అడవి గుట్టలపై దాకా విస్తరించింది. ఆనుకొని కొన్ని ఊర్లు.. రాళ్లు కనబడనంత పచ్చదనంతో నిండినా గుట్టల వరుస, దూరం నుంచి పచ్చని బుట్టలుగా కనబడుతున్నాయి. ఆ బుట్టలోకి సూర్యుడు నెమ్మదిగా జారుకున్నాకా, ఎవరో కాల్చొదిలేసిన బీడీ ముక్కకి అడవిలో మెల్లగా మంటలు లేచాయి.
గుట్ట పొడవునా తీగలా పాకిన ఎలగడ మంటలు. గాలులకు వేడి సెగలు తాకి ఆనుకొనున్న ఊర్ల మీదికి వీచాయి. ఓ ఊరి జనం తమ పొలాలకు మంటలు అంటుకోకుండా నీళ్లు తడుపుతూ జాగ్రత్తలు తీసుకుంటుంటే, అడవిలో నుంచి వినబడుతున్న రకరకాల జంతువుల అరుపులు, ఒక్కసారిగా ఓ గాండ్రింపు విని అన్నీ ఉన్న చోటే నిశబ్దమైయ్యాయని గమనించారు. పెద్ద పులి.
ఆ ఊరి జనం ఎలగడ మంటల్లో కనబడిన పులిని చూసి ఒక్కసారిగా దడుసుకున్నారు. అగ్గి వెలుతురుకి దాని కళ్లు ఇంకా కాంతివంతంగా ఉంటే, దాని ఒళ్ళు హూందాగా, మెల్లగా అడుగులేస్తూ కదులుతోంది. తమ పశువులపై కన్ను పడిందని అర్థమై గొర్రెల్ని, బర్రెల్ని, ఆవుల్ని ఇంట్లోకి తీసుకెళ్లసాగారు.
పులి అతి కొద్దిసేపటికే ఊరు మీదికి వచ్చేసింది. భయంతో ఎటు పడితే అటు పరిగెడుతున్న జనంలో, ఓ ఆవుపై పంజా విసిరింది. గట్టిగా దొరకబట్టి కొరికింది. చెట్ల పైకెక్కి కొందరు అరుస్తూ రాళ్లు, నిప్పు కట్టెల్ని విసురుతున్నా కూడా పులి మాత్రం ఆవుని చంపే దాకా వదల్లేదు. సగంగా చీల్చిన దేహాన్ని నోటితో లాగుతూ అడవిలోకి తీసికెళ్ళిపోయింది.
అర్ధరాత్రి వరకు అడవిలోని మంటలు కాస్త చల్లారాయి. కానీ ఊరూరంతా వేడెక్కిపోయి కూర్చుంది.. ఓ చెట్టుకింద.
‘నీయవ్వ, ఆఫీసర్ల మీద గౌరంతో పులిని ఏమనకుండ కూసుంటే, శివరికి గిట్ల భయపడ్తూ బలవ్వుడే అయింది కదే. ఇగ గిట్లే సూస్కుంట కూసుంటే గాదు. నేనే ఏదోటి జేత్తా. పులిని సంపుడో లేదా దాని సేతుల సచ్చుడో, ఏదోటి తేలాలే ఇయాల’ లింగ.. పులి తన ఆవుని చంపిందని కోపం బాధతో.
‘రోజూ ‘పులి కగ్గితగలా పులి కగ్గితగలా’ అని కోరుకుంటాంటే, అడివికగ్గితగిల్నా కూడా అల్లకేలే దున్కవట్టే. దాని పీనుగెల్ల. రాన్రాను అడివిడిశిపెట్టి ఊర్లనే దర్జాగా తిరుగుతదేమో.. మన పీనుగుల్ని పీక్కుతింటానికి. ఓరి లింగా గీ ఆఫీసర్లను నమ్ముకోకురా, నీ బల్లేనికి పనిజెప్పుకో, అప్పుడే సక్కగైతది’ ఓ ముసలవ్వ.
‘ముసల్ది గట్లే అంటది. అడివిని ఈ నేలని నమ్ముకొని ఎన్నేండ్లనుంచో ఈడ్నే ఉంటున్నంగా, ఇప్పుడంటే పులులు అత్తున్నయ్ గానీ దానికంటే ముందు వేరే జంతువులేమైన తక్కువనా యేంది? కానీ ఇవేం కొత్త కాదుగా. మల్లోసారీ ఆఫీసర్లకు సెప్పిసూద్దాం, ఆల్లే సూస్కుంటరు’ తాత్పరంగా కూర్చుంటూ చెప్పాడు మరో పెద్దమనిషి.
పక్కకున్న తన బల్లేన్ని అందుకొని, ‘హా! సూస్కున్నర్తి పులిని.. మనల్ని కాదు. అయినా నీదేంబోయిందోయ్.. ఎన్నైన సెప్పిసత్తవ్. సచ్చింది మా పసువులు. ఇన్ని రోజులంటే ఎదురుజూసినం, ఇప్పుడు ఎదురుతిర్గుడే. అందుకే ఎవలచ్చినా రాకున్న నేనే తేల్చుకుంటా. సెప్పిన కదా సచ్చుడో లేదా పులిని సంపుడో’ లింగ ఆవేశంగా.
‘నువ్వు ఊ అంటే బల్లెం ఎత్తుతానవేంద్రా.. దించు. నీ బాధ నాకు తెల్సురా. కానీ ఈ ఒక్కసారి నా మాటినుర్రి. ఆవేశంలో పులిని ఎదుర్కునుడు పెద్ద పని కాదనుకుంటున్నావ్. నీకు నీ బల్లేనికి గంత ధైర్యం లేదని తెల్సు. అందుకే ఆఫిసర్లకు జెప్తే ఆల్లే సూస్కుంటరు. ఆళ్లకు జెప్పకుంట జేస్తే మల్ల జాగలు ఖాళీ జేయమంటర్రా. ఎందుకచ్చిన లొల్లి, కొంచెం నిమ్మలంగాండ్రి ముందు’ పెద్దమనిషి.
‘ఎప్పుడు సూడు ఏదో నచ్చజెప్పుడే ఉంది నీది. సచ్చుడుకి సిద్ధమైన కాబట్టే ఈ ధైర్యం, మనందరి పానాల కంటే ఎక్కువనానే. సరే. నువ్వన్నట్టు ఆఫీసర్లనే అడుగుదాం. రేపే అందరం సద్దులు వట్టుకొనే ఆఫిసర్ల కాడికే పోదాం. ఇనే దాక ఆన్నె ఉందాం. ఎంటనే పులిని పట్టుకుంటామంటే సరి లేకుంటే మాత్రం ఏం జేయాల్నో గదే సేసుడు’ లింగా.
అవును.. అతను అన్నది లెక్కేనని ఊరంతా అనుకున్నరు. అలా అనుకున్నారో లేదో పులి గాండ్రింపు గుట్ట మీది నుంచి గట్టిగా వినబడింది. ఒక్కసారిగా అందరూ అలర్టయి అటు వైపే చూశారు. ఎర్రటి చంద్రుడికి అడ్డంగా నిల్చున్న పులి ఆకారం స్పష్టంగా కనబడసాగింది. లింగా ఆవేశం ఆపుకుంటూ బల్లెం మీద పట్టు బిగించాడు. పులిని చూస్తూ కొందరి కళ్లల్లో చింత నిప్పులు, కొందరి కళ్లల్లో ఊటబాయిలు, ఇంకొందర్లో రెండూనూ.
తెల్లారింది..
అటవీశాఖ కార్యాలయం తాళం తీయడానికి వచ్చిన అటెండరు, ఆఫీస్ ముందు కూర్చున్న నాలుగొందల మందిని చూసి ఒక్కసారిగా జడుసుకున్నాడు. అతని ఫోన్ లాక్కొని ఒకచోట కూర్చోబెట్టారు. అధికారులు రాగానే అందరూ గుమిగూడి ఆందోళనకు దిగారు. నచ్చచెప్పాలని ఎంత చూసినా అధికారుల మాటలు ఎవరూ వినేలాలేరు.
జనాల ఆవేశం చూసి అధికారులకు చెమటలు పడ్తున్నాయి. ‘విషయం సీరియస్‌గా ఉందని చెప్తాం. తమ పై అధికార్లతో మాట్లాడడానికి కాస్త సమయం కావాలి’ అని అడగడంతో అధికారులను కార్యాలయం లోపలికి వెళ్ళనిచ్చారు.
ఏసీ గదిలోకి రాగానే కాన్ఫరెన్స్ కాల్ కలుపుకొని చెమటలు తుడ్చుకోసాగారు అధికారులు.
‘ఆల్రెడీ చెప్పారు కదయ్యా, మళ్లీ ఏంటి? ట్రాంక్విలైజ్ (మత్తు మందు) చేయడానికి పర్మిషన్లు వద్దా? దానికి టైమ్ పడ్తదని తెలీదా? మత్తు మందు ఎత్తు నుంచి ఇవ్వడానికి ఏనుగుల్ని మధ్యప్రదేశ్ నుంచో తమిళనాడు నుంచో పంపొద్దూ! దానికి వైల్డ్ లైఫ్ టాస్క్ ఫోర్స్ పర్మిషన్ ఇవ్వొద్దూ? ఎందుకోయ్ తొందర?’ వీడియో కాన్ఫరెన్స్ కాల్లో పై అధికారి.
‘అది కాద్సర్.. బయట జనాలు గందరగోళం చేస్తున్నారు. పరిస్థితి కాస్త అదుపు తప్పేలా ఉంది. వారం రోజుల్లోనే పులి వల్ల దాదాపు 35 ప్రాణాలు బలయ్యాయి సార్. పులి సంగతి తేల్చే వరకు ఊరి జనం ఆఫీస్ ముందు నుంచి కదిలేలా లేరు’
‘అవునయ్యా.. కానీ తొందరపడితే లాభం లేదుకదా! ఇలాగే పోయిన నెల సరైన ఎక్స్‌పీరియెన్స్ లేకే, పక్క రాష్ట్రం ఆఫీసర్ల పై దాడి జరిగి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. పులికి మీరు కూడా బలి అవుతారా ఏంటి? ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి’ ఫోన్‌కాల్ కట్ చేయబోతూంటే..
‘సార్ సార్.. ఇదే విషయం బయట చెప్తే జనం ఇంకా సీరియస్ అవుతారు సార్. ఇప్పటికే మాటినట్లేదు.’
‘అయితే నేనేం చేయాలయ్యా? పోలీసులకు ఫోన్ చెయ్. అడవి దగ్గర ఊర్లన్నీ ఎప్పుడో ఖాళీ చేయమని చెప్పాం కదా. వాళ్ళే ‘మా అడవి.. మా మట్టి‘ అని కూర్చున్నారు.
ఇప్పుడు అనుభవిస్తున్నారు. మన పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వమేమో, పులుల కొత్త అభయారణ్యం అనుమతుల కోసం టైగర్ రిజర్వ్‌కి లేఖలు రాస్తోంది. మనం, ఉన్న దాంట్లో కనీసం జనాన్ని ఖాళీ చేయలేకపోతున్నాం..’
‘నిజానికి ఇప్పుడున్న ప్రాబ్లం ఆ రాష్ట్ర సరిహద్దు దగ్గరే మొదలైంది సార్. అంటే వాంకిడి, సిర్పూర్ లాంటి మండల శివారు ప్రాంతాల్లో పెన్ గంగ, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయ్ కదా సార్! ఆ నదికి అవతల వైపున్న మహారాష్ట్ర అడవిలోని పులులు, ఫోడ్సా అనే సరిహద్దు గ్రామంలోని అడవి దగ్గర నది నీళ్ళతో దాహం తీర్చుకుంటున్న వాటికి ఇవతల వైపున్న తెలంగాణ అడవిలోని జంతువులు.. మనుషులు కనబడడంతో దాడి చేయడం మొదలెట్టాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పులులు తిరుగుతూ తిరుగుతూ మన అడవికి, ఆనుకొనున్న ఊర్ల వరకూ వచ్చాయి సార్..’
‘సర్లేవయ్యా, దానికి ఎవడు మాత్రం ఏం చేస్తరు? సరిహద్దులు మనుషులకే.. జంతువులకు కాదు. మీ విషయం వివరంగా చెప్పి ఆ పర్మిషన్లేవో కాస్త అత్యవసరం కింద తీసుకొస్తాన్లే. ఏదో ఒకటి చెప్పి ముందు వాళ్లని పంపించేస్కోండి’ ఫోన్‌కాల్ కట్ చేసేశాడు.
అధికార్లకి మళ్ళీ చెమటలు పడ్తున్నాయి. బయటకొచ్చి చూసేసరికి ఇంకొన్ని ఊర్ల జనం కూడా తోడయి మొత్తం మూడువేల మంది జమయ్యారు. వాళ్లంతా పంజా విసిరే పులుల్లాగే ఉన్నారు. ‘పై ఆఫీసర్లు ఇంకాస్త సమయం పడ్తదన్నారు, కాస్త ఓపిక పట్టిండి’ సీనియర్ అధికారి నచ్చజెప్పబోతే, ‘ఎంత టైమ్’ అని నిలదీశారు.
‘కరెక్ట్‌గా ఇంత అని చెప్పలేం కానీ కొద్ది రోజుల్లోనే’, అనగానే, ‘ఈడికచ్చిన సగం మంది పులి దెబ్బకి సచ్చినాకనా?! ఈల్లు గిట్లే అంటరు గానీ మనం జేయాల్సింది జేసుడే, అప్పుడే తొందర వడ్తరు’ అని జనం అక్కడున్న అటవీ శాఖ అధికార్లందరినీ కార్యాలయంలోకి తోసి బయటికి గొళ్లెం పెట్టి తాళం వేసేశారు! విషయం తెలుసుకున్న పోలీసులు వెంటవెంటనే చేరుకున్నారు.
జనం వాళ్ళకు ఎదురుతిరిగారు. లాఠీలకు పని చెప్పక తప్పలేదు. కార్యాలయంలో బంధించిన అధికార్లకు ఏ పొదల్లోంచి పులి వస్తదేమోనంత భయంగా ఉన్నారు. ఎందుకంటే జనం ఆవేశంతో ఏ పామునో అడవి పందినో లోపలికి పంపిస్తే పరిస్థితేంటని బయటికి చూస్తూ కూర్చున్నారు. పిల్లలు, ఆడవాళ్లని తేడా లేకుండా బయట పోలీసులు తరిమేయాలని చూస్తున్నా ఎవరూ వినకుండా ఎదురుతిరుగుతూనే ఉన్నారు.
కొద్దిసేపటికి మీడియా రాకతో, న్యూస్ కాస్త వైరల్ అయ్యింది. నిరసనలు, లాఠీ చార్జ్, ఎదురుతిరగటాలు వీడియోలుగా ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తుంటే, అటు టీవీ చానెల్స్‌లో ‘మనిషి–పులి’ చర్చ మొదలైంది.
‘భూమ్మీద ఎన్నో జీవరాశులు అంతరించిపోతున్నప్పటికీ, పెద్ద పులుల పైనే ఎందుకింత ఆసక్తి?! నేషనల్ యానిమల్ ఫ్యామిలీ అనా?’ ఒకరు. ‘అంతరించిపోయే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషులకి లేదా? పులులు మనుషుల మధ్యకి రాలేదండి, మనుషులే అడవిని దున్నుకుంటూ వాళ్ళ మధ్యలోకి వెళ్లారు’ ఇంకొకరు. ‘పులినైనా.. మనిషినైనా.. కాపాడాల్సింది ప్రభుత్వమే’ మరొకరు.
యాంకర్ వారి ముగ్గుర్నీ అదుపులో పెడ్తూండగానే వాళ్లు తిట్టుకోవడం మొదలెట్టారు. మరో దిక్కు వేరు వేరు సభలు నిర్వహిస్తూ అటు మానవ హక్కుల సంఘాలు, ప్రపంచ మేధావులు, ఇటు ప్రతిపక్షాలు అడవి బిడ్డల వైపే మద్దతు పలుకుతున్నామని ప్రకటించాయి.
అయితే బయట ప్రపంచంలో జరుగుతున్న ఈ రాద్ధాంతం అటవీ అధికార్లను బంధించిన అడవి బిడ్డలకు ఏ మాత్రం తెలీదు! అడవిలో ఉన్న జంతువుల పట్ల కూడా తమకున్న ప్రేమ అపారమని, కాని తప్పని పరిస్థితుల్లో ఇలా చేస్తున్నామని అడవి బిడ్డలు లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులకు చెప్పుకొచ్చారు. ఆ మాటలు జాలేశాయో లేక సిబ్బంది తక్కువగా ఉండడంతో జనాల్ని కంట్రోల్ చేయలేకో పోలీసు లాఠీచార్జ్ ఆపేశారు.
కార్యాలయం బయటే వంటా వార్పూ మొదలైంది. ఈ లోపే పై అధికార్లతో ప్రభుత్వం చర్చలు పెట్టి చర్యలు తీస్కోడానికి సిద్ధమైంది. సాయంత్రానికి దిగొచ్చి ఓ ప్రకటన విడుదల చేసింది.
‘అడవికి ఆనుకొని ఉన్న గ్రామంలోని ప్రజల్ని, వాళ్ల పాడి పశువుల్ని కాపాడుకోవడానికి, అంతరించిపోతున్న పులులను కాపాడుకునే బాధ్యతతో పులి ఆకలి తీర్చడానికి శామీర్‌పేట్ మహావీర్ హరిణ వనస్థలి జాతీయ వనం నుంచి వంద చుక్కల జింకల్ని, దుప్పుల్ని టైగర్ కారిడార్‌కి పంపుతున్నాం. వీటిని అడ్డంపెట్టుకుని పులిని ట్రాంక్విలైజ్ చేసి వెటర్నరీ డాక్టర్ సమక్షంలో ఒక ట్రాకర్‌ను కూడా అమర్చుతారు’ అని ఆ ప్రకటన భావం.
పోలీసులు, అటవి అధికార్లు అక్కడున్న జనాలకు అర్థమయ్యేలా వివరంగా చెప్పి వాళ్ళను చల్లార్చారు. జనానికి నమ్మకం కలిగి, కార్యాలయం తాళాలు తీసి, అధికారులకు భోజనాలు పెట్టి వెళ్ళిపోయారు. లింగకి మాత్రం లోలోపల ఏవో ప్రశ్నలు రేగుతున్నాయి.
∙∙
అడవిలోనే పుట్టి పెరిగిన ఒక దుప్పి, ఎప్పటిలా ఒక ఉదయం ఎవరి కంటా పడకుండా మెల్లిగా చెట్ల మధ్య నుంచి తిరుగుతూ ఉంది.. దొరికిన వాటిని తింటూ! అప్పుడే హైదరాబాద్ జూపార్క్ నుంచి వచ్చిన రెండు వ్యాన్లను గమనించి ఆగింది. తీక్షణంగా ఆ వ్యాన్‌ల వైపు చూస్తూ ఉండిపోయింది. వాన్ వెనుక డోర్లు తీయగానే ఎదురుగా కనబడిన పచ్చని అడవి చూసి లోపలున్న జింకలు, దుప్పులు చెంగున బయటికి దూకాయి.
చుట్టూ రకరకాల పక్షుల కూతలు, సెలయేళ్ల చప్పుళ్లు, కంటినిండా పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ జైలు నుంచి విడుదలైనట్టు సంబురంగా ఒక్కోటి ఒక్కో దిక్కు పరుగెత్తసాగాయి. వాటినన్నిటిని దూరం నుంచి కాస్త ఆశ్చర్యంగా చూస్తోంది అడవి దుప్పి. వ్యాన్ల నుంచి అన్నిటినీ దించకుండా జింక మాంసం కోసం కొన్నిటిని వేరే జీప్‌లోకి ఎక్కించి పంపించాడు డ్రైవర్.
వ్యాన్ దిగిన ఓ పిల్ల జింక తల్లి కోసం వెదుకుతూ జీప్ వెనుకే పరుగెత్తింది, అందుకోలేక ఓ చోట ఆగిపోయింది. అధికారులు తమకు పంపిన ట్రాంక్వి గన్స్ చెక్ చేసుకొని సిద్ధమవుతున్నారు.
కాసేపటికే పులి గట్టిగా గాండ్రించింది.. అడవి దద్దరిల్లింది.
పక్షులు, జంతువులు ఉలిక్కిపడ్డాయి, ఉక్కిరిబిక్కిరయ్యాయి. కొన్నైతే గాండ్రింపు విన్న దిక్కు కాకుండా వ్యతిరేక దిశకు పరుగుతీశాయి. ఆ ‘అడవి దుప్పి’ తలతిప్పి చూసింది.
పులి గాండ్రింపులు ఇంకా వినబడుతున్నా కొద్దీ, బెదురు కళ్ళతో ప్రాణులు చెల్లాచెదురవుతున్నాయి.
తల్లి కోసం తిరుగుతున్న జింక పిల్ల పై పులి కన్ను పడి వెంట పడసాగింది. అది పరిగెడుతున్న వేగానికి సర్రున గాలి చీలినట్టు శబ్దం వస్తోంది.
ఆ జింక పిల్ల ప్రాణ భయంతో దొరక్కుండా.. దారితెన్ను లేకుండా చెట్ల మధ్య నుంచి పారిపోతోంది. పులి తన శరీరాన్ని సాగదీస్తూ దాని వెంటపడి వేటాడుతోంది. జింక పిల్లయితే, దూది పింజలా ఎగురుతూ, భీతిల్లిపోయి పరిగెడుతోంది. దాని కళ్ళ నిండా భయం. రెండుమూడుసార్లు.. జింక దొరికినట్టే దొరికి పారిపోతోంది. పులి మరింత కోపంగా పంజా విప్పి గాండ్రించింది. అదెంత ఆకలి మీదుందో, దాని కళ్ళు, ఎండుకుపోయిన దాని డొక్కలు వూగుతున్నాయి.. ఆయాసంతో. ఈ వేటను దూరం నుంచి చూస్తున్న అడవి దుప్పికి కూడా పులి మీద భయంతో ఎటు పారిపోవాల్నో అర్థం కాలేదు. జాగ్రత్తపడి ఓ చోట నిల్చుంది.
కొంతసేపటికి అడవి నిశ్శబ్దమైపోయింది.. దుప్పి నిశ్చలమై పోయింది. పులి పంజాకు చిక్కింది, జింక అరుపులు కొద్దిసేపు వినొచ్చాయి. పది నిమిషాలు అడవంతా నిశ్శబ్దం. జింకను సుష్టుగా తిన్న పులి.. నాలుకతో మీసాలు తుడుచుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ ఒక పొదలోకి వెళ్లి పడుకుంది. దుప్పి గుండె భయంతో కొట్టుమిట్టాడింది.
పొదల్లో పులి నిద్రలోకి జారిపోయింది. దుప్పికి మెల్లమెల్లగా అర్థమైంది. మనుషులు తమను తాము కాపాడుకోడానికి అందాల జింక పిల్లని పులి పంజాకి చిక్కించేశారని. దాంతో పాటు కొన్ని జింకల్ని మనుషులే తినడానికి తీస్కెళ్ళారని కూడా అర్థమైంది. ఆ అడవి దుప్పికి ఆందోళన మొదలైంది, పులి కంటే మనుషుల మీదే అసహ్యం కలిగింది.
తమ జాతి ప్రాణుల పట్ల జరుగుతున్న జంతుమేధానికి దుప్పి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఓ చెట్టు పై అలికిడయ్యింది. ఉలిక్కిపడి తలెత్తి చూసింది దుప్పి. చెట్టు కొమ్మల్లో ఒక మనిషి పొడవైన ట్రాంక్వి గన్ పట్టుకొని పొదలో పడుకున్న పులి వైపు గురిపెట్టి చూస్తున్నాడు.
దుప్పి ఒక్కసారిగా తన బలాన్ని కూడదీసుకొని.. ఆ చెట్టుని ఢీ కొట్టింది!
మోడుబారిన చెట్టు కొమ్మల్లా ఉన్న దాని కొమ్ములు రెండు సగం విరిగాయి. తుపాకీతో సహా.. అతను దబ్బున కిందపడ్డాడు. దుప్పి వేగంగా వచ్చి.. సగం విరిగున్న కొమ్ములతో అతన్ని కుమ్మింది.
ఆ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయెంత సమయం కూడా అతడికి లేదు. ‘అ..మ్...మ’ అని అడవి దద్దరిల్లేలా అరిచాడు. అతని భీకర అరుపుకి పులి నిద్రలేచినట్టే లేచి బద్ధకంగా ఒళ్ళు విరిచి మళ్ళీ పడుకుంది. దుప్పి కొంత దూరం వెనుకడుగేసి, వేగంగా మరోసారి వచ్చి కుమ్మింది! అతను అరుస్తూనే లేచి, పరిగెత్తసాగాడు.
అప్పటికే దుప్పి కొమ్ములు దిగి అతడికి శరీరం రక్తసిక్తమైంది. అయినా మెల్లిగా తుపాకీ అందుకొని దుప్పికి గురిపెట్టాడు. ట్రిగ్గర్ మీదికి వేలుపోకముందే, దుప్పి మరోసారి అతడి ఛాతీ దగ్గర కుమ్మింది. తుపాకి దూరంగా ఎగిరిపడింది. ఈ సారి మళ్ళీ కసిదీరా కుమ్మింది. దుప్పి కొమ్ములనిండా చిక్కని రక్తం.. నెత్తుటి గాయాలతో అతను అరుస్తూనే, కాసేపటికి కనుమూశాడు.
పులి నిద్రలేచింది. అతని శవం దగ్గరికి వచ్చింది, ఎదురుగా దుప్పిని చూసింది. రక్తం ఓడుతున్న కొమ్ములతో, ఆయాసంతో కాళ్ళు నిగ్గబెట్టి నిల్చుంది.. పులి కళ్ళల్లోకి చూస్తోంది దుప్పి. పులి పడి ఉన్న అతని శవం చుట్టూ రెండుసార్లు తిరిగి, వాసన చూసి నిశ్శబ్దంగా మళ్ళీ తన గుహలోకి వెళ్ళి పడుకుంది.
‘పులి ప్రాణాలు మాత్రమేనా, జింక ప్రాణాలు గొప్పవి కావా? వాటికే మాత్రం విలువ లేదా??’ అన్నట్టుగా దుప్పి అతని శవం వైపు చూస్తుండిపోయింది. దాని కొమ్ములకంటుకున్న రక్తం.. నేలపై ధారగ కారుతూనే ఉంది. రాత్రయ్యే సరికి ఈ సంఘటన మీదా ఊర్లో గుసగుసలు మొదలయ్యాయి. దుప్పి ధైర్యం కొందరి భయాలను పోగొట్టింది.
మర్నాడు..
పేపర్లో ప్రముఖంగా ఒక వార్త.. ‘పులి దాడికి అటవి అధికారి మృతి’ అని. ప్రతిపక్షాలు ఘెల్లుమన్నాయి. ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇంకొన్ని సీసీ కెమెరాలు పెట్టి నిఘా పెంచింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వాళ్ళు ఆశ్చర్యపోయేలా ఒక దృశ్యం కెమెరాలో కనిపిస్తోంది.
మోడుబారిన కొమ్మలాంటి విరిగిన కొమ్ములతో, అక్కడక్కడా రక్తపు మరకలతో ఒక దుప్పి, ఏ జంకు గొంకు లేకుండా పులికి ఎదురుగా నిల్చుంది! దుప్పి ధైర్యానికి అధికారులు నోరెళ్లబెట్టడం ఆపి వెటర్నరీ డాక్టర్తో అక్కడికి పరిగెత్తారు. పులి నాలుగడుగులు వెనుకకువేసి గట్టిగా గాండ్రించి, విసురుగా వచ్చి పంజా ఎత్తింది.
దుప్పి రవ్వంత కూడా భయపడలేదు. దుప్పి మెడను పులి నోట కరుచుకోబోతే తప్పించుకుంటుంది కానీ పారిపోవట్లేదు. పులి దుప్పి కొమ్ములను నోటితో కర్చుకొని పొదల్లోకి లాక్కెళ్ళిపోతుంటే.. దూరం నుంచి ట్రాంక్వీ గన్ పేలిన చప్పుడు. కానీ దానికి క్షణం ముందే ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్న లింగా బల్లెం గాల్లోకి లేచింది.
చదవండి: Dondapati Krishna-Funday Story: పెళ్ళీడుకొచ్చిన చెల్లెలు ఉందని ఇంగితం లేదు! ఆ తండ్రి కష్టం తీరేనా?
Comments
Please login to add a commentAdd a comment