Life Book
-
ఆ వార్తలో నిజం లేదు!
లైఫ్ బుక్ 'లేడీ వర్సెస్ రికీ బాల్’ సినిమాలో సహాయక పాత్రలో నటించిన పరిణితీ చోప్రా ‘ఇష్క్‌జాదే’ ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీతో ఫసీ’ మొదలైన సినిమాలలో హీరోయిన్గా తన ప్రతిభ చాటుకున్నారు. ఆమె మనసులోని మాటలు... కాలమే నిర్ణయిస్తుంది... ‘నేను గ్లామరస్ పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను’ ‘గ్లామరస్ పాత్రలు చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు’ ఇలా అనుకొని ఎవరూ సినిమాల్లోకి అడుగు పెట్టరు. గ్లామరస్ పాత్రలు చేయడం, చేయకపోవడం అనేది కాలమే నిర్ణయిస్తుంది తప్ప మన ఇష్టానిష్టాలు నిర్ణయించవు. అందుకే, గ్లామరస్ పాత్రలు చేయడానికి ఎంతగా ఇష్టపడతానో, సహజత్వానికి దగ్గర ఉండే గ్లామర్ లేని పాత్రలనూ అంతే ఇష్టపడతాను. ఒత్తిడిని వదులుకోవాలి... డైలాగులను తేలిగ్గా చెప్పడం కోసం ఒకటికి రెండు సార్లు మననం చేసుకోవడం నా అలవాటు. ఇది మంచి అలవాటే కావచ్చుగానీ మననం చేసుకునే క్రమంలో ఒత్తిడికి లోనవుతుంటాను. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ ముఖ్యం... సినిమా రంగంలో ఉన్నంత మాత్రాన క్రమశిక్షణకు దూరంగా ఉండాలనేమీ లేదు. ఏ కొద్దిమందినో చూసి ‘సినిమా వాళ్లకు క్రమశిక్షణ ఉండదు’ అనుకోవద్దు. సినిమా అనే కాదు ఏ రంగంలోనైనా క్రమశిక్షణ అనేది ముఖ్యమని నమ్ముతాను. ఆ వార్తలో నిజం లేదు... ‘హ్యాపీ న్యూ ఇయర్’ తరువాత షారుక్ ఖాన్ చేయబోయే సినిమాలో కథానాయికగా నటిస్తున్నాను అనే వార్తలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి పరిచితులు, అపరిచితులు, అభిమానుల నుంచి అభినందన సందేశాల వరద మొదలైంది. నిజానికి ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే షారుక్‌ను అడిగిచూడండి! - పరిణితీ చోప్రా, హీరోయిన్ -
కాలేజీ జీవితాన్ని మిస్ అయ్యాను
లైఫ్ బుక్ మా నాన్న నిరంజన్ దేశాయ్ ఎన్నో నాటకాల్లో నటించారు. నాటకం కోసం నాన్న, మామయ్య రిహార్సల్స్ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి చూసేదాన్ని. ఈ ప్రభావంతోనే సినిమాల మీద, నటన మీద ఆసక్తి పెరిగింది. సినిమాలు చూడడం కోసం తరచుగా కాలేజీ ఎగ్గొట్టేదాన్ని. ఇలా చేయడం వల్ల కాలేజీ జీవితంలో ఉండే ఉత్సాహాన్ని, భిన్నమైన అనుభవాలను కోల్పోయాను. ఒకే తరహా ఆలోచనలతో ఉన్నవారు మాట్లాడుకుంటే కాలమే తెలియదు. ఉదాహరణకు మా నాన్న, నేను మాట్లాడుకుంటుంటే ఆ మాటల్లో సినిమా ప్రపంచం తప్ప ఏదీ వినిపించదు. కొన్నిసార్లయితే మేము గుజరాత్ గురించి ముఖ్యంగా సూరత్ గురించి కూడా ఇష్టంగా మాట్లాడుకుంటాం. మన మూలాలను ప్రేమించడానికి, వాటి గురించి మాట్లాడుకోవడానికి కాలం అనేది ప్రమాణం కాదు. సంవత్సరాల తరబడి ఒకచోట గడిపిన వారు కూడా మూలాలను మరచిపోవచ్చు. అయితే సూరత్‌లో గడిపింది నాలుగు సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ నా సంప్రదాయ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. స్త్రీ సాధికారికతకు సంబంధించిన సినిమాలు, స్త్రీలపై జరిగే రకరకాల హింసను నిరసిస్తూ...సందేశాత్మక చిత్రాలు రావడం మంచిదే. అయితే సినిమాలతో మాత్రమే ప్రజలలో మార్పు వస్తుందనుకోను. మార్పుకు అవసరమైన సాధానాలలో అదొకటి మాత్రమే. ఏదైనా గొప్ప సినిమా చూస్తున్నప్పుడు... ‘‘ఈ పాత్ర నేను చేసి ఉంటే ఎంత బాగుండేది’’ అనిపిస్తుంది. ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకుంటూ, ఊహల్లో నటిస్తూ ఎంతో సంతోషిస్తాను. ఆశావాదమనేది ఎప్పుడూ ఉత్సాహం ఇస్తుంది. ‘‘సినీ పరిశ్రమలో నాకంటూ ఒక పాత్ర కాచుకొని ఉంది. ఆ పాత్ర చేస్తే నా నటనలోని మరో కోణం బయటపడుతుంది. లోకం ప్రశంసిస్తుంది’’ అనుకుంటాను. - ప్రాచీ దేశాయ్, హీరోయిన్, బోల్‌బచ్చన్ ఫేమ్ -
ఆ ప్రయాణంలో నాతో నేను మాట్లాడుకున్నాను
లైఫ్ బుక్ మా నాన్నగారు బొమ్మలు గీస్తారు. కవితలు రాస్తారు. వంట బాగా చేస్తారు. తోటపని చేస్తారు...ఈ అన్నిట్లోకి నాకు నచ్చిన విషయం ఆయనలోని సున్నితత్వం. సున్నితంగా ఉన్న వాళ్ల దగ్గరికి బొమ్మలైనా, కవిత్వమైనా ఆప్యాయంగా వస్తాయి! వేసవి సెలవుల్లో మా నాన్నమ్మ వాళ్లు ఉండే బారీపడ(ఒడిషా) అనే ఒక మోస్తరు పట్నానికి వెళ్లేవాళ్లం. ఎన్ని నగరాలకు వెళ్లినా... బారీపడ జ్ఞాపకాలు మాత్రం ప్రత్యేకమైనవి. రైలు నుంచి బస్సు, బస్సు నుంచి రిక్షా... ఇలా దీర్ఘ ప్రయాణం చేసిన తరువాతగానీ ఆ పట్నానికి చేరడానికి వీలయ్యేది కాదు. ఇప్పుడు మాత్రం విమానం ఎక్కి ఆ తరువాత కారు ఎక్కితే చాలు అది వస్తుంది. కానీ దీర్ఘమైన ప్రయాణమే నాకు నచ్చుతుంది. ఆ ఊళ్లో ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. అవి పేరుకు మత సంబంధమైన ఉత్సవాలుగా అనిపించినా నిజానికవి... సామాజిక, సాంస్కృతిక ఉత్సవాలు. ఆలయ ఉత్సవాల సందర్భంగా ఊరంతా కొత్త కళతో శోభించేది. నేను బాగా ఆలోచించిగానీ నిర్ణయం తీసుకోలేను. ఈ క్రమంలో నెల కావచ్చు...ఆర్నెల్లు కావచ్చు...సంవత్సరం కూడా కావచ్చు. ఉదా: భౌగోళికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత...దేనిలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేయాలో అర్థం కాలేదు. ‘‘ఓ ఏడాది విరామం తీసుకోవాలనుకుంటున్నాను’’ అని నాన్నతో చెప్పి చాలా ప్రాంతాలు ప్రయాణించాను. నాతో నేను మాట్లాడుకున్నాను. నా ఇష్టాన్ని వెతుకున్నాను. ప్రయాణం తరువాత ఒక పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధించాను. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలు తిరిగినా పుట్టి పెరిగిన ప్రాంతం అంటేనే ఎవరికైనా ఇష్టం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే...తల్లి నుంచి దూరమైనట్లు అనిపిస్తుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన నాకు ఆ నగరాన్ని వదలాలంటే ఇబ్బం దిగా ఉంటుంది. ఢిల్లీకీ నాకూ మధ్య బలమైన ఆకర్షణ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. - నందితా దాస్, ప్రముఖ నటి -
ఒకే మనిషిలో... రెండు కోణాలూ చూడాలి!
లైఫ్ బుక్ సినిమా నేపథ్యం ఉన్న వాళ్లు అలవోకగా నటిస్తారని, లేని వాళ్లు కష్టపడాల్సి వస్తుందనే దాన్ని నమ్మను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు సినిమా నేపథ్యం లేదు. అయినా ‘నటించగలను’ అనే ఆత్మవిశ్వాసం ఉండేది. మొదట్లో నా నటనపై విమర్శలు వచ్చేవి. కొందరైతే ‘‘ఇషాకు నటించడం కూడా తెలుసు!’’ అని వ్యంగ్యంగా రాసే వాళ్లు. నాకు కోపం రాలేదు. నటన మెరుగు పరుచుకోవాలనే పట్టుదల మాత్రం పెరిగింది. అలా క్రమంగా నా నటనను మెరుగుపరుచుకున్నాను. విమర్శించిన వాళ్ల నుంచే ప్రశంసలు అందుకున్నాను. సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని పరిస్థితులే కల్పిపిస్తాయి. మా అమ్మకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు చాలాకాలం పాటు ఆసుపత్రికి తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో నాకు నేనుగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను. తెలియని విషయాలను అడిగి తెలుసుకున్నాను. సినిమా ఫీల్డ్‌లో నాకంటూ గాడ్‌ఫాదర్, సలహాదారులు ఎవరూ లేరు. మంచి అయినా, చెడు అయినా నా నిర్ణయాలు నేనే తీసుకున్నాను. సొంత నిర్ణయాలు తీసుకోవడంలో ఆత్మసంతృప్తి కూడా ఉంది. ఒక వ్యక్తికి ఉన్న రెండు కోణాలను చూడాలి. ఒకే కోణంలో చూస్తే అపార్థాలు పెరుగుతాయి. ఉదా: డెరైక్టర్ సాజిత్‌ఖాన్ సెట్లో గట్టిగా అరిచేవాడు. షూటింగ్ అయి పోయిన తరువాత మాత్రం ఆత్మీయంగా మాట్లాడేవాడు. ‘అరుస్తున్నాడు కదా!’ అని మనసులో కోపం పెట్టుకుంటే అతడిని ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయేదాన్ని. ఏ విషయానికైనా సరే అధిక ప్రాధాన్యత ఇవ్వను. అధిక ప్రాధాన్యత వల్ల ఆందోళన తప్ప ఏమీ మిగలదు. ఒత్తిడి భారంతో పొరపాట్లు చేస్తుంటాం. - ఈశా గుప్తా, హీరోయిన్ -
ఇల్లు దాటాక స్వేచ్ఛ విలువ తెలిసింది!
లైఫ్ బుక్: వాణీకపూర్ మా నాన్నకు జంతువుల హక్కులకు సంబంధించి ఒక స్వచ్ఛంద సంస్థ ఉండేది. దీంతో మా ఫామ్‌హౌజ్‌లో ఎటు చూసిన బాతులు, శునకాలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు ఉండేవి. బుజ్జికుక్కపిల్లలు బయట ఎక్కడైనా దీనస్థితిలో కనిపించినా, మురికిగా కనిపించినా ఇంటికి తెచ్చేదాన్ని. వాటిని శుభ్రంగా ఉంచేదాన్ని. నాకు అలా జంతువులన్నీ ఫ్రెండ్స్‌గా మారిపోయాయి. మనుషులతో కంటే వాటితో ఆడుకున్నదే ఎక్కువ. చిన్నప్పుడు చాలా నియమనింబంధనల మధ్య పెరిగాను. కొంత కాలానికి నాకు స్వేచ్ఛ కావాలనిపించింది. ఢిల్లీలో టూరిజం కోర్సు చేసినప్పుడుగానీ నాకు ఆ అవకాశం రాలేదు. అప్పుడు నేను మొదటి సారిగా హాస్టల్లో ఉన్నాను. స్వేచ్ఛ విలువ ఏమిటో అప్పుడు తెలిసింది. అయినప్పటికీ, పబ్‌లకు, డిస్కోలకు వెళ్లడం కంటే ఇంట్లో జరిగే విందులనే బాగా ఇష్టపడతాను. నాలో ఆధునిక భావాలు ఉన్నప్పటికీ... నా హృదయం మాత్రం పాత ప్రపంచంలోనే ఉంది! కొన్నిసార్లు అడగకుండానే అదృష్టం ఆప్యాయంగా పలకరిస్తుంది. మోడల్ కావాలనేది నా కోరిక. అయితే నా కోరికకు నా బరువు ప్రతిబంధకంగా కనిపించేది. అయినప్పటికీ ఏదో ఆశ. 75 కిలోల బరువుతో ఢిల్లీలోని ఒక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీకి ఇంటర్వ్యూకు వెళ్లాను. ఎంపికవుతానని పొరపాటున కూడా అనుకోలేదు. అదేం అదృష్టమోగానీ ఎంపికయ్యాను. ఆ తరువాత చాలా బరువు తగ్గాను. ‘ఇది జరగాలి’ ‘అది జరగాలి’ అనే కోరికలు ఏమీ లేవు. జరగాల్సి ఉంటే కచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను. నేను పుట్టి పెరిగిన వాతావరణంలో సినిమాల్లో నటించాలనే ఊహే రాదు. నేను కూడా సినిమాల్లోకి రావాలనే ఎప్పుడు అనుకోలేదు. కానీ విధి ఇలా నిర్ణయించింది! -
పిల్లలు నన్ను తిట్టుకున్నా సరే...
లైఫ్ బుక్ నా జీవితంలో ఇప్పటి వరకు ఏ విషయంలోనూ పశ్చాత్తాపం ప్రకటించలేదు. మంచో చెడో...నేను తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనుకుంటాను. ప్రతికూల, అనుకూల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతిదానిలోనూ కొద్దో గొప్పో మంచి విషయాన్ని నేర్చుకున్నాను. టైమ్ సరిపోవడం లేదు...అనే మాట తరుచుగా వినిపిస్తుంటుంది. పక్కా ప్రణాళిక ఉంటే అదేమీ అసాధ్యం కాదనే విషయం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అయిందిటికల్లా మేల్కోవడం, ఆరింటికి జిమ్‌లో గడపడం, ఎనిమిదింటికల్లా పిల్లల్ని స్కూల్‌కు సిద్ధం చేయడం...ఇలా ప్రతి పని పక్కాగా చేస్తాను. ఒక్కసారి అలవాటు అయితే ఏదైనా సులువు అవుతుంది. నేను స్ట్రిక్ట్ మదర్‌ను. పిల్లలు నన్ను ఒక విలన్‌గా పరిగణించి తిట్టుకున్నా ఫరవాలేదు. పిల్లలకు వారి హద్దుల గురించి తెలియజేస్తుంటాను. ఒక పని ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? అనేది పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తుంటాను. అలా అని నా రూల్స్ శిలాశాసనాలు కావు. అప్పుడప్పుడూ వెసులుబాటు కల్పిస్తుంటా. ఉదాహరణకు ఒక రోజు మా అమ్మాయికి ఒక రూల్ పాటించాలనిపించలేదు. ‘నీ ఇష్టం’ అంటాను. మరుసటి రోజు మాత్రం రూల్ రూలే! - కాజల్ -
అద్దంలో చూసుకోవడానికీ భయపడేదాన్ని!
లైఫ్ బుక్ నాది చాలా సున్నిత హృదయం. ఎవరైనా నాతో కఠినంగా మాట్లాడితే తట్టుకోలేను. మరే పని లేనట్లు రోజంతా ఆ విషయం గురించే ఆలోచించి తెగ బాధపడిపోతుంటాను. దీని నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాను. సలహాలు అన్నివేళలా ఉపకరించవని చెప్పడానికి నా సొంత అనుభవాలే నిదర్శనం. ఉదా: ‘డర్టీ పిక్చర్’ సినిమాను ఒప్పుకోవద్దని చాలామంది సన్నిహితులు చెప్పారు. ‘ఆ సినిమా చేస్తే నీ కెరీర్ ముగిసినట్లే’ అని కూడా అన్నారు. నేను వాటిని చాలా తేలికగా తీసుకున్నాను. నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. మార్చుకొని ఉంటే చాలా నష్టపోయేదాన్ని. ఎప్పుడు పరాజయం ఎదురైనా ‘మేము ఉన్నాం కదా!’ అని నా కుటుంబం, స్నేహితులు ధైర్యాన్ని ఇచ్చేవారు. కొన్నిసార్లు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడేదాన్ని. ఆ అద్దంలో నా అంతరాత్మ ప్రత్యక్షమై ‘నువ్వెప్పుడూ విజయం సాధించలేవు’ అని తిడుతున్నట్లు అనిపించేది. నేను చేసే పాత్రలు ఆ సినిమా వరకు మాత్రమే పరిమితం కావు. ఆ పాత్రలు నాతో పాటు ఇంటికి నడిచొస్తాయి. నవ్విస్తాయి. ధైర్యాన్ని ఇస్తాయి. - విద్యాబాలన్ -
బిఫోర్ దే పాస్...
ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య చిన్న చిన్న గ్రామాలలో నివసించే ఆదివాసీలు ద్రోక్పాస్ల గురించి పెద్ద విషయాలే చెప్పు కోవచ్చు. విషాదమేమిటంటే ఇప్పుడు వారి జనాభా రెండు వేల అయిదు వందలు మాత్రమే! ద్రోక్పాస్లు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా... ఎన్నో ఆదివాసుల తెగలు ప్రమాదం అంచున ఉన్నాయి. తన మిత్రుడు ఒక రోజు, ప్రమాదకర స్థితిలో ఉన్న ఆదివాసి తెగల గురించి చెప్పినప్పుడు బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ జిమ్మి నెల్సన్ ఆశ్చర్యపడ్డాడు. ఆ ఆశ్చర్యానికి దుఃఖం కూడా తోడైంది. ‘బిఫోర్ దే పాస్ అవే’ అనుకున్నాడేమో భుజానికి కెమెరా తగిలించుకొని ప్రపంచం మొత్తం తిరిగాడు. అది మామూలు కెమెరా కాదు...యాభై ఏళ్ల ‘ప్లేట్ ఫిల్మ్ కెమెరా’ అద్భుతమైన స్పష్టత దాని సొంతం. ‘‘వారి దగ్గర డబ్బులేక పోవచ్చుగానీ చాలా సంపన్నులు. ఈ విషయాన్ని ఆధునిక ప్రపంచానికి చాటడానికి బిఫోర్ దే పాస్ అవే... ప్రాజెక్ట్ చేపట్టాను. డబ్బుతో కొలవలేని గొప్ప సంస్కృతి వారి సొంతం’’ అంటాడు నెల్సన్. ‘బిఫోర్ దే పాస్ అవే’ ఫొటో సిరీస్‌లో ఫొటోలు మాత్రమే కాదు...కన్నీటి తడి కూడా కనిపిస్తుంది. ఆర్ట్ ఎటాక్! సమ్‌థింగ్ స్పెషల్ విక్టర్ గీసే బొమ్మలు ఆహా అనిపించడంతో పాటు నోరూరిస్తాయి. అరవై అయిదు సంవత్సరాల ఈ బ్రెజిల్ ఆర్టిస్ట్ నట్స్, గ్రేప్స్, బేబికార్న్...మొదలైన వాటిని ఉపయోగించి బొమ్మలు గీస్తుంటాడు. తన కళకు ప్రత్యామ్నాయ కళ అని కూడా పేరు పెట్టుకున్నాడు. కొందరేమో ‘ఆర్ట్ ఎటాక్’ అని సరదాగా పిలుస్తారు. గతంలో ఆర్ట్ డెరైక్టర్‌గా పని చేసిన విక్టర్ ‘‘నా బొమ్మలు పిల్లలతో పాటు పెద్దలను అలరిస్తున్నాయి’’ అని మురిసిపోతు న్నాడు. బిస్కట్లతో రూపొందించిన బొమ్మలకైతే భలే క్రేజు. ఈ బొమ్మలను తన ఫేస్బుక్ పేజీలో పెట్టినప్పుడు మంచి స్పందన వచ్చింది. కొందరు వీటి నుంచి స్ఫూర్తి పొంది తాము కూడా తయారుచేయడం మొదలెట్టారు. అందుబాటులో ఉండే పదా ర్థాలు, వస్తువులను ఉపయోగించి బొమ్మలు గీయడానికి ప్రాధా న్యత ఇస్తాడు విక్టర్. డిష్ క్లాత్స్, ఫ్లోర్ క్లాత్స్...ఇలా ఏవైనా సరే. సాధారణ వస్తువులతో అసాధారణమైన చిత్రాలను సృష్టించడం తన పని అని చెబుతాడు. ‘‘మనసు బాగ లేనప్పుడు... బొమ్మలు గీస్తాను. వాటిని చూస్తే కొత్త ఉత్సాహం వస్తుంది. నా ఆర్ట్ నాకు థెరపీలాగా పని చేస్తుంది’’ అంటున్నాడు విక్టర్. యుద్ధంలో గెలిస్తేనే... లైఫ్ బుక్- కత్రినా కైఫ్ ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోకపోతే ఆరోజు వృథా అయిపోయినట్లు అనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోకపోతే సరికొత్తగా ఏమీ చేయలేం. నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాలను పక్కనపెట్టడం కాకుండా వాటిని తగిన సందర్భాలలో అన్వయించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఒక కెరీర్‌ను ఎంచుకున్నామంటే... నిరంతరం మనతో మనం యుద్ధం చేయడమే. ప్రతికూలత అనే శత్రువులను ఆ యుద్ధంలో సంహరించడం మీదే కెరీర్లో మన విజయం ఆధారపడి ఉంటుంది. ఈ దేశంలో పెరగలేదు, హిందీ రాదు...ఇవి నాకు మైనస్ పాయింట్లుగా నిలిచాయి. ఈ దేశంలో మళ్లీ పెరిగే అవకాశం లేకపోవచ్చుగానీ హిందీ నేర్చుకునే అవకాశం మాత్రం ఉందిగా. ఈ పని కోసం కష్టపడ్డాను. విమర్శ అనేది బాధ పెట్టవచ్చుగాక...కానీ దాన్ని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోను. ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి మంచిగా మాట్లాడడం అనేది అరుదు. ‘ఇది లోకనైజం’ అని అన్ని విమర్శలనూ ఒకే గాటన కట్టలేం. కొన్ని విమర్శలు మన విజయానికి మెట్లలాంటివి. కుండల్లో గుర్రాలు పరుగెత్తిస్తాడు! మన జాతీయాలు ‘టీలు తాగారా... టిఫిన్లు చేశారా?’ ‘అరే... ఎక్కడ చచ్చార్రా... ఇక్కడ ఒక్కడూ లేడూ’ ‘అది ఇలా కాదు... ఇలా చేయండి’ ఇలాంటి డైలాగులు మన నిత్యజీవితంలో ఎన్నోచోట్ల వినబడుతుంటాయి. హడావిడి ఎక్కువ చేసి, పనేమీ చేయని వాళ్లు మనకు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ల కోసమే పుట్టిన జాతీయం- ‘కుండల్లో గుర్రాలు’ తాము ఏమాత్రం పని చేయకుండా ఇతరులను తెగ హడావిడి పెట్టేవాళ్లను ‘‘అబ్బో... కుండల్లో గుర్రాలు పరుగెత్తిస్తున్నాడు’’ అనో ‘‘ఏమీ చేయలేడు...కుండల్లో గుర్రాలు పరుగెత్తించడంలో మాత్రం సిద్ధహస్తుడు’’ అంటుంటారు. గుర్రాలను ఎక్కడ పరుగెత్తిస్తారు? రోడ్డు మీదో, ఊరి బయటో. మరి కుండల్లో పరుగెత్తిస్తారా ఎవరైనా! వంట గురించి ఏమీ తెలియకపోయినా వంటగదిలో దూరి ‘అలా చేయాలి ఇలా చేయాలి’ అని ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ల విషయంలోనూ ఇది ఉపయోగిస్తారు.