prachi desai
-
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న 'మిస్టరీ థ్రిల్లర్' సినిమా
మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించిన 'సైలెన్స్' (Silence... Can You Hear It?) అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమా 2021లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అది కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్నడం విశేషం. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి సైలెన్స్ చిత్రం మెప్పించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'సైలెన్స్ 2 ది నైట్ ఔల్ బార్ షూటౌట్' మీ ముందకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అబన్ బరూచా దేవ్‌హన్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయీ, ప్రాచీ దేశాయ్ కలిసి నటించారు. ఏప్రిల్ 16 నుంచి సైలెన్స్ 2 సినిమా జీ5లో డైరెక్ట్‌గా విడుదల కానుంది. ప్రస్తతం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. జీ స్టూడియోస్, క్యాండిడ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నగరంలో జరుగుతున్న వరుస హత్యల వెనకున్న హంతకులను పట్టుకునే మిస్టరీని ఏసీపీ అవినాష్ వర్మగా నటించిన మనోజ్ ఏ విధంగా చేదించాడనేది కథకు ప్రధాన మూలం. కథలో ఎన్నో ట్విస్ట్‌లతో పాటు థ్రిల్లింగ్‌ను పంచే సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 16న విడుదల కానున్న సైలెన్స్ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందన జీ5 ప్రకటించింది. -
ఆల్రెడీ పెళ్లైన దర్శకుడిని ప్రేమించిన హీరోయిన్!
రోహిత్ శెట్టి.. మోడర్న్ బాలీవుడ్లో కమర్షియల్లీ ఎంటర్టైనింగ్ సినిమా ఫార్ములాను కనిపెట్టిన దర్శకుడు! హీరో వర్షిప్‌ను డైరెక్టర్ వర్షిప్‌గా బదలాయించిన వాడు.. టెక్నీషియన్స్ ఇమేజ్ను ఇనుమడింప చేసినవాడు! కెరీర్ గ్రాఫ్‌లో ఆకాశంతో పోటీపడ్తున్న ఈ ఫిల్మ్ మేకర్ ప్రేమ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్‌గానే ఉండిపోయాడు! అతని ప్రేమిక పేరు ప్రాచీ దేశాయ్. ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’లో వన్ ఆఫ్ ది హీరోయిన్స్. ఈ ప్రేమ కథా సాదాసీదాగానే ప్రారంభమైంది. ఆ సంగతి చెప్పుకునే ముందు రోహిత్ శెట్టి పెళ్లి జీవితం గురించి తెలుసుకోవాలి. అతనిది పెద్దలు కుదిర్చిన వివాహం. భార్య పేరు మాయా. ఒక కొడుకు కూడా. ఇషాన్ శెట్టి. బాలీవుడ్‌లోని రోహిత్ శెట్టి పరిచయస్తుల ప్రకారం.. మరీ అన్యోన్య దాంపత్యం కాకపోయినా పొరపొచ్చాలతో సతమతమవుతున్న సంసారమేం కాదు. ప్రాచీతో ప్రేమలో పడ్డాడు రోహిత్. ‘బోల్ బచ్చన్’ సమయంలో. ఆ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌కు చెల్లెలుగా నటించింది ప్రాచీ దేశాయ్. నిజానికి ఆ పాత్ర కోసం ముందుగా జెనీలియా డిసూజాను అనుకున్నారు. ఆమె సైన్ కూడా చేసింది. ఎందుకనో సినిమా మొదలయ్యే టైమ్‌కి జెనీలియా తప్పుకుంది. ప్రాచీ చేరింది. రోహిత్ ప్రేమ మొదలైంది. ఫిదాకాక తప్పలేదు ‘బోల్ బచ్చన్’ చిత్రీకరణ జైపూర్‌లో జరుగుతోంది. సీన్స్ వివరిస్తున్నప్పుడు ప్రాచీని చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం వచ్చింది రోహిత్‌కు. వృత్తిపట్ల ఆమె నిబద్ధత.. పాపులారిటీ మాయని పట్టించుకోని ఆమె స్థితప్రజ్ఞత అతనికి బాగా నచ్చాయి. ఆకర్షణకులోను చేసే అందమెలాగూ ఉండనే ఉంది. ప్రేమ పెంచుకోవడానికి ఈ కారణాలు చాలు కదా! ప్రాచీని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమెను ప్రత్యేకంగా ట్రీట్ చేయసాగాడు. షూటింగ్ ప్యాకప్ అవగానే డిన్నర్ డేట్స్, రొమాంటిక్ ఈవెనింగ్స్‌ను ఆస్వాదించసాగాడు ప్రాచీతో. రోహిత్‌కు పెళ్లయిన విషయం తెలిసున్న ఆమె తొలుత అతనితో ముభావంగానే ఉంది. కానీ హాస్య చతురతతో అతను ఇంప్రెస్ చేసిన తీరుకు ఫిదాకాక తప్పలేదు ఆమెకు. విడాకులకూ సిద్ధం ప్రాచీ ప్రాణమైపోయింది రోహిత్‌కు. సినిమా వర్క్ పూర్తయినా ఆమె చేయి వదల్లేదు. ఇంటికి వెళ్లడమే మానేశాడు. వాళ్లిద్దరూ సహజీవనం చేశారని చెప్తాయి బాలీవుడ్ వర్గాలు. వదంతులుగానూ ప్రచారం అయింది. అయితే ఆ విషయం మాయాకూ తెలిసింది రోహిత్ సన్నిహితుల ద్వారా. భార్యకు ప్రశ్నించే అవకాశమూ ఇవ్వలేదు.. ఎదురుగా వచ్చి తనూ వివరణ ఇవ్వలేదు. కుమిలిపోయింది మాయా. విడాకులకు సిద్ధమయ్యాడు రోహిత్. సంబంధించిన కాగితాలూ పంపాడు భార్యకు సంతకం చేయమని. ‘చస్తే చేయను’ అని భీష్మించుకుంది మాయా. ప్రాచీ ప్రేమను కలకాలం నిలుపుకోవడానికి మాయాతో తెగతెంపులు చేసుకోవాలని చాలా ప్రయత్నించాడు. అయినా మాయా తగ్గలేదు. ఆమె వల్లే.. ప్రాచీ వల్ల బంగారం లాంటి కాపురం కూలిందనే కామెంట్లూ మొదలయ్యాయి. అవి ప్రాచీ చెవిన పడ్డాయి. కలత చెందింది. ‘నా వల్ల మీ ఇల్లు నాశనమవడం నాకిష్టం లేదు. ఏవేవో కామెంట్లు వింటున్నా. సారీ .. రోహిత్’ అని చెప్పింది ప్రాచీ. ‘అయ్యో.. మాకు ముందునుంచే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నేను విడిగానే ఉండాలనుకున్నా.. లక్కీగా నా లైఫ్‌లోకి నువ్ వచ్చావ్’ అంటూ ఆమెను ఒప్పించజూశాడు. వినలేదు ప్రాచీ. ఇంటికి వెళ్లిపొమ్మని కోరింది. వెళ్లిపోయాడు. నేరుగా మాయా దగ్గరికే. మళ్లీ ప్రాచీ, అతను కలుసుకోలేదు. అలా ఆ ప్రేమ కథ ముగిసిపోయింది. భార్యా, కొడుకుతో సంతోషంగానే ఉన్నాడు రోహిత్. ఒంటరిగానే మిగిలిపోయింది ప్రాచీ. ఏ రిపోర్టర్ అయినా ‘పెళ్లి ఎప్పుడు?’ అని అతి చనువుగా అడిగితే ‘పెళ్లి గురించి నాకు గొప్ప అభిప్రాయమేం లేదు. అదొక భద్రమైన వ్యవస్థగా కూడా ఫీలవట్లేదు. అలాగని పెళ్లి చేసుకోననీ అనట్లేదు. చేసుకుంటాను నాకు నచ్చిన మనిషి తారసపడ్డప్పుడు’ అని చెబుతుంది ప్రాచీ దేశాయ్. ‘ప్రాచీ వల్లే మీ పెళ్లి డిస్టర్బ్ అయిందా?’ అని మీడియా రోహిత్‌నూ ఎన్కౌంటర్ చేసినప్పుడు.. ‘లేదు. నా భార్యతో అంతకుముందు నుంచే నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ఫేస్ చేశాను’ అని ప్రాచీకి చెప్పిన మాటనే మీడియాకూ చెప్పాడు రోహిత్. - ఎస్సార్ చదవండి: నా డిజిటల్ ఎంట్రీ గురించి భయంగా ఉంది: షాహిద్ కపూర్ -
నో చెప్పినా ఆ డైరెక్టర్ ఇప్పటికీ వదలట్లేదు: హీరోయిన్
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులకు లోనయ్యామంటూ గతంలో ఎందరో నటీమణులు మీడియా ముందు వాపోయారు. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమం కూడా క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చింది. ఇక ఇటీవలే దివంగత నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే సైతం చిత్రపరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ దేశాయ్ కెరీర్ తొలినాళల్లో చవిచూసిన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది. ఓ సినిమా నటించేందుకు దర్శకుడు తన నుంచి ఏదో ఆశించారని తెలిపింది. వారి ఉద్దేశం అర్థమై వెంటనే నాకు ఆ సినిమానే వద్దంటూ వచ్చేశానని చెప్పింది. అయితే ఆ డైరెక్టర్‌తో సినిమాలో నటించనని కరాఖండిగా చెప్పినప్పటికీ అతడు ఇప్పటికీ తరచూ ఫోన్లు చేస్తున్నాడని వాపోయింది. అప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా అతడి సినిమాల్లో నటించనని తేల్చి చెప్పానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇక ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడానికి ప్రధాన కారణమేంటో చెప్పింది ప్రాచీ దేశాయ్. ఎన్నో అవకాశాలు తన దగ్గరి దాకా వస్తున్నాయని, కానీ ఆ పాత్రలు నచ్చక వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఉన్నత హోదాలో ఉండాలన్న కుతూహలం తనకు లేదని, తనకు ప్లస్ అయ్యే పాత్రలను మాత్రమే ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది. చదవండి: ‘అప్పట్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాం, కానీ!’ బేరాలు వద్దు: కాజల్ ఎమోషనల్ పోస్ట్ -
'ఆ హీరో ఓపిక చూస్తే ఆశ్చర్యమేస్తుంది'
ముంబై: బాలీవుడ్ లో ఈ మధ్య బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తోంది. క్రీడానేపథ్యం, జీవితకథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపై అక్కడి ప్రేక్షక్షులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ క్రికెట్లో సక్సెస్ ఫుల్ క్రికెటర్ గానే కాక అంతకంటే ఎక్కువ వివాదాస్పద క్రికెటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అజారుద్దీన్. అజార్ మూవీలో ఇమ్రాన్ హష్మీ క్రికెటర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఇమ్రాన్ తో కలిసి నటిస్తున్న ప్రాచీ దేశాయ్ ఆ హీరోపై ప్రశంసలు కురిపిస్తుంది. అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ చెబుతోంది. ఏ సీన్లో అయినా సరే డైరెక్టర్ చెప్పినట్టుగా ఇమ్రాన్ నటిస్తాడని, ఎంతో ఓపికగా ఉంటాడంటోంది. నిజంగానే గతంలో ఇమ్రాన్ చేసిన సినిమాలకు, ప్రస్తుత మూవీకి చాలా వ్యత్యాసాలున్నాయని వివరించింది. రీటేక్ లు ఎన్ని చేస్తున్నా ఇమ్రాన్ ఓపికగా ఉంటాడని సీన్ పైనే దృష్టిపెడతాడని ఈ విషయాన్ని అతడి నుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది. వీటితో పాటు ఎలాంటి ప్రశ్నలు అడిగినప్పటికీ సహనాన్ని కోల్పోడంటూ పొగిడేసింది. ఇంకా ఎన్నో నేర్చుకునే అవకాశం ఉందంటూ అజార్ మూవీలో నటిస్తున్న ప్రాచీ దేశాయ్ అంటోంది. అజార్ జీవితంలోని క్రికెట్, వివాదాలు, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలపై ఉన్న ఎన్నో అనుమానాలపై ఈ సినిమాతో క్లారిటీ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఏక్తాకపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు టోని డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. లారాదత్తా, హుమా ఖురేషి, నర్గీస్ ఫక్రీ, గౌతమ్ గులాటీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అజార్ మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. -
ఆ సీక్వల్లో నటించటం లేదు
అమీర్ ఖాన్ కెరీర్లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే సెన్సేషనల్ సినిమా లగాన్. కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న సమయంలో అమీర్ లాంటి స్టార్ హీరో స్వాతంత్ర్య సమరం నేపధ్యంతో తెరకెక్కించిన పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా లగాన్. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా, తరువాత కమర్షియల్ గానూ ఘనవిజయం సాదించి, అస్కార్ రేసులో పోటి పండింది. ఇంతటి ఘనవిజయం సాధించిన లగాన్‌కు సీక్వల్ రూపొందించాలన్న ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. లగాన్ స్థాయి కథ కోసం ఇంతకాలం ఎదురుచూసిన దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఫైనల్‌గా ఈ సినిమా సీక్వల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడానికి రెడీ అవుతున్నాడు. అయితే లగాన్ తొలి భాగంలో నటించిన నటీనటులు సీక్వల్లో నటించే అవకాశాలు మాత్రం కనిపించటం లేదు. లగాన్ సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసిన హీరో అమీర్ ఖాన్ సీక్వల్లోనటించటం లేదని ప్రకటించేశాడు. ప్రస్తుతం దంగల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అమీర్ లగాన్ సీక్వల్లో నటించడానికి ఇంట్రస్ట్ చూపించటం లేదు. హీరోయిన్గా మాత్రం బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్‌ని ఫైనల్ చేశారు చిత్రయూనిట్. సినీ చరిత్రను మలుపు తిప్పిన లగాన్ సీక్వల్ హీరోగా ఎవరు నటిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
సునీల్ సరసన...
‘రాక్ ఆన్’, ‘లైఫ్ పార్టనర్’, ‘బోల్ బచ్చన్’, ఏక్ విలన్’.. ఇలా హిందీలో అరడజను చిత్రాలకు పైగా నటించారు ప్రాచీ దేశాయ్. ప్రస్తుతం హిందీలో ఆమె రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి కాకుండా తెలుగులో సునీల్ సరసన కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్‌పీఎ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ నెలలోనే చిత్రీకరణ ఆరంభం కానుంది. ఇందులో సునీల్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. -
కాలేజీ జీవితాన్ని మిస్ అయ్యాను
లైఫ్ బుక్ మా నాన్న నిరంజన్ దేశాయ్ ఎన్నో నాటకాల్లో నటించారు. నాటకం కోసం నాన్న, మామయ్య రిహార్సల్స్ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి చూసేదాన్ని. ఈ ప్రభావంతోనే సినిమాల మీద, నటన మీద ఆసక్తి పెరిగింది. సినిమాలు చూడడం కోసం తరచుగా కాలేజీ ఎగ్గొట్టేదాన్ని. ఇలా చేయడం వల్ల కాలేజీ జీవితంలో ఉండే ఉత్సాహాన్ని, భిన్నమైన అనుభవాలను కోల్పోయాను. ఒకే తరహా ఆలోచనలతో ఉన్నవారు మాట్లాడుకుంటే కాలమే తెలియదు. ఉదాహరణకు మా నాన్న, నేను మాట్లాడుకుంటుంటే ఆ మాటల్లో సినిమా ప్రపంచం తప్ప ఏదీ వినిపించదు. కొన్నిసార్లయితే మేము గుజరాత్ గురించి ముఖ్యంగా సూరత్ గురించి కూడా ఇష్టంగా మాట్లాడుకుంటాం. మన మూలాలను ప్రేమించడానికి, వాటి గురించి మాట్లాడుకోవడానికి కాలం అనేది ప్రమాణం కాదు. సంవత్సరాల తరబడి ఒకచోట గడిపిన వారు కూడా మూలాలను మరచిపోవచ్చు. అయితే సూరత్‌లో గడిపింది నాలుగు సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ నా సంప్రదాయ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. స్త్రీ సాధికారికతకు సంబంధించిన సినిమాలు, స్త్రీలపై జరిగే రకరకాల హింసను నిరసిస్తూ...సందేశాత్మక చిత్రాలు రావడం మంచిదే. అయితే సినిమాలతో మాత్రమే ప్రజలలో మార్పు వస్తుందనుకోను. మార్పుకు అవసరమైన సాధానాలలో అదొకటి మాత్రమే. ఏదైనా గొప్ప సినిమా చూస్తున్నప్పుడు... ‘‘ఈ పాత్ర నేను చేసి ఉంటే ఎంత బాగుండేది’’ అనిపిస్తుంది. ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకుంటూ, ఊహల్లో నటిస్తూ ఎంతో సంతోషిస్తాను. ఆశావాదమనేది ఎప్పుడూ ఉత్సాహం ఇస్తుంది. ‘‘సినీ పరిశ్రమలో నాకంటూ ఒక పాత్ర కాచుకొని ఉంది. ఆ పాత్ర చేస్తే నా నటనలోని మరో కోణం బయటపడుతుంది. లోకం ప్రశంసిస్తుంది’’ అనుకుంటాను. - ప్రాచీ దేశాయ్, హీరోయిన్, బోల్‌బచ్చన్ ఫేమ్ -
టీవీక్షణం: సీరియల్స్‌ని ఎప్పటికీ వదలను!
టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్సే’ సీరియల్లో మెరిసి, ఆ ఒక్క సీరియల్‌తోనే సినిమాల్లో చాన్స్ కొట్టేసిన ప్రాచీ చెప్పిన కబుర్లివి... మాది సూరత్ (గుజరాత్). తొమ్మిదో తరగతి వరకూ అక్కడే చదివాను. తర్వాత చదువంతా పుణెలో సాగింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టాను. అవకాశాలు అంది వచ్చాయి. బాగా బిజీ అయిపోవడంతో చదువుకు స్వస్తి చెప్పేశాను. అది 2006. అప్పుడు నాకు పదిహేడేళ్లు. ఓరోజు అనుకోకుండా బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి ‘కసమ్సే’ సీరియల్లో నటించమని పిలుపు వచ్చింది. ఏక్తాకపూర్ బ్యానర్లో చాన్స్ రావడమనేది అదృష్టం కదా! అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. ‘బానీ’ పాత్ర నన్ను పాపులర్ చేసింది. చాలా అవార్డులు అందుకున్నాను. 2007లో ప్రముఖ డ్యాన్స్ షో ‘ఝలక్ దిఖ్లాజా’ రెండో సిరీస్‌లో పాల్గొని, గెలవడం మర్చిపోలేని అనుభూతి. అంతవరకూ సీరియల్ పాత్ర పేరుతో ‘బానీ’ అని పిలిచినవారంతా ‘ప్రాచీ’ అని పిలవడం మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు ‘కసమ్సే’లో నటించాక ‘రాక్ ఆన్’ చిత్రంలో నటించే చాన్స్ వచ్చింది. ఫర్హాన్ అక్తర్ భార్యగా నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో అవకాశాలు వరుసగా రావడం మొదలైంది. లైఫ్ పార్ట్నర్, ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, తేరీ మేరీ కహానీ, బోల్ బచ్చన్, ఐ మి ఔర్ హమ్, పోలీస్గిరి... ఇలా వరుసగా చేసుకుంటూ పోతున్నాను. నిజానికి సినిమాల వైపు వెళ్లాలని నేనేమీ అనుకోలేదు. అలాగని వచ్చిన అవకాశాన్ని వదులుకోవడమూ ఇష్టం లేదు. అందుకే వచ్చిన చాన్సని ఉపయోగించుకున్నాను. అయితే టీవీని పూర్తిగా వదిలేయలేదు. ప్రాచీ అంటే ఎవరో అందరికీ తెలిసింది సీరియళ్ల వల్లనే. అందుకే నేనెప్పుడూ వాటిని వదులుకోను. మంచి సీరియల్ చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను. నాకు తెలిసి టీవీకి పని చేయడమే ఎక్కువ కష్టం. వరుస షెడ్యూళ్లు, కొన్ని గంటలపాటు అలుపు లేకుండా నటించాలి, ఎమోషన్స్ ఎక్కువగా ప్రదర్శించాలి. అదే సినిమా అయితే పరిమిత సమయాలు, గంటలపాటు షూటింగ్ జరగడమనేది ఎప్పుడో కానీ ఉండదు, క్యారెక్టర్‌కి కూడా పరిమితి ఉంటుంది. అందరూ అనుకునేదేమిటంటే, బుల్లితెర నటీనటులు వెండితెర మీద వెలగలేరని. అది ఎంతమాత్రం నిజం కాదు. నటన తెలిసినవారికి సినిమా రంగమైనా, టెలివిజన్ రంగమైనా ఒకటే. ఆ పాత్రను ఎంత బాగా ఓన్ చేసుకున్నాం, దానికి ఎంతవరకూ న్యాయం చేయగలం అన్నదాన్నిబట్టే ఉంటుంది సక్సెస్! నేను చాలా కూల్‌గా ఉంటాను. నాకుగా ఎవరి జోలికీ పోను. ఎవరైనా నా జోలికొచ్చినా తప్పుకు పోతాను. ఇండస్ట్రీలో ఇది చాలా అవసరం. టాలెంట్ ఉంటే చాలదు. ప్రవర్తనను కూడా కాచుకుని ఉండాలి. అందరి కళ్లూ మనమీదే ఉంటాయి. ఏ చిన్న తప్పుటడుగు వేసినా, పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందిక్కడ! నా పెళ్లి గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు. నిజానికి నాకు పెళ్లి ఆలోచన లేదు. అస్సలు చేసుకోనని కాదు గానీ, ఇప్పుడు మాత్రం చేసుకోను. ఒంటరిగా ఉండటం బాగుంది. ఇప్పుడు తోడు కోసం కంగారు పడాల్సిన అవసరం కనిపించడం లేదు. కాబట్టి నేనసలు పెళ్లి గురించి టెన్షన్ పడట్లా! {పస్తుతం ‘రాక్ ఆన్’ సీక్వెల్లో నటిస్తున్నాను. ఇంకా కొన్ని ఆఫర్స్ కూడా చేతిలో ఉన్నాయి. లైఫ్ ప్రశాంతంగా సాగిపోతోంది. చెప్పుకోదగ్గ విశేషాలూ లేవు. కుమిలిపోయేంత కష్టాలూ లేవు. నా జీవితం ఇలా సాగిపోయినా చాలు నాకు!