ఆ ప్రయాణంలో నాతో నేను మాట్లాడుకున్నాను
లైఫ్ బుక్
మా నాన్నగారు బొమ్మలు గీస్తారు. కవితలు రాస్తారు. వంట బాగా చేస్తారు. తోటపని చేస్తారు...ఈ అన్నిట్లోకి నాకు నచ్చిన విషయం ఆయనలోని సున్నితత్వం. సున్నితంగా ఉన్న వాళ్ల దగ్గరికి బొమ్మలైనా, కవిత్వమైనా ఆప్యాయంగా వస్తాయి!
వేసవి సెలవుల్లో మా నాన్నమ్మ వాళ్లు ఉండే బారీపడ(ఒడిషా) అనే ఒక మోస్తరు పట్నానికి వెళ్లేవాళ్లం. ఎన్ని నగరాలకు వెళ్లినా... బారీపడ జ్ఞాపకాలు మాత్రం ప్రత్యేకమైనవి. రైలు నుంచి బస్సు, బస్సు నుంచి రిక్షా... ఇలా దీర్ఘ ప్రయాణం చేసిన తరువాతగానీ ఆ పట్నానికి చేరడానికి వీలయ్యేది కాదు. ఇప్పుడు మాత్రం విమానం ఎక్కి ఆ తరువాత కారు ఎక్కితే చాలు అది వస్తుంది. కానీ దీర్ఘమైన ప్రయాణమే నాకు నచ్చుతుంది. ఆ ఊళ్లో ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. అవి పేరుకు మత సంబంధమైన ఉత్సవాలుగా అనిపించినా నిజానికవి... సామాజిక, సాంస్కృతిక ఉత్సవాలు. ఆలయ ఉత్సవాల సందర్భంగా ఊరంతా కొత్త కళతో శోభించేది.
నేను బాగా ఆలోచించిగానీ నిర్ణయం తీసుకోలేను. ఈ క్రమంలో నెల కావచ్చు...ఆర్నెల్లు కావచ్చు...సంవత్సరం కూడా కావచ్చు. ఉదా: భౌగోళికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత...దేనిలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేయాలో అర్థం కాలేదు. ‘‘ఓ ఏడాది విరామం తీసుకోవాలనుకుంటున్నాను’’ అని నాన్నతో చెప్పి చాలా ప్రాంతాలు ప్రయాణించాను. నాతో నేను మాట్లాడుకున్నాను. నా ఇష్టాన్ని వెతుకున్నాను. ప్రయాణం తరువాత ఒక పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధించాను.
ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలు తిరిగినా పుట్టి పెరిగిన ప్రాంతం అంటేనే ఎవరికైనా ఇష్టం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే...తల్లి నుంచి దూరమైనట్లు అనిపిస్తుంది.
ఢిల్లీలో పుట్టి పెరిగిన నాకు ఆ నగరాన్ని వదలాలంటే ఇబ్బం దిగా ఉంటుంది. ఢిల్లీకీ నాకూ మధ్య బలమైన ఆకర్షణ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది.
- నందితా దాస్, ప్రముఖ నటి