సాయి కార్తీక్ ఎన్‌క్లేవ్ వైపు ఆటో వెళ్తోంది. ‘ఏంటి బావా, మొహం వెలిగిపోతోంది?’ నర్సయ్య అడిగాడు. ‘కాంట్రాక్ట్ ఒస్తే మనకు పండుగొచ్చినట్లే కదా బావా..’ నవ్వాడు బ్రహ్మయ్య.
‘ఎన్నో కాంట్రాక్టులు చేశాం. ఎప్పుడూ ఇంత సంతోషంగా లేవు. ఈసారి ఇంకేదో ఉంది. చెప్పు బావా..’ వదల్లేదు నర్సయ్య. పానకంలో పుడకలా వాళ్ళ మధ్య తాను ఎందుకని మాట్లాడకుండా, వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నాడు బ్రహ్మయ్య తమ్ముడు కొడుకు సోము.
‘అమ్మాయికి సంబంధం కుదిరేలా ఉంది బావా..’ బ్రహ్మయ్య మొహంలో ఓ బాధ్యత తీరిపోబోతున్న సంతోషం తొణికిసలాడింది. ‘కట్నం ఎంతడుగుతున్నారు?’ ‘ఆరు లక్షలు..’
‘ఆరు లక్షలే.. మునిగిపోతావేమో బావా..’ ‘వృత్తిని నమ్ముకున్న వాళ్ళకు దేవుడు అన్యాయం చేయడు’ ‘చేసిందంతా చేశాడుగా.. అప్పుడు కరోనాగా వచ్చి నోటికాడ కూడు లాక్కెళ్ళాడు. ఇప్పుడు రెండో ప్రసవం కూడా పుట్టింట్లోనే చేయించుకోమని కూతుర్ని పుట్టింటికి పంపేలా చేశాడు’
‘నీకు ఒకటే సంతానం కాబట్టి సరిపోయింది. నాకు ముగ్గురు. నా బాధ ఎవడితో చెప్పుకోవాలి?’ ‘కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసేశావ్. ఇప్పుడు కూతురిది కూడా చేసేస్తున్నావ్. ఇంకేంటి బావా?’
‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది బావా’ కన్నీటి చెమ్మ ఊరింది బ్రహ్మయ్యలో. అది గమనించిన సోము ‘కాస్త ఆగుతావా మావా..’ అని నర్సయ్యను వారించాడు.
కాసేపు.. మౌనం తన ప్రతాపాన్ని చూపించింది. విషయాన్ని దారి మళ్ళించడానికి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎస్.పి.బాలు పాటలు పెట్టాడు.
రుద్రవీణ సినిమాలోని ‘తరలిరాదా తనే వసంతం, తనదరికి రాని వనాల కోసం’ పాట వినిపిస్తోంది. బ్రహ్మయ్యకు ఎందుకో ఆ పాట అతని నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నట్లుగా అనిపించింది.
అంతలో చిన్నకొడుకు నుంచి ఫోనొచ్చింది.. ‘పొద్దున అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? కోడలి సీమంతాన్ని ఫంక్షన్ హాల్లో చేస్తానని బంధువులకు, ఫ్రెండ్స్‌కు చెప్పేశాను. ఇప్పుడు చేయకపోతే పరువు పోతుంది. రెండు కాకపోయినా లక్షన్నరయినా సర్దు..’ ఓ రకమైన బెదిరింపు, ఓ రకమైన అర్థింపు కలగలిసిన గొంతుతో చిన్న కొడుకు.
‘నా మేనకోడల్ని నీకిచ్చి చేస్తానని మాటిచ్చాను. ఆ మాటను గంగలో కలిపేశావ్. ఇప్పుడు అంతకన్నా ఏం పోదులే. అయినా మీ అత్తామామలు చేయాల్సిన కార్యక్రమాన్ని నన్ను చేయమంటావేంటిరా?’ గట్టిగానే అన్నాడు బ్రహ్మయ్య.
ఆ మాటలకు ఆటోలో ఉన్న నర్సయ్య.. ‘పోనీలే బావా! నా కూతుర్ని చేసుకోకపోయినా పర్లేదు. ఆడు సుఖంగా ఉండడమే కదా కావాల్సింది’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ మాటను వినిపించుకునే పరిస్థితిలో లేడు బ్రహ్మయ్య.
‘నువ్వు కనుక డబ్బులివ్వకపోతే ఇంటిపై నుంచి దూకేస్తా..’ బెదిరించాడు కొడుకు అవతలి నుంచి. ‘చెల్లి పెళ్లి కన్నా మీ సుఖాలే కదా మీకు ముఖ్యం. దాని పెళ్లి చేయలేకపోతే నేనూ దూకడమే’ కోపంగా అంటూ ఫోన్ పెట్టేశాడు బ్రహ్మయ్య.
అదేంటి బావా.. అట్లా అంటావ్! అన్నీ తెలిసినోడివి నువ్వే అలా ఇదైపోతే ఎట్టా..’ నొచ్చుకున్నాడునర్సయ్య. ఏం చేయను బావా! పెళ్ళీడుకొచ్చిన చెల్లెలు ఉందని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్లకి. డబ్బు, డబ్బు అంటూ పీక్కు తింటున్నారు. మీ అక్కక్కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. ఇన్ని ఇబ్బందుల్లో సీమంతాన్ని ఫంక్షన్ హాల్లో చేయడం అవసరమా, చెప్పు?’
‘పోనీలే పెదనాన్నా.. ఈ కాంట్రాక్టులో నాకొచ్చే డబ్బులు అన్నయ్యకివ్వు..’ ఊతం అందివ్వడానికి సిద్ధపడ్డాడు సోము.
‘నీకున్న బాధ్యత ఆళ్ళకి లేదనేరా నా బాధ..’ నుదురు కొట్టుకున్నాడు బ్రహ్మయ్య.
‘పిల్లలు పుట్టాక బాధ్యత తెలుస్తుందిలే బావా! నువ్వలా ఇదవ్వకు. ఎలాగోలా డబ్బులు సర్దు’ ఓదార్చాడు నర్సయ్య.
‘ఈ కాంట్రాక్టులో మిగిలే డబ్బులు ఆడికిచ్చేస్తే పిల్ల నిశ్చితార్థానికి ఎక్కడ్నుంచి తేవాలి?’ పరిష్కారం అడిగాడు బ్రహ్మయ్య. ఏం చెప్పాలో.. ప్రస్తుతానికి గట్టెక్కించే మార్గం ఏమిటో పాలుపోక మరేం మాట్లాడలేదు నర్సయ్య.
సాయి కార్తిక్ ఎన్ క్లేవ్ అపార్ట్ మెంట్ వచ్చింది. ముగ్గురూ ఆటో దిగారు. డెకోలం షీట్స్ కొన్ని, దూగోడ టూల్, ప్లైవుడ్ కటింగ్ మెషిన్ సామాగ్రినీ దించారు.
‘మీరు ఇక్కడే ఉండండి. పైకెళ్ళి ఓనర్‌ను కలిసొస్తాను’ అని చెప్పి లిఫ్ట్‌లో మూడో అంతస్తుకి వెళ్ళాడు బ్రహ్మయ్య.
‘ఒరేయ్ వీరేష్.. సాయంత్రం బావ ఫోన్ చేయగానే ఎక్కడున్నా వచ్చేయ్. ఆలస్యం చేయమాక. ఇంట్నావా? పోయినసారిలాగా చేశావనుకో మీ ఆవిడకు చెప్తా!’ ఆటో డ్రైవర్ వీరేష్‌కు సరదాలాంటి హెచ్చరిక చేశాడు నర్సయ్య.
‘ఆగు బాబాయ్.. ముందు పాట పాడాలి..’ అంటూ డ్రైనేజీ దగ్గరికెళ్ళాడు.
‘మా అక్కంటే అంత భయమా మామా?’ నవ్వుతూ అడిగాడు సోము.
‘భయమా... ఇదిగో.. అట్టాగే పోసుకుంటాడు..’ వీరేష్ వంక చూస్తూ నవ్వాడు నర్సయ్య.
పెదనాన్న బ్రహ్మయ్య కోసం పైకి చూశాడు సోము. పావుగంట అయినా అతను కిందకు రాలేదు. విషయం కనుక్కుందామని సోము ఫోన్ చేశాడు. కట్ చేశాడు బ్రహ్మయ్య. నర్సయ్య చేస్తున్నా కట్ చేస్తున్నాడు. ఏమైందో చూద్దామనుకున్నారు.
‘ఒరేయ్ వీరేష్... అప్పుడే ఎల్లమాక. ఇప్పుడే వత్తాం ఉండు..’ డ్రైవర్‌కి చెప్పి పైకి వెళ్ళారిద్దరూ.
అక్కడ బ్రహ్మయ్య ఓనర్‌ను బతిమాలడం చూసి నివ్వెరపోయారు.
‘ఏమైంది బావా?’ కంగారుగా అడిగాడు నర్సయ్య.
‘ ఈ కాంట్రాక్టు క్యాన్సిల్ అని చెప్తున్నా వినడం లేదు. జలగలాగా పట్టుకుని వేలాడుతున్నాడు చూడండి..’ ఓనర్ మాట గద్దింపులా ఉంది.
‘క్యాన్సిలా? ఎందుకు?’ ఆశ్చర్యపోయాడు సోము.
‘ఈ కాంట్రాక్టులు నాకు అచ్చి రావు. గతంలో చాలా ఇబ్బందులు పడ్డాను. బాగా సతాయిస్తారు. ఇంకో కాంట్రాక్టు వస్తే మధ్యలోనే వదిలేసి వెళ్తారు. బతిమాలుకోలేక చావాలి. ఎప్పటికోగాని రారు. అవన్నీ పక్కన పెడితే, ఓ పెద్ద కంపెనీ మూడు లక్షలకే ఓకే అంది. రెడీమేడ్ ఫర్నిచర్. వాళ్ళే వచ్చి బిగించి పెడతారు. మీకిది చెప్పమని మా ఆవిడతో మొన్ననే చెప్పాను’ చావు కబురు చల్లగా చెప్పాడు ఓనర్.
‘మాకేం చెప్పలేదండి. లేదంటే ఎందుకొస్తాం? మేడంగారిని పిలవండి’ అంటూ తానే మేడం.. మేడం..’ అని లోపలికి చూస్తే కేకేశాడు నర్సయ్య.
అతని అరుపులకు లోపలి నుంచి హడావుడిగా వచ్చింది ఆ ఇంటావిడ. ఏమిటన్నట్లు భర్తవంక చూసింది.
‘వర్క్ వద్దరిని వీళ్ళకు చెప్పమన్నాను కదా! చెప్పలేదా?’ అడిగాడు ఓనర్.
‘ఏదో హడావుడిలో పడి చెప్పడం మర్చిపోయానండి’ మన్నించమన్నట్లు భర్తకు చెప్పి, ‘ఆల్రెడీ కాంట్రాక్టు ఇచ్చేశాం. మీరు వెళ్ళండి’ అంటూ వాళ్ళను పంపించే ప్రయత్నం చేసింది.
‘అంత సింపుల్‌గా మర్చిపోయాం అంటే ఎలాగండీ? కొంత సామాను కొనుక్కొని కూడా వచ్చాం. తీరా ఇంటి దగ్గరకు వచ్చాక క్యాన్సిల్ అంటే ఎలా సార్? ఈ లోటు ఎవరు భర్తీ చేస్తారు?’ నర్సయ్యలో ఆవేశం చొరబడింది.
‘ముందిక్కడ్నుంచి బయల్దేరండి. గొడవ చేస్తే పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది’ బెదిరించాడు ఓనర్.
‘పోలీసులకు ఫోన్ చేస్తారా? చేయండి. ఏం చెప్పాలో మాకూ తెలుసు’ వెనక్కి తగ్గలేదు సోము.
‘ఇట్టాంటి బేరం తగిలిందేమిటిరా స్వామీ! చూశావా... నువ్వు చెప్పడం మర్చిపోవడంతో ఎంత పెంట అవుతోందో?’ అంటూ భార్యను కోప్పడ్డాడు. వెంటనే బ్రహ్మయ్య వాళ్లవైపు తిరిగి ‘విషయం అర్థం చేసుకోక ఇలా రాద్ధాంతం చేసేవాళ్లకు ముందు ముందు ఎలాగయ్యా కాంట్రాక్టులిచ్చేది?’ వాళ్లను తప్పుబట్టే ప్రయత్నం చేశారు.
‘మా డబ్బులు మాకివ్వండి. సామాను తీసుకుని మీకు నచ్చిన వాళ్ళతో పని చేయించుకోండి’ అరిచాడు నర్సయ్య.
అప్పటిదాకా ఏదోలా ఒప్పిద్దాం అనుకున్న బ్రహ్మయ్యకు అవకాశం లేకుండా పోయింది. నిశ్చితార్థానికి డబ్బులెలా సర్దాలో పాలుపోలేదు. గడువు చూస్తే రెండు వారాలే ఉంది. ఈ కాంట్రాక్టు వారం రోజుల్లో పూర్తి చేసి మిగతా పనులు చూసుకోవచ్చని ధీమాగా ఉన్నవాడు కాస్త డీలా పడ్డాడు.
బావా.. నువ్వాగు’ అంటూ నర్సయ్యను వారించి.. ‘పదండి వెళ్దాం..’ అంటూ ఓనర్‌కు చేతులెత్తి నమస్కారం పెట్టి అక్కడి నుంచి కదిలాడు బ్రహ్మయ్య.
ఇంతలో పెద్ద కొడుకునుంచి ఫోన్ .. ‘నాన్నా.. చిన్నమ్మాయి మొదటి పుట్టినరోజుకి డబ్బులు అడిగాను కదా..’ అని గుర్తు చేస్తూ!
‘కాంట్రాక్టు చేజారిపోయిందని మేమేడుస్తుంటే మధ్యలో నీ గోలేంటిరా?’ విసుక్కున్నాడు బ్రహ్మయ్య.
‘ఆటి సంగతి నాకు తెల్వదుగానీ నా సంగతి చెప్పు..’ అవతలి నుంచి ఫోన్‌లో.
‘నువ్వు నీ కూతురు గురించి నన్నడుగుతున్నావ్. నేను నా కూతురు గురించి తిప్పలు పడుతున్నాను’ బ్రహ్మయ్య.
‘పెద్దదానికి గ్రాండ్‌గా చేశాం. ఇప్పుడు చిన్నదానికి చేయకపోతే బాగుంటుందా?’ పెద్దకొడుకు ఫోన్‌లో.
‘అప్పుడు కుదిరింది, చేశాం. ఇప్పుడు టైట్‌గా ఉంది. ఇంట్లోనే కానిచ్చేద్దాం..’ అంటూ ఫోన్ పెట్టేశాడు బ్రహ్మయ్య.
ఇద్దరు కొడుకులూ.. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం, అది ఆ నోటా, ఈ నోటా పాకడంతో కూతురుకు సంబంధాలు రావడం గగనమై పోయింది. ఆరు లక్షల కట్నం ఇచ్చి, బండి పెడతామంటే ఒక సంబంధం ముందుకొచ్చింది. అందుకనే ఐదు లక్షలు విలువ చేసే కాంట్రాక్టును మూడున్నరకే ఒప్పుకున్నాడు. పెద్ద ఎమ్‌ఎన్సీ కంపెనీలు,
ఆన్‌లైన్, రెడీమేడ్ ఫర్నిచర్ పుణ్యమా అని ఈ కాంట్రాక్టు క్యాన్సిల్ అయ్యింది. ఏం చేయాలోనని బుర్ర పట్టుకున్నాడు బ్రహ్మయ్య.
‘రెడీమేడ్ ఫర్నిచర్ వచ్చాక మనకసలు పనిచ్చేవాళ్ళే లేరు బావా. కరోనా తర్వాత రాకరాక ఒకటి వచ్చిందంటే ఇది కూడా పోయే. వాచ్‌మన్ ఉద్యోగం చేసుకున్నా పదేలు వస్తాయ్. ఆ ‘శారదా రెసిడెన్సీ’ వాళ్ళు అడుగుతున్నారు.
వెళ్దామనుకుంటున్నాను బావా! ఆ అపార్ట్‌మెంట్‌లో ఎవరికైనా కార్పెంటర్ అవసరం పడితే మనమే చూసుకోవచ్చు’ కిందకు దిగుతూ తన కార్యాచరణను చెప్పాడు నర్సయ్య. ‘నువ్వూ నన్ను వదిలేసి వెళ్తావా బావా?’ బాధపడ్డాడు బ్రహ్మయ్య. ‘ఎన్నాళ్ళని కాంట్రాక్టుల కోసం పడిగాపులు కాస్తాం? కడుపులు మాడ్చుకుంటాం? నీక్కూడా చూస్తాను. వచ్చేయ్ బావా. ఆదాయం తగ్గినా మనశ్శాంతి ఉంటుంది’ అన్నాడు నర్సయ్య.
తనని కూడా వచ్చేయమనడంతో బాధపడ్డాడు బ్రహ్మయ్య.
‘నిజమే పెదనాన్నా.. అందరూ ఏదో ఒక జాబ్ చూసుకుంటున్నారు. మనమే దీన్ని పట్టుకుని వేలాడుతున్నాం అనిపిస్తోంది. నాన్న జీవితం కూడా ఇందులోనే తెల్లారిపోయింది.పెద్దమనసుతో నన్ను చేరదీశావ్. నీకు భారంగా ఉండడం నాకిష్టం లేదు. నేను కూడా ఏదన్నా చూసుకుంటా..’ తన మనసులో మాట చెప్పాడు సోము.
చేతికింద ఉంటారనుకున్న ఇద్దరు కార్పెంటర్లు తలో దిక్కు వెళ్ళిపోతామంటున్నారు. అనువైన మరో ఇద్దర్ని తెచ్చుకొని పని చేయించుకోవడం చాలా కష్టం.
‘ఒక ప్రాణాన్ని నిలబెడుతున్నాను అనుకుంటాడు డాక్టరు. న్యాయాన్ని కాపాడుతున్నాను అనుకుంటాడు లాయరు. దేశానికి రక్షణనిస్తున్నాను అనుకుంటాడు సైనికుడు. ఆళ్ళకిలాగే ఈ కార్పెంటర్ కళను కూడా అలాగే భావించమన్నాడు మా నాన్న పెద బ్రహ్మయ్య. దాన్ని తప్పలేదు కాబట్టే ‘కార్పెంటర్ బ్రహ్మయ్య’గా పేరొచ్చింది. ఇప్పుడు
‘వాచ్‌మన్ బ్రహ్మయ్య’ అని ఎవరైనా పిలిస్తే నేను తట్టుకోలేను. నా పేరుకు ముందున్న కార్పెంటర్‌ను నేనెప్పుడూ వేరుగా చూడలేదు. అదే నా జీవితం. అందులోనే నా జీవనం’ ఉద్విగ్నమయ్యాడు బ్రహ్మయ్య.
దేవుడి లీలలు ఎవరూ పసిగట్టలేరు. విచిత్రంగా అప్పుడే దేవుడు కరుణించాడు.
‘హలో! కార్పెంటర్ బ్రహ్మయ్యనా?’ అంటూ ఫోనొచ్చింది.
‘అవును సార్. మీరూ?’ అడిగాడు బ్రహ్మయ్య.
‘ఆర్నెల్ల కిందట నవీన్ నగర్‌లో ఒక కొటేషన్ ఇచ్చారు కదా! పాజిటివ్ రెసిడెన్సీ రాఘవరావును మాట్లాడుతున్నా..’
‘ఆ.. ఆ.. నమస్తే సార్. బాగున్నారా.. ఇంటీరియర్ వర్క్ అయిపోయిందా సార్?’
‘లేదండీ.. ఆ కాంట్రాక్టు మీకే ఇద్దామని చేశాను’
‘అదేదో ఎమ్మేన్సీ కంపెనీ వాళ్ళొచ్చి చేసి పెడతారు అన్నారు కదా సార్..’
‘ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి.. రెడీమేడ్ ఫర్నిచర్ అంతగా బాగోలేదు. డ్యూరబిలిటీ లేదు. మీ ప్రీవియస్ వర్క్స్ చూశాను. బాగా నచ్చాయి. పాతరోజుల్లో చేయించుకున్నట్లు దగ్గరుండి చేయించుకుందాం అని పట్టుబడుతోంది మా ఇంటావిడ. పీటలు, కుర్చీలు, మంచాలు, కప్ బోర్డులు చేయాలి. ఈ నెలాఖరుకు పిల్లలు అమెరికా నుంచి వస్తున్నారు. అప్పటిలోగా అయిపోవాలి. చెప్పండి.. ఎంతవుతుంది?’
‘మీకన్నీ తెలుసు కదా సార్. మీరే చూసి చెప్పండి’
‘నాలుగు లక్షలు అడిగారు. మూడుకి చేసెయ్యండి. మా అపార్ట్‌మెంట్లో ఇంకా ముగ్గురు రెడీగా ఉన్నారు. మీకే కాంట్రాక్టు వచ్చేలా చేస్తాను’
‘అలాగే కానియ్యండి సార్. ఇప్పుడొచ్చి కొలతలు తీసుకుంటాను’ అంటూ ఫోన్ పెట్టేసి ఇద్దరి వంకా చూశాడు బ్రహ్మయ్య.
దించిన సామాగ్రిని ఆటోలోకి ఎత్తాడు సోము. సంతోషంతో యూట్యూబ్‌లో పాత పాటలు పెట్టాడు నర్సయ్య.
‘ఉందిలే మంచికాలం ముందుముందునా.. అందరూ సుఖపడాలి నందనందనా..’ అని వస్తోంది. ఆ పాట.. బ్రహ్మయ్యకు భవిష్యత్ పైన ఆశల్ని సజీవంగా ఉంచినట్లు అనిపించింది.
-దొండపాటి కృష్ణ
చదవండి: Crime Story: ఫోరెన్సిక్.. ఆదర్శ జంట అనుకున్నారు! అసలు విషయం తెలిసి!
Comments
Please login to add a commentAdd a comment