ఒకడు జాషువా
విశేష సంపుటి
రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మించింది కాదు. జాషువా సాహిత్యం ఒక్క పూటలో పుట్టింది కాదు. రోమ్ నగరమూ, జాషువా కవిత్వమూ రెండూ ఒక్కటే. శ్రీకృష్ణుడు చిటికెన వేలి మీద గోవర్థన పర్వతం ఎత్తి పట్టినట్లు ఒక్క జాషువా ఒంటి చేత్తో తెలుగు పద్యాన్ని ఎత్తి పట్టాడు. తాజ్‌మహల్ కట్టడం వెనుక ఎంత కథ ఉందో, ఎంత వెత ఉందో, ఎంత శ్రమ ఉందో, ఎంత సౌందర్యం ఉందో అంతే కృషి జాషువా పద్యనిర్మాణం వెనుక దాగి ఉంది. అనంత పద్మనాభుడి ఆలయంలో అపారమైన నిధులున్నట్లే ‘కవి కోకిల’ జాషువా కవిత్వంలో కూడా అమూల్యమైన కవితా నిధులున్నాయి. వాటిని ఒక చోట చేర్చి గ్రంథరూపం తీసుకువచ్చిన వైనం ‘జాషువా సర్వలభ్య రచనల సంకలనం’.
దాదాపు వందేళ్ల నాటి జాషువా తొలికృతి- ‘హిమథామార్కధర పరిణయము’ (1917) నుంచి జీవిత చరమాంకంలోని ‘వీలునామా’ వరకు జాషువా సమగ్ర సాహిత్య సమ్మేళనమే ఈ సర్వలభ్య రచనల సంకలనం. 1654 పేజీల ఈ గ్రంథంలో ఆరువేలకు పైగా పద్యాలున్నాయి. ఇది కేవలం పుస్తకం కాదు. జాషువా ప్రత్యక్షర, ప్రత్యక్ష కవితా సాక్షాత్కార రూపం. ఈ గ్రంథం ప్రచురించడం వెనుక అనితరసాధ్యమైన అమోఘమైన కృషి ఉంది.
సాహిత్యమంటే ప్రాణం పెట్టే ‘మనసు ఫౌండేషన్’ రాయుడుగారికే ఇది సాధ్యం అయ్యింది. ఎందుకంటే అవి కాలే చేతులు కావు కనుక. ‘పిరదౌసి’ కావ్యంలో జాషువా చెప్పినట్టు ‘సిరి నిజంబుగ వట్టి టక్కరిది సుమ్ము’. ఆ టక్కరి సిరి మెడలు వంచి ఒడలు పులకరించి పోయేలా ఉత్తమ రచయితల గ్రంథాలు సరసమైన ధరలకు ప్రచురించడం ‘మనసు ఫౌండేషన్’ వారి ప్రచురణ సంస్కారం. ఆ పరంపర నుంచి వచ్చిందే జాషువా సమగ్ర సాహిత్య సంకలనం.
వెయ్యేళ్లకు పైబడిన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక్కడే జాషువా. ఇతర కవుల పితరులకు తాగడానికి నేతులున్నాయ్. కమ్మని నూతులున్నాయ్. అక్షరాలు నేర్వడానికి అగ్రహారాలున్నాయ్. తాత ముత్తాతల, జేజి నాయనల జేజేలున్నాయ్. వారసత్వపు భేషజాలున్నాయ్. ఇవ్వేవి లేనివాడు, ఒంటరివాడు, అంటరానివాడు జాషువా ఒక్కడే. ఈ సమాజం వెలి వేసినా, తన భావాలను బలి చేసినా తానే ఒక ఆకాశమై- తానే ఒక సూర్యుడై- తానే ఒక కవి చంద్రుడై- తానే ఒక కవి కోకిలై తానొక్కడే ‘నవయుగ కవి చక్రవర్తి’యై- తెలుగు పద్యానికి అజరామరకీర్తియై- స్ఫూర్తియై నిలిచిన ఏకైక కవి ‘కళాప్రపూర్ణ’ గుఱ్ఱం జాషువా. తెలుగులో వేలాది మంది కవులున్నారు.
వాళ్లు రాసిన కొన్ని రచనల్లో కొన్ని ఆశ్వాసాలు బాగుంటాయి. మరికొన్ని ఘట్టాలు కంఠతా పెట్టిస్తాయి. మరికొందరి పద్యాలు కంటతడి పెట్టిస్తాయి. కొన్ని కమ్మగా చదివిస్తాయి. కాని జాషువా ప్రతి పద్యం అమృతమయం. ఆద్యంతం రసమయం. పఠితను వెంటాడుతూ ఉంటుంది. ఏ పద్యాన్నీ పక్కన పెట్టలేము. అది నేరుగా హృదయంలోకి చొచ్చుకుని పోతుంది. వేయిరేకుల కలువగా విచ్చుకుపోతుంది. ఇది జాషువాకు మాత్రమే అబ్బిన పద్య విద్య. ఈ శిల్పం జాషువా సొంతం.
జాషువా వస్తురూప పరిణామాలు తెలుసుకోవాలన్నా, ఆయన సాహిత్యంలోని దృక్పథాలను గుర్తించాలన్నా, అమేయమైన ఆయన కవితా మాధుర్యాన్ని ఆస్వాదించాలన్నా రసజ్ఞులైన పాఠకులు ఈ గ్రంథాన్ని చవి చూడవలసిందే. జాషువా తెలుగునాట ఆరాధ్యనీయుడు. అభిమానులకు ప్రాతఃస్మరణీయుడు. ‘మనసు ఫౌండేషన్’ జాషువాకిచ్చిన గొప్ప నివాళి, నిత్య నీరాజనం ఈ సంకలనం. తరతరాలు దాచుకోవలసిన ప్రతినిత్యం చదువుకోవలసిన అపురూపగ్రంథం.
వెల: రూ. 400; ప్రతులకు: ఎమెస్కో లేదా అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు;
మనసు ఫౌండేషన్: 00089077699
- ఎండ్లూరి సుధాకర్