jashuva
-
జాషువా స్ఫూర్తితోనే ముందుకెళుతున్నాం!
సాక్షి, అమరావతి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ఆశయ స్ఫూర్తితోనే వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జాషువా జయంతిని గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. మంత్రి నాగార్జున మాట్లాడుతూ సమాజంలో అనేక అవమానాలు, వివక్షను ఎదుర్కొని ఎదిగిన మహాకవి జాషువా అని కొనియాడారు. సమాజాన్ని మేల్కొలిపేలా రచనలు చేశారని చెప్పారు. ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఉన్నతమైన ఆయన రచనలు గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ఫిరదౌసి వంటి వాటిని అన్ని భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాషువా స్ఫూర్తితో దళిత వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. నందిగం సురేష్ మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగా తనదైన శైలిలో సమాజాన్ని మేల్కొల్పిన మహనీయుడు జాషువా అని చెప్పారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
కవిత్రయం తరువాత సిసలైన కవి జాషువా
ఏఎన్‌యూ: కవిత్రయం తరువాత తెలుగులో సిసలైన కవి గుర్రం జాషువా అని అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యూనివర్సిటీ తెలుగు విభాగం, ఏపీ అధికార భాషా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి ముందస్తు వేడుకలు మంగళవారం జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన విజయబాబు మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న ఛీత్కారాలను సత్కారాలుగా మలచుకున్న దార్శనికుడు జాషువా అని చెప్పారు. వీసీ పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. జాషువా విశ్వజననీయమైన రచనలు చేశారన్నారు. జాషువా తన సాహిత్యం ద్వారా విశ్వాన్ని జాగృతం చేశారన్నారు. రెక్టార్ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ బి.కరుణ, పాలక మండలి సభ్యురాలు సీహెచ్.స్వరూపరాణి, సీడీసీ డీన్ కె.మధుబాబు, ప్రిన్సిపాల్స్ పి.సిద్దయ్య, శ్రీనివాసరెడ్డి, ప్రమీలారాణి ప్రసంగించారు. సాహితీ పురస్కారాలు ప్రదానం తెలుగు భాషా సాహిత్యంలో విశేష సేవలు అందించిన దుగ్గినపల్లి ఎజ్రయ్య, కొమ్మవరపు విల్సన్‌రావు, విడదల సాంబశివరావు, పోగుల విజయశ్రీ, కొండపల్లి సుదర్శనరాజు, గుమ్మ సాంబశివరావు, కాకాని సుధాకర్, సీహెచ్ స్వరూపరాణి, గుమ్మడి విజయ్‌కుమార్, డి.అనిల్‌కుమార్, పీవీ సుబ్బారావుకు సాహితీ పురస్కారాలు ప్రదానం చేశారు. వ్యాసరచన, వక్తృత్వం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. -
పట్టాభి కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు: ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: టీడీపీ నేత పట్టాభి విషయంలో ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్టాభి విషయంలో ఏం జరిగిందో ఎస్పీ జాషువా కీలక విషయాలు వెల్లడించారు. టీడీపీ లీడర్ పట్టాభిని పోలీసులు కొట్టారనేది అవాస్తమని స్పష్టం చేశారు. కాగా, ఎస్పీ జాషువా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నిందలు వేయడం సరికాదు. పట్టాభి అవాస్తవంతో కోర్టును తప్పుదారి పట్టించాలని చూశారు. పట్టాభి కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు. డాక్టర్ల బృందం రెండుసార్లు పరీక్షించినా ఎలాంటి గాయం లేకపోవడంతో పట్టాభి వ్యూహం విఫలమైంది. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినా సుమోటోగా కేసు నమోదు చేశాం. వీడియో ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి, ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. -
శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ జాషువా
-
గుంటూరులో జాషువా కళా ప్రాంగణం నిర్మిస్తున్నాం: మంత్రి సురేష్
సాక్షి, గుంటూరు: తెలుగు భాషాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరులో జాషువా కళా ప్రాంగణం నిర్మిస్తున్నామని తెలిపారు. జాషువా నివసించిన ఇంటిని స్మారక భవనంగా మార్చాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్తామని పేర్కొన్నారు. ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టినప్పటికీ తెలుగు భాషా ఔన్నత్యాన్ని కాపాడతామని తెలిపారు. తెలుగు అకాడమీ ద్వారా జాషువా కవితలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని ఆయన వెల్లడించారు. మూఢ నమ్మకాలు, సామాజిక రుగ్మతులపై జాషువా రచనలు ప్రభావం చూపాయని గుర్తుచేశారు. -
కులపిశాచిపై యుద్ధ గళం
గత రెండు సహస్రాబ్దుల్లో ఎన్ని లక్షలమంది తమ నైపుణ్యాలను కులపిశాచి బలిపీఠంపై బలిచేశారో- జాషువా అన్నట్లు.. ఎంత కోయిల పాట.. ఎన్ని వెన్నెల వాగులు.. ఎంత రత్నకాంతి ఈ దేశంలో భగ్నమయ్యాయో? నా కవితా వధూటి వద నంబు నెగాదిగా జూచి/ ...... భళీ భళీ యన్నవాడే మీ/దేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో/బాకున గ్రుమ్మి నట్లగున్.../ అంటూ అవ మానాగ్నిలో కాలిన జాషువా మహాకవి. మత వృషభేంద్రముల్/పనికిమాలిన వర్ణపు దున్నపోతులున్/జతలుగ సాగి ఈ భరతజాతిని నాశనమొనర్చె/దిక్కుమాలిన కులమతోన్మాద లోకా న/మగ్గె నాలోని ప్రతిభ... అంటూ వేదనా జ్వాలల్లో రగిలిన సురగాలి తిమోతి జ్ఞానానంద కవేగాక... టైజం కన్నా/ కేస్టిజమే భయంకరం/ మత పిచ్చి యమ ఖడ్గమే ఈ కులవాదం.../ అనేక అంచుల రాకాసి మృగం/ దీని శవాన్ని ఎలక్ట్రానిక్ దహనవాటికలో/ బూడిద కూడా దొరకనంతగా / కాల్చిపారేయాలి అంటూ మండే గుండెతో తీర్పును ప్రకటించిన నగేష్బాబుతోపాటు ఎందరో మహనీయులు భారతదేశంలో కుల మహమ్మారి శతాబ్దాలుగా సాగించిన, నేటికీ సాగిస్తున్న మానవతా హననాన్ని రక్తాక్షరా లతో చరిత్రలో రాశారు. దాని నిర్మూలనకు పోరాటం చేశారు. కానీ, ఈ దేశంలో చోటు చేసుకున్న అమానవీయమైన మానసిక బానిసత్వం మానవజాతి చరిత్రలో ఒక సుదీర్ఘమైన దుర్మార్గపు జాడ్యం, ఏ మందుకీ, చికి త్సకూ లొంగని జుగుప్సాకరమైన కర్మసిద్ధాంతం. ‘‘కర్మసిద్ధాంతమున నోరు కట్టివేసి/ స్వార్థలో లురు నా భుక్తిననుభవింత్రు/ కర్మయననేమొ, దానికి క్షయయేమొ..’’ అంటూ, ఈ నేలపై జరిగిన కుట్ర బట్టబయలు చేశాడు కవి జాషువా. ‘‘వాని రెక్కల కష్టంబు లేనినాడు/ సస్యరమ పండి పులకింప సంశయించు/ వాడు చెమటోడ్చి ప్రపంచమునకు/ భోజనము బెట్టువానికి భుక్తి లేదు’’ ఇదీ కర్మ సిద్ధాంతపు కుట్ర, వాని రెక్కల కష్టంతోనే తమ కడుపులు, ఖజానాలూ నింపు కోవాలి. వానికి మాత్రం భుక్తి ఉండరాదు. ఒళ్లు దాచుకునేందుకు గుడ్డ ఉండరాదు. రక్తమోడ్చి కష్టం జేసిన మేను వాల్చేందుకు చిన్నగూడు ఉండరాదు. ఒక బలమైన శత్రువును పకడ్బందీగా నిస్స హాయుడిని చేసి, శవసమానుడిని చేసిన తర్వాతే ప్రత్యర్థి హమ్మయ్య ఇక పర్వాలేదు మనకు అని నిర్భయంగా నిద్రపోగలుగుతాడు. అభద్రతా భయమే కులం సృష్టికి మూలం. ఈ మొత్తం చరి త్రను నాలుగు పద్యపాదాల్లో ప్రపంచం ముందుం చాడు జాషువా. ‘‘ఆ యభాగ్యుని రక్తంబు నాహ రించి/యినుప గజ్జెల తల్లి జీవనము సేయు/గసరి బుసకొట్టు నాతని గాలిసోక/నాల్గు పడగల హైందవ నాగరాజు పుట్టు బానిస, అంటరానివాడు దళితుడు, అవర్ణుడు, నీచ, నిమ్న, బడుగు, బలహీన, అణగా రిన, అబల, ఆడది, పంచములు, అగ్ర, అథమ, అవర్ణ, సవర్ణ, ఉచ్ఛ, అస్పృశ్య, మీరేమిట్లు వంటి చెత్త పదాలను భాషలో సృష్టించి ఈ దేశపౌరులకు అంటగట్టి భారతీయులంతా సమానులే అని ప్రకటి స్తున్న రాజ్యాంగం అమలులో ఉన్న దేశంలో పౌరు లను అవమానించే పదాలు వాడటం చట్ట ప్రకారం శిక్షార్హం కాదా? 2005 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ‘పాపం సరస్వతి మరొక స్త్రీని తాకి మైలపడి పోయింది’ అనే శీర్షికతో వార్తా పత్రికలు ఒక కులవివక్ష వార్తను మన కందించాయి. ఆమె గళం అద్భుతమని ఆకాశానికె త్తిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, ఆమె కులం తెలియగానే, హతాశులయ్యారు. దళిత విద్యా ర్థిని నీలం సునీత సంగీతంలో మాస్టర్స్ డిగ్రీతో బయటికి వస్తే ‘నీకెందుకమ్మా సంగీతాలు, సరిగమలూ పిలగాళ్ల కేవో ఆఆఇఈలూ చెప్పుకోక’ అంటూ ఉచిత సలహాలు పారే శారు. గడిచిన రెండు సహస్రా బ్దుల్లో ఎన్ని లక్షలమంది ఆయా రంగాల్లో తమ ప్రతిభా నైపుణ్యా లను ఈ దేశ కులపిశాచి బలి పీఠంపై బలిచేశారో.. ప్రతిష్టాత్మక మైన ఐఐటీలు, ఎయిమ్స్‌లలో కొనసాగుతున్న దళిత విద్యార్థుల ఆత్మహత్యలు, కాలి బుగ్గవుతున్న రేపటి పౌరుల కలల నింగిని తాకుతూనే ఉంది. మూఢాచారాలు, మూర్ఖత్వాల మీద కలం యుద్ధం చేసిన ప్రఖ్యాత రచయిత చలం కులమనే పైశాచికత్వం మీద కూడా తన కలాన్ని ఝళిపిం చడం సహజంగానే ప్రాచుర్యం పొందలేదు. తన స్త్రీ గ్రంథంలో, ‘‘... దేశనాయకుడో, శాస్త్ర పండితుడో కావలసినవారిని కేవలం చెప్పులు కుట్టే పనికే అంకితం చేస్తే.. దేశానికి ఎంత నష్టం. స్త్రీలూ అంతే కదూ... ఎందరు వర్తకుల్ని, చిత్రకారుల్ని, కవుల్ని, శిల్పుల్ని, యంత్రకారుల్ని స్త్రీలలోనూ తరతరాలుగా ఈ దేశం పోగొట్టుకొంటున్నదో.. రాజ్య మేలాల్సిన స్త్రీలు అంట్లు తోముతున్నారు.’’ అన్నారాయన. జాషువా అన్నట్లు ‘ఎంత కోయిల పాట... ఎన్ని వెన్నెల వాగులు.. ఎంత రత్న కాంతి... భగ్న మయ్యాయో..’ ‘వాడి తలపై/ నీ కాళ్లున్నందుకు/ సిగ్గుపడు/ వాడి కాళ్లను మోస్తున్న/ నీ తలలో/ రోషాగ్ని జ్వలిస్తేనే/ నిచ్చెన మెట్లు/ కాలిబుగ్గ య్యేది’. అప్పుడే జాషువా జన్మదినం నవ్వులు చిందిస్తుంది. (నేడు గుర్రం జాషువా జయంతి సందర్భంగా) వ్యాసకర్త కవి, రచయిత, ఆకాశవాణి పూర్వ ప్రయోక్త 90108 23014 - ఝాన్సీ కేవీ కుమారి -
నవయుగ కవితా చక్రవర్తి జాషువా
విజయవాడ కల్చరల్ : నవయుగ కవితా చక్రవర్తి జాషువాఅని వక్తలు అభిప్రాయపడ్డారు. రసభారతి సాహితీ సంస్థ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సంస్థల సంయుక్తంగా జాషువా 45వ వర్థంతి సభలను శనివారం శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిం చాయి. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ జాషువా తన సాహిత్యం ద్వారా వేలమంది యువకవులను ప్రభావితం చేశాడన్నారు. జాషువా పిరదౌసీ కావ్యంపై డాక్టర్ జంధ్యాల పరదేశిబాబు, జాషువా కవితా వైభవం పై డాక్టర్ జంధ్యాల మహతీ శంకర్, ఆయన సాహిత్యంలో మానతా విలువలపై డాక్టర్ గుమ్మా సాంబశివరావు, జాషువా భావుకతపై పింగళి వెంకటకృష్ణారావులు ప్రసంగించారు. కార్యక్రమంలో రసభారతి సాహితీ సంస్థ అధ్యక్షుడు పి.లక్ష్మణరావు, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచంద్ పాల్గొన్నారు. అనంతరం కవి పండితులను జ్యోతిష్యశాస్త్రవేత్త రామన్, వ్యాపార వేత్త చెట్టపల్లి మారుతీ ప్రసన్నలు సత్కరించారు. -
గోదావరికి భోజనం అస్థికలా?
పద్యాన్ని ప్రజాస్వామికం చేసిన ఆధునిక కవుల్లో మహాకవి జాషువా ముఖ్యుడు. రాజమహేంద్రవరానికి జాషువాకీ ఎంతో సంబంధం ఉంది. గోదావరిపై అఖండ గౌతమి పేరుతో ఖండికలు రాశారాయన. ఆ తల్లిపై రాసిన కవితగల కాగితం గోదావరి నీళ్లల్లో వేసి ఆమెకే ఇచ్చిన అనుభూతి పొందిన మెత్తని పూవుటెడద వాడాయన. అఖండ గౌతమిపై ఆయనకుండిన భావదీప్తికి ఒక పద్యం మచ్చుకు. ‘నీపొట్టకు వారి అస్థికలు భోజనమయ్యెగదమ్మ చావులే నట్టి సుధాశరీర మహిమాన్విత! వందనమమ్మ గౌతమీ! భావం ఏమిటంటే.. ‘ఓ గోదారీ నీ గట్లపై రాజ్యవైభవ సంపాదనకై యుద్ధాలు చేసుకుంటూ ఎంతోమంది రాజులు చనిపోయారు. కానీ గౌతమీ నదీ నీకు చావు లేదు. ఎందుకంటే నీ శరీరం అమృతమైనది. రాజ్యాలకై యుద్ధాలు చేసుకునే రాజులు పుడుతూ చనిపోతుంటారు అంటూ చనిపోయే రాజుల అస్థికలు నీకు భోజనమయ్యెగదమ్మా’ అనడంలో వుంది రచనా సృజన నైపుణ్యం. గరుడ పురాణంలో చీము, నెత్తురు వంటి నదులుంటే వాటి గట్లు ఎముకలతో ఉన్నాయని వుంది. గోదావరితో ఈ ఖండికలోనే మరో పద్యంలో ‘ఓ గౌతమీ నీవు రాజమహేంద్రవరం వద్ద ప్రవహించావు. కాబట్టి మూడు పర్వాల భారతాన్ని నీవు చదువుకున్నావు. దీన్ని నీవు నీ భర్తకు అంటే కడలి మగనికి వినిపిస్తే మంచిది. అక్కడ నీకు గౌరవం వస్తుంది అనేది భావం. సరే అస్థికలు భోజనంగా తీసుకునే గోదావరి ఒక్కొక్కప్పుడు దారుణ మరణాలకు సాక్షిగా ఉండటంలో ఆశ్చర్యాన్ని కూర్చేది ఏముంటుంది?’ -
ఒకడు జాషువా
విశేష సంపుటి రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మించింది కాదు. జాషువా సాహిత్యం ఒక్క పూటలో పుట్టింది కాదు. రోమ్ నగరమూ, జాషువా కవిత్వమూ రెండూ ఒక్కటే. శ్రీకృష్ణుడు చిటికెన వేలి మీద గోవర్థన పర్వతం ఎత్తి పట్టినట్లు ఒక్క జాషువా ఒంటి చేత్తో తెలుగు పద్యాన్ని ఎత్తి పట్టాడు. తాజ్‌మహల్ కట్టడం వెనుక ఎంత కథ ఉందో, ఎంత వెత ఉందో, ఎంత శ్రమ ఉందో, ఎంత సౌందర్యం ఉందో అంతే కృషి జాషువా పద్యనిర్మాణం వెనుక దాగి ఉంది. అనంత పద్మనాభుడి ఆలయంలో అపారమైన నిధులున్నట్లే ‘కవి కోకిల’ జాషువా కవిత్వంలో కూడా అమూల్యమైన కవితా నిధులున్నాయి. వాటిని ఒక చోట చేర్చి గ్రంథరూపం తీసుకువచ్చిన వైనం ‘జాషువా సర్వలభ్య రచనల సంకలనం’. దాదాపు వందేళ్ల నాటి జాషువా తొలికృతి- ‘హిమథామార్కధర పరిణయము’ (1917) నుంచి జీవిత చరమాంకంలోని ‘వీలునామా’ వరకు జాషువా సమగ్ర సాహిత్య సమ్మేళనమే ఈ సర్వలభ్య రచనల సంకలనం. 1654 పేజీల ఈ గ్రంథంలో ఆరువేలకు పైగా పద్యాలున్నాయి. ఇది కేవలం పుస్తకం కాదు. జాషువా ప్రత్యక్షర, ప్రత్యక్ష కవితా సాక్షాత్కార రూపం. ఈ గ్రంథం ప్రచురించడం వెనుక అనితరసాధ్యమైన అమోఘమైన కృషి ఉంది. సాహిత్యమంటే ప్రాణం పెట్టే ‘మనసు ఫౌండేషన్’ రాయుడుగారికే ఇది సాధ్యం అయ్యింది. ఎందుకంటే అవి కాలే చేతులు కావు కనుక. ‘పిరదౌసి’ కావ్యంలో జాషువా చెప్పినట్టు ‘సిరి నిజంబుగ వట్టి టక్కరిది సుమ్ము’. ఆ టక్కరి సిరి మెడలు వంచి ఒడలు పులకరించి పోయేలా ఉత్తమ రచయితల గ్రంథాలు సరసమైన ధరలకు ప్రచురించడం ‘మనసు ఫౌండేషన్’ వారి ప్రచురణ సంస్కారం. ఆ పరంపర నుంచి వచ్చిందే జాషువా సమగ్ర సాహిత్య సంకలనం. వెయ్యేళ్లకు పైబడిన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక్కడే జాషువా. ఇతర కవుల పితరులకు తాగడానికి నేతులున్నాయ్. కమ్మని నూతులున్నాయ్. అక్షరాలు నేర్వడానికి అగ్రహారాలున్నాయ్. తాత ముత్తాతల, జేజి నాయనల జేజేలున్నాయ్. వారసత్వపు భేషజాలున్నాయ్. ఇవ్వేవి లేనివాడు, ఒంటరివాడు, అంటరానివాడు జాషువా ఒక్కడే. ఈ సమాజం వెలి వేసినా, తన భావాలను బలి చేసినా తానే ఒక ఆకాశమై- తానే ఒక సూర్యుడై- తానే ఒక కవి చంద్రుడై- తానే ఒక కవి కోకిలై తానొక్కడే ‘నవయుగ కవి చక్రవర్తి’యై- తెలుగు పద్యానికి అజరామరకీర్తియై- స్ఫూర్తియై నిలిచిన ఏకైక కవి ‘కళాప్రపూర్ణ’ గుఱ్ఱం జాషువా. తెలుగులో వేలాది మంది కవులున్నారు. వాళ్లు రాసిన కొన్ని రచనల్లో కొన్ని ఆశ్వాసాలు బాగుంటాయి. మరికొన్ని ఘట్టాలు కంఠతా పెట్టిస్తాయి. మరికొందరి పద్యాలు కంటతడి పెట్టిస్తాయి. కొన్ని కమ్మగా చదివిస్తాయి. కాని జాషువా ప్రతి పద్యం అమృతమయం. ఆద్యంతం రసమయం. పఠితను వెంటాడుతూ ఉంటుంది. ఏ పద్యాన్నీ పక్కన పెట్టలేము. అది నేరుగా హృదయంలోకి చొచ్చుకుని పోతుంది. వేయిరేకుల కలువగా విచ్చుకుపోతుంది. ఇది జాషువాకు మాత్రమే అబ్బిన పద్య విద్య. ఈ శిల్పం జాషువా సొంతం. జాషువా వస్తురూప పరిణామాలు తెలుసుకోవాలన్నా, ఆయన సాహిత్యంలోని దృక్పథాలను గుర్తించాలన్నా, అమేయమైన ఆయన కవితా మాధుర్యాన్ని ఆస్వాదించాలన్నా రసజ్ఞులైన పాఠకులు ఈ గ్రంథాన్ని చవి చూడవలసిందే. జాషువా తెలుగునాట ఆరాధ్యనీయుడు. అభిమానులకు ప్రాతఃస్మరణీయుడు. ‘మనసు ఫౌండేషన్’ జాషువాకిచ్చిన గొప్ప నివాళి, నిత్య నీరాజనం ఈ సంకలనం. తరతరాలు దాచుకోవలసిన ప్రతినిత్యం చదువుకోవలసిన అపురూపగ్రంథం. వెల: రూ. 400; ప్రతులకు: ఎమెస్కో లేదా అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు; మనసు ఫౌండేషన్: 00089077699 - ఎండ్లూరి సుధాకర్