కథ: కొత్త బట్టలు.. | Funday: Surendra Seelam Telugu Story Kotha Battalu | Sakshi
Sakshi News home page

కథ: కొత్త బట్టలు.. మా యమ్మ ఫోన్‌ సేసి అడిగినప్పుడ్నుంచి ఏడుచ్చా పనుకున్యా!

Published Sun, Aug 21 2022 10:51 AM | Last Updated on Tue, Aug 23 2022 12:41 PM

Funday: Surendra Seelam Telugu Story Kotha Battalu - Sakshi

‘అంగీ గుడ్డలు, పంచలు, టువాళ్ళు, టౌజర్లమ్మో’అని అరుసుకుంటా సైకిలు మీంద వెంకటయ్య పోతాంటే బండకాడ కూచున్య మాయమ్మ కాడికి ఉరుకుతా పోయిన. మాయమ్మ కూరగాయల రమణమ్మతో ఊళ్ళో  రాజకీయాలు మాట్టాడ్తంది. 

‘మోవ్‌.. మోవ్‌..’అని పిలుచ్చున్యా ఇనపడకుంది మా యమ్మకు. వెంకటయ్య కాపొల్ల ఇంటికెళ్ళి అరుసుకుంటా పోయా. రవణమ్మకాడికి బాయికాడి ౠమ్మొచ్చి కూచుండ్య. మాయమ్మ ఆమె దిక్కు సూసి మొఖమంతా కారంసేసుకొని ‘సెప్పురా ఏం కొంపలు మునిగిపోయి సచ్చనాయి, సీత్వ కొట్టుకున్నట్టు కొట్టుకుంటనావు’ అని కొట్టుకునా నా కాడికొచ్చి.

ఆ ౠమ్మమీదండే  కోపం  నా మీంద పడే. వాళ్ళిద్దరి సంగతి అలివికాదులే అనుకొని ‘మా...  మా ... వెంకటయ్య తాత కాపోల్ల ఇంటికి దిక్కు పోయినాడుమా బట్టలేసుకొని’ అని అన్య. 

‘ఆ పోతాడు వానికేమి మచ్చుగా పోతాడు పా’ అని ముందుకు దొబ్బే నన్ను. 
‘ఎప్పుడూ ఉగాది పండక్కి బట్టలు కొనిచ్చావ్గా ఇప్పుడేం!’ అని మంకు పట్టు పట్టినా. 

‘లెక్క ఉండి సావగూడదు ఊరికే వచ్చయా బట్టలు? ఈసారి ఏం లేవు పా, నీకు మీ నాయనకు తిన్నీకి ల్యాకున్య సోకులకేం కొదవలేదు’ అనేసరికి కళ్ళలో నీళ్ళు సేరె. పెద్ద దెయ్యం మాదిరి మా యమ్మ, ఇంటికెళ్ళి నడుసుకుంటా పోయా. ఉగాది పండక్కు నాలుగు రోజులు గూడ లేవ్, ఇప్పుడు కొనుక్కుని మద్దిలేటికి ఇయ్యకపోతే వానక్క.. వాడు పండగ రోజుగాని ఇయ్యడు.

పండగ టైమ్లో వాంది పెద్ద బిల్డప్లే నా కొడుకుది అనుకుని యింటికెళ్ళి పోతాంటే మా సుధీర్‌ గాడు ఎదురొచ్చె. వాళ్ళమ్మ జమ్మలమడుక్కు రెడిమేడ్‌ బట్టలు తీసుకరానికి పొయ్యిందంటా అని సెప్పేసరికి కడుపులో మంట లేశా. ఉగాది రోజు కొత్త బట్టలు ఏసుకోకుంటే అది పండగ లెక్కేకాదు.  మా ఊళ్ళో పండగంటే  ఉగాది పండగేలే. ఆ రోజు మారెమ్మ దేళం ఉంటాది.. నా సామీరంగ ఊరంతా ఆన్నే ఉంటాది. 

ఊళ్ళో సున్నం తగలని ఇల్లు ఉండదు. సాయంత్రం ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు ఏట్లో కడుక్కొచ్చి, యాపమాను  మండలు కట్టి,  ఎర్రమన్ను పూసి, సున్నం బొట్లు పెట్టి  మారెమ్మ దేళం సుట్టూరా కేకలు ఏసుకుంటా బల్లు  తిప్పుతాంటే.. ఏం ఉంటాది పానం పోయిన లెక్కల్యాప్పడు. 

మాయబ్బ ఎద్దులు బో ఉరుకుతాయిలే ఆ పొద్దు. దాళ్ళ ముందర రెడ్డిగారి ముస్లి ట్రాక్టర్‌ కూడా సాల్దు. మంది లెక్కంతా కూడబెట్టి ఉగాదికి బట్టలు కొనుక్కుని మారెమ్మ దేళం కాడికి వచ్చారు.  కబడ్డీ ఆటలు, కోకో దుమ్ములో మునిగిపోద్ది మారెమ్మ దేళం. రెండు కళ్ళు సాలవు ఆతల్లిని సూన్నీకి.

అట్టాడ్ది ఆపొద్దు కొత్త బట్టలు వేసుకోకుంటే ఎట్టుంటాది! దానికన్నా సగం శనగ మాత్ర మింగిసచ్చే మేలు. సున్నం కొట్టే దాంతో ఉగాది పండగ వారం రోజులు ముందే ఊళ్ళోకి దిగుతాది. పది రోజులు నుంచి సూచ్చన.. బట్టలు ఊసే ఎత్తట్లేదు మాయమ్మ. ఇంగ కాదని నేనే రంగంలోకి దిగిన.

మాయన్న నంగి నా కొడుకు నేను ఎట్టా అడుగుతానని మెల్లగాకుండా ఉంటాడు సెవిటి నాకొడుకు. ఇంట్లో మాయమ్మ సున్నం ఉడకేచ్చంది. కుత కుతమనని అరుచ్చంది కుండ. మా నాయన వార్తలు సూచ్చనాడు. మా యమ్మకు ఊర్లో యవ్వారాలు, మా నాయనకి దేశం యవ్వారాలు.  మాయన్నగాడు ప్యాడకాసులు ఎత్తుతనాడు గాడిపాట్లో.  
వంకర మూతితో ‘మోవ్‌ మోవ్‌ బట్టలు మా, నాలుగురోజులు కూడా లేవు మా, వెంకటయ్య తాత పోతాడు మా’ అన్యా.

‘ఇట్నే అరుచ్చాంటే సున్నం కుండలో ౠడ్చ నాకొడక నిన్ను! పుట్టించినోడు ఆడ ఉండాడు సూడు.. పోయి అడుగుపో’ అని మా నాయన దిక్కు సూపిచ్చింది. 
మా నాయనను అడిగేదానికన్నా రగ్గుకప్పుకొని పనుకునేది మేలు.  మాయన్న గాని దగ్గరికిపోయి ‘రేయి నువ్వు అడుగురా నాయనని’ అని అడిగితే.. ‘నాకు బట్టలు వద్దు ఆ మనిషి సేత్తో తల్లు వద్దు. నువ్వే అడుగుపో’ అని ప్యాడ గంప ఎత్తుకొని దిబ్బకుపోతన్య మాయన్నను ఎగిచ్చి తందామనుకున్య.

వెంకటయ్య తాత బట్టలు బట్టలు అని అరుసుకుంటా హరివరం పోయినాడు. రాత్రంతా ఏడుపు మొఖంతోనే పనుకున్యా. బువ్వ గూడ తిన్ల్యా. తినకుంటామాన్లే లెక్క ల్యాకుంటే యానుంచి త్యావాల. 

ఆడ అప్పు పుచ్చిపోతుంది. శనగలన్నీ వాని దుంప తెంచుతున్నాం. గాడిద పని సేచ్చన్య ఇల్లు గడవకుంది అని కళ్ళు వొత్తుకునా మా యమ్మ.  బట్టలు ఉండవని తెల్సి నా పానం గిలగిల తన్నుకుంది మంచంలో. పొద్దున బడికి పొతున్యప్పుడు మా యమ్మని సతాయిచ్చా కూచ్చున్య.

మా నాయన బువ్వ తింటా కాలెత్తుకొని మీదకొచ్చినాడు ‘మర్యాదగా బడికిపో ల్యాకుంటే ఈపు పగుల్తాది. పిల్లోనివా ఏమన్నా ఏడోతరగతి సదవుతున్నావ్‌? ఇంగా బట్టలు అంటావే లేసిపో నాకొడకా’ అన్యాడు. సేసేది ఏం ల్యాక సునీల్‌గాని కోసం సైకిల్‌ పట్టుకొని బడికాడ నిలబన్య ఎంతసేపటికి రాకపోయా నా కొడుకు. 

బాబాగాడు వచ్య రొంచేపటికి. ‘రేయి వాడు రాడంట. బట్టలు కొనుక్కొనికి టౌన్కూ పోతానడంట మనం పోదాంపా’ అని లాక్కొనిపోయా నా మనసేమో సునీల్‌గాని బట్టల మాటల మద్య ఇరుక్కొనిపోయ. బళ్ళోంతా బట్టల మీదే ధ్యాస. ఉగాది పండగ కళ్ళు ముందర తిరుగుతాంది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి మా ఇల్లు సున్నం పూతతో కొత్తగా ఉంది.  

పుంజు కోడికి జొన్నలు పెడ్తా నీళ్ళు అందుకోమనే మా నాయన. మా యమ్మ పొయ్యి కాడ కూచ్చోని ‘ఏమే.. రెండు కేజీలన్నా పడ్తాదా?’ అని అడిగా. దానికి ఈ మోగొడు ‘ఏంది రెండు కేజీలే తిక్కదాన, మూడు కేజీలు పైన పడ్తాది’ అని ఇకారాలు పోతాంటే కోపం మా యేరు పొంగుతున్నట్టు పొంగ్య నాలో.

నీళ్ళు తీసుకొని ఇచ్చిన. ఏందో మా యమ్మ.. రొంచేపు నాయన్ను  తిడ్తాది, రొంచేపు ఆ మనిషితో బా ఉంటాది ఈ ఎర్రిది అనుకున్యా. బడికానుంచి వచ్చినాక బయటికి కూడా పోల. సునీల్‌గాడు బట్టలు తెచ్చుకొంటాడు. మా యమ్మ సుట్టురే ముండ మొఖం ఏసుకొని తిరుగుతనే ఉన్యా. మా యమ్మను బొ తిట్టుకున్యాలే ఆ పొద్దు. 

రెండు రోజులు గడిచిపోయినాయి. ఉగాది పండగ ఆనుకొని వచ్చింది. బడికి పొతనా వచ్చనా అంతే, మాయమ్మతో మాట్లాడి రెండు రోజులు అయింది. బట్టలు కొంటేనే మాట్టాడ్తాని సెప్పిన. రెండుసార్లు మాట్టాడించింది. నేను మాటల్యా. నాది  మాట అంటే మాటే. దాంట్లో  మా కర్రెబ్బ కంటే మొండి నా కొడుకుని. ఎప్పుడూ మా యబ్బ పేరుతో తిడ్తాంటాది మాయమ్మ.

రేపు ఆదివారం, వచ్చే సోమవారం పండగని, దీనంగా సూసిన దాని గుండెలో మాత్రం జాలి ఊట దిగలా. సచ్చే సావని అన్నట్టుంది. నా బట్టల ఆశ ఏటికాడ గోరిలలో కలిసిపోయింది. పండగ రోజు బయటికి పోగూడదని, సంకలో ఉల్లిగడ్డ పెట్టుకొని జెరం వచ్చిందని సేప్దామనుకున్యా అందరికీ ఇంగా.  
∙∙ 
పొద్దున ఆరుగంటలకి నిద్రలేపింది మాయమ్మ. ‘బట్టలకు నేను, తిరుపాలమ్మక్క పొద్దుటూర్కూ పోతానం ఉప్పుపిండి సేసిన, మధ్యానం మీ నాయనకి ఉండిచ్చి తినండి’ అని నెత్తి మీద ముద్దు పెడితే మాయమ్మ మీద ఒట్టు కళ్ళలో గిర్రున తిరిగా నీళ్ళు.

సాదా సీర కట్టుకుని మారెమ్మ పొతునట్టు కనిపించింది మాయమ్మ. ఆమె దిక్కు సూచ్చా మంచంలో కూచ్చున్యా. మా నాయన బరుగోళ్ళు తోలుకొని పోయినాడు. పొద్దుటూర్‌ బట్టలు ఏసుకుంటునా అని గుండె జెజ్జినక్కతొక్కుతుంది. అందరికి సెప్పనీకి  తనకలాడ్తాంది. సుధీర్గానీ యింటికాడికి దొమ్మలు ఇడుసుకొని పోయిన.

ఊరంతా తిరుగుతా ఏటికాడ సైటి మీంద పనుకొని, ఎట్టాటి బట్టలు తెచ్చాదో ఈ తిక్కది నన్ను గూడా పిలుసుకొని పోయింటే బాగుండని మా యమ్మను తలుసుకున్యా. నాలుగు సార్లన్నా మాయమ్మకి ఎక్కిళ్ళు వచ్చింటాయి నా దెబ్బకి.  ఏటవతలుంచి బరగోళ్ళు ఇంటిదావ పట్టినాయి. మధ్యానం అయితాంది. సాయంత్రం కోసం ఎదురుసూచ్చన. 

బువ్వ కూడా కావట్లేదు నాకు ఆ పొద్దు, పొట్ట నిండా తిని తేపుకుంటా వచ్చా మా దచ్చగిరి మామ ‘రేయి సిన్నోడా.. మీ నాయన ఎతుకుతనాడ్రా  మీకోసం. పెద్దోడు యాడుండాడు’ అని అడిగా.

‘వాడు క్రికెట్‌ ఆన్నీకి పోయినాడు.  ఏమంటా మామ?’అని అరుగు దిగిన.  
‘ఏమోరా శాంచేపు నుంచి ఎతుకుతనాడు పో’ అని టువాలు పరిచి పనుకున్యాడు దచ్చగిరి మామ. 

ఎండ వాంచుతుంది. ఇంటికి పోయేసరికి పొయ్యి కాడ అన్నం వండుతున్నాడు మా నాయన. నన్ను సూసి ‘వాడు యాడికి పోయినాడు’ అని అడిగా. ఇంట్లో ఉప్పుపిండి సర్వ కింద పడింది. బియ్యంనూకలు సెల్లాసెదురు అయినాయి. మా నాయన నా వెనకమాన్లే వచ్చి వాకిలేసి కొట్టా నా కొడకల్లారా ఇంట్లో ఉండకుండా యాడికి సచ్చినార్రా?

వాకిలి వేయకుండా పోయినారు. కుక్క అంతా అల్లకొల్లలం సేసిందని సేతికి యాది దొరికితే దాంతో కొట్టినాడు. మా జేజి వచ్చి అడ్డుపన్యా ఆగల. కుక్కను కొట్టినట్టు కొట్టినాడు. మాయన్న గాడు తప్పించుకొని, మా జేజి కాడ దాపెట్టుకున్యాడు. ఓంకెలు పెట్టి ఏడుచున్య ఇసిపెట్టల మా నాయన. కుక్క మీద జాలేసింది. అప్పడుగాని అది దొరికింటే సచ్చేది మా నాయన సేతిలో, ఒళ్ళు హూనం అయిపొయింది.

మంచం కింద దాసిపెట్టుకున్య. ఏడుచ్చా, అట్నే పనుకున్యా. మా అమ్మ వచ్చేదాకా తెలియదు రాత్రి అయిందని. వాతలు పడి పొంగింది నడ్డీపు. మంచం ఎత్తి దగ్గరకు తీసుకుంది మాయమ్మ. దెబ్బలకు పై అంతా కాల్తాంది. మాయన్న బరగోళ్ల సంబం కాడ ఆనుకొని సూచ్చనాడు. మసక మసక కనపడ్తనాడు. 
‘నీ తలపండు పగల, యెయ్యాలప్పుడు పుట్టించుకుందే మీయమ్మ. నీ సేతులకు ధూమ్‌ తగల, ఇట్టనా పిల్లోని కొట్టేది పై సూడు ఎట్టా కాల్తాన్దో’ అని బొల బొలా ఎడ్సా మాయమ్మ. 

పానం అంతా సచ్చుగా ఉంది. మంచంలో పనుకోబెట్టింది. జెరం మాత్రం తీసుకొని వచ్చినాడు మా నాయన. శారన్నం తినిపించి మాత్ర ఏసింది మాయమ్మ. కళ్ళు మూసుకొని పోతనాయి. నా తలకాయ ఒళ్ళో పెట్టుకొని కూచుంది. మా యన్నను బట్టలు సూపించమని సెప్పింది. బట్టలసబ్బు రంగు అంగీ దాని మీదకి మిలట్రీ ప్యాంట్‌ తీసుకొని వచ్చింది నాకు. పానం బట్టల మీందకు పాకింది. సేత్తోతాకిన, ఎప్పుడెప్పుడు ఏసుకుందామా అంటాంది మనసు. 

‘బట్టలు బట్టలు అని సచ్చండ్య ఇన్ని రోజులు ఇప్పుడేమో ఇట్టా సచ్చా’ అనా మాయమ్మ. బట్టలు పట్టుకొని అట్నే పనుకున్యా. అల్లుపోయినట్టుంది పానం. దెబ్బలకు మూలుగుతనే ఉన్యా రాత్రంతా. రాత్రి రెండు మూడు సార్లు మా నాయన సెయ్యి నుదురు మీద తాకింది సల్లగా. మాయమ్మ మూడు గంటలకే లేసి ఇల్లంతా తుడిసి స్నానం సేసి  పండగ మొదలుపెట్టింది.

బచ్యాల వాసన ఇల్లంతా పట్టింది. నా జెరం మాత్రం తగ్గలేదు. పాలు తాపించి ఇంగో జెరం మాత్రం ఏసినాడు మా నాయన. మారెమ్మ దేళం కాడికి బల్లు రెడీ ఐతనాయి. మాయబ్బ ఎద్దుల గజ్జెలు, మారెమ్మ దేళంకాడ తప్పెట్లు ఇనిపించి కళ్లలో నీళ్లు దిగినాయి. ఫ్యాన్‌ గాలికి కొత్తబట్టలు దేవుని మూలన కవర్లో సప్పిడి సెచ్చాంటే ఆ రోజంతా మంచంలో మూలాగుతనే ఉన్యా.

బతుకుదెరువుకి ఊరు యిడ్సి ఇరవైఏళ్లు  అయితాంది. మా యమ్మ ఫోన్‌ సేసిరేపు ఉగాది పండక్కు కొత్తబట్టలు కొనుకున్యావ నాయన అని అడిగినప్పుడ్నుంచి గుండె ఊరిమీందకు పీకి పండగ మతికొచ్చి పిల్లోని మాదిరి  ఏడుచ్చా పనుకున్యా.
-సురేంద్ర శీలం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement