![Sakshi Magazine Funday: Sridhar Bollepalle Nenu Telugu Story](/styles/webp/s3/article_images/2022/05/9/image-nenu-story.jpg.webp?itok=IvZvAHeY)
ఉన్నట్టుండి మెలకువ వచ్చింది నాకు. టైమ్ చూద్దును కదా అర్ధరాత్రి ఒకటిన్నర. ఇది కాస్త అసహజమైన విషయమే. ఒకసారి పడుకున్నానూ అంటే మళ్లీ తెల్లారేవరకూ వొకపట్టాన లేచే రకం కాదు నేను. నా నిద్రని డిస్టర్బ్ చేయగలిగే శబ్దాలు కూడా ఏమీ బయట్నించీ లోపలికి రాలేదని బల్లగుద్ది చెప్పగలను. ఇలా మధ్యరాత్రిలో నిద్ర లేవడమన్నది ఊహ తెలిశాక ఎప్పుడూ జరగలేదు.
ఒంటరిగా పడుకోవడం అలవాటు లేక మెలకువొచ్చిందని అనుకోడానికి కూడా లేదు. నాకంటూ అసలెవరున్నారని. ఆ ఫ్లాట్‌లో వుండేది నేనొక్కణ్నేగా. మరి నన్ను నిద్ర లేపింది ఏమైవుండొచ్చు? ఉన్నట్టుండి సడెన్‌గా వెలిగింది నాకు, ఆ గదిలో నేను వొంటరిగా లేను. ఇంకెవరో కూడా వున్నారు. నా పడకగదిలో కనీసం బెడ్‌లైట్ కూడా వేసి లేదు. కిటికీల్లోంచీ బయటి వెలుతురేమీ లోపలికి రావట్లేదు.
ఎంత చీకటిగా వుందంటే, అసలు కళ్లు తెరవడానికీ మూయడానికీ తేడా ఏం తెలీడం లేదు. అయినా సరే అర్థమైపోయింది నాకు, ఆ రూములో ఎవరో వున్నారని. నేను భయపళ్లేదు. నాకు ఎలాంటి హానీ తలపెట్టే వుద్దేశం ఆ వ్యక్తికి లేదని నాకు తెలిసిపోతోంది. ఎలా తెలుస్తోందీ అని అడగొద్దు. చిమ్మచీకటిలో కూడా యింకొక మనిషి అక్కడున్నట్టు నాకెలా తెలిసిందో, యిదీ అలాగే.
ఆఫీసుల్లో పెట్టినట్టు నా బెడ్రూమ్ బయట కూడా ఒక లాగ్ రిజిస్టర్ పెట్టాలి. ఇంట్లో నేనొక్కణ్నే వుండి, నిద్రలో మునిగిపోయి వున్నప్పుడు నా గదిలోకి రావాలనుకున్నవాళ్లు ‘పర్పస్ ఆఫ్ విజిట్’ ఏంటో అందులో రాసిన తర్వాత మాత్రమే లోపలికి రావాలి. నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది.
ఆ వొచ్చిన మనిషికి నాకేదో చెప్పాలన్న వుద్దేశం లేదు. నన్నేదైనా అడిగే ఆలోచనా లేదు. కాస్త యెడంగా నిలబడి నేనేం చేస్తున్నానో పరిశీలించడమే అతను (ఆమె?) చేయదల్చుకున్న పని అని అనిపించింది నాకు. అసలైనా అంత చీకట్లో, అందునా నిద్రపోతున్న నన్ను గమనించడం ద్వారా నా గురించి ఏం తెలిసే అవకాశం వుంది?
ఆ వచ్చిన మనిషి చనిపోయిన మా నాన్న గానీ, అమ్మ గానీ అయ్యుండే చాన్సుందా? వాళ్లు వదిలెళ్లిన పాత పెంకుటిల్లు బాగోగులు నేను చూస్కోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయడానికి వచ్చారా? అయ్యుండకపోవచ్చు. మరి?
నాలుగేళ్ల క్రితం చనిపోయిన నా బెస్టు ఫ్రెండు ఆత్మ అయ్యుండొచ్చా? ‘నాగ్గానీ ఏమైనా అయితే, మా ఫ్యామిలీ మేటర్స్ అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాల్రా’ అని చేతిలో చెయ్యేయించుకొని, మాట తీసుకొని మరీ కన్ను మూశాడు. నేను వాళ్లింటి ఛాయలకి పోయి ఎన్నాళ్లయ్యింది? తనకి నేనిచ్చిన ప్రామిస్‌ని గుర్తు చేయాలనుకుంటున్నాడా? ఆత్మలకి అన్నీ తెలిసిపోయే ప్రొవిజన్ వుంటే వాడికి (వాడి ఆత్మకి) నా మీద భ్రమలు తొలగిపోయి వుండాలి. మొత్తమ్మీద యీ కొత్తమనిషి ప్రెజెన్సు, దాని వెనక వుండగల కారణాలు యివన్నీ ఆలోచిస్తుంటే నాకు మిగతా విషయాలేవీ గుర్తుకు రావట్లేదు.
లెక్క ప్రకారం, యిలా అనుకోకుండా మెలకువ వచ్చిన ఎవరైనా ఏం చేయాలీ? ఆ ముందురోజు జరిగిన లేదా తర్వాతిరోజు జరగాల్సిన ముఖ్యమైన పనేదో చప్పున మైండులోకి వచ్చి, దాని గురించే కదా ఆలోచించాలి! నాకు సంబంధించినంత వరకూ ముఖ్యమైన విషయం అంటే లావణ్య తప్ప మరింకేదీ కాదు. పిచ్చెక్కించే అందం, అసాధారణమైన తెలివితేటలు, అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్. అలాంటి అమ్మాయి పార్టనర్‌గా దొరకడాన్ని మించిన అదృష్టం ఏ మగాడికైనా వేరే వుంటుందా? లక్కీగా పెళ్లి అనే సిస్టమ్‌లో యిరుక్కుపోవడానికి లావణ్య కూడా సిద్ధంగా లేదు.
‘లైఫ్ అంతా వొక్కడితోనే అనే ఆలోచనే సఫొకేటింగా వుంటుంది’ అని పైకే అనేస్తుంది. ఎవరైనా వింటే ఏం అనుకుంటారో అనే భయం కూడా లేదు ఆ పిల్లకి. ‘సీరియస్ కమిట్‌మెంట్లు అవసరం లేని క్యాజువల్ రిలేషన్ షిప్ ఎవరితో అయినా ఓకే’ అన్నట్లుగా ఉంటుంది.
లావణ్య అలా ఉండడంత మొదట్లో నాకు పెద్దగా నచ్చలేదు. ఆమె నమ్మే ఫిలాసఫీలో నాకు లాభించగల కోణం ఏంటీ అన్నది నాకు తర్వాత్తర్వాత తెలిసొచ్చింది. ఒకవేళ ఆమె కూడా అందరిలాగానే పెళ్లి ద్వారా వచ్చే సెక్యూరిటీ కావాలనుకుంటే ఏమైవుండేది? అసలు నన్ను దగ్గరకి రానిచ్చేదేనా? మిగతావాళ్ల సంగతేమో గానీ, నాతో ఫిజికల్‌గా ఎఫైర్ పెట్టుకోడానికి లావణ్యకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అలాగని దానికి లివిన్ రిలేషన్ అని పేరు పెట్టడం కూడా ఆమెకి యిష్టం వుండదు. ఏదీ ఒక అరేంజ్‌మెంట్ లాగా, కాంట్రాక్ట్ లాగా వుండకూడదనేది తన ఫిలాసఫీ.
సమాజం ఎప్పుడైనా మార్పుని వ్యతిరేకిస్తుంది. కొన్నాళ్లకి చచ్చినట్టు రాజీపడుతుంది. ఏ మార్పుతో అయితే అయిష్టంగా రాజీపడిందో దాని తాలూకూ ఫలితాన్ని యిన్‌ఫ్లూయెన్స్ చేయాలని కొన్నాళ్లకి దానిలో ఆరాటం మొదలవుతుంది. అప్పుడు ఆ మార్పుకి విలువ లేకుండా పోతుంది. మళ్లీ కొత్త మార్పు కోసం కొత్తగా ప్రయత్నం మొదలవుతుంది. ఇవన్నీ లావణ్య చెప్పిన మాటలే. తన ఐడియాలజీతో నాకొచ్చిన పేచీ ఏమీ లేదనే అనిపించింది నాకు.
∙∙
‘దబ్’ అన్న సౌండుకి మళ్లీ మెలకువొచ్చింది నాకు. కిటికీలో నుండీ విసరబడిన న్యూస్ పేపర్ చప్పుడన్నమాట. పేపర్ బాయ్ మీద భలే కోపం వచ్చింది. అయితే, ఆ కోపం ఎంతోసేపు ఆగలేదు. మూడో అంతస్తులో వున్న కిటికీలోంచీ కచ్చితంగా నా రూములో కొచ్చి పడేలాగా గురిచూసి విసిరే వాడి టాలెంట్ గుర్తొచ్చి ముచ్చటేసింది. అవునూ, మూడు రోజుల్నుండీ నేను పేపర్ చదవనే లేదా? రబ్బర్‌బ్యాండ్ కూడా తీయకుండా పేపర్లు కిటికీ పక్కనే పడున్నాయేంటి? సరే నా సంగతి వదిలేద్దాం.
మరి నా రూముకి కొత్తగా వచ్చిన గెస్టు సంగతేంటి? అతను (ఆమె?) కి పేపర్ చదవాలనీ, బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనీ లేదా? ఎవరో నా పక్కన వున్నారని తెలిసి కూడా నాకు మళ్లీ నిద్ర ఎలా పట్టింది? తెల్లారింది కాబట్టీ, వెలుతుర్లో ఆ మనిషి ఎవరన్నదీ స్పష్టంగానే కనబడొచ్చు. కానీ, నాకెందుకో అలా తెలుసుకోబుద్ధి కాలేదు. అవతలి మనిషి వల్ల నాకెలాంటి యిబ్బందీ లేనప్పుడు ఆరాలు తీయడం పద్ధతి కాదని అనిపించింది నాకు. అలా చేయడం ఎదుటివాళ్ల ప్రైవసీకి భంగం కలిగించడం కాదూ?!
తాళం వేసున్న గదిలో, ఊహించని విధంగా వొక అగంతకుడు ప్రత్యక్షం అవ్వడం, అప్పుడే నిద్రలేచి మత్తుగా ఆవులిస్తున్న హీరోపై హత్యా ప్రయత్నం చేయడం, ఆ ప్లాన్ ముందే పసిగట్టిన హీరో లాఘవంగా అవతలికి గెంతడం, కత్తితో పొడవబోయిన క్రిమినల్ తూలి ముందుకి పడిపోవడం, వాడి చేతిలో వున్న ఆయుధం జారిపోవడం.. సినిమాల్లో చూసిన యిలాంటి సీన్లన్నీ గుర్తుకొచ్చాయి నాకు కాసేపు.
నిజానికి నా బుర్ర చేస్తున్న తప్పు క్షమార్హం కాదు. ఎందుకంటే అసలు నా చుట్టూ వున్న వాతావరణం ప్రాస్పెక్టివ్ క్రైౖ మ్ సీన్లా లేనే లేదు. ముందుగా జరిగిన వొప్పందం ప్రకారం యిద్దరు మనుషులు స్నేహపూర్వకంగా ఒక వెన్యూని షేర్ చేసుకుంటున్నట్టుంది. అయినా, వర్రీ కావాల్సిన సీరియస్ యిష్యూస్ వదిలేసి, యింత అల్పమైన విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను నేను?
పట్టించుకోవాలే గానీ ఎన్ని సమస్యలు లేవు నాకు! లావణ్య విషయంలో నాకు పోటీ వస్తున్న కొలీగ్ సుందర్ విషయంలో ఏం చేయాలో ఆలోచించాలి ముందు. సుందర్..! ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదు. లేదా, వయసు పెరక్కుండా అడాలసెన్స్‌లోనే ఆగిపోయినట్టున్నాడు. లావణ్య మనసు మార్చగలననీ, ఆమెకి పెళ్లి మీద నమ్మకం కుదిరేలా చేస్తాననీ వాదిస్తాడు.
‘జీవితాంతం యితని చేయి వదలకూడదు అనిపిచేంత నమ్మకం కలిగించే మగాడు తారసపడకపోవడం వల్లే లావణ్య అలా మాట్లాడుతోందీ’ అంటాడు. ‘ఎన్ని రోజులు ఎదురుచూసైనా సరే, ఎంత కష్టపడాల్సివచ్చినా సరే.. లావణ్యని పెళ్లి చేసుకోవడమే నా జీవితాశయం’ అంటాడు.
ఒకప్పుడు తను కూడా సుందర్ లాగానే వుండేవాడు. అచ్చం అలానే ఆలోచించేవాడు, ‘విధి యిద్దరు మనుషుల్ని దగ్గరగా తీసుకురావడం, వాళ్లిద్దరూ కలిసి జీవితం పంచుకోలేకపోవడం, ఆ వెలితి వాళ్లని జీవితాంతం వేధించడం’.
కాలేజీ రోజుల్లో యిలాంటి కథలు ఎంత కిక్కెక్కించాయో.. తనకి కూడా! చాలామంది గ్రాడ్యువల్‌గా ఆ ట్రాన్స్ నుండి బయటకి వచ్చేస్తారు. సుందర్ మాత్రం బయట ప్రపంచం ఎలావుందో చూడడానికి రెడీగా లేడు. అతని ప్రవర్తన చైల్డిష్‌గా వుందని చెప్పడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం లేదు సరి కదా, కోపం తెచ్చుకొని అసహనంతో రగిలిపోతున్నాడు.
∙∙
‘కావాలంటే నువ్వూ లావణ్యని ప్రేమించు. తనని పెళ్లి చేసుకోవాలని నాకు మాదిరిగానే కలలు కను. నాకేం అభ్యంతరం లేదు. మనిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటే లావణ్య వాళ్లనే ప్రేమిస్తుంది. అసలు లావణ్య వరకూ ఎందుకు?! నాకన్నా నువ్వే తనని ఎక్కువ సంతోషంగా ఉంచగలవు అని నమ్మకం కుదిరితే నేనే హ్యాపీగా మీ యిద్దరి లైఫ్‌లో నుండీ వెళ్లిపోతాను. కానీ, అసలు ప్రేమా పెళ్లీ అనే ప్రస్తావన లేకుండా, వొక అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుంటే చాలు అనుకోవడం తప్పు’ అన్నాడు సుందర్.
‘చెప్పేది వినవే. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవొద్దు, తనతో సంబంధం పెట్టుకుంటే చాలు’ అని జనరలైజ్ చేయడం లేదు నేను. ఇక్కడ డిస్కషన్ కేవలం లావణ్య గురించే. ఆ అమ్మాయికి కావాల్సిందేదో తనకి యివ్వడమే కదా ఆమెని ప్రేమించేవాడు చేయాల్సిన పని?’ లాజిక్ తీశాన్నేను.
‘అసలిలా ఎలా మాట్లాడగలుగుతున్నావ్? ఆ అమ్మాయికి లైఫ్ అంటే ఏంటో యింకా క్లియర్‌గా తెలీదు. ఏదో సరదాకి అలా మాట్లాడుతుందంతే. తన అమాయకత్వాన్నీ, వల్నరబిలిటీనీ క్యాష్ చేసుకోవడంలో తప్పు లేదని అంటున్నావ్ నువ్వు, అంతేగా?’, నన్ను విలన్ లాగా చూస్తూ అడిగాడు సుందర్. ‘లైఫ్ అంటే ఏంటో యింకా క్లియర్‌గా తెలియని అమ్మాయిని ప్రేమించి, ఆమెని పెళ్లి చేసుకోవడం కూడా తప్పేగా మరి?
కొన్నాళ్లయ్యాక ఆమె తన యిష్టాయిష్టాలేంటో తెలుసుకొని, అసలు పెళ్లెందుకు చేసుకున్నాన్రా దేవుడా అని వుసూరుమంటుందేమో?’ అన్నాను నేను. చెప్పొద్దూ, నన్ను చూసుకుంటే నాకే చాలా గర్వంగా అనిపించింది. ఈ దెబ్బకి సుందర్‌గాడి మాట పడిపోతుంది.
‘భవిష్యత్తులో లావణ్య పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అనుకుంటే, అది లైఫ్ గురించి మొత్తం తెలుసుకున్నట్టు అవుతుందా? పెళ్లి చేసుకోవడం కంటే, దొరికినోడితో దొరికినట్టు ఉండడం బెటర్ అనే ఆలోచన తప్పు అని తెలుసుకోవడం కదా అల్టిమేట్ రియలైజేషన్ అంటే?!’ వీడంత తేలిగ్గా రాజీ పడే రకం కాదు. ‘సుందర్, నువ్వేం అనుకోనంటే నిన్నొక ప్రశ్న అడుగుతాను’ టెంపో మార్చి, సాఫ్ట్‌గా అన్నాను.
‘ఏంటి? అడుగు’ అనుమానంగా బదులిచ్చాడు. ‘పెళ్లి గురించి లావణ్య ఫిలాసఫీ మీద నీకు రెస్పెక్ట్ లేదు. ఆ అమ్మాయికి తన లైఫ్ గురించి తాను డెసిషన్ తీసుకునేంత మెచూరిటీ వుందనే నమ్మకం లేదు. మరి, ఏం చూసి తనని ప్రేమించావు? ఎందుకు తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు?’ నా నుండి ఈ ప్రశ్నని సుందర్ ఏమాత్రం వూహించలేదని తన ఎక్స్‌ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. సుందర్‌లో కాస్త నిజాయితీ లేకపోలేదు. అతని స్థానంలో ఎవరైనా వుంటే, నా ప్రశ్నకి అడ్డదిడ్డంగా ఏదో వొక సమాధానం చెప్పివుండేవాళ్లు. కానీ సుందర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించాడు.
నిజానికి సుందర్‌ని కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. లావణ్యతో నేను సంబంధం పెట్టుకోడానికి అతని పర్మిషన్ తో పనేముంది? కానీ, ఎందుకోగానీ నేను చేసే పని రేషనల్‌గానే వుందని సుందర్‌ని నమ్మించాలని అనిపిస్తోంది. బహుశా, నేనూ వొకప్పుడు అతనిలాగానే ఆలోచించేవాడిని అని నాకు పదేపదే గుర్తుకు రావడం వల్ల అనుకుంటాను. వాదించడం ఆపేసి సుందర్ డిఫెన్సులో పడిపోవడం నాకు కాస్త వుత్సాహానిచ్చింది.
సుందర్.. విషయం యిక్కడిదాకా వచ్చింది కాబట్టీ, నాకు ఏమనిపిస్తుందో చెపుతా విను. నీకూ నాకూ లావణ్య నుండీ కావాల్సింది వొక్కటే. మనిద్దరి అప్రోచ్ మాత్రమే వేరు. పెళ్లి అన్నమాట ఎత్తకుండా లావణ్యతో నేను ఎక్కడ తేలతానో, పెళ్లీ పెళ్లీ అని కలవరిస్తూ నువ్వు కూడా అక్కడే తేలతావ్. పచ్చిగా చెప్పాలంటే, లావణ్యతో ‘రిలేషన్‌షిప్’ కోసం నువ్వు పెళ్లి అనే పదాన్ని అడ్డం పెట్టుకుంటున్నావ్, అంతే!’
మరీ యింత హార్ష్‌గా చెప్పకుండా వుండాల్సిందేమో. కానీ, యిక ముసుగులో గుద్దులాట అనవసరం. ఈసారి కూడా సుందర్ ఏమీ మాట్లాడలేదు. లేచి నిలబడి గదిలో అటూయిటూ పచార్లు చేయడం మొదలెట్టాడు. ఆల్రెడీ లైన్ క్రాస్ చేసేశాను. ఇక కొత్తగా జరగ్గలిగే డ్యామేజ్ అంటూ ఏం లేదు. సిగరెట్ పెట్టె, లైటర్ చేతిలోకి తీసుకొని, అప్పటిదాకా జరిగిన చర్చని కంక్లూడ్ చేస్తూ చెప్పాన్నేను.. ‘నా మాట విని నువ్వూ నా స్కూల్లోకొచ్చెయ్. ఇలా తర్జనభర్జన పడుతూ పోతే, చివరికి నువ్వూ నేనూ తప్ప అందరూ వాడతారు దాన్ని’ లావణ్య గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం మేము.
కానీ ఆమెని వుద్దేశించి ‘దానిని’, ‘అది’ లాంటి పదాలు నేను వాడడం అదే మొదటిసారి. కుండబద్దలు కొట్టేసి, నా పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి, మాటలకి మరీ ఎక్కువ డెకరేషన్ అవసరం లేదు అని నా యిన్‌స్టింక్ట్ చెపుతోందన్నమాట.
హాల్లోంచీ బాల్కనీలోకి వెళ్లే తలుపు బోల్ట్ తీస్తూ నేను పై మాటలు అంటున్న సమయానికి సుందర్ వేరేౖ వెపు తిరిగి వున్నాడు. అతని ఫేస్ నాకు కనబడుతూ వుండివుంటే కనీసం చివరి రెండు వాక్యాలైనా మాట్లాడకుండా నిగ్రహించుకొని వుండేవాణ్నేమో. సుందర్ ఆవేశంగా నా మీదకి రావడం అర్థమయ్యి చప్పున వెనక్కి తిరగబోయాను నేను. అప్పటికే అతను నా కాలర్ పట్టుకుని విసురుగా వెనక్కిలాగి, నా తలని పక్కనే వున్న గోడకేసి కొట్టాడు. అతని పట్టు నుండి విడిపించుకోడానికి నా శక్తికొద్దీ ప్రయత్నించాను. చూడ్డానికి అర్భకుడిలా వున్నాడనే కానీ గట్టిపిండమే.
∙∙
నా గదిలో ఎవరో వున్నారని నేను గ్రహించడం దగ్గర కదా ఈ కథ మొదలైంది. నేను పడుకోడానికి ముందు ఏం జరిగిందీ అన్నది గుర్తు చేసుకున్నాక నాకు యిప్పుడు కొంత క్లారిటీ వచ్చినట్లే అనిపిస్తుంది. సుందర్‌ని నేను చంపేశానన్నమాట. నాకు నిద్రాభంగం అవడానికి కారణమైంది సుందర్ శవం కానీ లేదా అతని ఆత్మ కానీ అయ్యుండాలి.
సెకండ్ ప్రాబబిలిటీ ప్రకారం, సుందర్ నన్ను చంపేసి వుంటే, ఆ గదిలో వున్న యిద్దరూ నేనే అవ్వడానికి కూడా అవకాశం వుంది. సుందర్‌కీ నాకూ మధ్య జరిగిన పెనుగులాటలో ఎవరు గెలిచారు అన్నదానిమీద ఆధారపడి వుంటుంది నిజం ఏంటన్నది.
అన్నట్టు మీకు యింకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. సుందర్ నన్ను చంపడానికి ప్రయత్నించడం, అంత కంగారులోనూ, నన్నేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదు. నన్ను ఆశ్చర్యపోయేలా చేసిందేంటంటే, సుందర్ మొహంలో కోపం కాకుండా భయం కనిపించడం. తన గురించి తాను తెలుసుకోవడంలో మనిషికి వుండే భయం.
ప్రాణాలు వదలడానికి ముందు ఏబర్డీన్ లోయల్లో మాక్బెత్‌ని వేధించిన భయం. నిజం బారి నుండి పారిపోలేని నిస్సహాయత దెయ్యంగా మారి వెంటాడుతున్నప్పుడు కలిగే భయం. ఫైనల్‌గా సుందర్‌ని నేను కన్విన్స్ చేశానా? ఒకవేళ నా ప్రవర్తనని సమర్థించుకోడానికి నేను సుందర్ మొహంలో భయాన్ని కాకుండా ఆశ్చర్యాన్నే చూసినట్టు నటిస్తున్నానా? ఈ చివరి ఆలోచన రాగానే నా వొళ్లు వొక్కసారిగా జలదరించింది. తల పక్కకి తిప్పి, నా గదిలో వున్నదెవరో చూడాలంటే నాకిప్పుడు భయంగా వుంది.
Comments
Please login to add a commentAdd a comment