బిఫోర్ దే పాస్... | Before they pass ... | Sakshi
Sakshi News home page

బిఫోర్ దే పాస్...

Published Mon, Feb 10 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

Before they pass ...

ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య చిన్న చిన్న గ్రామాలలో నివసించే ఆదివాసీలు ద్రోక్‌పాస్‌ల గురించి పెద్ద విషయాలే చెప్పు కోవచ్చు. విషాదమేమిటంటే ఇప్పుడు  వారి జనాభా రెండు వేల అయిదు వందలు మాత్రమే! ద్రోక్‌పాస్‌లు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా... ఎన్నో ఆదివాసుల తెగలు ప్రమాదం అంచున ఉన్నాయి.

 తన మిత్రుడు ఒక రోజు, ప్రమాదకర స్థితిలో ఉన్న ఆదివాసి తెగల గురించి చెప్పినప్పుడు బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ జిమ్మి నెల్సన్ ఆశ్చర్యపడ్డాడు. ఆ ఆశ్చర్యానికి  దుఃఖం కూడా తోడైంది. ‘బిఫోర్ దే పాస్ అవే’ అనుకున్నాడేమో భుజానికి కెమెరా తగిలించుకొని ప్రపంచం మొత్తం తిరిగాడు. అది మామూలు కెమెరా కాదు...యాభై ఏళ్ల ‘ప్లేట్ ఫిల్మ్ కెమెరా’ అద్భుతమైన స్పష్టత దాని సొంతం. ‘‘వారి దగ్గర డబ్బులేక పోవచ్చుగానీ చాలా సంపన్నులు. ఈ  విషయాన్ని ఆధునిక ప్రపంచానికి చాటడానికి బిఫోర్ దే పాస్ అవే... ప్రాజెక్ట్ చేపట్టాను. డబ్బుతో కొలవలేని గొప్ప సంస్కృతి వారి సొంతం’’ అంటాడు నెల్సన్. ‘బిఫోర్ దే పాస్ అవే’ ఫొటో సిరీస్‌లో ఫొటోలు మాత్రమే కాదు...కన్నీటి తడి కూడా కనిపిస్తుంది.
 
 ఆర్ట్ ఎటాక్!

 సమ్‌థింగ్ స్పెషల్
 
 విక్టర్ గీసే బొమ్మలు ఆహా అనిపించడంతో పాటు నోరూరిస్తాయి. అరవై అయిదు సంవత్సరాల ఈ బ్రెజిల్ ఆర్టిస్ట్ నట్స్, గ్రేప్స్, బేబికార్న్...మొదలైన వాటిని ఉపయోగించి బొమ్మలు గీస్తుంటాడు. తన కళకు ప్రత్యామ్నాయ కళ అని కూడా పేరు పెట్టుకున్నాడు. కొందరేమో ‘ఆర్ట్ ఎటాక్’ అని  సరదాగా పిలుస్తారు.


 గతంలో ఆర్ట్ డెరైక్టర్‌గా పని చేసిన విక్టర్ ‘‘నా బొమ్మలు పిల్లలతో పాటు పెద్దలను అలరిస్తున్నాయి’’ అని మురిసిపోతు న్నాడు. బిస్కట్‌లతో రూపొందించిన బొమ్మలకైతే భలే క్రేజు. ఈ బొమ్మలను తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టినప్పుడు మంచి స్పందన వచ్చింది. కొందరు వీటి నుంచి స్ఫూర్తి పొంది తాము కూడా తయారుచేయడం మొదలెట్టారు. అందుబాటులో ఉండే పదా ర్థాలు, వస్తువులను ఉపయోగించి బొమ్మలు గీయడానికి ప్రాధా న్యత ఇస్తాడు విక్టర్. డిష్ క్లాత్స్, ఫ్లోర్ క్లాత్స్...ఇలా  ఏవైనా సరే. సాధారణ వస్తువులతో అసాధారణమైన చిత్రాలను సృష్టించడం తన పని అని చెబుతాడు. ‘‘మనసు బాగ లేనప్పుడు... బొమ్మలు గీస్తాను. వాటిని చూస్తే కొత్త ఉత్సాహం వస్తుంది. నా ఆర్ట్ నాకు థెరపీలాగా పని చేస్తుంది’’ అంటున్నాడు విక్టర్.
 
 యుద్ధంలో గెలిస్తేనే...
 లైఫ్ బుక్- కత్రినా కైఫ్
 
 ప్రతి రోజు  ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోకపోతే ఆరోజు వృథా అయిపోయినట్లు అనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోకపోతే సరికొత్తగా ఏమీ చేయలేం. నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాలను పక్కనపెట్టడం కాకుండా వాటిని తగిన సందర్భాలలో అన్వయించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను.
 
 ఒక కెరీర్‌ను ఎంచుకున్నామంటే... నిరంతరం మనతో మనం యుద్ధం చేయడమే. ప్రతికూలత అనే శత్రువులను ఆ యుద్ధంలో సంహరించడం మీదే కెరీర్‌లో మన విజయం ఆధారపడి ఉంటుంది. ఈ దేశంలో పెరగలేదు, హిందీ రాదు...ఇవి నాకు మైనస్ పాయింట్లుగా నిలిచాయి. ఈ దేశంలో మళ్లీ పెరిగే అవకాశం లేకపోవచ్చుగానీ హిందీ నేర్చుకునే అవకాశం మాత్రం ఉందిగా. ఈ పని కోసం కష్టపడ్డాను.
 
 విమర్శ అనేది బాధ పెట్టవచ్చుగాక...కానీ దాన్ని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోను. ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి మంచిగా మాట్లాడడం అనేది అరుదు. ‘ఇది లోకనైజం’ అని అన్ని విమర్శలనూ ఒకే గాటన కట్టలేం. కొన్ని విమర్శలు మన విజయానికి మెట్లలాంటివి.
 
 కుండల్లో గుర్రాలు పరుగెత్తిస్తాడు!

 మన జాతీయాలు
 
 ‘టీలు తాగారా... టిఫిన్లు చేశారా?’
 ‘అరే... ఎక్కడ చచ్చార్రా... ఇక్కడ ఒక్కడూ లేడూ’
 ‘అది ఇలా కాదు... ఇలా చేయండి’
 ఇలాంటి డైలాగులు మన నిత్యజీవితంలో ఎన్నోచోట్ల వినబడుతుంటాయి. హడావిడి ఎక్కువ చేసి, పనేమీ చేయని వాళ్లు  మనకు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ల కోసమే పుట్టిన జాతీయం-
 ‘కుండల్లో గుర్రాలు’
 తాము ఏమాత్రం పని చేయకుండా ఇతరులను తెగ హడావిడి పెట్టేవాళ్లను ‘‘అబ్బో... కుండల్లో గుర్రాలు పరుగెత్తిస్తున్నాడు’’ అనో ‘‘ఏమీ చేయలేడు...కుండల్లో గుర్రాలు పరుగెత్తించడంలో మాత్రం సిద్ధహస్తుడు’’ అంటుంటారు.
 గుర్రాలను ఎక్కడ పరుగెత్తిస్తారు?
 రోడ్డు మీదో, ఊరి బయటో.
 మరి కుండల్లో పరుగెత్తిస్తారా ఎవరైనా!
 వంట గురించి ఏమీ తెలియకపోయినా వంటగదిలో దూరి ‘అలా చేయాలి ఇలా చేయాలి’ అని  ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ల విషయంలోనూ ఇది ఉపయోగిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement