నారు ప్రేక్షకులు. చుక్క మర్నాడు తప్పకుండా అమ్మవారికి ఉపారాలెడతానంటోంది. తలుపులు నీరసంగా గోడకి జారబడి పడుకున్నాడు. మళ్ళీ జ్వరం వచ్చింది ఒంటిన తెలివిలేదు.
ఇంకో ఘడియకి కారు అలికిడి వినబడింది. సందడి తగ్గి కొత్త గొంతుక వినబడడంతో మెల్లిగా కళ్ళు తెరిచాడు తలుపులు. ఎదురుగా పోలీసులు, జనం అంతా అమ్మయ్య అంటున్నారు.
‘‘పకీర్ని మీరెలా వదిలేశారండీ!?’’ అంటున్నారు మునసబుగారు ఆశ్చర్యంగా.
‘‘తలుపుల్ని పట్టుకోడానికి, చింతాలు కూనీ కేసులో వీడో సైడు హీరో. వాడూ వీడే కలిసే చంపుంటారు. వీడెలాగో పారిపోయి పైపెచ్చు కోర్టుకొచ్చి ప్రాసిక్యూషన్ తరఫున పకీరు మీద సాక్ష్యం ఇచ్చి వచ్చాడు. వీడి ప్రతిభ ఈ సంగతి మధ్యాన్నమే తెలిసింది. పకీరు ముందర చెబితే మేం నమ్మలేదు. అందుకని మేమొచ్చేలోగా పకీరు తొందరపడీ మాతో చెప్పకుండా వచ్చేశాడు’’ అన్నారు ఇన్‌స్పెక్టర్‌గారు.
‘‘కాని వీడెంత నాటకం ఆడాడు. మొగుణ్ణి గొట్టి మొగసాలకెక్కినట్టు, సర్లెండి దొంగని దొంగే పట్టుకోవాలి’’ అన్నారు మునసబుగారు.
‘‘బావుంది ఇపుడు మీరంతా కలిసి వాళ్ళని పట్టిచ్చారు మరీ మీరంతా దొంగలేనా?’’
‘‘ఏమో దొరికాక ఒక్కొక్కడూ ఒక్కొక్క రకం దొంగ.... దొరికేదాక ఒకొక్కడూ ఒకొక్క దొర’’ అన్నారు మునసబుగారు.
-ముళ్ళపూడి వెంకటరమణ
Comments
Please login to add a commentAdd a comment