
పదహారు కళల పౌర్ణమి వంటి పాట
కటిక నలుపు అమావాస్యకు ఒరిగిపోయింది.
పద నాడులకు ప్రాణ స్పందననొసగిన పల్లవి
అసంపూర్ణ చరణాలను మిగిల్చి వెళ్లిపోయింది.
చలువ వెన్నెలలో మునిగి
అలల మువ్వలను కూర్చి ఒక కలం
గగనపు విరితోటలోని గోగుపూలు తెస్తానని
వీధి మలుపు తిరిగిపోయింది.
కవిని చిరాయువుగా జీవించమని ఆనతినివ్వని
ఆది భిక్షువును ఏమి అడగాలో తెలియక
ఒక గీతం అటుగా అంతర్థానమయ్యింది.
తెలుగువారి కంట కుంభవృష్టి మిగిల్చి
‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనే పేరు
తెలిమంచులా కరిగిపోయింది.
తెలుగువారి ఆఖరు పండిత సినీ కవి
సువర్ణ చరిత్ర తుది పుట మడిచింది.
‘అమ్మలాల..
పైడి కొమ్మలాల..
వీడు ఏమయాడె..
జాడ లేదియాల’...
అయ్యో... కట్ట వలసిన
పాట వరుస హార్మోనియం
మెట్ల మీద పడి
భోరున విలపిస్తూ ఉంది.