ఆ వార్తలో నిజం లేదు!
లైఫ్ బుక్
'లేడీ వర్సెస్ రికీ బాల్’ సినిమాలో సహాయక పాత్రలో నటించిన పరిణితీ చోప్రా ‘ఇష్క్‌జాదే’ ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీతో ఫసీ’ మొదలైన సినిమాలలో హీరోయిన్‌గా తన ప్రతిభ చాటుకున్నారు. ఆమె మనసులోని మాటలు...
కాలమే నిర్ణయిస్తుంది...
‘నేను గ్లామరస్ పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను’ ‘గ్లామరస్ పాత్రలు చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు’ ఇలా అనుకొని ఎవరూ సినిమాల్లోకి అడుగు పెట్టరు. గ్లామరస్ పాత్రలు చేయడం, చేయకపోవడం అనేది కాలమే నిర్ణయిస్తుంది తప్ప మన ఇష్టానిష్టాలు నిర్ణయించవు. అందుకే, గ్లామరస్ పాత్రలు చేయడానికి ఎంతగా ఇష్టపడతానో, సహజత్వానికి దగ్గర ఉండే గ్లామర్ లేని పాత్రలనూ అంతే ఇష్టపడతాను.
ఒత్తిడిని వదులుకోవాలి...
డైలాగులను తేలిగ్గా చెప్పడం కోసం ఒకటికి రెండు సార్లు మననం చేసుకోవడం నా అలవాటు. ఇది మంచి అలవాటే కావచ్చుగానీ మననం చేసుకునే క్రమంలో ఒత్తిడికి లోనవుతుంటాను. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది.
క్రమశిక్షణ ముఖ్యం...
సినిమా రంగంలో ఉన్నంత మాత్రాన క్రమశిక్షణకు దూరంగా ఉండాలనేమీ లేదు. ఏ కొద్దిమందినో చూసి ‘సినిమా వాళ్లకు క్రమశిక్షణ ఉండదు’ అనుకోవద్దు. సినిమా అనే కాదు ఏ రంగంలోనైనా క్రమశిక్షణ అనేది ముఖ్యమని నమ్ముతాను.
ఆ వార్తలో నిజం లేదు...
‘హ్యాపీ న్యూ ఇయర్’ తరువాత షారుక్ ఖాన్ చేయబోయే సినిమాలో కథానాయికగా నటిస్తున్నాను అనే వార్తలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి పరిచితులు, అపరిచితులు, అభిమానుల నుంచి అభినందన సందేశాల వరద మొదలైంది. నిజానికి ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే షారుక్‌ను అడిగిచూడండి!
- పరిణితీ చోప్రా, హీరోయిన్