ఒకే మనిషిలో... రెండు కోణాలూ చూడాలి!
లైఫ్ బుక్
సినిమా నేపథ్యం ఉన్న వాళ్లు అలవోకగా నటిస్తారని, లేని వాళ్లు కష్టపడాల్సి వస్తుందనే దాన్ని నమ్మను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు సినిమా నేపథ్యం లేదు. అయినా ‘నటించగలను’ అనే ఆత్మవిశ్వాసం ఉండేది. మొదట్లో నా నటనపై విమర్శలు వచ్చేవి. కొందరైతే ‘‘ఇషాకు నటించడం కూడా తెలుసు!’’ అని వ్యంగ్యంగా రాసే వాళ్లు. నాకు కోపం రాలేదు. నటన మెరుగు పరుచుకోవాలనే పట్టుదల మాత్రం పెరిగింది. అలా క్రమంగా నా నటనను మెరుగుపరుచుకున్నాను. విమర్శించిన వాళ్ల నుంచే ప్రశంసలు అందుకున్నాను.
సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని పరిస్థితులే కల్పిపిస్తాయి. మా అమ్మకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు చాలాకాలం పాటు ఆసుపత్రికి తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో నాకు నేనుగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను. తెలియని విషయాలను అడిగి తెలుసుకున్నాను. సినిమా ఫీల్డ్‌లో నాకంటూ గాడ్‌ఫాదర్, సలహాదారులు ఎవరూ లేరు. మంచి అయినా, చెడు అయినా నా నిర్ణయాలు నేనే తీసుకున్నాను. సొంత నిర్ణయాలు తీసుకోవడంలో ఆత్మసంతృప్తి కూడా ఉంది.
ఒక వ్యక్తికి ఉన్న రెండు కోణాలను చూడాలి. ఒకే కోణంలో చూస్తే అపార్థాలు పెరుగుతాయి. ఉదా: డెరైక్టర్ సాజిత్‌ఖాన్ సెట్లో గట్టిగా అరిచేవాడు. షూటింగ్ అయి పోయిన తరువాత మాత్రం ఆత్మీయంగా మాట్లాడేవాడు. ‘అరుస్తున్నాడు కదా!’ అని మనసులో కోపం పెట్టుకుంటే అతడిని ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయేదాన్ని. ఏ విషయానికైనా సరే అధిక ప్రాధాన్యత ఇవ్వను. అధిక ప్రాధాన్యత వల్ల ఆందోళన తప్ప ఏమీ మిగలదు. ఒత్తిడి భారంతో పొరపాట్లు చేస్తుంటాం.
- ఈశా గుప్తా, హీరోయిన్