LifeBook
-
ఆ విషయంలో తెగ ఇబ్బంది పడతాను!
లైఫ్‌బుక్: కాజోల్ హీరోలకు మాత్రమే మంచి పాత్రలను ఎంచుకునే అవకాశం ఉందనేదాంట్లో నిజం లేదు. హీరో అవసరం లేకుండానే ప్రేక్షకులను మెప్పించే పాత్రలను అప్పుడూ ఇప్పుడూ హీరోయిన్లు చేశారు. ఇక వయసు విషయంలో ఒక తమాషా ఎప్పుడూ జరుగుతుంటుంది. మగవాళ్లు 55 సంవత్సరాలు దాటినా- ‘‘ఇప్పటికీ గ్లామర్‌గా ఉన్నాడు’’ అంటారు. అదే ఆడవారి విషయానికి వస్తే- ‘‘ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవారో’’ అంటారు! అప్పుడు ఇప్పుడు నాలో మార్పు రాని విషయం...ఫోటోషూట్! ఎప్పుడు కెమెరా ముందు కూర్చున్నా తెగ ఇబ్బంది పడతాను. ‘‘భగవంతుడా ఏమిటిది?’’ అని గొణుక్కుంటాను. కెమెరా ముందు ఉంటానన్న మాటేగానీ ఎలాంటి హావభావాలు ప్రకటించాలో కూడా నాకు అర్థం కాదు. రోలింగ్ కెమెరా ముందు మాత్రం ఎలాంటి సమస్యా అనిపించదు. నలభైలోకి వచ్చేశాను. ‘నలభై తరువాత జీవితం మారుతుంది’ అనే దాని కంటే ‘నలభై అనేది మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక రిమైండర్ లాంటిది’ అనేదాన్ని నమ్ముతాను. నలభైలో ఆవేశం కంటే ఆలోచన ముందుంటుంది. ‘‘నేను సరియైన దారిలోనే ప్రయాణిస్తున్నానా?’’ అని నలభైలో ఎవరికి వారు ప్రశ్నించుకుంటారు. అదృష్టవశాత్తూ నేను సరియైన మార్గంలోనే ప్రయాణిస్తున్నాను. ఒకప్పుడు 70 సంవత్సరాలు బతకడం గొప్ప. అంతకంటే ఎక్కువ కాలం బతికితే ‘అదనపు కాలం’గా భావించేవారు. ఇప్పుడు ఏ వయసులోనైనా సరే హార్ట్ రిప్లెస్మెంట్తో సహా రకరకాల రిప్లెస్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘నా వయసు ఇంత’ అని మనమేమీ బెంగపడిపోనక్కర్లేదు. ఇప్పుడున్న మెడికల్ సైన్స్ దీర్ఘాయుషును ప్రసాదిస్తున్నప్పుడు 40 సంవత్సరాలకే భయపడడం అనేది అర్థం లేని పని. -
అలా చేయాల్సింది కాదన్నారు..!
లైఫ్‌బుక్ సినిమాలకు ముందు ప్రకటనల్లో నటించాను. ఆర్థిక స్వాతంత్య్రమంటే ఏమిటో అప్పుడే తొలిసారిగా తెలిసింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారు కొందరు. ఆచితూచి పాత్రలు ఎంపిక చేసుకునేవారు కొందరు. మొదటి దాని వల్ల డబ్బు వస్తుంది. రెండో దాని వల్ల తృప్తి మిగులుతుంది. నేను రెండో కోవలో ఉండాలను కుంటున్నాను. డబ్బు కంటే తృప్తికే ప్రాధాన్యత ఇవ్వాలను కుంటున్నాను. ‘బ్లాక్’ సినిమాలో చేసినప్పుడు ‘‘సహాయక పాత్ర చేయడం ఏమిటి? అలా చేసి ఉండాల్సింది కాదు!’’ అన్నవాళ్లు ఉన్నారు. నేను మాత్రం అదేమీ పట్టించుకో కుండా నటించాను. అదొక గొప్ప భావోద్వేగ ప్రయాణం. కొన్ని రంగాలలోకి అడుగుపెట్టినప్పుడు...కొన్ని అలవా ట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. నాకు కొత్త వారితో మాట్లాడాలంటే సిగ్గు. సినిమా రంగంలో ఇది కుదరదు కదా... అందుకే ఈ అలవాటు నుంచి బయటపడడానికి కష్టపడాల్సి వస్తుంది. ‘బ్లాక్’లాంటి హృదయం కదిలించే సినిమాలు చేసినా, ‘టాంగో చార్లీ’లాంటి మాసాల సినిమా చేసినా, ‘ఓవర్ ది మౌంటెన్’లాంటి అంతర్జాతీయ చిత్రాలు చేసినా నేను చేసే పాత్ర గురించి హోంవర్క్ చేయడం మరవను. శాంతినికేతన్లో చిన్నప్పుడు రవీంద్రుడి గీతాలు పాడేదాన్ని. మణిపురి నృత్యం అక్కడే నేర్చుకున్నాను. సినిమా అనేది కేవలం వినోదం కోసం అనే మాటను నమ్మను. సినిమాతో సామాజిక సందేశాన్ని ప్రజలకు చేరువ చేయవచ్చు. ‘యాక్టర్’లో ‘యాక్టివిస్ట్ట్’ కూడా ఉన్నా రు. కాబట్టి నటులు సామాజిక స్పృహకు సంబంధించిన పనుల్లో పాల్గొంటే ఆ ప్రభావం ఇతరులపై గాఢంగా ఉంటుంది. సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సామా జిక కార్యక్రమాలకు మాత్రం ఎప్పుడూ దూరంగా ఉండలేదు. - నందనా సేన్, హీరోయిన్ -
అలా చెప్పుకోవడం విని నవ్వొచ్చేది!
లైఫ్‌బుక్ - నిమ్రత్, హీరోయిన్ (లంచ్‌బాక్స్ ఫేమ్) నాన్న మిల్ట్రీ ఆఫీసర్. నేను ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కాశ్మీర్లో మిలిటెంట్ల కాల్పుల్లో చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ తానై చూసుకుంది అమ్మ. ఢిల్లీ కాలేజిలో చదువుతున్న రోజుల్లో ముంబాయికి వెళ్లి సినిమాల్లో నటించాలని కలలు కనేదాన్ని. ‘ముంబాయి వెళతాను’ అని అమ్మకు చెప్పడానికి ధైర్యం చాల్లేదు. ఒకరోజు ధైర్యం చేసి అడిగాను. ముందు కాదన్నా... ఆ తరువాత ఒప్పుకుంది. ప్రతి ఒక్కరు అమ్మను - ‘‘మీ అమ్మాయి ముంబాయికి ఎందుకు వెళ్లింది? అక్కడ ఏం చేస్తుంది?’’లాంటి అనుమానపు ప్రశ్నలు అడిగేవారు. ఈ ప్రశ్నలతో అమ్మకు కోపం నషాలానికి అంటేది. వెంటనే నాకు ఫోన్ చేసి - ‘‘ఉద్యోగం దొరికిందా? దొరకకపోతే వచ్చేయ్’’ అని ఆజ్ఞాపించేది. ఇక నటన విషయానికి వస్తే హాబీగా మాత్రమే దాన్ని తీసుకోవాలని, వృత్తిగా ఎంచుకోవద్దని గట్టిగా చెప్పేది. ‘‘మీ అమ్మాయి సినిమాల్లో నటిస్తుందా?’’ అని నోళ్లు నొక్కుకున్న వాళ్లే ‘లంచ్‌బాక్స్’ సినిమాకు దేశవిదేశాల్లో ప్రశంసలు లభించిన తరువాత ‘మాకు బాగా తెలిసిన అమ్మాయి’ అని నా గురించి చెప్పుకోవడం విని నవ్వొచ్చేది!