పిల్లలు నన్ను తిట్టుకున్నా సరే...
లైఫ్ బుక్
నా జీవితంలో ఇప్పటి వరకు ఏ విషయంలోనూ పశ్చాత్తాపం ప్రకటించలేదు. మంచో చెడో...నేను తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనుకుంటాను. ప్రతికూల, అనుకూల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతిదానిలోనూ కొద్దో గొప్పో మంచి విషయాన్ని నేర్చుకున్నాను.
టైమ్ సరిపోవడం లేదు...అనే మాట తరుచుగా వినిపిస్తుంటుంది. పక్కా ప్రణాళిక ఉంటే అదేమీ అసాధ్యం కాదనే విషయం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అయిందిటికల్లా మేల్కోవడం, ఆరింటికి జిమ్‌లో గడపడం, ఎనిమిదింటికల్లా పిల్లల్ని స్కూల్‌కు సిద్ధం చేయడం...ఇలా ప్రతి పని పక్కాగా చేస్తాను. ఒక్కసారి అలవాటు అయితే ఏదైనా సులువు అవుతుంది.
నేను స్ట్రిక్ట్ మదర్‌ను. పిల్లలు నన్ను ఒక విలన్‌గా పరిగణించి తిట్టుకున్నా ఫరవాలేదు. పిల్లలకు వారి హద్దుల గురించి తెలియజేస్తుంటాను. ఒక పని ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? అనేది పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తుంటాను. అలా అని నా రూల్స్ శిలాశాసనాలు కావు. అప్పుడప్పుడూ వెసులుబాటు కల్పిస్తుంటా. ఉదాహరణకు ఒక రోజు మా అమ్మాయికి ఒక రూల్ పాటించాలనిపించలేదు. ‘నీ ఇష్టం’ అంటాను. మరుసటి రోజు మాత్రం రూల్ రూలే!
- కాజల్