రాజమహేంద్రవరానికి చెందిన చిత్రకారుడు తాడోజు హరి వేసిన సిరివెన్నెల తైలవర్ణ చిత్రం
వేటూరి తరువాత తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణ వార్త జిల్లాను విషాదంలోకి నెట్టేసింది. జిల్లాలో పాటల, సాహితీ ప్రియులు ఆయన పాటలతో ఉన్న బంధాన్ని.. పదాలు రగిలించిన స్ఫూర్తిని తల్చుకుని కన్నీటిపర్యంతమయ్యారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ‘ఏకాకి జీవితం నాది’ అంటూ నిష్క్రమించిన ఆ మహనీయునికి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం/కాకినాడ: సీతారామశాస్త్రితో జిల్లాకు విడదీయరాని బంధం ఉంది. ఆయన తండ్రి వెంకట యోగి కాకినాడ ఐడియల్ కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా పని చేశారు. 1970–72 ప్రాంతంలో అదే కళాశాలలో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదివారు. తండ్రి నుంచి సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఆయన సాహిత్య ప్రస్థానం కాకినాడలోనే ప్రారంభమైంది. కాకినాడ గాంధీనగర్‌లోని రెడ్‌క్రాస్ బిల్డింగ్ వద్ద ఆయన కుటుంబం నివాసం ఉండేది. 1976 నుంచి 1984 వరకూ కాకినాడలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో క్లరికర్ క్యాడర్‌లో పని చేశారు. అక్కడి సాహితీవేత్తలు అద్దేపల్లి రామ్మోహనరావు తదితరులతో అప్పటికే పరిచయాలుండేవి. సాహితీవేత్త సీహెచ్ కృష్ణారావు నిర్వహించే ‘నెలనెలా వెన్నెల’ సాహిత్య సభలకు హాజరయ్యేవారు. కవితలు రాసి వినిపించేవారు. పద్మశ్రీ అవార్డు పొందిన సిరివెన్నెలను 2019 ఆగస్టు 3న కాకినాడ సూర్య కళామందిర్‌లో స్థానిక కవులు సత్కరించారు.
‘సిరివెన్నెల’గా మారిందిక్కడే..
సుప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్ సినిమాల షూటింగ్‌లు దాదాపు ఈ జిల్లాలోనే జరిగేవి. కాకినాడకు చెందిన రచయిత ఆకెళ్ల ద్వారా విశ్వనాథ్‌కు సీతారామశాస్త్రి తొలిసారి పరిచయమయ్యారు. ఆయన ప్రతిభను గుర్తించిన విశ్వనాథ్ జనని జన్మభూమి (1984) సినిమాలో తొలి అవకాశమిచ్చారు. రామచంద్రపురంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సిరివెన్నెల ఒక పాట పాడి వినిపించడంతో విశ్వనాథ్ ఆకర్షితులయ్యారు. ఆ పాటను వెంటనే జనని జన్మభూమి సినిమాలో తీసుకున్నారు. ఆయన సాహితీ స్థాయిని అర్థం చేసుకున్న విశ్వనాథ్ తన తదుపరి చిత్రమైన సిరివెన్నెలలో అవకాశమిచ్చారు. అందులోని పాటలన్నీ సీతారామశాస్త్రే రాశారు. ఆ పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో సీతారామశాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. రామచంద్రపురానికి చెందిన ఉజూరు వీర్రాజు, చింతా రామకృష్ణారెడ్డి, ఎం.భాస్కరరెడ్డిలు సంయుక్తంగా సిరివెన్నెల సినిమా నిర్మాణ సారథ్యం వహించారు. ఈ సినిమాలో పాట ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. సిరివెన్నెల సినిమా ఆయన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది.
►స్వాతి కిరణం చిత్రంలో స్వీయరచన శివానీ.. భవానీ పాట చిత్రీకరణ సందర్భంగా రామచంద్రపురంలోని రాజుగారి కోటలో సీతారామశాస్త్రి రెండు రోజుల పాటు సీతారామశాస్త్రి ఉన్నారు. కాజులూరు మండలం పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరాన్ని పలుమార్లు సందర్శించారు.
►సీతానగరం మండలం రాపాక పంచాయతీ పరిధిలోని శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానాన్ని సిరివెన్నెల ఏటా సందర్శించేవారు.
ఆ పాట ఎప్పటికీ జనం నోళ్లలో..
సంప్రదాయ కావ్య భాషను చలన చిత్రాల్లో పాటగా మలచి, సామాన్యుడు సైతం సులువుగా పాడుకునే శైలిని ప్రవేశపెట్టారు సీతారామశాస్త్రి. ఆయన పాటలతో సినిమా సాహిత్యం సుసంపన్నమైంది. సీతారామశాస్త్రి మృతి చెందినప్పటికీ ఆయన పాట ఎప్పటికీ జనం నోళ్లలో నిలిచే ఉంటుంది. ఆయన కాకినాడలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు, వివిధ సాహిత్య సభల్లో ఆయనతో నా అనుబంధం స్నేహపాత్రమైనది.
– దాట్ల దేవదానంరాజు, కవి, యానాం
అలా పరిచయం చేశారు
డిగ్రీ చదువుతున్న రోజుల నుంచే సీతారామశాస్త్రి పరిచయం. ఆకెళ్ల గారితో పాటు సీతారామశాస్త్రిని తరచూ కలుసుకునేవాడిని. ఆయనకు నా కవిత్వం అంటే ఎంతో అభిమానం. ఒకసారి నేను ఆయన ఆఫీసుకు వెళ్లాను. అక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ ఉన్నారు. ‘ఈయన నా అభిమాన కవి’ అంటూ నన్ను ఆయనకు పరిచయం చేయడమే కాకుండా.. పత్రికల్లో అచ్చయ్యే నా కవితలను ఎత్తి రాసుకున్న డైరీ చూపించినపుడు నేనే ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచీ అనేక సందర్భాల్లో కలుస్తూనే ఉన్నాం.
– డాక్టర్ శిఖామణి, సంపాదకుడు, కవిసంధ్య, యానాం
సీతానగరం మండలం శ్రీరామనగరంలోని చిట్టిబాబాజీ ఆశ్రమంలో సిరివెన్నెల పూజలు (ఫైల్)
మాది 40 ఏళ్ల స్నేహబంధం
సీతారామశాస్త్రితో నాది 40 ఏళ్ల స్నేహబంధం. మాది సాహిత్య సంబంధమే కాదు.. ఆత్మీయ అనుబంధం కూడా. మా కుటుంబంలో ఓ వ్యక్తిలా ఉంటారు. సిరివెన్నెల మరణం తీరని లోటు. ఆయనపై ఓ పుస్తకం రాస్తున్నాను. ఓ అధ్యాయం పూర్తి చేశాను. ఇటీవల కలుసుకోవాలనుకున్నా అనారోగ్యం వల్ల వాయిదా పడింది. అమలాపురంతో ఆయనది విడదీయరాని అనుబంధం. ‘సిరివెన్నెల సినీ గీతాలు’ శీర్షికతో పూర్తి చేసి ఆవిష్కరిస్తాను. – డాక్టర్ పైడిపాల, పాటల పరిశోధన రచయిత
రాజమహేంద్రవరంతో అనుబంధం
రాజమహేంద్రవరంలో నిర్వహించిన సాహిత్య సభలకు సిరివెన్నెల తరచూ వచ్చేవారు. నగరానికి చెందిన చాగంటి శరత్‌బాబుతో ఎక్కువ సాంగత్యం ఉండేది. సామర్లకోటలోని రామ్‌షా వద్ద వీరిద్దరూ సహాయకులుగా ఉండేవారు. రామ్‌షా ఆయుర్వేద వైద్యుడే కాకుండా జ్యోతిష శాస్త్ర ప్రవీణుడు కూడా. దీంతో వీరిద్దరూ ఆయుర్వేదంతో పాటు జ్యోతిష శాస్త్రంపై కూడా పట్టు సంపాదించారు. ఏ ఉద్యోగం దొరకకపోతే జ్యోతిషం చెప్పుకొని బతకవచ్చంటూ సిరివెన్నెల సరదాగా అనేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చాగంటి శరత్‌బాబుతో ఉన్న బంధంతో ఆయన కుమార్తెను తన కోడలిగా చేసుకున్నారు. శరత్‌బాబు గత సెప్టెంబర్ 26న మరణించారు. అక్టోబర్ 5న రాజమహేంద్రవరం దానవాయిపేటలో జరిగిన సంస్మరణ సభలో సిరివెన్నెల పాల్గొన్నారు. అదే నగర చివరి సందర్శన అవుతుందని అభిమానులు అనుకోలేదు. సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నగరానికి చెందిన సినీ నటుడు, గాయకుడు జిత్‌మోహన్‌మిత్రా కన్నీరు పెట్టుకున్నారు.
సిరివెన్నెల చిత్రం షూటింగ్‌లో సీతారామశాస్త్రి తదితరులు
ఆయనతో పరిచయం మరువలేనిది
‘సిరివెన్నెల’ సినిమాకు నిర్మాణ బాధ్యతలు వహించడం నా జీవిత అదృష్టం. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పాటలు అమోఘం. పాటకు కొత్త సొబగులద్దారు. ఆయన రాసిన పాటలు ఆ సినిమాకు ప్రాణం పోశాయి. నంది అవార్డు రావటం ఎంతో ఆనందాన్ని అందించింది. మా చిత్రం నుంచే ఆయన ‘సిరివెన్నెల’గా మారిపోయారు.
– ఉజూరు వీర్రాజు, సిరివెన్నెల నిర్మాత, రామచంద్రపురం
Comments
Please login to add a commentAdd a comment