కథ: అసలు ఎవరీమె? మనిషా.. దయ్యమా?.. అవును నేనే! | Sakshi Funday Magazine: Karthik Gopal Story Mallappa Gate | Sakshi
Sakshi News home page

Mallappa Gate Story: అసలు ఎవరీమె? మనిషా.. దయ్యమా?.. అవును నేనే!

Published Tue, Nov 30 2021 9:14 AM | Last Updated on Tue, Nov 30 2021 9:18 AM

Sakshi Funday Magazine: Karthik Gopal Story Mallappa Gate

‘ఏమప్పా, ఏమప్పా ..’  ఎవరో తన భుజాన్ని తడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరచి చూస్తే సాయంత్రం రైలు ఎక్కేటపుడు వాకిలికి అడ్డంగా కూర్చొని.. ఏవో తత్వాలు పాడుకుంటున్న బైరాగి ‘ఏమప్పా .. నువ్వు మద్దికెర స్టేషన్‌లో దిగతానని నిన్న ఎవరితోనో చెప్తుంటే వింటినే. ఇపుడే బండి స్టేషన్‌ కూడా దాటిపోయెనే’ అని చెప్పగానే  ఒక్కసారి నిద్రమత్తు పోయి బ్యాగ్‌ తీసుకోని మూసిన డోర్‌లాగి బయటకు చూస్తే, రైలు వేగం పుంజుకొని ఔటర్‌ సిగ్నల్‌ కూడా దాటేసింది. ఏమీ చేయలేని పరిస్థితి తనను తాను తిట్టుకుంటూ వచ్చి కూర్చొన్నాడు. మరి ఇపుడు ఎలా అని ప్రశ్నిస్తున్నట్టుంది బైరాగి మొహం. రెండు రోజుల కిందట తనకు అమ్మ చేసిన ఫోన్‌కాల్‌ గుర్తొచ్చింది.

‘పాండూ.. బాగున్నావురా?’
‘బాగున్నానమ్మా.. నాన్న బాగున్నాడమ్మా? 
‘ఆయనకేమి.. బాగున్నాడు! మీ చిన్నాయన కొడుకు పెండ్లి కదా బంధువులకు పత్రికలివ్వడానికి అనంతపురం పోయినాడులే’
‘అవునా.. సరేలేమ్మా! నాకు ఆఫీస్‌కి టైమవుతుంది మరి..’ అన్నాడు పాండు ఫోన్‌ కట్‌చేసే మూడ్‌తో.  

‘పాండూ.. నువ్వు పెళ్ళికి వస్తున్నావు కదరా! మీ చిన్నాయనకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా నీకు! వచ్చేటప్పుడు మీ చిన్నాయనకి, చిన్నమ్మకి మాంచి బట్టలు తీసుకోని రా. సంతోషపడతారు’ 
‘సెలవు దొరకదే.. నేను రాలేనే అమ్మా’ ప్రాధేయపడుతున్నట్టుగా పాండు.
‘అదేం కుదరదు. ఎలాగో వీలు కల్పించుకొని రా అంతే. మన బంధువులందరూ అడుగుతారు రాలేదమని! అదీగాక నువ్వూరొచ్చి సంవత్సరం దాటుతుంది. ఎల్లుండే ముహూర్తం ఉదయం 6. 15 నిమిషాలకు’ అంటూ ఫోన్‌ పెట్టేసింది. 

ఎలాగోలా బాస్‌కి సర్ది చెప్పి.. చిన్నాన్న , చిన్నమ్మకి బట్టలు తీసుకోని ఉదయమే మద్దికెరలో ఉండాలని కిందటి సాయంత్రమే హైదరాబాద్‌ నుండి బయలు దేరాడు. ‘నిద్రపోకుండా ఉండాల్సింది. ఒకవేళ నెక్ట్స్‌ స్టేషన్‌ గుంతకల్‌లో దిగి రాత్రంతా అక్కడే ఉండి తెల్లారు జామునే బయలు దేరినా ఉదయం ఎనిమిది అయిపోతుంది టైమ్‌. మరి చిన్నమ్మ, చిన్నాయనకి బట్టలెపుడు ఇవ్వాలి?’ అనే ఆలోచనల్లోపడ్డాడు పాండు. 

ఇంతలోనే ట్రైన్‌ స్లో అవుతూ ఆగిపోయింది. డోర్‌ తీసి బయటకు చూస్తే నంచర్ల రైల్వే స్టేషన్‌. ‘ఇక్కడ ట్రైనెపుడూ ఆగదే? ఎందుకు ఆగిందో మరి? ఇక్కడ నుండి మద్దికెర ఏడు కిలోమీటర్లు.  ట్రైన్‌ దిగి వెనక్కి నడుచుకుంటూ పొతే స్టేషన్‌ వరకు వెళ్లనవసరం లేదు పట్టాల వెంబడి నడచుకుంటూ పొతే మొదట రెడ్డి బావి వస్తుంది. దాని తరువాత మల్లప్ప గేట్‌ వస్తుంది. గేట్‌ వరకు వెళ్ళితే చాలు అటు నుండి ఊర్లోకి వెళ్ళచ్చు’ అనుకుంటూ పాండు ట్రైన్‌ దిగేశాడు.   

స్టేషన్‌ ఊరికి దూరంగా ఉన్నట్టుంది. మిణుకు, మిణుకు మంటున్న లైట్లు.. ఉండుండీ వీస్తున్న గాలి. ఆ నిశ్శబ్ద వాతావరణంలో గార్డ్‌ వేసిన విజిల్‌ శబ్దానికి భయపడి కాబోలు చెట్ల మీదున్న పక్షులలో అలజడి మొదలైంది. రైలు వెళ్లిన తర్వాత చుట్టూ ఒకసారి పరిశీలించి చూశాడు పాండు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత భయంకర నిశ్శబ్దం. అపుడు సమయం అర్ధరాత్రి 1.10 నిమిషాలు.    అక్కడున్న సిమెంట్‌ బెంచ్‌ మీద కూర్చున్న పాండు  ‘ఇక్కడ  దిగి తప్పు చేశానా?’ అనే ఆలోచనలోపడ్డాడు. ఏది ఏమైనా సరే తను వెళ్లాల్సిందేనని నిర్ణయించుకొని స్టేషన్‌ దాటి ముందుకెళ్ళి పోయాడు.
∙∙ 
పౌర్ణమేమో.. వెన్నెల పిండారబోసినట్టుంది. శరీరాన్ని తాకుతున్న చల్లని గాలి.. కిర్‌ కిర్‌ మంటూ కీచురాళ్ళ రొద.. అవేమీ పట్టనట్టు టకటక పట్టాలపై నడచి వెళ్తున్న పాండుకు ఎదురుగా ఉన్న పొద పక్కన ఎవరో కదిలినట్టు అనిపించి నిల్చున్న వాడల్లా ఠక్కున పట్టాల పై కూర్చున్నాడు. అపుడే ఒక తీతువు పిట్ట గట్టిగా అరుస్తూ తన పక్క నుంచే వెళ్లడంతో కొంచెం భయమనిపించి జేబులో నుంచి సిగరెట్, అగ్గిపెట్టె తీశాడు. అగ్గిపెట్టెలో ఒకటే పుల్ల ఉంది. ఎలాగోలా సిగరెట్‌ ముట్టించి.. సెల్‌ఫోన్‌ లైట్‌ ఆన్‌ చేద్దాం అనుకుంటే అది రాత్రే చార్జింగ్‌ అయిపోయి ఆఫ్‌ అయింది. దీనికే భయపడితే ఎట్లా అదేంటో తెలుసుకుందామని లేచి ముందుకెళ్లి  పొద పక్కకు చూస్తే అపుడపుడు వీస్తున్న గాలికి అటూ ఇటూ ఊగుతున్న తెల్ల జిల్లేడు చెట్టు. నవ్వొచ్చింది పాండుకి. నిజం కన్నా ఊహే ఎక్కువ భయపెడుతుంది మనిషిని. 

నడుస్తూ, నడుస్తూ రెడ్డివారి బావి దగ్గరకు వచ్చాడు. ఒక్కసారి అటు వైపు చూస్తే తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. రాత్రిపూట అటు వైపు ఎవరూ వెళ్లరని దయ్యాలు తిరుగుతుంటాయని పెద్దలు చెప్పేవారు. ఎందుకో రామలక్ష్మి అక్క గుర్తొచ్చింది. అపుడు పాండుకి  పదేళ్లు ఉంటాయేమో! ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో మగ సంతానం కోసం భర్త తన చెల్లెలినే పెళ్లి చేసుకొంటే.. భర్త ఆదరణ కరువై, ఆడపిల్లల తల్లిగా తనను అందరూ దూరం చేస్తుంటే తట్టుకోలేక ఆ రెడ్డివారి బావిలోనే దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి చనిపోయిందని తెలుసుకొని ఆ పిల్లలు పడిన బాధ తాను ఎప్పటికీ మర్చిపోలేడు.. ఆ చేదు జ్ఞాపకాలతోనే మల్లప్ప గేట్‌ దగ్గరకు చేరుకున్నాడు. గేట్‌ మూసే ఉంది.

‘ఇపుడే ట్రైన్‌ వెళ్ళింది కదా. గేట్‌మన్‌ మేలుకునే ఉంటాడు ఇక్కడే ఒక సిగరెట్‌ తాగి మెల్లిగా ఇల్లు చేరుకోవచ్చు’ అనుకుంటూ అగ్గిపెట్టె కోసం గేట్‌మన్‌ రూమ్‌ తలుపు తట్టాడు. వాకిలి బార్లా తెరుచుకుంది. చీకటిగానే ఉంది. ఎవరూ కనపడలేదు. బయట ఉన్నాడేమో అనుకుంటూ వెనుకవైపు వెళ్ళాడు. 
పొగడపూల చెట్టు పక్కన అటువైపు తిరిగి ఊరుకేసి చూస్తూన్న ఓ ఆకారాన్ని చూసి ‘అన్నా.. అగ్గిపెట్టె ఉందా?’ అని అడిగాడు. వినపడలేదేమోనని మళ్లీ అడిగాడు. 
చల్లని గాలిహోరు.. దట్టమైన చింతచెట్టు కింద ఉండటంతో.. వెన్నెల వెలుతురులోనూ ఆ వ్యక్తి సరిగా కనపడటం లేదు. అంతలోకే ఆ ఆకారం అతనివైపు తిరిగింది. ఆడమనిషిలా కనిపించింది. అర్ధరాత్రి పూట.. ఆ ఆడమనిషికేం పని ఇక్కడ? అనుకున్నాడు పాండు. 

దూరంగా..  డగ్‌.. డగ్‌మంటూ ఏవో శబ్దాలు. భయంతో అతని గొంతు పిడచకట్టుకుపోయింది.  కాళ్లల్లో సన్నని వణుకూ  మొదలై పారిపోదాం అని అతను అనుకుంటూండగానే ఆ ఆడమనిషి.. అతనికెదురుగా వచ్చి నిలబడింది. ‘ఎ.. ఎ..ఎవరు?’ అని అడగాలనుకున్నాడు. గొంతు పెగల్లేదు. అయినా ధైర్యం కూడదీసుకుని ‘ఎ.. ఎవరు నువ్వు? గేట్‌మన్‌ ఏమయ్యాడు?’ అని అతను అడుగుతుండగానే ఆ ఆడమనిషి మరింత దగ్గరగా వచ్చి ‘నేనా.. నేనా..? నేనెవరో తెలియదా? అర్ధరాత్రి ఎవరు కనపడతారో తెలియదా?’ అంటూ ‘అసలు నువ్వెవరు? ఇక్కడికెందుకు వచ్చావ్‌?’ అని ఎదురు ప్రశ్నించింది. 

‘నేను ఈ ఊరి వాడినే. నా పేరు పాండురంగ. రేపు మా చిన్నాయన కొడుకు పెళ్లి. రైల్లో నిద్రపోవడంతో స్టేషన్‌లో దిగలేకపోయా. నంచర్లలో దిగి నడుచుకుంటూ వస్తున్నా. సిగరెట్‌ వెలిగించుకుందామని అగ్గిపెట్టె కోసం ఇక్కడికొచ్చా అంతే’ అని చెప్పాడు. 
‘అంతేనా.. లేక ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారం చంపేసే వాడివా? అలాంటి వాడి రక్తం తాగాలని ఎదురుచూస్తున్నా’ అంటూ పక్కనే ఉన్న బండరాయి పై కూర్చొని ‘ఊ.. ఊ..’ అని ఊగిపోతూ ‘వెళ్ళు రూమ్‌లో ఎడమ పక్కన నీళ్లుంటాయి తాగు’ అని దబాయించింది ఆ ఆడ ఆకారం.  
బెరుకు బెరుకుగానే అక్కడి నుంచి రూమ్‌లోకి వెళ్లాడు పాండు. నిజంగానే అక్కడ వాటర్‌ బాటిల్‌ ఉంది. గటగటా నీళ్లు తాగి.. అక్కడే  టేబుల్‌ మీద కనిపించిన అగ్గిపెట్టె తీసుకొని సిగరెట్‌ వెలిగించాడు పాండు.

అసలు ఎవరీమె? మనిషా.. దయ్యమా? చీకట్లో కనపడటం లేదు. దయ్యమైతే ఇంత నిదానంగా ఉంటుందా? ఒకవేళ మనిషనుకుంటే రక్తం తాగుతా అంటుందా? ఏంటో ఏమో ఏవరైనా వస్తే బాగుండు..’ అనుకోసాగాడు.  సిగరెట్‌ తాగిన తర్వాత కొంచెం వణుకు తగ్గినట్టయింది.  
‘అయిపోతే రా.. ఇక్కడికి’ అంటూ ఊగిపోతూ.. మళ్లీ తలతిప్పి ఊరుకేసి చూస్తుంటే.. దూరంగా ఏదో ఆకారం వాళ్లవైపు వస్తూ కనిపించింది. అంతే భయంతో పరుగెత్తి చీకట్లో కలసిపోయాడు పాండు.. ‘ఆగు ఆగు .. ’ అంటూ ఆ ఆకారం వారిస్తున్నా వినకుండా.. ఆగకుండా!
∙∙ 
‘రేయి.. లేవరా... లే... తొందరగా తయారవ్వు.. ఆరున్నరవుతోంది’  
‘ఏంటన్నయా.. అప్పుడేనా?’ అన్నాడు పాండు బద్ధకిస్తూ. 
‘లెవ్వురా బాబూ.. అమ్మా, నాన్నా.. మన కోసం ఎదురు చూస్తుంటారు’ 
‘అపుడే వెళ్లిపోయారా?’ అంటూ దిగ్గున లేచి కూర్చున్నాడు పాండు. 
‘ఆ .. బట్టలు కూడా తీసుకెళ్లారు’

బద్ధకం వదిలించుకుని లేచి.. స్నానం చేసి పెళ్లింటికి బయలుదేరారు పాండు వాళ్లు.  మధ్యలోనే చిన్నాయన ఎదురై ‘ఏమిరా.. పాండూ ఇంత లేటుగానా వచ్చేది? పో.. వాడిని పలకరించు’ అని అంటూండగానే ఎవరో అతణ్ణి పిలవడంతో ఆ వైపు వెళ్లాడు. 
పెళ్ళిలో తెలిసిన బంధువులను, మిత్రులను పలకరిస్తూ పెళ్లి మంటపానికి వెళ్లి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాడు పాండు. అతని తండ్రి ‘ఇంత లేటా?’ అన్నట్టుగా కొరకొరా చూశాడు అతని వైపు. అపుడే కొంత మంది పెళ్లి చూసి తిరుగు ప్రయాణమై వెళ్తున్నారు కూడా! 

‘ఏమప్పా పాండూ.. బాగున్నావా ఏందీ?’ అని అడుగున్న తన ఎదురింటి సుబ్బన్నను చూసి 
‘బాగున్నా మామా! ఇంట్లో అందరూ కులాసాయేనా మామా?’ అని తిరిగి పలకరించాడు పాండు. 
‘ఆ దేవుని దయ వలన అందరం బాగున్నాములే’ బదులిచ్చాడు సుబ్బన్న. 
‘సరే.. మామా మళ్లీ కలుస్తా.. అమ్మ పిలుస్తూంది’ అంటూ వాళ్లమ్మ దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆమె ఓ అమ్మాయితో మాట్లాడుతూ పాండును చూసి దగ్గరకు రమ్మని చేయి ఊపింది. 

‘పాండూ.. బంధువులందరినీ పలకరించావా? లేదా?’ అడుగుతూండగానే ఆ అమ్మాయి 
‘సరే అత్తమ్మా, నేను వెళ్తాను. అమ్మ ఎదురు చూస్తుంటుంది’ అని చెప్పి వెనుదిరగబోయింది. అంతలోకే పాండు వాళ్లమ్మ ఏదో గుర్తొచ్చినదానిలా ‘ఇదిగో మహేశ్వరీ.. అమ్మను, నాన్నను భోజనానికి పంపించు’ అని పురమాయించింది.  
అలాగే అంటూ వెళ్తున్న మహేశ్వరీని చూస్తూ ‘ఎవరమ్మా ఆ అమ్మాయి?’ అని అడిగాడు పాండు. 

‘మన పక్క వీధిలో ఉంటారు లేరా?’ అని చెప్పింది ఆమె. 
‘సరేనమ్మా.. రాత్రంతా సరిగ్గా నిద్దర్లేదు. ఇంటికెళ్లి కొద్దిసేపు పడుకుంటానే.. తలనొప్పిగా ఉంది’ అన్నాడు. 
‘సరే పో.. కాస్త రెస్ట్‌ తీసుకొని రా’ 
∙∙ 
ఇంటికెళ్ళి పడుకున్న పాండు సాయంత్రం వరకు లేవలేదు. సాయంకాలం ఫ్రెషప్‌ అయ్యి ఆలా ఊర్లోకి వెళ్లాడు.. ఫ్రెండ్స్‌ని పలకరించి వద్దామని. రాములోరి గుడి దాటుతుండగా గుడి మెట్ల దగ్గర మహేశ్వరి కనిపించింది. 
ఆమె దగ్గరకు వెళ్లి ‘అర్ధరాత్రి మల్లప్ప గేట్‌ దగ్గర ఆడవాళ్ళను రేప్‌చేసే మనుషుల రక్తాన్ని తాగాలని ఎదురు చూస్తున్న మహేశ్వరికి వందనం’ అన్నాడు. 
చివ్వున తలతిప్పి అతని వైపు చూసింది మహేశ్వరి. 

‘నువ్వు అమ్మతో మాట్లాడుతున్నపుడే నీ వాయిస్‌ గుర్తు పట్టేశా. అక్కడే అడిగితే బాగోదని ఆగిపొయా. అసలేం జరుగుతోంది? మల్లప్ప గేట్‌ దగ్గర దయ్యాల పేరు చెప్పుకొని అందరినీ భయపెట్టడం వెనుకున్న మతలబేంటో చెప్తావా? లేక అందరినీ పిలవనా?’ చిన్నగానే కానీ బెదిరిస్తున్నట్టుగా అడిగాడు పాండు.  
‘పిలువు.. నాకేమన్నా భయమా?’ అంది మహేశ్వరి. 
అంతలోనే అక్కడకి పూజారి రావడం చూసి  ‘అయ్యవార్లూ. మన మల్లప్ప గేట్‌ దగ్గర ఏప్పుడైనా దయ్యాలు కనిపించాయని ఎవరన్నా అనుకోవడం విన్నారా?’ అని అడిగింది.
‘లేదమ్మా.. ఎవరికైనా కనిపించాయా ఏమిటి?’ ఆత్రంగా అడిగాడు పూజారి. 

‘ఈయనకి కనిపించించాయని చెప్తున్నాడు మరి’ పాండుకేసి చూపిస్తూ అంది. 
‘అవునా?’ అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు పూజారి.
‘ రాత్రి మాత్రం అక్కడున్నది నువ్వే! డౌటే లేదు. నిజం చెప్పు?’ అడిగాడు పాండు. 
‘అవును.. నేనే’ 

‘అదే.. అలా ఎందుకు చేశావ్‌?’ అడిగాడు పాండు. 
అతనికి కాస్త దగ్గరగా వచ్చి అటూ ఇటూ చూస్తూ ‘నీకు తెలుసో.. లేదో మా నాన్న రైల్వేలో పని చేస్తాడు.  నిన్న రాత్రి మల్లప్ప గేట్‌ దగ్గర  గేట్‌మన్‌గా డ్యూటీ వేశారు. సాయంత్రం నుంచే నాన్నకు ఒంట్లో నలతగా వుండింది.  వద్దులే అని వారించినా వినకుండా బయలుదేరిన నాన్నకు ఒంట్లో ఎలా ఉందోనని చూసి పోదామని గేట్‌ దగ్గరకు వచ్చాను. చల్లటిగాలికి బాగా దగ్గుతూన్న నాన్న.. ఇంట్లో ఉన్న మాత్రలు తెచ్చుకుంటానని ఇంటికెళ్లాడు.

నాన్న కోసం ఎదురుచూస్తూంటే నువ్వొచ్చావ్‌. వచ్చిన నువ్వు ఎలాంటి వాడివో నాకెలా తెలుస్తుంది? ఏ తాగుబోతో, దొంగో అయితే నా పరిస్థితి ఏంటి? నన్ను చూసి భయపడుతున్న నిన్ను భయపెట్టి అక్కడ నుండి పారిపోయేలా చేయాలని అనుకున్నా. ఆ తర్వాత నీ పేరు పాండు అని, నువ్వు హైద్రాబాద్‌ నుండి వస్తున్నావని నువ్వు చెప్పడంతో తేలికపడ్డా. అందుకే వెళ్లి వాటర్‌ తాగమని చెప్పా.  నాన్న వచ్చేనంత వరకు తోడుగా నువ్వుంటే భయం ఉండదని నా నాటకం కంటిన్యూ చేస్తుండగానే దూరంగా మా నాన్న రావడం చూసిన నువ్వు ఆగు ఆగు అని అరుస్తున్నా పరుగెత్తి పారిపోయావు. జరిగింది అదే. నమ్మితే నమ్ము లేకుంటే లేదు’ అని మెట్లుదిగి వెళ్ళిపోతూ మళ్లి  వెనక్కి వచ్చి ‘నువ్వు మాత్రం ధైర్యవంతుడివే’ అంటూ పరుగెత్తిపోయింది మహేశ్వరి. ఆమె వైపే చూస్తుండిపోయాడు పాండు.  
                                               
∙ కార్తిక్‌ గోపాల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement