కాలేజీ జీవితాన్ని మిస్ అయ్యాను
లైఫ్ బుక్
మా నాన్న నిరంజన్ దేశాయ్ ఎన్నో నాటకాల్లో నటించారు. నాటకం కోసం నాన్న, మామయ్య రిహార్సల్స్ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి చూసేదాన్ని. ఈ ప్రభావంతోనే సినిమాల మీద, నటన మీద ఆసక్తి పెరిగింది. సినిమాలు చూడడం కోసం తరచుగా కాలేజీ ఎగ్గొట్టేదాన్ని. ఇలా చేయడం వల్ల కాలేజీ జీవితంలో ఉండే ఉత్సాహాన్ని, భిన్నమైన అనుభవాలను కోల్పోయాను.
ఒకే తరహా ఆలోచనలతో ఉన్నవారు మాట్లాడుకుంటే కాలమే తెలియదు. ఉదాహరణకు మా నాన్న, నేను మాట్లాడుకుంటుంటే ఆ మాటల్లో సినిమా ప్రపంచం తప్ప ఏదీ వినిపించదు. కొన్నిసార్లయితే మేము గుజరాత్ గురించి ముఖ్యంగా సూరత్ గురించి కూడా ఇష్టంగా మాట్లాడుకుంటాం.
మన మూలాలను ప్రేమించడానికి, వాటి గురించి మాట్లాడుకోవడానికి కాలం అనేది ప్రమాణం కాదు. సంవత్సరాల తరబడి ఒకచోట గడిపిన వారు కూడా మూలాలను మరచిపోవచ్చు. అయితే సూరత్‌లో గడిపింది నాలుగు సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ నా సంప్రదాయ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు.
స్త్రీ సాధికారికతకు సంబంధించిన సినిమాలు, స్త్రీలపై జరిగే రకరకాల హింసను నిరసిస్తూ...సందేశాత్మక చిత్రాలు రావడం మంచిదే. అయితే సినిమాలతో మాత్రమే ప్రజలలో మార్పు వస్తుందనుకోను. మార్పుకు అవసరమైన సాధానాలలో అదొకటి మాత్రమే. ఏదైనా గొప్ప సినిమా చూస్తున్నప్పుడు... ‘‘ఈ పాత్ర నేను చేసి ఉంటే ఎంత బాగుండేది’’ అనిపిస్తుంది. ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకుంటూ, ఊహల్లో నటిస్తూ ఎంతో సంతోషిస్తాను.
ఆశావాదమనేది ఎప్పుడూ ఉత్సాహం ఇస్తుంది. ‘‘సినీ పరిశ్రమలో నాకంటూ ఒక పాత్ర కాచుకొని ఉంది. ఆ పాత్ర చేస్తే నా నటనలోని మరో కోణం బయటపడుతుంది. లోకం ప్రశంసిస్తుంది’’ అనుకుంటాను.
- ప్రాచీ దేశాయ్, హీరోయిన్, బోల్‌బచ్చన్ ఫేమ్