‍కథ: చావు నీడ.. ఏం మనిషివయ్యా? నేను గుర్తుకు రాలేదా? | Sakshi Funday: B Narsan CHavu Needa Telugu Story | Sakshi
Sakshi News home page

‍కథ: చావు నీడ.. ఏం మనిషివయ్యా? నేను గుర్తుకు రాలేదా?

Published Tue, Jun 7 2022 4:37 PM | Last Updated on Tue, Jun 7 2022 4:47 PM

Sakshi Funday: B Narsan CHavu Needa Telugu Story

కైలాసం మరణవార్త వినగానే గాబరాగా వెళ్ళడానికి సిద్ధమైన నారాయణ కొద్దిసేపు నడింట్లో బొమ్మలా నిలబడి, ఆ వెంటనే ఏదో పనున్నట్లు తొడుక్కున్న బట్టల్ని విడిచి కొక్కేనికి తగిలేసి లుంగీ చుట్టుకొని టాయిలెట్‌కి వెళ్ళాడు.

అయిదు నిముషాలు ఓపిక పట్టిన సరస్వతి నోరు విప్పి ‘ఇదేరా మీ నాయన పరిస్థితి.. ఇన్నేళ్లు కలిసి బతికిన దగ్గరి ఫ్రెండ్స్‌లో ఎవరికి ఏమైనా.. ఇలాగే హైరానా పడిపోతూ.. తయారైనాక ఏదో అర్జెంటు పనున్నట్లు బాత్రూమ్‌లో దూరుతున్నాడు...’ అని కొడుక్కి ఫిర్యాదు చేసింది. 

ముందు రూములో టేబుల్‌మేట్‌ పై లాప్‌టాప్‌ పెట్టుకొని పని చేసుకుంటున్న గణేష్‌ ‘తోటివాళ్ళు చనిపోతే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది గాదే’ అంటూ తల్లిని శాంతపరచాడు.  

‘అంత భయపడితే ఎట్లారా.. వెనుక ముందు అందరూ పోయేటోళ్లే. అందరు డెబ్బైయేళ్లు దాటినోళ్లే! ఇంకా ఉంటరా...’ అంది సరస్వతి విసుగ్గా బాత్రూమ్‌ తలుపు వంక చూస్తూ.

‘మరీ అంత తీసేయకే అమ్మా.. ఒకే వాడలో పుట్టి పెరిగి చదువుకొని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసినా కష్టసుఖాల్లో కలుసుకుంటూ తోడబుట్టినోళ్ల కన్నా మంచిగా ఉంటారు నాన్న బ్యాచ్‌ వాళ్ళు. వాళ్ళ స్నేహానికే షష్టి పూర్తయిందేమో...’ అన్నాడు గణేష్‌.

‘ఆ.. అంతా మిలిటరీ సిస్టమ్‌ బ్యాచ్‌. వారానికి రెండు సార్లయినా తలా వంద వేసుకొని సిట్టింగులు వేస్తే గాని పొద్దు గడవదు. పిల్లలు ఎక్కడున్నా ఒక్కరూ ఊరు వదలరు.. ఎక్కడ చీర్స్‌ మిస్సవుతామోనని’ అని నవ్వింది సరస్వతి.

‘ఏదో టైమ్‌ పాస్‌.. మందు పార్టీ పేరు మీద నవ్వులు, ముచ్చట్లే ఎక్కువ’  అని సర్ది చెప్పాడు.
మరో అయిదు నిమిషాల తర్వాత బాత్రూమ్‌ తలుపు తెరుచుకుంది.

‘ఏమైంది.. ఇంతసేపు పోయినవ్‌?’ అని దీర్ఘం తీసింది సరస్వతి.
తడబడుతున్నట్లు బెడ్‌రూములోకి నడుస్తూ ‘ఏమోనే.. ఇలాంటి వార్త తెలువగానే ప్రాణం గుబులు గుబులు అయితాంది. లుంగీలోనే పడుతుందా అన్నట్లు పేగులు జారిపోతాయ్‌. పోయి కూచుంటే కడుపు గట్టిగ పట్టేసినట్లు ముడుసుక పోతుంది. కూచొని కూచొని యాస్టకొచ్చి లేసి వచ్చిన..’ అంటూ నారాయణ బట్టలేసుకుని బయటపడ్డాడు.

నారాయణ, కైలాసంల ఇళ్లు దూరమే అయినా మార్కెట్లో ఒకే దగ్గర వారి తండ్రులకు దుకాణాలుండేవి. కైలాసం తండ్రిది కిరాణా కొట్టు. అదే గద్దెపై నారాయణ తండ్రి పొగాకు అమ్మేవాడు. ఇద్దరినీ తండ్రులు ఏడో తరగతిలోనే చదువు మాన్పించేశారు. అది నిజాం జమానా. ఓ సాయబు పెద్దమనిషి వీళ్ళని చూసి ‘ఈ పొట్టెగాళ్లు  ఇస్కూలు పోరేంది?’ అని అడిగాడు. 

‘చదివేం చేస్తారు.. మాకు దుకాణాలే ఉండే ..’ అన్నారు ఇరు తండ్రులు. ‘అరె భాయ్‌..  అరబ్బీల ఇమ్తెహాన్‌ రాస్తే మదర్సాల పంతుల్లయితరు. నేను రాసుడు నేర్పుతా.. అంతా చూసి రాసుడే..’ అని ఆ సాయబు ఇద్దర్నీ తయారు చేయించాడు. రెండేండ్లు తండ్లాడి ఆ పరీక్ష పాసై ఇద్దరూ యుక్త వయసులోనే స్కూల్‌ టీచర్లు అయ్యారు. సైకిలు మీద వెళ్లి చుట్టూ పల్లెల్లో పనిచేస్తూ ఇంతకాలం కలిసి బతికిన వీళ్ళనిప్పుడు చావు విడదీసింది. మరణవార్త వినగానే నారాయణ ఒక్కసారిగా తన ఆప్తమిత్రుణ్ణి తీసికెళ్ళిన చావు తన కోసం కూడా వెతుకుతున్నట్లు బెదిరిపోయాడు.

ఇంట్లోంచి బయటపడ్డ నారాయణకు జీవన్‌ ఎదురయ్యాడు తన పాత స్కూటర్‌ మీద. జీవన్‌..  నారాయణ కన్నా రెండేళ్లు పెద్ద. మందు, మాంసం ముట్టని కులంలో పుట్టాడు. మిత్రమండలికి పొద్దటి పూటకు హాజరవుతాడు కాని చీర్స్‌ సాయంత్రాలకు రాడు. వాళ్లందరూ కలవడానికి రాములు టైలర్‌ షాపు అడ్డా. అందులో రెండు కుట్టు మిషన్లు, పది పాత కుర్చీలుంటాయి.

పేరుకే టైలర్‌ షాపు గాని అప్పుడప్పుడు ఆల్టరేషన్‌ గిరాకీ వస్తుంది. రాములు కొడుకులు ఉద్యోగాలు చేస్తూ తండ్రికి అవసరమున్నన్ని డబ్బులు పంపుతుంటారు. అసలు రాములు దుకాణం తెరిచేదే దోస్తుల కోసం. పొద్దున్న తొమ్మిదింటికో, పదికో వచ్చినవాళ్లు మధ్యాహ్నం రెండింటికి ఆకలవుతుంటే మెల్లగా ఇంటి దారి పడతారు. మళ్ళీ ఏదో మిస్సవుతున్నట్లు అయిదారింటికే పక్షుల్లా వాలిపోతారు.

ఇలా ఏండ్లకేండ్లు దాటుతున్నా ఒక్కరికీ విసుగు విరామం లేదు. మధ్య మధ్యలో ఎవరింట్లోనో పిల్లల బర్త్‌డేలో, పెద్దల సంవత్సరీకాలో.. సందర్భమేదైతేనేం మిత్రులందరి సమ్మేళనమక్కడే. పెళ్ళికి వారం రోజులు, చావుకు పన్నెండు రోజులు టీమంతా బిజీ, బిజీ. పిల్లలు కూడా వీళ్ళని మర్యాదగా చూసుకుంటారు. 

ఇంతకాలం తమకన్నా పెద్దవాళ్ళు ఒక్కొక్కరు చనిపోతుంటే ‘అయ్యో పాపం పోయాడా..’ అనుకుంటూ వాళ్లతో ఉన్న పరిచయాల్ని గుర్తుచేసుకొని బాధపడేవారు. తమ అన్నలు, బావలు పోతున్నా ‘వారి కాలమొచ్చింది.. పోయారు’ అని నిట్టూర్చేవారు. 

వీరి బ్యాచ్‌లోనే తిరిగే సత్తయ్యకు రాత్రి పక్షవాతం వస్తే తెల్లారి నుండి మంచానికే అతుక్కుపోయాడు. అందరూ వెళ్లి చూసొచ్చారు. ఏడుస్తుంటే ఊరడించి ‘మళ్ళీ నడుస్తావు.. అంత బేజారుకాకు’ అని ధైర్యమిచ్చారు. కొన్ని నెలల తర్వాత హార్ట్‌ ఎటాక్‌ వచ్చి సత్తయ్య చనిపోయాడు. అప్పటికే ఆయన దగ్గరికెళితే కంపు వాసన వచ్చేది. ఇంటివాళ్లే దగ్గరికెళ్ళేవారు కాదట. నారాయణకు ఆ వాసన ఇంకా ముక్కులో ఉన్నట్లే అనిపిస్తుంది.

కైలాసం ఇంటి ముందు జీవన్‌ స్కూటర్‌ ఆపగానే దిగిన నారాయణ ఎవరినీ చూడకుండా కైలాసం శవం దగ్గరికెళ్లి బిగ్గరగా ఏడ్చాడు. జ్ఞాపకాలన్నీ మదిలో తిరిగి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. ఇదివరకైతే ఎవరి చావు దగ్గరికెళ్ళినా మొక్కుబడిగా వెళ్లినట్లు అయ్యో పాపం అని నిట్టూర్చి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చేవారు. ఇప్పుడు తమ తోడు ఈడు వాళ్ళు దారి పట్టేసరికి కొందరి మనసులో తెలియని భయం ముల్లులా గుచ్చుకుంది. నారాయణకు మాత్రం కాస్త లోతుగా దిగినట్లుంది.

ఓ రోజు అడ్డా మీదికి రాధాకిషన్‌ రాకపోయేసరికి గోపాల్‌ ఫోన్‌ చేసి ‘ఏమాయెరా.. రాలేదు? ఏమన్నా పనుందా!’ అన్నాడు. 
ఫోన్‌ ఎత్తిన ఆయన భార్య మంగ ‘కళ్ళు మసక మసక కనిపిస్తున్నాయట. రంగులు సరిగ్గా తెలుస్తలేవు అంటున్నాడు. కొడుకును దింపిరారా అన్నాడు గని నాల్రోజులాగుమని నేనే వద్దన్నా’ అని పెట్టేసింది.

ఫోన్‌ చేసిన గోపాల్‌ అందరితో ఆమె అన్నది చెప్పి ‘వాడు తెలివి తక్కువోడురా.. షుగర్‌ కంట్రోల్ల పెట్టుకోడాయే.. పద్ధతి పాడు లేకపోతె ఏమైతది’ అన్నాడు మాములు ధోరణిలో. నారాయణకు నోరు తడారిపోయి రాములును నీళ్లడిగాడు.

తెల్లారి అందరూ రాధాకిషన్‌ ఇంటికెళ్లారు. మనుషుల అలికిడి విని ‘ఎవరు?’ అన్నాడు.
‘వార్నీ.. మేం రా.. కనిపిస్తలేమారా..’ అన్నాడు గంగారాం.

‘దూరముంటే తెలుస్తలేదు’ అన్నాడు రాధాకిషన్‌ కళ్ళు మూసుకొని నొసలు పట్టుకొని.
లోపటి నుంచి వచ్చిన మంగ కళ్ళు తుడుచుకుంటూ ‘అంత నా కర్మకే వచ్చింది. చెప్పినట్లు వినడాయే.. నాకేమైతది అని ఊకుంటే ఇక్కడికచ్చింది’ అంది.

‘ ఏ.. ఊకోయే.. ముందు చాయ్‌ పెట్టుపో ’ అని పెళ్ళాన్ని కసిరి ‘ ఏం లేదురా.. డాక్టర్‌ మందులు రాసిచ్చిండు. వాడితే కంటి రక్తనాళాలు మంచిగై మల్ల ఎప్పటి తీరు కనబడతాయట’ అంటూ మిత్రులకు డాక్టర్‌ ఫైల్‌ చూపించాడు. 

‘మందులు మంచిగా వాడు.. లేపోతే గుడ్డోనివైతవ్‌ సుమీ ..’  అని  జాగ్రత్తలు చెప్పివచ్చారు.
జీవన్‌.. రాధాకిషన్‌ ఇద్దరూ చిన్నప్పటి నుండి క్లాస్‌మేట్‌లే కాక ఇద్దరూ రెవెన్యూలో కలిసి పనిచేశారు. ఆ కొసరు ప్రేమతో అప్పుడప్పుడు స్కూటర్‌ మీద రాధాకిషన్‌ను అడ్డా మీదికి తీసుకొచ్చాడు. మందులు వాడినా చూపు మరింత చీకటే అయింది. అడిగేవారికి సమాధానం చెప్పలేక, మిత్రుల ఓదార్పును తట్టుకోలేక రాధాకిషన్‌ బయటికి రావడం మానేశాడు.

కళ్ళు పోవడమే కాకుండా పుండు పడ్డ కాలును మోకాలిదాకా తీసేయాలని డాక్టర్‌ చెప్పిన రాత్రే రాధాకిషన్‌ ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ఆ నరకం కన్నా చావే నయమని మిత్రులకు అనిపించింది. కానీ ఛాతీ విరుచుకొని నడిచిన రాధాకిషన్‌ ఉరి వేసుకోవడమే అందరినీ తొలిచివేస్తున్న బాధ. కనబడని గాలానికి చిక్కినట్లు నారాయణ విలవిల్లాడిపోయాడు.

మిత్ర ఖేదం అంతటితో ఆగనట్లు ఓ రోజు గంగారామ్‌కు ఊపిరి భారంగా ఉంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదని ఆక్సిజన్‌ కోసం మెషిన్‌ వాడాలని డాక్టర్‌ అన్నాడు. పక్కన చిన్న సూట్‌కేసంత మెషిన్, మీసం లాగా ముక్కు కింద ఎప్పుడు సన్న గొట్టం పైపు ఆయనకు తగిలించారు. మెషిన్లో నింపడానికి రకరకాల మందులు, వాటి కొలతలు, సమయపాలన అంతా ఓ కంపల్సరీ డ్యూటీలా ఆయన్ని, కుటుంబాన్ని చుట్టుకుంది.

మిత్రులు కలవడానికి వెళితే ‘ఇదేందిరా.. బఱె మెడకు తనుగేసి  కట్టేసినట్టు ఏం బతుకు..?’ అని ఓ విషాదభరిత నవ్వు నవ్వాడు. గంగారాం ముచ్చట్లలో దిట్ట. నవ్వితే ఆ చప్పుడుకు ఏమైందని నలుగురు తిరిగి చూసేవారు. ‘మెల్లగరా బై’  అని బిక్షపతి విసుక్కున్నా ఆ తెలివి కొద్దిసేపే. తానే చెప్పి తానే నవ్వే విదూషకుడు ఆయన. బ్యాచ్‌లో గలగల పోయింది. 

గంగారాం.. బిక్షపతి మునిసిపాలిటీలో ఉద్యోగులు. ఏం మాయ చేశారో గాని వాళ్ల సర్వీసంతా ఊర్లోనే గడిచింది. ఇళ్లు కూడా పక్కపక్కనే. గంగారాం ముచ్చట్లు.. నవ్వులు వినేందుకు తానే అప్పుడప్పుడు వెళ్లి పలకరించేవాడు. అయితే ఆ హుషారు ఆయనలో తగ్గింది. ఊ.. ఆ.. తప్ప ఎక్కువగా మాట్లాట్లేదు. ఆయన ముఖంలో విషాద ఛాయలు చూడలేక బిక్షపతి పోవడమే తగ్గించాడు.

అందరిలో ఉత్సాహంగా స్కూటర్‌ పై రయ్యరయ్యన తిరిగే జీవన్‌కు ఇట్లవుతుందని ఎవరూ అనుకోలేదు. మూత్రం మంటగా వస్తుందని పరీక్షలు చేయిస్తే ప్రొస్టేట్‌ గ్లాండ్‌ పెరిగిందని తేలింది. కొడుకు హైదరాబాద్‌ తీసికెళ్ళి సర్జరీ చేయించాడు. గ్లాండ్‌ను తీసేయక తప్పలేదు. మనిషి పూర్తిగా పీక్కుపోయాడు. ఇంట్లోనే కర్ర సాయంతో నడుస్తున్నాడు. 

రాత్రిళ్ళు మంచంపై పడుకుంటే భూమి గిర్రని తిరిగినట్లు ప్రాణం తూలుతుందని నారాయణ భార్యకు చెబితే కొడుకు డాక్టరుకు చూపించాడు. కొన్ని టెస్టులు చేయించి బీపీ పెరిగిందని మందుల డోసు పెంచి నెల నెలా చెకప్‌ చేయించుకోవాలన్నాడు. బీపీ కంట్రోల్‌ కాకపోతే పక్షవాతం వచ్చే చాన్సు ఉందని చాటుగా కొడుకు, భార్య మాట్లాడుకుంటున్నారు. డాక్టర్‌ చెప్పకున్నా కొడుకు మూడు కాళ్ళ ప్లాసిక్‌ వాకింగ్‌ స్టిక్‌ తీసుకొచ్చాడు. అది చేతిలో లేకుండా భార్య ఒక్క అడుగు వేయనీయడం లేదు.

నారాయణ కాలు బయటపెట్టడం సంపూర్ణ నిషేధమైంది. బీపీ తగ్గడానికి ఎవరు ఏం చెప్పినా సరస్వతి ఆయనపై ఆ ప్రయోగాలు చేస్తోంది. టైలర్‌ రాములు చనిపోతే కొడుకు తోడుగా వెళ్ళాడు నారాయణ. రాములు శవంలా లేడు. కాలేయం చెడిపోయి చనిపోయినందున శరీరం ఆకుపచ్చగా గోండ్రు కప్పలా ఉబ్బింది. 

తండ్రి ముఖంలో బెదురు చూసి గణేష్‌ ‘వెళ్దాం పద..’ అంటూ తొందర పెట్టి బయటకు తీసుకొచ్చాడు.  రోడ్డు మీదికి రాగానే నారాయణ వాంతి చేసుకొని పక్కన రాయిపై కూలబడ్డాడు. కార్లోంచి నీళ్లు తెచ్చి తండ్రికిచ్చి మెల్లగా ముందు సీట్లో  కూచోబెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. 

అదే రోజు నడిరాత్రి బాత్రూమ్‌కు వెళ్లేందుకు లేచిన సరస్వతి కాలు కిందపెట్టగానే పాదానికి ఏదో తడిగా తగిలింది. లేవబోతే జారబోయి మంచంలోనే కూలబడ్డది. ‘ఇక్కడ నూనె ఎవరు పారబోసిన్రు’ అనుకుంటూ ఆ వైపు నుంచి వెళ్లి లైటు వేసింది. 

కిందంతా రక్తం పారి గడ్డ కట్టింది.  నారాయణ మణికట్టు అడ్డంగా కోతబడి ఒక్కొక్క బొట్టు నేలరాలుతోంది. ఆయన మరో చేతిలో పండ్లు కోసుకొనే కత్తి ఉంది.
‘అయ్యో .. ఎంత పని చేసిండు’ అంటూ కొడుకును లేపింది. 

హాస్పిటల్‌కు తీసికెళ్లారు. ఇంకా కొనఉపిరి ఉన్నందున బతికిపోయాడు. పూర్తిగా కోలుకున్నా రక్తం పోయినందువల్ల ఎడమచేయి బలహీనమైంది. రోజులు గడుస్తున్నా ఇంట్లో ఎవరి ముందు తల ఎత్తకుండా నారాయణ ముభావంగా ఉంటున్నాడు. ఓరోజు మంచంపై ఒరిగి కూచున్న తండ్రి దగ్గరికొచ్చి గణేష్‌ ఆయన గదవపై చెయ్యేసి తల పైకెత్తి ‘ఇది ఇలాగే పైకి ఉండని..’ అంటూ పక్కన కూచున్నాడు.  

కొంగుతో చేతులు తుడుచుకుంటూ సరస్వతి కూడా దగ్గరికొచ్చింది. ‘నాన్నా.. చావుకు భయపడుతూ దూరమున్న దాన్ని కోరి దగ్గరకు రమ్మంటున్నావేంది? ఏదో అవుతది అని ఊహించుకుని బెదిరిపోతున్నావ్‌. బతికినన్ని రోజులు బతకాలి.. చేతనయినట్లు బతకాలి. తల్లి.. బిడ్డకు జన్మనిచ్చేందుకు తొమ్మిది నెలలు మోసి కనేందుకు పడ్డ శ్రమలో చావు యాతన పిసరంత కూడా ఉండదు.

ఆత్మహత్య అంటే తల్లి శ్రమని నిష్ఫలం చేయడమే, అవమానించడమే. చిన్నప్పటి దోస్తులు ఒక్కొక్కరు పోతుండడం బాధగానే ఉంటది. వారి వియోగంతో అంతా చీకటే అనుకోకు. అందులోంచి బయటికి రా. నీ వయసువారు, అంతకన్నా పెద్దవారు కోట్లాది మంది ఉన్న ప్రపంచమిది. నీదేమంత వయసు? డెబ్భై ఆరేండ్లు. అమితాబ్‌కు డెబ్భై తొమ్మిదేండ్లు, రంగనాయకమ్మగారికి ఎనభై రెండేండ్లు..  వయసు హుషారు కన్నా మానసిక ఉత్సాహంతో వాళ్ళు  జీవితాన్ని ప్రేమిస్తూ సద్వినియోగం చేసుకుంటున్నారు.

వీరిలాగే ఈ భూమ్మీద ఇంకెందరో ఉన్నారు. పోయాక మళ్ళీ ఎన్నడూ కానరాని ఈ మనుషులతో, నేలా.. ఆకాశం.. చెట్లు చేమతో గడిపేందుకు ఎంతో విలువైన క్షణాలివి. ధనరాశులు పోసి క్షణ కాలపు జీవితాన్ని కూడా కొనలేం. ఈ మానసిక రుగ్మతలోంచి బయటికి రా! మళ్ళీ నీ ఊపిరి దీపాన్ని నీ చేతులతోనే ఆర్పేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించకు. ఎనభై ఏళ్ల వయసులో ఒకాయన ఎవరెస్టు ఎక్కాడట.. ఇలాంటి వారి జీవితాలు తెలుసుకో..  మనసు తేలికపడి కొత్త ఉత్సాహమొస్తుంది.’  

గణేష్‌ మాట ఇంకా అయిపోకముందే ఇన్నిరోజులు నోరు తెరవని సరస్వతి ఒక్కసారిగా నారాయణ పక్కకొచ్చి ‘ఏం మనిషివయ్యా.. కోసుకునేటప్పుడు నేను గుర్తుకు రాలేదా? నీకేం తక్కువజేసిన? పోతే ఇద్దరం పోదాం.. మల్ల అసుంటి బుద్ధి పుడితే ముందు నా చేయి కొయ్యి సరేనా..’ అంటూ నారాయణ ఛాతీపై తల పెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది.

మనసులో మూసుకు పోయిన తలుపులన్నీ ఒక్కొక్కటి తెరచుకొని చల్లని గాలులు, వెచ్చని వెలుగులు ప్రసరించి సరికొత్త జీవితాన్ని నింపుతున్నట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నారాయణ. ఈ భూమ్మీద పుట్టే ప్రతి జీవి పోయేదే కదా.. తనకెందుకీ పిచ్చి తొందర..గాబరా.. అనుకున్నాడు. అప్పుడే ఆయన మనసులోని చావు పీడ తోక ముడిచింది.
-బి.నర్సన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement