చింపకురా చిరిగెదవు | Kathasaram By CV Krishna rao | Sakshi
Sakshi News home page

చింపకురా చిరిగెదవు

Published Mon, May 27 2019 12:48 AM | Last Updated on Mon, May 27 2019 12:48 AM

Kathasaram By CV Krishna rao - Sakshi

కథాసారం

... వైరా అనే నైజాం గ్రామంలో ఒక గోడ మీద ఈ నోటీసు అంటించబడింది. ప్రొద్దున ఒక పోలీసు దారినపోతూ కాగితం చూశాడు, చదువుకొన్నాడు.
‘‘ఏయ్‌ షావుకార్, బైటికి రారా’’
పై పంచ సవరించుకొంటూ గడపలో కొచ్చాడు షావుకారు.
‘‘ఈ కాగితం ఎవరంటించారు?’’

నోటీసు
‘ఈ ఫిర్కాలో పటేళ్లు, పట్వారీలు, దేశముఖులు, జాగీర్దార్లు పోలీసులతో కలిసి అపరిమితమైన దుండగాలు చేస్తున్నారు. కాబట్టి నేటినుండి ఏ పోలీసు అధికారి గాని, ప్రభుత్వోద్యోగి గాని ఇంకెవరైనా గాని ప్రజలపై జులుం చేస్తే తగిన శిక్ష అనుభవిస్తారు.’
షరా‘‘ ఈ నోటీసు ఎవరు చించుతారో వాళ్ల పేరు నోటు చేసుకోబడ్తుంది జాగ్రత్త!
ఇట్లు
ప్రజా రక్షణ సంఘం 

 

గడప దాటి అరుగు దగ్గరకు వచ్చి కాగితం చదివి ‘‘ఏమో’’ అన్నాడు.
‘‘అది చించెయ్‌’’
‘‘నీవే చించెయ్యరాదు. నాకేం బట్టింది. ప్రాణం మీదకు తెచ్చుకోను’’
‘‘బద్మాష్‌’’ అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు పోలీసు.
‘‘ఏంది? వెంకయ్య మామా’’ అంటూ ఆ దార్నేబోతూ ఒకాయన, ఈ దార్నేబోతూ ఇంకో ఆయనా పదిమంది చేరారు. ప్రతివాడూ ఆ కాగితం అంటించినందుకు ఉబ్బితబ్బిబ్బౌతున్నాడు.
‘‘ఎవరంటావు’’
‘‘ఎవరో’’
ఎక్కువ మాట్లాడితే ఎవరు ఏ చాడీలు అమీన్‌కు చెప్తారోనని ఎవరి పని మీద వాళ్లు పోతున్నారు.
ఇంతలోనే హెడ్‌ కానిస్టేబులు వచ్చాడు, ముగ్గురు పోలీసుల్తో.
‘‘ఏయ్‌ వడ్డరీ, యిదర్‌ ఆవ్‌’’
‘‘ఏం దండయ్యా’’
‘‘ఆ కాగితం చించెయ్‌’’
‘‘ఓరి చాతనైతది, కథలు చెప్తుండారు, గుబులేస్తుండది.’’
ఎవర్ని చూసినా వంగేట్టు లేరు. తీరా వాడు తలకాయ వంచుకొనిపోయినాక ‘‘ఆ ముండకు మాత్రం ధైర్యం చచ్చిందా’’ అన్నాడు ఎల్లప్ప.
‘‘బారెడు తుపాకి మూరెడు టోపీ ఉంటే సరా? గుప్పెడు గుండె లేని ముండా నాయాళ్లు’’ అన్నాడు వీరప్ప. 
అమీన్‌సాబ్‌ వస్తున్నాడని బైట తాళం వేసి ప్రక్క గొంది గుండా తప్పుకొన్నాడు గోడ సాహుకారు. భయం పుట్టినవాళ్లు పోగా ఓ యిరవైమంది ఉన్నారు. అమీన్‌ లాఠీ ఊపుకొంటూ వచ్చి ఒకతన్ని కాగితం చించమన్నాడు.
‘‘హుజూర్‌ అది జోరుగా చదవండి’’
‘‘అరవ్వాకు బుద్ధిహీనుడా’’
ఓ ముసల్తాత అన్నాడు ‘‘మీరే చించరాదండే పంతులుగారు’’
‘‘నీవు చించెయ్‌ తాతా’’
‘‘నా చేతకాదు తండ్రీ’’
పెద్దపులిని చూసినట్లు కాగితం వంక ఇంకోసారి చూసి తప్పుకొన్నాడు అమీన్, అమ్మనాలి బూతులు కూసుకొంటూ.
రెండు లారీలు ఖమ్మం కలెక్టర్‌ ఇంటిముందు ఆగినవి. సరాసరి అమీన్‌ కలెక్టర్‌తో లోనికి వెళ్లాడు. జరిగిన సంగతంతా చెప్తే–
‘‘చివరకు గోడ మీద నోటీసు చించలేకపోయినావా?’’
‘‘అది ప్రభుత్వానికి ఉద్వాసన చెప్పే నోటీసు సార్‌’’
‘‘మరి నీవే చించేయలేకపోయినావా?’’
‘‘నా చేతుల్తో అది చించేస్తే ఆ ఊళ్లో ఎన్నాళ్లు అమీన్‌గిరి చెయ్యగలుగుతాను?’’
‘‘అవును’’
కలక్టర్, అమీన్‌ ఇద్దరు బుగ్గన చేతులు జేర్చి, ఒక అనామక కార్యకర్త నైజాం నాజీత్వంపై నోటీసు చించే నిమిత్తం ఆలోచించసాగారు.
‘‘అచ్ఛీబాత్, నేను వరంగల్‌ నుంచి ఒక రజాకార్‌ను పంపుతాను. అతను హిందువులాగా తలపాగా చుట్టుకొని, ధోతీ కట్టుకొని, మీరడగంగానే ముందుకొచ్చి చించేట్టు ఏర్పాటు చేస్తాను. మీరు ఒక పని చేయాలి’’
‘‘చిత్తం! ఏంటది’’
‘‘వచ్చి చూచే జనంలో ఎవరివద్దా కాగితం కలం లేకుండా చేయండి!!!’’
 

సీవీ కృష్ణా రావు

సి.వి.కృష్ణారావు కథ ‘నోటీసు’ ఇది. 1948లో విశాలాంధ్ర మాసపత్రికలో తొలిసారి ప్రచురితం. సౌజన్యం: వాసిరెడ్డి నవీన్‌ సంపాదకత్వంలో వచ్చిన ‘తెలంగాణ విముక్తి పోరాట కథలు’. సి.వి.కృష్ణారావు 1926 జూలై 3న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తాలూకాలో జన్మించారు. తెలంగాణలోని బంధుత్వాలతో నల్గొండ జిల్లాకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. సౌమ్యుడిగా పేరుపడ్డారు. ప్రాథమికంగా కవి అయిన కృష్ణారావు మాదీ మీ ఊరే, వైతరిణి, అవిశ్రాంతం, కిల్లారి, రాస్తూ రాస్తూ లాంటి కవితా సంపుటాలు వెలువరించారు. చాలా ఏళ్లపాటు ప్రతి నెలా చివరి ఆదివారం ‘నెల నెలా వెన్నెల’ పేరుతో సమావేశాలు నిర్వహించారు. లబ్ధ ప్రతిష్టులతోపాటు కొత్తగా రాస్తున్నవారిని కూడా అందులో పాల్గొనేలా ప్రోత్సహించేవారు. అక్కడ చదివిన కవితలతో నెల నెలా వెన్నెల పేరుతోనే సంకలనాలు వెలువరించేవారు.  ఒకప్పుడు కృష్ణారావుగారు ఆ వెన్నెలను నెల నెలా కిందకు దింపేవారని వాడ్రేవు చినవీరభద్రుడు మురిసిపోతారు. తన ‘అపరిచితం’ నవలికలో ‘వైతరణి వేణుగోపాలరావు’ పాత్రకి సజీవమూలం కృష్ణారావుగారే అని నరేశ్‌ నున్నా మురిపెంగా చెప్పుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement