
ఆనంద్ పనిచేసే కంపెనీకి రెండే రెండు బ్రాంచీలున్నాయి.. ఒకటి హైదరాబాద్‌లో, ఇంకొకటి విజయవాడలో. సొంత ఊరికి దగ్గరని పట్టుబట్టి విజయవాడ బ్రాంచీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. సొంత ఊరికి దగ్గరనే కాదు కానీ, నిజానికి హైదరాబాద్ అంటే ఆనంద్‌కు ఎందుకో పిచ్చి భయం. అది ఆనంద్‌కు సొంతంగా వచ్చింది కాదు. వాళ్ల నాన్న ఓసారి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రోడ్డుపైనే ఒక మర్డర్ చూశాడట. విజయవాడలో అలాంటివేం జరగక కాదు, కళ్లారా చూడటంతో ఎందుకో ఆయనకు హైదరాబాద్ అంటే భయం పట్టుకుంది. అందుకే ఏదో తప్పనిసరైతే తప్ప హైదరాబాద్‌కి వచ్చేవాడు కాదు. ఆనంద్‌ని పంపడమూ ఆయనకెప్పుడూ ఇష్టం లేదు.
కానీ ఈసారి తప్పక వెళ్లాల్సిందేనని నాన్నతో చెప్పాడు ఆనంద్. చేసేదేంలేక పంపించాడు. మనవాడేమో ఒట్టి అమాయకుడు.
హైదరాబాద్ బ్రాంచీకి వచ్చిన పని అయిపోయేసరికి రాత్రయ్యింది. ఇంత రాత్రి తిరిగి విజయవాడ వెళ్లడం సేఫా కాదా అని ఆలోచిస్తున్నాడు ఆనంద్. పైగా రాత్రుళ్లు ప్రయాణమంటే ఆనంద్‌కి చచ్చేంత భయం. చేతిలో ఆరు లక్షల రూపాయల డబ్బు ఉంది.
ఎలా వెళ్లాలి? పోనీ హైదరాబాద్‌లోనే ఉండిపోతే? ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. పక్కనే ఉన్న హోటల్లో దూరి టీ తాగుతూ ఆలోచిస్తున్నాడు.
సరిగ్గా అప్పుడే నాన్న నుంచి ఫోనొచ్చింది –
‘‘ఏరా, బస్సెక్కావా?’’ అని.
‘‘లేదు నాన్నా. ఇక్కడ పని వల్ల లేటైంది. మీకు తెలుసుగా, రాత్రుళ్ళు ప్రయాణం అంటే నాకు పడదని. నేను ఉదయాన్నే వస్తాను’’ అన్నాడు మెల్లగా.
‘‘వెధవ, ఏం భయమ్రా నీకు? అక్కడ ఎవరి దగ్గర ఉంటావు? దొంగలు ఉంటారు. ఇప్పుడేం చేద్దామని?’’
‘‘ఏదైనా హోటల్లో ఉంటా’’
‘‘హోటాల్లోనా? వద్దురా నాయనా. పోలీసులు వస్తారంట’’
‘‘నేను ఒక్కడినే ఉంటే పోలీసులు ఎందుకు వస్తారు నాన్నా? నన్నేం అంటారు?’’
‘‘నీ దగ్గర ఆఫీస్ డబ్బు ఉంది. కాబట్టి ఏదైనా చేస్తారేమో’’
‘‘అబ్బా నాన్నా. నేను ఏదో ఒకటి చేస్తా. కాసేపు ఆగి ఫోన్ చేస్తాలే’’ అని విసుగ్గా ఫోన్ పెట్టేశాడు ఆనంద్.
ఎవరితో మాట్లాడదామన్నా అందరూ హిందీలో మాట్లాడుతున్నారు. ఆనంద్‌కేమో హిందీ ఒక్క ముక్క అర్థం కాదు. ఎవరైనా ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడు.
అలా అనుకుంటుండగానే ఫేస్‌బుక్ మెసెంజర్‌లో బసవ అనే ఫ్రెండ్ దగ్గర్నుంచి ‘హాయ్’ అనే మెసేజ్ వచ్చింది. ఆనంద్ రిప్లై ఇచ్చాడు.
కాసేపట్లో ఆనంద్‌తో మాట కలిపి నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు బసవ.
‘‘హాయ్‌రా బుద్దిమంతుడా.. ఏం పని మీద వచ్చావు?’’ అని గంభీరమైన గొంతుతో ఎగతాళి చేస్తూ అడిగాడు బసవ.
‘‘చిన్న పని ఉంటే వచ్చా. లేటైంది. ఉదయన్నే వెళ్లిపోవాలి. చేతిలో డబ్బు ఉంది. ఎక్కడ ఉండాలో తెలియట్లేదు’’ అని కాస్త కంగారుగా చెప్పాడు ఆనంద్.
‘‘ఓ ఇంతేనా. సరే నువ్వు ఉన్న లోకేషన్ పంపు నేను వస్తా. మా రూమ్‌లో పడుకుని ఉదయాన్నే వెళ్లిపోదువు’’
తప్పని పరిస్థితుల్లో ఆనంద్ సరే అన్నాడు.
ఇంతలో ఆనంద్‌కు వాళ్ల నాన్న దగ్గర్నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది.
‘‘ఏమైందిరా ? ఎట్లా వస్తావు ?’’
‘‘అయ్యో నాన్నా, మీరు నన్ను కంగారు పెట్టకండి. నా టెన్త్ ఫ్రెండ్ బసవ ఇక్కడే ఉంటున్నాడంటా. వాడి రూమ్‌లో ఉండి ఉదయన్నే వస్తా’’
‘‘నీకు మైండ్ పని చేస్తుందా? అసలే వాడు చిన్నప్పుడు పెద్ద దొంగ. ఓసారి మన తోటలో పండ్లు దొంగతనం చేశాడని తిడితే నన్ను రాయి తీసుకుని కొట్టాడు మర్చిపోయావా? నువ్వు పోయి పోయి వాడి దగ్గరే ఉంటున్నావా? వాడు చిన్నప్పుడే అలా ఉంటే ఇంక హైదరాబాద్‌లో ఎంత పెద్ద రౌడీ అయ్యి ఉంటాడు! వద్దురా బాబు, వాడి దగ్గర అస్సలు ఉండకు’’ ఆనంద్ తండ్రి భయం భయంగా చెప్పాడు.
ఆనంద్‌కి వాళ్ల నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చి చెమటలు పట్టాయి. ఇంతలో వెనకాల నుంచి ఓ బైక్ శబ్దం వినిపించింది. వచ్చింది బసవే. ఆనంద్ ఫోన్ కట్ చేశాడు.
బసవ బైక్ దిగి ఆనంద్‌కు దగ్గరగా వచ్చి హత్తుకుని ‘‘ఎలా ఉన్నావురా?’’ అని అడిగాడు. ఆనంద్ తల ఊపుతూ ‘‘ఈ టైంలో నాకు ఎందుకు మెసేజ్ చేయాలనిపించింది?’’ అమాయకంగా అడిగాడు.
‘‘అరేయ్, ఫేస్‌బుక్ లో ‘నియర్ బై’ అని చూపించింది. అరె ఆనంద్‌గాడు హైదరాబాద్‌లో ఉన్నాడా అనుకొని మెసేజ్ చేశా. అయినా ఏమైంద్రా, చెమటలు పడుతున్నాయి. సరే ముందైతే రూమ్‌లో ఫ్రెషప్ అయి ఏదైనా తిని పడుకుందువు. ఆ బ్యాగ్ నాకు ఇవ్వు, ముందు పెట్టుకుంటాను’’ అని బసవ నెమ్మదిగా మాట్లాడాడు.
‘‘పర్లేదురా, నేను వేసుకుంటాను’’ అన్నాడు ఆనంద్ అయోమయంగానే.
బసవ రూమ్ వచ్చింది.
ఆనంద్ ఒంట్లో ఇంకా భయం తగ్గలేదు.
ఉదయం నుంచి ఆఫీస్ పని మీదా ఆటు ఇటు తిరిగి బాగా అలిసిపోయాడు.
ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. రూమంతా నీటుగా ఉంది. అలా సోఫాలో కూర్చున్నాడు ఆనంద్.
ఇంతలో బసవకు ఫోన్ వచ్చింది. పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు.
‘‘నువ్వు నన్ను చంపడం కాదే. నేను తల్చుకుంటే నిన్ను చంపిపడేస్తా. నా గురించి నీకు తెలియదు’’ అంటూ అరుస్తున్నాడు.
ఈ ఆరుపులు వినేసరికి ఆనంద్‌కు భయం ఎక్కువైంది. వాళ్ల నాన్న ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆనంద్ లిఫ్ట్ చేద్దాం అనుకునేలోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంతలో బసవ వచ్చాడు.
‘‘ఏమైంది బసవా? ఎందుకు అలా అరుస్తున్నావు? చంపుతా అంటున్నావు?’’ అని భయంగా అడిగాడు ఆనంద్.
బసవ తన గర్ల్ ఫ్రెండ్ షాలిని ఫోటో చూపిస్తూ ‘‘దీన్ని చంపాలన్నంత కోపం తెప్పిస్తోంది.ఏదో ఒక రోజు దాని సంగతి ఖతం అవుతుందిలే కానీ, నువ్వు ఫ్రెషప్ అయి ఉండు, ఏదైనా తినడానికి పట్టుకొస్తా’’ అని లేచాడు బసవ.
‘‘లేదులే, నాకు ఆకలిగా లేదు. నాకేం వద్దు ఇప్పుడు’’ అన్నాడు ఆనంద్ భయంగానే.
‘‘అర్రె, రూమ్‌కి వచ్చి తినకుండా ఎలా ఉంటావు? తీసుకొస్తానుండు. హైదరాబాద్‌లో ఏ టైంలో అయినా ఫుడ్ దొరుకుతుంది’’
‘‘ఇంత నైట్ ఎందుకులే బసవ. నువ్వు కూడా రెస్ట్ తీసుకో. రేపు మార్నింగ్ తింటా’’
‘‘లేదు మామా నువ్విప్పుడు తినాల్సిందే. నేను వెంటనే వస్తా. నువ్వు కాసేపు అలా పడుకో, వచ్చి లేపుతా’’ అని బసవ బయటకు వెళ్లాడు.
పారిపోదామని ఆనంద్ డోర్ దగ్గరకు వెళ్లాడు. కానీ బసవ బయట్నించి లాక్ చేసుకుని వెళ్లిపోయాడు. ఆనంద్ కంగారుగా అటు ఇటు తిరిగాడు. ఫోన్ చార్జింగ్ పెట్టి..తల కింద డబ్బులు ఉన్న బ్యాగ్ పెట్టుకుని సోఫాలో నడుము ఒంపి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.
∙∙
అర్ధరాత్రి ఏదో శబ్దం వినిపించి ఆనంద్ వెంటనే లేచి చూశాడు. ఏదో భయంకరమైన ఏడుపు వినిపించింది. ముందు తన బ్యాగ్ ఉందా లేదా అని చూసుకున్నాడు. ఫోన్ దగ్గరకు వెళ్లాడు. చార్జింగ్ పెట్టాడు కానీ స్విచ్ వేయలేదు. ఫోన్ జెబులో పెట్టుకుని డోర్ దగ్గరకు వెళ్తుండగా పక్క రూమ్‌లో బసవ గట్టిగా ఏడుస్తూ కనిపించాడు.
ఆనంద్ ఒళ్ళు వణికింది.
నెమ్మదిగా ముందుకు వెళ్తూ.. ‘‘బసవ.. బసవ.. ఏమైంద్రా, ఎందుకు ఏడుస్తున్నావ్?’’ అని అడిగాడు.
‘‘తప్పు చేశాను మామా. చాలా పెద్ద తప్పు చేశాను’’ అంటూ ఆనంద్ వైపు తిరిగాడు బసవ.
బసవ ముఖం చూడగానే ఆనంద్‌కు గుండె ఆగినంత పనైంది. వెన్నులో వణుకు పుట్టింది. కాళ్లు చేతులు గజగజ వణుకుతున్నాయి.
‘‘ఏమైంది బసవా? ముఖానికి ఆ రక్తం ఏంటి?’’
‘‘షాలినిని చంపేశానురా’’ అని మళ్లీ ఏడ్చాడు.
ఆనంద్‌కు బసవ ఏమంటున్నాడో అర్థం కాలేదు. గజగజ వణుకుతూ.. ‘‘ఎందుకు చంపావురా?’’ అని ఓ అడుగు వెనక్కి వేస్తూ అడిగాడు.
కాస్త ముందుకు నడిచిన బసవ.. గోడకు తలను గట్టిగా కొట్టుకున్నాడు. జేబులో ఉన్న సిగరెట్ బయటకు తీశాడు. సిగరెట్ కాల్చుతూ.. ‘‘నీకు ఫుడ్ తీసుకొచ్చేందుకు వెళ్లాను కదా. అప్పుడు షాలిని ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మని పిలిచింది. ఏమైందో అని వెళ్లా. వెళ్లగానే బయటకు వచ్చి, ‘గొడవ పడ్డాను కదా, బాధగా అనిపించి నిన్ను చూడాలి అనిపించింది, అందుకే పిలిచా’ అని చెప్పింది. అసలే నీకు ఆకలి అవుతుంది. నీకోసం నేను చాలా చోట్ల వెతికితే ఓ దగ్గర ఫుడ్ దొరికింది. ‘సరేలే చూశావు కదా, ఇక నేను వెళ్తా’ అని చెప్పా షాలినికి. ‘కాసేపు ఉండు, కాసేపు ఉండు’ అని అర్ధగంట ఉంచింది. ‘‘ఫుడ్ చల్లారిపోతుంది. రూమ్‌లో నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఆకలిగా ఉంది, వెళ్తా’’ అని చెప్పా. ‘ఏంటి, ఊరికే ఫ్రెండ్ ఫ్రెండ్ అని. ఒక్కరోజు తినకుంటే చస్తాడా’ అని నా చేతిలో ఉన్న ఫుడ్ విసిరికొట్టింది. నాకు బీపీ పెరిగి తలమీద ఒక్కటిచ్చా. సరిగ్గా పక్కనే ఉన్న రాయిపై బలంగా పడింది. తలకు గట్టిగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే చనిపోయింది’ అని చెబుతూ గట్టిగా ఏడ్చాడు బసవ.
బసవ చెప్పింది విన్నాక ‘ఎందుకు వచ్చానురా నాయనా, ఇక్కడికి రాకుండా ఉండాల్సింది, వచ్చి పెద్ద సమస్యలో ఇరుక్కున్నా’ అనుకుంటూ.. ‘‘ఇప్పుడు ఏం చేస్తావురా?’’ అని అదే సన్నటి గొంతుతో వణుకుతూ అడిగాడు ఆనంద్.
‘‘అదే, ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ అన్నాడు బసవ.
‘‘మరి షాలిని శవం ఎక్కడ ఉంది?’’
‘‘అక్కడ ఓ ఆటో అతను చూశాడు. అతని ఆటోలోనే తీసుకొచ్చి రూమ్ వెనకాల తొవ్వి అందులో పాతి పెట్టాను’’
‘‘వామ్మో.. వామ్మో.. మా నాన్న ముందే చెప్పాడు. నీ దగ్గరికి వెళ్లొద్దని. నేనే అనవసరంగా వచ్చా. ఎందుకు చేశావురా నాకు మేసేజ్? నీను వెళ్లిపోతా.... దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. వెళ్లిపోతా’’ అని ఆనంద్ భయం భయంగా ముందుకు కదిలాడు.
‘‘అర్రె, ఎక్కడికిరా వెళ్లేది? ఇదంతా చేసింది నీకోసమే’’
‘‘ఏంటి నా కోసమా?’’
‘‘నువ్వు రావడం వల్ల నేను ఫుడ్ కోసం బయటికి వెళ్లా. బయటికి వెళ్లా కాబట్టి షాలిని దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నీకోసం తెస్తున్న ఫుడ్ తను కింద పడేసింది కాబట్టే షాలినిని కొట్టా. అదే నువ్వు రాకుండా ఉంటే నేను బయటకు వెళ్లేవాడినే కాదు. ఇదంతా జరిగేది కాదు. సో, ఇదంతా చేసింది నీకోసమే కదరా?’’
‘‘నీకో దండంరా నాయనా. మా నాన్నకు తెలిస్తే తట్టుకోలేడు. ప్లీజ్ నన్ను వదిలెయ్’’
‘‘నిన్ను వదిలేసి రేపు పోలీసులు వస్తే నేను ఒక్కడినే జైలుకి పోవాలా?’’
‘‘అంటే నేను కూడా జైలుకు వెళ్తానా?’’
‘‘నీకోసమే చేశాను కాబట్టి నువ్వు కూడా వెళ్తావు’’
‘‘నీకు దండం పెడుతా. నన్ను ఇందులో ఇరికించకు. నన్ను వదిలెయ్ ప్లీజ్’’
‘‘సరే, ఇందులో ఇద్దరం ఇరుక్కోకుండా ఉండాలంటే నువ్వు ఓ చిన్న పని చేయాలి. నీ బ్యాగ్‌లో ఉన్న ఆరు లక్షలు ఆ ఆటో వాడికి ఇస్తే వాడు ఎక్కడా నోరు విప్పడు. సో... షాలిని గురించి సమస్య రాదు. ఇక తనకి ఎవ్వరూ లేరు. ఫ్రెండ్స్ అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా. ఓ వారం తర్వాత ఈ ఊరు వదిలి నేను వెళ్లిపోతా. నువ్వు ఎలాగూ మీ ఊరికి వెళ్లిపోతావు. తర్వాత ఇక పోలీసులు కనిపెట్టినా నేను వాళ్లకు దొరకను’’ అన్నాడు బసవ ధీమాగా.
‘‘ఒకవేళ నువ్వు దొరికి నా పేరు చెబితే ? అయినా ఈ డబ్బు ఆఫీస్‌ది, నేను ఇవ్వలేను’’
‘‘దుబాయ్‌లో నా ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడికి వెళ్లిపోతా. ఇక డబ్బు ఈ టైమ్‌లో నువ్వు ఇవ్వకుంటే నిన్ను కూడా చంపి ఆ డబ్బు తీసుకుంటా. సో, నువ్వు మర్యాదగా ఇస్తే మీ ఊరికి వెళ్లిపోతావు. లేదంటే నా చేతిలో చస్తావు. అది కూడా జరగకుంటే జైల్లో ఉంటావు. నాకు ఎలాగో ఈ గొడవలు, జైలు అలవాటే’’ అన్నాడు బసవ బెదిరిస్తున్నట్టే.
‘‘వామ్మో, లేదు లేదు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. నన్ను వదిలెయ్’’
‘‘సరే, ఉదయం ఆరుగంటలకు నిన్ను లేపుతా. నువ్వు వెళ్లిపో. ఇక్కడ జరిగింది ఎవ్వరికీ చెప్పకు. ఎవరికైనా చెప్పావో, అప్పుడు నిన్ను కూడా చంపాల్సి వస్తుంది. జాగ్రత్త’’ గట్టిగా బెదిరించాడు బసవ.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూ అలానే ఆ సోఫాలో ముడ్చుకుని పడుకున్నాడు ఆనంద్.
∙∙
‘ప్రియురాలిని మర్డర్ చేసిన ప్రియుడు...అతనికి సాయం చేసిన స్నేహితుడు. వాళ్లను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు’
టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ శబ్దం ఆనంద్ చెవిలో పడింది.
వెంటనే లేచి.. ‘షాలినిని చంపింది నేను కాదు, నేను కాదు. చంపింది బసవ. నా దగ్గర ఉన్న ఆరు లక్షలు కూడా తీసుకున్నాడు’ అని గట్టిగా అరిచాడు ఆనంద్.
ఆనంద్ అరుపులకు వంట గది నుంచి బసవ, షాలిని బయటకు వచ్చారు. వాళ్ళను చూశాక ఆనంద్‌కి తల తిరిగింది.
బ్యాగ్ ఉందో లేదో చూశాడు. ఉంది. డబ్బులు కూడా అలాగే ఉన్నాయి.
ఆనంద్ భయపడుతూ.. ‘షాలిని, నువ్వు చనిపోలేదా?’ అనడిగాడు.
‘‘ఆనంద్, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు. షాలిని చనిపోవడం ఏంటి?’’ అని బసవ కాస్త నెమ్మదిగా ఆడిగాడు.
కాసేపు ఆలోచించిన ఆనంద్..తాను కల కన్నానని మతికి తెచ్చుకుని నైట్ తన కల్లోకి వచ్చిందంతా బసవకు చెప్పాడు.
అది విని బసవ, షాలిని తెగ నవ్వుకున్నారు. షాలిని అయితే కిందపడీ మరీ నవ్వేసింది.
‘‘అది కాదురా, నువ్వు చిన్నప్పుడే అలా ఉంటే ఇప్పుడు ఇంకా రౌడీ అయ్యి ఉంటావని మా నాన్న నా తల తిన్నాడు. నేను ఆ భయంతోనే పడుకున్నా. అందుకే ఇలాంటి కల వచ్చిందేమో’’ అన్నాడు ఆనంద్.
‘‘ఒరెయ్ చిన్నప్పుడు జరిగిన దాన్ని మనసులో పెట్టుకుంటే ఎలా? నేను ఇప్పుడు చాలా బుద్దిగా ఉంటున్నా. నైట్ పుడ్ దొరకలేదు. ఇక నిన్ను లేపడం ఎందుకని నేను అలానే పడుకున్నా. నీకు షాలినిని పరిచయం చేద్దామని ఉదయాన్నే పిలిపించా. నేనే నీకు షాక్ ఇద్దామంటే, నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు’’ అని మళ్లీ అందరూ గట్టిగా నవ్వుకున్నారు. -రమేశ్ రాపోలు
Comments
Please login to add a commentAdd a comment