పిల్లనగ్రోవికి ఒళ్లంతా గేయాలే | Summary Of Mullapudi Venkata Ramana Kanuka | Sakshi
Sakshi News home page

పిల్లనగ్రోవికి ఒళ్లంతా గేయాలే

Published Mon, Aug 26 2019 12:05 AM | Last Updated on Mon, Aug 26 2019 12:06 AM

Summary Of Mullapudi Venkata Ramana Kanuka - Sakshi

ముళ్లపూడి వెంకటరమణ ఇంకా ఒక్కటి మిగిలింది. ఇదేనా? ఉదయం నుండి వెతుకుతున్నది మంచిది కాక, కానందువల్ల ఈ గుట్టలో పడిపోయిందేమో. ఇప్పుడు మిగిలింది– ఒకప్పుడు పనికిరాదని తాను పడవేసిందేమో. 

పొద్దు వాటారి నప్పటినుంచి మర్రిచెట్లలోంచి వూడలు వూడలుగా దిగజారుతున్న చీకటి, చెలమై  చెలరేగిన యమునై, భూమినంతా ముంచివేసింది. చెట్టుకింద చీకటిమధ్య చితుకుల మంటలు కృష్ణుడి మీద ఎర్రపట్టు కండువాలా కదలాడుతున్నాయి. మంటలో ఊచ కాలుస్తున్న గోపన్న ముఖం మీద– అతని పక్కన చెల్లాచెదురుగా పడివున్న వేణువుల మీద వెలుగు నీడల భాషలో కావ్యాలు రాస్తున్నాయి.

ఇంక మూడు ఝాములు పోతే సప్తమి తెల్లవారుతుంది. కృష్ణుడి పుట్టినరోజు వచ్చేస్తుంది. పాతిక పండగలనాడు గోపన్న ఆరంభించిన వేణు నిర్మాణం ఇంకా తెమలలేదు. రేపటికైనా సాధించి, తన వేణువును ఆయనకు సమర్పించాలి. రేపివ్వలేకపోతే ఇంక ఈ జన్మకివ్వలేడు... వేళయిపోయింది.

‘‘నాయనా, బువ్వ దినవే’’ అన్నాడు చిన్న గోపన్న వచ్చి. గోపన్న కీమాట వినబడలేదు.

అతని హృదయం బృందావనిలో ఉంది. అక్కడకు కృష్ణుడు వస్తాడు. వచ్చే వేళయింది. గోపికల అందెల రవళి వినిపిస్తోంది. వెదురు పొదలు సన్నగా ఈల వేస్తున్నాయి. 

గోపన్న ఎన్ని యుగాలుగా అక్కడ చెట్ల మాటున కూర్చున్నాడో అతనికే తెలియదు. ఆకులలో ఆకై పువ్వులో పువ్వయి, ఇసుకలో రేణువై యమునలో బిందువై కృష్ణ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు.

పరిశుద్ధమైన స్వరాలలో ఒక్కొక్క స్వరాన్ని మనసులో నిలుపుకుని పరుగున తన కుటీరానికి వచ్చాడు. కొత్త వెదురు కోసి స్వరద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని ఇందులో పలికించబోయాడు. ఆ స్వరం తన ఈ వేణువులో పలికితే ఇది కృష్ణయ్యకు కానుక ఇవ్వాలి. కాని అది పలకదు. ఎన్ని వేల వేణువులో చేశాడు. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ వేణువును శ్రుతి చేయడానికే ఉపయోగించాడు. ఒక్క జీవితానికి లెక్కదేలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొన్ని కోట్లు ఉంటాయి. వాటిని వృథా చేస్తే ఎలా? యమున ఒడ్డున పొదల మాటున దాగి  కృష్ణుడి మురళి విన్నప్పుడు వూపిరి బిగబట్టుకునే కాలం గడిపేవాడు. అక్కడ పొదుపు చేసిన దానిని కొత్త వేణువును పూరించడానికి ఉపయోగించేవాడు. తీరా అది శ్రుతి శుద్ధంగా వినబడేది కాదు. లోపలేవన్నా ఈనెలు లేచాయేమోనని లోపల కూడా నునుపు చేసేవాడు. ఇక పట్టుకువెళదాం అని లేచేసరికి దాని గొంతుక జీరబోయేది.

గోపన్న పూర్వం ఎన్నో వేణువులు చేశాడు. తృప్తిగా వాయించాడు. ఒక స్థాయి వచ్చాక అతనికొక ఊహ పోయింది. వేణువును కిందపెట్టి, సంగీతాన్ని ఊహించబోయాడు. ఊహించిన సంగీతాన్ని భావన చేసి, భావించిన దానిని అనుభవించి దర్శించే వరకు అతనికొక సత్యం తోచింది. జలపాతాన్ని వెదురుగొట్టంలో ఇమడ్చడం పొరబాటు. అన్ని వేదాంతాలూ, అన్ని అసత్యాలూ అర్ధసత్యాలేనంటూ, తనలో భాగాలేనంటూ నిలచే అద్వైత సత్యంలా ఈ సంగీతంలో అపస్వరాలు కూడా అర్థస్వరాల, పూర్ణస్వరాల పక్కన నిలిచి, అందంగా భాసించసాగాయి. ప్రతి అణువునా భగవంతుడున్నాడు. ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది, అన్న వాక్యాల తాత్పర్యం గోపన్న అర్భక దేహానికి దుర్భరమైపోయింది. అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించడానికి శక్తి చాలలేదు.

అతన్ని ఆ స్థితినుంచి ఐహిక స్థితికి తెచ్చి కాపాడినది– కృష్ణుడి మురళి. అది విన్న క్షణాన అతను ఆ స్థితిలోకే మేలుకున్నాడు. తన ఊహకు అందిన దానికన్న గొప్పదీ, ఆకళింపు చేసుకుని అనుభవించడానికి సులువైనదీ అతనికి ఆనాడే వినిపించింది. నాటినుంచి ప్రతి నిత్యం కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి, మురళి వినేవాడు. కొత్తల్లో గోపకాంతలు కంగారు పడ్డారు. తరువాత అతన్ని ఒక గోవుగా, చెట్టుగా జమ కట్టేశారు.

ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ మురళిని ఎత్తుకు వచ్చాడు. యమున ఒడ్డుకు వచ్చి, చెంగుచాటు నుంచి మురళి తీసి వాయించాలనుకునేసరికి అది కనబడలేదు.

గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నాడు గోపన్న. కాని ఆ గజదొంగ సాయంత్రం కనబడి ‘‘గోపన్నా నా మురళిని తీసుకుపోయావు కదూ... పోనీ ఇంకొకటి చేసిపెట్టు’’ అన్నాడు నవ్వి.

గోపన్న తెల్లబోయాడు. మర్నాటి నుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు. అతనిలో కొత్త శక్తి, కొత్త చైతన్యం మేల్కొన్నాయి. తన చేతులతో రూపు దిద్దుకుంటున్న మురళి రేపు కృష్ణుడి హస్తాలను అలంకరిస్తుందని ఆశపడుతూ మురళిని రూపొందించాడు.

మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. గుండె బద్దలయినంత పనయింది. జీర. రెండు మూడు వేణువులు పలికినట్టుంది. కృష్ణుడు వూదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్లు పులకరించిందా? అది పడేసి మరోటి చేశాడు. అదీ అంతే.

మర్నాడు వెదురు చాలా తెప్పించాడు. పది పన్నెండు చేశాడు. ఒక్కొకటీ వూది చూడడం, నచ్చక పారవెయ్యడం...
‘‘నీకు వేణువు ఇవ్వందే నా ముఖం చూపను కృష్ణయ్యా’’ అనుకున్నాడు. నాటినుంచి ఇదే పని.

ఊళ్లో వాళ్లంతా వింతగా చెప్పుకున్నారు. సంగీతం పిచ్చి వదిలిందనుకుంటే, మళ్లీ పిల్లంగోవి పిచ్చి పట్టిందిగావాల అని నవ్వుకున్నారు.

గోపన్న పనికిరావని పడేసిన వందలాది వేణువులను కొత్తలో గొల్లపిల్లలు తీసుకుపోయేవారు. తరువాత అతనికి భయం వేసింది– వాటిలో ఏదైనా కృష్ణయ్య దగ్గరకు పోతుందేమోనని. అందుకని పాకలో అటకమీద పడేసేవాడు.

యమున ఒడ్డున గోపన్న పాక, పాక పక్కన పందిరి కింద వెదుళ్లు, చెట్టుక్రింద కొలిమి చూసి జనం హేళన చేశారు– గోపన్నా! కలప దుకాణం పెట్టరాదూ!

పాతికేళ్లు గడిచిపోయాయి. కృష్ణయ్య పెద్దవాడయ్యాడు. బృందావనికి రావడం లేదు. రాజకీయాల్లో తిరుగుతున్నాడు. అయినా కృష్ణాష్టమి వెళ్లిన ప్రతి నవమినాడు గోపన్న కొత్త వేణువు ఆరంభిస్తూ, ‘పైసారి పుట్టిన రోజుకైనా పంపాలి’ అనుకొనేవాడు. పుట్టిన రోజు వచ్చేది వెళ్లేది... వేణువు మాత్రం కుదిరేది కాదు.

‘‘నాయనా బువ్వదినవే’’అన్నాడు చిన్నగోపన్న. తండ్రి వాడివంక చూశాడు. తల్లి లేని బిడ్డ. తండ్రి ఉండీ లేనిబిడ్డ. 

‘‘బువ్వదింటాలేగాని, రేపు కిష్టయ్య పుట్టినరోజు. నువ్వు నందయ్యగారి లోగిలికెళ్లి ఎవరూ చూడకుండా ఇది కిష్టయ్యకిచ్చి– మా నాయనిచ్చి రమ్మన్నాడని చెప్పిరావాల’’ అన్నాడు గోపన్న.
‘‘బువ్వ దినుమరి’’ అన్నాడు బిడ్డడు.
గోపన్నకు వాణ్ణి చూడగానే బాలకిష్టయ్య గుర్తుకొచ్చాడు. లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. వాడు తెల్లబోయి బుగ్గ తుడుచుకున్నాడు.
‘‘నువ్వలాగే అంటావు. పొద్దాటేలేమో ఇది బాగాలేదు ఒద్దులే అంటావు’’
‘‘అనను. ఈసారిది బాగుంటదిలే. అయినా సూడనుగా’’ అన్నాడు గోపన్న నీరసంగా నవ్వి.

మర్నాడు ఉదయమే గోపన్న కొడుక్కి తలంటి పోశాడు. సాంబ్రాణి ధూపమేసి జుట్టు ఆరబెట్టాడు. వదులుగా కొప్పు ముడేసి పూలు తురిమాడు. పట్టు కండువా తీసి పంచె కట్టాడు. మరోటి తీసి ధట్టీ చుట్టాడు. కస్తూరి తిలకం, కాటుక దిద్ది, దిష్టి తగలకుండా బుగ్గన చుక్క పెట్టాడు. నెమిలీకల వీవనలోంచి ఒక కన్ను తీసి కొప్పున బెట్టాడు.

చినగోపన్న కెందుకో కంట నీరు తిరిగింది. జాలిగా నాయన వంక చూశాడు. ముస్తాబు ముగించిన గోపన్న క్షణంలో నిర్విణ్ణుడై పోయాడు. ఇదేమిటి బాలకృష్ణుడు గోపాలకృష్ణుడు... ఇక్కడికి ఎందుకొచ్చాడు? తాను ఏనాడో ఎత్తుకొచ్చిన వేణువు కోసమా? అప్రయత్నంగా చేతులు జోడించి దండం పెట్టాడు. కన్నీరు కట్టలు తెంచుకుంది. దుఃఖమో, ఆనందమో.

‘‘ఏందే అయ్యా’’ అంటూ వచ్చి కౌగిలించుకున్నాడు కొడుకు. గోపన్న ఉలికిపడి కళ్లు తుడుచుకున్నాడు. ‘‘ఏదే... మురళేదే’’ అంటూ అటూయిటూ చూశాడు. కనబడలేదు.

‘‘అటక మీదెట్టాను. రాతిరి ఎలకలొస్తే’’ అన్నాడు చినగోపన్న భయపడుతూ.

‘‘ఆ! ఎంత పన్జేశావురా’’ అన్నాడు గోపన్న. ఎలకలుండేదే అటక మీద అని తెలిసి అక్కడ పెట్టడమేమిటని కేకలెయ్యబోయాడు గాని మనస్కరించలేదు. అటకమీదికెక్కి చూశాడు. వేణువులు గుట్టలుగా ఉన్నాయి.

అందులో ఏది కొత్తది? ఏది మంచిది? వేణువులన్నీ కిందకు దించాడు. ఒక్కొక్కటీ తీసి వూది చూడసాగాడు. 

‘‘ఇది కాదు’’ ‘‘ఇదీ కాదు’’
ఇటువేపు గుట్ట తరుగుతోంది. అటు వేపుది పెరుగుతోంది. ‘‘నేతి నేతి’’ అనుకొంటూ వేణుపరీక్ష సాగిస్తూనే వున్నాడు. చిన్న గోపికి చెమటకి కస్తూరి బొట్టు కరిగిపోయింది. కాటుక చెరిగిపోయింది. అన్నం తిననందువల్ల నీరసం కూడా కలిగింది. కానీ గోపన్న ఇదేమీ గమనించే స్థితిలో లేడు.

ఇది కాదు. ఇదీ కాదు.
ఇన్ని వేణువుల గుట్టలో ఎక్కడో సత్యమైన కొత్త వేణువు దాగివుంది. అది సత్యమైనదేనా?
పొద్దు వాటారింది. చిన్నగోపన్న దీపం వెలిగించాడు. ‘‘నాయనా చీకటి పడిపోతోందే. పుట్టింరోజు పండగయిపోతుంది’’ అన్నాడు జంకుతూ. గోపన్న తల వూచాడు. ఇంక రెండే రెండు వేణువులు మిగిలాయి. ఒకటి చూశాడు.

ఇదీ కాదు. ఇంకా ఒక్కటి మిగిలింది. ఇదేనా? ఉదయం నుండి వెతుకుతున్నది మంచిది కాక, కానందువల్ల ఈ గుట్టలో పడిపోయిందేమో. ఇప్పుడు మిగిలింది– ఒకప్పుడు పనికిరాదని తాను పడవేసిందేమో. చివరి మురళిని పరీక్షించడానికి ధైర్యం చాలలేదు. సత్యం తెలుసుకొని చనిపోగల శక్తి లేదు. 

‘‘ఇదే’’ అన్నాడు ధీమాగా.
‘‘చూడవా’’ అన్నాడు కుర్రాడు.
‘‘ఒద్దు. లగెత్తు. కిష్టయ్య చేతికియ్యి ఆయనే చూస్తాడు’’.

పాతిక సంవత్సరాల గాలివాన వెలిసింది. గోపన్న మేను వాల్చాడు. తాను పని ముగించాడా. భగవంతుడికి శ్రుతి శుద్ధమైన వేణువును పంపాడా. శ్రుతి శుద్ధంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు ఉందా? సరిచేసే శక్తి ఆయనకు లేదని తను అనుకొన్నాడా? గోపన్నకు నవ్వు వచ్చింది. పాతికేళ్ల పొరబాటు. ఒక జీవితం పొరబాటు. ఆయన అలుగుతాడా. అలగడు. వెర్రిగోపన్న అనుకుంటాడు. అనుకొని మురళిని తన పెదిమల దగ్గర ఉంచుకుంటాడు. శ్రుతులన్నీ దాచుకున్న బొజ్జలోంచి ఓంకారానికి మూలస్థానమైన నాభిలోంచి మంగళ గళంలోంచి మధురాధరాలలోంచి...

తన పక్కనున్న వేణువులోంచి సన్నటి స్వరం నెమ్మదిగా ఇవతలికి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. ఇంకో క్షణానికి ఆ పక్క మురళి, ఉత్తర క్షణార్థానికి ఇటుపక్క మురళి మేలుకున్నాయి. మరికొద్ది క్షణాలలో కుటీరంలోని సహస్ర వేణువులూ భువన మోహనంగా గానం చేయసాగాయి. అన్నిటిలోనూ కృష్ణుడి మోహన గానమే. అసత్యమైన వేణువు లేనేలేదు. భగవంతుడికి ఉపయోగపడని వేణువే లేదు. గోపన్న సహస్ర వేణునాద స్వరార్ణవంలో– సాక్షాన్మహా విష్ణువై తేలుతున్నాడు.

వేణుగానం ముగిసిన కొద్ది క్షణాలకు అంతకన్న మధురమైన అడుగుల సవ్వడి వినబడింది. తాను పంపిన మురళి మంచిదో కాదో చెప్తాడు. ఈ సత్యం ఇక తెలిసినా మానినా ఒకటే. అంతకన్న గొప్ప సత్యాన్ని దర్శించాడు గోపన్న. నెమ్మదిగా కళ్లు తెరిచాడు. గుమ్మంలో బాలకృష్ణుడు!

నువ్వే వచ్చావా కిష్టయ్యా అంటూ చేతులు జోడించాడు.

‘‘అయ్యా అయ్యా కిష్టయ్య నీ మురళి వాయించాడే. నాకు బువ్వలెట్టాడు. కానీ కిష్టయ్య ఎంత వాంచినా ఏమీ వినబడలే. అస్సలు పాట రాలేదే. కానీ కిష్టయ్య నన్నిక్కడ ముద్దెట్టు...’’

గోపన్న ఇంతసేపూ గానం చేసి అలసిపోయిన వేణువుల వంక ఆప్యాయంగా సగర్వంగా చూసి ఒకటి తీసి ముద్దుపెట్టుకున్నాడు.


ముళ్లపూడి వెంకటరమణ (1931–2011) ‘కానుక’ కథకు ఇది సంక్షిప్త రూపం. 1963లో ప్రచురితౖమైంది. పరిపూర్ణత కోసం పడే ఒక కళాకారుడి తపననూ, అదే సమయంలో భగవంతుడికి పరిపూర్ణంగా లొంగిపోయే భక్తినీ ఈ కథ చిత్రిస్తుంది. రమణ పాత్రికేయుడిగా పనిచేశారు. ‘బుడుగు’ సృష్టికర్త. హాస్యానికి పెట్టింది పేరు. సాక్షి, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, పెళ్లి పుస్తకం, మిష్టర్‌ పెళ్లాం వంటి సినిమాల రచయిత. రుణానందలహరి, గిరీశం లెక్చర్లు, రాజకీయ బేతాళ పంచవింశతి ఆయన రచనల్లో కొన్ని. కోతి కొమ్మచ్చి ఆయన ఆత్మకథ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement