mullapudi venkata ramana
-
ఎందుకో?.. నేను పుట్టినప్పుడు పూలవాన కురవలేదు..
సీటీఆర్ (రాజమహేంద్రవరం): పాత్రికేయునిగా, కథా రచయితగా, సినీ రచయితగా, నిర్మాతగా తెలుగువారి గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న ముళ్లపూడి వెంకట రమణ ధవళేశ్వరంలో 1931 జూన్ 28న జన్మించారు.. తన జన్మదినం గురించే ఆయన స్వీయచరిత్రలో విసిరిన చమక్కులను ముందుగా చూద్దాం...‘జ్యేష్ఠా నక్షత్రం, వృశ్చికరాశిలో పుట్టాను. అంటే జూన్ 28 తెల్లవారు జామున, 1931లో. పీవీగారు కూడా జూన్ ఇరవైయ్యెనిమిదే, 1921లో. అంటే నా కన్నా పదేళ్ల చిన్న. ఈ మాటంటే ఆయన పకాపకా నవ్వారు. ఎందుకో?... రాజమండ్రి, ధవళేశ్వరాల మధ్యనున్న ఆల్కాట్ గార్డెన్స్ ఆసుపత్రిలో పుట్టాను. నేను పుట్టినప్పుడు దేవదుందుభులు మోగలేదు. అచ్చరలాడలేదు. గంధర్వులు పాడలేదు. పూలవాన కురవలేదు.’’ కష్టాలతో చెలిమి... పట్టుమని పదేళ్లు రానివయసులోనే ముళ్లపూడి తండ్రిని కోల్పోయారు. కుటుంబానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పొట్ట చేతపట్టుకుని మద్రాసు మహానగరానికి వెళ్లారు. ఒక మెట్టగదిలో ముళ్లపూడి, ఆయన సోదరుడు, తల్లి కాపురం. తల్లి విస్తర్లు కుట్టి, ప్రెస్సులో కంపోజింగ్ పనులు చేసి సంసార నౌకను నడిపారు. మధ్యలో 7,8 తరగతులు చదువుకోవడానికి ముళ్లపూడి తల్లి, సోదరుడితో కలసి రాజమండ్రి వచ్చి, ఇన్నీసుపేటలోని కందుకూరి వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో చదివారు. తిరిగి మద్రాసు చేరుకున్నారు. ఎస్సెల్సీ వరకు చదువు కొనసాగింది. పూలేకాదు, ముళ్ళూ... పాత్రికేయ జీవితంలో అందుకున్న సన్మానాలు, పొందిన బిరుదుల, మెళ్లో వేసిన శాలువాలూ, పూలదండలే కాదు, పొందిన అవమానాలు, అగచాట్లు, డబ్బు చిక్కులూ, ఛీత్కారాలు అన్నిటినీ ముళ్లపూడి తన స్వీయచరిత్రలో చెప్పుకొచ్చారు. పొలిటికల్ కాలమిస్టుగా పనిచేస్తున్నప్పుడు నీలం సంజీవరెడ్డి గారు క్లబ్‌కు తీసుకువెళ్లి నా పేరు చెప్పి భోజనం లాగించెయ్. .అన్నారు..అప్పటికే ఆకలి ‘రుచి’పూర్తిగా తెలిసిన ముళ్లపూడి డైనింగ్ హాలులోకి వెళ్లి బేరర్‌కు చెప్పారు. ‘డ్రైవర్సుకీ, బోయెస్కీ బాక్ సైడ్ షెడ్లో ఇరికప్పా, పిన్నాలే పో’ అన్నాడు వాడు. సంజీవరెడ్డిగారికి ఏదో అనుమానం వచ్చి, హాలులోకి వచ్చి బేరర్‌ను చివాట్లు పెట్టారు. సినీ రిపోర్టరుగా ఉండగా గుచ్చుకున్న మరో ముల్లు.. సినీ స్టూడియోలో ఓ సారి ఎస్వీ రంగారావుగారు ఎదురయ్యారు. రమణని పిలిచి చెంప ఛెళ్లు మనిపించారు..‘‘చూడు రమణా! పత్రికకూ, నీ ఆఫీసుకూ ఓ స్టేటస్ ఉంది. స్టార్‌గా నాకో దర్జా ఉంది. నువ్విలా మాసిన గడ్డంతో, కాల్చిన చిలకడదుంపలా రావడం ఇన్సల్టు. మీకు డబ్బు లేకపోయినా శుభ్రంగా ఉండవచ్చును గదా’’ అన్నారు ఎస్వీఆర్.. ఇలాంటి అనుభవమే ఒకసారి అక్కినేనితో ఎదురయింది. ఆయన ఏదో కబుర్లు చెబుతూ...‘రమణగారూ. కొన్ని తత్వాలే అంత. ఫరెగ్జాంపుల్, మిమ్మల్ని మార్చడం మీ దేవుడి తరం కాదు, మీకు కోటి రూపాయలిచ్చినా ఈ మురికి బట్టలే వేసుకుంటారు..’ రమణ కోపంతో రిటార్ట్ ఇచ్చారు..‘‘సార్. ఇవి నలిగిన బట్టలు కావచ్చుకాని, మురికివి మాత్రం కావు. నేను ఒకసారి కట్టివిడిచిన బట్టను ఉతికి ఆరేస్తేకాని కట్టను. మీరు మీ ప్యాంట్లూ, సిల్కు చొక్కాలూ తొడిగి విప్పాక, చిలక్కొయ్యకేస్తారు. పదేసి రోజులు అదే వాడుతారు. నాకున్నది ఒకటే జత. కాని ప్రతిరాత్రి ఉతికారేసుకుంటాను. తువ్వాలు కట్టుకుని పడుకుంటాను. నాకు సిగ్గులేదు కాని, పొగరుంది...’ నిరుద్యోగ విజయాలు, పాత్రికేయునిగా ఉద్యోగం రెండేళ్ల ‘నిరుద్యోగ విజయాలు’ తరువాత నాటి ప్రముఖ ఆంధ్రపత్రికలో పాత్రికేయునిగా ఉద్యోగం ముళ్లపూడిని వరించింది. పాత్రికేయునిగా తనదైన ముద్ర వేస్తూనే, కథారచయితగా ముళ్లపూడి తన సత్తా చూపారు. రెండుజెళ్ల సీతలూ, సీగానపెసూనాంబలు, బుడుగులూ, అప్పారావులూ ఆయన కలం నుంచి వెలువడ్డాయి. గురజాడ గిరీశం, చిలకమర్తి గణపతి, మొక్కపాటి బారిస్టర్ పార్వతీశంలాగా, పానుగంటి జంఘాల శాస్త్రిలాగా ముళ్లపూడి సృష్టించిన అప్పారావు పుస్తకాల పుటల నుంచి వచ్చి, తెలుగువారి జీవితంలోకి చొరబడ్డాడు. (చదవండి: వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ?) తాగింది కావేరి జలాలు, ఉపాసించింది గోదావరి జలాలు తుది వరకు మద్రాసులోనే జీవించినా, ఆయన ధ్యాస, యాస, శ్వాస గోదావరి చుట్టుతానే తిరిగింది. తన 14 ఏటా నుంచి నేస్తం అయిన బాపుతో కలసి నిర్మించిన సాక్షి, అందాలరాముడు, ముత్యాలముగ్గు, స్నేహం, బుద్ధిమంతుడు మొదలైన సినిమాలు ఈ గడ్డనే పురుడు పోసుకున్నాయి. ఈ మాండలికమే ఆ పాత్రలు మాట్లాడాయి.. ఆరుద్ర చెప్పినట్లు ‘‘హాస్యం ముళ్లపూడి వాడి, వేడి తాకిడికి ఈ డేరింది’’ అనడంలో అతిశయోక్తి లేదు. (చదవండి: పిల్లనగ్రోవికి ఒళ్లంతా గేయాలే) -
గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!!
పాపం ఈ పెద్దవాళ్లెపుడూ యింతే. ముందస్తుగా వాళ్ల మాట వినాలి అంటారు గదా. పోనీలే మనం అల్లరి చేస్తే అప్పుడు మన్ని రష్చించరు. మళ్లీ అల్లరి చెయ్యను.. అంటే చెయ్యి అంటారు. చేస్తానూ అంటే ఒద్దూ అంటారు. ఎప్పుడూ మనమే వాళ్ల మాట వినాలి అంటారు. ఒక్కసారేనా వాళ్లు మన మాట వినరు. అంతెందుకు.. యిప్పుడు పాపం బాఘా చిన్న పిల్లలుంటారా.. వాళ్లకి కుంచెం తెలుగు వస్తుంది చూడు.. అప్పుడేమో.. ఎవరూ లేకుండా కుంచెం మాటాడుతారు. యీ అమ్మా.. నాన్నా.. బామ్మ.. యిలాటివాళ్లు ఎలాగో వినేస్తారు. అప్పుడు పక్కింటి లావుపాటి పిన్నిగారూ.. వాళ్ల ముగుడూ అలాటి వాళ్లు మనింటికొస్తారు.. అప్పుడేమో ఈ పాపాయిని కూచోబెట్టి నీ పేరు చెప్పూ అంటారు. పాపం పాపాయికి బాఘా తెలుగురాదు గదా.. దానికి భయంవేసి చెప్పదు. అప్పుడేమో ఈ పెద్దవాళ్లందరూ చూట్టూ నించుని చెప్పుచెప్పు చెప్పూ అని కేకలు వేస్తారు గదా.. పాపాయికి కోపం వచ్చేస్తుంది. దాన్ని రష్చించడానికి నేను చెప్తాననుకో పేరు! వాళ్లు వినరుగా నన్ను కొఠేస్తారు. దాని పేరు అదే చెప్పాలిట. అది చెప్పదుగా మరి. అప్పుడు వాళ్లమ్మా నాన్న దాన్ని కొఠేస్తారు మొండి పిల్లా అని. వాళ్లకి మొండి పిల్ల అంటే అసలు అర్థం తెలీదు. నాకు తెలుసనుకో. పక్కింటి లావుపాటి పిన్నిగారు ఒకసారి పేరంటానికెళ్లి వాళ్ల పాపను ఎత్తుకుంటుంది కదా.. అప్పుడు పాప చంక దిగనంటుంది కదా.. వాళ్లమ్మ పిలిచినా వాళ్లనాన్న, బామ్మ పిలిచినా రాను పో అంటుంది. ఆఖరికి ఇంకో పాపాయి వచ్చి ఉంగా భాషలో ఆలుకుందా వత్తావే అని పిలిచినా సరే లాను పో అంతుందే అదీ మొండి పిల్ల. ఏవిటో ఈ పెరపంచకంలో బోల్డుబోల్డు రకాల పిల్లలు. బోల్డురకాల పెద్ధవాళ్లు. అప్పుడప్పుడూ నేను హాచర్యపడి పోయేస్తుంటాను. బుడుగూ, మరేమోనేం మా అమ్మావాళ్లూ రోజూ నన్ను బళ్లోకి వెళ్లమంటున్నారు. లాపోతే కొట్టుతాను అంటున్నారు ఎలాగ? ముందస్తుగా నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వీడు నన్ను అనుమానం చేస్తున్నాడు కదా. నా పేరు బుడుగు అయినా వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ? అందుకే. అయినా వాడి ఖష్టాలు చూస్తే జాలి వేస్తోంది గదా మనకి. అసలు నీ చిన్నప్పటినించీ, మీ తాతయ్య చిన్నప్పటినించీ చిన్న పిల్లలు ఎప్పుడూ ఇలా కష్టపడుతూనే ఉన్నారు. అందరు చిన్నపిల్లలినీ ఇలా బళ్లో పెట్టెయ్యడమే. పోనీ ఏదో ప్పదిరోజులికి ఒకసారి వెళ్లితే చాలదుట. రోఝూ వెళ్లాలిట. మళ్లీ యీ పెద్దవాళ్లందరూ చిన్నప్పుడు ఇలా కష్టపడినవాళ్లే. అయినా పెద్దయ్యాక ఇప్పుడు చిన్న చిన్న పిల్లలిని బళ్లో పెఠేస్తున్నారు. అంతెందుకులే.. పాపం నన్ను కూడా రేపో మూడ్రోజులుకో బళ్లోపెట్టాలని చూస్తున్నారు గదా. నన్నేం చెయ్యలేరనుకో. అయినా చిన్నవాళ్లూ బళ్లోకెళ్లకుండా ఉండడానికని కొన్ని సంగతులు చెప్తాను. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. ఒకటి: జెరం వచ్చిందని చెప్పాలి. మనం చెప్తే నమ్మరుగదా.. అందికని యేం చెయ్యాలంటే ముందస్తుగా చొక్కా యిఫ్పేసుకోవాలి. అప్పుడేమో ఎండలో నిలబడాలి చాలాసేపు. అప్పుడు వీపు మీద .. పొట్ట మీద జెరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేసుకుని అమ్మ దగ్గిరికి వెళ్లాలి. అమ్మోయి జెరం జెరం గబగబా చూడూ.. బళ్లోకి వెళ్లద్దని చెప్పూ అని చెప్పాలన్నమాట. ఇంకోటి: జెరం రాగానే పరిగేసుకు కెళ్లి చెప్పాలి తెలుసా.. లాపోతే జెరం చల్లారిపోతుంది. ఉంకోటి కూడాను.. ఇలాంటి దానికి అసలు బామ్మ మంచిది. బామ్మకి చెప్పేస్తే చాలు.. అప్పుడు అదే అమ్మకి చెప్తుంది. రెండు: కుంచెం మంది పిల్లలు కడుపునొప్పి అని అంటారు కాని అది మంచిదికాదులే. రెండుసార్లో.. ఫదిసార్లో అయాకా అమ్మావాళ్లూ కారప్పూసా పకోడీలు చేసుకుని మనకి పెట్టకుండా తినేస్తారు. యిప్పుడు లేదుగదే అమ్మా అని చెప్పినా సరే.. పెట్టరు. ఇప్పుడు లేకపోతే రేపోప్పదిరోలుకో వస్తుందిగా అందుకని వద్దూ అని అంటారు. అందుకని, తలనొప్పి అన్నింటికన్నా మంచిది. ముందస్తుగా అమ్మ నమ్మదు అనుకో. అయినా సరే మనం తలనొప్పి తలనొప్పి అని పదిసార్లో వందసార్లో చెబితే కుంచెం నమ్ముతారు. ఇది కూడా ముందస్తుగా బామ్మకే చెప్పాలి. అమ్మకి చెబితే లాబంలేదు. అసలు ఏం చేసినా లాబంలేదు. ఎలాగేనా బళ్లోకి వెళ్లాలిలే. అందుకని కుంచెం ఎలాగో చాలా కష్టపడి రోఝూ బళ్లోకే పోవడం మంచిది. గబగబా గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా. అప్పుడు ఇంచక్కా ఎప్పుడూ బడి మానేయొచ్చు. యింకోటి.. మా బాబాయంత పెద్దవాళ్లు అయ్యాకా.. అసలు ఇంక బళ్లోకి వెళ్లద్దంటారులే. మా బాబాయి అంతేగా.. బళ్లోకి వెళ్తాను వెళ్తాను అంటాడు. బామ్మా, నాన్న..యింక చాల్లే, ఆఫీసుకి వెళ్లిపో అంటారు. అదన్నమాట. ఈ పెద్దవాళెపుడూ యింతే. మనం వెళ్తాం అంటే వద్దూ అని అంటారు. మనం వెళ్లను ఒద్దూ అంటే, వెళ్లూ వెళ్లూ బళ్లోకెళ్లూ బడి దొంగా అంటారు యెలాగ? ఇంకో ఉత్తరం చూడు.. వీడు కుంచెం పెద్ద కుర్రాడిలా వున్నాడు. వురేయ్ వురేయి బుడుగూ మలేమోన మా అమ్మా నాన్నా డబ్బులు అసలు ఈటంలేదూ ఎలాగరా మరీ అని రాశాడు గదా.. ఇది కూడా చాలా కష్టమే. అసలు డబ్బులు అంటే చాలామందికి చాలా యిష్టంట. నాక్కూడా కుంచెం యిష్టమేననుకో. కాని ఏం చేస్తాం. చిన్న పిల్లలికీ, కాలేజీకి వెళ్లే బాబాయిలకీ డబ్బులు చాలా యివ్వరు. అడిగినా సరే. కాని అబద్ధం చెప్తే చాలా డబ్బులు ఇస్తారుట. బాబాయి యిలాగే చేస్తాడుట. మళ్లీనేమో నాన్నకి అమ్మ డబ్బులు ఇవ్వదు కదా. ఎందుకూ అంటుంది. అప్పుడు నాన్న కుంచెం అబద్ధాలు చెప్పుతాడుట. చిన్న పిల్లలు మాత్తరం అబద్ధం చెప్పకూడదుట. చెప్పితే కొట్టుతారు. కాని మనం నిజెం చెప్పుతాను అంటూ కుంచెం మంది పెద్దవాళ్లు డబ్బులిస్తారులే. పక్కింటి లావుపాటి పిన్నిగారి ముగుడు లేడూ.. వాడేం.. బీడీలు కాలుస్తాడులే. బీడీలు కాలచడం అంటే తప్పు కదా ఊరికే జెటకా తోలడానికి దాచుకోవాలి అంతే. వాడు నిజెంగా కాలిచేస్తాడు గదా. పక్కింటి లావుపాటి పిన్నిగారు అతనికి చెప్పిందిలే వురేయ్ ముగుడూ అలా బీడీలు కాలచకూడదూ అని. అయినా వాడు మా యింటికి వచ్చి నాన్న దగ్గర కూచుని కాలుచుతాడు గదా. అప్పుడేమో నేను వురేయ్ నీ సంగతి చెప్పుతా ఉండు అని అంటాను గదా. వాడు ఘబుకుని నన్ను ముద్దు పెఠేసుకుని ఓ కాణీయో ప్పదణాలో యిచ్చేసి చెప్పకమ్మా బుడుగు తప్పమ్మా ఒద్దమ్మా యిలాని ఏడుచుతాడు. అప్పుడు నేనేమో పోనీలే అని.. యేవండీ పక్కింటి లావుపాటి పిన్నిగారూ.. మరేమోనూ మీ ముగుడేమో మా నాన్నతో కలసి బీడీలు కాలచలేదండీ అని అబద్ధాలు చెపేస్తాను. ఏవిటో నేను యెప్పుడు ఇలా అందరినీ రష్చించుతానులే. - ముళ్లపూడి వెంకటరమణ చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
గోదారమ్మ నేర్పిన లౌకిక పాఠాలు
జర్నలిస్టుగా, కథారచయితగా, అనువాదకునిగా, సినీ రచయితగా, నిర్మాతగా ప్రజల హృదయాల్లో తనదైన ముద్రవేసుకున్న ముళ్ళపూడి వెంకట రమణ తన బాల్యంలో –రాజమండ్రి వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో సెకండ్ ఫారం చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటలను తన జీవిత చరమాంకంలో–80వ పడికి చేరువలో రాసిన స్వీయచరిత్ర ‘కోతికొమ్మచ్చి’లో వర్ణించారు. 1931 జూన్ 28న రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ ఆసుపత్రిలో రమణ జన్మించారు. భారత మాజీప్రధాని పి.వి.నరసింహారావు కూడా 1921 జూన్ 28న జన్మించారు. ‘అంటే నా కన్నా పదేళ్ళు (పి.వి) చిన్న అని నేను అన్నప్పుడు, ఆయన పకపకా నవ్వారు–ఎందుకో?’.. అని స్వీయచరిత్రలో రమణ చమత్కార బాణం సంధించారు. చిన్నప్పుడు తాను పెరిగిన ఇంటిని గురించి, వాతావరణం గురించి, రమణ చెప్పిన మాటలు... మా ఇల్లు కోలాహలంగా ఉండేది. గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలు, అవి లేనప్పుడు సావిట్లో కుసుమహరనాథ భజనలు, నట్టింల్లో దెయ్యాలను సీసాల్లో బిగించే ముగ్గుల పూజలూ, బైరాగులూ–పెరటి వసారాలో చుట్టాలూ వాళ్ళ చుట్టాలకి పెట్టుకునే తద్దినాలూ, శాంతులూ, తర్పణాలూ.. మా నాన్న ఒకసారి ఆసుపత్రికి వెళ్లారు. ఇంక రారు అని చెప్పారు, అప్పుడు మా ఇల్లు చీకటైపోయింది...’ తలుపులు ఇంట్లో అన్నం తిన్నందుకు... ఆకలని ‘బాల రమణ’ గోల చేస్తే, తలుపులు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి గంజిలో అన్నం కరుడు వేసి పెట్టేవాడట. ఈ సంఘటన ముళ్ళపూడి మాటల్లో... ‘వాళ్ళింట్లో వెడల్పయిన కంచుగిన్నె ఉండేది. వాళ్ళు ఆ కంచుగిన్నెను పీట మీద పెట్టి, తాము కింద కూర్చుని తినేవాళ్ళు. మా ఇంట్లో నాన్నా వాళ్ళు పీట మీద కూచుని నేల మీద కంచం పెట్టుకుని తినేవారు. ఒకసారి మా ఇంట్లో అన్నం దగ్గర కూర్చుని, పీట మీద కంచం పెట్టి, కింద కూర్చుని తినబోయాను. అమ్మమ్మ చూసింది – ‘అదేమిట్రా–పీట మీద కంచం’ అంది. ‘తలుపులూ వాళ్ళింట్లో ఇలాగే తింటారు – అన్నం దేవుడట కదా? అందుకని దీన్ని పీటమీద పెట్టి మనమే కింద కూచోవాలిట’ అన్నాను. ‘వాడింట్లో అన్నం తిన్నావా’ అంది అమ్మమ్మ. ‘కాదమ్మా, సద్ది కూడు..’ అన్నాను. ‘ఓరి గాడిదా! లే నూతి దగ్గిరికి పద’ అంటూ ఈడ్చుకెళ్ళి చేదతో నీళ్ళు తోడి నెత్తిమీద దిమ్మరించింది... సీన్ కట్ చేస్తే–1969. నేస్తం బాపుతో కలసి ‘బుద్ధిమంతుడు’ సినిమా తూర్పుగోదావరి జిల్లా, పులిదిండి గ్రామంలో తీసారు. పరిమనిష్ఠాగరిష్ఠుడైన మాధవాచార్యులు అన్నగారు –మద్యం, మగువలతో కాలక్షేపం చేసే గోపాలాచార్యులు ఉరఫ్ గోపి తమ్ములుంగారు. అన్నగారికి నిరంతరం ఆలయంలోని కృష్ణపరమాత్మకు తన కష్టసుఖాలు చెప్పుకోవడం రివాజు, తమ్ముడు వర్ణాంతర వివాహానికి సిద్ధపడ్డాడని తన ఆవేదనను నల్లనయ్యతో చెప్పుకుంటాడు. ‘వాడు పూర్తిగా చెడిపోయాడు. తగని సావాసాలు చెయ్యడమే కాకుండా, వర్ణాంతర వివాహానికి, వర్ణ సంకరానికి సిద్ధమయ్యాడు. వాడిని వెలివేసాను’ చిరునవ్వుతో కృష్ణుడికొంటె ప్రశ్న–మాధవయ్యా! మరి నిన్నెవరు వెలివేయాలి?’ ఇంత నిష్ఠాగరిష్ఠుడిని–నన్నే కృష్ణుడు ఇలా ప్రశ్నిస్తాడా? అని....‘ఎందుకూ?’ అమాయకంగా కృష్ణుడిని ప్రశ్నించాడు. ‘నీవు వర్ణసంకరం చేయడం లేదా? నేను క్షత్రియుల ఇంట పుట్టానని, యాదవుల ఇంట పెరిగానని నీకు తెలియదా? నన్ను నీ ఇంటిలోనే నిలుపుకుని నా ప్రసాదం కళ్ళకద్దుకుని తింటున్నావే? నిన్నెవరు వెలివేయాలి?.’ – వారణాసి సుబ్రహ్మణ్యం, సాక్షి, రాజమహేంద్రవరం కల్చరల్ గోదావరి గట్టుపై బాపురమణలు -
సాక్షి
రెండు ఝాముల పొద్దు తిరిగింది. వీధరుగు మీద పడక్కుర్చీలో మేను వాల్చిన మునసబుగారు వార్తాపత్రికను పడేసి కన్నులరమూసి చింతాలు ఖూనీ కేసు గురించి లీలగా ఆలోచిస్తూ సన్నగా గుర్రుపెడుతున్నారు. ∙∙ చుక్క వొగరుస్తూ తూలి పడబోతూ తిట్టుకుంటూ పరుగెడుతోంది. ‘‘నా దేవుడోయ్! నా కొంపదీశావురోయ్. సందేళకి నివ్వింక నేవురోయ్ నాయనోయ్’’ అంటోంది. మాట మాటకీ వొగరుస్తోంది. మగతనిద్రలో ఉన్న మునసబుగారికి చింతాలు కేసులో తలుపుల్నురిదీయబోతున్నట్టు కలొచ్చింది. సంకెళ్ల చప్పుడు గూడా వినబడినట్టయి గతుక్కుమని కళ్లు తెరిచారు. వీధిలో చుక్క పరుగెడుతోంది. శివాలెత్తినట్టు ఊగిపోతోంది. ‘‘ఏవిటే చుక్కా?’’ అన్నారు మునసబుగారు. ‘‘నాయనోయ్ నా కొంప ముంచాడయ్యోయ్’’ అంది చుక్క వెనక్కి తిరక్కుండానే పరుగు సాగించింది కాలవొడ్డువైపుకి. సుడిగాలి వెనకాల ఆకులలముల్లా వస్తున్నాడు చుక్క తమ్ముడు. చింపిరిజుట్టు, బాన బొజ్జా ఎగరేసుకుంటూ చిన్న చిన్న అంగలతో అడుగులేస్తూ– ‘‘ఈరిగా ఇల్రా. ఆగు. చుక్కేవిటిలా పరుగెడు...’’ ‘‘పకీర్నొగ్గేశారంటండీ పోలీసోళ్లు. ఆడు మూడు గంటల కారుకొచ్చెత్తన్నాడు. తలుపులు మావని సంపేత్తాడంటండి’’ అని ఏడుస్తూ పరుగెత్తాడు ఈరిగాడు అక్క చుక్క వెనుక. మునసబుగారు పూర్తిగా మేలుకున్నారు. ఫకీర్నెవరొగ్గేశారు? ఎలా ఒగ్గేశారు? కేసు పూర్తికాందే ఇది ఎలా జరిగింది? ఫకీరుగాడు ఊళ్లో వచ్చిపడితే ఈసారి ఊరు వల్లకాడవడం ఖాయం. అందరికన్నా ముందు తలుపుల్ని కాలికిందేసి నల్లిని నలిపినట్టు నలిపేస్తాడు వాడు. రెండేళ్ల క్రితం సంకురాత్రి పండగలికి కోడిపందాల్లో ఓడినందుకు ఉక్కురోషం వేసుకొచ్చి చూస్తూ ఉండగా నరసయ్యని అట్టే పీక నులిమి చంపేశాడు. అంతా అట్టే గుడ్లప్పగించి నిలబడిపోయారు. ఒక్కడికీ అదేమనడానికి దమ్ములు చాలకపాయే. సాక్ష్యానికి మనుషుల్ని పోగేసుకు రాబోయేసరికి ప్రాణం సాలొచ్చింది. ఫకీరుగాడు పరమ కిరాతకుడు. ‘‘బాబోయ్ కొంపలు ముణిగినయ్యండి’’ అంటూ వచ్చాడు ముత్యాలు. ‘‘ఫకీర్నొగ్గేశారంటగా, తలుపులెదవ ఒణుకుతో సచ్చేట్టున్నాడండి. ఏందారి?’’ అన్నాడు. మునసబుగారు గయ్‌మన్నారు ఒక్కసారి. ‘‘ఏవుంది. ఒకటేదారి...అసలాణ్ణి సాక్షానికెళ్లమన్నదెవడంట. యదవలు. ఒక్కడు ముందర చెప్పినట్టినడు. ఆ మాత్రం మగసిరి ఇంకోడికి లేదనే బయల్దేరాడేం యదవ. ఇప్పుడేడిచేం లాభం?’’ అన్నారాయన. ముత్యాలు మాటాడలేదు. తలొంచుకు నిలబడ్డాడు. మునసబుగారు కండువా బుజానేసుకుని కరణంగారింటికి బయల్దేరారు. ‘‘నరిసిరెడ్డిని కేకేసుకురా. కరణం గారింటికాడుంటానన్జెప్పు’’ అన్నారు. ‘‘ఆరక్కడే ఉన్నారండి’’ అన్నాడు ముత్యాలు. ముత్యాలమ్మ గుడిమలుపులోనే శివాలు వినిపించాయి మునసబుగారికి. ఇంకో అడుగేసేవరకూ గుడి దగ్గర గణాచారి ఉగ్రంగా ఊగిపోతోంది. తలుపులు నేలబారుగా సాగిలబడి దండాలెడుతున్నాడు. చుక్క చతికిలబడి, నెత్తి కొట్టుకుంటూ శోకన్నాలెడుతోంది. తలుపులు పెద్దపెళ్లాం సావాలు ధైర్యం చిక్కబట్టుకు గణాచారిని ప్రశ్నడుగుతోంది. మునసబుగారు ఆగదల్చుకోలేదు కాని, అంతకితం వరకు గణాచారి గాబోలు బాగుచేస్తున్న కందుల్ని కాకులు దినిపోతుంటే, ‘‘హుష్ కాకీ!’’ అన్నాడు. సాగిలపడున్న తలుపులు తలిటు దిప్పి చూసి, బావురుమని ఏడుస్తూ మునసబుగారి కాళ్లు చుట్టేసుకున్నాడు. ‘‘నాన్నగారోయ్ నను సంపేత్తాడండోయ్. ఆడొచ్చేత్తన్నాడండోయ్’’ అని భోరున ఏడవసాగాడు. గణాచారి ప్రశ్న చెబుతూనే ఉంది. ∙∙ సావిట్లో అంతా సందడిగా ఉంది. కరణంగారూ, వారి పట్నపల్లుడూ, ప్రెసిడెంటు సర్సిరెడ్డి, ఇంకిద్దరు మెంబర్లు, జనాభా లెక్కలు రాసుకోడానికొచ్చిన ఓ దొరటోపీ మనిషీ రెండుభాషల్లో మూకుమ్మడిగా ఏకటాకీన ఖూనీ కథలూ బ్రెమ్మరాతా కర్మ సిద్ధాంతం, ఆ బాపతు వేదాంతం వాళ్ల చిన్ననాటి ముచ్చట్లు, నేతి బీరకాయలో నెయ్యి ఉండని వైనం, అమెరికాలో గాంగ్‌స్టర్లు ఖూనీలు చేసే శిల్పం, ఫకీరుగాడి పుట్టు పూర్వాలూ, తలుపులుగాడి రెండో పెళ్లాం చుక్కకీ మధుర శిల్పాలలో అచ్చరలకీ కొట్టొచ్చినట్టు కనబడే పోలికలు (ఎవరో తెలీదు) ఖూనీలు కామాపుజేసే వాళ్ల కథలూ చెప్పుకుంటూ, హఠాత్తుగా దయచెయ్యండి అన్న ఒకమాటని మాత్రం ఏకగ్రీవంగా అన్నారు. తర్వాత, జరిగిన కథను సమీక్షించి కర్తవ్యం గురించి నిశ్శబ్దం తీవ్రంగా ఉపన్యసించింది. కరణంగారు గొంతు సవరించుకున్నారు. ప్రెసిడెంటుగారు అనుకరించారు. ‘‘అసలు వాణ్ణెలా వదిలేశారూ అంట?’’ అన్నారు మునసబుగారు. ‘‘మరే కేసు పూర్తిగాందే...అసలూ?’’ అన్నారు కరణంగారు. ‘‘పారిపోయుండాల’’ అన్నారు ప్రెసిడెంటుగారు. ‘‘ఇంఫాసిబుల్’’ అన్నాడు దొర టోపీ ఆయన. కరణంగారి అల్లుడు సాహసించి కలగజేసుకున్నాడు. ‘‘వైనాట్. అమెరికాలో జైళ్లలాంటి వాటినే తప్పించుకుంటారు. అక్కడ...’’ ప్రెసిడెంటుగారి చూపు చూసి ఆగిపోయాడు కరణంగారల్లుడు. ‘‘నే సెలవు దీసుకుంటానండీ’’ అన్నాడు దొరటోపీ ఆయన. ‘‘తలుపులుగాడి పాణానికి ముప్పే’’ అన్నాడు ముత్యాలు. ‘‘వాడి పెళ్లాం ఒకటే ఏడుపు పాపం. కట్టుకుని ఆర్నెల్లు కూడా తిరగలేదింకా’’ అన్నాడు ఏదో పెద్ద ఆర్నెల్లు తిరిగితే ఫర్వాలేదన్నట్టు. ‘‘సార్ జనాభా లెక్కలో జనసంఖ్య ఎంత రాసుకున్నారో గాని, ఒకటి తగ్గించి ఖర్చు రాయొచ్చు’’ అన్నాడు అల్లుడుగారు విట్టీగా..అని చుట్టూ చూసి నవ్వబోయి కొయ్యబారిపోయాడు. ∙∙ ప్రెసిడెంటుగారు జనాభా లెక్కలాయన్తో మాటాడుతూ సాగనంపబోయారు. మిగతా వాళ్లు ఆలోచనలో పడిపోయారు. ఫకీరు మూడుగంటల మెయిలు కారుకి దిగుతాడన్న వార్త అందరికీ తెలుసు. ఐదు నిమిషాలయ్యే సరికి చుక్కా, తలుపులూ వచ్చారు. ‘‘నాన్నగారోయ్ నాకేం దారి చెప్పండ’’న్నాడు తలుపులు ఏడుస్తూ. ఏ నాన్నగారూ ఏ దారీ చెప్పలేదు. ‘‘అసలు నీకెందుకురా గోల, నువ్వెందుకు సాక్ష్యమిచ్చావు? ఫకీరుతో చెలగాటవేవిటి? అదీ ఖూనీ కేసులో! మాకా మాత్రం దమ్ముల్లేకనే!?’’ అన్నారు కరణంగారు. ‘‘సర్లెండి అదంతా ఎందుకిప్పుడు. ఆడి మొఖానలా రాసిపడేసుంది గావాల. కుదురుగా ఇంటికాడెలాగుండగల్డూ..’’ అన్నారు మునసబుగారు. ఊళ్లో ఇందరున్నారు జెమాజెట్టీల్లాంటి వాళ్లు. ఇందరు కలిసి పట్టపగలు ఒక్క ఫకీరుగాడికి అడ్డుపళ్లేరా అనిపించింది. ఎవరి మటుకు వాళ్లకి. ఆ మాటే చుక్క పైకి అనేసింది. ‘‘అవున్నాన్నగోరు. ఆడు రాగానే బెడిత్తిరగేసీ..’’ అన్నాడు తలుపులు. ‘‘ఛస్ నువ్వూర్కో. ఇలాటెదవాలోచన్లు జేసే ఇంతకి దెచ్చుకున్నావు’’ అన్నారు మునసబుగారు. మునసబుగారి మనసు ఆయనకన్నా ముత్యాలుకు బాగా తెలుసు. ఇలాటి సమయాల్లో అతనే టీకా తాత్పర్యాలు భాష్యాలు చెబుతాడు. ఇప్పుడూ నమ్మినబంటుగా ఆ పని చేశాడు. ఫకీరుది పాము పగ అని వెల్లడించాడు. ‘‘మరిపుడేటి చేదారి ఏటి దారీ?’’ అన్నాడు తలుపులు. ‘‘దారికేటుంది. ఎవిడిదారాడిదే. నన్నడిగితే ఆడలా మెయిలు కారు దిగేతలికి నువ్విట్నించిలా పొలాలకడ్డంబడి పో. లేదా పడవెక్కి పట్నానికెళ్లిపో. ఆనక మేవంతా ఆడికి నచ్చచెబుతాం. సల్లబడ్డాక మెల్లగా రావచ్చు’’ అన్నాడు ముత్యాలు. ‘‘వాడు శాంతించకపోతే అదే పాయని, పట్నంలోనే స్థిరపడిపోవచ్చున’’ని కూడా ఆశపెట్టారు. తలుపులికి మనసు కొద్దిగా స్థిమిత పడుతోంది. కొంచెం కుడి ఎడమా ఆలోచిస్తున్నాడు. ముత్యాల్లాంటి వాళ్లిద్దరు తనకెడాపెడా నిలబడి, కర్నం మునసబులూ పంచాయితీ ప్రెసిడెంటూ వెనక నిలబడితే చాలు. ఫకీరుగాడికి దర్జాగా ఎదురుపడవచ్చు. ‘‘ఎటేస్ పల్లకుండావు. ఎల్ల దల్చుకుంటే బేగీ లగెత్తు’’ అన్నాడు ముత్యాలు తమాషాగా చుక్క వంక చూసి నవ్వి. తలుపులు చుక్క వంక చూశాడు. తల కొట్టేసినట్టయింది. ‘‘బతికుంటే బలుసాకేరుకు దినొచ్చన్నా’’రు కరణంగారు. ‘‘అవును మావా’’ అంది చుక్క కళ్లు చెంగుతో వత్తుకుంటూ. తలుపులు చుట్టూ చూసి, ‘‘ఎదవ నాయాళ్లు. యదవ కళ్లెదవ నోళ్లు’’ అనుకున్నాడు. కరణంగారు, మునసబుగారు ఒక్క మారే బరువుగా నిట్టూర్చారు. అనిందికేముంది గనక, ఫకీరు పరమ దుర్మార్గుడు. అన్నిటికీ తెగించినవాడు. వాడికి అడ్డపడిందికి ఆలుబిడ్డలున్న వాడెవడూ ముందుకు రాడు. అంచేత తలుపులు, ప్రాణాల మీద ఆశ ఉంటే తక్షణం వెళ్లిపోవడం మంచిదని వారభిప్రాయపడ్డారు. తలుపులు మరోసారి ఆలోచించుకున్నా ఊరొదిలి పోబుద్ధికాలేదు. ప్రాణభయం ఎంత పీకుతున్నా కొంపా గోడూ వదులుకుని పారిపోవడం వాడికి అవమానంగా తోచింది. ‘‘నా బాబు, నా బాబు బాబు ఈడనే పుట్టి ఈణ్ణే మట్టిలో గలిశారు. నేనెందుకు పోవాల నేనేం కూనీల్జేశానా?’’ అన్నాడు. కరణంగారు నవ్వారు. ‘‘ఇదెప్పట్నించిరోయ్ దేశభక్తి. ప్రాణమ్మీదికి ముంచుకొస్తూ ఉంటే ఈ వేదాంతం ఏమిటి? నీ బాబూ ఆడి బాబూ ఖూనీ కేసులో సాక్షాలిచ్చి పీకల మీదికి...’’ ‘‘ఎవరదీ?’’ అన్నారు మునసబుగారు వాకిట్లోకొచ్చిన మనిషిని చూసి. ‘‘నేనండి ఎర్రెంకన్నని. తలుపులుగాడింకా ఈణ్ణే ఉన్నాడండీ, అయిబాబో! ఫకీర్నొగ్గేశారండి. ఆడొచ్చి సంపేత్తాడండియ్యాల... ఊరంతా..’’ ‘‘అదేనోయ్, పారిపొమ్మంటే అవునుగాని నీకెవరు జెప్తారిది. వదల్డం నిజమేనా అని..’’ ‘‘ఎవరేటండి దాన్నడగండి. ఆ చుక్కకే తెల్సు. ఇందాక పన్నెండు గంటల కారుకి డైవోరు రెడ్నాయుడే సెప్పాడంటండి..’’ ‘‘అదే మేం ఊరొదిలి పొమ్మంటున్నాం. వాడు శాంతించాకా..’’ ‘‘ఇంకేడికి పోతాడండి. కబురపుడే అందరికీ తెల్సిపోయింది. ఆడి మనుసులు ఈడు ఊరొదిలిపోకుండా కాలవకాడ తోపుకాడ వుంతినకాడా కాపేశారంటండి. ఆడు మూడుగంటల కారుకొచ్చేత్తన్నాడంట..’’ ‘‘నాయనోయ్’’ అంటూ చుక్క ఏడుపు లంకించుకుంది. చూస్తుండగానే తలుపులికీ ముచ్చెమటలు పోసేశాయి. గజ గజ వణికిపోయాడు. రెండు చేతుల్లో తల పట్టుకు కూలబడిపోయాడు. కళ్లు తిరిగిపోయాయి. ‘‘నా తల్లి ముత్తేలమ్మో..’’ అంటూ చుక్క వొళ్లోకి ఒరిగిపోయాడు. ∙∙ ‘‘అయితే ఏం చేదాం?’’ అన్నారు కరణంగారు. మునసబుగారు మాటాడలేదు. ‘‘చేసేదేముంది, ఎవడి ఖర్మకెవరు కర్తలు. అటు కోరటు వాళ్లలా మంచీ చెడ్డా లేకుండా ఖూనీకోర్లని దేశం మీదకొదిలేస్తుంటే చేసేదేవుంది?’’ అన్నారాయనే మళ్లీ. మునసబుగారు గొంతు సవరించుకున్నారు. ‘‘చిన్నా పెద్దా మనమంతా కల్సి ఆడూళ్లో దిగ్గానే అడ్డం పడితే..?’’ అన్నారు. కరణంగారు తల తాటించారు. ‘‘మీరేమన్నా అనుకోండన్నగారూ, నాకా సాహసం లేదు. కొంప దుంపనాశనం చేసుకోదలిస్తే తప్ప...’’ మునసబుగారు ముత్యాలుకేసి చూశారు. ‘‘దారుణం, ఇది ఊరో అడివో నాకు తెలీటం లేదు. ఇందరం ఉండి ఒక్కడి ప్రాణానికి అడ్డు పళ్లేకున్నాం’’ అన్నారు మునసబుగారు లేస్తూ. ‘‘ఏం చేస్తాం...పోనీ పోలీసు ఠాణాకి కబురంపండి మనిషినిచ్చి..వస్తా. అల్లుడూ అమ్మాయి సినిమాకోయ్ అని గోలబెడుతున్నారు. మాయాబజారుట...మీరూ వస్తారా?’’ అన్నాడు కరణంగారు. ‘‘రాను...’’ అంటూ వెళ్లిపోయారు మునసబుగారు. కరణంగారు, చుక్కకి ధైర్యం చెప్పారు. తలుపులికి స్పృహే ఉన్నట్టు లేదు. ‘‘రాగానే మీ సవుతులిద్దరు వాడి కాళ్ల మీద పడండి. అంతకన్న మార్గం తోచట్లేదు’’ అన్నారాయన. ∙∙ చుక్క తలుపుల్ని లేవదీసి నెమ్మదిగా ఇంటికి బయల్దేరింది. నెత్తిన ఎండ పేలిపోతోంది. తలుపులికి ఒళ్లు మసిలిపోతోంది. కళ్లు మూసుకునే చుక్కనానుకు నడుస్తున్నాడు. అమ్మవారి గుడి దగ్గర ఆగి, ‘‘గండం గడిచి తెల్లారితే ఉపారాలెత్తుతాను తల్లీ పెట్ట నేయిత్తానమ్మా’’ అని దండమెట్టుకుంది. ఇల్లు చేరి గుమ్మంలో అడుగెడుతుండగా, ‘‘ఆడు తొడిగింది కరణంగారి కమీజంట గాదూ, ఎందుకన్నా మంచిది ఇప్పించేసేయ్’’ అని చెప్పి వెళ్లిపోయాడు కరణంగారింటి పాలేరు. ‘‘థూ...’’ అని ఉమ్మేసింది చుక్క. లోపల సవితి చామాలు పడుకుని ఉంది. అంపకం పాలతో జ్వరం వచ్చేసింది సావాలుకు. కలవరింతలు, కేకలు. చుక్కకి దుఃఖం పొంగి వచ్చేసింది. తలుపుల్ని మంచాన పడుకోబెట్టి దుప్పటి కప్పింది. సావాలు కణతలంటి చూసింది. ‘‘నా కొంప ముంచాడే నాయనో’’ అంటూ గొల్లుమంది సావాలు. ‘‘ఏం సేత్తాం అన్నిటికా సల్లన్తల్లుండాది. ఈ గండం గడిత్తే రేపు పారాలెత్తించి పెట్టనేద్దాం. నువ్వు కూడా మొక్కుకో’’ అంది చుక్క. ‘‘మల్లిద్దరవెందుకులే’’ అంది సావాలు. ‘‘నీ జిమ్మడ బుద్ధి పోనిచ్చుకున్నావు గాదు’’ అంది చుక్క. తలుపులికి గంజినీళ్లు పోసి, గుడిసివతలికొచ్చింది చుక్క. ‘‘మూడు గంటల కారొచ్చుండాలి. ఆడీ పాటికి దిగుండాలి. నా తల్లో! నివ్వే దిక్కు’’ అనుకుంటూ నించుంది. ఫకీరొస్తే ఎందుకేనా ఉంటుందని రెండు బడితెలూ ఓ పెద్దగెడా రెండు కొరకంచులూ తీసి ఓ పక్కన అట్టే పెట్టింది. చుక్క తమ్ముడు పరుగున వచ్చి, ‘‘అక్కా అక్కా కారొచ్చేసింది గాని ఆడురానేదు. నాను చూశా నాను చూశా, కిళ్లీ బడ్డీ రంగన్నక్కూడా ఒకిటే ఆచ్చిరం! ఫకీరుగాడు రానేదని’’ అన్నాడు. చుక్క ఒక్క లగువున లోపలికెళ్లింది. ‘‘ఆడు రానేదు మావో. ఆడు రానేదు. అంతా అబద్ధం’’ అంటూ తలుపుల్ని కావలించుకుంది. తలుపులు మెల్లిగా కళ్లు తెరిచి ‘‘ఆ..’’ అన్నాడు. ‘‘గండం గడిచింది మావా ఆడు రానేదు. మద్దినేళ డైవోరు పరాసికం ఆడుండాల యదవ సచ్చినోడు మల్లీపాల్రానీ సెప్తా..’’ అంది. తలుపులు అమాంతం చుక్కని గాఢంగా కౌగిలించుకున్నాడు. తలుపులు కళ్లంట బొటబొట కన్నీళ్లు కారాయి. జ్వరం దిగిపోయింది. ‘‘ఎందుకన్న మంచిదిగాని, మావా, ఇపుడే నావకెల్లి, పట్నంలో పోలీసోళ్లకి సెప్పరాదా సింతాలు ఖూనీ కేసులో ఫకీరుగాడికి జేలు కాయమయేదాకా ఈడ కాపలా ఉండాలనీ’’ అంది చుక్క. తలుపులు చుక్కని దగ్గరకి తీసుకుని వీపు తట్టాడు. జుట్టు సరిచేశాడు. ‘‘ఎర్రిమొకవా మనకోసం పోలీసోళ్లొత్తార్టే యెర్రిమొకవాని మొకం చూడు’’ అన్నాడు. అంటూనే చుక్క మొహం చూశాడు. ‘‘ఎంత సక్కని మొకం. కళ్లుబ్బిపోనాయి గాని, పాపం ఎంతేడిశావో నాకోసం’’ అన్నాడు. ‘‘సర్లే బాగుండాయి సరసాలు. కాత్తుంటే ఆడొచ్చి ఈప్మీన రేవెట్టుండేవోడే గందా’’ అంది సావాలు నీరసంగా నవ్వుతూ. చుక్క పకపక నవ్వింది. ‘‘బుద్ధి పోనిచ్చుగున్నావుగాదప్పా. ఫకీరుగాదు, యములాడొచ్చినా సరే మావిలాగే కాయిలించుకు సరసాలాడుతూనే సచ్చిపోతాం. నియ్యల్లే నాకు జెరం రాదు ఆపదలొత్తే’’ అంది. ‘‘అలాగే అలాగే ఊసులాడ్డానికేవి. మద్దినాల మతిసెడి శోకాన్నాలెట్టినాళ్లెవరో.. సూద్దారి, ఆడు మూడుగంట్ల కారుకి రాపోతే ఆ తరవాద్దానికి రాడని కరాటి? కాపీ నీల్లో కల్లునీల్లో దాగుతంటే కారు తిప్పుండచ్చుగా’’ అంది సావాలు. తలుపులు పట్టు దప్పినట్టయి తలెత్తి చూసింది చుక్క. మళ్లీ వెర్రిచూపు పడిపోయింది. ‘‘ఆ! ఏటేటీ ఎలాగెలాగా!?’’ అంటూ కొయ్యబారిపోయాడు తలుపులు.‘‘నీ జిమ్మడ. యదవనోరు నివ్వూను’’ అంటూ లేవబోయింది చుక్క. తలుపులే చుక్కని పక్కకి తోసేసి లేచి నిలబడ్డాడు. ‘‘ఆ మాట రైటే ఆ మాట రైటే’’ అంటూ గుడిశవతలకి వెళ్ళిపోయాడు. ‘‘యాడకయ్యోవ్ స్వామి!’’ అంటూ వెంటబడింది చుక్క. ‘‘మల్తొత్తా మల్తొత్తా’’ అంటూ గబగబా వెళ్ళిపోయాడు తలుపులు. ∙∙ పొద్దు వాటారింది. ముత్యాలమ్మ గుడి దగ్గర రావిచెట్టు కింద కూర్చున్నాడు తలుపులు చిత్తుగా తాగేసి. ‘‘నా సావిరంగా, రారా ఇయ్యాల నువ్వే నేనో తేలిపోవాలా. పుచ్చెలెగిరిపోవాల’’ అని గొణుక్కుంటున్నాడు. అరమైలు అసింటా అప్పుడే బస్సు దిగిన జమాజెట్టీ పకీరు కూడా అదేమాట అనుకున్నాడు కసిగా. దిగుతూనే ఎదర కిళ్ళీ బడ్డీ లోపలికెళ్ళి కూర్చున్నాడు. ‘‘కాసినీ సోడానీల్లియ్యవో’’ అన్నాడు పకీరు. బడ్డీవాడు ఖాళీసోడా కాయపట్టుకు లోపలికి వెళ్ళి ‘నీళ్ళు’నింపి ఇచ్చాడు. పకీరు గడగడ తాగేసి, ‘‘ఇంతకన్నా వుట్టినీల్లే ఇత్తే సరిపోయేదిగా యదవా’’ అన్నాడు. ఈవల ఒకటే జట్కా వుంది. అందులో ఇందాకటి ఇస్తోకులో రాణి కూర్చుని వుంది. రాజా బడ్డీ దగ్గరికొచ్చి సిగరెట్టు కొంటున్నాడు. పకీరు బండి దగ్గర కొచ్చి, ‘‘దిగండమ్మా, ఈ బండెల్లదు’’ అన్నాడు. రాజా విసురుగా వచ్చాడు ‘‘ఎవడ్రా నువ్వు ఆడవాళ్లని దబాయిస్తున్నావు బ్లడిఫూల్’’ అంటూ. పకీరు వెనక్కి తిరుగుతూనే ఎడం చేయి తిరగేసి వెనక్కి విసిరాడు. ‘‘అమ్మో’’ అని ఒక్క కేక పెట్టి చెంపని తడుముకున్నాడు రాజా. మళ్ళీ మాటడలేదు. అమ్మాయి మాట్లాడకుండా బండి దిగిపోయి తనే పెట్టి కిందకి దించేసింది. అతను చెంపని చెయ్యి తియ్యలేదు. కన్నార్పలేదు. పన్నెత్తి పలకలేదు. పకీరు బండిలోకెక్కి కూర్చున్నాడు. ‘‘రోడ్డు బావులేదు’’ అన్నాడు బండివాడు. ‘‘పోనీ’’ అన్నాడు పకీరు. బండి కదిలింది. తూము మలుపు దగ్గరేనే జట్కా ఆపేశాడు బండతను. రావిచెట్టు దగ్గిర బండకానుకుని వెల్లకిలా పడుకుని కాలు మీద కాలు ఏసుకుని వెకిలి ధైర్యంతో ఏడుపులాంటి నవ్వుతో లొల్లాయి పాటలు పాడుతున్నాడు తలుపులు గట్టిగా. కరణంగారు సకుటుంబంగా సినిమాకెళ్ళిపోయారు. ఎందుకేనా మంచిదని ప్రెసిడెంటుగారూ వారికి తోడుగా వెళ్ళారు. ఎక్కడా సందడి లేదు. ఊరందరికీ ప్రాణం ఖంగారుగా వుంది. చుక్క రెండుమార్లొచ్చి తలుపుల్ని బతిమాలింది కొంపకి రమ్మని. ‘‘నా సామిరంగా ఇయ్యాల ఆడో నేనో తేలిపోవాల’’ అన్నాడు తలుపులు. మునసబుగారు పెందలాడే భోంచేసి అరుగు మీద కూర్చున్నారు చుట్ట ముట్టించి. ఆయనకి ప్రాణం కుతకుత ఉడికిపోతుంది. చూస్తూ చూస్తూ ఓ మనిషిని మరోడు ఖూనీ చేస్తు వుంటే దిక్కుమాలినట్టు ఊరుకోవడం ఆయనకి నచ్చలేదు. వొంటో ఓపిగున్న వాడికి లేని బెడదలు నాకేల అనుకున్నాడు కాని సావిట్లో కెళ్ళబోతూ ఉండగా చుక్క తమ్ముడు ఎక్కణ్ణించో తుర్రున వచ్చి ‘‘బాబూగోరూ పకీరుగోడు బండిదిగి వచ్చేత్తాన్నాడండీ. మా మావని సంపేత్తాడు’’ అనేసి పరుగెత్తాడు ఆయన జవాబు కూడా వినకుండా. మునసబుగారు ఓ నిమిషం మేనువాల్చారుగాని ఉండబట్టలేక చివాల్న లేచి చితికర్ర పట్టుకొని ఇవతలికొచ్చారు. పకీరు తలుపులు కొంపకెళ్ళాలంటే ముత్యాలమ్మ గుడి మీదుగానే దారి. గుడికి ఎడమవైపున పదిగజాల్లో అవతల వేపచెట్టుంది. మునసబుగారు నెమ్మదిగా వెళ్ళి చెట్టు మొదట్లో బండిచాటు చేసుకుని కుదురుగా నిలబడ్డారు. ∙∙ తలుపులు నానా గోలాచేస్తున్నాడు. వెల్లకిలా పడుకుని వెకిలిగా నానా కూతలు కూస్తున్నాడు. పాడుతున్నాడు. హఠాత్తుగా తలుపులు పాట ఆపేశాడు. మునసబుగారి గుండె ఝల్లుమందీ. కొంచెం ముందుకు వంగి తొంగి చూశాడు. అల్లంత దూరాన యముడిలా పకీరు. తలుపులికి వొళ్ళంతా చెమట పోసేసి, బిగించుకు పోయిన శరీరం పట్టు సడలింది. కెవ్వున అరవబోయాడుగాని అంతలో తిరిగి ఒళ్ళు బిగించుపోయింది. చేతులు నేలకి వాలి పిడికిళ్ళు బిగించుకుపోయాయి. గొంతు ఎవరో నొక్కేస్తున్నట్లయింది. వెంట్రుకలతో దిట్టంగా ఉన్న చెయ్యి ఒకటి ముందుకు వచ్చి తలుపులు కమీజు కాలరు పట్టుకోంటోంది. గేదెకొమ్ములాటి మీసాలు, మీసాల్లాటి కనుబొమలూ ఉన్న మొహం, ఇవన్నీ చూస్తే సాక్ష్యం ఇవ్వాల్సివస్తుందనీ మళ్ళీ ఈ రాక్షసుడు ఏంచేస్తాడోననీ దూరం ఆలోచించి చంద్రుడు మొహం మబ్బు చాటు చేసుకున్నాడు. సినిమా కెళ్ళిన కరణంగారిలా, తప్పుకున్న ముత్యాలులా, ఊరుకున్న ప్రెసిడెంటులా, మునసబులా... తలుపులు తొడుక్కున్న కరణంగారి కమీజు కాలర్ని పిడికిలి బిగించి పట్టుకున్నాడు పకీరు. కొయ్యబారి నోరు తెరచి గుడ్లు తేలవేసి చూస్తున్న తలుపులు ఒక్కసారి ‘‘బాబోయ్’’ అని పెద్దగావు కేక పెట్టాడు. అతనిలో అణిగిపోయిన మగసిరి తిరగబడి మేలుకుంది. భయం మొండితనమైంది. అతని పక్కన నీరసంగా ఎండిన తోటకూర కాడలా పడున్న రెండు చేతులూ గుప్పెళ్ళలో దుమ్ము తీసుకుని, ముందుకు వాలిన పకీరు మొహంలోకి కొట్టాయి. పకీరు పట్టు వదిలి ‘ఛా’ అంటూ రెండు చేతులా మొహం మూసుకొని కళ్ళు వత్తుకోబోయాడు. విలాసముద్రలో ఉన్న తలుపులు కాళ్ళు రెండూ తెగిన స్ప్రింగ్‌లా తన్నుకుని విడిపడ్డాయి. ముడుచుకుని ముందుకురికి పకీరును పొత్తికడుపు మీద తన్నాయి. పకీరు వెనక్కి తూలి తమాయించుకొని పెద్దకేక వేయబోయాడు గాని తలుపులు శరీరం మట్టగిడసలా తన్నుకుని బంతిలా పైకెగిరింది. తలుపులు తల పొట్టేలు మల్లె ముందుకు వంగింది. సన్నగా రివటాల ఉండే తలుపులు తాలూకు శరీరం దాన్ని తీసుకువెళ్ళి సరాసరి తూలి తమాయించుకోబోతున్న పకీరు పొట్ట మీదకు గురిపెట్టి కొట్టింది. బాణంలా వెళ్ళి తగిలాడు తలుపులు. పకీరు వెనక్కి పడుతూనే రెండు చేతులా తలుపులు జెబ్బలు పట్టుకున్నాడు. పడీపడగానే పక్కగా ఒరిగి, ఒక జెబ్బ వదిలి ఆ చేత్తో తలుపులు రొమ్ము మీద గాఢంగా పొడిచాడు. తలుపులు కిక్కురుమనలేకపోయాడు గాని ఆ బాధలో అప్రయత్రంగా అతని అరచేతి కింది భాగం పకీరు కింది పెదిమకు కొట్టుకుంది. పెదిమ చితికి, హడావుడిగా పకీరు కుడిచేతిని ఓదార్పుకు పిలిచింది. ఎడమచెయ్యి అతని అనుమతి తీసుకోకుండానే, సగంలో వదిలేసిన కళ్లకు సేవ చేయబోయింది. ఈ విధంగా ఊపిరి తీసుకోవటానికి సదుపాయం సంపాదించిన తలుపులు ఆ పని పూర్తికాగానే ఇంకొ దొర్లు దొర్లి లేచి ఉట్ల సంబరాలకి అలవాటైన ఒడుపుతో ఎగిరి శక్తి కొద్దీ రెండు మడమలతోటీ పకీరు ఎదురురొమ్ము మీదకి దిగాడు తలుపులు కాళ్ళు పట్టుకులాగబోయే లోగా, తలుపులు ఒక కాలుతో పకీరు గడ్డం మీద తన్ని తూలి ముందుకుపడిపోయాడు. తలుపులు లేచి కూర్చొని వెనక్కి చూశాడు. పకీరు నోటివెంట ఎర్రటి రక్తం తెల్లటి వెన్నెలలో నల్లగా మిలమిల మెరుస్తూ చెంప మీదుగా నేలకి జారుతుంది. అమాంతం తలుపులికి బలం, ధైర్యం తొలిసారి ఆవేశించాయి. కూర్చున్న పళంగానే ముందుకు వంగి రెండు పిడికిళ్ళూ బిగించి పకీరు రెండు చెంపల మీదా ముక్కు మీదా మూడు గుద్దులు గుద్దాడు. ‘‘బాబోయ్!’’ అని పెద్ద కేక పెట్టాడు పకీరు. ఊరు మారు మోగిపోయింది. లోకంలో మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ, బలవంతులు, బలహీనులూ, హింసాప్రియులు, అహింసాపరులూ ఎవరెవరెన్న భేదాలకు అతీతమైన అరిచిన బాధ అది. తలుపులు ఈసారి బలమంతా పూన్చిన పిడికిలితో నారి సారించినట్టు చెయ్యి వెనక్కిలాగి ఒక్క ఊపున పకీరు మెడనరం మీద పోటు పొడిచాడు. ‘‘బాబోయ్’’ అని మరో పొలికేక వేసి గిలగిల తనుకున్నాడు పకీరు. ఇంకో దెబ్బకి తలుపులు సన్నాహం చేస్తు ఉండగా పకీరు పిడికిట పొదిగి బిగించిన బొటనవేలుతో అతని డొక్కలో గాఢంగా పొడిచాడు. అర్బకుడు తలుపులు, జాతరలో కోడిపెట్టెలా తన్నుకుని లేచి చెట్టు దగ్గిరకు పరుగెత్తాడు. అక్కడ నక్కపిల్లి కర్ర ఉందన్న సంగతి అప్పుడు తట్టింది. కర్ర తీసుకొని గిరుక్కున వెనక్కి తిరిగాడు తలుపులు. ఆరడుగుల పకీరు గాయపడ్డ పులిలా తూచి, చూచి వొడుపుగా అడుగులేస్తున్నాడు తన వేపు. పకీరు చేతిలో నాలుగంగుళాల బాకుంది. దగ్గరకు వచ్చాడు పకీరు. ‘‘ద్దొంగ.’’. ‘‘పకీరూ’’ అని హఠాత్తుగా పెద్ద గర్జన వినబడింది. తుళ్ళిపడి కేక వేపు చూడబోయి ఇటు తిరిగేలోగా పకీరు నెత్తిన తలుపులు శక్తి వంచనలేని దెబ్బ కొట్టాడు చేవగల కర్రతో. ‘‘బోబోయ్’’ అని ముత్యం మూడోసారి కేకవేసి కూలిపోయాడు పకీరు. తలుపులు తీరికగా కుడివైపు చూశాడు. అందాక చెట్టు చాటున ఉన్న ముసబుగారు ఇవతలికి వచ్చి వెన్నెలలో నిల్చున్నారు చేతికర్ర పట్టుకొని గంభీరంగా. తలుపులు మళ్ళీ ఇటు తిరిగి కళ్ళు మూసుకుని కసీతీరా పకీరును బడితెతో బాదుతున్నాడు. ‘‘ఇక చాలు తులుపులూ’’ అన్నారు మునసబుగారు. ∙∙ పంచాయితీ ఆఫీసు అరుగు దగ్గిర జనం చాలామంది చేరారు. ఆఫీసువారి మూడు హరికేను దీపాలు ధర్మవిజయంలా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. పకీరు కాళ్ళూ చేతులూ కట్టేసి అరుగు మీద పడేశారు. ముత్యాలు అతని గాయాలు కడిగి మంచినీళ్ళు పడుతున్నాడు. చుక్క పసుపుకుంకాలనీ, తలుపులు తాకతునూ మెచ్చుకుంటున్నారు ప్రేక్షకులు. చుక్క మర్నాడు తప్పకుండా అమ్మవారికి ఉపారాలెడతానంటోంది. తలుపులు నీరసంగా గోడకి జారబడి పడుకున్నాడు. మళ్ళీ జ్వరం వచ్చింది ఒంటిన తెలివిలేదు. ఇంకో ఘడియకి కారు అలికిడి వినబడింది. సందడి తగ్గి కొత్త గొంతుక వినబడడంతో మెల్లిగా కళ్ళు తెరిచాడు తలుపులు. ఎదురుగా పోలీసులు, జనం అంతా అమ్మయ్య అంటున్నారు. ‘‘పకీర్ని మీరెలా వదిలేశారండీ!?’’ అంటున్నారు మునసబుగారు ఆశ్చర్యంగా. ‘‘తలుపుల్ని పట్టుకోడానికి, చింతాలు కూనీ కేసులో వీడో సైడు హీరో. వాడూ వీడే కలిసే చంపుంటారు. వీడెలాగో పారిపోయి పైపెచ్చు కోర్టుకొచ్చి ప్రాసిక్యూషన్ తరఫున పకీరు మీద సాక్ష్యం ఇచ్చి వచ్చాడు. వీడి ప్రతిభ ఈ సంగతి మధ్యాన్నమే తెలిసింది. పకీరు ముందర చెబితే మేం నమ్మలేదు. అందుకని మేమొచ్చేలోగా పకీరు తొందరపడీ మాతో చెప్పకుండా వచ్చేశాడు’’ అన్నారు ఇన్స్పెక్టర్గారు. ‘‘కాని వీడెంత నాటకం ఆడాడు. మొగుణ్ణి గొట్టి మొగసాలకెక్కినట్టు, సర్లెండి దొంగని దొంగే పట్టుకోవాలి’’ అన్నారు మునసబుగారు. ‘‘బావుంది ఇపుడు మీరంతా కలిసి వాళ్ళని పట్టిచ్చారు మరీ మీరంతా దొంగలేనా?’’ ‘‘ఏమో దొరికాక ఒక్కొక్కడూ ఒక్కొక్క రకం దొంగ.... దొరికేదాక ఒకొక్కడూ ఒకొక్క దొర’’ అన్నారు మునసబుగారు. -ముళ్ళపూడి వెంకటరమణ -
రమణీయ శ్రీ రామాయణం
అన్నిటికీ వాల్మీకి రామాయణమే మూలం, ఆధారం. అన్ని రామాయణాలతో పాటు ఇదీ మరొక్క రామాయణం. ఇందులో నా సొంత కవిత కొంచెం కూడా లేదు. ఉన్నదంతా వాల్మీకి కవితా సౌందర్యమే. – ముళ్లపూడి శ్రీదేవి,ముళ్లపూడి వేంకటరమణ సతీమణి బాపు రమణలు రామభక్తులు. బొమ్మలతో, అక్షరాలతో రాముడి ఋణం కొంతైనా తీర్చుకుని వెళ్లిన జంట. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ముళ్లపూడి వెంకటరమణ సతీమణి ముళ్లపూడి శ్రీదేవి. ఎన్నటికైనా వాల్మీకి ఉపమానాలను ఒక పుస్తకంగా తేవాలని నాలుగు దశాబ్దాల క్రితమే ఆలోచన చేశారు రమణగారు. అప్పుడు సాధ్యపడలేదు. ఇప్పటికి ఆ ఆలోచన ఆచరణలోకి వచ్చింది. ‘రమణీయ శ్రీ రామాయణం’ పేరున ఈ పుస్తకాన్ని శ్రీదేవి ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను సాక్షితో పంచుకున్నారు ముళ్లపూడి శ్రీదేవి. ఇది ముళ్లపూడి వెంకటరమణగారి కోరిక. అంటే రమణగారు నాకు కలలో కనిపించి రామాయణం రాయమన్నారని కాదు నేను చెప్పేది. రమణగారి చిన్న వయస్సులో – అంటే ఇంకా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడని రోజుల్లో – వాల్మీకి రామాయణాన్ని శ్రీనివాస శిరోమణి తెలుగులో వచనానువాదం చేస్తున్నారు. అది ఆంధ్ర పత్రికలో ఆదివారం సారస్వతానుబంధంలో ప్రచురింపబడేది. తెలుగువారంతా ఆ రామాయణాన్ని ఇష్టంగా భక్తిగా చదివారు. ఆ రోజుల్లో శిరోమణి గారి దగ్గర వెంకటరమణ గారు సహాయకుడిగా పనిచేశారు. ఆ సందర్భంగా అనువాదం కోసం ఎన్నో రామాయణాలు పరిశీలించారు. వాల్మీకి మహర్షి కవిత్వం, ఆయన శైలి, ఆయన భక్తి ఆకళింపు చేసుకున్నారు. రామాయణమన్నా, రాముడన్నా భక్తి తాత్పర్యాలు ఏర్పడ్డాయి. ఆ ఇష్టంతోనే రమణగారు ‘సీతాకల్యాణం’ కథ రాశారు. ‘ఉపమా కాళిదాసస్య’ అని లోకోక్తి. ‘ఉపమా వాల్మీకస్య’ అని రమణగారు అంటారు. వాల్మీకి మహర్షి కథ చెప్పే పద్ధతి చాలా సరళంగా ఉంటుంది. కథ చెప్పేటప్పుడు అలంకారాలు ఎక్కువగా ఉపయోగించడు. కథ సూటిగా సాగిపోతుంది. వర్ణనల విషయంలో మాత్రం వాల్మీకి ఉపమాలంకారాన్ని విరివిగా ఉపయోగించాడు. ఆయా సమయాలలో సందర్భానుసారంగా ఒకటిరెండు ఉపమానాలు చెప్పి ఊరుకోడు. ఒకదాని వెంట మరొకటిగా పుంఖానుపుంఖంగా ఉపమా లంకారాలు గుప్పిస్తాడు. పాఠకుడిని ఊపిరి తిప్పుకోనివ్వడు. వాల్మీకి ప్రయోగించిన ఈ పద్ధతి రమణగారిని ఎక్కువగా ఆకర్షించింది. రమణగారి కథల్లో కూడా ఈ ఉపమానాల ప్రయోగం తరచుగా కనిపిస్తుంది. విశేషమైన ఈ ప్రయోగాన్ని పాఠకులకు అందించాలని రమణగారి కోరిక. వాల్మీకి చెప్పిన రామకథను మళ్లీ చెప్తూ, సందర్భానుసారంగా వచ్చిన ఉపమానాలను యథాతథంగా అమర్చటం సముచితంగా ఉంటుందని నాకు అనిపించింది. నాకు తోచిన పద్ధతిలో రామాయణం చెప్పటానికి పూనుకున్నాను. ఇంత ప్రయత్నానికీ మూలకారణం ముళ్లపూడి వెంకటరమణగారే. రామాయణం ఒక కొత్త ఉద్దేశంతో చెప్పడానికి ప్రయత్నించాను. అన్నిటికీ వాల్మీకి రామాయణమే మూలం, ఆధారం. అన్ని రామాయణాలతో పాటు ఇదీ మరొక్క రామాయణం. ఇందులో నా సొంత కవిత కొంచెం కూడా లేదు. ఉన్నదంతా వాల్మీకి కవితా సౌందర్యమే. రమణగారు వాల్మీకి రామాయణంలోని ఉపమానాలను అందరికీ ప్రత్యేకంగా చెప్పాలని ఆశించారు. వాల్మీకి ఎంత గొప్పగా, ఎంత అందంగా వాడాడో చెప్పాలనుకున్నారు. ఎలా చెబితే బాగుంటుందా అని ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం, మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడు వంటి పెద్దలను అడిగారు. అందరూ ఆలోచన బావుందన్నారు. కానీ ఎలా రాయాలో చెప్పలేదు. దానితో రమణ గారు ఈ అంశాన్ని పుస్తకంగా తీసుకురాలేదు. అప్పట్లో వాల్మీకి ఉపమానాలను నా స్వదస్తూరితో రాసి ఉంచాను. అందువల్ల అది నా మనసులో ఉండిపోయింది. నేను ప్రతి ఉపమానానికి అంకెలు వేసి పెట్టుకున్నాను. మా అమ్మాయి సలహా మేరకు కార్యరూపంలోకి దిగాను. వాల్మీకి ఎప్పుడు, ఏ సందర్భంలో, ఏ అర్థంలో ఉపమానాలు చెప్పారో వివరంగా రాసి, నా బ్లాగులో పెట్టాను. మొత్తం రెండు సంవత్సరాల పాటు రాశాను. నేను పూర్తిచేసిన మరునాడు తిరుపతిలో ఉండే కథాప్రపంచం పబ్లిషర్ కిరణ్ ఈ పుస్తకం ప్రచురిస్తానన్నాడు. రామాయణం రాస్తూ నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడమే కాదు, నా మనసులో నాతోనే ఉన్న రమణ గారి కోరిక నెరవేర్చాను’ అని ముగించారు ముళ్లపూడి శ్రీదేవి. – డా. వైజయంతి పురాణపండ -
పిల్లనగ్రోవికి ఒళ్లంతా గేయాలే
ముళ్లపూడి వెంకటరమణ ఇంకా ఒక్కటి మిగిలింది. ఇదేనా? ఉదయం నుండి వెతుకుతున్నది మంచిది కాక, కానందువల్ల ఈ గుట్టలో పడిపోయిందేమో. ఇప్పుడు మిగిలింది– ఒకప్పుడు పనికిరాదని తాను పడవేసిందేమో. పొద్దు వాటారి నప్పటినుంచి మర్రిచెట్లలోంచి వూడలు వూడలుగా దిగజారుతున్న చీకటి, చెలమై చెలరేగిన యమునై, భూమినంతా ముంచివేసింది. చెట్టుకింద చీకటిమధ్య చితుకుల మంటలు కృష్ణుడి మీద ఎర్రపట్టు కండువాలా కదలాడుతున్నాయి. మంటలో ఊచ కాలుస్తున్న గోపన్న ముఖం మీద– అతని పక్కన చెల్లాచెదురుగా పడివున్న వేణువుల మీద వెలుగు నీడల భాషలో కావ్యాలు రాస్తున్నాయి. ఇంక మూడు ఝాములు పోతే సప్తమి తెల్లవారుతుంది. కృష్ణుడి పుట్టినరోజు వచ్చేస్తుంది. పాతిక పండగలనాడు గోపన్న ఆరంభించిన వేణు నిర్మాణం ఇంకా తెమలలేదు. రేపటికైనా సాధించి, తన వేణువును ఆయనకు సమర్పించాలి. రేపివ్వలేకపోతే ఇంక ఈ జన్మకివ్వలేడు... వేళయిపోయింది. ‘‘నాయనా, బువ్వ దినవే’’ అన్నాడు చిన్న గోపన్న వచ్చి. గోపన్న కీమాట వినబడలేదు. అతని హృదయం బృందావనిలో ఉంది. అక్కడకు కృష్ణుడు వస్తాడు. వచ్చే వేళయింది. గోపికల అందెల రవళి వినిపిస్తోంది. వెదురు పొదలు సన్నగా ఈల వేస్తున్నాయి. గోపన్న ఎన్ని యుగాలుగా అక్కడ చెట్ల మాటున కూర్చున్నాడో అతనికే తెలియదు. ఆకులలో ఆకై పువ్వులో పువ్వయి, ఇసుకలో రేణువై యమునలో బిందువై కృష్ణ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు. పరిశుద్ధమైన స్వరాలలో ఒక్కొక్క స్వరాన్ని మనసులో నిలుపుకుని పరుగున తన కుటీరానికి వచ్చాడు. కొత్త వెదురు కోసి స్వరద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని ఇందులో పలికించబోయాడు. ఆ స్వరం తన ఈ వేణువులో పలికితే ఇది కృష్ణయ్యకు కానుక ఇవ్వాలి. కాని అది పలకదు. ఎన్ని వేల వేణువులో చేశాడు. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ వేణువును శ్రుతి చేయడానికే ఉపయోగించాడు. ఒక్క జీవితానికి లెక్కదేలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొన్ని కోట్లు ఉంటాయి. వాటిని వృథా చేస్తే ఎలా? యమున ఒడ్డున పొదల మాటున దాగి కృష్ణుడి మురళి విన్నప్పుడు వూపిరి బిగబట్టుకునే కాలం గడిపేవాడు. అక్కడ పొదుపు చేసిన దానిని కొత్త వేణువును పూరించడానికి ఉపయోగించేవాడు. తీరా అది శ్రుతి శుద్ధంగా వినబడేది కాదు. లోపలేవన్నా ఈనెలు లేచాయేమోనని లోపల కూడా నునుపు చేసేవాడు. ఇక పట్టుకువెళదాం అని లేచేసరికి దాని గొంతుక జీరబోయేది. గోపన్న పూర్వం ఎన్నో వేణువులు చేశాడు. తృప్తిగా వాయించాడు. ఒక స్థాయి వచ్చాక అతనికొక ఊహ పోయింది. వేణువును కిందపెట్టి, సంగీతాన్ని ఊహించబోయాడు. ఊహించిన సంగీతాన్ని భావన చేసి, భావించిన దానిని అనుభవించి దర్శించే వరకు అతనికొక సత్యం తోచింది. జలపాతాన్ని వెదురుగొట్టంలో ఇమడ్చడం పొరబాటు. అన్ని వేదాంతాలూ, అన్ని అసత్యాలూ అర్ధసత్యాలేనంటూ, తనలో భాగాలేనంటూ నిలచే అద్వైత సత్యంలా ఈ సంగీతంలో అపస్వరాలు కూడా అర్థస్వరాల, పూర్ణస్వరాల పక్కన నిలిచి, అందంగా భాసించసాగాయి. ప్రతి అణువునా భగవంతుడున్నాడు. ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది, అన్న వాక్యాల తాత్పర్యం గోపన్న అర్భక దేహానికి దుర్భరమైపోయింది. అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించడానికి శక్తి చాలలేదు. అతన్ని ఆ స్థితినుంచి ఐహిక స్థితికి తెచ్చి కాపాడినది– కృష్ణుడి మురళి. అది విన్న క్షణాన అతను ఆ స్థితిలోకే మేలుకున్నాడు. తన ఊహకు అందిన దానికన్న గొప్పదీ, ఆకళింపు చేసుకుని అనుభవించడానికి సులువైనదీ అతనికి ఆనాడే వినిపించింది. నాటినుంచి ప్రతి నిత్యం కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి, మురళి వినేవాడు. కొత్తల్లో గోపకాంతలు కంగారు పడ్డారు. తరువాత అతన్ని ఒక గోవుగా, చెట్టుగా జమ కట్టేశారు. ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ మురళిని ఎత్తుకు వచ్చాడు. యమున ఒడ్డుకు వచ్చి, చెంగుచాటు నుంచి మురళి తీసి వాయించాలనుకునేసరికి అది కనబడలేదు. గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నాడు గోపన్న. కాని ఆ గజదొంగ సాయంత్రం కనబడి ‘‘గోపన్నా నా మురళిని తీసుకుపోయావు కదూ... పోనీ ఇంకొకటి చేసిపెట్టు’’ అన్నాడు నవ్వి. గోపన్న తెల్లబోయాడు. మర్నాటి నుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు. అతనిలో కొత్త శక్తి, కొత్త చైతన్యం మేల్కొన్నాయి. తన చేతులతో రూపు దిద్దుకుంటున్న మురళి రేపు కృష్ణుడి హస్తాలను అలంకరిస్తుందని ఆశపడుతూ మురళిని రూపొందించాడు. మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. గుండె బద్దలయినంత పనయింది. జీర. రెండు మూడు వేణువులు పలికినట్టుంది. కృష్ణుడు వూదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్లు పులకరించిందా? అది పడేసి మరోటి చేశాడు. అదీ అంతే. మర్నాడు వెదురు చాలా తెప్పించాడు. పది పన్నెండు చేశాడు. ఒక్కొకటీ వూది చూడడం, నచ్చక పారవెయ్యడం... ‘‘నీకు వేణువు ఇవ్వందే నా ముఖం చూపను కృష్ణయ్యా’’ అనుకున్నాడు. నాటినుంచి ఇదే పని. ఊళ్లో వాళ్లంతా వింతగా చెప్పుకున్నారు. సంగీతం పిచ్చి వదిలిందనుకుంటే, మళ్లీ పిల్లంగోవి పిచ్చి పట్టిందిగావాల అని నవ్వుకున్నారు. గోపన్న పనికిరావని పడేసిన వందలాది వేణువులను కొత్తలో గొల్లపిల్లలు తీసుకుపోయేవారు. తరువాత అతనికి భయం వేసింది– వాటిలో ఏదైనా కృష్ణయ్య దగ్గరకు పోతుందేమోనని. అందుకని పాకలో అటకమీద పడేసేవాడు. యమున ఒడ్డున గోపన్న పాక, పాక పక్కన పందిరి కింద వెదుళ్లు, చెట్టుక్రింద కొలిమి చూసి జనం హేళన చేశారు– గోపన్నా! కలప దుకాణం పెట్టరాదూ! పాతికేళ్లు గడిచిపోయాయి. కృష్ణయ్య పెద్దవాడయ్యాడు. బృందావనికి రావడం లేదు. రాజకీయాల్లో తిరుగుతున్నాడు. అయినా కృష్ణాష్టమి వెళ్లిన ప్రతి నవమినాడు గోపన్న కొత్త వేణువు ఆరంభిస్తూ, ‘పైసారి పుట్టిన రోజుకైనా పంపాలి’ అనుకొనేవాడు. పుట్టిన రోజు వచ్చేది వెళ్లేది... వేణువు మాత్రం కుదిరేది కాదు. ‘‘నాయనా బువ్వదినవే’’అన్నాడు చిన్నగోపన్న. తండ్రి వాడివంక చూశాడు. తల్లి లేని బిడ్డ. తండ్రి ఉండీ లేనిబిడ్డ. ‘‘బువ్వదింటాలేగాని, రేపు కిష్టయ్య పుట్టినరోజు. నువ్వు నందయ్యగారి లోగిలికెళ్లి ఎవరూ చూడకుండా ఇది కిష్టయ్యకిచ్చి– మా నాయనిచ్చి రమ్మన్నాడని చెప్పిరావాల’’ అన్నాడు గోపన్న. ‘‘బువ్వ దినుమరి’’ అన్నాడు బిడ్డడు. గోపన్నకు వాణ్ణి చూడగానే బాలకిష్టయ్య గుర్తుకొచ్చాడు. లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. వాడు తెల్లబోయి బుగ్గ తుడుచుకున్నాడు. ‘‘నువ్వలాగే అంటావు. పొద్దాటేలేమో ఇది బాగాలేదు ఒద్దులే అంటావు’’ ‘‘అనను. ఈసారిది బాగుంటదిలే. అయినా సూడనుగా’’ అన్నాడు గోపన్న నీరసంగా నవ్వి. మర్నాడు ఉదయమే గోపన్న కొడుక్కి తలంటి పోశాడు. సాంబ్రాణి ధూపమేసి జుట్టు ఆరబెట్టాడు. వదులుగా కొప్పు ముడేసి పూలు తురిమాడు. పట్టు కండువా తీసి పంచె కట్టాడు. మరోటి తీసి ధట్టీ చుట్టాడు. కస్తూరి తిలకం, కాటుక దిద్ది, దిష్టి తగలకుండా బుగ్గన చుక్క పెట్టాడు. నెమిలీకల వీవనలోంచి ఒక కన్ను తీసి కొప్పున బెట్టాడు. చినగోపన్న కెందుకో కంట నీరు తిరిగింది. జాలిగా నాయన వంక చూశాడు. ముస్తాబు ముగించిన గోపన్న క్షణంలో నిర్విణ్ణుడై పోయాడు. ఇదేమిటి బాలకృష్ణుడు గోపాలకృష్ణుడు... ఇక్కడికి ఎందుకొచ్చాడు? తాను ఏనాడో ఎత్తుకొచ్చిన వేణువు కోసమా? అప్రయత్నంగా చేతులు జోడించి దండం పెట్టాడు. కన్నీరు కట్టలు తెంచుకుంది. దుఃఖమో, ఆనందమో. ‘‘ఏందే అయ్యా’’ అంటూ వచ్చి కౌగిలించుకున్నాడు కొడుకు. గోపన్న ఉలికిపడి కళ్లు తుడుచుకున్నాడు. ‘‘ఏదే... మురళేదే’’ అంటూ అటూయిటూ చూశాడు. కనబడలేదు. ‘‘అటక మీదెట్టాను. రాతిరి ఎలకలొస్తే’’ అన్నాడు చినగోపన్న భయపడుతూ. ‘‘ఆ! ఎంత పన్జేశావురా’’ అన్నాడు గోపన్న. ఎలకలుండేదే అటక మీద అని తెలిసి అక్కడ పెట్టడమేమిటని కేకలెయ్యబోయాడు గాని మనస్కరించలేదు. అటకమీదికెక్కి చూశాడు. వేణువులు గుట్టలుగా ఉన్నాయి. అందులో ఏది కొత్తది? ఏది మంచిది? వేణువులన్నీ కిందకు దించాడు. ఒక్కొక్కటీ తీసి వూది చూడసాగాడు. ‘‘ఇది కాదు’’ ‘‘ఇదీ కాదు’’ ఇటువేపు గుట్ట తరుగుతోంది. అటు వేపుది పెరుగుతోంది. ‘‘నేతి నేతి’’ అనుకొంటూ వేణుపరీక్ష సాగిస్తూనే వున్నాడు. చిన్న గోపికి చెమటకి కస్తూరి బొట్టు కరిగిపోయింది. కాటుక చెరిగిపోయింది. అన్నం తిననందువల్ల నీరసం కూడా కలిగింది. కానీ గోపన్న ఇదేమీ గమనించే స్థితిలో లేడు. ఇది కాదు. ఇదీ కాదు. ఇన్ని వేణువుల గుట్టలో ఎక్కడో సత్యమైన కొత్త వేణువు దాగివుంది. అది సత్యమైనదేనా? పొద్దు వాటారింది. చిన్నగోపన్న దీపం వెలిగించాడు. ‘‘నాయనా చీకటి పడిపోతోందే. పుట్టింరోజు పండగయిపోతుంది’’ అన్నాడు జంకుతూ. గోపన్న తల వూచాడు. ఇంక రెండే రెండు వేణువులు మిగిలాయి. ఒకటి చూశాడు. ఇదీ కాదు. ఇంకా ఒక్కటి మిగిలింది. ఇదేనా? ఉదయం నుండి వెతుకుతున్నది మంచిది కాక, కానందువల్ల ఈ గుట్టలో పడిపోయిందేమో. ఇప్పుడు మిగిలింది– ఒకప్పుడు పనికిరాదని తాను పడవేసిందేమో. చివరి మురళిని పరీక్షించడానికి ధైర్యం చాలలేదు. సత్యం తెలుసుకొని చనిపోగల శక్తి లేదు. ‘‘ఇదే’’ అన్నాడు ధీమాగా. ‘‘చూడవా’’ అన్నాడు కుర్రాడు. ‘‘ఒద్దు. లగెత్తు. కిష్టయ్య చేతికియ్యి ఆయనే చూస్తాడు’’. పాతిక సంవత్సరాల గాలివాన వెలిసింది. గోపన్న మేను వాల్చాడు. తాను పని ముగించాడా. భగవంతుడికి శ్రుతి శుద్ధమైన వేణువును పంపాడా. శ్రుతి శుద్ధంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు ఉందా? సరిచేసే శక్తి ఆయనకు లేదని తను అనుకొన్నాడా? గోపన్నకు నవ్వు వచ్చింది. పాతికేళ్ల పొరబాటు. ఒక జీవితం పొరబాటు. ఆయన అలుగుతాడా. అలగడు. వెర్రిగోపన్న అనుకుంటాడు. అనుకొని మురళిని తన పెదిమల దగ్గర ఉంచుకుంటాడు. శ్రుతులన్నీ దాచుకున్న బొజ్జలోంచి ఓంకారానికి మూలస్థానమైన నాభిలోంచి మంగళ గళంలోంచి మధురాధరాలలోంచి... తన పక్కనున్న వేణువులోంచి సన్నటి స్వరం నెమ్మదిగా ఇవతలికి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. ఇంకో క్షణానికి ఆ పక్క మురళి, ఉత్తర క్షణార్థానికి ఇటుపక్క మురళి మేలుకున్నాయి. మరికొద్ది క్షణాలలో కుటీరంలోని సహస్ర వేణువులూ భువన మోహనంగా గానం చేయసాగాయి. అన్నిటిలోనూ కృష్ణుడి మోహన గానమే. అసత్యమైన వేణువు లేనేలేదు. భగవంతుడికి ఉపయోగపడని వేణువే లేదు. గోపన్న సహస్ర వేణునాద స్వరార్ణవంలో– సాక్షాన్మహా విష్ణువై తేలుతున్నాడు. వేణుగానం ముగిసిన కొద్ది క్షణాలకు అంతకన్న మధురమైన అడుగుల సవ్వడి వినబడింది. తాను పంపిన మురళి మంచిదో కాదో చెప్తాడు. ఈ సత్యం ఇక తెలిసినా మానినా ఒకటే. అంతకన్న గొప్ప సత్యాన్ని దర్శించాడు గోపన్న. నెమ్మదిగా కళ్లు తెరిచాడు. గుమ్మంలో బాలకృష్ణుడు! నువ్వే వచ్చావా కిష్టయ్యా అంటూ చేతులు జోడించాడు. ‘‘అయ్యా అయ్యా కిష్టయ్య నీ మురళి వాయించాడే. నాకు బువ్వలెట్టాడు. కానీ కిష్టయ్య ఎంత వాంచినా ఏమీ వినబడలే. అస్సలు పాట రాలేదే. కానీ కిష్టయ్య నన్నిక్కడ ముద్దెట్టు...’’ గోపన్న ఇంతసేపూ గానం చేసి అలసిపోయిన వేణువుల వంక ఆప్యాయంగా సగర్వంగా చూసి ఒకటి తీసి ముద్దుపెట్టుకున్నాడు. ముళ్లపూడి వెంకటరమణ (1931–2011) ‘కానుక’ కథకు ఇది సంక్షిప్త రూపం. 1963లో ప్రచురితౖమైంది. పరిపూర్ణత కోసం పడే ఒక కళాకారుడి తపననూ, అదే సమయంలో భగవంతుడికి పరిపూర్ణంగా లొంగిపోయే భక్తినీ ఈ కథ చిత్రిస్తుంది. రమణ పాత్రికేయుడిగా పనిచేశారు. ‘బుడుగు’ సృష్టికర్త. హాస్యానికి పెట్టింది పేరు. సాక్షి, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, పెళ్లి పుస్తకం, మిష్టర్ పెళ్లాం వంటి సినిమాల రచయిత. రుణానందలహరి, గిరీశం లెక్చర్లు, రాజకీయ బేతాళ పంచవింశతి ఆయన రచనల్లో కొన్ని. కోతి కొమ్మచ్చి ఆయన ఆత్మకథ. -
మీరు తింటే నేను లొట్టలేస్తా!
సాహిత్య మరమరాలు ముళ్లపూడి వెంకటరమణ ఫోర్తు ఫారంలో ఉన్నప్పుడే కథలు రాశాడు. అప్పుడు చెన్నైలోని కేసరి స్కూల్లో చదువుతున్నాడు. ఉపాధ్యాయుడి సలహా మేరకు కథలను ఒక పుస్తకంగా కుట్టి, పాఠశాల ‘ఫౌండర్స్ డే’ రోజు కె.ఎన్.కేసరికి అంకితమిచ్చాడు. కేసరి ఆయుర్వేద వైద్యంలో ప్రసిద్ధులు. గొప్ప సంపన్నుడు, గొప్ప దాత. పిల్లాడి తీరుకు ముచ్చటపడి తెల్లారి రమణను ఇంటికి పిలిపించాడు కేసరి. రమణ, వాళ్లమ్మ ఇద్దరూ ‘కేసరి కుటీ’రానికి వెళ్లారు. రమణ వాళ్లమ్మ కేసరి వారి గృహలక్ష్మి ప్రెస్సులోనే పనిచేసేవారు. వెళ్లగానే కేసరి వీళ్ల ఆర్థిక పరిస్థితి వాకబు చేశారు. ఇంతలో బంట్రోతు జిలేబీ, మసాలాదోసెతో రెండు ప్లేట్లు వాళ్ల ముందు తెచ్చిపెట్టాడు. ‘తినండి’ అన్నారు కేసరి. ‘మరి మీరు’ అన్నట్టు వాళ్లు చూశారు. ‘‘అదేరా, నువ్వు పది దోసెలు తినగలవు– కాని ఒక్కటీ కొనలేవు. కాని నేను? వెయ్యి దోసెలు కొనగలను– కాని ఒక్కటీ తినలేను. నేనూ చిన్నప్పుడు నీలా బీదవాడినే. అప్పుడు డబ్బు లేనప్పుడు ఆకలి. ఇప్పుడు డబ్బొచ్చాక అజీర్ణం. తిండి అప్పుడూ లేదు ఇప్పుడూ లేదు. అదే గమ్మత్తు’’ అన్నారు కేసరి. రమణ, వాళ్లమ్మ అలాగే చూస్తూండిపోయారు. ‘‘తినండి తినండి. నేను లొట్టలేస్తాను’’ అని పక పక నవ్వారు కేసరి. -
బుడుగు వెంకటరమణ
జూన్ 28న ముళ్లపూడి వెంకటరమణ జయంతి కేవలం పదేళ్ల వ్యవధిలో గబగబా, చకచకా పత్రికారచనలో అనేకానేక తమాషాలు చేసేశారు ముళ్లపూడి వెంకటరమణ. రచనకు జవజీవాలిచ్చేది, రచయితని నాలుగు కాలాలపాటు బతికించేది తాను సృష్టించిన పాత్రలే. ఒక్కోసారి మహాకావ్యాలలో ఒక చిన్న పాత్ర తారలా మెరిసి పాఠకుల మనసుల్లో నిలిచిపోతుంది. తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యంలో ‘నిగమశర్మ అక్క’ అలాంటి ఒక తార. రమణ సృష్టించిన పాత్రలన్నీ పాఠకులని అలరించాయి. మరీ ముఖ్యంగా బుడుగు. ఇంటింటివాడుగా నిలిచాడు. ప్రాణ దీపమున్న పాత్రలకి వయసు రాదు. అమృతం సేవించినట్టు అక్కడే ఆగిపోతాయి. కాని పాఠకులు పెరుగుతారు. వాళ్లు బుడుగుని స్కూలు రోజుల్లో చదివి మనసుకి హత్తుకున్నారు. ఆనక తండ్రిగా తమ బిడ్డల్లో బుడుగుని చూసుకుని మురిసిపోయారు. తాతత్వం వచ్చాక మనవడిలో, మనవరాలిలో మళ్లీ బుడుగే! బుడుగులకి జెండర్ లేదు. ఆడ బుడుగులు కూడా అలాగే పేల్తారు. బుడుగు అల్లరి చేస్తాడు. బామ్మని, బాబాయిని, రాధని, గోపాలాన్ని, ఇశనాథాన్ని సాధిస్తాడు, శోధిస్తాడు, వాదిస్తాడు. వాళ్లని తన దినచర్యలో కలుపుకుంటాడు. తన ధోరణిలో తను మాట్లాడతాడు. ఆ ధోరణిలోనే రమణ తన ముద్ర చూపారు. పెద్దవారు ప్రదర్శించే లౌక్యాలను బుడుగులో పెట్టి ఉతికి ఆరేశారు. ‘‘బుడుగేమీ ఒరిజినల్ కాదండీ, ఇటీజిన్ ఇంగ్లీష్’’ అంటూ తెలుగు మీరిన కొందరు ఎత్తిచూపారు. ఆ మాటకొస్తే కృతయుగంలో వామనుడిలో బుడుగాంశ లేదా? అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష... అంచేత నాలుగైదేళ్ల చలాకీ పిల్లలు ఏ భాషలో అయినా తగుల్తారు. బుడుగు పదహారున్నరణాల తెలుగుపిల్లాడిలా రమణ కలంలోంచి దిగి తిష్టవేశాడు. వయసు మీదపడుతున్నట్లయితే ఇది బుడుగు షష్టిపూర్తి సంవత్సరం! అంతకుముందు తెలుగు తల్లులు తమ పిల్లల బాల్యాన్ని, చిలిపి అల్లర్లను వినోదిస్తూ బాలకృష్ణుడితో పోల్చుకుని మురిసేవారు. బుడుగు రంగంలోకి దిగి బాలకృష్ణుణ్ని మరిపించాడు. రాస్తూ రాస్తూనే, పదిమందీ బాగు బాగు అంటున్న తరుణంలోనే రమణ బుడుగుని ఆపేశారు. ‘‘ఎందుకండీ పాపం ఆపేసేశారండీ’’ అని బుడుగ్గాయిలెవరైనా అడిగితే, ‘‘ఎవరో ఏమిటా జట్కా భాషని గసిరారండీ, భయపడి ఆపేశానండీ’’ అని సవినయంగా చెప్పేవారు. పని చెయ్యదలచనప్పుడు సాకులు చెప్పడం రమణకు వెన్నతో పెట్టిన విద్య. ‘‘ఎక్కడ అందుకోవాలో కాదు, ఎక్కడ ఆపాలో కూడా తెలిసినవాడు మర్యాదపాత్రుడు’’ - అని ప్రాజ్ఞుడు అనుకుంటాడు. ఆచరిస్తాడు. రమణ చేసిందదే. లేకపోతే, బారిష్టర్ పార్వతీశం రెండు మూడు భాగాల్లాగా, స్వీట్ హోమ్ పేరుకి తగ్గట్టే జీళ్ల పాకమైనట్టు, శ్రీమతి కాంతం జిడ్డులా వదలనట్టు, ...నట్టు, ...నట్టు బుడుగు కూడా బలైపోయేవాడు. అదృష్టవంతుడు, ఆపేయబడటంతో బతికిపోయాడు. ఒక మంచి పాత్ర దొరికినప్పుడు రచయితలు మార్కెటింగ్ మొదలు పెడతారు. అప్పుడు పాఠకులు కస్టమర్లయిపోతారు. అక్కడ కథ ముగుస్తుంది. ముగింపులో కూడా బుడుగు గడుసు, పెళుసు మాటల్ని వుటంకించక్కర్లేదు. చాలా మందికి చాలా జ్ఞాపకం ఉంటాయి. లేనివారికి ఇప్పుడు వస్తాయి. దటీజ్ బుడుగు! తెలుగు ముక్కల్తో ఆడాడు చెడుగుడు. రమణకి వాడు కీర్తి తొడుగు. - శ్రీరమణ -
రమణగారి సినిమా ‘కథ’
ముళ్లపూడి వెంకటరమణ జీవించి ఉండగా ఆయన ఆత్మకథ మూడు భాగాలుగా వచ్చింది. ‘కోతి కొమ్మచ్చి’, ‘ఇంకోతి కొమ్మచ్చి’, ‘ముక్కోతి కొమ్మచ్చి’... ఇవి పాఠకుల ఆదరణ పొందాయి. ఇప్పుడు ‘కొసరు కొమ్మచ్చి’ వచ్చింది. హాసం ప్రచురణల తరఫున వరప్రసాదరెడ్డి ప్రచురించారు. రమణ గురించి ఇందులో బాపూ ఇతర స్నేహితులు, సన్నిహితులు రాసిన అనేక వ్యాసాలు ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి. వీటిలో రమణ మిత్రుడు బి.వి.ఎస్.రామారావు రాసిన ఒక జ్ఞాపకాన్ని ఇక్కడ ఇస్తున్నాం. రమణగారు సినిమా కథ చెప్పడం వెనుక ఉన్న తిప్పలు తెలిపే సరదా జ్ఞాపకం ఇది. రమణ నాతో ఎన్నోసార్లు అన్నాడు- ‘ఈ ప్రొడ్యూసర్లకీ డెరైక్టర్లకీ కథ చెప్పడం చిరాకు’ అని. ‘ఉదాహరణకి ఓ ప్రొడ్యూసర్‌కి ఇలా కథ చెప్తాననుకో- అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకి కోటలాంటి హవేలీ వుంటుంది. ఆయనకు ఏడుగురు కొడుకులు. ఇంటి నిండా నౌకర్లూ చాకర్లు వందమంది పైగా ఉంటారు. ఆ రాజుగారి పెద్దకొడుక్కి ఓ పెళ్లి సంబంధం వస్తుంది. పది ఫారిన్ కార్లలో దిగిపోతారు పెళ్లికూతురు తాలూకు వాళ్లు... మనం ఇలా కథ చెబుతుంటే మొదటి వాక్యంలోనే బ్రేక్ పడుతుంది ప్రొడ్యూసర్ మనసుకు. దాంతో ఇలా ఆలోచించుకుంటూ వుంటాడు. వీడు ఏడుగురు కొడుకులంటున్నాడు. ఏడుగురు చాకులాంటి కుర్రాళ్లు దొరుకుతారా? వందమంది నౌకర్లు- సరే జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకోవచ్చు. కాని పది ఫారిన్ కార్లు ఎక్కడ దొరుకుతాయి. రెండు కార్లు పురుషోత్తమరావుగార్ని అడగవచ్చు. ఒకటి మావగార్ని అడుగుదాం. నా కారు బిజీ కనుక కుదరదు. మిగతా కార్లు ఎక్కడ్నించి తేవాలి. ఇలా ప్రొడ్యూసర్లు ప్రొడక్షను, బడ్జెటులో పడతారు కాని కథ వినరు. కథంతా చెప్పేసి ఎలా వుంది సార్ అంటే- ‘నాకు నచ్చితే సరిపోదు. మా డెరైక్టరుగారికి నచ్చాలి. ఆయనతో ఓ సిట్టింగు ఏర్పాటు చేస్తాను లేండి’ అంటాడు. సరే అతనన్నట్టే డెరైక్టరుగారికి కథ చెప్పామనుకో- అనగనగా ఓ రాజు. ఆయనకు ఏడుగురు కొడుకులు అనగానే ఆయన మనసులో ‘ఏడుగురూ కొడుకులుండాలా? అందులో ముగ్గుర్ని కూతుళ్లుగా పెట్టుకుంటే పోలే’ అని మనం చెప్పే కథ వింటూ అందులోని అంశాలను నలుగురు కొడుకులూ ముగ్గురు కూతుళ్లకూ అన్వయించుకుని మధ్యలో కుదరక మళ్లీ ఒకసారి చెప్పండంటారు. మనం ఏమి చెప్పినా అతను పేరలల్‌గా ఆలోచిస్తూ పోతాడు. వీళ్లకు కథ చెప్పడం చాలా కష్టం. మరో రకం డెరైక్టర్లు మనసు మరెక్కడో పెట్టుకొని వస్తారు. మనం కథ మొదలెట్టగానే మనకేసి చూస్తూనే ఆవలించేస్తారు. మరో డెరైక్టరుకు కథ చెప్పినప్పుడు మధ్య మధ్యలో నిద్దర పోతాడు. ఎలా వుంది సార్ అంటే బావుంది కాని అక్కడక్కడ జంపులొచ్చాయయ్యా అంటాడు. ఎందుకు రావు అతను మధ్య మధ్యలో నిద్రపోతే... వీళ్లకు ఇలా కథ చెప్పడం నా తరం కాదని కథ సినాప్సిస్ పేపరు మీద ఫెయిర్ కాపీ చేయించి ఇచ్చేసాను- రెండు మూడు సందర్భాల్లో. ఒక డెరైక్టరు నేనిచ్చిన కాగితంలోని సంఘటన ఆయన అప్పుడు డెరైక్టు చేస్తున్న సినిమాలో పెట్టేశాడు. అందుకే ఈ కథ చెప్పడం అన్నది చిరాకే’ అంటాడు రమణ. ఈ విషయంలో బాపు ఏం తక్కువ కాదు. రమణ చెప్పిందతనికి వెంటనే నచ్చదు. చాలాసార్లు వీళ్లిద్దరికీ స్టోరీ డిస్కషన్లలో అభిప్రాయబేధాలు వస్తుంటాయి. రమణకు కోపం వచ్చి వెళ్లిపోతుంటాడు. మర్నాడు ‘బాపు చెప్పిందాంట్లో పాయింటు వుందా’ అని ఆలోచిస్తాడు. ఉందని తోస్తే వెంటనే మార్పు చేసేసి ఆల్టర్నేటివ్ సజషన్సుతో వచ్చి కూర్చుంటాడు. అలాగే బాపూ కూడా ఆలోచిస్తాడు. ‘నేనన్నదాంట్లో తప్పేమిటి’ అని. తప్పని తోస్తే ‘నువ్వు చెప్పిందే రైటేమో వెంకట్రావు’ అనేస్తాడు. ఒక్క పౌరాణికాల విషయంలోనే వీళ్ల మధ్య విభేదాలుండవు. ఎందుకంటే అన్ని పురాణాలూ వీళ్లిద్దరూ క్షుణ్ణంగా చదువుకున్నారు. పైగా వాళ్లిద్దరికీ మెమెరీ ఎక్కువ. రమణ రాసిన ప్రతి డైలాగూ బాపుకి నచ్చుతుంది. ఎందుకంటే రమణ ఎప్పుడూ వెనకా ముందులు ఆలోచించి రాస్తాడు. ఇక్కడ ఒక పాయింటు చెపితే దానికి ఎక్కడో ఒక లింకు వుంటుంది. అందుకే రమణ రాసిన డైలాగుని బాపు ఎప్పుడూ మార్చడు. షూటింగ్ టైమ్‌లో నాకు ఎన్నోసార్లు రమణ రాసిన డైలాగులు చదివి వినిపించి ‘ఒక్క వెంకట్రావే రాయగలడయ్యా ఇలాంటి డైలాగు. మహానుభావుడు’ అని మెచ్చుకున్న సందర్భాలు వున్నాయి. వీళ్లిద్దరి సినీ ప్రయాణం ఇలాంటిది. సినిమా పుస్తకం/ కొసరు కొమ్మచ్చి/ వెల: రూ. 200/ ప్రతులకు: 040-23047638 -
ఒకళ్లని జడ్జ్చేయటం నా దృష్టిలో తప్పు!
బా..పు.. రెండు అక్షరాల్లో కొండంత వినయం.. ఎవరెస్టంత జ్ఞానం, కోట్ల నిమిషాల మౌనం... తెలుగు జాతికి వన్నె తెచ్చిన వైనం..! తెలుగుదనానికి బ్రాండ్ అంబాసిడర్ బాపు... ప్రతి తెలుగింట్లోనూ నిక్షిప్తమైన ‘బొమ్మల’ కొలువు బాపు! ఈయన చిత్రకారుడు, చలన చిత్రకారుడు, చరిత్రకారుడు, విచిత్రదారుడు! చాలా థాంక్స్ ముళ్లపూడి వెంకటరమణగారూ! బాపుగారి గురించి ఈ వ్యాసం రాయాల్సి వస్తుందని, అప్పుడు నాకు బాపుగారి స్థాయి పదకోశం, భావజాలం అవసరమవుతాయని, నా చిన్నప్పట్నుంచే మీరు రచనలు చేసి, నాలుగక్షరమ్ముక్కలు కాయితం మీద పెట్టే ధైర్యాన్ని మీ పాఠకుడిగా నాకిచ్చినందుకు... బాపు వంటి నిరాడంబర, మొహమాటపు, మౌనిని సినిమాల్లోకి తీసుకొచ్చి, సినిమాలిన్యం అంటకుండా, నిర్‘మాత’గా కాపాడుకుంటూ, కథ ‘కుడి’ భుజమై ఎడాపెడా మంచి సినిమాలు రాసేసి ఇచ్చినందుకు... బాపుగారు, సినిమాలు తీసేసి మనందరి గుండెల్లో పదికాలాలు నిలిచేలా చేసినందుకు..! చివరిగా... బాపుగారు లాంటి మహోన్నత వ్యక్తిని ఆవిష్కరింపజేసే మహాద్భుత అవకాశాన్ని కల్పించి, పాఠకులకన్నా ముందే నాకు ఉగాది పండుగను అందించిన సాక్షికి కృతజ్ఞతాభివందనాలతో... - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు చెన్నై... బాపురమణల ఇల్లు... ఉదయం పదకొండు గంటల సమయం. డోర్ బెల్ కొడితే ఆయనే స్వయంగా తలుపు తీశారు. ‘‘ఎలా ఉన్నావు? నాన్నగారు కులాసానా? ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నావు?’’ అని అడిగారు. ‘‘బాగానే ఉన్నానండి. నాన్నగారు బావున్నారు. ఇప్పుడు ‘పార్క్’ అని ఒక లవ్‌స్టోరీ చేస్తున్నానండి. త్వరలో రిలీజ్’’ అన్నాను. ‘‘బావుంది. చిన్న సినిమాలు ఈ మధ్య బానే ఆడుతున్నట్టున్నాయ్’’ ‘‘అవును సార్. మీరు ఫాలో అవుతున్నారా?’’ ‘‘ఎందుకవ్వను? నెట్లో కూచుంటే సినిమాలు చూస్తూనే ఉంటాను. థియేటర్‌కి వెళ్లడం ఈ మధ్య తగ్గింది కాబట్టి సీడీల్లో చూస్తున్నాను’’ అని చిన్న గ్యాప్ ఇచ్చి, ‘‘పైరసీ కాదులే’’ అన్నారు. నేనూ నవ్వాను. ఇంత నాలెడ్జ్ పెట్టుకుని మీరెందుకు సార్ పబ్లిసిటీకి, ఇంటర్వ్యూలకి దూరంగా ఉంటారు? ‘‘నాకేమి తెలుసని మాట్లాడాలి? నా గురించి ఏవన్నా ఉంటే రమణగారు చెప్పారు. మిగిలినవి ఎవరికి తోచినట్టు వాళ్లు రాసుకున్నారు. నేను చెప్పడానికేమీ లేదు’’ అన్నారు క్లుప్తంగా. కషాయ: చేదు.... మాత్ర మింగుదామంటే గొంతులో ఆగిపోయినట్టుంది నా పరిస్థితి! ఈయనతో నాలుగు నిముషాలకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం లేదేమో అనుకున్నాను మనసులో! కానీ, అది నాలుగున్నర గంటల నాలెడ్జ్ నదీ ప్రవాహం అవ్వబోతోందని ఆ నిమిషంలో నాకు తెలీదు. ‘‘మీరే మీకేమీ తెలీదంటే, ఎంతో కొంత తెలుసనుకుని కాన్ఫిడెంట్‌గా బతికేస్తున్న మాలాంటి వాళ్లకి కన్ఫ్యూజన్, డిప్రెషన్ వచ్చేస్తాయండి. మీకు చాలా తెలుసని ఒప్పుకోండి ప్లీజ్’’ పెద్ద మనసుతో, చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు, నన్నేమీ అనకుండా. ‘రావికొండలరావుగారు ఎలా ఉన్నారు? కలుస్తున్నారా?’ అని అడిగారు. ‘‘నాన్నగారు ఆయనతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారండి. ఇవాళ కూడా వాళ్లింటికే భోజనానికి వెళ్లారు. నేను కొంచెం తక్కువే...’’ అంటూ... ‘‘మీ ‘పెళ్లిపుస్తకం’ కథ రావికొండలరావు గారిదే కదా! ఆయనకి ఉత్తమ కథకుడిగా నంది అవార్డు కూడా వచ్చింది. మీరు తీసిన సినిమాల్లో బైట కథలు తీయడం అదొక్కటేనా సర్?’’ అన్నాను. ‘‘రమణగారు, నేను వేరే కథ చర్చిస్తున్నాం. అనుకోకుండా కొండలరావు గారు కలిసినపుడు ఈ లైన్ చెప్పారు. బావుందనిపించి అది పక్కన పెట్టేసి ఇది చేయడం మొదలుపెట్టాం’’ ‘‘ఎంత బాగా తీశారు సర్! సినిమా చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. అప్పుడు ఇంటర్మీడియెట్ కాబట్టి కుదర్లేదు. ఆ సినిమా రిలీజైన దగ్గర్నుంచి కొన్నేళ్ల దాకా ఎవరింట్లో పెళ్లికెళ్లినా మా సైడ్ నుంచి ఆ సినిమా విహెచ్ఎస్ క్యాసెట్టే గిఫ్ట్’’ ‘‘అవును చాలామంది అదే చెప్పేవారు’’ ‘‘కృష్ణంరాజుగారు ప్రభాస్‌తో ‘భక్తకన్నప్ప’ మళ్లీ తీస్తానని ఏదో ఇంటర్వ్యూలో అన్నారు. మీ డెరైక్షన్లోనేనా?’’ అన్నాను. ‘‘ఆ విషయం నాకు తెలీదు గానీ, మొన్నామధ్య భరణిగారు సునీల్ హీరోగా తీస్తున్నానని చెప్పారు’’ ‘‘ఓ... రైట్స్ అడిగారా?’’ ‘‘పురాణం కథలకి రైట్స్ ఏవిటి నా మొహం... ఎవరికి నచ్చితే వాళ్లు తీస్కోవచ్చు. భరణిగారు శివుడిపైన మంచి మంచి పాటలు రాశారు. మీరు వినే ఉంటారు... ఆటగదరా శివా... అని, గంగావతరణం అని... బహుశ వాటిని సినిమాకి ఉపయోగించే అవకాశం భక్తకన్నప్పతో వస్తుందనుకుంటాను’’ అన్నారు. ‘‘నెక్ట్స్ ఏవన్నా ప్లాన్ చేస్తున్నారా సర్...’’ ‘‘ఏమీ అనుకోలేదండి...’’ ‘‘మీరు, రమణగారు ‘శ్రీరామరాజ్యం’ తర్వాత చేద్దాం అనుకున్న స్క్రిప్టు ఏదైనా ఉందాండి?’’ ‘‘ఆ సినిమా మధ్యలోనే వారు కాలం చేశారు కదా! మేం ఎప్పుడూ ఓ సినిమా మధ్యలో ఇంకో సినిమా గురించి ఆలోచించలేదు. ఒక సినిమా అయ్యాక కొంత గ్యాప్ తర్వాతే ఇంకో సినిమా గురించి ఆలోచించడం మొదలుపెట్టేవాళ్లం’’ ‘‘మీ సినిమాలంటే పడి చచ్చిపోయే నిర్మాతలున్నారు సర్... జీవితకాలంలో మీ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా తియ్యాలని ఉందని నాతో కొంతమంది మంచి వ్యాపారవేత్తలు అన్నారు కూడా...’’ ‘‘అలా అన్నవాళ్లూ ఉన్నారు, అలాగే అని మమ్మల్ని చీట్ చేసిన వాళ్లూ ఉన్నారు’’ అన్నారు నిర్లిప్తంగా. ‘‘ఛ... మిమ్మల్నెవరు మోసం చేస్తారు సార్... మీరిద్దరూ చాలా సీనియర్లు! ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ సమకాలీనులు, స్నేహితులు. మిమ్మల్ని చీట్ చేయగలరా? పైగా, మీ సినిమాలన్నీ మీ పేర్ల మీదే సేల్ అవుతాయి గదా!’’ అన్నాను. ‘‘అలాగే అమ్మేవాళ్లు... తీరా డబ్బులొచ్చాక మాకెగ్గొట్టిన ప్రొడ్యూసర్లున్నారు. నా దగ్గర లేవని అడ్డం తిరిగిన వాడిని మేం దబాయించేవాళ్లం కాదు. వదిలేసే వాళ్లం’’ ‘‘అయ్యో....’’ కొంచెంసేపటి తర్వాత నేనే అన్నాను... ‘‘ఎలాగైనా మీ సినిమాలు అనుకరించడం గానీ, కాపీ కొట్టడం కానీ కుదరని పనండి. పూర్తిగా వేరే బాణీ మీది’’ ‘‘అదేం లేదు. షాట్లు తీయడంలో ఎవరి స్టైల్ వాళ్లదనుకో - కథని, సీన్స్‌ని కూడా కాపీ కొట్టేవాళ్లున్నారు. ఓసారి రమణగారు రైటర్స్ అసోసియేషన్‌లో కంప్లైంట్ చేస్తే, ఓ ప్రబుద్ధుడు ‘ఓ మీరింకా బతికే ఉన్నారా?’ అని ఆయన మొహం మీదే అడిగాడు ఇరవయ్యేళ్ల క్రితం. దాంతో ఆయనకి ఇంకా ఒళ్లు మండి ఆ ఇష్యూని ఫార్వర్డ్ చేశారు. అప్పటికీ వాడు పశ్చాత్తాపపడకపోగా, రమణగారితో ‘అదేంటండీ! మీ సినిమాలు చూసి మేం ఇన్స్పైర్ అయి తీస్తే... మీ తరం వారు సంతోషిస్తారనుకున్నాంగానీ ఇలా బాధపడతారేంటి?’ అన్నాట్ట’’ ‘‘మొత్తం మీద అసోసియేషన్ కాంపెన్సేట్ చేసిందా సర్?’’ ‘‘కొంత చేసింది. దాన్ని పక్కన పెడితే, అప్పట్లో ఆ కాపీ కొట్టినవాడు చాలా పీక్‌లో ఉన్నాడు. పీకల్దాకా పొగరుండేది... కానీ, ఎలా ఎదిగాడో, అలాగే డౌనయ్యాడు. అంతే! ప్రారబ్ధం.’’ ‘‘రమణగారిని ఇంకో దర్శకుడు చాలా బాధపెట్టాడని విన్నాను సర్. ఆయనే మాటలు రాయాలని పట్టుబట్టి, హైదరాబాద్ తీసుకొచ్చి, గెస్ట్‌హౌస్‌లో పెట్టి ఇరవైరోజులు ఎడ్రస్ లేకుండాపోయి, తర్వాత ఫోన్ చేస్తే - ‘ఓ మీరింకా ఇక్కడే ఉన్నారా? ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు, మళ్లీ పిలిపిస్తాను రండి’ అన్నాట్ట కదా! దానికి రమణగారు చాలా బాధపడ్డారని తెలిసింది..?’’ ‘‘మాకు ఇలాంటివి ఇంకా ఎన్నో జరిగాయి. ఇప్పుడు తల్చుకోవడం అనవసరం. ఏ జనరేషన్‌కి ఆ జనరేషనే - కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అందరూ సుఖపడుతూనే పైకొచ్చారనుకోవడం తప్పు. ఏదేమైనా, మేం మా సొంత సంస్థలో సినిమాలే హాయిగా తీశాం. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఎవర్నీ ఏమీ అనుకునే పనిలేదు. నిర్మాతగా రమణగారు నా వరకూ ఏ కష్టమూ రానీయలేదు’’ కటు: కారం... ఛీత్కారం.... ‘‘మీ సొంత సినిమాల్లో పైచేయి డెరైక్టర్‌గా మీది వుండేదా? రైటర్ కమ్ ప్రొడ్యూసరైన రమణగారిదా?’’ ‘‘ఏ రోజూ రమణగారు నా వర్క్‌లో వేలు పెట్టలేదు. ఇద్దరం కొన్నాళ్లపాటు చర్చించుకున్నాక ఆయన రైటర్‌గా ఫుల్ వెర్షన్ రాసిచ్చేవారు. చిన్నప్పట్నుంచి ఆయన చేతి రాత నాకే బాగా అర్థమయ్యేది కాబట్టి, నేనది ఫెయిర్ కాపీ చేస్తూ పక్కనే బొమ్మలేసుకునేవాణ్ని. అది నా హోమ్‌వర్క్ అన్నమాట! అలా స్టోరీ బోర్డ్ కంప్లీట్ అయ్యాక నేను కాన్ఫిడెంట్‌గా సెట్కెళ్లేవాణ్ని’’ ‘‘మీరు ఎక్కువగా మాట్లాడరు కదా? సెట్లో ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి మీ స్టోరీ బోర్డ్ ఇచ్చేసేవారా?’’ మళ్లీ పెద్దమనసు చేసుకుని, చిన్నగా నవ్వుతూ - ‘‘సెట్లో నా స్టోరీబోర్డ్ ఎవ్వరికీ అర్థం కాదు... నాకు తప్ప! నేను ఎక్కువ మాట్లాడనంటే... అనవసరమైన విషయాల్లో ఎక్కువ మాట్లాడననిగానీ, సెట్లో డెరైక్టర్ గా అవసరమైనవన్నీ చెప్పనని కాదు. ఆర్టిస్టులకి యాక్షన్ కూడా చేసి చూపిస్తాను’’ మీరా? అని అనబోయి, మళ్లీ పెద్ద మనసు చేసుకుంటారని భయమేసి ఆగిపోయాను. ‘‘మీరు ఎవ్వరి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయకుండానే డెరైక్ట్‌గా ‘సాక్షి’తో డెరైక్టరైపోయారు. పైగా ఆ సినిమా మీకు చాలా మంచి పేరు తెచ్చింది..’’ ‘‘ఎవ్వరిదగ్గరా పని చెయ్యలేదు కానీ, రమణగారితో షూటింగులకి వెళ్తుండేవాణ్ని. చాలా సినిమాలు మేం కలిసే చూసేవాళ్లం, డిస్కస్ చేసుకునేవాళ్లం. ‘సాక్షి’కి మంచిపేరు వచ్చినా, పర్సనల్‌గా నా వర్క్ నాకు సంతృప్తిగా అనిపించలేదు. నేను మళ్లీ చూసినప్పుడు నా డెరైక్షన్ నాకు నచ్చలేదు. అయినా అది బాగా ఆడిందంటే ఆ క్రెడిట్ మొత్తం రమణగారి కథనం, మాటలు; కృష్ణ-విజయనిర్మలగార్ల యాక్టింగ్... అదే ‘సాక్షి’కి హైలైట్! ‘‘మీ ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాకి కో-డెరైక్టర్ కె.వి. రావుగారి ద్వారా అప్రెంటిస్‌గా అవకాశం వచ్చింది నాకు. అదే సమయంలో రావికొండలరావుగారి ద్వారా సింగీతం గారి ‘బృందావనం’ సినిమాకి అబ్జర్వేషన్ ఛాన్స్ వచ్చింది. రెండిట్లో హీరో రాజేంద్రప్రసాద్గారే. మీరు హైదరాబాద్‌లో, సింగీతంగారు చెన్నైలో. చెన్నైలో పనిచేయాలన్న యాంబిషన్ కోసం మీ సినిమా త్యాగం చేశాన్నేను. ఆ బాధ ఉండకూడదనే మీ ‘శ్రీరామరాజ్యం’ సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా వచ్చి మీకు సహాయంగా ఉంటానని నేను ఫోన్ చేసి అడిగితే మీరు వద్దన్నారు. ఎందుకని?’’ ‘‘అప్పటికే మీరు ఏడెనిమిది సినిమాలు తీసిన డెరైక్టరు. మీరు మళ్లీ అసిస్టెంట్ డెరైక్టరుగా రావడం నాకిష్టం లేదు. మీరింకా చాలా సినిమాలు తీయాలి. బోలెడు సక్సెస్, పేరు, డబ్బు సంపాదించుకోవాలి’’ మమకారం- మధుర: తీపి లేచి వెళ్లి పాదాభివందనం చేశాను. ‘‘నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ నాన్నగారంటే చాలా అభిమానం నాకు. మంచి వ్యక్తి’’ ‘‘నాన్నా! నువ్వెంత అదృష్టవంతుడివి? బాపుగారితో ప్రశంస....’’ (అనుకున్నాను మనసులో) ‘‘ఇంతకీ మీకు చిత్రలేఖనం ఎలా వచ్చిందండి? సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరు?’’ అన్నాను. ‘‘మా నాన్నగారే. ఆయన అడ్వకేటు. ఆయనకి డ్రాయింగ్, పెయింటింగ్ హాబీ. అది నాకూ అలవాటయింది. కానీ నాన్నగారికి చిత్రలేఖనం హాబీయేగానీ, దాన్ని వృత్తిగా చేసుకోవడం ఇష్టం లేదు. కూడు, గుడ్డ పెట్టదనేవారు. అందుకే నన్ను కూడా ‘లా’ చదివించారు కానీ, అది హాబీ అయింది’’ చమత్కారం.... ఆమ్ల: పులుపు ‘‘కోర్టుకి ఒక్కసారే వెళ్లాను... అది డిగ్రీ పూర్తయ్యాక, బార్ కౌన్సిల్లో పేరు ఎన్రోల్ చేయించుకోవడానికి’’ అన్నారు బాపుగారు. ‘‘కేసులేవన్నా వాదించారా?’’ ‘‘అబ్బే.... ఒక్క కేసూ వాదించలేదు. మళ్లీ కోర్టుకెప్పుడూ వెళ్లలేదు కూడా’’ అన్నారు నవ్వుతూ. ‘‘మీరు వాదించడం ప్రాక్టీసు చేసుంటే మీ నిర్మాతల నుంచి రావల్సిన బకాయిలన్నీ వసూలైపోయేవి’’ పెద్దమనసు చేసుకుని, మళ్లీ చిన్నగా నవ్వారు. ఫొటోగ్రాఫర్ శివ మౌనంగా కెమెరాతో తన పని తను చేసేస్తున్నారు. కానీ మధ్యమధ్యలో మంచి ఉపయోగపడే ప్రశ్నలు ఒకటిరెండు సంధించారు... ‘‘అన్నీ తెలిసిన మీరే ఇంత అణకువగా ఉంటే... ఏవీ రాని వాళ్లు మీ ఎదురుగా విర్రవీగుతున్నప్పుడు వాళ్లని చూస్తే మీకేమనిపిస్తుంది?’’ అంటూ... జాలేస్తుందనో, నవ్వు వస్తుందనో, చిరాకొస్తుందనో చెప్తారనుకున్నాను. ‘‘నేనెవ్వరినీ జడ్జ్ చేయను. ఒకళ్లని జడ్జ్ చేయడం చాలా కష్టం. నా దృష్టిలో అది చాలా తప్పు కూడా’’ అన్నారు. ఏదో సైకాలజీ బుక్‌లో చదివిన లైను జ్ఞాపకం వచ్చింది నాకు. ‘‘ఇఫ్ యు స్టార్ట్ జడ్జింగ్ సమ్‌వన్, యు విల్ స్టాప్ లవింగ్ దెమ్’’ అని! ఇంతలో ప్రస్తావన పుస్తకాల మీదకు మళ్లింది. ఆయనకి నచ్చిన పుస్తకాలు, ఆయన మెచ్చిన పుస్తకాలు, ఆయన్ని మలచిన పుస్తకాలు... సంభాషణ అలా కొనసాగుతుండగా డ్రాయింగ్ రూమ్‌లోకి ఎంటరయ్యాం. ఆ టైంలో ఆయన మాతో పంచుకున్న ఒకటిరెండు విషయాలు... ‘‘నా ప్రతి సినిమాలో ఎక్కడో ఒకచోట పుస్తకాలు కనపడే షాట్ తప్పనిసరిగా తీస్తాను. పుస్తక పఠనా ప్రాచుర్యం పెంచడానికి ఆ మార్గం ఎంచుకొమ్మని సూచించింది నా గాడ్ ఫాదర్లాంటి వాడైన ఈజెన్‌బర్గ్ (ఫోర్డ్ పౌండేషన్ సౌత్ ఇండియన్ పబ్లిషింగ్ హెడ్)’’ అని! సరదాగా మరోటి - ‘‘ఓ రోజు మా ఇంట్లో దొంగలుపడ్డారు. ఏవో కొన్ని వస్తువులు, కొంత క్యాష్ పట్టుకుపోయారు. రమణగారి చిన్నల్లుడు తనకి తెలుసని ఈ ఏరియా ఎస్సైని, కానిస్టేబుల్ని తీసుకొచ్చాడు. ఆయన ఇల్లంతా చూసి, నా డ్రాయింగ్ రూమ్‌లోకి వచ్చారు. పాపం దొంగలు ఇలా చిందరవందర చేసేశారా... ఇప్పుడివన్నీ సర్దుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది... అన్నారు సిన్సియర్‌గా. ‘అది నా రూమ్. అదెప్పుడూ అలాగే ఉంటుంది. దొంగలు ఆ గదిలోకి రాలేదు’ అన్నాను. అప్పుడాయన ఫేస్ చూసి ఇంటిల్లిపాదీ నవ్వుకున్నాం. లవణ: ఉప్పు... నష్టంలోంచి పుట్టిన హాస్యం కాబట్టి! ‘రమణగారు లేని జీవితం ఎలా ఉందండి’ అని ఉన్నట్టుండి అడిగారు ‘సాక్షి’ సినిమా డెస్క్ ఇన్‌ఛార్జి పులగం చిన్నారాయణ. నేను కంగారుపడ్డాను. ఈ ఉగాది పచ్చడిలో నేను చూడకూడదనుకున్న రుచి అదొక్కటే. కానీ, అది కూడా లేకపోతే పూర్తిగా, పూర్ణంగా ఉండదనుకున్నారేమో చిన్నారాయణ. బాపుగారు కదిలిపోయారు. కన్నీళ్ల పర్యంతమయ్యారు. అర్ధరాత్రి రెండుగంటల సమయంలో రమణగారి అనాయాస మరణాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ‘‘నన్ను గోడలేని చిత్తరువుని చేసి ఒంటరిగా వెళ్లిపోయావా వెంకట్రావూ!’’ అన్నమయ్య కీర్తనలో భావాన్ని రమణగారికి అన్వయించి బాపుగారు వేసుకున్న బొమ్మ - రమణగారి నవ్వుతున్న మొహం. వెంకటరమణుడిపై భక్తి అన్నమయ్యది. ముళ్లపూడి వెంకటరమణుడిపై భక్తి, స్నేహం, గౌరవం బాపుగారిది. ‘‘రమణగారు లేని జీవితం ఊహించలేనిది’’ అన్నారు కన్నీళ్లతో! తిక్త: వగరు... తప్పనిసరైన నిజాన్ని అంగీకరించడం వగరే. చెన్నైలో పుట్టి, పెరిగిన తెలుగువారు కాబట్టే తెలుగుదనం వారి ఊహల్లో అంత అందంగా, సున్నితంగా, ఆహ్లాదంగా ఉండి ఉంటుందనిపించింది. ఒకరు తన ‘రాత’ని ధారపోశారు.... ఒకరు తన ‘గీత’తో దానికి ప్రాణం పోశారు... ఇచ్చిపుచ్చుకోవడానికి ఇంతకన్నా మధురమైన స్నేహం ప్రపంచంలో ఏ ఇద్దరి మధ్యా ఉండదు. మళ్లీ మధుర: తీపి... తెలుగువారికి ఇంతకన్నా షడ్రసోపేతమైన ఉగాది ఉంటుందని నేననుకోను. బాపుగారికి అస్సలు ఏ మాత్రం ఇష్టంలేని ఈ పని చేసినందుకు రేపు ఆయన పేపర్లో చూసి, చదివి, మళ్లీ పెద్దమనసు చేసుకుని, చిన్నగా నవ్వేస్తారని ఆశిస్తూ..... మీ వి.ఎన్.ఆదిత్య బొమ్మ పూర్తిగా గీస్తేగానీ సంతకం పెట్టనన్నారు... నన్ను ఇన్స్పైర్ చేసేది సంగీతం మాత్రమే! కాలేజీ రోజుల్లో మౌత్ ఆర్గాన్ వాయించేవాణ్ని. బడేగులామ్ అలీఖాన్, మెహదీహసన్ గాత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఉర్దూ పెద్దగా రాదు. అయినా వారి వాయిస్‌ల వల్ల ఆ పాటలు బాగా ఎంజాయ్ చేస్తాను. బడేగులామ్ అలీఖాన్ కచేరీలకి పి.బి.శ్రీనివాస్ తీసుకెళ్లేవాడు. కానీ, ఆయన్నెప్పుడూ కలవలేదు. మెహదీహసన్ని మాత్రం ఒకసారి కలిశాను. ఆయన పెయింటింగ్ మీద సంతకం పెట్టివ్వమని అడిగాను. పెయింటింగ్ చూసి ‘నా హార్మోనియం సగమే గీశావ్, పూర్తిగా గీసి పట్రా అప్పుడే సంతకం’ అన్నారు. పెద్దవాళ్లకి వాళ్ల కళంటే అంత అభిమానం! అబ్దుల్ కరీమ్‌ఖాన్ అనే క్లాసికల్ సింగర్ దగ్గరికి ఓ అభిమాని వచ్చి - ‘నేను జాబ్‌కి లీవ్‌పెట్టి ఒక మూడు నెలలు మీ దగ్గర సంగీతం ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను’ అన్నాట్ట! దానికాయన తన చేతిలో నున్నగా ఉన్న పొన్నుకర్ర చూపించి, దీన్ని ఫ్యాక్టరీలో మెషిన్ మీద అయిదు నిముషాల్లో తయారుచేస్తారు. కానీ నా అరచేయి కింద ముప్ఫై ఏళ్లుగా ఉంది. అందుకే ఇంత నునుపు తేలింది. సంగీతం మూడు నెలల్లో నేర్చుకుంటే రాదు... అన్నారట. ఏ విద్యలోనైనా ప్రాక్టీస్ చాలా అవసరం. నిరంతరం అదే పనిలో ఉండాలి. ఇప్పటికీ నేలమీద కూర్చునే బొమ్మలేస్తాను! నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. ‘బాల’ పత్రికలో రమణగారు కథలు, వ్యాసాలు రాస్తున్నప్పుడు రేడియో అన్నయ్య, బాల సంపాదకులు న్యాయపతి రాఘవరావుగారు బొమ్మలు గీయమని నన్ను బాగా ప్రోత్సహించేవారు. మదరాసులోని మూర్ మార్కెట్‌కి శని, ఆదివారాలు తీసుకెళ్లి, కావలసిన పుస్తకాలు, పెయింటింగ్ బ్రష్‌లు, డ్రాయింగ్ షీట్లు, రంగులు కొనిచ్చేవారు. ‘‘ఆనంద వికటన్’’ పత్రికలో గోపులుగారనే ఆర్టిస్టు బొమ్మలు వేసేవారు. నాకు వారంటే చాలా ఇష్టం. వారింటికి వెళ్లి బొమ్మలెలా వేస్తారా! అని పరిశీలిస్తూ నేర్చుకునేవాణ్ని. ఒక్కోసారి రోజుకి పద్దెనిమిది గంటలు బొమ్మలేసేవాణ్ని. ఇప్పటికీ నేలమీద కూర్చునే బొమ్మలేస్తాను. అమెరికాలో, లండన్‌లో నా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టారు. నాకు జుత్తు లేదు గానీ, ఇంతమంది అభిమాన చిత్రకారులున్నారు. మా అమ్మాయి బాగా బొమ్మలేస్తుంది. మా రెండో అబ్బాయి కూతురు (మనవరాలు) దానికి ఎనిమిదేళ్లు అది కూడా బాగా బొమ్మలేస్తుంది. నన్ను చాలామంది అడుగుతుంటారు - మనవళ్లు, మనవరాళ్లకి నేర్పించరా - అని! దానికి నా సమాధానం ఒకటే - నేనే నిరంతర విద్యార్థిని, నాకొస్తే కదా వాళ్లకి నేర్పించడానికి - అని! ఈ తరం దర్శకుల్లో రాజమౌళి, త్రివిక్రమ్‌లు జీనియస్‌లు! నేనొక సినిమాబఫ్ని! ఇప్పటికీ వీడియోలో రోజుకి పది సినిమాలు చూస్తాను. నేను చేసే హోమ్‌వర్క్ వల్ల ఫిల్మ్ నెగెటివ్ తక్కువ ఎక్స్పోజ్ చేస్తాను. ‘సీతాకల్యాణం’లో మా గురువుగారు పిలకా నరసింహమూర్తిగారుగీసిన దశావతారాలు బొమ్మలు వాడాను. ఇషాన్ ఆర్య, బాబా అజ్మీ, పీఆర్‌కె రాజు, రవికాంత్ నగాయిచ్ నా కెమెరామెన్లలో ఎక్కువ నాతో వర్క్ చేశారు. నాతో పని చేయాలంటే నేను చెప్పినట్టు వినాలి. లేకపోతే కష్టం. పాతవన్నీ గొప్పవి అనుకోవడం తప్పు. ఈ రోజుల్లో కూడా చాలా గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు. ఈ తరం తెలుగు దర్శకుల్లో రాజమౌళి, త్రివిక్రమ్‌లు జీనియస్‌లు. పరిస్థితులకి తలవంచకుండా సినిమాలు తీస్తున్నారు. రమణగారి చొక్కా పట్టుకుని పైకొచ్చేశాను! నాకు ఎనిమిదేళ్లు, రమణగారికి పదేళ్లు ఉన్నప్పట్నుంచి మా స్నేహం. చిన్నప్పట్నుంచి నేను, రమణగారు హాలీవుడ్ సినిమాలన్నిటికీ నేల టిక్కెట్ తీసుకుని వెళ్లేవాళ్లం. ప్రతి శుక్రవారం మౌంట్రోడ్కెళ్లి మూడు సినిమాలు వరసగా చూసి వచ్చేవాళ్లం. సినిమా, సినిమాకి మధ్యలో ఒక టీ తాగి, బిస్కెట్టు తినడం... అంతే! నాకు నలుగురితో మాట్లాడాలంటే భయం. జలగండంలాగ నాకు ‘జన’గండం ఉన్నట్టుంది. కానీ, రమణగారు అలా కాదు. ఇండస్ట్రీలోనూ, బయటా ఆయనకు చాలామందితో మంచి అనుబంధం ఉంది. రామారావుగారు, నాగేశ్వరరావుగారు లాంటి పెద్ద నటులంతా మాతో అన్ని సినిమాలు చేశారంటే ఆయనతో ఉన్న అనుబంధం వల్లే! రమణగారు వర్క్ చేయకుండా నేను ఏ ఒక్క సినిమా తీయలేదు. నేను పైకి రావడానికి నా ప్రతిభేం లేదు... రమణగారి చొక్కా పట్టుకుని పైకొచ్చేశాను!