లల్లా ఫత్మాకు అల్జీమర్స్. ఆఖరి దశలో ఉంటుంది. ‘ఆమె జ్ఞాపకాలు తడినేలపైన వెదజల్లబడి ఉంటాయి.’ తాహర్ బిన్ జెల్లౌన్ రాసిన ఫ్రెంచ్ నవలైన, ‘ఎబౌట్ మై మదర్’లో– మొరాకోలో, నిరక్షరాస్యురాలైన లల్లా కొడుకైన తాహర్– క్రమం తప్పకుండా తల్లిని చూడ్డానికి వస్తుంటాడు. కథకుడతనే. పదిహేనేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు లల్లాకు పెళ్ళి చేస్తారు. పదహారు ఏళ్ళప్పుడు గర్భం ధరిస్తుంది. భర్త టైఫాయిడ్‌తో పోతాడు. కూతురి ప్రసవం తరువాత, తల్లిదండ్రులు ఆమెను ఒక ముసలాడికిచ్చి మళ్లీ పెళ్ళి చేస్తారు. ఒక కొడుకును పుట్టించి అతనూ మరణిస్తాడు. ఆఖరికి, ఆమెకు తాహర్‌కు తండ్రవబోయే వ్యక్తితో వివాహమవుతుంది. వెలిసిపోతున్న జ్ఞాపకాలతో, ఎంతోకాలంగా తన మనస్సులోనే పదిలపరచుకున్న రహస్యాలను తల్లి తునకల్లో చెప్పే వాక్యాలను వింటూ, మొరాకో యుద్ధానంతరపు ఆమె జీవితపు నిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు కొడుకు. ఆమె తన పెళ్ళిళ్ళ ఏర్పాట్లు, పండుగ భోజనాలు, బంగారపు కుట్టుపనుండే తన జోళ్ళ గురించి మాట్లాడుతుంది. ‘తనింకా 1944లో, తను పెరిగిన తంజాలో ఉన్నామనుకుంటోంది. మేమిప్పుడు 2000లో ఫెజ్‌లో ఉన్నాం. అమ్మ కలలు ఆమెపై ధ్వజమెత్తుతున్నాయి. వర్తమానం ఒకవైపు ఒరుగుతోంది... మిణుకు మిణుకుమంటోంది... ఆపై పూర్తిగా మసకబారింది. ఇకపై యీమెకు దీనితో సంబంధం ఉండదు.’
తెలివిలోకి వచ్చినప్పుడు మొరాకో స్వాతంత్య్ర పరివర్తన పర్యంతం– ఆర్థిక కారణాలవల్ల తమ కుటుంబం ఫెజ్‌కు పారిపోయినప్పటి కాలాన్ని తలచుకుంటుంది లల్లా. తిరుగుబాటు జరిగి ఎంతకాలమైందో గుర్తొచ్చినప్పుడు, నమ్మలేకపోతుంది: ‘ఇంచుమించు యాభై సంవత్సరాలా! అప్పుడు నేనెక్కడున్నాను?... అత్తరు తీయడానికి డాబామీద పరిచిపెట్టిన గులాబీల సుగంధమింకా నా నాసికాపుటాలకు చేరుతోంది... నేను ఒకే సమయంలో ఫెజ్‌లోనూ, టాంగియర్‌లోనూ కూడా ఎలా ఉన్నాను?’ అంటూ, తాహర్‌ను అడుగుతుంది: ‘నేను ఎటువంటి జీవితం గడిపాను?’ తల్లి ఆలోచనాపరురాలు కాదని తెలిసిన కొడుకు, ‘ఆ జీవితాన్ని ఊహించుకోవడం నా పనే’ అనుకుంటాడు. స్త్రీలను అణిచివేసే సంస్కృతిలో, తల్లి తన అదృష్టాన్ని విధికెందుకు వదిలేసిందో అర్థం చేసుకుంటాడు. తల్లి కుటుంబం నుండి కోరుకున్న మెప్పు ఆమెకేనాడూ దొరకలేదనీ, ఆమె జీవితం అసంతృప్తికరంగానే గడిచిందనీ గుర్తిస్తాడు.
అనివార్యమైన తల్లి మరణం ముందు అతని అన్న తల్లితో, ‘దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి సంతోషంగా ఉంచాలి’ అంటాడన్న ఒక వినయపూర్వకమైన జ్ఞాపకంతో లల్లా కథను ముగిస్తాడు. ఆమె మృత్యువు తరువాత కుటుంబాన్ని తలకిందులు చేసే మరణశయ్య రహస్యాలేమీ ఉండవు కథలో. నవల మొరాకో దేశపు సంస్కృతిని వివరిస్తుంది. ఉదా: ‘దేవుని పట్ల ప్రేమతో పాటు, తల్లిదండ్రుల మీదుండే మత భక్తంత గౌరవం... ఏదో రోజు వారి ఆశీర్వాదం మనకి ఉండదేమోనన్న భయంతో జీవిస్తాం.’సొంపైన, కవితాత్మకమైన భాష ఉన్న నవలిది. రాస్ స్క్వార్జ్, లులూ నార్మాన్ ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ పుస్తకాన్ని–టెలిగ్రామ్ బుక్స్ 2016లో ప్రచురించింది. తొలి ప్రచురణ 2006లో. మొరాక్ సాంస్కృతిక రాజధాని అనబడే ఫెజ్‌లో పుట్టిన జిల్లౌన్– వ్యాసకర్త, కవి, విమర్శకుడు. ఫ్రాంకో–అరబిక్ స్కూల్లో అరబిక్‌తో పాటు ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నారు. 16 ఏళ్ళ వయస్సులో సొర్బోన్‌లో పైచదువులకని వెళ్ళి, 1973లో ‘హార్రుదా’ అన్న ఫ్రెంచ్ నవల రాశారు. ‘నిజానికి నేను ద్విభాషిని. రాసేందుకు కావాలని ఏ ఎంపికా చేసుకోనప్పటికీ, ఫ్రెంచ్‌లో రాయడం సంతోషం కలిగించింది. మాతృభాషైన అరబిక్‌ను ఎలాగూ కోల్పోలేను కనుక ఒక విదేశీ భాషపైన శక్తి వెచ్చించాను’ అని చెప్పే జెల్లౌన్ రచనలన్నీ ఫ్రెంచులో ఉన్నవే. ఆయన ‘నోబెల్ ప్రైజ్’ కోసం అనేకసార్లు షార్ట్ లిస్ట్ అయ్యారు.
కృష్ణ వేణి
తల్లి గతాన్ని నిర్మించే కొడుకు
Published Mon, Jul 1 2019 2:56 AM | Last Updated on Mon, Jul 1 2019 2:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment