కులపిశాచిపై యుద్ధ గళం
గత రెండు సహస్రాబ్దుల్లో ఎన్ని లక్షలమంది తమ నైపుణ్యాలను కులపిశాచి బలిపీఠంపై బలిచేశారో- జాషువా అన్నట్లు.. ఎంత కోయిల పాట.. ఎన్ని వెన్నెల వాగులు.. ఎంత రత్నకాంతి ఈ దేశంలో భగ్నమయ్యాయో?
నా కవితా వధూటి వద నంబు నెగాదిగా జూచి/ ...... భళీ భళీ యన్నవాడే మీ/దేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో/బాకున గ్రుమ్మి నట్లగున్.../ అంటూ అవ మానాగ్నిలో కాలిన జాషువా మహాకవి.
మత వృషభేంద్రముల్/పనికిమాలిన వర్ణపు దున్నపోతులున్/జతలుగ సాగి ఈ భరతజాతిని నాశనమొనర్చె/దిక్కుమాలిన కులమతోన్మాద లోకా న/మగ్గె నాలోని ప్రతిభ... అంటూ వేదనా జ్వాలల్లో రగిలిన సురగాలి తిమోతి జ్ఞానానంద కవేగాక...
టైజం కన్నా/ కేస్టిజమే భయంకరం/ మత పిచ్చి యమ ఖడ్గమే ఈ కులవాదం.../ అనేక అంచుల రాకాసి మృగం/ దీని శవాన్ని ఎలక్ట్రానిక్ దహనవాటికలో/ బూడిద కూడా దొరకనంతగా / కాల్చిపారేయాలి అంటూ మండే గుండెతో తీర్పును ప్రకటించిన నగేష్‌బాబుతోపాటు ఎందరో మహనీయులు భారతదేశంలో కుల మహమ్మారి శతాబ్దాలుగా సాగించిన, నేటికీ సాగిస్తున్న మానవతా హననాన్ని రక్తాక్షరా లతో చరిత్రలో రాశారు. దాని నిర్మూలనకు పోరాటం చేశారు. కానీ, ఈ దేశంలో చోటు చేసుకున్న అమానవీయమైన మానసిక బానిసత్వం మానవజాతి చరిత్రలో ఒక సుదీర్ఘమైన దుర్మార్గపు జాడ్యం, ఏ మందుకీ, చికి త్సకూ లొంగని జుగుప్సాకరమైన కర్మసిద్ధాంతం.
‘‘కర్మసిద్ధాంతమున నోరు కట్టివేసి/ స్వార్థలో లురు నా భుక్తిననుభవింత్రు/ కర్మయననేమొ, దానికి క్షయయేమొ..’’ అంటూ, ఈ నేలపై జరిగిన కుట్ర బట్టబయలు చేశాడు కవి జాషువా.
‘‘వాని రెక్కల కష్టంబు లేనినాడు/ సస్యరమ పండి పులకింప సంశయించు/ వాడు చెమటోడ్చి ప్రపంచమునకు/ భోజనము బెట్టువానికి భుక్తి లేదు’’ ఇదీ కర్మ సిద్ధాంతపు కుట్ర, వాని రెక్కల కష్టంతోనే తమ కడుపులు, ఖజానాలూ నింపు కోవాలి. వానికి మాత్రం భుక్తి ఉండరాదు. ఒళ్లు దాచుకునేందుకు గుడ్డ ఉండరాదు. రక్తమోడ్చి కష్టం జేసిన మేను వాల్చేందుకు చిన్నగూడు ఉండరాదు.
ఒక బలమైన శత్రువును పకడ్బందీగా నిస్స హాయుడిని చేసి, శవసమానుడిని చేసిన తర్వాతే ప్రత్యర్థి హమ్మయ్య ఇక పర్వాలేదు మనకు అని నిర్భయంగా నిద్రపోగలుగుతాడు. అభద్రతా భయమే కులం సృష్టికి మూలం. ఈ మొత్తం చరి త్రను నాలుగు పద్యపాదాల్లో ప్రపంచం ముందుం చాడు జాషువా. ‘‘ఆ యభాగ్యుని రక్తంబు నాహ రించి/యినుప గజ్జెల తల్లి జీవనము సేయు/గసరి బుసకొట్టు నాతని గాలిసోక/నాల్గు పడగల హైందవ నాగరాజు
పుట్టు బానిస, అంటరానివాడు దళితుడు, అవర్ణుడు, నీచ, నిమ్న, బడుగు, బలహీన, అణగా రిన, అబల, ఆడది, పంచములు, అగ్ర, అథమ, అవర్ణ, సవర్ణ, ఉచ్ఛ, అస్పృశ్య, మీరేమిట్లు వంటి చెత్త పదాలను భాషలో సృష్టించి ఈ దేశపౌరులకు అంటగట్టి భారతీయులంతా సమానులే అని ప్రకటి స్తున్న రాజ్యాంగం అమలులో ఉన్న దేశంలో పౌరు లను అవమానించే పదాలు వాడటం చట్ట ప్రకారం శిక్షార్హం కాదా?
2005 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ‘పాపం సరస్వతి మరొక స్త్రీని తాకి మైలపడి పోయింది’ అనే శీర్షికతో వార్తా పత్రికలు ఒక కులవివక్ష వార్తను మన కందించాయి. ఆమె గళం అద్భుతమని ఆకాశానికె త్తిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, ఆమె కులం తెలియగానే, హతాశులయ్యారు. దళిత విద్యా ర్థిని నీలం సునీత సంగీతంలో మాస్టర్స్ డిగ్రీతో బయటికి వస్తే ‘నీకెందుకమ్మా సంగీతాలు, సరిగమలూ పిలగాళ్ల కేవో ఆఆఇఈలూ చెప్పుకోక’ అంటూ ఉచిత సలహాలు పారే శారు. గడిచిన రెండు సహస్రా బ్దుల్లో ఎన్ని లక్షలమంది ఆయా రంగాల్లో తమ ప్రతిభా నైపుణ్యా లను ఈ దేశ కులపిశాచి బలి పీఠంపై బలిచేశారో.. ప్రతిష్టాత్మక మైన ఐఐటీలు, ఎయిమ్స్‌లలో కొనసాగుతున్న దళిత విద్యార్థుల ఆత్మహత్యలు, కాలి బుగ్గవుతున్న రేపటి పౌరుల కలల నింగిని తాకుతూనే ఉంది.
మూఢాచారాలు, మూర్ఖత్వాల మీద కలం యుద్ధం చేసిన ప్రఖ్యాత రచయిత చలం కులమనే పైశాచికత్వం మీద కూడా తన కలాన్ని ఝళిపిం చడం సహజంగానే ప్రాచుర్యం పొందలేదు. తన స్త్రీ గ్రంథంలో, ‘‘... దేశనాయకుడో, శాస్త్ర పండితుడో కావలసినవారిని కేవలం చెప్పులు కుట్టే పనికే అంకితం చేస్తే.. దేశానికి ఎంత నష్టం. స్త్రీలూ అంతే కదూ... ఎందరు వర్తకుల్ని, చిత్రకారుల్ని, కవుల్ని, శిల్పుల్ని, యంత్రకారుల్ని స్త్రీలలోనూ తరతరాలుగా ఈ దేశం పోగొట్టుకొంటున్నదో.. రాజ్య మేలాల్సిన స్త్రీలు అంట్లు తోముతున్నారు.’’ అన్నారాయన.
జాషువా అన్నట్లు ‘ఎంత కోయిల పాట... ఎన్ని వెన్నెల వాగులు.. ఎంత రత్న కాంతి... భగ్న మయ్యాయో..’ ‘వాడి తలపై/ నీ కాళ్లున్నందుకు/ సిగ్గుపడు/ వాడి కాళ్లను మోస్తున్న/ నీ తలలో/ రోషాగ్ని జ్వలిస్తేనే/ నిచ్చెన మెట్లు/ కాలిబుగ్గ య్యేది’. అప్పుడే జాషువా జన్మదినం నవ్వులు చిందిస్తుంది.
(నేడు గుర్రం జాషువా జయంతి సందర్భంగా)
వ్యాసకర్త కవి, రచయిత,
ఆకాశవాణి పూర్వ ప్రయోక్త 90108 23014
- ఝాన్సీ కేవీ కుమారి