Crime Story: కిలో 70 తులాల బంగారం.. బెడిసి కొట్టిన ప్లాన్‌.. ఆఖరికి! | Funday Magazine: Bedisi Kottina Plan Telugu Crime Story By Chokkara Thatha Rao | Sakshi
Sakshi News home page

Crime Story: కిలో 70 తులాల బంగారం.. బెడిసి కొట్టిన ప్లాన్‌.. ఆఖరికి!

Published Mon, Jun 20 2022 4:28 PM | Last Updated on Mon, Jun 20 2022 4:34 PM

Funday Magazine: Bedisi Kottina Plan Telugu Crime Story By Chokkara Thatha Rao - Sakshi

‘సార్‌ బంగారం మీద లోను కావాలి’ అంటూ  కో ఆపరేటివ్‌ బ్యాంకులోని ఫీల్డ్‌ ఆఫీసర్‌ ముందు ఒక బ్యాగ్‌ పెట్టాడు కస్టమర్‌. ‘బంగారం ఇమ్మంటే సంచీ పెట్టావేంటి?’ అడిగాడు ఫీల్డ్‌ ఆఫీసర్‌. 

‘అందులో బంగారమే ఉంది’ ఫీల్డ్‌ ఆఫీసర్‌ వైపు చూస్తూ అన్నాడు కస్టమర్‌. ‘ఇంత బంగారమా? మీరు నగల కొట్టుకు వెళ్ళాల్సింది పోయి బ్యాంకుకు వచ్చినట్టున్నారు’ ఆశ్చర్యపోతూ అన్నాడు ఆఫీసర్‌. 

‘బంగారం అమ్మటానికి రాలేదు సార్‌.. తాకట్టు పెట్టడానికి వచ్చాను’ అన్నాడు. ‘ఎంత కావాలి?’ మాట నొక్కుతూ అన్నాడు.  ‘ముప్పై లక్షలు’ చెప్పాడు. ‘ముప్పై లక్షలా? అంత డబ్బు ఈ బ్యాంకులో ఇవ్వరు’ ముఖం అదోలా పెట్టి అన్నాడు.

‘ఆ మాటేదో మీ మేనేజరు చెప్పాలి’ మేనేజరు రూమ్‌ వైపు చూస్తూ అన్నాడు.  ‘మేనేజరు చెప్పినా.. నేను చెప్పినా ఒకటే. ఈ బంగారం తీసుకుపొండి’ అంటూ కస్టమరుకి బ్యాగు ఇవ్వబోయాడు. 

‘మీ మేనేజరుని అడిగొస్తాను’ అంటూ మేనేజర్‌ గదిలోకి వెళ్ళాడు కస్టమర్‌.  ‘ఏం కావాలి? అడిగాడు మేనేజర్‌.  ‘బంగారం మీద డబ్బు ఇమ్మంటే ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఇవ్వట్లేదు’ చెప్పాడు.

ఆ మాట వినగానే ఓసారి తన క్యాబిన్‌కు  రమ్మని ఫీల్డ్‌ ఆఫీసర్‌కి ఫోన్‌ చేశాడు మేనేజర్‌. ఫీల్డ్‌ ఆఫీరసర్‌ వచ్చీరావడంతోనే ‘బంగరం మీద లోన్‌ ఇవ్వనన్నారట’ అడిగాడు మేనేజర్‌.  ‘అవును సర్‌. అతను అడిగింది లక్ష కాదు, రెండు లక్షలు కాదు ఏకంగా ముప్పై లక్షలు. అంత డబ్బు ఎలా ఇస్తాం సర్‌?’ తన మాట వినకుండా మేనేజర్ని కలిశాడని కస్టమర్‌ మీద అప్పటికే కొంత అసహనం ఉంది ఫీల్డ్‌ ఆఫీసర్‌కి.

‘మూర్తిగారూ.. ఇది మార్చి నెల. మన టార్గెట్స్‌ మనకుంటాయి. డిపాజిట్స్‌ సేకరించడమే కాదు. ఆ డబ్బు మళ్ళీ లోన్స్‌ రూపంలో కస్టమర్స్‌కి చేరినప్పుడే బ్యాంకు లాభాలతో నడిచేది. మీకు తెలుసు కదా.. మన బ్రాంచ్‌కున్న టార్గెట్స్‌ గురించి! బిజినెస్‌ విషయంలో మన బ్రాంచ్‌ ఇప్పటికే వెనకబడి ఉంది. ఈ లోనే కాదు. ముప్పై లక్షల లోపు గోల్డ్‌ లోన్స్‌ మరో రెండు మూడు ఇవ్వండి పర్లేదు’ అన్నాడు మేనేజర్‌. 

సరే అన్నట్టుగా తలూపుతూ  కస్టమర్‌ వైపు అదోలా చూసి తన సీట్లోకి వెళ్ళిపోయాడు ఫీల్డ్‌ ఆఫీసర్‌. బ్యాంక్‌ మేనేజర్‌కి థ్యాంక్స్‌ చెప్పి కౌంటరు వైపు నడిచాడు కస్టమర్‌. అప్పటికే బంగారాన్ని రుద్ది మదింపు చేసి వెయిట్‌ చూశాడు గోల్డ్‌ అప్రయిజర్‌. ‘వంద తులాల నిఖార్సయిన బంగారం సార్‌’ ఫీల్డ్‌ ఆఫీసర్‌తో చెప్పాడు అప్రయిజర్‌.

అరగంట తర్వాత ముప్పై లక్షలు కస్టమర్‌ చేతికిస్తూ ‘వడ్డీ నెల నెలా కట్టేయాలి. కట్టకపోతే సంవత్సరం చివర్లో బంగారం వేలం వేసేస్తాం’ చిరాగ్గా చెప్పాడు ఫీల్డ్‌ ఆఫీసర్‌.

‘ఎప్పుడు ఏది కట్టాలో మాకు తెలుసండి. మీరు చెప్పేదాక తెచ్చుకోం’ అంటూ డబ్బు బ్యాగులో వేసుకుని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు కస్టమర్‌. ఆలోపే ఏజీఎం నుంచి ఫోన్‌ మేనేజర్‌కు.. ‘మీ టార్గెట్‌ ఇంకా కోటి రూపాయలు మిగిలే ఉంది. ఎలా పూర్తి చేస్తారో నాకు తెలీదు. నెలాఖరు లోపు టార్గెట్‌ పూర్తి చేయాలి’ అంటూ.  
∙∙ 
ఇరవై రోజుల తర్వాత మరో కస్టమర్‌ బంగారం మీద లోన్‌ కావాలని బ్యాంక్‌ మేనేజర్‌ దగ్గర కొచ్చాడు. సమయానికి నాకోసమే వచ్చాడని మనసులో అనుకుంటూ ‘ఎంత కావాల’ని కస్టమర్ని అడిగాడు మేనేజర్‌. ‘ఇరవై లక్షలు’ అనగానే ఎగిరి గంతేసినంత పని చేశాడు మేనేజర్‌. వెంటనే కస్టమర్ని ఫీల్డ్‌ ఆఫీసర్‌ దగ్గరకు పంపించాడు మేనేజర్‌. కస్టమర్‌ తెచ్చిన డెబ్బై తులాల బంగారాన్ని  అప్రయిజర్‌తో చెక్‌ చేయించి, ఫార్మాలిటీస్‌ పూర్తిచేసి కస్టమర్‌కు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాడు ఫీల్డ్‌ ఆఫీసర్‌. 

‘పచ్చ నోట్లు తళ తళ మెరిసిపోతున్నాయి అచ్చం బంగారంలాగే’ నవ్వుకుంటూ డబ్బు అందుకుని కళ్ళకద్దుకున్నాడు కస్టమర్‌. ‘వస్తాను సార్‌’ బ్యాంక్‌ మేనేజరుకూ థ్యాంక్స్‌ చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు కస్టమర్‌.
∙∙ 
సాయంత్రం ఆరయింది. స్టాఫ్‌ తప్ప బ్యాంకులో జనం లేరు. మేనేజర్‌ ఫైల్స్‌ మీద సంతకాలు చేస్తున్నాడు. ఫీల్డ్‌ ఆఫీసర్‌ కంప్యూటర్‌ ముందు బిజీగా ఉన్నాడు. గ్రిల్‌ గేటు లోపల సెక్యూరిటీ గార్డ్‌ నుంచుని ఉన్నాడు. బ్యాంకు ఉన్న ప్రాంతం బాగా బిజీ సెంటర్‌. జనంతో ఎప్పుడూ కిట కిటలాడుతుంటుంది. ఇంతలో ఓ కారొచ్చి బ్యాంకు ముందు ఆగింది. ఇద్దరు వ్యక్తులు కారులోంచి దిగి బ్యాంకు వైపు నడిచారు. 

‘ఎవరు కావాలి?’ అంటూ వాళ్లను గ్రిల్‌ గేట్‌ దగ్గర ఆపాడు సెక్యూరిటీ గార్డ్‌. ‘మేనేజర్ని కలవాలి’ చెప్పాడు అందులో ఒకడు. ‘ఈటైమ్‌లో కలవడం కుదరదు. మేనేజర్‌ బిజీగా ఉన్నారు. ఇంతకీ అపాయింట్‌మెంట్‌ ఉందా?’ అడిగాడు.

‘అపాయింట్‌మెంట్‌ లేదు పాడు లేదు’ అంటూ పక్కకు తోసేసి సెక్యూరిటీ గార్డు నోటికి ప్లాస్టర్‌ అంటించి కదలకుండా కాళ్ళు చేతులు కట్టేశారు. పనుల్లో పడిన బ్యాంకు స్టాఫ్‌ ఈ సంఘటన గమనించలేదు. మంకీ క్యాప్స్‌ ధరించి ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు ఆగంతుకులు. కత్తులు పట్టుకుని ఎదురుగా వస్తున్న ఆగంతుకుల్ని చూసిన మేనేజర్‌ విఠల్‌ ప్రసాద్‌ భయంతో ‘సెక్యూరిటీ ’ అంటూ కేకేశాడు.

మేనేజర్‌ కేక విన్న ఫీల్డ్‌ ఆఫీసర్‌ తన గది నుండి లేచేలోపు ఒకరు మేనేజర్‌ గదిలోకి, మరొకరు ఫీల్డ్‌ ఆఫీసర్‌ గదిలోకి వెళ్ళి కత్తులతో వాళ్ళను బెదిరించారు. ‘ఎవరు మీరు?’ అనేలోపు ‘డబ్బు, బంగారం ఎక్కడుందో చెప్పండి’ అంటూ మేనేజర్, ఫీల్డ్‌ ఆఫీసర్‌ మెడల మీద కత్తులు దూయబోయారు. వాళ్ళ చర్యలకు భయపడి లాకర్లను ఓపెన్‌ చేశాడు ఫీల్డ్‌ ఆఫీసర్‌.

లాకర్లలో ఉన్న డబ్బు, బంగారం చూసేసరికి ఆగంతుకుల కళ్ళు ఆనందంతో తళతళా మెరిసిపోయాయి. లాకర్లలో ఉన్న లక్షల కొద్ది డబ్బు, వందల తులాల బంగారం తమతో తెచ్చిన బ్యాగుల్లో సర్దుకున్నారు ఆగంతుకులు. అక్కడున్న ఫోన్‌ కనెక్షన్లు, వాళ్ళ దగ్గరున్న సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసున్నారు. వాళ్ళను అక్కడ వదిలి తలుపులు వేసేసి హడావుడిగా కార్లో వెళ్ళిపోయారు ఆ ఆగంతుకులు.

వాళ్లు  వెళ్ళిపోయాక గేటు దగ్గర పడున్న సెక్యూరిటీ గార్డు పరిస్థితి చూసిన ఫీల్డ్‌ ఆఫీసర్‌.. అతని కాళ్లు, చేతులకున్న కట్లన్నీ విప్పాడు. టేబుల్‌ సొరుగులో ఉన్న తన పర్సనల్‌ సెల్‌ ఫోన్‌ తీసి పోలీసులకు ఫోన్‌ చేసి బ్యాంకులో జరిగిన దోపిడీ గురించి చెప్పాడు మెనేజర్‌ విఠల్‌ ప్రసాద్‌.

‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. వెపన్డ్‌ సెక్యూరిటీని పెట్టకపోవడం ఒక విధంగా తప్పే. సెంటర్లో ఉన్న బ్యాంకులో ఇలా రాబరీ జరుగుతుందని ఎవ్వరం ఊహించం. తప్పు జరిగిపోయింది. ఇంతకీ దొంగలు దొరికితే సరే. లేదంటే బ్యాంకుకి కోలుకోలేని నష్టం’ ఫీల్డ్‌ ఆఫీసర్‌ ముందు వాపోయాడు బ్యాంకు మేనేజర్‌.

మేనేజర్‌ నుండి ఫోన్‌ రాగానే హడావుడిగా క్లూస్‌ టీమ్‌తో బ్యాంకుకి చేరుకున్నారు పోలీసులు. బయట నుంచి పెట్టిన బోల్ట్‌తీసి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకు లోపల పరిసరాలన్నీ గమనించారు. ఖాళీగా ఉన్న లాకర్లు, పాడయిన సీసీ కెమెరాలు, కట్‌ చేసిన ఫోన్‌ కనెక్షన్లు అన్నీ నిశితంగా పరిశీలించారు.  

‘దొంగలు రావడం ముందుగా ఎవరు చూశారు?’ బ్యాంక్‌ మేనేజర్ని అడిగాడు ఎస్సై రఘువీర్‌.  ‘నేనే చూశాను సార్‌. అప్పటికే వాళ్ళు ముసుగులు ధరించి ఉన్నారు’ సెక్యూరిటీ గార్డ్‌ చెప్పాడు. ‘బ్యాంకులోకి వచ్చే ముందు వాళ్ళు నీతో ఏమని చెప్పారు?’ అడిగాడు. 

‘మేనేజర్ని కలవాలని చెప్పారు. అపాయింట్‌మెంట్‌ ఉందా? అని అడిగాను. అంతే నోటికి ప్లాస్టర్‌ వేసి కాళ్ళు చేతులు కట్టేసి నన్ను ఓ మూలన పడేశారు సార్‌’ అక్కడ జరిగింది చెప్పాడు సెక్యూరిటీ గార్డ్‌.

‘తర్వాత నా గదిలోకి, ఫీల్డ్‌ ఆఫీసర్‌ గదిలోకి చెరొకరు వచ్చి కత్తులు చూపించి మమ్మల్ని బెదిరించి లాకర్లు ఓపెన్‌ చేయించి డబ్బు, బంగారం దోచుకుపోయారు’ మేనేజర్‌ విఠల్‌ ప్రసాద్‌ వివరంగా చెప్పాడు. 

‘ఇంత బిజీ సెంటర్లో రాబరీ చేశారంటే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే అయ్యుంటుంది. వాళ్ళు ఏ భాషలో మాట్లాడారు?’ అడిగాడు ఎస్సై. ‘తెలుగులోనే’ చెప్పాడు మేనేజర్‌. 

క్లూస్‌ టీమ్‌ ఫొటోలు.. లాకర్స్‌ మీదున్న వేలి ముద్రలు తీసుకున్నాక..  మేనేజర్‌ నుండి కంప్లయింటు తీసుకుని తన టీమ్‌తో అక్కడ నుండి జీపులో బయలుదేరాడు ఎస్సై రఘువీర్‌. మరునాడు ఉదయమే బ్యాంకుకి వచ్చాడు. బ్యాంకుకి ఎదురుగా ఉన్న షాపింగ్‌ మాల్‌ సీసీ కెమెరా ఫుటేజ్‌ పరిశీలించాడు.

ముందురోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య సీసీ ఫుటేజ్‌ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆ సమయంలో బ్యాంకులోకి వెళ్తున్న దృశ్యం దగ్గర పాజ్‌  చేశాడు ఎస్సై. బ్యాంకు గేటు ముందుకు రాగానే వాళ్ళు ముసుగులు ధరించారు.

‘వాళ్ళే సర్‌ బ్యాంకులో దొంగతనం చేసింది’ సీసీ కెమెరా వైపు చూస్తూ అన్నాడు సెక్యూరిటీ గార్డ్‌. ‘కొన్నాళ్ళ క్రితం వీళ్ళిద్దరూ మా బ్యాంకులో బంగారం కూడా తాకట్టు పెట్టారు’ అంటూ ఫీల్డ్‌ ఆఫీసర్‌ చెప్పాడు. 

‘ఇదంతా చూస్తుంటే ఇదేదో పెద్ద పథకంలా ఉంది. డొంక లాగితే దొంగలెవరో దొరలెవరో తెలుస్తుంది’ అని ఎస్సై అనగానే ‘ఎస్సైగారూ.. నా సెల్‌ ఫోన్‌ మీ దగ్గర ఉండిపోయింది’ అంటూ గుర్తు చేశాడు మేనేజర్‌. 

‘మా ఇన్వెస్టిగేషన్‌ ఇంకా మొదలవందే! ఇన్వెస్టిగేషన్‌ పూర్తి అయ్యాక అప్పుడు ఫోన్‌ మీ చేతికొస్తుంది’ అంటూ ఎస్సై రఘువీర్‌ అక్కడ నుండి బయలుదేరాడు. స్టేషన్‌లో ఉన్నప్పుడు మేనేజర్‌ సెల్‌ ఫోన్‌కి కాల్‌ రాగానే ఫోన్‌ ఆన్‌ చేశాడు ఎస్సై రఘువీర్‌. 

‘మేనేజర్‌ గారు.. మన ప్లాన్‌ సూపర్‌ సక్సెస్‌. బ్యాంకు రాబరీ కేసు కింద పోలీసులు కేసు రాసుకుంటారు. మీ చేతికి మట్టి అంటకుండా భలే నాటకమాడారు. బంగారం, డబ్బు భద్రంగా నా దగ్గరే ఉన్నాయి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం’ అంటూ అవతల వ్యక్తి ఫోన్‌ కట్‌ చేశాడు. ఎస్సై రఘువీర్‌కి విషయమంతా అర్థమైంది.

ఇంతకు ముందు ఫోన్‌ చేసిన వ్యక్తి, బ్యాంక్‌ మేనేజర్‌ సెల్‌కి చాలా సార్లు ఫోన్‌ చేసినట్టు కాల్‌ హిస్టరీ చూపిస్తోంది. కాల్‌ సెంటర్‌ నుండి ఆ వ్యక్తి అడ్రస్‌ తీసుకుని అతని ఇంటికి వెళ్ళాడు ఎస్సై.

‘యు ఆర్‌ అండర్‌ అరెస్ట్‌’ అంటూ ఎస్సై అనగానే అతన్ని తీసుకొచ్చి జీపులో పడేశాడు కానిస్టేబుల్‌. ‘నన్ను ఎందుకు అరెస్ట్‌ చేశారు సార్‌’ అడిగాడు అవతల వ్యక్తి. ‘బ్యాంకు రాబరీ కేసులో’  చెప్పాడు. 

‘ఆ దొంగతనానికి నాకు ఏంటి సర్‌ సంబంధం?’ అమాయకంగా ప్రశ్నించాడు. ‘సీసీ ఫుటేజ్‌ చూస్తే తెలుస్తుంది’ బదులిస్తూ పొమ్మని జీప్‌ డ్రైవర్‌కు సైగ చేశాడు ఎస్సై. 

‘ఆరోజు నీతోపాటు ఉన్న రెండో వ్యక్తి ఎక్కడ?’ అంటూ స్టేషన్‌కు రాగానే ఇంటరాగేషన్‌ మొదలుపెట్టాడు ఎస్సై. ఏదో అడ్రస్‌ చెప్పాడు ఆ వ్యక్తి. అతను చెప్పిన అడ్రస్‌కి వెళ్ళి రెండో వ్యక్తిని పోలీస్‌ స్టేషనుకి తీసుకొచ్చారు ఇద్దరు కానిస్టేబుళ్లు.  వాళ్ళిద్దరి నుండి మొత్తం సమాచారంతో పాటు పోయిన బంగారం, డబ్బూ రాబట్టాడు ఎస్సై రఘువీర్‌. 
∙∙ 
పోలీస్‌ జీప్‌ బ్యాంక్‌ ముందు ఆగింది. లోపలకు వస్తున్న ఎస్సైని చూసి ‘రండి.. రండి..  దొంగలు దొరికారా సార్‌?’ అంటూ పలకరిస్తూ ప్రశ్నించాడు బ్యాంక్‌ మేనేజర్‌.  ‘దొరికారు. ఒకసారి స్టేషనుకి వస్తే విషయాలన్నీ మాట్లాడుకుందాం’ అని జవాబిస్తూ పక్కనే ఉన్న ఫీల్డ్‌ ఆఫీసర్ని చూసి ‘మీరూ రావాలి’ చెప్పాడు  ఎస్సై రఘువీర్‌. ఎస్సైతోపాటు అందరూ  స్టేషనుకి బయలుదేరారు.

‘దొంగలెక్కడ?’ స్టేషనుకి చేరుకోగానే అటూ ఇటూ చూస్తూ ఆత్రంగా ఎస్సైని అడిగాడు బ్యాంకు మేనేజర్‌. ‘డ్రామాలు ఆపి ఇప్పుడు చెప్పండి. ఈ దొంగతనం మీరే కదా చేయించారు?’ మేనేజర్‌ వైపు కోపంగా చూస్తూ అన్నాడు ఎస్సై. 

ఆ మాటలు విని ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఆశ్చర్యపోయాడు. ‘అదేంటి అలా మాట్లాడుతున్నారు? దొంగతనం నేను చేయించడమేంటి?’ ఎదురు ప్రశ్న వేశాడు మేనేజర్‌. ఇంతలో పక్క గదిలోంచి ఇద్దరు దొంగలతోపాటు గోల్డ్‌ అప్రయిజర్‌ అక్కడకు రావడం చూసి కంగు తిన్నాడు మేనేజర్‌.

‘ఈపని మీరెందుకు చేశారు?’ దొంగల్ని అడిగాడు ఎస్సై. ‘దొంగ బంగారం మాకిచ్చి ఆ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టమన్నదే కాక, బ్యాంకులో దొంగతనం కూడా చేయమన్నది మేనేజర్‌గారే సార్‌. అందుకు మా ఇద్దరికీ చెరో మూడేసి లక్షలు ఇచ్చారు’ చెప్పాడు అందులో ఒక దొంగ.

‘దొంగ బంగారాన్ని మంచి బంగారంగా విలువ కడితే నాకు లక్ష రూపాయలిస్తామని మేనేజర్‌గారు చెబితే ఈపని నేను చేశాను సార్‌’ అప్రయిజర్‌ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. 

మేనేజర్‌ ఇంత దారుణానికి ఒడిగడతారని ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఊహించలేదు. ‘అప్పటికీ మేనేజర్‌తో చెప్పాను సార్‌.. బంగారం మీద ముప్పై లక్షలు అప్పు ఎలా ఇస్తామని? ఇప్పుడు తెలిసింది మేనేజర్‌గారి ఆలోచన ఏమిటో’ అన్నాడు ఫీల్డ్‌ ఆఫీసర్‌. ‘ఈ రాబరీ ప్లాన్‌ ఎందుకు వేశారు?’ ఎస్సై ప్రశ్నకి బదులిచ్చాడు మేనేజర్‌. 

‘దొంగ బంగారం పెట్టి లోన్‌ తీసుకుని మళ్ళీ లోన్‌ కట్టేద్దామనుకునే లోపు బ్యాంకు ఆడిట్‌ జరగబోతోందని తెలిసింది. ఆడిట్‌ జరిగితే ఎక్కడ బంగారం విషయం బయట పడుతుందోనని భయపడి ఈ ప్లాన్‌ చేశాను. తప్పంతా నాదే’ తన నేరాన్ని ఒప్పుకున్నాడు మేనేజర్‌. 

‘గోల్డ్‌ లోన్‌ కింద తీసుకున్న డబ్బు ఏం చేశారు?’ ‘విజయవాడలో ల్యాండ్‌ కొన్నాను’ చెప్పాడు మేనేజర్‌. ‘బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తూ బ్యాంకుకే కన్నం వేసే మీలాంటి వాళ్ళకు ఎంత పెద్ద శిక్ష  వేసినా తక్కువే’ అంటూ మేనేజర్‌తో పాటు ఇద్దరు దొంగల్ని, గోల్డ్‌ అప్రయిజర్ని సెల్‌లో వేశాడు ఎస్సై.
- చొక్కర తాతారావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement