Crime Story: ఫోరెన్సిక్‌.. ఆదర్శ జంట అనుకున్నారు! అసలు విషయం తెలిసి! | Funday: Koilada rammohan Rao Telugu Crime Story Forensic | Sakshi
Sakshi News home page

Crime Story: ఫోరెన్సిక్‌.. ఆదర్శ జంట అనుకున్నారు! అసలు విషయం తెలిసి!

Published Thu, Jul 28 2022 5:03 PM | Last Updated on Thu, Jul 28 2022 5:03 PM

Funday: Koilada rammohan Rao Telugu Crime Story Forensic - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

‘కిరణ్మయి చనిపోవడం ఏమిటి?ఈ రోజు సాయంత్రం కూడా తనతో మాట్లాడాను. ఎంతో చలాకీగా ఉంది. ఇంతలోకే ఏమైంది?’ అంటూ కిరణ్మయి ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టింది పక్కింటి పావని. 

‘నిజమేనమ్మాయ్‌. ఆరోగ్యంగా హుషారుగా తిరిగే పిల్ల ఇలా అర్ధాంతరంగా..’ అంటూ కన్నీళ్లొత్తుకుంది ఆ వీథిలోనే ఉంటున్న జానకమ్మ. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లేసరికి, అప్పటికే చాలా మంది జనం పోగయ్యారు.  ‘కిరణ్మయి, రాజీవ్‌ల జంట భలే ఉండేది ఆదర్శ దాంపత్యానికి ఉదాహరణగా! కాలనీలో అందరితో సఖ్యంగా ఉండేవారు!’ అంటూ అక్కడి జనసందోహం సానుభూతి కనబర్చసాగారు. 

‘ఇంతకూ ఏం జరిగింది?’ ఆరా తీసే ప్రయత్నం జరుగుతోంది గుమిగూడిన ఆ గుంపులో. 
‘పది గంటలప్పుడు ఇంటికొచ్చి కాలింగ్‌  బెల్‌ కొట్టాడట రాజీవ్‌. ఎంతకీ తలుపు తీయకపోయేసరికి భార్య నిద్రపోయి ఉంటుందని భావించి తన దగ్గరున్న తాళంతో తలుపు తీసి.. బెడ్‌ రూమ్‌లోకి వెళ్ళాడట.

అక్కడ అపస్మారకస్థితిలో చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న కిరణ్మయిని చూసి బెంబేలెత్తిపోయాడట. పక్కింటి మహేంద్రకి ఫోన్‌చేసి సాయం కోరాడట. వాళ్ళిద్దరూ ఆమెకు సపర్యలు చేస్తుండగా వాంతి చేసుకుందట. శుభ్రం చేసేలోగానే ఆమె ప్రాణం పోయిందట.

అప్పుడే సింగపూర్‌ నుంచి ఆమె తమ్ముడు వసంత్‌ వచ్చాడట’ అని ఎవరో చెబుతుంటే ఇంకెవరో అడ్డుపడి ‘ఆ అబ్బాయి అప్పుడే రావడం ఏమిటి?’ అని ప్రశ్నించారు మరొకరు. ‘రేపు కిరణ్మయి పుట్టిన రోజుట. సర్‌ప్రైజ్‌ చేద్దామని చెప్పాపెట్టకుండా వచ్చాడుట’ అని ఇంకెవరో వివరమిస్తుండగానే పోలీసు జీప్‌ వచ్చింది.

గుంపులో కలకలం ‘పోలీసులు వచ్చారేంటి?’ అని. ఆ కలకలానికి బయటకు వచ్చిన వసంత్‌.. ‘రండి సార్‌.. కంప్లైంట్‌ ఇచ్చింది నేనే’ అంటూ ఎస్సై అంబరీష్‌కు ఎదురెళ్లాడు. అది విన్న అక్కడున్నందరికీ మతిపోయింది. 

‘మీరు కిరణ్మయికి ఏమవుతారు? ఇది హత్యని మీకెందుకు అనుమానం వచ్చింది?’ ప్రశ్నించాడు ఎస్సై లోపలికి నడుస్తూ. 
‘నా పేరు వసంత్‌. నేను కిరణ్మయికి సొంత తమ్ముడిని. మీ ఫార్మాలిటీస్‌ పూర్తయ్యాక చెప్తాను అన్నీ’ అంటూ ఎస్సైని అనుసరించాడు.

సరే అన్నట్టుగా తలూపుతూ శవం ఉన్న గదిలోకి ప్రవేశించాడు ఎస్సై. అక్కడ రాజీవ్, మహేంద్రతోపాటు మరో ముగ్గురు ఉన్నారు. పోలీసులు ఎందుకొచ్చారో తెలియక తికమకపడుతున్నారు. పోలీస్‌ టీమ్, ఫోరెన్సిక్‌ టీమ్‌.. వాళ్ళ పనుల్లో మునిగిపోయింది.

రాజీవ్, వసంత్‌లను తప్ప మిగిలినవాళ్ళను బయటకు పంపేశాడు ఎస్సై. బెడ్‌ మీద పడుకొని ఉన్న శవాన్ని పరిశీలనగా చూశాడు. ఏదో వాసన వస్తున్నట్లు గ్రహించి అటూ ఇటూ చూశాడు.

అది గమనించిన రాజీవ్‌ ‘చనిపోయే ముందు వాంతి చేసుకుంది. శుభ్రం చేసినా ఇంకా వాసన వస్తోంది’ అన్నాడు. ‘హత్యేమోనని అనుమానంగా ఉంది. దేన్నీ టచ్‌ చేయొద్దు’ హెచ్చరించాడు ఎస్సై. రాజీవ్‌ ఏదో చెప్పబోతుంటే ‘ఫార్మాలిటీస్‌ పూర్తయ్యాక మాట్లాడొచ్చు’ అంటూ ఇల్లంతా గాలించసాగాడు.

ఏ క్లూ దొరక్కపోయేసరికి వసంత్‌ దగ్గరకు వచ్చి ‘ఇది హత్య అనడానికి ఏ ఆధారమూ కనబడ్డం లేదు. డాక్టర్‌ కూడా సహజ మరణమనే అంటున్నారు. మీకెందుకు డౌట్‌గా ఉంది?’ అడిగాడు ఎస్సై అంబరీష్‌.

వసంత్‌  బదులు చెప్పబోతుండగా అతని మీద విరుచుకుపడ్డాడు రాజీవ్‌.. ‘అయితే పోలీసులను పిలిపించింది నువ్వన్నమాట. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఈ రోజే ఊడిపడ్డ నీకేం తెలుసని? ఈ ఇంట్లో హత్య జరగడమేంటి?’ అంటూ! అతణ్ణి అంబరీష్‌ అడ్డుకుంటేగానీ వసంత్‌ నోరువిప్పలేకపోయాడు.

‘సర్‌ నేను సింగపూర్‌లో ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌గా పని చేస్తున్నాను. ఎన్నో క్రైమ్‌ కేసుల విషయంలో అక్కడి పోలీసులకు హెల్ప్‌ చేస్తూంటాను’  అంటూ తన ఐడీ కార్డ్‌ చూపించాడు వసంత్‌.  

ఆ కార్డ్‌ తీసుకుంటూ ‘ఓ.. అలాగా? అయితే నేర పరిశోధనలో మీకు బ్రహ్మాండమైన అనుభవం ఉందన్న మాట. సరే. ఇప్పుడు చెప్పండి.. మీకెందుకు అనుమానం వచ్చింది ఇది హత్య అని?’ అడిగాడు ఎస్సై. రాజీవ్‌కి  సైలెంట్‌గా ఉండక తప్పలేదు. 

 ‘ఇలా రండి..  మా అక్క నోటిని పరీక్షగా చూడండి. మీకు క్లూ దొరకొచ్చు’ అన్నాడు మళ్లీ కిరణ్మయి డెడ్‌ బాడీ దగ్గరకు ఎస్సైని తీసుకెళుతూ. ఎస్సైతో పాటు ఫోరెన్సిక్‌ టీమ్‌ లీడర్‌ భాస్కర్‌ కూడా డెడ్‌బాడీ దగ్గరకు వచ్చి.. మళ్లీ పరీక్షగా చూసి, పెదవి విరిచారు. 

‘పెద్ద క్లూ ఏమీ కనబడట్లేదు. కింది పెదవి చివర రెండు మెతుకులు కనిపిస్తున్నాయి. వాంతి అయిందని వాళ్ళు ముందే చెప్పారు కదా? అది తప్ప ఏముంది?’ అన్నాడు భాస్కర్‌. అతన్ని సమర్థిస్తున్నట్లు తలూపాడు అంబరీష్‌.

‘అయితే అక్క పంటిలో ఇరుక్కున్న గులాబి రంగు దారప్పోగు మిమ్మల్ని ఆకర్షించలేదన్నమాట?’  అడిగాడు వసంత్‌. 
‘చూశాను. అయితే ఏమిటి?’ అడిగాడు ఎస్సై. 

‘ఏదో కర్చీఫ్‌నో.. లేదా గుడ్డనో అక్క నోట్లో కుక్కి ఉంటారని అనుమానం కలగడం లేదూ?’ వసంత్‌. 
ఆ ఊహ తమకు తట్టనందుకు కాస్త సిగ్గుపడ్డారు అంబరీష్, భాస్కర్‌లు. 

‘అది కర్చీఫ్‌ అని నేను నిర్ధారణ  చేసుకున్నాను. రండి చూపిస్తాను. అది కార్‌ గ్యారేజ్‌లో ఉంది’ అంటూ అటు వైపు దారి తీశాడు వసంత్‌. గ్యారేజ్‌లోని కారుకి కాస్త దూరంలో పడున్న పింక్‌ కర్చీఫ్‌ను కర్రతో పైకి లేపి ‘ఇది ఎవరిది?’ అని రాజీవ్‌ని ప్రశ్నించాడు. 

‘కిరణ్మయిది’ అంటూ సమాధానం ఇచ్చాడు రాజీవ్‌.
‘కేవలం దీని ఆధారంతోనే హత్య అని తేల్చేస్తున్నారా?’ వసంత్‌ని అడిగాడు అంబరీష్‌. 
‘అన్నీ వివరంగా చెప్తాను సర్‌. అందరినీ బయటకు పంపేయండి’ అన్నాడు వసంత్‌. 

‘నేను కూడా ఉండకూడదా?’ కోపంగా అడిగాడు రాజీవ్‌. 
‘మిస్టర్‌ రాజీవ్‌ ప్లీజ్‌ కోపరేట్‌’ అంటూ బయటకు దారి చూపించాడు అంబరీష్‌. విసవిసా అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాజీవ్‌.

‘నా అనుమానాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్‌స్పెక్టర్‌.. ఒక రిక్వెస్ట్‌. అక్క రక్తం, సలైవాతోపాటు పెదవుల దగ్గర ఉన్న అన్నం మెతుకులను వీలయినంత తొందరగా టాక్సికాలజీ టెస్టులకు పంపండి’ అన్నాడు వసంత్‌. 

‘టాక్సికాలజీ టెస్టులు అంటున్నారు. ఆమె పై విషప్రయోగం జరిగిందని అనుమానమా?’ అడిగాడు ఎస్సై.
‘అవును సర్‌. రుజువులు చూపిస్తాను రండి’ అంటూ మళ్లీ శవం దగ్గరకు తీసుకెళ్ళాడు. కిరణ్మయి బుగ్గలు, గోర్లను చూపిస్తూ ‘అస్పష్టంగా కనిపిస్తున్న ఈ చెర్రీ రంగు మచ్చలను చూడండి..

ఇవి విష ప్రయోగ సంకేతాలే. కానీ టెస్ట్‌ల ద్వారే ప్రూవ్‌ కావాలి. మా అక్క బాడీని క్షుణ్ణంగా పరీక్షించడానికి మీ అనుమతి కోరుతున్నాను’ అన్నాడు వసంత్‌. అంగీకరిస్తున్నట్లు తలూపాడు ఎస్సై.

గ్లోవ్స్‌ వేసుకుని.. కిరణ్మయి చేతులను, కాళ్ళను చూపుతూ ‘ఈ గుర్తులను చూస్తే అర్థమవడం లేదా అక్క కాళ్లు, చేతులను కట్టేసి ఉంచినట్లు?’ అని వసంత్‌ చెపుతుంటే అంబరీష్‌ ఆశ్చర్యపోతూ  ‘ఈ వసంత్‌  నేర పరిశోధనలో ఆరితేరిన వాడై ఉండాలి. అతని ముందు నేను గానీ, భాస్కర్‌ గానీ, శవాన్ని పరీక్షించిన డాక్టర్‌ గానీ దిగదుడుపే’ అనుకున్నాడు.

‘ఇది చాలా క్రిటికల్‌ కేసులా ఉంది. విషప్రయోగం జరిగినట్లు తెలుస్తుంది గానీ, దాని కోసం నోట్లో గుడ్డలు కుక్కడం, కాళ్ళు, చేతులు కట్టేయడం ఎందుకో అర్థంకావడం లేదు. అటాప్సీ రిపోర్ట్‌ వస్తే గానీ, ఏ విషయమూ తేలదు. ఒకవేళ మీరు అన్నట్లు హత్యే అయితే గనుక ఎందుకు జరిగి ఉంటుంది? ఎవరు చేసి ఉంటారు? మీకు ఎవరి మీదనయినా అనుమానం ఉందా?’ అడిగాడు ఎస్సై. 

‘నేనిప్పుడు ఏమీ చెప్పలేను సర్‌. టెస్ట్‌ రిజల్ట్స్, అటాప్సీ రిపోర్ట్‌ చూశాకే మాట్లాడతాను. అవి వచ్చిన వెంటనే కబురుపెట్టండి’ అన్నాడు వసంత్‌.
∙∙ 
పోలీస్‌ స్టేషన్లో ఒక టేబుల్‌ ముందు కూర్చుని రిపోర్ట్‌లు పరిశీలిస్తున్నాడు వసంత్‌. ఎస్సై అంబరీష్, సీఐ మహంకాళి.. అతను చెప్పేది వినడానికి కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. రిపోర్ట్‌లను క్షుణ్ణంగా పరిశీలించాక, రెండు చేతులతో బల్లను చరిచి.. ‘యస్‌.. నా అనుమానం నిజమయింది’ అన్నాడు. ‘కంగ్రాట్స్‌.. వివరంగా చెప్పండి’ అన్నాడు సీఐ కాళి. 

‘కార్బన్‌ మోనాక్సైడ్‌ పాయిజనింగ్‌ జరిగింది. ఇదిగో ఈ రిపోర్ట్స్‌ చూడండి.. కార్బాక్సీ హీమోగ్లోబిన్‌ శాతం ముప్పై. అంటే చాలా ఎక్కువ. మన శరీరం మూడు శాతాన్ని మాత్రమే తట్టుకోగలదు. స్మోకింగ్‌ అలవాటు ఉన్నవాళ్లు పది శాతం వరకూ తట్టుకుంటారు. కానీ ముప్పై శాతం చేరుకుందంటే ప్రాణాపాయమే.  మనం పీల్చుకునే ఆక్సిజన్, రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్‌తో కలుస్తుంది.

అలారక్తం, శరీరంలోని అన్ని భాగాలకు, అన్ని కణాలకు చేరడం వల్ల, వాటికి ఆక్సిజన్‌ నిరంతరంగా అందుతుంది. అయితే కార్బన్‌ మోనాక్సైడ్, ఆక్సిజన్‌ కన్నా తొందరగా, సులువుగా హీమోగ్లోబిన్‌తో కలసి కార్బాక్సీహీమోగ్లోబిన్‌ను ఏర్పరుస్తుంది. అందువల్ల ఆక్సిజన్‌ రక్తంతో కలవడం ఆగిపోతుంది. ఫలితంగా శరీర భాగాలకు గానీ, కణాలకు గానీ ఆక్సిజన్‌ అందదు.

ఆ విధంగా కార్బన్‌ మోనాక్సైడ్‌  ఒక విషంలా పనిచేస్తుంది. అలా ఏర్పడే ఆక్సిజన్‌ కొరత వల్ల ఊపిరి అందకపోవడం, అపస్మారకంలోకి పోవడం, కొన్ని సార్లు కోమాలోకి వెళ్ళడం, మరణం సంభవించడం, వికారంగా అనిపించడం, వాంతులు కావడం, శరీరంలోని కొన్ని భాగాలపై చెర్రీ రెడ్‌ రంగు మచ్చలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. మనం ఆ ఇంటికి వెళితే, ఈ విషప్రయోగం ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు’ అన్నాడు వసంత్‌. 
∙∙ 
నేరుగా కారు గ్యారేజ్‌లోకి దారి తీశాడు వసంత్‌ .. ఎస్సై అంబరీష్‌తో. గ్యారేజ్‌ అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ గోడమీద ఉన్న ఓ  మచ్చను చూపిస్తూ ‘ఇది చూశారా? కారు సైలెన్సర్‌కి ఎదురుగా ఉంది. సైలెన్సర్‌ నుంచి వచ్చిన వాయువుల తాకిడికి ఈ మచ్చ ఏర్పడింది. అయితే ఇది ఇంత స్పష్టంగా ఏర్పడిందంటే, కారు ఇంజన్‌ను  కనీసం అరగంటయినా ఆన్‌లో ఉంచి ఉండాలి. అవునా?’ అడిగాడు వసంత్‌. 

‘అవును. అయితే?’ అడిగాడు అంబరీష్‌. 
‘హంతకుడు చాలా తెలివిగా ప్లాన్‌ చేశాడు. మా అక్క కాళ్ళు, చేతులూ కట్టేసి అరవకుండా నోట్లో కర్చీఫ్‌ కుక్కి, ఇదిగో ఈ సైలెన్సర్‌ ఎదురుగా తన ముఖం ఉండేటట్లు బంధించి చాలాసేపు సెలెన్సర్‌ నుంచి వాయువును పీల్చుకునేలా చేశాడు. ఇది పాతకారు కాబట్టి ఆ వాయువుల్లో కార్బన్‌ మోనాక్సైడ్‌ శాతం ఎక్కువగా ఉండే ఉంటుంది. ఆ విధంగా ఆ విషప్రయోగం చేశాడు.

దాంతో మా అక్క అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయుంటుంది. అప్పుడు ఆమెను బెడ్‌ రూమ్‌లోకి మార్చి ఉంటాడు. కట్టిన తాళ్ళను మాయం చేశాడు గానీ, కర్చీఫ్‌ అక్కడే పడిపోయినట్లు గుర్తించి ఉండడు ఆ గాభరాలో. అదే మనకు ఆధారం అయింది. పాపం ఇదేమీ తెలియని మా బావ ఇంట్లోకి వచ్చి చూసేసరికి, మా అక్క చావు బతుకుల్లో కనిపించింది. కళ్ళ ముందే భార్య చనిపోవడం చూసిన మా బావ ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో’ అన్నాడు బాధగా. 

‘మీరంత బాధ పడిపోకండి. హంతకుడు మీ బావేనని మా సీఐ అనుమానం’ అనగానే, తెల్లమొహం వేశాడు వసంత్‌.
‘ఇది హత్య కావచ్చనే అనుమానం వచ్చిన వెంటనే, ఆయన తనదైన శైలిలో దర్యాప్తు మొదలుపెట్టారు. చాలా విషయాలు బయటపడ్డాయి. మీ బావ ఒక మేకవన్నె పులి. భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. అదే అతన్ని హత్యకు ఉసిగొల్పి ఉండవచ్చునని భావించాం.

హత్య వేరే వాళ్లెవరూ చేసినట్లు ఆధారాలు దొరకలేదు. మీరు ఎప్పుడయితే రంగంలోకి దిగారో అప్పటి నుంచి అతనికి బెంగ పట్టుకుంది. అందుకే ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని మా వాళ్ళు పసిగట్టారు. ఇప్పుడు హత్య ఎలా జరిగిందన్న విషయమూ స్పష్టమైంది. సాక్ష్యాలూ ఎదురుగా ఉన్నాయి. ఈ విషయం మా సీఐకి చెప్పాలి. వెంటనే రాజీవ్‌ను పట్టుకోవాలి’ అంటూ మొబైల్‌ ఫోన్‌ తీశాడు ఎస్సై అంబరీష్‌.
చదవండి: Crime Story: మోస్ట్‌ వాంటెట్‌.. పరిణీత ఎందుకలా చేసిందో తెలిసి అందరూ షాక్‌!
క్రైమ్‌ స్టోరీ: హంతకుడెవరు.. అసలు ట్విస్ట్‌ తెలిసిన తర్వాత!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement