గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! | Mullapudi Venkata Ramana Budugu Katha In Funday Magazine | Sakshi
Sakshi News home page

నా పేరు బుడుగు అయినా వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ?

Published Sun, Nov 14 2021 12:43 PM | Last Updated on Sun, Nov 14 2021 3:34 PM

Mullapudi Venkata Ramana Budugu Katha In Funday Magazine - Sakshi

పాపం ఈ పెద్దవాళ్లెపుడూ యింతే. ముందస్తుగా వాళ్ల మాట వినాలి అంటారు గదా. పోనీలే మనం అల్లరి చేస్తే అప్పుడు మన్ని రష్చించరు. మళ్లీ అల్లరి చెయ్యను.. అంటే చెయ్యి అంటారు. చేస్తానూ అంటే ఒద్దూ అంటారు. ఎప్పుడూ మనమే వాళ్ల మాట వినాలి అంటారు. ఒక్కసారేనా వాళ్లు మన మాట వినరు. అంతెందుకు.. యిప్పుడు పాపం బాఘా చిన్న పిల్లలుంటారా.. వాళ్లకి కుంచెం తెలుగు వస్తుంది చూడు.. అప్పుడేమో.. ఎవరూ లేకుండా కుంచెం మాటాడుతారు. యీ అమ్మా.. నాన్నా.. బామ్మ.. యిలాటివాళ్లు ఎలాగో వినేస్తారు. అప్పుడు పక్కింటి లావుపాటి పిన్నిగారూ.. వాళ్ల ముగుడూ అలాటి వాళ్లు మనింటికొస్తారు.. అప్పుడేమో ఈ పాపాయిని కూచోబెట్టి నీ పేరు చెప్పూ అంటారు. 

పాపం పాపాయికి బాఘా తెలుగురాదు గదా.. దానికి భయంవేసి చెప్పదు. అప్పుడేమో ఈ పెద్దవాళ్లందరూ చూట్టూ నించుని చెప్పుచెప్పు చెప్పూ అని కేకలు వేస్తారు గదా.. పాపాయికి కోపం వచ్చేస్తుంది. దాన్ని రష్చించడానికి నేను చెప్తాననుకో పేరు! వాళ్లు వినరుగా నన్ను కొఠేస్తారు. దాని పేరు అదే చెప్పాలిట. అది చెప్పదుగా మరి. అప్పుడు వాళ్లమ్మా నాన్న దాన్ని కొఠేస్తారు మొండి పిల్లా అని. వాళ్లకి మొండి పిల్ల అంటే అసలు అర్థం తెలీదు.

నాకు తెలుసనుకో. పక్కింటి లావుపాటి పిన్నిగారు ఒకసారి పేరంటానికెళ్లి వాళ్ల పాపను ఎత్తుకుంటుంది కదా.. అప్పుడు పాప చంక దిగనంటుంది కదా.. వాళ్లమ్మ పిలిచినా వాళ్లనాన్న, బామ్మ పిలిచినా రాను పో అంటుంది. ఆఖరికి ఇంకో పాపాయి వచ్చి ఉంగా భాషలో ఆలుకుందా వత్తావే అని పిలిచినా సరే లాను పో అంతుందే అదీ మొండి పిల్ల. 

ఏవిటో ఈ పెరపంచకంలో బోల్డుబోల్డు రకాల పిల్లలు. బోల్డురకాల పెద్ధవాళ్లు. అప్పుడప్పుడూ నేను హాచర్యపడి పోయేస్తుంటాను. 

బుడుగూ, మరేమోనేం మా అమ్మావాళ్లూ రోజూ నన్ను బళ్లోకి వెళ్లమంటున్నారు. లాపోతే కొట్టుతాను అంటున్నారు ఎలాగ? ముందస్తుగా నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వీడు నన్ను అనుమానం చేస్తున్నాడు కదా. నా పేరు బుడుగు అయినా వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ? అందుకే. అయినా వాడి ఖష్టాలు చూస్తే జాలి వేస్తోంది గదా మనకి. 
అసలు నీ చిన్నప్పటినించీ, మీ తాతయ్య చిన్నప్పటినించీ చిన్న పిల్లలు ఎప్పుడూ ఇలా కష్టపడుతూనే ఉన్నారు.

అందరు చిన్నపిల్లలినీ ఇలా బళ్లో పెట్టెయ్యడమే. పోనీ ఏదో ప్పదిరోజులికి ఒకసారి వెళ్లితే చాలదుట. రోఝూ వెళ్లాలిట. మళ్లీ యీ పెద్దవాళ్లందరూ చిన్నప్పుడు ఇలా కష్టపడినవాళ్లే. అయినా పెద్దయ్యాక ఇప్పుడు చిన్న చిన్న పిల్లలిని బళ్లో పెఠేస్తున్నారు. అంతెందుకులే.. పాపం నన్ను కూడా రేపో మూడ్రోజులుకో బళ్లోపెట్టాలని చూస్తున్నారు గదా. నన్నేం చెయ్యలేరనుకో. అయినా చిన్నవాళ్లూ బళ్లోకెళ్లకుండా ఉండడానికని కొన్ని సంగతులు చెప్తాను.

చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..

ఒకటి: జెరం వచ్చిందని చెప్పాలి. మనం చెప్తే నమ్మరుగదా.. అందికని యేం చెయ్యాలంటే ముందస్తుగా చొక్కా యిఫ్పేసుకోవాలి. అప్పుడేమో ఎండలో నిలబడాలి చాలాసేపు. అప్పుడు వీపు మీద .. పొట్ట మీద జెరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేసుకుని అమ్మ దగ్గిరికి వెళ్లాలి. అమ్మోయి జెరం జెరం గబగబా చూడూ.. బళ్లోకి వెళ్లద్దని చెప్పూ అని చెప్పాలన్నమాట. 



ఇంకోటి:  జెరం రాగానే పరిగేసుకు కెళ్లి చెప్పాలి తెలుసా.. లాపోతే జెరం చల్లారిపోతుంది. ఉంకోటి కూడాను.. ఇలాంటి దానికి అసలు బామ్మ మంచిది. బామ్మకి చెప్పేస్తే చాలు.. అప్పుడు అదే అమ్మకి చెప్తుంది. 

రెండు: కుంచెం మంది పిల్లలు కడుపునొప్పి అని అంటారు కాని అది మంచిదికాదులే. రెండుసార్లో.. ఫదిసార్లో అయాకా అమ్మావాళ్లూ కారప్పూసా పకోడీలు చేసుకుని మనకి పెట్టకుండా తినేస్తారు. యిప్పుడు లేదుగదే అమ్మా అని చెప్పినా సరే.. పెట్టరు. ఇప్పుడు లేకపోతే రేపోప్పదిరోలుకో వస్తుందిగా అందుకని వద్దూ అని అంటారు. అందుకని, తలనొప్పి అన్నింటికన్నా మంచిది. ముందస్తుగా అమ్మ నమ్మదు అనుకో. అయినా సరే మనం తలనొప్పి తలనొప్పి అని పదిసార్లో వందసార్లో చెబితే కుంచెం నమ్ముతారు. ఇది కూడా ముందస్తుగా బామ్మకే చెప్పాలి. అమ్మకి చెబితే లాబంలేదు. అసలు ఏం చేసినా లాబంలేదు. ఎలాగేనా బళ్లోకి వెళ్లాలిలే. అందుకని కుంచెం ఎలాగో చాలా కష్టపడి రోఝూ బళ్లోకే పోవడం మంచిది.

గబగబా గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా. అప్పుడు ఇంచక్కా ఎప్పుడూ బడి మానేయొచ్చు. యింకోటి.. మా బాబాయంత పెద్దవాళ్లు అయ్యాకా.. అసలు ఇంక బళ్లోకి వెళ్లద్దంటారులే. మా బాబాయి అంతేగా.. బళ్లోకి వెళ్తాను వెళ్తాను అంటాడు. బామ్మా, నాన్న..యింక చాల్లే, ఆఫీసుకి వెళ్లిపో అంటారు. అదన్నమాట. ఈ పెద్దవాళెపుడూ యింతే. మనం వెళ్తాం అంటే వద్దూ అని అంటారు. మనం వెళ్లను ఒద్దూ అంటే, వెళ్లూ వెళ్లూ బళ్లోకెళ్లూ బడి దొంగా  అంటారు యెలాగ?

ఇంకో ఉత్తరం చూడు.. వీడు కుంచెం పెద్ద కుర్రాడిలా వున్నాడు. వురేయ్‌ వురేయి బుడుగూ మలేమోన మా అమ్మా నాన్నా డబ్బులు అసలు ఈటంలేదూ ఎలాగరా మరీ అని రాశాడు గదా.. ఇది కూడా చాలా కష్టమే. అసలు డబ్బులు అంటే చాలామందికి చాలా యిష్టంట. నాక్కూడా కుంచెం యిష్టమేననుకో. కాని ఏం చేస్తాం. చిన్న పిల్లలికీ, కాలేజీకి వెళ్లే బాబాయిలకీ డబ్బులు చాలా యివ్వరు. అడిగినా సరే. కాని అబద్ధం చెప్తే చాలా డబ్బులు ఇస్తారుట. బాబాయి యిలాగే చేస్తాడుట. 

మళ్లీనేమో నాన్నకి అమ్మ డబ్బులు ఇవ్వదు కదా. ఎందుకూ అంటుంది. అప్పుడు నాన్న కుంచెం అబద్ధాలు చెప్పుతాడుట. చిన్న పిల్లలు మాత్తరం అబద్ధం చెప్పకూడదుట. చెప్పితే కొట్టుతారు. 

కాని మనం నిజెం చెప్పుతాను అంటూ కుంచెం మంది పెద్దవాళ్లు డబ్బులిస్తారులే. పక్కింటి లావుపాటి పిన్నిగారి ముగుడు లేడూ.. వాడేం.. బీడీలు కాలుస్తాడులే. బీడీలు కాలచడం అంటే తప్పు కదా ఊరికే జెటకా తోలడానికి దాచుకోవాలి అంతే. వాడు నిజెంగా కాలిచేస్తాడు గదా. పక్కింటి లావుపాటి పిన్నిగారు అతనికి చెప్పిందిలే వురేయ్‌ ముగుడూ అలా బీడీలు కాలచకూడదూ అని. అయినా వాడు మా యింటికి వచ్చి నాన్న దగ్గర కూచుని కాలుచుతాడు గదా.

అప్పుడేమో నేను వురేయ్‌ నీ సంగతి చెప్పుతా ఉండు అని అంటాను గదా. వాడు ఘబుకుని నన్ను ముద్దు పెఠేసుకుని ఓ కాణీయో ప్పదణాలో యిచ్చేసి చెప్పకమ్మా బుడుగు తప్పమ్మా ఒద్దమ్మా యిలాని ఏడుచుతాడు. అప్పుడు నేనేమో పోనీలే అని.. యేవండీ పక్కింటి లావుపాటి పిన్నిగారూ.. మరేమోనూ మీ ముగుడేమో మా నాన్నతో కలసి బీడీలు కాలచలేదండీ అని అబద్ధాలు చెపేస్తాను. ఏవిటో నేను యెప్పుడు ఇలా అందరినీ రష్చించుతానులే.  

- ముళ్లపూడి వెంకటరమణ

చదవండి: టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement