ఆ విషయంలో తెగ ఇబ్బంది పడతాను!
లైఫ్‌బుక్: కాజోల్
హీరోలకు మాత్రమే మంచి పాత్రలను ఎంచుకునే అవకాశం ఉందనేదాంట్లో నిజం లేదు. హీరో అవసరం లేకుండానే ప్రేక్షకులను మెప్పించే పాత్రలను అప్పుడూ ఇప్పుడూ హీరోయిన్‌లు చేశారు.
ఇక వయసు విషయంలో ఒక తమాషా ఎప్పుడూ జరుగుతుంటుంది. మగవాళ్లు 55 సంవత్సరాలు దాటినా-
‘‘ఇప్పటికీ గ్లామర్‌గా ఉన్నాడు’’ అంటారు.
అదే ఆడవారి విషయానికి వస్తే-
‘‘ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవారో’’ అంటారు!
అప్పుడు ఇప్పుడు నాలో మార్పు రాని విషయం...ఫోటోషూట్! ఎప్పుడు కెమెరా ముందు కూర్చున్నా తెగ ఇబ్బంది పడతాను.
‘‘భగవంతుడా ఏమిటిది?’’ అని గొణుక్కుంటాను. కెమెరా ముందు ఉంటానన్న మాటేగానీ ఎలాంటి హావభావాలు ప్రకటించాలో కూడా నాకు అర్థం కాదు. రోలింగ్ కెమెరా ముందు మాత్రం ఎలాంటి సమస్యా అనిపించదు.
నలభైలోకి వచ్చేశాను. ‘నలభై తరువాత జీవితం మారుతుంది’ అనే దాని కంటే ‘నలభై అనేది మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక రిమైండర్ లాంటిది’ అనేదాన్ని నమ్ముతాను. నలభైలో ఆవేశం కంటే ఆలోచన ముందుంటుంది.
‘‘నేను సరియైన దారిలోనే ప్రయాణిస్తున్నానా?’’ అని నలభైలో ఎవరికి వారు ప్రశ్నించుకుంటారు. అదృష్టవశాత్తూ నేను సరియైన మార్గంలోనే ప్రయాణిస్తున్నాను.
ఒకప్పుడు 70 సంవత్సరాలు బతకడం గొప్ప. అంతకంటే ఎక్కువ కాలం బతికితే ‘అదనపు కాలం’గా భావించేవారు. ఇప్పుడు ఏ వయసులోనైనా సరే హార్ట్ రిప్లెస్‌మెంట్‌తో సహా రకరకాల రిప్లెస్‌మెంట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘నా వయసు ఇంత’ అని మనమేమీ బెంగపడిపోనక్కర్లేదు. ఇప్పుడున్న మెడికల్ సైన్స్ దీర్ఘాయుషును ప్రసాదిస్తున్నప్పుడు 40 సంవత్సరాలకే భయపడడం అనేది అర్థం లేని పని.