పుస్తకాలు, చిత్రపటాలు ఆవిష్కరిస్తున్న వివిధ దేశాల కవులు, రచయితలు
సాక్షి, గుంటూరు: సామాజిక సమస్యలపై యువతరం దృష్టి సారించాలని జేకేసీ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. గుంటూరులోని జేకేసీ కళాశాల ఆడిటోరియంలో గుంటూరు 12వ అంతర్జాతీయ ఆంగ్ల కవితోత్సవం (జీఐపీఎఫ్) గురువారం ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు పరుచూరి గోపీచంద్, పంచుమర్తి నాగసుశీల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న కవితోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కవిత రచనా నైపుణ్యాలను అలవర్చుకుని, కవులు, కవయిత్రులుగా ఎదగాలని సూచించారు. కవితా రచన ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు తమ వంతు కృíషి చేయాలని చెప్పారు. సామాజిక సమస్యలకు కవితలను అస్త్రంగా మలచుకుని పరిష్కార మార్గాలను చూపి సమాజంలో చైతన్య తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రస్తుత యువతరం కవిత రచనా నైపుణ్యాలను అలవర్చుకుని భావితరాలకు వారసత్వంగా అందించాలని పిలుపునిచ్చారు.
గత 12 ఏళ్లుగా అంతర్జాతీయంగా కవులును ఒక చోటకు చేర్చి నిర్వహిస్తున్న కవితోత్సవం కళాశాల కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేస్తోందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు పరుచూరి గోపీచంద్, పంచుమర్తి నాగసుశీల మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, శ్రీలంక, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా, పోలాండ్ తదితర దేశాల నుంచి 190 మంది కవులు తమ సంకలనాలను అందించారని చెప్పారు. ప్రతి ఏటా తమ ఆంగ్ల శాఖ ఆధ్వర్యంలో తెలుగు, ఆంగ్ల భాషల్లో అంతర్జాతీయ కవితోత్సవాలను జరిపేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రపంచ శాంతి కోరుతూ హృదయాలను కదిలించి శాంతి వైపు మళ్లించే ఉద్ధేశ్యంతో అంతర్జాతీయ కవితోత్సవాన్ని 2008 నుంచి ప్రతి యేటా నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచ శాంతి, స్త్రీ సమానత్వం, పర్యావరణం, మానవతా విలువలు, గిరిజన జీవన విధానం అంశాలపై దేశ, విదేశాలకు చెందిన 190 మంది ప్రముఖ కవులు, కవయిత్రులు రచించిన పద్యాలతో ఎంపిక చేసి ముద్రించిన సంకలనాన్ని ఆవిష్కరించినట్లు వివరించారు.
రెండు రోజుల పాటు జరిగే కవితోత్సవంలో తమ పద్యాలను వినిపిస్తారని తెలిపారు. ఈసందర్భంగా దేశంతో పాటు విదేశాల నుంచి తరలివచ్చిన ఆయా కవులు, కవయిత్రులు ఆంగ్లంలో రచించిన కవితలతో సంకలనం చేసిన ‘‘ది వాస్’’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా మంగుళూరులోని ఏజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీఆర్ కృష్ణ కార్యక్రమ నిర్వాహకుడు గోపీచంద్, నాగసుశీలను లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల పాలకమండలి గౌరవాధ్యక్షుడు డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య, ఢిల్లీలోని ఆదర్శ్ ప్రెస్ నిర్వాహకుడు సుదర్శన్, ప్రముఖ గుండె శస్త్ర చికిత్స వైద్య నిపుణుడు డాక్టర్ లంకా శివరామ్ ప్రసాద్, కళాశాల పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్సార్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.నాగేశ్వరరావు, వాకాటి శిరీష్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కవితలు.. చిత్రాలు
నేను తెలుగు అమ్మాయినే. మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. వివాహానంతరం భువనేశ్వర్‌లో స్థిరపడ్డాను. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నెలకొల్పి విద్యాసంస్థను నిర్వహిస్తున్నాను. మహిళలపై జరుగుతున్న దాడులు, గృహ హింసకు వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్య పరుస్తున్నాను. ఇందుకు కవితలతో పాటు చిత్రలేఖన, నృత్య విభాగాల్లో ప్రతిభ చాటుతున్నాను. నేను గీసిన ప్రతి చిత్రానికి ఒక కవిత రచించడంతో పాటు, ప్రతి కవితకు అద్ధం పట్టేలా ఒక చిత్రాన్ని గీస్తాను. ‘‘రక్తపు మడుగులో శాంతి కపోతం’’, ‘‘సిజ్లింగ్ వర్సెస్ డిజ్లింగ్ కలర్స్’’ అనే కవితా పుస్తకాలను గతేడాది ఇదే వేదికపై ఆవిష్కరించాను.
- గాయత్రి మావూరు, భువనేశ్వర్
12 ఏళ్లుగా నిరంతరాయంగా కవితోత్సవం
ప్రపంచ శాంతి లక్ష్యంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు, మహిళపై దాడులు, పర్యావరణం వంటి అంశాలపై కవితా రచనలను ఆహ్వానిస్తూ గత 12 ఏళ్లుగా నిరంతరాయంగా కవితోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన కవులు, కవయిత్రులను ఒక వేదికపైకి చేర్చి వారి ఆలోచనలు, భావాలను పరస్పరం పంచుకోవడం ద్వారా సామాజిక సమస్యలపై మరింతగా కవితాస్త్రాలను సంధించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాం.
– పరుచూరి గోపీచంద్, కార్యక్రమ నిర్వాహకుడు
బహుముఖ ప్రజ్ఞాశాలి ‘సైగన్’
బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రెనాటా సైగన్ అంతర్జాతీయ కవితోత్పవంలో పాల్గొనేందుకు పోలెండ్ దేశం నుంచి తొలిసారిగా గుంటూరు వచ్చారు. నటనతో పాటు కవయిత్రిగా, గ్రాఫిక్ డిజైనర్, ఫొటోగ్రాఫర్, జర్నలిస్ట్‌గా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. కవితోవ్సంలో పాల్గొనేందుకు గుంటూరు రావడం ఆనందంగా ఉందని, ఇక్కడి ఆతిధ్యం బాగుందని ఆమె చెప్పారు. ఆమె రచించిన కవితలు ఇంగ్లిష్, రష్యన్, బల్గేరియా, టర్కిష్, బెలారూసియన్, ఇటాలియన్, తెలుగు భాషల్లోకి అనువాదమయ్యాయి.
స్పేస్ ఇంజినీరింగ్ చదువుతూ.. రచనలవైపు
పోలాండ్‌కు చెందిన ఆగ్నిస్కా జర్నికో స్పేస్ ఇంజినీరింగ్ చదువుతూ తన తల్లి ఇజబెల్లా జుబ్కో బాటలో కవితా రచన చేయడం ప్రారంభించారు. గిటార్ వాయిద్యంపై శిక్షణ పొందుతూ అంతర్జాతీయస్థాయి పోటీలో ప్రతిభ చాటింది. కవితా రచనతో సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో ముందుకెళుతున్నానని చెబుతోంది.
పోలిష్ రైటర్స్ యూనియన్ సభ్యురాలు ‘ఇబజెల్లా’
పోలాండ్‌కు చెందిన ఇజబెల్లా జుబ్కో జగియోలొనైన్ యూనివర్శిటీలో అధ్యాపకురాలిగా పని చేస్తూ కవితా రచన హాబీగా మలచుకున్నారు. పోలిష్ రైటర్స్ యూనియన్‌లో సభ్యురాలిగా చురుకైన పాత్ర పోషిస్తూ సాహిత్య రచనలో నిమగ్నమయ్యారు. సాహిత్యంలో ప్రతిభ చూపినందుకు పలు అవార్డులను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment