జూన్ 28న ముళ్లపూడి వెంకటరమణ జయంతి
కేవలం పదేళ్ల వ్యవధిలో గబగబా, చకచకా పత్రికారచనలో అనేకానేక తమాషాలు చేసేశారు ముళ్లపూడి వెంకటరమణ. రచనకు జవజీవాలిచ్చేది, రచయితని నాలుగు కాలాలపాటు బతికించేది తాను సృష్టించిన పాత్రలే. ఒక్కోసారి మహాకావ్యాలలో ఒక చిన్న పాత్ర తారలా మెరిసి పాఠకుల మనసుల్లో నిలిచిపోతుంది. తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యంలో ‘నిగమశర్మ అక్క’ అలాంటి ఒక తార.
రమణ సృష్టించిన పాత్రలన్నీ పాఠకులని అలరించాయి. మరీ ముఖ్యంగా బుడుగు. ఇంటింటివాడుగా నిలిచాడు. ప్రాణ దీపమున్న పాత్రలకి వయసు రాదు. అమృతం సేవించినట్టు అక్కడే ఆగిపోతాయి. కాని పాఠకులు పెరుగుతారు. వాళ్లు బుడుగుని స్కూలు రోజుల్లో చదివి మనసుకి హత్తుకున్నారు. ఆనక తండ్రిగా తమ బిడ్డల్లో బుడుగుని చూసుకుని మురిసిపోయారు. తాతత్వం వచ్చాక మనవడిలో, మనవరాలిలో మళ్లీ బుడుగే! బుడుగులకి జెండర్ లేదు. ఆడ బుడుగులు కూడా అలాగే పేల్తారు. బుడుగు అల్లరి చేస్తాడు. బామ్మని, బాబాయిని, రాధని, గోపాలాన్ని, ఇశనాథాన్ని సాధిస్తాడు, శోధిస్తాడు, వాదిస్తాడు. వాళ్లని తన దినచర్యలో కలుపుకుంటాడు. తన ధోరణిలో తను మాట్లాడతాడు. ఆ ధోరణిలోనే రమణ తన ముద్ర చూపారు. పెద్దవారు ప్రదర్శించే లౌక్యాలను బుడుగులో పెట్టి ఉతికి ఆరేశారు.
‘‘బుడుగేమీ ఒరిజినల్ కాదండీ, ఇటీజిన్ ఇంగ్లీష్’’ అంటూ తెలుగు మీరిన కొందరు ఎత్తిచూపారు. ఆ మాటకొస్తే కృతయుగంలో వామనుడిలో బుడుగాంశ లేదా? అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష... అంచేత నాలుగైదేళ్ల చలాకీ పిల్లలు ఏ భాషలో అయినా తగుల్తారు. బుడుగు పదహారున్నరణాల తెలుగుపిల్లాడిలా రమణ కలంలోంచి దిగి తిష్టవేశాడు. వయసు మీదపడుతున్నట్లయితే ఇది బుడుగు షష్టిపూర్తి సంవత్సరం! అంతకుముందు తెలుగు తల్లులు తమ పిల్లల బాల్యాన్ని, చిలిపి అల్లర్లను వినోదిస్తూ బాలకృష్ణుడితో పోల్చుకుని మురిసేవారు. బుడుగు రంగంలోకి దిగి బాలకృష్ణుణ్ని మరిపించాడు.
రాస్తూ రాస్తూనే, పదిమందీ బాగు బాగు అంటున్న తరుణంలోనే రమణ బుడుగుని ఆపేశారు. ‘‘ఎందుకండీ పాపం ఆపేసేశారండీ’’ అని బుడుగ్గాయిలెవరైనా అడిగితే, ‘‘ఎవరో ఏమిటా జట్కా భాషని గసిరారండీ, భయపడి ఆపేశానండీ’’ అని సవినయంగా చెప్పేవారు. పని చెయ్యదలచనప్పుడు సాకులు చెప్పడం రమణకు వెన్నతో పెట్టిన విద్య. ‘‘ఎక్కడ అందుకోవాలో కాదు, ఎక్కడ ఆపాలో కూడా తెలిసినవాడు మర్యాదపాత్రుడు’’ - అని ప్రాజ్ఞుడు అనుకుంటాడు. ఆచరిస్తాడు.
రమణ చేసిందదే. లేకపోతే, బారిష్టర్ పార్వతీశం రెండు మూడు భాగాల్లాగా, స్వీట్ హోమ్ పేరుకి తగ్గట్టే జీళ్ల పాకమైనట్టు, శ్రీమతి కాంతం జిడ్డులా వదలనట్టు, ...నట్టు, ...నట్టు బుడుగు కూడా బలైపోయేవాడు. అదృష్టవంతుడు, ఆపేయబడటంతో బతికిపోయాడు. ఒక మంచి పాత్ర దొరికినప్పుడు రచయితలు మార్కెటింగ్ మొదలు పెడతారు. అప్పుడు పాఠకులు కస్టమర్లయిపోతారు. అక్కడ కథ ముగుస్తుంది. ముగింపులో కూడా బుడుగు గడుసు, పెళుసు మాటల్ని వుటంకించక్కర్లేదు. చాలా మందికి చాలా జ్ఞాపకం ఉంటాయి. లేనివారికి ఇప్పుడు వస్తాయి. దటీజ్ బుడుగు! తెలుగు ముక్కల్తో ఆడాడు చెడుగుడు. రమణకి వాడు కీర్తి తొడుగు.
- శ్రీరమణ
బుడుగు వెంకటరమణ
Published Sun, Jun 28 2015 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement