కందుకూరు (ప్రకాశం జిల్లా) దరినే ఉన్న లింగసముద్రంలో మహాస్వప్న మకాం అని తెలిసింది. బియ్యీడీ కాలేజీ ప్రాక్టికల్ పరీక్షల ఎగ్జామినర్‌గా కందుకూరు వెళ్లే అవకాశం వచ్చింది. ఆ నెపాన మాలకొండ వెళ్లి లక్ష్మీనరసింహస్వామితోనూ, లింగసముద్రం వెళ్లి మహాస్వప్నతోనూ పరిచయం కలిగించుకున్నాను. లింగసముద్రం మొదట్లోనే ఒక టీకొట్టు కనబడింది. ‘‘మహాస్వప్న గారుండేది ఎక్కడా?’’ అని అడిగాను. ఆ పేరు నోరు తిరగలేదు ఆయనకు. ‘‘మఆ... సపనా... ఏం జేస్తుంటా’’డని ఆరా అడిగాడు. ‘‘ఆయన పెద్దకవి’’ అని సమాధానమిచ్చాను. ‘‘అట్టజెప్పు, కవిగారా? రోజూ యీడేగా టీ తాగేది, కాసేపట్లో వొత్తాడు. యీడే ఉండండి.’’ చెక్కబెంచీ మీద కూలబడ్డాను. నిమిషం గడిచిందో లేదో సన్నగా, సుమారుపాటు ఎత్తుతో, పళ్లు రెండు మూడు ఊడిపోయినా ముఖం కళగా ఉన్న, ఊగుతూ నడుస్తున్న ఒకాయన వచ్చి నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. రెండు, మూడు నిమిషాలు గడిచాక, మహాస్వప్నతో నాకు పరిచయం లేదన్న సంగతి, టీకొట్టు మనిషి అర్థం చేసుకున్నట్టు ఉన్నాడు. ‘అడుగో నువ్వడిగిన కవిగారు, మాట్టాడకుండా కూచున్నావే?’ అని హుషారు చేశాడు. అప్పుడు సుమారు రెండు గంటలపాటు ఆయనతో మాట్లాడిన పిచ్చాపాటి ఇది. అన్నీ ఆయన మాటలే. ఇది జరిగింది 8.11.2008 నాడు.
‘‘దిగంబర కవిత్వానికి ముందే చాలా కవిత్వం రాశాను. అచ్చు పడింది తక్కువ. చించెయ్యలేదుగానీ పారేసింది, ఎక్కడ పెట్టానో మరిచిపోయింది ఎక్కువ. మహాస్వప్న పేరుతో కాకుండా చాలాపేర్లతో రాశాను. నగ్నముని ‘సహస్ర నామధేయుడు’ అని హాస్యంగా అంటూండేవాడు. దిగంబర సాహిత్యం మూడు సంకలనాలు బయటపడ్డ తరువాత మా మధ్య సైద్ధాంతిక విభేదాలు బయటపడ్డాయి. విడిపోయాం. అయినా నాకు ఎవరితో వ్యక్తిగత వైరుధ్యం లేదు. భైరవయ్య మొదటినుండీ ఒక బెట్టుగా ఉండేవాడు. దిగంబర కవిత్వం ఆవిష్కరణకు కూడా పెద్ద నిలువుబొట్టు పెట్టుకొని వచ్చాడు. ఏమిటిదీ అంటే అది అదే, ఇది యిదే అన్నాడు. జ్వాలాముఖి అంత పసిబిడ్డ మనస్తత్వం కలిగిన అగ్నిపర్వతాన్ని నేను ఇంకొకరిని చూడలేదు. జ్వాలాముఖి అన్న పేరు అసలుకైతే చెరబండరాజుకు ఇంకా బాగా అతుకుతుంది.హైదరాబాదులో నాలుగేళ్లు నిరుద్యోగిగా గడిపాను. తెలుగు నుండి ఇంగ్లీషులోకి, హిందీలోకి అనువాదాలు చేశాను. చాలా కొద్ది డబ్బు వచ్చేది. దానితోనే గడిపాను. నాకు మూడు భాషలు బాగానే వచ్చు. ఫ్రెంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాను. పురుట్లోనే సంధి కొట్టింది. సంస్కృతం కూడా ట్రై చేశాను. కుదరలేదు. నాకు శ్రీశ్రీ అన్నా, శ్రీశ్రీకి నేనన్నా చాలా అభిమానం. నా పుస్తకం ఒకదానిని అచ్చువేస్తానన్నాడు. నేనే నిరాకరించాను. ‘పుస్తకం రాసేనాటికీ యిప్పటికీ నా అభిరుచులు, భావజాలం మారిపోయాయి. పుస్తకం ప్రచురించే నాటికి పుస్తకంలో కంటెంట్, రచయిత ఐడియాలజీ ఒకటిగా ఉండాలి. లేకపోతే వేయకూడదు అన్నది నా సిద్ధాంతం’ అని చెప్పాను.
1964లో మొదటిసారి, 1977లో రెండవసారి పుట్టపర్తి వెళ్లాను. బాబా దర్శనంతో నాలో మార్పు వచ్చింది. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మనసుకు కాస్త శాంతి చిక్కినట్లు అనిపించింది. అయితే అన్యాయం పట్లా, అసమానతల పట్లా, సమాజంలో ఒకరినొకరు చేసుకునే మోసాల పట్ల నా భావాలు దిగంబర కవిత్వం నాడు ఎలా ఉన్నాయో యిప్పటికీ అలానే ఉన్నాయి. 1977లో బాబాను దర్శించుకున్న తరువాత నాకు స్వప్న దర్శనం(యిదీ ‘మహాస్వప్న’ పేరుకి అర్థం అనుకున్నాను.) కలిగింది. బాబా ఇక నేను పుట్టపర్తి రానవసరం లేదన్నారు. నీకు ఒక మార్గం చూపాను, ఆ మార్గం వెంట వెళ్లడమే నీ కర్తవ్యం, ఇక బాబా దర్శనం ఎందుకు నీకు? అని సందేశమిచ్చారు. ఆ మాట పాటించి పుట్టపర్తి వెళ్లలేదు. 1964 తరువాత నా భావాలలో ఎంతో మార్పు వచ్చింది. నా భావాల పట్ల నాకే ఎన్నో సందేహాలు కలిగాయి. కొన్ని మార్చుకున్నాను. కొన్ని సమాధానాల కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. ముఖ్యంగా ‘మావో’ ఆలోచనాధోరణిపై వచ్చిన అనుమానాలు నివృత్తి కాకపోగా ‘‘అనవసర అపోహలు వద్దు’’, ‘‘వాటిని ప్రశ్నించడమే తప్పు’’ అనే విధమైన సమాధానాలు వచ్చాయి. అప్పుడే ఆధ్యాత్మిక ధోరణి ఏర్పడింది. అంతా మేజిక్, అన్‌నాచురల్‌లో జీవిస్తున్నాం అనే భావన ఏర్పడింది. సత్యం(?) కనుక్కోవాలనే తపన నన్ను అంతర్ముఖుడిని చేసింది. నా పరిచితులు అందరికీ నా ధోరణి అర్థం కాలేదు. నేను ఆ దశలో వారికి సరిగా చెప్పలేకపోయాను.
ఇప్పటికీ దినపత్రికల్లో కవితలు, పద్యాలు, భక్తి వ్యాసాలు విరివిగా రాస్తున్నాను. అన్నీ మారుపేర్లతోనే. ఇప్పటి సాహిత్యం పట్ల నాకు పెద్ద అవగాహన లేదు. చదవటం లేదు కాబట్టి. నాలుగైదు పత్రికలు మాత్రం చదువుతాను. కథ కనిపిస్తే మాత్రం శ్రద్ధగా చదువుతాను. కవిత్వం కంటే కథ మన ప్రాంతంలో బాగా పరిణతి చెందింది. ఏది దొరికితే అది చదువుతుంటాను. దానిలో మంచి ఏదన్నావుంటే గ్రహించటానికి ప్రయత్నిస్తాను.’’ మహాస్వప్న ఆ రెండు గంటల్లో చెప్పిన విషయాలను ఒక వారం తర్వాత నాకు గుర్తున్నవి రాసుకున్నాను. ఆ ముక్కలే ఇవి. మా సంభాషణలో కుటుంబ విషయాలు ప్రస్తావనకు రాలేదు. మేనల్లుడి వద్ద ఉంటున్నానని చెప్పారు. మా మధ్య ఒక ఏడాదిపాటు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచి, నెమ్మదిగా నీరసపడ్డాయి. 2008 తర్వాత రెండుసార్లు లింగసముద్రం వెళ్లాను. మహాస్వప్న ఊళ్లోనే ఉన్నప్పటికీ నాకున్న సమయంలో ఆయన జాడ తీయలేకపోయాను.
మోదుగుల రవికృష్ణ
వివిఐఎ–వివిఐటి, నంబూరు
మహాస్వప్నతో కాసేపు
Published Mon, Jul 1 2019 3:03 AM | Last Updated on Mon, Jul 1 2019 3:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment