పద్యాన్ని ప్రజాస్వామికం చేసిన ఆధునిక కవుల్లో మహాకవి జాషువా ముఖ్యుడు.
పద్యాన్ని ప్రజాస్వామికం చేసిన ఆధునిక కవుల్లో మహాకవి జాషువా ముఖ్యుడు. రాజమహేంద్రవరానికి జాషువాకీ ఎంతో సంబంధం ఉంది. గోదావరిపై అఖండ గౌతమి పేరుతో ఖండికలు రాశారాయన. ఆ తల్లిపై రాసిన కవితగల కాగితం గోదావరి నీళ్లల్లో వేసి ఆమెకే ఇచ్చిన అనుభూతి పొందిన మెత్తని పూవుటెడద వాడాయన. అఖండ గౌతమిపై ఆయనకుండిన భావదీప్తికి ఒక పద్యం మచ్చుకు.
‘నీపొట్టకు వారి అస్థికలు భోజనమయ్యెగదమ్మ చావులే
నట్టి సుధాశరీర మహిమాన్విత! వందనమమ్మ గౌతమీ!
భావం ఏమిటంటే.. ‘ఓ గోదారీ నీ గట్లపై రాజ్యవైభవ సంపాదనకై యుద్ధాలు చేసుకుంటూ ఎంతోమంది రాజులు చనిపోయారు. కానీ గౌతమీ నదీ నీకు చావు లేదు. ఎందుకంటే నీ శరీరం అమృతమైనది. రాజ్యాలకై యుద్ధాలు చేసుకునే రాజులు పుడుతూ చనిపోతుంటారు అంటూ చనిపోయే రాజుల అస్థికలు నీకు భోజనమయ్యెగదమ్మా’ అనడంలో వుంది రచనా సృజన నైపుణ్యం. గరుడ పురాణంలో చీము, నెత్తురు వంటి నదులుంటే వాటి గట్లు ఎముకలతో ఉన్నాయని వుంది.
గోదావరితో ఈ ఖండికలోనే మరో పద్యంలో ‘ఓ గౌతమీ నీవు రాజమహేంద్రవరం వద్ద ప్రవహించావు. కాబట్టి మూడు పర్వాల భారతాన్ని నీవు చదువుకున్నావు. దీన్ని నీవు నీ భర్తకు అంటే కడలి మగనికి వినిపిస్తే మంచిది. అక్కడ నీకు గౌరవం వస్తుంది అనేది భావం. సరే అస్థికలు భోజనంగా తీసుకునే గోదావరి ఒక్కొక్కప్పుడు దారుణ మరణాలకు సాక్షిగా ఉండటంలో ఆశ్చర్యాన్ని కూర్చేది ఏముంటుంది?’