ఈవారం కథ: సార్థకత  | Eswary Telugu Story Sarthakata In Funday Magazine | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: సార్థకత 

Published Sun, Sep 26 2021 11:58 AM | Last Updated on Sun, Sep 26 2021 12:10 PM

Eswary Telugu Story Sarthakata In Funday Magazine - Sakshi

అప్పటికే అది పదోసారో పదిహేనో సారో! అనసూయ గోడ గడియారం కేసి చూడడం.. వెంటనే వాకిట్లోకి వచ్చి వీథి చివర కనిపించేంత వరకు చూడటం. మనవళ్లిద్దరూ స్కూల్‌ నుంచి వచ్చి స్నానాలు చేసి పాలు తాగి హోంవర్క్‌ చేసుకుంటున్నారు. పిల్లల్ని చూసి నిట్టూర్చింది. ‘ఇదే వేరే ఎవరి ఇంట్లోనైనా ఇలాంటి పిల్లలు ఈపాటికి ఆటలు ఆడుకుంటూ తల్లిదండ్రులతో షికార్లు తిరుగుతూ ఆనందంగా ఉండేవారు. పాపం వీళ్లు మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా పేచీలు పెట్టకుండా చెప్పిన మాట వింటారు. 

తన కూతురు  జీవితంలో ఏదైనా ఆశ.. శ్వాస మిగిలి ఉందంటే అది వీళ్లే’ అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన అనసూయ.. గేటు చప్పుడు అవ్వడంతో ఒక్కసారిగా బయటకు వచ్చి చూసింది. తలవంచుకుని వస్తూ కనిపించింది కూతురు. ‘హమ్మయ్య! వచ్చేసింది’ అనుకుంటూ కూతురి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి ‘ఏమ్మా! అలా ఉన్నావు? ఈరోజు మళ్లీ ఏమైనా..’ అంటుండగానే జోళ్ళు విప్పి లోపలికి వచ్చిన సుజాత హాల్లో ఉన్న దీవాన్‌ మీద బోర్లా పడి భోరుమని ఏడవసాగింది. 

అక్కడే ఉన్న పిల్లలిద్దరూ బిక్క మొహం వేసుకుని అమ్మమ్మకి చేరోవైపు చేరి ఆమె చేతులు పట్టుకుని తల్లిని భయంభయంగా చూడసాగారు. అనసూయ పిల్లలిద్దరితో సుజాతకి దగ్గరగా వెళ్లి ‘ఏడవకు తల్లీ! నువ్వు  ఏడుస్తుంటే పిల్లలు చూడూ.. ఎలా భయపడుతున్నారో!  ఏం చేయాలో ఆలోచిద్దాంలే గానీ.. లేచి స్నానం చేసిరా‘ అంటూ పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి టీవీ ఆన్‌ చేసింది.  
దుఃఖభారం తీరి లేచికూర్చున్న సుజాత  ఎదురుగా గోడపైనున్న తనభర్త ఫొటోకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది.
ఒకపక్క కూతురి స్థితి, మరొక  పక్క  పక్షవాతంతో మంచంలో  ఉన్న  భర్త... ఏంచేయలేని  తన  నిస్సహాయత  మీద తనకే కోపం వస్తోంది అనసూయకు. 
∙∙ 
బ్యాంకులో పనిపూర్తి చేసుకుని గబగబా రోడ్డుపైకి వచ్చింది సరస్వతి. ఖాళీ ఆటో ఏమైనా ఉంటే ఆపుదామని ప్రయత్నిస్తోంది. కానీ కనిపించటం లేదు. ‘రఘు వస్తానంటే అనవసరంగా వద్దన్నాను’ అనుకుంటూ దగ్గరలో ఉన్న బస్టాప్‌  వైపు నడక సాగించింది. ఆరోజు సరస్వతి స్నేహితురాలు కామేశ్వరి రిటైర్మెంట్‌ ఫంక్షన్‌కి  ఆఫీసు నుంచి నేరుగా వెళ్లాలని అనుకుంది. కానీ ఆఫీసులోనే ఆలస్యమైపోతుండడంతో ఇంటికే వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. 

కామేశ్వరి, సరస్వతి ఇద్దరూ హై స్కూల్‌ నుంచీ మంచి స్నేహితులు. డిగ్రీ అవుతూనే ప్రభుత్వ పరీక్షలు రాసి గవర్నమెంటు ఉద్యోగం తెచ్చుకుంది కామేశ్వరి. ఈరోజు ఆఫీసర్‌ స్థాయిలో రిటైర్‌ అవుతోంది. సరస్వతి.. ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ చేయక అమ్మా, నాన్న  చూసిన బ్యాంకు ఉద్యోగి సంబంధం  ఒప్పుకుని పెళ్లి చేసుకుంది. దురదృష్టవశాత్తూ పెళ్లి అయిన ఐదు సంవత్సరాలకే హార్ట్‌ ఎటాక్‌తో భర్త చనిపోవడంతో ఆ బాధ నుంచి కోలుకొని తన మూడు సంవత్సరాల కొడుకు భవిష్యత్తు కోసం కాంపెన్సేటరీ గ్రౌండ్స్‌  మీద బ్యాంకులో చేరి ప్రమోషన్‌ పొంది ఆఫీసర్‌ స్థాయికి చేరింది.
బస్టాప్‌ దగ్గరికి చేరిన సరస్వతి..  నిలబడే  ఓపికలేక అక్కడున్న కుర్చీలో కూలబడింది. 

ఆ బస్టాపులోనే కొంచెం దూరంలో.. చీకట్లో.. ఎవరో ఇద్దరు వాదులాడుకుంటున్నారు. వాళ్ల గొంతులను బట్టి ఒకరు ఆడ, ఇంకొకరు మగ అని అర్థమైంది.  వాళ్ళని పరీక్షగా చూసింది సరస్వతి. చలికాలం కావడంతో ఆ ఇద్దరూ స్వెట్టర్లు వేసుకుని ఉన్నారు. అందులో ఒకరు మంకీ  క్యాప్‌ పెట్టుకోవడంతో మొహాలు సరిగ్గా కనిపించడంలేదు. అప్పుడప్పుడు  నెమ్మదిగా మాట్లాడుకుంటూ అంతలోనే గొంతుపెంచి అరుచుకుంటున్నారు. వాళ్ల వాదనా స్థాయి క్రమంగా పెరుగుతోంది. అప్పుడప్పుడు చుట్టూ చూసుకుంటున్నారు. సరస్వతి వచ్చి బస్టాప్‌లో కూర్చోవడం ఆ మసక వెలుతురులో వాళ్ళు గమనించినట్లు లేదు. అమ్మాయి అనుకుంటా.. ఏడుస్తూ బతిమాలుతోంది ‘ప్లీజ్‌! నన్ను వదిలేయ్‌. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి’ అంటూ.
‘ఈ అమ్మాయిలు ఎందుకిలా అబ్బాయిలకు అవకాశం ఇస్తున్నారు? అసలు ఈ ఇద్దరు ఎవరు? ఎందుకు పొట్లాడుకుంటున్నారు? తను మధ్యలో వెళ్లి ఏం ఆడగ్గలదు?’ అనుకుంటూ తన బస్సు సంగతి మరచిపోయి వాళ్లనే చూడసాగింది సరస్వతి.  

ఇంతలో ఆ అమ్మాయి అతనికేదో చెప్పి వెళ్ళిపోవడానికంటూ నాలుగడుగులు వేసింది సరస్వతి ఉన్న వైపు. ఆమె వెనుకే వస్తూ అతను జేబులో నుంచి ఏదో వస్తువు తీసి ఆ అమ్మాయి మీద దాడిచేయబోయాడు. అది గ్రహించిన సరస్వతి దిగ్గున లేచి తనకు దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయిని పక్కకు తోసేసింది. ఆ వెంటనే అతని చేయి పట్టుకుని ‘హెల్ప్‌ హెల్ప్‌..’ అంటూ అరవసాగింది. 

అతను సరస్వతి చేతులను విదిలించుకొని పారిపోతుంటే, రోడ్డు మీద బైక్స్‌పై వెళ్తున్న వారు ఆమె అరుపులు విని పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకొని బస్టాప్‌ దగ్గరికి తీసుకువచ్చారు. ఈలోగా అతని చేతిలో నుంచి కింద పడిన వస్తువు ఏమిటాని సెల్‌ఫోన్‌ లైట్‌ ఆన్‌చేసి చూసిన సరస్వతి ఒక్కసారిగా వణికి పోయింది. అది చాలా పదునుగా ఉన్న చిన్నచాకు. ‘అమ్మ బాబోయ్‌! ఎంత పెద్ద ప్రమాదం తప్పింది!’ అనుకుంది సరస్వతి.
కిందపడిన అమ్మాయిని ఎవరో చేయిపట్టి పైకి లేపారు. ఏంజరిగిందో తెలియని అయోమయస్థితిలో ఉందా అమ్మాయి. ఇకే మాత్రం ఆలస్యం చేయకుండా సరస్వతి.. షీ టీమ్స్‌కి, తనకి పరిచయమున్న మరొక ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్లకు ఫోన్‌చేసి సమాచారమిచ్చి వెంటనే రావలసిందిగా కోరింది. 
ఈ హడావిడికి రోడ్డు మీద వెళ్తున్న జనం కొంతమంది పోగయ్యారు. పోలీస్‌ హారన్‌ వినిపించడంతో అందరికీ ఆసక్తి ఎక్కువైంది. కారులోంచి దిగిన లేడీపోలీస్‌ సరస్వతిని చూసి ‘మేడం ఏం జరిగింది?’ అని ప్రశ్నించింది. ఆ పోలీస్‌ని విష్‌  చేసి జరిగినదంతా వివరించింది సరస్వతి.
                 ∙∙ 
‘మేడమ్‌! నమస్తే. ఈరోజు న్యూస్‌పేపర్‌లో చూశా. ఎంత పెద్ద ప్రమాదం తప్పించారు మేడమ్‌! భగవంతుడు మీ రూపంలో వచ్చి ఆ అమ్మాయిని రక్షించాడు. వాళ్ళమ్మ, నాన్న  ఎప్పటికీ రుణపడి  ఉంటారు మీకు. నిన్న మీరు ఆ అమ్మాయిని అలా సేవ్‌ చేసుండకపోతే ఈరోజు ఎలాంటి న్యూస్‌ వినాల్సి వచ్చేదో!’ అంటూ  ఆగకుండా మాట్లేడుస్తున్న సుజాతకేసి చిరునవ్వుతో  చూసింది సరస్వతి.

 ‘ఒకేచోట పనిచేస్తున్నా.. ఈరోజు పేపర్‌లో చూసేదాకా ఆడపిల్లల కోసం మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు మాకు తెలియలేదు మేడమ్‌’ అంది.
 ‘నాదేం లేదమ్మా. నిస్సహాయులైన ఆడవాళ్లకు ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలనిపించి ‘ఆలంబన’ అనే స్వచ్ఛంద సంస్థ ఆశయాలు నచ్చి దానిలో సభ్యత్వం తీసుకున్నా. వారితో కలసి ఆడవాళ్లకోసం పని చేస్తున్నాను. నిన్న జరిగినది కొంచెం పెద్దవిషయం కాబట్టి ఆ న్యూస్‌తో పాటు నా గురించీ రాశారు.. అంతేనమ్మా’ అంది సరస్వతి తేలిగ్గా. 

‘లేదు మేడమ్‌.. మీరెంతమంది లైఫ్‌ సేవ్‌  చేశారో, కొందరిని మీరెలా ఆదుకుంటున్నారో చాలా వివరంగా రాశారు మేడమ్‌’
‘ఆడవాళ్ళకింకా.. ఇప్పటికీ చాలా సమస్యలుంటున్నాయమ్మా! వాటిని పరిష్కరించుకోలేకపొతే వారితో పాటు వారి తర్వాతి తరమూ నష్టపోతుంది’
‘మేడమ్‌ మీరు పనిచేస్తున్న ఆఫీస్‌లోనే నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా.. ధైర్యం గానూ ఉందండీ’
సుజాత మాటలు విన్న సరస్వతి నవ్వుతూ ఆమె భుజం తట్టింది.

‘ఓకే మేడమ్‌. లంచ్‌టైమ్‌లో కలుస్తా మళ్లీ!  నాకైతే మీతో ఇంకా మాట్లాడుతూనే ఉండాలని ఉంది’ అంటూ తన సీటువైపు నడిచింది సుజాత. ఎప్పుడూ గంభీరంగా ఉంటూ తనపని తాను చేసుకుపోయే ఈ అమ్మాయి ఈరోజు ఇంతలా మాట్లాడడం సరస్వతికి ఆశ్చర్యం వేసింది. 

క్యాష్‌ కేబిన్‌లోకి వెళ్లిన సుజాత తనసీట్లో కూర్చుందే గాని మనసంతా వేరే ఆలోచనలతో నిండిపోయుంది. రెండు నిమిషాల తరువాత భారంగా ఊపిరి తీసుకుని ‘ఈరోజు లంచ్‌ టైమ్‌లో నా సమస్యను మేడమ్‌కి చెప్పి.. పరిష్కారం అడగాలి. ఆవిడయితేనే ఆ సమస్యను పరిష్కరించగలరు’ అనుకుంది. అలా అనుకోవడంతోనే మనసంతా చాలా తేలికై ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించింది.
∙∙ 
రోజూ వచ్చే టైమ్‌ కంటే ఆలస్యం కావడంతో అనసూయ కంగారు పడుతూ కూతురు కోసం ఎదురు చూడసాగింది. పిల్లలిద్దరూ తల్లి గురించి ఎదురు చూసి భోజనం చేసి నిద్రపోయారు కూడా. అనసూయ కూతురుకి ఫోన్‌ చేస్తే ‘మళ్ళీ చేస్తాను’ అంటూ కట్‌ చేసింది. ఆఫీసులో పని అవలేదా? లేక ఆ వ్యక్తి వల్ల మళ్లీ ఏదైనా సమస్య వచ్చి పడిందా? అర్థం కాక అనసూయకు కంగారు పెరిగింది. ఒకపక్క కూతురు గురించి ఎదురు చూస్తూనే మంచంలో ఉన్న భర్తకు అన్నం తినిపిస్తూ ఆలోచనల్లో పడిపోయింది.. ‘పెళ్లి అయిన నాటి నుంచీ సమస్యలే తనకు. భర్తది గవర్నమెంట్‌ ఉద్యోగమని ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లిచేశారు. అతనికి లేని దురలవాటు లేదని తెలుసుకునేసరికి పిల్ల కడుపున పడింది. 

కూతురు పెంపకం ఒకపక్క భర్తను ఎలాగైనా మార్చుకోవాలి.. అనే తపన ఇంకోపక్క... మానసికంగా, శారీరకంగా తనతో తాను చాలా యుద్ధం చేయాల్సిన పరిస్థితిని ముందుంచింది. వయసు మీద పడడంతో భర్తలో వచ్చిన మార్పుకు ఆనందపడుతూ కూతురు పెళ్లి జరిపించింది. అల్లుడు కూడా తన భర్త పనిచేసే బ్యాంకులోనే పనిచేస్తుండే వాడు. చాలా బుద్ధిమంతుడు. ఇంక అన్నీ మంచి రోజులే అనుకునేంతలో భర్తకు పక్షవాతం రావడం, అల్లుడు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో మళ్లీ జీవితాలన్నీ చీకట్లోకి వెళ్లిపోయాయి. సుజాతకు అల్లుడి ఉద్యోగం ఇవ్వడంతో మనసుని రాయి చేసుకుని చేరింది. ఈ సమస్యలు చాలవన్నట్లు తన ఆఫీసులోనే పని చేస్తున్న వ్యక్తి నుంచి వేధింపులు సుజాతకు..’ మనసు భారమైపోయి నిట్టూర్చింది అనసూయ. 

  గేటుతీసిన చప్పుడవ్వడంతో ఒక్క ఉదుటున గదిలోంచి హాల్లోకి వచ్చింది అనసూయ. సుజాతతో పాటు వేరే ఆవిడ ఎవరో లోపలికి వస్తూ కన్పించారు. 
‘అమ్మా.. ఈవిడ సరస్వతిగారు. పొద్దున పేపర్‌లో చూపించాను కదా ’ అంటూ పరిచయం చేసింది సుజాత హాల్లోకి వస్తూనే. 
‘నమస్తే. రండి రండి కూర్చోండి’ అంది అనసూయ సోఫా చూపిస్తూ. 

ఎప్పుడు దిగులుగా ఉండే కూతురు మొదటిసారి హుషారుగా మాట్లాడడం ఆశ్చర్యమనిపించింది అనసూయకు.
 ‘ఆమ్మా.. టైమ్‌ లేదు. మేడమ్‌ గేట్‌ దగ్గరి నుంచే  వెళ్ళిపోతానంటుంటే ఒక్కసారి నీకు పరిచయం చేయాలని లోపలికిరమ్మన్నాను’ అంటూ ఒక్క క్షణం ఆగి ‘అమ్మా.. నా  ప్రాబ్లెమ్‌ మేడమ్‌కి చెప్పాను. ఇప్పుడు అతనింటి నుంచే వస్తున్నామిద్దరం. మేడమ్‌ చాలాబాగా హేండిల్‌ చేశారు. దెబ్బకి భపడ్డాడు వాడు.  

పరువుపోతుందని చచ్చినట్టు కాళ్ళబేరానికి వచ్చాడు. రేపటి నుంచి ఆఫీసుకి లీవ్‌ పెట్టేస్తానన్నాడు. వేరే ఊరికి ట్రాన్స్ఫర్‌ పెట్టుకుని పోతానన్నాడు. అమ్మా! మేడమ్‌ అండగా  ఉన్నారు. ఇకే సమస్యనైనా ధైర్యంగా ఫేస్‌ చేస్తానమ్మా..’ ఉద్వేగంతో చెప్పింది సుజాత.
‘చాలా థాంక్స్‌ సరస్వతిగారూ.. మీలాంటి వారు మనుషుల రూపంలో తిరిగే దేవతలు’ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా సరస్వతి చేతులు పట్టుకుని అంది అనసూయ.  

 ‘అయ్యో! అంతమాట అనకండి. మనిషికి మనిషి సాయం అంతే. సుజాత  బాగా సెన్సిటివ్‌. తన వెనుక ఎవ్వరూ లేరనుకుని వేధించసాగాడు. నేను వెళ్లేసరికి ఉద్యోగం పోతుందని  భయపడ్డాడు’ అంది సరస్వతి. 
‘మేడమ్‌.. కొంచెం కాఫీ తీసుకోండి’  అంది సుజాత.
‘అయ్యో! ఇప్పుడెందుకమ్మా.. ఇంటికి వెళ్లిపోతాను కదా!’
‘పర్వాలేదు మేడమ్‌.. కాఫీయే కదా తీసుకోండి. డిన్నరే చేసేసి వెళ్తే బాగుండేది. కానీ ఇంట్లో మీ అబ్బాయి వెయిట్‌ చేస్తూంటాడని అన్నారని అడగట్లేదు. మరొకసారెప్పుడైనా మా ఇంటికి భోజనానికి రావాలి మీరు’ అంది సుజాత. 

‘ఓ.. తప్పకుండా! ఇంక వెళ్తాను’ అంటూ లేచింది సరస్వతి. 
‘మేడమ్‌! ఆగండి.. క్యాబ్‌ బుక్‌ చేస్తాను. ఆ..అలాగే మా నాన్నగారిక్కూడా మిమ్మల్ని చూపిస్తాను రండి’ అంటూ సరస్వతిని తన తండ్రి గదిలోకి తీసుకెళ్ళింది సుజాత. మంచంలో పడుకొనున్న సుజాత తండ్రిని చూసిన సరస్వతికి చాలా బాధేసింది. కాలు, చేయి చచ్చు బడిపోయి, మూతి వంకరైపోయి శున్యంలోకి  చూస్తున్నట్టు రూఫ్‌కేసి చూస్తూ పడుకున్న అతడిని జాలిగా చూసింది సరస్వతి. 
 ‘నాన్నా..’ అంటూ పిలిచి అతనికి దగ్గరగా వెళ్లి ‘ఈవిడ  సరస్వతిగారు. మా బ్యాంకులోనే పనిచేస్తున్నారు. ఈరోజు నాకు చాలా  సాయం చేశారు. నన్ను ఇంటిదగ్గర దింపి వెళదామని వచ్చారు’ అని చెప్పింది సుజాత. 

అయన పైకప్పు నుంచి తన చూపును అతికష్టం మీద సుజాత వైపు, తర్వాత నెమ్మదిగా సరస్వతి వైపు సారించాడు.
‘మేడమ్‌.. మా నాన్న  కూడా మన బ్యాంకులోనే చేశారు’ అన్నది సుజాత.
 ‘ఆహా! అలాగా’ అంటూ అతడికేసి  ఎక్కువసేపు చూడలేక అక్కడి ఆల్మరాలో సర్దిన ఫొటోలకేసి చూడసాగింది సరస్వతి.
సుజాత వాళ్ళ పెళ్లిఫొటో చూసి  ‘ఎంత చక్కగా ఉందో జంట. భగవంతుడికెంత ఈర్ష్య పుట్టిందో.. ఏమో! వీళ్లనిలా విడదీసేశాడు’ అని మనసులో అనుకుంటూ పక్కనున్న ఫొటో చూసింది. అది  కొంచెం పాత ఫొటో. సుజాత  తల్లి, తండ్రి అయి ఉంటారు.  సుజాత  తల్లి అప్పుడెంత అందంగా ఉందో! ఆవిడే ఈవిడ  అంటే నమ్మేలా లేదు’ అని మనసులో అనుకుంటూండగా సరస్వతి చూపులను గమనించిన సుజాత..
‘అది .. అమ్మానాన్నది. అప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నానట’ అంది నవ్వుతూ. 

సరస్వతి కూడా సుజాతకేసి చూసి నవ్వి మళ్లీ ఆ ఫొటోవైపు చూసింది. ఈసారి ఆ ఫొటోలో ఉన్న మగ వ్యక్తిని చూసి ఉలిక్కి పడింది. ఇంకా పరీక్షగా చూసింది. ఫొటోకేసి మంచంలో ఉన్న వ్యక్తికేసి మార్చి మార్చి చూడసాగింది. 
అతడు నిర్జీవమైన కళ్ళతో సరస్వతి వైపు  చూస్తున్నాడు. అతడి కంటి చివర నుంచి కారుతున్న కన్నీటిని సుజాత తుడవసాగింది. 
 ఒక్కసారిగా ‘నేను వెళ్తానమ్మా’ అంటూ వేగంగా ఆ గది నుంచి బయటకు వచ్చేసింది సరస్వతి.
 ‘మేడమ్‌.. ఉండండీ.. క్యాబ్‌ బుక్‌  చేస్తాను’అని సుజాత అంటుండగానే
 ‘వద్దమ్మా.. నేను ఆటోలో వెళ్ళిపోతాను’ అని బదులిస్తూ  ‘వెళ్ళొస్తానండి’ అంటూ అనసూయకూ చెప్పి పరుగులాంటి నడకతో బయటకు వచ్చి అటువైపుగా వెళ్తున్న ఆటోను అపి ఎక్కేసింది సరస్వతి.

‘చాలా థాంక్స్‌ మేడమ్‌’ అంటూ సుజాత ఇంకేదో గట్టిగా చెప్తూండగానే ఆటో బయలుదేరిపోయింది. సరస్వతికి చాలా అసహనంగా ఉంది. సుమారు ఇరవైఎనిమిది సంవత్సరాల కిందట.. ఒంటరైన తనని వేధించి మానసిక  క్షోభకు గురిచేసిన వ్యక్తి  కూతురు గురించా తను ఆలోచించింది? భర్త పోయిన దుఃఖంలో తానుండి.. భుక్తి కోసం తనకిచ్చిన భర్త ఉద్యోగాన్ని చేసుకుంటుంటే వెకిలి మాటలతో  వేధించాడు. ఆ చిన్న వయసులో ఇతడి ఆగడాలు భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అనారోగ్యం  పాలైంది. 

తన దూరపు బంధువు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంటే అతని సాయంతో ఆ సమస్య నుంచి బయట పడింది. పాత  జ్ఞాపకాలతో గుండె బరువెక్కసాగింది. తనను పెట్టిన బాధకి ఈ రోజు అంతకంతా  అనుభవిస్తున్నాడు. తప్పు చేసింది. అమ్మాయి సమస్యలో ఉన్నాను అన్న వెంటనే పరుగెత్తింది. ఈ అమ్మాయి ఎవరో.. ఏమిటో  తెలుసుకోకుండా!

‘మేడమ్‌ ఎటు వెళ్లాలో  చెప్పండి’అన్న డ్రైవర్‌  మాటలకి ఆలోచనల నుంచి బయటపడి తన ఇంటి దారి  చూపింది. ఇంటి దగ్గర ఆటో ఆగుతూనే రఘు బయటకు వచ్చాడు. 
‘వచ్చావా? ఇంకా రాకపోయేసరికి నేనే బయలుదేరి వద్దామనుకుంటున్నా’ అంటూ  సరస్వతి వాలకాన్ని గమనించి ‘అన్ని పనులతో బాగా స్ట్రెయిన్‌  అయిపోతున్నట్టున్నావమ్మా..’  అన్నాడు.
 ‘అదేం లేదురా! పద లోపలికి. తొందరగా  వంట చేస్తాను. ఇప్పటికే లేట్‌ అయింది’ అంది లోపలికి నడుస్తూ సరస్వతి. 
 ‘అమ్మా! అన్నీ సిద్ధం చేసేశాను. నువ్వు  ఫ్రెషైరా.. ఈ లోపు భోజనం వడ్డించేస్తాను’ అన్నాడు రఘు.  

ఆ మాటలతో తేలికపడిన మనసుతో స్నానానికి వెళ్లింది సరస్వతి. అన్నట్టుగానే తను ఫ్రెష్‌ అయి వచ్చేసరికి  డైనింగ్‌ టేబుల్‌ మీద అన్నీ సిద్ధం చేసిపెట్టాడు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారిద్దరూ.

‘అమ్మా.. నిన్న ఆంటీ రిటైర్మెంట్‌ ఫంక్షన్‌ విశేషాలేవీ నీకు చెప్పనే లేదు’ అన్నాడు కూర కలుపుకుంటూ. 
‘ఆ! అవును కదా.. చెప్పు ఎలా జరిగిందో’ అడిగింది నోట్లో ముద్దపెట్టుకుంటూ. 
‘ఎంత బాగా మాట్లాడారో ఆంటీ! ఆవిడ చేసిన వర్క్‌లో చిన్న మిస్టేక్‌ కూడా పట్టుకోలేరట ఎవరూ. లెక్కలు ఖచ్చితంగా చూస్తారట. ఆవిడ వర్క్‌ చేశారంటే పై ఆఫీసర్స్‌ కళ్ళు మూసుకుని ఫైల్‌ ప్రోసెస్‌ చేసేయొచ్చుట. అందరూ ఆవిడని తెగ పొగిడారు తెల్సా!’ 
 ‘అవునురా.. చిన్నప్పుడూ అంతే. చాలా బాగా చదివేది. ఎప్పుడూ క్లాస్‌ ఫస్టే!’ సరస్వతి. 

 ‘ఆహా! ఆవిడా మాట్లాడుతూ అదే చెప్పారు.. బాగా చదివి ఇంజనీర్‌ అవ్వాలనుకునే వారట. కానీ ఇంటర్‌లో తొంభయ్‌ మార్కులు వస్తాయనుకున్న పేపర్‌లో తొమ్మిది మార్కులు వచ్చాయట. ఈవిడ  బాగా చదువుతుందని తెలిసిన వాళ్ళు రీకౌంటింగ్‌కి అప్లై చేసుకో అన్నారట. కానీ డబ్బుల్లేక చేసుకోలేక పోయారట’
‘అప్పట్లో ఆడపిల్లలం అందరం ఆర్ట్స్‌ గ్రూప్‌లోనే చేరేవాళ్లం. కానీ తను మాత్రం పట్టుబట్టి సైన్స్‌ గ్రూప్‌ తీసుకుంది. ఇంజనీరింగ్‌ చదవలేక పోయానని అప్పట్లో బాధపడేది’
‘ఆ .. కానీ ఇప్పుడు ఆవిడ మంచికే ఆలా జరిగిందన్నారమ్మా అంతా! 90మార్కుల ప్లేస్‌లో తొమ్మిది మార్కులు పడడం వల్ల తనలా ఎవరూ బాధపడకూడదని తన ఉద్యోగంలో లెక్కలు  నిక్కచ్చిగా చూసేవారట. పైగా తాను ఇంజనీర్‌ కాలేకపోయినా ప్రాజెక్ట్స్‌ వర్క్స్‌ నిమిత్తం తన చేతుల మీదుగా ఇంజనీర్స్‌కి అమౌంట్‌ రిలీజ్‌ చేసేవారట. 90 మార్కుల స్థానంలో 9 మార్కులు వేసే భగవంతుడు నేను చేయాల్సిన పనిని బోధించాడు అనిపిస్తుందని చెప్పారమ్మా! ఎంత పాజిటివ్‌గా ఆలోచించారో!’ రఘు మాటలకి తలూపుతూ భోజనం చేస్తున్న సరస్వతి తనకి ఏదో హితోపదేశం జరిగినట్టు ఆలా ఉండిపోయింది. భోజనం ముగించిన రఘు ఏదో ఫోన్‌ రావడంతో తన గదిలోకి వెళ్ళి పోయాడు . 

‘నా చేత కూడా సమాజానికి మేలు చేయించాలని ఆరోజు తనకి అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చేశాడేమో భగవంతుడు. ఈనాడు తను చేసే చిన్నిసాయంతో ఎంతమంది మొహాల్లో చిరునవ్వులు  చూస్తున్నాను. నా జన్మకో సార్థకత కోసమే ఆ సంఘటన జరిగి ఉంటుంది.
పాపం! ఇందులో సుజాత తప్పేముంది? తనను అనవసరంగా తిట్టుకుంది.. సుజాతకి  చేసిన సాయానికి! తనూ సాటి మహిళూ కదా! చాలా తప్పుగా ఆలోచించింది. 

అతను చేసిన పాపానికి మంచానపడి అనుభవిస్తూనే ఉన్నాడు. సుజాత తండ్రి ఫొటో చూసి అసహ్యంతో వచ్చేసింది అక్కడి నుంచి. ఆ అమ్మాయి ఏమనుకుందో’ అనుకుంటూ ఫోన్‌ తీసుకుని సుజాతకి రింగ్‌ చేసింది. రెండో రింగ్‌ కే అవతల ఫోన్‌ ఎత్తినా చాలా గోలగా వినిపిస్తోంది. ఒక్కసారిగా భయంవేసింది సరస్వతికి. ‘తన ముందు తప్పై పోయిందని చెప్పిన అతను ఆ తరువాత సుజాత ఇంటికి వచ్చి ఏమైనా గొడవ చేస్తున్నాడా? లాభంలేదు అవసరమైతే పోలీస్‌ హెల్ప్‌ తీసుకోవాలి’ అనుకుంటున్నంతలో ‘హలో మేడం!’ అంటూ నీరసంగా వినిపించింది  సుజాత గొంతు. 

‘ఏమ్మా!ఏం జరిగింది?’
 ‘మేడమ్‌ మీరు వెళ్ళాక..’ 
 ‘ఆ! ఏమైంది?’
 ‘గోడమీది రెండుచేతులు జోడించి నమస్కరించి ఉన్న బొమ్మ వైపు చూపించారు నాన్న. మీరుండగానే కళ్ళలో నీళ్లు వచ్చాయి. అతికష్టం మీద మీరు వెళ్లిన వైపు చూపిస్తూ దండం పెట్టడానికి ట్రై చేస్తూ ప్రాణాలు  వదిలేశారు మేడమ్‌. నేను, అమ్మా నా సమస్య గురించి కూడా ఆయనకు ఏమీ చెప్పలేదు. మేమిప్పుడు మా  ఊరు వెళ్లిపోతున్నాం మేడమ్‌’ దుఃఖభరితమైన గొంతుతో చెప్పింది సుజాత. 

 ‘అయ్యయ్యో! ఎంతపని జరిగింది? అమౌంట్‌ కానీ ఏదైనా హెల్ప్‌ కానీ కావాలంటే చెప్పమ్మా’
‘తప్పకుండా మేడమ్‌. ఊర్లో మా పెద్దనాన్న గారు వాళ్ళున్నారు. అక్కడికి వెళ్లిపోతున్నాం ఇక్కడి మా బంధువులు కొందరు వచ్చారు. బ్యాంక్‌కి పదిహేను రోజులు సెలవు అప్లై చేస్తాను. మీరు కూడా ఒకసారి మేనేజర్‌గారికి  చెప్పండి. ఉంటాను మేడమ్‌’
సరస్వతి ఫోన్‌ పెట్టేసి భారంగా నిట్టూర్చింది ‘పశ్చాత్తాపం పడిన జీవుడికి విముక్తి కలిగింది’ అనుకుంటూ.
- ఈశ్వరి

చదవండి: మరోకథ: ఎండ గుర్తు

చదవండి: ఈవారం కథ: ఎదురు చూపులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement