sahithayam
-
హృదయవిదారక మిస్టరీ..! కన్న బిడ్డలు బతికున్నారోలేదో తెలియక..
ఒక అగ్నిప్రమాదం.. రాత్రికి రాత్రే వారి సంతోషాల్లో నిప్పులు పోసింది. బతుకంతా నిరీక్షించేలా చేసింది. అది శత్రువు పగతో చేసిన ఘోరమో? లేక విధి వికృతంగా పన్నిన పన్నాగమో? తెలియకుండానే జీవితాలకు జీవితాలు ముగిసిపోయాయి. కడుపు కోతకు మించిన దుఃఖం ఉండదు. కన్నబిడ్డలు బతికి ఉన్నారా.. లేదా తెలియని స్థితికి మించిన నరకం ఉండదు. అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు జార్జ్, జెన్నీ సోడర్ దంపతులు. 1945 డిసెంబర్ 24న అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో అర్ధరాత్రి ఒంటిగంటకు జార్జ్ నివసిస్తున్న రెండంతస్తుల భవనానికి ఉన్నట్టుండి నిప్పు అంటుకుంది. జెన్నీ, జార్జ్‌లు.. తమతో నిద్రిస్తున్న నలుగురు పిల్లల్ని తీసుకుని బయటికి పరుగుతీశారు. కానీ పై అంతస్తులో నిద్రపోతున్న మరో ఐదుగురు పిల్లల్ని కాపాడటానికి వీలుకాలేదు. కనీసం ఫైర్ స్టేషన్ కి కాల్ చేద్దామంటే.. టెలిఫోన్ వైర్లు తెగిపడున్నాయి. దగ్గర్లో ఉన్న బొగ్గు ట్రక్కుల సాయంతో పై అంతస్తుకి ఎక్కుదామంటే.. వాటి ఇంజిన్లు స్టార్ట్ కాలేదు. మారిస్(14), లూయీ(9) అనే ఇద్దరు మగపిల్లలు.. మార్తా(12), ఐరీన్ (8), బెట్టీ (5) అనే ముగ్గురు ఆడపిల్లలు పైనే ఇరుక్కుపోయారు. మారిస్, లూయీ, మార్తా, ఐరీన్, బెట్టీ చూస్తుండగానే ఇల్లు కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ జరిగి, ఐదుగురు పిల్లలు సజీవదహనం అయ్యార ని కేసు క్లోజ్ చేశారు పోలీసులు. కానీ జార్జ్ దంపతులు తమ పిల్లలు చనిపోలేదని, కిడ్నాప్ అయ్యారని నమ్మారు. పక్కదారి పట్టించేందుకే అగ్నిప్రమాదాన్ని సృష్టించారనే వాదన వినిపించారు. అందుకు చాలా సాక్ష్యాలను సిద్ధం చేశారు. వాటిలో ముఖ్యమైనది అంతపెద్ద ప్రమాదం జరుగుతుంటే పిల్లల నుంచి ఎటువంటి అరుపులు వినిపించలేదు. లెక్కప్రకారం గంటలోనే కాలి బూడిదైన ఇంటిలో.. ఐదు అస్థిపంజరాలు దొరకాలి. కానీ ఒకే ఒక్క మాంసం ముద్ద, కొన్ని ఎముకలు మాత్రమే దొరికాయి. వాళ్ల పనేనా? జార్జ్ సోడర్ ఇటలీలోని సార్డినియాలో 1895లో జన్మించాడు. తన 13వ ఏట కుటుంబంతో కలసి అమెరికాకు వలస వచ్చాడు. ఇక జెన్నీ కూడా వలస వచ్చిన ఇటలీ వాసే. పెళ్లి తర్వాత ఈ జంట ఇటాలియన్ కమ్యునిటీకి చెందిన ఫాయెట్విల్లే సమీపంలో స్థిరపడ్డారు. అయితే ఆ ఏరియాలో ఉన్న ఇతర ఇటాలియన్లు నియంత అయిన బెనిటో ముస్సోలినీని సపోర్ట్ చేసేవాళ్లు. బలమైన రాజకీయాభిప్రాయాలు కలిగిన జార్జ్.. వారితో వాగ్వాదాలకు దిగేవాడు. జెన్నీ, జార్జ్ సోడర్ దంపతులు అదే పగతో వాళ్లెవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్లారా? అనేది చిక్కుముడిగా మారింది. అగ్నిప్రమాదం జరిగే కొన్ని నెలల ముందు ఒక అపరిచితుడు జార్జ్ వాళ్లింటికి వచ్చి కుటుంబ బీమా తీసుకోవాలని పట్టుబట్టాడు. నిరాకరించడంతో ‘త్వరలోనే ఈ ఇల్లు కాలి బూడిదవుతుంది. పిల్లలు నాశనమయిపోతారు. ముస్సోలినీని విమర్శించి నందుకు మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించి వెళ్లిపోయాడు. అప్పుడు జార్జ్ పట్టించుకోలేదు. ఘటన తర్వాత అతడు దొరకలేదు. ఫోన్ కావాలనే చేశారా? అగ్ని ప్రమాదం జరిగిన రోజు రాత్రి.. పన్నెండున్నరకు గాఢనిద్రలో ఉన్న జెన్నీ ఓ ఫోన్ కాల్కి నిద్రలేచింది. అవతల ఒక ఆడ గొంతు.. జెన్నీ ఎప్పుడూ వినని పేరు. ‘రాంగ్ నంబర్’ అని జెన్నీ అనగానే అవతల నుంచి ఓ నవ్వు వినిపించింది. అర్థం కాని జెన్నీ.. ఫోన్ పెట్టేసి.. వెళ్లి పడుకుంది. అప్పుడే ఇంటి పైకప్పు మీద ఏదో పడిన శబ్దం జెన్నీకి వినిపించింది. గంటలోపే రూమంతా పొగకమ్మింది. మరిన్ని షాకింగ్ నిజాలు.. ఘటన తర్వాత టెలిఫోన్ రిపేర్‌చేసే వ్యక్తి ఆ ఇంట్లో తగలబడిపోయిన వైర్లను చూసి.. టెలిఫోన్ వైర్లు మంటల్లో కాలిపోకముందే.. ఎవరో కావాలనే లైన్‌కట్ చేశారని తెలిపాడు. మరోవైపు ఓ స్థానికుడు.. ఆ ఇంటి దగ్గర్లో వాహనాల ఇంజిన్లను తొలగించే పరికరాన్ని చూశానని చెప్పడంతో.. కావాలనే బొగ్గు ట్రక్కుల ఇంజిన్లు పనిచేయకుండా చేశారనే అనుమానం బలపడింది. బూడిదైన ఇంట్లో.. జార్జ్‌కు సగం కాలిన ఒక గట్టి రబ్బరు వస్తువు కనిపించింది. అది పైనాపిల్ బాంబు తయారు చేయడానికి ఉపయోగించే వస్తువు. అంటే జెన్నీకి ఆ రాత్రి వినిపించిన శబ్దం బాంబేనా? అనే కొత్త సందేహం మొదలైంది. అసలైన నిర్ధారణ ఇదే పిల్లల ఫొటోలను పేపర్లో వేయడంతో పాటు ఆ చుట్టుపక్కల గోడలపై అతికించి.. జాడ చెబితే 5 వేల డాలర్లు ఇస్తానని రివార్డ్ ప్రకటించాడు జార్జ్. అప్పుడే ఒకామె ఆ ఐదుగురు పిల్లల్ని చూశానంటూ వచ్చింది. ఆ ఇంటికి 50 మైళ్ల దూరంలో టూరిస్ట్ బూత్ నడుపుతున్నానని, అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఉదయమే తనకు ఆ పిల్లలు కనిపించారని, వాళ్లు ఫ్లోరిడా లైసెన్స్ ప్లేట్‌తో ఉన్న ఒక టూరిస్ట్ కారులో ఉన్నారని, వాళ్లకు తానే టిఫిన్ పెట్టానని చెప్పింది. జార్జ్ దంపతుల ఆశలు బలపడ్డాయి. మరోవైపు సౌత్ కరోలినా అనే హోటల్లో పనిచేసే మరొకామె ఐదుగురిలో నలుగురు పిల్లల్ని చూశానని పిల్లలతో పాటు ఎవరో నలుగురు పెద్దవాళ్లూ ఉన్నారని, వాళ్లు పిల్లల్ని నాతో మాట్లాడనివ్వలేదని చెప్పింది. ఇలాంటి పలు ఆధారాలతో 1947లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు ఆ దంపతులు రిక్వెస్ట్ చెయ్యడంతో కేసు రీఓపెన్ అయ్యింది. అందులో భాగంగా ఇంటి బూడిదల్లో దొరికిన మాంసం ముద్దను, ఎముకలను మరోసారి టెస్ట్ చేశారు. అయితే అవి పిల్లలవి కావని, మాంసం ఒక జంతువుదని, ఎముకలు 17 ఏళ్లు పైబడిన గుర్తు తెలియని యువకుడివని తేలాయి. దాంతో రివార్డ్‌ను 10 వేలకు పెంచాడు జార్జ్. 23 ఏళ్ల తర్వాత 1968లో జార్జ్‌కు ఫ్రమ్ అడ్రెస్ లేని ఒక పోస్ట్ వచ్చింది. అందులో ఒక యువకుడి ఫొటో ఉంది. ఫొటో వెనుక లూయీ సోడర్, ఐ లవ్ బ్రదర్ ఫ్రాంకీ అని రాసి ఉంది. అదే జార్జ్ కుటుంబానికి చివరిగా దొరికిన ఆధారం. అదే విషయాన్ని పోలీసుల ముందు పెడితే నవ్వారు. కానీ ఆ యువకుడు తప్పిపోయిన పిల్లల్లో ఒకడైన లూయీలానే ఉన్నాడని జార్జ్ నమ్మాడు. ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేందుకు ఒక డిటెక్టివ్‌ని కూడా నియమించాడు. కానీ డిటెక్టివ్ డబ్బులు తీసుకున్నంత వేగంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యలేపోయాడు. ఆ పోస్ట్ అందుకున్న ఏడాదికే అనారోగ్యంతో జార్జ్ కన్నుమూశాడు. సుమారు 21 ఏళ్లు జెన్నీ కూడా తన పిల్లలకోసం నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తూనే బతికింది. బతికి ఉన్నన్నాళ్లూ నిరసనగా నల్లటి దుస్తులనే ధరించింది. ఆమె మరణం తర్వాత.. అంటే 1989 నుంచి 2021 వరకూ.. జార్జ్–జెన్నీల చిన్న కూతురు సిల్వియా సోడర్.. తన మనవళ్లతో కలసి.. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో కూడా తన తోబుట్టువులను వెతికే ప్రయత్నం చేసింది. ఇంట్లో అగ్నిప్రమాదం జరిగేనాటికి సిల్వియా వయసు రెండేళ్లు. 2021 ఏప్రిల్ 21న తన 79వ ఏట.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది సిల్వియా. నాటి ఘటనలో ఏకైక సాక్ష్యంగా మిగిలిన జార్జ్ ఏకైక వారసురాలు సిల్వియా కూడా ఇప్పుడు ప్రాణాలతో లేదు. బహుశా సిల్వియా కంటే పెద్దవాళ్లైన ఆ ఐదుగురు కూడా ప్రాణాలతో ఉండి ఉండరు. కానీ పేగుబంధం కోసం కన్నప్రేమ చేసే పోరాటాలకు ఈ మిస్టరీ ఓ హృదయవిదారకమైన ఉదాహరణగా మిగిలింది. - సంహిత నిమ్మన చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!! -
ఈవారం కథ: సార్థకత
అప్పటికే అది పదోసారో పదిహేనో సారో! అనసూయ గోడ గడియారం కేసి చూడడం.. వెంటనే వాకిట్లోకి వచ్చి వీథి చివర కనిపించేంత వరకు చూడటం. మనవళ్లిద్దరూ స్కూల్ నుంచి వచ్చి స్నానాలు చేసి పాలు తాగి హోంవర్క్ చేసుకుంటున్నారు. పిల్లల్ని చూసి నిట్టూర్చింది. ‘ఇదే వేరే ఎవరి ఇంట్లోనైనా ఇలాంటి పిల్లలు ఈపాటికి ఆటలు ఆడుకుంటూ తల్లిదండ్రులతో షికార్లు తిరుగుతూ ఆనందంగా ఉండేవారు. పాపం వీళ్లు మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా పేచీలు పెట్టకుండా చెప్పిన మాట వింటారు. తన కూతురు జీవితంలో ఏదైనా ఆశ.. శ్వాస మిగిలి ఉందంటే అది వీళ్లే’ అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన అనసూయ.. గేటు చప్పుడు అవ్వడంతో ఒక్కసారిగా బయటకు వచ్చి చూసింది. తలవంచుకుని వస్తూ కనిపించింది కూతురు. ‘హమ్మయ్య! వచ్చేసింది’ అనుకుంటూ కూతురి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి ‘ఏమ్మా! అలా ఉన్నావు? ఈరోజు మళ్లీ ఏమైనా..’ అంటుండగానే జోళ్ళు విప్పి లోపలికి వచ్చిన సుజాత హాల్లో ఉన్న దీవాన్ మీద బోర్లా పడి భోరుమని ఏడవసాగింది. అక్కడే ఉన్న పిల్లలిద్దరూ బిక్క మొహం వేసుకుని అమ్మమ్మకి చేరోవైపు చేరి ఆమె చేతులు పట్టుకుని తల్లిని భయంభయంగా చూడసాగారు. అనసూయ పిల్లలిద్దరితో సుజాతకి దగ్గరగా వెళ్లి ‘ఏడవకు తల్లీ! నువ్వు ఏడుస్తుంటే పిల్లలు చూడూ.. ఎలా భయపడుతున్నారో! ఏం చేయాలో ఆలోచిద్దాంలే గానీ.. లేచి స్నానం చేసిరా‘ అంటూ పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసింది. దుఃఖభారం తీరి లేచికూర్చున్న సుజాత ఎదురుగా గోడపైనున్న తనభర్త ఫొటోకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఒకపక్క కూతురి స్థితి, మరొక పక్క పక్షవాతంతో మంచంలో ఉన్న భర్త... ఏంచేయలేని తన నిస్సహాయత మీద తనకే కోపం వస్తోంది అనసూయకు. ∙∙ బ్యాంకులో పనిపూర్తి చేసుకుని గబగబా రోడ్డుపైకి వచ్చింది సరస్వతి. ఖాళీ ఆటో ఏమైనా ఉంటే ఆపుదామని ప్రయత్నిస్తోంది. కానీ కనిపించటం లేదు. ‘రఘు వస్తానంటే అనవసరంగా వద్దన్నాను’ అనుకుంటూ దగ్గరలో ఉన్న బస్టాప్ వైపు నడక సాగించింది. ఆరోజు సరస్వతి స్నేహితురాలు కామేశ్వరి రిటైర్మెంట్ ఫంక్షన్‌కి ఆఫీసు నుంచి నేరుగా వెళ్లాలని అనుకుంది. కానీ ఆఫీసులోనే ఆలస్యమైపోతుండడంతో ఇంటికే వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. కామేశ్వరి, సరస్వతి ఇద్దరూ హై స్కూల్ నుంచీ మంచి స్నేహితులు. డిగ్రీ అవుతూనే ప్రభుత్వ పరీక్షలు రాసి గవర్నమెంటు ఉద్యోగం తెచ్చుకుంది కామేశ్వరి. ఈరోజు ఆఫీసర్ స్థాయిలో రిటైర్ అవుతోంది. సరస్వతి.. ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ చేయక అమ్మా, నాన్న చూసిన బ్యాంకు ఉద్యోగి సంబంధం ఒప్పుకుని పెళ్లి చేసుకుంది. దురదృష్టవశాత్తూ పెళ్లి అయిన ఐదు సంవత్సరాలకే హార్ట్ ఎటాక్‌తో భర్త చనిపోవడంతో ఆ బాధ నుంచి కోలుకొని తన మూడు సంవత్సరాల కొడుకు భవిష్యత్తు కోసం కాంపెన్సేటరీ గ్రౌండ్స్ మీద బ్యాంకులో చేరి ప్రమోషన్ పొంది ఆఫీసర్ స్థాయికి చేరింది. బస్టాప్ దగ్గరికి చేరిన సరస్వతి.. నిలబడే ఓపికలేక అక్కడున్న కుర్చీలో కూలబడింది. ఆ బస్టాపులోనే కొంచెం దూరంలో.. చీకట్లో.. ఎవరో ఇద్దరు వాదులాడుకుంటున్నారు. వాళ్ల గొంతులను బట్టి ఒకరు ఆడ, ఇంకొకరు మగ అని అర్థమైంది. వాళ్ళని పరీక్షగా చూసింది సరస్వతి. చలికాలం కావడంతో ఆ ఇద్దరూ స్వెట్టర్లు వేసుకుని ఉన్నారు. అందులో ఒకరు మంకీ క్యాప్ పెట్టుకోవడంతో మొహాలు సరిగ్గా కనిపించడంలేదు. అప్పుడప్పుడు నెమ్మదిగా మాట్లాడుకుంటూ అంతలోనే గొంతుపెంచి అరుచుకుంటున్నారు. వాళ్ల వాదనా స్థాయి క్రమంగా పెరుగుతోంది. అప్పుడప్పుడు చుట్టూ చూసుకుంటున్నారు. సరస్వతి వచ్చి బస్టాప్‌లో కూర్చోవడం ఆ మసక వెలుతురులో వాళ్ళు గమనించినట్లు లేదు. అమ్మాయి అనుకుంటా.. ఏడుస్తూ బతిమాలుతోంది ‘ప్లీజ్! నన్ను వదిలేయ్. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి’ అంటూ. ‘ఈ అమ్మాయిలు ఎందుకిలా అబ్బాయిలకు అవకాశం ఇస్తున్నారు? అసలు ఈ ఇద్దరు ఎవరు? ఎందుకు పొట్లాడుకుంటున్నారు? తను మధ్యలో వెళ్లి ఏం ఆడగ్గలదు?’ అనుకుంటూ తన బస్సు సంగతి మరచిపోయి వాళ్లనే చూడసాగింది సరస్వతి. ఇంతలో ఆ అమ్మాయి అతనికేదో చెప్పి వెళ్ళిపోవడానికంటూ నాలుగడుగులు వేసింది సరస్వతి ఉన్న వైపు. ఆమె వెనుకే వస్తూ అతను జేబులో నుంచి ఏదో వస్తువు తీసి ఆ అమ్మాయి మీద దాడిచేయబోయాడు. అది గ్రహించిన సరస్వతి దిగ్గున లేచి తనకు దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయిని పక్కకు తోసేసింది. ఆ వెంటనే అతని చేయి పట్టుకుని ‘హెల్ప్ హెల్ప్..’ అంటూ అరవసాగింది. అతను సరస్వతి చేతులను విదిలించుకొని పారిపోతుంటే, రోడ్డు మీద బైక్స్‌పై వెళ్తున్న వారు ఆమె అరుపులు విని పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకొని బస్టాప్ దగ్గరికి తీసుకువచ్చారు. ఈలోగా అతని చేతిలో నుంచి కింద పడిన వస్తువు ఏమిటాని సెల్‌ఫోన్ లైట్ ఆన్‌చేసి చూసిన సరస్వతి ఒక్కసారిగా వణికి పోయింది. అది చాలా పదునుగా ఉన్న చిన్నచాకు. ‘అమ్మ బాబోయ్! ఎంత పెద్ద ప్రమాదం తప్పింది!’ అనుకుంది సరస్వతి. కిందపడిన అమ్మాయిని ఎవరో చేయిపట్టి పైకి లేపారు. ఏంజరిగిందో తెలియని అయోమయస్థితిలో ఉందా అమ్మాయి. ఇకే మాత్రం ఆలస్యం చేయకుండా సరస్వతి.. షీ టీమ్స్‌కి, తనకి పరిచయమున్న మరొక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు ఫోన్‌చేసి సమాచారమిచ్చి వెంటనే రావలసిందిగా కోరింది. ఈ హడావిడికి రోడ్డు మీద వెళ్తున్న జనం కొంతమంది పోగయ్యారు. పోలీస్ హారన్ వినిపించడంతో అందరికీ ఆసక్తి ఎక్కువైంది. కారులోంచి దిగిన లేడీపోలీస్ సరస్వతిని చూసి ‘మేడం ఏం జరిగింది?’ అని ప్రశ్నించింది. ఆ పోలీస్‌ని విష్ చేసి జరిగినదంతా వివరించింది సరస్వతి. ∙∙ ‘మేడమ్! నమస్తే. ఈరోజు న్యూస్పేపర్లో చూశా. ఎంత పెద్ద ప్రమాదం తప్పించారు మేడమ్! భగవంతుడు మీ రూపంలో వచ్చి ఆ అమ్మాయిని రక్షించాడు. వాళ్ళమ్మ, నాన్న ఎప్పటికీ రుణపడి ఉంటారు మీకు. నిన్న మీరు ఆ అమ్మాయిని అలా సేవ్ చేసుండకపోతే ఈరోజు ఎలాంటి న్యూస్ వినాల్సి వచ్చేదో!’ అంటూ ఆగకుండా మాట్లేడుస్తున్న సుజాతకేసి చిరునవ్వుతో చూసింది సరస్వతి. ‘ఒకేచోట పనిచేస్తున్నా.. ఈరోజు పేపర్లో చూసేదాకా ఆడపిల్లల కోసం మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు మాకు తెలియలేదు మేడమ్’ అంది. ‘నాదేం లేదమ్మా. నిస్సహాయులైన ఆడవాళ్లకు ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలనిపించి ‘ఆలంబన’ అనే స్వచ్ఛంద సంస్థ ఆశయాలు నచ్చి దానిలో సభ్యత్వం తీసుకున్నా. వారితో కలసి ఆడవాళ్లకోసం పని చేస్తున్నాను. నిన్న జరిగినది కొంచెం పెద్దవిషయం కాబట్టి ఆ న్యూస్‌తో పాటు నా గురించీ రాశారు.. అంతేనమ్మా’ అంది సరస్వతి తేలిగ్గా. ‘లేదు మేడమ్.. మీరెంతమంది లైఫ్ సేవ్ చేశారో, కొందరిని మీరెలా ఆదుకుంటున్నారో చాలా వివరంగా రాశారు మేడమ్’ ‘ఆడవాళ్ళకింకా.. ఇప్పటికీ చాలా సమస్యలుంటున్నాయమ్మా! వాటిని పరిష్కరించుకోలేకపొతే వారితో పాటు వారి తర్వాతి తరమూ నష్టపోతుంది’ ‘మేడమ్ మీరు పనిచేస్తున్న ఆఫీస్‌లోనే నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా.. ధైర్యం గానూ ఉందండీ’ సుజాత మాటలు విన్న సరస్వతి నవ్వుతూ ఆమె భుజం తట్టింది. ‘ఓకే మేడమ్. లంచ్‌టైమ్‌లో కలుస్తా మళ్లీ! నాకైతే మీతో ఇంకా మాట్లాడుతూనే ఉండాలని ఉంది’ అంటూ తన సీటువైపు నడిచింది సుజాత. ఎప్పుడూ గంభీరంగా ఉంటూ తనపని తాను చేసుకుపోయే ఈ అమ్మాయి ఈరోజు ఇంతలా మాట్లాడడం సరస్వతికి ఆశ్చర్యం వేసింది. క్యాష్ కేబిన్‌లోకి వెళ్లిన సుజాత తనసీట్లో కూర్చుందే గాని మనసంతా వేరే ఆలోచనలతో నిండిపోయుంది. రెండు నిమిషాల తరువాత భారంగా ఊపిరి తీసుకుని ‘ఈరోజు లంచ్ టైమ్‌లో నా సమస్యను మేడమ్‌కి చెప్పి.. పరిష్కారం అడగాలి. ఆవిడయితేనే ఆ సమస్యను పరిష్కరించగలరు’ అనుకుంది. అలా అనుకోవడంతోనే మనసంతా చాలా తేలికై ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించింది. ∙∙ రోజూ వచ్చే టైమ్ కంటే ఆలస్యం కావడంతో అనసూయ కంగారు పడుతూ కూతురు కోసం ఎదురు చూడసాగింది. పిల్లలిద్దరూ తల్లి గురించి ఎదురు చూసి భోజనం చేసి నిద్రపోయారు కూడా. అనసూయ కూతురుకి ఫోన్ చేస్తే ‘మళ్ళీ చేస్తాను’ అంటూ కట్ చేసింది. ఆఫీసులో పని అవలేదా? లేక ఆ వ్యక్తి వల్ల మళ్లీ ఏదైనా సమస్య వచ్చి పడిందా? అర్థం కాక అనసూయకు కంగారు పెరిగింది. ఒకపక్క కూతురు గురించి ఎదురు చూస్తూనే మంచంలో ఉన్న భర్తకు అన్నం తినిపిస్తూ ఆలోచనల్లో పడిపోయింది.. ‘పెళ్లి అయిన నాటి నుంచీ సమస్యలే తనకు. భర్తది గవర్నమెంట్ ఉద్యోగమని ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లిచేశారు. అతనికి లేని దురలవాటు లేదని తెలుసుకునేసరికి పిల్ల కడుపున పడింది. కూతురు పెంపకం ఒకపక్క భర్తను ఎలాగైనా మార్చుకోవాలి.. అనే తపన ఇంకోపక్క... మానసికంగా, శారీరకంగా తనతో తాను చాలా యుద్ధం చేయాల్సిన పరిస్థితిని ముందుంచింది. వయసు మీద పడడంతో భర్తలో వచ్చిన మార్పుకు ఆనందపడుతూ కూతురు పెళ్లి జరిపించింది. అల్లుడు కూడా తన భర్త పనిచేసే బ్యాంకులోనే పనిచేస్తుండే వాడు. చాలా బుద్ధిమంతుడు. ఇంక అన్నీ మంచి రోజులే అనుకునేంతలో భర్తకు పక్షవాతం రావడం, అల్లుడు యాక్సిడెంట్లో చనిపోవడంతో మళ్లీ జీవితాలన్నీ చీకట్లోకి వెళ్లిపోయాయి. సుజాతకు అల్లుడి ఉద్యోగం ఇవ్వడంతో మనసుని రాయి చేసుకుని చేరింది. ఈ సమస్యలు చాలవన్నట్లు తన ఆఫీసులోనే పని చేస్తున్న వ్యక్తి నుంచి వేధింపులు సుజాతకు..’ మనసు భారమైపోయి నిట్టూర్చింది అనసూయ. గేటుతీసిన చప్పుడవ్వడంతో ఒక్క ఉదుటున గదిలోంచి హాల్లోకి వచ్చింది అనసూయ. సుజాతతో పాటు వేరే ఆవిడ ఎవరో లోపలికి వస్తూ కన్పించారు. ‘అమ్మా.. ఈవిడ సరస్వతిగారు. పొద్దున పేపర్లో చూపించాను కదా ’ అంటూ పరిచయం చేసింది సుజాత హాల్లోకి వస్తూనే. ‘నమస్తే. రండి రండి కూర్చోండి’ అంది అనసూయ సోఫా చూపిస్తూ. ఎప్పుడు దిగులుగా ఉండే కూతురు మొదటిసారి హుషారుగా మాట్లాడడం ఆశ్చర్యమనిపించింది అనసూయకు. ‘ఆమ్మా.. టైమ్ లేదు. మేడమ్ గేట్ దగ్గరి నుంచే వెళ్ళిపోతానంటుంటే ఒక్కసారి నీకు పరిచయం చేయాలని లోపలికిరమ్మన్నాను’ అంటూ ఒక్క క్షణం ఆగి ‘అమ్మా.. నా ప్రాబ్లెమ్ మేడమ్‌కి చెప్పాను. ఇప్పుడు అతనింటి నుంచే వస్తున్నామిద్దరం. మేడమ్ చాలాబాగా హేండిల్ చేశారు. దెబ్బకి భపడ్డాడు వాడు. పరువుపోతుందని చచ్చినట్టు కాళ్ళబేరానికి వచ్చాడు. రేపటి నుంచి ఆఫీసుకి లీవ్ పెట్టేస్తానన్నాడు. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని పోతానన్నాడు. అమ్మా! మేడమ్ అండగా ఉన్నారు. ఇకే సమస్యనైనా ధైర్యంగా ఫేస్ చేస్తానమ్మా..’ ఉద్వేగంతో చెప్పింది సుజాత. ‘చాలా థాంక్స్ సరస్వతిగారూ.. మీలాంటి వారు మనుషుల రూపంలో తిరిగే దేవతలు’ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా సరస్వతి చేతులు పట్టుకుని అంది అనసూయ. ‘అయ్యో! అంతమాట అనకండి. మనిషికి మనిషి సాయం అంతే. సుజాత బాగా సెన్సిటివ్. తన వెనుక ఎవ్వరూ లేరనుకుని వేధించసాగాడు. నేను వెళ్లేసరికి ఉద్యోగం పోతుందని భయపడ్డాడు’ అంది సరస్వతి. ‘మేడమ్.. కొంచెం కాఫీ తీసుకోండి’ అంది సుజాత. ‘అయ్యో! ఇప్పుడెందుకమ్మా.. ఇంటికి వెళ్లిపోతాను కదా!’ ‘పర్వాలేదు మేడమ్.. కాఫీయే కదా తీసుకోండి. డిన్నరే చేసేసి వెళ్తే బాగుండేది. కానీ ఇంట్లో మీ అబ్బాయి వెయిట్ చేస్తూంటాడని అన్నారని అడగట్లేదు. మరొకసారెప్పుడైనా మా ఇంటికి భోజనానికి రావాలి మీరు’ అంది సుజాత. ‘ఓ.. తప్పకుండా! ఇంక వెళ్తాను’ అంటూ లేచింది సరస్వతి. ‘మేడమ్! ఆగండి.. క్యాబ్ బుక్ చేస్తాను. ఆ..అలాగే మా నాన్నగారిక్కూడా మిమ్మల్ని చూపిస్తాను రండి’ అంటూ సరస్వతిని తన తండ్రి గదిలోకి తీసుకెళ్ళింది సుజాత. మంచంలో పడుకొనున్న సుజాత తండ్రిని చూసిన సరస్వతికి చాలా బాధేసింది. కాలు, చేయి చచ్చు బడిపోయి, మూతి వంకరైపోయి శున్యంలోకి చూస్తున్నట్టు రూఫ్‌కేసి చూస్తూ పడుకున్న అతడిని జాలిగా చూసింది సరస్వతి. ‘నాన్నా..’ అంటూ పిలిచి అతనికి దగ్గరగా వెళ్లి ‘ఈవిడ సరస్వతిగారు. మా బ్యాంకులోనే పనిచేస్తున్నారు. ఈరోజు నాకు చాలా సాయం చేశారు. నన్ను ఇంటిదగ్గర దింపి వెళదామని వచ్చారు’ అని చెప్పింది సుజాత. అయన పైకప్పు నుంచి తన చూపును అతికష్టం మీద సుజాత వైపు, తర్వాత నెమ్మదిగా సరస్వతి వైపు సారించాడు. ‘మేడమ్.. మా నాన్న కూడా మన బ్యాంకులోనే చేశారు’ అన్నది సుజాత. ‘ఆహా! అలాగా’ అంటూ అతడికేసి ఎక్కువసేపు చూడలేక అక్కడి ఆల్మరాలో సర్దిన ఫొటోలకేసి చూడసాగింది సరస్వతి. సుజాత వాళ్ళ పెళ్లిఫొటో చూసి ‘ఎంత చక్కగా ఉందో జంట. భగవంతుడికెంత ఈర్ష్య పుట్టిందో.. ఏమో! వీళ్లనిలా విడదీసేశాడు’ అని మనసులో అనుకుంటూ పక్కనున్న ఫొటో చూసింది. అది కొంచెం పాత ఫొటో. సుజాత తల్లి, తండ్రి అయి ఉంటారు. సుజాత తల్లి అప్పుడెంత అందంగా ఉందో! ఆవిడే ఈవిడ అంటే నమ్మేలా లేదు’ అని మనసులో అనుకుంటూండగా సరస్వతి చూపులను గమనించిన సుజాత.. ‘అది .. అమ్మానాన్నది. అప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నానట’ అంది నవ్వుతూ. సరస్వతి కూడా సుజాతకేసి చూసి నవ్వి మళ్లీ ఆ ఫొటోవైపు చూసింది. ఈసారి ఆ ఫొటోలో ఉన్న మగ వ్యక్తిని చూసి ఉలిక్కి పడింది. ఇంకా పరీక్షగా చూసింది. ఫొటోకేసి మంచంలో ఉన్న వ్యక్తికేసి మార్చి మార్చి చూడసాగింది. అతడు నిర్జీవమైన కళ్ళతో సరస్వతి వైపు చూస్తున్నాడు. అతడి కంటి చివర నుంచి కారుతున్న కన్నీటిని సుజాత తుడవసాగింది. ఒక్కసారిగా ‘నేను వెళ్తానమ్మా’ అంటూ వేగంగా ఆ గది నుంచి బయటకు వచ్చేసింది సరస్వతి. ‘మేడమ్.. ఉండండీ.. క్యాబ్ బుక్ చేస్తాను’అని సుజాత అంటుండగానే ‘వద్దమ్మా.. నేను ఆటోలో వెళ్ళిపోతాను’ అని బదులిస్తూ ‘వెళ్ళొస్తానండి’ అంటూ అనసూయకూ చెప్పి పరుగులాంటి నడకతో బయటకు వచ్చి అటువైపుగా వెళ్తున్న ఆటోను అపి ఎక్కేసింది సరస్వతి. ‘చాలా థాంక్స్ మేడమ్’ అంటూ సుజాత ఇంకేదో గట్టిగా చెప్తూండగానే ఆటో బయలుదేరిపోయింది. సరస్వతికి చాలా అసహనంగా ఉంది. సుమారు ఇరవైఎనిమిది సంవత్సరాల కిందట.. ఒంటరైన తనని వేధించి మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తి కూతురు గురించా తను ఆలోచించింది? భర్త పోయిన దుఃఖంలో తానుండి.. భుక్తి కోసం తనకిచ్చిన భర్త ఉద్యోగాన్ని చేసుకుంటుంటే వెకిలి మాటలతో వేధించాడు. ఆ చిన్న వయసులో ఇతడి ఆగడాలు భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్యం పాలైంది. తన దూరపు బంధువు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే అతని సాయంతో ఆ సమస్య నుంచి బయట పడింది. పాత జ్ఞాపకాలతో గుండె బరువెక్కసాగింది. తనను పెట్టిన బాధకి ఈ రోజు అంతకంతా అనుభవిస్తున్నాడు. తప్పు చేసింది. అమ్మాయి సమస్యలో ఉన్నాను అన్న వెంటనే పరుగెత్తింది. ఈ అమ్మాయి ఎవరో.. ఏమిటో తెలుసుకోకుండా! ‘మేడమ్ ఎటు వెళ్లాలో చెప్పండి’అన్న డ్రైవర్ మాటలకి ఆలోచనల నుంచి బయటపడి తన ఇంటి దారి చూపింది. ఇంటి దగ్గర ఆటో ఆగుతూనే రఘు బయటకు వచ్చాడు. ‘వచ్చావా? ఇంకా రాకపోయేసరికి నేనే బయలుదేరి వద్దామనుకుంటున్నా’ అంటూ సరస్వతి వాలకాన్ని గమనించి ‘అన్ని పనులతో బాగా స్ట్రెయిన్ అయిపోతున్నట్టున్నావమ్మా..’ అన్నాడు. ‘అదేం లేదురా! పద లోపలికి. తొందరగా వంట చేస్తాను. ఇప్పటికే లేట్ అయింది’ అంది లోపలికి నడుస్తూ సరస్వతి. ‘అమ్మా! అన్నీ సిద్ధం చేసేశాను. నువ్వు ఫ్రెషైరా.. ఈ లోపు భోజనం వడ్డించేస్తాను’ అన్నాడు రఘు. ఆ మాటలతో తేలికపడిన మనసుతో స్నానానికి వెళ్లింది సరస్వతి. అన్నట్టుగానే తను ఫ్రెష్ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసిపెట్టాడు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారిద్దరూ. ‘అమ్మా.. నిన్న ఆంటీ రిటైర్మెంట్ ఫంక్షన్ విశేషాలేవీ నీకు చెప్పనే లేదు’ అన్నాడు కూర కలుపుకుంటూ. ‘ఆ! అవును కదా.. చెప్పు ఎలా జరిగిందో’ అడిగింది నోట్లో ముద్దపెట్టుకుంటూ. ‘ఎంత బాగా మాట్లాడారో ఆంటీ! ఆవిడ చేసిన వర్క్‌లో చిన్న మిస్టేక్ కూడా పట్టుకోలేరట ఎవరూ. లెక్కలు ఖచ్చితంగా చూస్తారట. ఆవిడ వర్క్ చేశారంటే పై ఆఫీసర్స్ కళ్ళు మూసుకుని ఫైల్ ప్రోసెస్ చేసేయొచ్చుట. అందరూ ఆవిడని తెగ పొగిడారు తెల్సా!’ ‘అవునురా.. చిన్నప్పుడూ అంతే. చాలా బాగా చదివేది. ఎప్పుడూ క్లాస్ ఫస్టే!’ సరస్వతి. ‘ఆహా! ఆవిడా మాట్లాడుతూ అదే చెప్పారు.. బాగా చదివి ఇంజనీర్ అవ్వాలనుకునే వారట. కానీ ఇంటర్లో తొంభయ్ మార్కులు వస్తాయనుకున్న పేపర్లో తొమ్మిది మార్కులు వచ్చాయట. ఈవిడ బాగా చదువుతుందని తెలిసిన వాళ్ళు రీకౌంటింగ్‌కి అప్లై చేసుకో అన్నారట. కానీ డబ్బుల్లేక చేసుకోలేక పోయారట’ ‘అప్పట్లో ఆడపిల్లలం అందరం ఆర్ట్స్ గ్రూప్‌లోనే చేరేవాళ్లం. కానీ తను మాత్రం పట్టుబట్టి సైన్స్ గ్రూప్ తీసుకుంది. ఇంజనీరింగ్ చదవలేక పోయానని అప్పట్లో బాధపడేది’ ‘ఆ .. కానీ ఇప్పుడు ఆవిడ మంచికే ఆలా జరిగిందన్నారమ్మా అంతా! 90మార్కుల ప్లేస్‌లో తొమ్మిది మార్కులు పడడం వల్ల తనలా ఎవరూ బాధపడకూడదని తన ఉద్యోగంలో లెక్కలు నిక్కచ్చిగా చూసేవారట. పైగా తాను ఇంజనీర్ కాలేకపోయినా ప్రాజెక్ట్స్ వర్క్స్ నిమిత్తం తన చేతుల మీదుగా ఇంజనీర్స్‌కి అమౌంట్ రిలీజ్ చేసేవారట. 90 మార్కుల స్థానంలో 9 మార్కులు వేసే భగవంతుడు నేను చేయాల్సిన పనిని బోధించాడు అనిపిస్తుందని చెప్పారమ్మా! ఎంత పాజిటివ్‌గా ఆలోచించారో!’ రఘు మాటలకి తలూపుతూ భోజనం చేస్తున్న సరస్వతి తనకి ఏదో హితోపదేశం జరిగినట్టు ఆలా ఉండిపోయింది. భోజనం ముగించిన రఘు ఏదో ఫోన్ రావడంతో తన గదిలోకి వెళ్ళి పోయాడు . ‘నా చేత కూడా సమాజానికి మేలు చేయించాలని ఆరోజు తనకి అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చేశాడేమో భగవంతుడు. ఈనాడు తను చేసే చిన్నిసాయంతో ఎంతమంది మొహాల్లో చిరునవ్వులు చూస్తున్నాను. నా జన్మకో సార్థకత కోసమే ఆ సంఘటన జరిగి ఉంటుంది. పాపం! ఇందులో సుజాత తప్పేముంది? తనను అనవసరంగా తిట్టుకుంది.. సుజాతకి చేసిన సాయానికి! తనూ సాటి మహిళూ కదా! చాలా తప్పుగా ఆలోచించింది. అతను చేసిన పాపానికి మంచానపడి అనుభవిస్తూనే ఉన్నాడు. సుజాత తండ్రి ఫొటో చూసి అసహ్యంతో వచ్చేసింది అక్కడి నుంచి. ఆ అమ్మాయి ఏమనుకుందో’ అనుకుంటూ ఫోన్ తీసుకుని సుజాతకి రింగ్ చేసింది. రెండో రింగ్ కే అవతల ఫోన్ ఎత్తినా చాలా గోలగా వినిపిస్తోంది. ఒక్కసారిగా భయంవేసింది సరస్వతికి. ‘తన ముందు తప్పై పోయిందని చెప్పిన అతను ఆ తరువాత సుజాత ఇంటికి వచ్చి ఏమైనా గొడవ చేస్తున్నాడా? లాభంలేదు అవసరమైతే పోలీస్ హెల్ప్ తీసుకోవాలి’ అనుకుంటున్నంతలో ‘హలో మేడం!’ అంటూ నీరసంగా వినిపించింది సుజాత గొంతు. ‘ఏమ్మా!ఏం జరిగింది?’ ‘మేడమ్ మీరు వెళ్ళాక..’ ‘ఆ! ఏమైంది?’ ‘గోడమీది రెండుచేతులు జోడించి నమస్కరించి ఉన్న బొమ్మ వైపు చూపించారు నాన్న. మీరుండగానే కళ్ళలో నీళ్లు వచ్చాయి. అతికష్టం మీద మీరు వెళ్లిన వైపు చూపిస్తూ దండం పెట్టడానికి ట్రై చేస్తూ ప్రాణాలు వదిలేశారు మేడమ్. నేను, అమ్మా నా సమస్య గురించి కూడా ఆయనకు ఏమీ చెప్పలేదు. మేమిప్పుడు మా ఊరు వెళ్లిపోతున్నాం మేడమ్’ దుఃఖభరితమైన గొంతుతో చెప్పింది సుజాత. ‘అయ్యయ్యో! ఎంతపని జరిగింది? అమౌంట్ కానీ ఏదైనా హెల్ప్ కానీ కావాలంటే చెప్పమ్మా’ ‘తప్పకుండా మేడమ్. ఊర్లో మా పెద్దనాన్న గారు వాళ్ళున్నారు. అక్కడికి వెళ్లిపోతున్నాం ఇక్కడి మా బంధువులు కొందరు వచ్చారు. బ్యాంక్‌కి పదిహేను రోజులు సెలవు అప్లై చేస్తాను. మీరు కూడా ఒకసారి మేనేజర్‌గారికి చెప్పండి. ఉంటాను మేడమ్’ సరస్వతి ఫోన్ పెట్టేసి భారంగా నిట్టూర్చింది ‘పశ్చాత్తాపం పడిన జీవుడికి విముక్తి కలిగింది’ అనుకుంటూ. - ఈశ్వరి చదవండి: మరోకథ: ఎండ గుర్తు చదవండి: ఈవారం కథ: ఎదురు చూపులు -
సులభ సుందర కవి
జనప్రియ కవిగా పేరు మోసిన కన్నడ కవి కె.ఎస్.నిసార్ అహమద్ మే 3న బెంగళూరులో తన 84వ యేట క్యాన్సర్‌తో మరణించారు. భూగర్భ శాస్త్ర ఆచార్యులుగా పనిచేసిన నిసార్ పద్మశ్రీ, పంప ప్రశస్తి, గౌరవ డాక్టరేట్లతో సన్మానింపబడ్డారు. వినాయక కృష్ణ గోకాక్, ఎం.గోపాలకృష్ణ అడిగ 1950 ప్రాంతంలో ప్రతిపాదించిన నవ్య కవిత్వం ఉద్యమంలో పుట్టుకొచ్చిన కవుల్లో నిసార్ పేర్కొనదగినవారు. ఆంగ్ల కవులైన ఇలియట్, ఆడెన్, డిలాన్ థామస్, ఏట్స్, స్టీఫన్ స్పెండర్ మొదలైనవాళ్ల కవిత్వానికి ప్రభావితులై కన్నడంలో స్వాంతంత్య్రం తర్వాత నెలకొన్న రాజకీయ, సాంఘిక దుస్థితులకు ప్రతిస్పందిస్తూ వచ్చిందే నవ్య కవిత్వం. విషమ పరిస్థితుల వాస్తవిక చిత్రణ, వచన కవితా శైలి, స్వానుభవ అభివ్యక్తి, బౌద్ధికతా ప్రాధాన్యం, నూతన ప్రతీకల, పదచిత్రాల ప్రయోగం, సూటితనం, వ్యంగ్యం దీని లక్షణాలు. బి.సి.రామచంద్రశర్మ, జి.ఎస్.శివరుద్రప్ప, చెన్నవీరకణవి, పి.లంకేశ్, చంద్రశేఖర పాటీల్, చంద్రశేఖర కంబార, సుమతీంద్ర నాడిగ మొదలైనవాళ్లు తమతమ వ్యక్తిగత ముద్రలతో కవితలు రచిస్తే, నిసార్ సులభ, సుందర శైలిలో రాసి విశాల పాఠక సముదాయాన్ని సంపాదించుకున్నారు. సంప్రదాయ, నవ్య కవుల, యువకవులతో పాలలో పంచదారలా కలిసిపోయినందువల్ల నిసార్ కవిత్వంలో ప్రబుద్ధతతో పాటు సంవేదన కూడా సుతారంగా సంగమించింది. సమకాలీన సమవయస్కుల కవితల్లో బౌద్ధికత పైచెయ్యి కాగ, ఈయన కవితల్లో సహృదయత, సారళం, సహజత్వం త్రివేణిగా రూపొందాయి. నిసార్ కవిత్వంలో అన్యాయానికీ, అక్రమానికీ ప్రతిఘటన వుంది కానీ సాత్విక రూపంలో, సంస్కారవంతమైన రీతిలో. ఆవేశం లేదు, అనుభవం వుంది, అనురాగమూ వుంది. ఆయన కవితా సంకలనం నిత్యోత్సవ 1976లో వెలువడి, 1978లో క్యాసెట్ రూపంలో విడుదలైంది. మధుర లలిత సంగీత గాయకుడు మైసూరు అనంతస్వామి సంగీత సారథ్యంలో వెలువడ్డ ఈ క్యాసెట్ కర్ణాటకలో జయభేరి మోగించింది. ‘నిత్యోత్సవం తల్లి నిత్యోత్సవం నీకు నిత్యోత్సవం’ అంటూ మొదలైన గీతం జోగ్ జలపాతం వెలుగు జిలుగులతో, తుంగానది హొయలతో, సహ్యాద్రి పర్వత నీలుగులతో, సతత హరిత అరణ్యాల పచ్చదనంతో ప్రకృతి కర్ణాటక మాతకు నీరాజనం పడుతున్నదని నిసార్ నివాళులు అర్పించారు. నిసార్ కవితా వస్తువు సామాన్యమైనదిగా కనిపించినా, కవి అంతర్ దృష్టి ఆ కవితకు విశిష్టతను సంతరించిపెడ్తుంది. ‘రామన్ సత్త సుద్ది’ (సర్ సి.వి.రామన్ మరణ వార్త) తనకు గొప్ప విషయంగా తోచినా, సామాన్య ప్రజల్లో ఎలాంటి కదలిక కలిగించకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. పేరు ప్రతిష్ఠల్ని ఆశించినా, వాటి పరిమితుల్ని అర్థం చేసుకోవాలన్న బోధ కలిగిస్తుంది ఈ కవిత. ‘నిమ్మొడ నిద్దూ నిమ్మంతాగదె’(మీతో వున్నా, మీవాడు కాని) కవిత, కవి ప్రజల్లో మమైక్యమైనా దూరం చేయబడ్డ విజాతీయుని బాధను వ్యక్తం చేస్తుంది. నిసార్ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లోని ఉదాత్తతను ప్రశంసించారు. లోపాల్ని సుతిమెత్తగా సూచించి బాధపడ్డారు. -ఘట్టమరాజు -
రారండోయ్
అమ్జద్ కవితా సంపుటి తొలకరి చినుకులు, కథా సంపుటి పూలచాదర్ ఆవిష్కరణ సభ అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఆవిష్కర్తలు: కె.శివారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి. నిర్వహణ: కవిసంగమం, పాలపిట్ట బుక్స్.డాక్టర్ నందిని సిధారెడ్డి ‘నూరు పూలు’ ముందుమాటల ఆవిష్కరణ సభ అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: కె.శివారెడ్డి. గ్రంథ సంపాదకులు: డాక్టర్ బెల్లంకొండ సంపత్‌కుమార్. నిర్వహణ: తెలంగాణ రచయితల సంఘం శేషేంద్ర శర్మ 92వ జయంతి సభ అక్టోబర్ 20న సా. 6 గంటలకు త్యాగరాయ గానసభలో జరగనుంది. కీలకోపన్యాసం: శ్రీరామకవచం సాగర్. నిర్వహణ: గుండ్లకమ్మ రచయితల సంఘం. అక్టోబర్ 20న ఉదయం 9:30కు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని విద్యానికేతన్ పాఠశాలలో జరిగే రాజాం రచయితల వేదిక సమావేశంలో సాహిత్యోద్యానంలో పద్య పరిమళాలు అంశంపై చెళ్లపిళ్ల సన్యాసిరావు ప్రసంగిస్తారు. ముఖ్య అతిథి: ముయిద ఆనందరావు. పిల్లల్లో తెలుగు మీద గౌరవం, ఆసక్తి పెంచడం కోసం దాసుభాషితం.కామ్ ‘సి.పి.బ్రౌన్ వార్షిక పాఠశాలల తెలుగు పోటీ 2019’ నిర్వహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల పదో తరగతి విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు, వారి పాఠశాలలు ఇందులో పాల్గొనవచ్చు. పిల్లలు ఉమ్మడిగా రూ.40 వేలు, ఉపాధ్యాయులు రూ.10 వేలు గెలవొచ్చు. రెండు రాష్ట్రాలకూ కలిపి బహుమతుల మొత్తం లక్ష రూపాయలు. ప్రదానం హైదరా బాద్‌లో డిసెంబర్ రెండవ వారంలో జరుగు తుంది. రిజిస్టర్ చేసుకునేందుకు ఞ్టౌ్ఛ్ఛ2019 అని 9952029498 వాట్సాప్ నంబరుకు సందేశం పంపాలి. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అమరావతి సాహితీ మిత్రులు, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అవినీతి వ్యతిరేక కవితల పోటీ నిర్వహిస్తున్నాయి. బహుమతులు వరుసగా 5 వేలు, 3 వేలు, 2 వేలు. నవంబర్ 20లోగా ‘రావి రంగారావు, 101, శంఖచక్ర నివాస్, అన్నపూర్ణనగర్, 5వ లైన్, తూర్పు గోరంట్ల, గుంటూరు–522034’ చిరునామాకు చేరాలి. -
రారండోయ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నవలల పోటీ – 2019లో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ రెండు లక్షల రూపాయల బహుమతి గెలుచుకుందని పోటీ కార్యనిర్వాహకులు జంపాల చౌదరి తెలియజేస్తున్నారు. తానా నవలల పోటీల్లో ఇలా పూర్తి బహుమతి అందుకుంటున్న తొలి నవల ఇది. జూలై 4, 5, 6 తేదీల్లో వాషింగ్టన్ డి.సి. నగరంలో తానా 22వ మహాసభలు జరగనున్నాయి. చంద్రశేఖర్ ఇండ్ల ‘రంగుల చీకటి కథలు’ పుస్తకావిష్కరణ జూలై 7 సా.6 గం.కు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరుగుతుంది. సభాధ్యక్షత కవి సిద్ధార్థ్ధ, ఆవిష్కరణ: కె.శ్రీనివాస్ డాక్టర్ శాంతి నారాయణ నవల – నాలుగు అస్తిత్వాలు, నాలుగు నవలికలు, కాలమ్ కథలు–నాగలి కట్ట సుద్దులు ఆవిష్కరణ సభ జూలై 5న సా.6 గం.కు రవీంద్రభారతిలో జరగనుంది. ఆవిష్కర్త: కె.రామచంద్రమూర్తి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్ ఢిల్లీలో లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయ 5వ వార్షికోత్సవ సందర్భంగా న్యూఢిల్లీ తెలంగాణ భవన్లో జూలై 3న సా. 6 గంటలకు కవిసమ్మేళనం జరగనుంది. చింతపట్ల సుదర్శన్ నవల పగలే వెన్నెల ఆవిష్కరణ, సి.ఎస్.రాంబాబు పుస్తక పరిచయం ఉంటాయి. సమన్వయం: కె.హరనాథ్. చిగురుమళ్ల శ్రీనివాస్ నాన్న శతకము ఆవిష్కరణ జూలై 7న ఉ.10:30కు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయం పైన జరగనుంది. ఆవిష్కర్త: సోమేపల్లి వెంకట సుబ్బయ్య. నిర్వహణ: రమ్యభారతి సాహిత్య వేదిక. మాయకుంట్ల నారాయణరెడ్డి నానీల పయనం ఆవిష్కరణ జూలై 5న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో జరగనుంది. ముఖ్య అతిథి: ఎన్.గోపి. నిర్వహణ: తేజ ఆర్ట్ క్రియేషన్స్. విశాఖ రసజ్ఞ వేదిక పురస్కారాన్ని జూలై 7న సా.6 కు చింతకింది శ్రీనివాసరావుకు ప్రదానం చేయ నున్నారు. పురస్కార ప్రదానం ఎన్.రామకృష్ణ. -
మహాస్వప్నతో కాసేపు
కందుకూరు (ప్రకాశం జిల్లా) దరినే ఉన్న లింగసముద్రంలో మహాస్వప్న మకాం అని తెలిసింది. బియ్యీడీ కాలేజీ ప్రాక్టికల్ పరీక్షల ఎగ్జామినర్‌గా కందుకూరు వెళ్లే అవకాశం వచ్చింది. ఆ నెపాన మాలకొండ వెళ్లి లక్ష్మీనరసింహస్వామితోనూ, లింగసముద్రం వెళ్లి మహాస్వప్నతోనూ పరిచయం కలిగించుకున్నాను. లింగసముద్రం మొదట్లోనే ఒక టీకొట్టు కనబడింది. ‘‘మహాస్వప్న గారుండేది ఎక్కడా?’’ అని అడిగాను. ఆ పేరు నోరు తిరగలేదు ఆయనకు. ‘‘మఆ... సపనా... ఏం జేస్తుంటా’’డని ఆరా అడిగాడు. ‘‘ఆయన పెద్దకవి’’ అని సమాధానమిచ్చాను. ‘‘అట్టజెప్పు, కవిగారా? రోజూ యీడేగా టీ తాగేది, కాసేపట్లో వొత్తాడు. యీడే ఉండండి.’’ చెక్కబెంచీ మీద కూలబడ్డాను. నిమిషం గడిచిందో లేదో సన్నగా, సుమారుపాటు ఎత్తుతో, పళ్లు రెండు మూడు ఊడిపోయినా ముఖం కళగా ఉన్న, ఊగుతూ నడుస్తున్న ఒకాయన వచ్చి నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. రెండు, మూడు నిమిషాలు గడిచాక, మహాస్వప్నతో నాకు పరిచయం లేదన్న సంగతి, టీకొట్టు మనిషి అర్థం చేసుకున్నట్టు ఉన్నాడు. ‘అడుగో నువ్వడిగిన కవిగారు, మాట్టాడకుండా కూచున్నావే?’ అని హుషారు చేశాడు. అప్పుడు సుమారు రెండు గంటలపాటు ఆయనతో మాట్లాడిన పిచ్చాపాటి ఇది. అన్నీ ఆయన మాటలే. ఇది జరిగింది 8.11.2008 నాడు. ‘‘దిగంబర కవిత్వానికి ముందే చాలా కవిత్వం రాశాను. అచ్చు పడింది తక్కువ. చించెయ్యలేదుగానీ పారేసింది, ఎక్కడ పెట్టానో మరిచిపోయింది ఎక్కువ. మహాస్వప్న పేరుతో కాకుండా చాలాపేర్లతో రాశాను. నగ్నముని ‘సహస్ర నామధేయుడు’ అని హాస్యంగా అంటూండేవాడు. దిగంబర సాహిత్యం మూడు సంకలనాలు బయటపడ్డ తరువాత మా మధ్య సైద్ధాంతిక విభేదాలు బయటపడ్డాయి. విడిపోయాం. అయినా నాకు ఎవరితో వ్యక్తిగత వైరుధ్యం లేదు. భైరవయ్య మొదటినుండీ ఒక బెట్టుగా ఉండేవాడు. దిగంబర కవిత్వం ఆవిష్కరణకు కూడా పెద్ద నిలువుబొట్టు పెట్టుకొని వచ్చాడు. ఏమిటిదీ అంటే అది అదే, ఇది యిదే అన్నాడు. జ్వాలాముఖి అంత పసిబిడ్డ మనస్తత్వం కలిగిన అగ్నిపర్వతాన్ని నేను ఇంకొకరిని చూడలేదు. జ్వాలాముఖి అన్న పేరు అసలుకైతే చెరబండరాజుకు ఇంకా బాగా అతుకుతుంది.హైదరాబాదులో నాలుగేళ్లు నిరుద్యోగిగా గడిపాను. తెలుగు నుండి ఇంగ్లీషులోకి, హిందీలోకి అనువాదాలు చేశాను. చాలా కొద్ది డబ్బు వచ్చేది. దానితోనే గడిపాను. నాకు మూడు భాషలు బాగానే వచ్చు. ఫ్రెంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాను. పురుట్లోనే సంధి కొట్టింది. సంస్కృతం కూడా ట్రై చేశాను. కుదరలేదు. నాకు శ్రీశ్రీ అన్నా, శ్రీశ్రీకి నేనన్నా చాలా అభిమానం. నా పుస్తకం ఒకదానిని అచ్చువేస్తానన్నాడు. నేనే నిరాకరించాను. ‘పుస్తకం రాసేనాటికీ యిప్పటికీ నా అభిరుచులు, భావజాలం మారిపోయాయి. పుస్తకం ప్రచురించే నాటికి పుస్తకంలో కంటెంట్, రచయిత ఐడియాలజీ ఒకటిగా ఉండాలి. లేకపోతే వేయకూడదు అన్నది నా సిద్ధాంతం’ అని చెప్పాను. 1964లో మొదటిసారి, 1977లో రెండవసారి పుట్టపర్తి వెళ్లాను. బాబా దర్శనంతో నాలో మార్పు వచ్చింది. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మనసుకు కాస్త శాంతి చిక్కినట్లు అనిపించింది. అయితే అన్యాయం పట్లా, అసమానతల పట్లా, సమాజంలో ఒకరినొకరు చేసుకునే మోసాల పట్ల నా భావాలు దిగంబర కవిత్వం నాడు ఎలా ఉన్నాయో యిప్పటికీ అలానే ఉన్నాయి. 1977లో బాబాను దర్శించుకున్న తరువాత నాకు స్వప్న దర్శనం(యిదీ ‘మహాస్వప్న’ పేరుకి అర్థం అనుకున్నాను.) కలిగింది. బాబా ఇక నేను పుట్టపర్తి రానవసరం లేదన్నారు. నీకు ఒక మార్గం చూపాను, ఆ మార్గం వెంట వెళ్లడమే నీ కర్తవ్యం, ఇక బాబా దర్శనం ఎందుకు నీకు? అని సందేశమిచ్చారు. ఆ మాట పాటించి పుట్టపర్తి వెళ్లలేదు. 1964 తరువాత నా భావాలలో ఎంతో మార్పు వచ్చింది. నా భావాల పట్ల నాకే ఎన్నో సందేహాలు కలిగాయి. కొన్ని మార్చుకున్నాను. కొన్ని సమాధానాల కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. ముఖ్యంగా ‘మావో’ ఆలోచనాధోరణిపై వచ్చిన అనుమానాలు నివృత్తి కాకపోగా ‘‘అనవసర అపోహలు వద్దు’’, ‘‘వాటిని ప్రశ్నించడమే తప్పు’’ అనే విధమైన సమాధానాలు వచ్చాయి. అప్పుడే ఆధ్యాత్మిక ధోరణి ఏర్పడింది. అంతా మేజిక్, అన్నాచురల్లో జీవిస్తున్నాం అనే భావన ఏర్పడింది. సత్యం(?) కనుక్కోవాలనే తపన నన్ను అంతర్ముఖుడిని చేసింది. నా పరిచితులు అందరికీ నా ధోరణి అర్థం కాలేదు. నేను ఆ దశలో వారికి సరిగా చెప్పలేకపోయాను. ఇప్పటికీ దినపత్రికల్లో కవితలు, పద్యాలు, భక్తి వ్యాసాలు విరివిగా రాస్తున్నాను. అన్నీ మారుపేర్లతోనే. ఇప్పటి సాహిత్యం పట్ల నాకు పెద్ద అవగాహన లేదు. చదవటం లేదు కాబట్టి. నాలుగైదు పత్రికలు మాత్రం చదువుతాను. కథ కనిపిస్తే మాత్రం శ్రద్ధగా చదువుతాను. కవిత్వం కంటే కథ మన ప్రాంతంలో బాగా పరిణతి చెందింది. ఏది దొరికితే అది చదువుతుంటాను. దానిలో మంచి ఏదన్నావుంటే గ్రహించటానికి ప్రయత్నిస్తాను.’’ మహాస్వప్న ఆ రెండు గంటల్లో చెప్పిన విషయాలను ఒక వారం తర్వాత నాకు గుర్తున్నవి రాసుకున్నాను. ఆ ముక్కలే ఇవి. మా సంభాషణలో కుటుంబ విషయాలు ప్రస్తావనకు రాలేదు. మేనల్లుడి వద్ద ఉంటున్నానని చెప్పారు. మా మధ్య ఒక ఏడాదిపాటు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచి, నెమ్మదిగా నీరసపడ్డాయి. 2008 తర్వాత రెండుసార్లు లింగసముద్రం వెళ్లాను. మహాస్వప్న ఊళ్లోనే ఉన్నప్పటికీ నాకున్న సమయంలో ఆయన జాడ తీయలేకపోయాను. మోదుగుల రవికృష్ణ వివిఐఎ–వివిఐటి, నంబూరు -
తల్లి గతాన్ని నిర్మించే కొడుకు
లల్లా ఫత్మాకు అల్జీమర్స్. ఆఖరి దశలో ఉంటుంది. ‘ఆమె జ్ఞాపకాలు తడినేలపైన వెదజల్లబడి ఉంటాయి.’ తాహర్ బిన్ జెల్లౌన్ రాసిన ఫ్రెంచ్ నవలైన, ‘ఎబౌట్ మై మదర్’లో– మొరాకోలో, నిరక్షరాస్యురాలైన లల్లా కొడుకైన తాహర్– క్రమం తప్పకుండా తల్లిని చూడ్డానికి వస్తుంటాడు. కథకుడతనే. పదిహేనేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు లల్లాకు పెళ్ళి చేస్తారు. పదహారు ఏళ్ళప్పుడు గర్భం ధరిస్తుంది. భర్త టైఫాయిడ్‌తో పోతాడు. కూతురి ప్రసవం తరువాత, తల్లిదండ్రులు ఆమెను ఒక ముసలాడికిచ్చి మళ్లీ పెళ్ళి చేస్తారు. ఒక కొడుకును పుట్టించి అతనూ మరణిస్తాడు. ఆఖరికి, ఆమెకు తాహర్కు తండ్రవబోయే వ్యక్తితో వివాహమవుతుంది. వెలిసిపోతున్న జ్ఞాపకాలతో, ఎంతోకాలంగా తన మనస్సులోనే పదిలపరచుకున్న రహస్యాలను తల్లి తునకల్లో చెప్పే వాక్యాలను వింటూ, మొరాకో యుద్ధానంతరపు ఆమె జీవితపు నిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు కొడుకు. ఆమె తన పెళ్ళిళ్ళ ఏర్పాట్లు, పండుగ భోజనాలు, బంగారపు కుట్టుపనుండే తన జోళ్ళ గురించి మాట్లాడుతుంది. ‘తనింకా 1944లో, తను పెరిగిన తంజాలో ఉన్నామనుకుంటోంది. మేమిప్పుడు 2000లో ఫెజ్‌లో ఉన్నాం. అమ్మ కలలు ఆమెపై ధ్వజమెత్తుతున్నాయి. వర్తమానం ఒకవైపు ఒరుగుతోంది... మిణుకు మిణుకుమంటోంది... ఆపై పూర్తిగా మసకబారింది. ఇకపై యీమెకు దీనితో సంబంధం ఉండదు.’ తెలివిలోకి వచ్చినప్పుడు మొరాకో స్వాతంత్య్ర పరివర్తన పర్యంతం– ఆర్థిక కారణాలవల్ల తమ కుటుంబం ఫెజ్కు పారిపోయినప్పటి కాలాన్ని తలచుకుంటుంది లల్లా. తిరుగుబాటు జరిగి ఎంతకాలమైందో గుర్తొచ్చినప్పుడు, నమ్మలేకపోతుంది: ‘ఇంచుమించు యాభై సంవత్సరాలా! అప్పుడు నేనెక్కడున్నాను?... అత్తరు తీయడానికి డాబామీద పరిచిపెట్టిన గులాబీల సుగంధమింకా నా నాసికాపుటాలకు చేరుతోంది... నేను ఒకే సమయంలో ఫెజ్లోనూ, టాంగియర్లోనూ కూడా ఎలా ఉన్నాను?’ అంటూ, తాహర్ను అడుగుతుంది: ‘నేను ఎటువంటి జీవితం గడిపాను?’ తల్లి ఆలోచనాపరురాలు కాదని తెలిసిన కొడుకు, ‘ఆ జీవితాన్ని ఊహించుకోవడం నా పనే’ అనుకుంటాడు. స్త్రీలను అణిచివేసే సంస్కృతిలో, తల్లి తన అదృష్టాన్ని విధికెందుకు వదిలేసిందో అర్థం చేసుకుంటాడు. తల్లి కుటుంబం నుండి కోరుకున్న మెప్పు ఆమెకేనాడూ దొరకలేదనీ, ఆమె జీవితం అసంతృప్తికరంగానే గడిచిందనీ గుర్తిస్తాడు. అనివార్యమైన తల్లి మరణం ముందు అతని అన్న తల్లితో, ‘దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి సంతోషంగా ఉంచాలి’ అంటాడన్న ఒక వినయపూర్వకమైన జ్ఞాపకంతో లల్లా కథను ముగిస్తాడు. ఆమె మృత్యువు తరువాత కుటుంబాన్ని తలకిందులు చేసే మరణశయ్య రహస్యాలేమీ ఉండవు కథలో. నవల మొరాకో దేశపు సంస్కృతిని వివరిస్తుంది. ఉదా: ‘దేవుని పట్ల ప్రేమతో పాటు, తల్లిదండ్రుల మీదుండే మత భక్తంత గౌరవం... ఏదో రోజు వారి ఆశీర్వాదం మనకి ఉండదేమోనన్న భయంతో జీవిస్తాం.’సొంపైన, కవితాత్మకమైన భాష ఉన్న నవలిది. రాస్ స్క్వార్జ్, లులూ నార్మాన్ ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ పుస్తకాన్ని–టెలిగ్రామ్ బుక్స్ 2016లో ప్రచురించింది. తొలి ప్రచురణ 2006లో. మొరాక్ సాంస్కృతిక రాజధాని అనబడే ఫెజ్‌లో పుట్టిన జిల్లౌన్– వ్యాసకర్త, కవి, విమర్శకుడు. ఫ్రాంకో–అరబిక్ స్కూల్లో అరబిక్‌తో పాటు ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నారు. 16 ఏళ్ళ వయస్సులో సొర్బోన్లో పైచదువులకని వెళ్ళి, 1973లో ‘హార్రుదా’ అన్న ఫ్రెంచ్ నవల రాశారు. ‘నిజానికి నేను ద్విభాషిని. రాసేందుకు కావాలని ఏ ఎంపికా చేసుకోనప్పటికీ, ఫ్రెంచ్‌లో రాయడం సంతోషం కలిగించింది. మాతృభాషైన అరబిక్‌ను ఎలాగూ కోల్పోలేను కనుక ఒక విదేశీ భాషపైన శక్తి వెచ్చించాను’ అని చెప్పే జెల్లౌన్ రచనలన్నీ ఫ్రెంచులో ఉన్నవే. ఆయన ‘నోబెల్ ప్రైజ్’ కోసం అనేకసార్లు షార్ట్ లిస్ట్ అయ్యారు. కృష్ణ వేణి -
చింపకురా చిరిగెదవు
కథాసారం ... వైరా అనే నైజాం గ్రామంలో ఒక గోడ మీద ఈ నోటీసు అంటించబడింది. ప్రొద్దున ఒక పోలీసు దారినపోతూ కాగితం చూశాడు, చదువుకొన్నాడు. ‘‘ఏయ్ షావుకార్, బైటికి రారా’’ పై పంచ సవరించుకొంటూ గడపలో కొచ్చాడు షావుకారు. ‘‘ఈ కాగితం ఎవరంటించారు?’’ నోటీసు ‘ఈ ఫిర్కాలో పటేళ్లు, పట్వారీలు, దేశముఖులు, జాగీర్దార్లు పోలీసులతో కలిసి అపరిమితమైన దుండగాలు చేస్తున్నారు. కాబట్టి నేటినుండి ఏ పోలీసు అధికారి గాని, ప్రభుత్వోద్యోగి గాని ఇంకెవరైనా గాని ప్రజలపై జులుం చేస్తే తగిన శిక్ష అనుభవిస్తారు.’ షరా‘‘ ఈ నోటీసు ఎవరు చించుతారో వాళ్ల పేరు నోటు చేసుకోబడ్తుంది జాగ్రత్త! ఇట్లు ప్రజా రక్షణ సంఘం గడప దాటి అరుగు దగ్గరకు వచ్చి కాగితం చదివి ‘‘ఏమో’’ అన్నాడు. ‘‘అది చించెయ్’’ ‘‘నీవే చించెయ్యరాదు. నాకేం బట్టింది. ప్రాణం మీదకు తెచ్చుకోను’’ ‘‘బద్మాష్’’ అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు పోలీసు. ‘‘ఏంది? వెంకయ్య మామా’’ అంటూ ఆ దార్నేబోతూ ఒకాయన, ఈ దార్నేబోతూ ఇంకో ఆయనా పదిమంది చేరారు. ప్రతివాడూ ఆ కాగితం అంటించినందుకు ఉబ్బితబ్బిబ్బౌతున్నాడు. ‘‘ఎవరంటావు’’ ‘‘ఎవరో’’ ఎక్కువ మాట్లాడితే ఎవరు ఏ చాడీలు అమీన్‌కు చెప్తారోనని ఎవరి పని మీద వాళ్లు పోతున్నారు. ఇంతలోనే హెడ్ కానిస్టేబులు వచ్చాడు, ముగ్గురు పోలీసుల్తో. ‘‘ఏయ్ వడ్డరీ, యిదర్ ఆవ్’’ ‘‘ఏం దండయ్యా’’ ‘‘ఆ కాగితం చించెయ్’’ ‘‘ఓరి చాతనైతది, కథలు చెప్తుండారు, గుబులేస్తుండది.’’ ఎవర్ని చూసినా వంగేట్టు లేరు. తీరా వాడు తలకాయ వంచుకొనిపోయినాక ‘‘ఆ ముండకు మాత్రం ధైర్యం చచ్చిందా’’ అన్నాడు ఎల్లప్ప. ‘‘బారెడు తుపాకి మూరెడు టోపీ ఉంటే సరా? గుప్పెడు గుండె లేని ముండా నాయాళ్లు’’ అన్నాడు వీరప్ప. అమీన్‌సాబ్ వస్తున్నాడని బైట తాళం వేసి ప్రక్క గొంది గుండా తప్పుకొన్నాడు గోడ సాహుకారు. భయం పుట్టినవాళ్లు పోగా ఓ యిరవైమంది ఉన్నారు. అమీన్ లాఠీ ఊపుకొంటూ వచ్చి ఒకతన్ని కాగితం చించమన్నాడు. ‘‘హుజూర్ అది జోరుగా చదవండి’’ ‘‘అరవ్వాకు బుద్ధిహీనుడా’’ ఓ ముసల్తాత అన్నాడు ‘‘మీరే చించరాదండే పంతులుగారు’’ ‘‘నీవు చించెయ్ తాతా’’ ‘‘నా చేతకాదు తండ్రీ’’ పెద్దపులిని చూసినట్లు కాగితం వంక ఇంకోసారి చూసి తప్పుకొన్నాడు అమీన్, అమ్మనాలి బూతులు కూసుకొంటూ. రెండు లారీలు ఖమ్మం కలెక్టర్ ఇంటిముందు ఆగినవి. సరాసరి అమీన్ కలెక్టర్‌తో లోనికి వెళ్లాడు. జరిగిన సంగతంతా చెప్తే– ‘‘చివరకు గోడ మీద నోటీసు చించలేకపోయినావా?’’ ‘‘అది ప్రభుత్వానికి ఉద్వాసన చెప్పే నోటీసు సార్’’ ‘‘మరి నీవే చించేయలేకపోయినావా?’’ ‘‘నా చేతుల్తో అది చించేస్తే ఆ ఊళ్లో ఎన్నాళ్లు అమీన్గిరి చెయ్యగలుగుతాను?’’ ‘‘అవును’’ కలక్టర్, అమీన్ ఇద్దరు బుగ్గన చేతులు జేర్చి, ఒక అనామక కార్యకర్త నైజాం నాజీత్వంపై నోటీసు చించే నిమిత్తం ఆలోచించసాగారు. ‘‘అచ్ఛీబాత్, నేను వరంగల్ నుంచి ఒక రజాకార్ను పంపుతాను. అతను హిందువులాగా తలపాగా చుట్టుకొని, ధోతీ కట్టుకొని, మీరడగంగానే ముందుకొచ్చి చించేట్టు ఏర్పాటు చేస్తాను. మీరు ఒక పని చేయాలి’’ ‘‘చిత్తం! ఏంటది’’ ‘‘వచ్చి చూచే జనంలో ఎవరివద్దా కాగితం కలం లేకుండా చేయండి!!!’’ సీవీ కృష్ణా రావు సి.వి.కృష్ణారావు కథ ‘నోటీసు’ ఇది. 1948లో విశాలాంధ్ర మాసపత్రికలో తొలిసారి ప్రచురితం. సౌజన్యం: వాసిరెడ్డి నవీన్ సంపాదకత్వంలో వచ్చిన ‘తెలంగాణ విముక్తి పోరాట కథలు’. సి.వి.కృష్ణారావు 1926 జూలై 3న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తాలూకాలో జన్మించారు. తెలంగాణలోని బంధుత్వాలతో నల్గొండ జిల్లాకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. సౌమ్యుడిగా పేరుపడ్డారు. ప్రాథమికంగా కవి అయిన కృష్ణారావు మాదీ మీ ఊరే, వైతరిణి, అవిశ్రాంతం, కిల్లారి, రాస్తూ రాస్తూ లాంటి కవితా సంపుటాలు వెలువరించారు. చాలా ఏళ్లపాటు ప్రతి నెలా చివరి ఆదివారం ‘నెల నెలా వెన్నెల’ పేరుతో సమావేశాలు నిర్వహించారు. లబ్ధ ప్రతిష్టులతోపాటు కొత్తగా రాస్తున్నవారిని కూడా అందులో పాల్గొనేలా ప్రోత్సహించేవారు. అక్కడ చదివిన కవితలతో నెల నెలా వెన్నెల పేరుతోనే సంకలనాలు వెలువరించేవారు. ఒకప్పుడు కృష్ణారావుగారు ఆ వెన్నెలను నెల నెలా కిందకు దింపేవారని వాడ్రేవు చినవీరభద్రుడు మురిసిపోతారు. తన ‘అపరిచితం’ నవలికలో ‘వైతరణి వేణుగోపాలరావు’ పాత్రకి సజీవమూలం కృష్ణారావుగారే అని నరేశ్ నున్నా మురిపెంగా చెప్పుకుంటారు. -
సాహిత్యంతోనే సామాజిక స్పృహ
– ఎస్వీయూ వీసీ దామోదరం యూనివర్సిటీక్యాంపస్ : చదువుతో పాటు సాహిత్యంపై విద్యార్థులు ఆసక్తి పెంచకుంటే సామాజిక స్పృహ పెరుగుతుందని ఎస్వీయూ వీసీ దామోదరం పేర్కొన్నారు. ఎస్వీయూ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో గురువారం ‘రాయలసీమ రచయితుల కథలు – స్త్రీవాద జీవిత చరిత్ర ’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ రాయలసీమలో సాహిత్యానికి కొదవలేదన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి నుంచి గల్లా అరుణకుమారి వరకు సాహిత్య రంగంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. అయితే సీమ సాహిత్యంలో స్త్రీవాద గొంతుక వినిపించాల్సిన అవసరం పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సదస్సులు నిర్వహించడం మంచి పరిణామమని ఆర్ట్స్ బ్లాక్ ప్రిన్సిపాల్ మునిరత్నం తెలిపారు. ఎం.రవికుమార్ మాట్లాడుతూ స్త్రీ, పురుషుల మధ్య అంతరాలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా వర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి సుభాషిణి కథలపై ప్రసంగించారు. సదస్సులో అధ్యాపకులు పేట శ్రీనివాసులురెడ్డి, ఎస్.రాజేశ్వరి, ఆర్.రాజేశ్వరి, దామోదర్‌నాయుడు పాల్గొన్నారు. 21టిపిఎల్164ః సదస్సులో మాట్లాడుతున్న ఎస్వీయూ వీసీ దామోదరం