రాజమహేంద్రవరం సిటీ: ఆహార ప్రియులకు శుభవార్త.. రాత్రివేళ టిఫిన్ లేదా మరే ఇతర ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా ఎక్కడ దొరుకుతాయనే దిగులు చెందనక్కర లేదు. ఒకచోటే ఫుడ్ ఐటమ్స్ కొలువుతీరి స్వాగతం పలకనున్నాయి. చీకటి పడిందని చింతపడనక్కర్లేదు. అర్ధరాత్రి సమీపిస్తున్నా ఆదరాబాదరా పడనక్కరలేదు. హ్యాపీగా తినివెళ్లొచ్చు.. రాజమహేంద్రవరంలోనే ఈ అవకాశమండోయ్.. ఈ వివరాలేంటో తెలుసుకుందాం..!
నగరంలో వినూత్నరీతిలో అర్బన్ ఫుడ్ ప్లాజా ఏర్పాటు కానుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రమయ్యాక చాలా మంది నగరానికి చేరుకునే ఇతర ప్రాంతాల వారు గాని ఇక్కడి ప్రజలు గాని రోడ్ల మీద ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా? అని వెతకటం సహజం. దీనిని దృష్టిలో పెట్టుకుని నగరపాలకసంస్థ రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ వివిధ రకాల ఫలహారాలు ఒకేచోట అందించాలని సంకల్పించింది.
బిర్యాని, చైనీస్ ఫుడ్, తందూరీ, వెజిటేరియన్ ఫుడ్స్, పండ్ల రసాలు, ఫాస్ట్ ఫుడ్స్, టిఫిన్స్ ఇలా 10 రకాల ఆహారాలను ఒకే వేదికపైకి అందుబాటులోకి తేనుంది. ఇందు కోసం 33 స్టాల్స్‌ను సిద్ధం చేస్తోంది. విజయవాడ తరువాత మన జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఇలాంటి సదుపాయం కల్పించనుంది. స్టాల్స్ ఏర్పాటుకు రూ.1 కోటి వెచ్చించనుంది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రెండో గేట్ అర్బన్ స్క్వేరు సెంటర్‌ను ఆనుకుని అర్బన్ ఫుడ్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 200 మీటర్లు పొడవున్న ఈ రోడ్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఫుడ్ ప్లాజా ప్రాంతాన్ని అలంకరించనున్నారు.
ఆర్ట్స్ కళాశాల రోడ్డులో సన్నాహాలు
ఈ స్టాల్స్‌లో నిబంధనలకు అనుగుణంగా.. నాణ్యతను పాటించేలా ఉత్సాహవంతులైన వ్యాపారుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించారు. ఎన్నింటికి తెరవాలి.. ఎన్నింటికి క్లోజ్ చేయాలి.. ఎలాంటి నాణ్యత కల్పించాలి?, సందర్శకులతో వ్యవహరించే తీరు.. ఫుడ్ ఐటమ్స్ లాంటి విషయాలపై 521 మంది దరఖాస్తుదారులతో ఇప్పటికే కమిషనర్
దినేష్‌కుమార్ మాట్లాడారు. మొదటి దశలో కంబాల చెరువు రోడ్డు పక్కన, కోటి లింగాల ఘాట్ వద్ద ప్లాజాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినా కార్యరూపం దాల్చలేదు. అర్బన్æ ఫుడ్ ప్లాజాను ఈట్ స్ట్రీట్ పేరుతో షాడే బాలికల స్కూల్ రోడ్‌లో ప్రతిపాదించి సిద్ధం చేశారు. ఆ రోడ్డు సక్రమంగా లేదని చివరికి ఆర్ట్స్ కళాశాల రోడ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరో పదిరోజులే సమయం ఉండటంతో ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో రాత్రి సమయాల్లో ప్రధాన సెంటర్లలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పుడ్‌ప్లాజాతో ఈ ఇబ్బందులు చక్కబడే అవకాశాలున్నాయి. అర్బన్ ఫుడ్ ప్లాజా కచ్చితంగా ప్రజలకు ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని పంచుతుందని కమిషనరు దినేష్‌కుమార్ చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ మార్గంలో రాకపోకలను నియంత్రించనున్నారు. ఆహార ప్రియులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిని హాయిగా వెళ్లగలగాలనేది తమ ఉద్దేశమని కమిషనర్ పేర్కొన్నారు.
డిసెంబరు 1న ప్రారంభం
రాజమహేంద్రవరంలో ఫుడ్ ప్లాజా ఏర్పాటుతో ఆహార ప్రియుల కోసం ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. విజయవాడ తరువాత ఈ నగరంలోనే ఏర్పాటు చేస్తున్నాం. 10 కేటగిరీల్లో 33 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రూ.25 వేలు ముందుగా డిపాజిట్ చెల్లించాలి. నెలకు రూ.10 వేలు అద్దెగా నిర్ణయించాం. ఈ నెల 21 వరకూ డిపాజిట్ చెల్లించేందుకు సమయం ఇచ్చాం. అందరి సమక్షంలో డ్రా తీసి దరఖాస్తుదారులకు షాపుల స్థలం కేటాయిస్తాం. రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ కోరుకున్న ఆహారం ఒకే వేదిక వద్ద లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– దినేష్‌కుమార్, కమిషనర్, నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment