Nandita Das
-
బ్లాక్ బస్టర్ మూవీ.. దాదాపు 22 ఏళ్ల తర్వాత వస్తోంది!
కోలీవుడ్‌లో మరచిపోలేని చిత్రాల్లో అళగి ఒకటని చెప్పుకోవచ్చు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తంగర్ బచ్చన్ తెరకెక్కించిన తొలి చిత్రం ఇదే. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. హృదయాలను హత్తుకునే కథా, కథనాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. నటుడు పార్తీపన్, నందితాదాస్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఉదయగీత సినీ క్రియేషన్స్ పతాకంపై ఉదయకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. 2002లో విడుదలైన ఈ వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రం అప్పుట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా చెప్పాలంటే కమలహాసన్ నటించిన పంబల్ కే.సంబంధం, అజిత్ హీరోగా నటించిన రెడ్ వంటి భారీ చిత్రాల మధ్య విడుదలైన అళగి చిత్రం అన్నింటికంటే పెద్ద విజయం సాధించింది. ఇళయరాజా సంగీత బాణీలు సంగీత ప్రియులను అలరించాయి. తీరం దాటని పాఠశాల ప్రేమకథా చిత్రంగా అళగి తెరకెక్కింది. ఈ తరం ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన చిత్రం అళగి. ఈ తరం యువతకు అందించాలనే ఉద్దేశంతో అళగి చిత్రాన్ని 22 ఏళ్ల తరువాత మళ్లీ ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో కొత్త హంగులు అద్ది.. ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఉదయకుమార్ తెలిపారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులందరూ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ తరం యువత చూడాల్సిన కథా చిత్రం అళగి అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడాన్ని దర్శకుడు తంగర్‌బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారన్నారు. దీనికి ఆయన సహకారం చాలా ఉందని చెప్పారు. ఇకపోతే అళగి చిత్రానికి సీక్వెల్‌ను కూడా చేసే ఆలోచన ఉందని నిర్మాత ఉదయకుమార్ చెప్పారు. -
లెజెండరీ బాలీవుడ్ నటుడి కుమార్తె మృతి
ప్రముఖ లెజెండరీ బాలీవుడ్ నటుడు అశోక్ కుమార్ కూతురు, నటి భారతి జాఫ్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె అల్లుడు, నటుడు కమల్జీత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఆమె దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. భారతీ జాఫ్రీ 'హజార్ చౌరాసి కి మా', 'సాన్స్', 'దమన్' వంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. భారతి సయీద్ జాఫ్రీ సోదరుడు హమీద్ జాఫ్రీని వివాహం చేసుకున్నారు. (చదవండి: Raju Srivastava Death: విషాదం.. ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ మృతి) భారతి మరణవార్త తెలుసుకున్న ప్రముఖ నటి, కొరియోగ్రాఫర్ నందితా దాస్ ఆమెతో కలిసి ఉన్న మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'నేను ఆమెను చాలా మిస్ అవుతున్నా. భారతీ జాఫ్రీ ఒక మంచి వ్యక్తి. ఆమెను కోల్పోవడం బాధాకరం. భారతి ఆలోచనా విధానం చాలా గొప్పది. చాలా ప్రతిభావంతురాలైన నటి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా." అని అన్నారు. భారతి అల్లుడు కన్వల్ జీత్ సింగ్ అత్తను తలుచుకుంటూ తీవ్ర భావోద్వేగానకి లోనయ్యారు. 'మాకు అన్నీ తానై ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆమె మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. బుధవారం ఆమె అంతిమక్రియలు చెంబూర్ క్యాంపులో నిర్వహిస్తాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ సంతాపం ప్రకటించారు. View this post on Instagram A post shared by Kanwaljit Singh (@kanwaljit19) -
‘డీ గ్లామరస్’ హీరోయిన్లు.. దేనికైనా రెడీ
హీరోయిన్ అంటే అమాయకంగా ఉండి.. హీరో ఏడిపిస్తే ఉడుక్కుని.. నాలుగు పాటల్లో స్టెప్పులేసి... ఎండ్ కార్డులో గ్రూపు ఫొటోలో కనిపించే రోజులు పోయాయి. ‘గ్లామరస్ హీరోయిన్’ అనిపించుకున్న నాయికలు ‘డీ గ్లామరస్’గా కనిపిస్తున్న రోజులు ఇవి. క్యారెక్టర్ కోసం క్యారెక్టర్‌కి తగినట్లుగా కనబడుతున్నారు. 2021లో తెరపై నాయికల క్యారెక్టర్ కనబడింది. ఆ క్యారెక్టర్స్‌ని చూద్దాం. ‘పరేశానురా.. పరేశానురా.. ప్రేమన్నదే పరేశానురా’.. అంటూ ‘ధృవ’లో మెరుపు తీగలా కనిపించిన రకుల్ ప్రీత్‌సింగ్‌ని చూసి యూత్ పరేశాన్ అయ్యారు. కెరీర్ ఆరంభించిన ఏడేళ్లల్లో రకుల్ చేసినవన్నీ గ్లామరస్ రోల్సే కాబట్టి ‘గ్లామరస్ హీరోయిన్’ అనే స్టాంప్ బలంగా పడిపోయింది. అయితే అందుకు భిన్నంగా ‘కొండపొలం’లో గొర్రెల కాపరి ఓబులమ్మగా కనిపించారామె. ఈ అమ్మాయి ఎప్పుడూ గ్లామర్ పాత్రలే చేస్తుందేంటి? అనే ముద్రను ఓబులమ్మ చెరిపేయగలుగుతుందని రకుల్ నమ్మారు. ఆ నమ్మకం నిజమైంది. రకుల్ కంటే సీనియర్ అయిన ప్రియమణి ఖాతాలో కూడా గ్లామరస్ క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి. అయితే ‘నారప్ప’లో సుందరమ్మగా నల్లని మేకప్‌తో ఆకట్టుకున్నారు ప్రియమణి. మరోవైపు హీరోయిన్గా దూసుకెళుతున్న రష్మికా మందన్నా కూడా గ్లామర్ ఇమేజ్‌కి దూరంగా వెళ్లడానికి వెనకాడలేదు. ఇటీవల రిలీజైన ‘పుష్ప’లో ‘సామీ.. సామీ’ అంటూ అసలు సిసలైన పల్లె పిల్లలా కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచారీ బ్యూటీ. గ్లామర్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోయిన్లకు రచయితలు డీ–గ్లామరస్ రోల్స్ రాయడం, ఆ పాత్రలను సవాల్‌గా తీసుకుని నాయికలు ఒప్పుకోవడం అనేది మంచి మార్పు. మంచి మార్పు ఎప్పుడూ ఆహ్వానించదగ్గదే. 2022లోనూ తారల ‘క్యారెక్టర్ కనబడే’ పాత్రలు మరిన్ని వస్తున్నాయి. 2022లోనూ... 2021లో ‘నారప్ప’లో సుందరమ్మగా కనిపించిన ప్రియమణి ‘విరాటపర్వం’లో నక్సలైట్‌గా కనిపించనున్నారు. అడవిలో ఉండేవాళ్లు ఎలా ఉంటారు? కమిలిపోయిన చర్మంతో, ఎర్రబారిన జుత్తుతో.. ఈ సినిమాలో ప్రియమణి ఇలానే కనిపించనున్నారు. ఇదే సినిమాలో మరో సీనియర్ తార, దాదాపు డీ–గ్లామరస్ రోల్స్ చేసే నందితా దాస్ కూడా నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఇక నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ అంటే సాయిపల్లవి డేట్స్ ఉన్నాయేమో కనుక్కోండి అంటుంది ఇండస్ట్రీ. సాయిపల్లవి మీద గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించినదానికన్నా కాస్త డిఫరెంట్‌గా ‘విరాటపర్వం’లో కనిపించనున్నారామె. నిజానికి 2021లోనే ‘విరాటపర్వం’ విడుదల కావాలి. కానీ కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇక నటనకు అవకాశం ఉన్న పాత్ర, ఫుల్ ట్రెడిషనల్‌గా కనిపించే పాత్ర అంటే మహానటికి ఫోన్ వెళుతుంది. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో అంత అద్భుతంగా ఒదిగిపోయారు కీర్తీ సురేష్. కీర్తికి గ్లామరస్ హీరోయిన్ ట్యాగ్ లేదు. అయితే ఇప్పటివరకూ కనిపించని విధంగా తమిళ సినిమా ‘సాని కాయిదమ్’లో కనిపించనున్నారామె. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. -
ఆ సినిమాకు హీరో ఒక్క రూపాయి తీసుకున్నాడంతే!
ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హాసన్ మాంటో జీవిత కథ ఆధారంగా వచ్చిన చిత్రం "మాంటో". బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించాడు. నటి, దర్శకురాలు నందితా దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిషి కపూర్, రన్వీర్ షోరే, జావేద్ అక్తర్, పరేష్ రావల్, దివ్యా దత్త కీలక పాత్రల్లో నటించారు. అయితే వీరందరూ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా నటించారట. ఈ విషయాన్ని గతంలో నందితా దాస్ స్వయంగా మీడియాకు వెల్లడించింది. డబ్బుకు కాకుండా స్క్రిప్ట్‌కు విలువిచ్చి వారంతా పైసా తీసుకోలేదని పేర్కొంది. మరి ఈ సినిమాలో హీరోగా నటించిన నవాజుద్దీన్ ఎంత తీసుకున్నారనుకుంటున్నారు? అక్షరాలా ఒక్క రూపాయి. అవును, ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. "మాంటో సినిమా ద్వారా నా ఆలోచనలను, ఆశయాలను వ్యక్తీకరించాలనుకున్న నేను నందిత దగ్గర నుంచి డబ్బులు ఆశించానంటే అంతకన్నా అపరాధం మరొకటి ఉండదు. కానీ ప్రొఫెషనల్ నటుడిగా ఒక్క రూపాయి మాత్రం తీసుకున్నాను" అని నవాజుద్దీన్ చెప్పుకొచ్చాడు. చదవండి: రూ. 175 కోట్ల బంగ్లాలో హీరోయిన్ సహజీవనం సౌత్ నిర్మాత తన గదిలోకి రమ్మన్నాడు: సీనియర్ నటి -
ఆఖరి పర్వం
‘విరాటపర్వం’ చివరి దశకు వచ్చేసింది. కొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తికానుందని తెలిసింది. రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేశ్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఉద్యమకారుల పాత్రల్లో రానా, సాయి పల్లవి కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆఖరి షెడ్యూల్‌ను వికారాబాద్ అడవుల్లో›పూర్తి చేస్తున్నారు. రానా, సాయిపల్లవి మరియు ముఖ్య తారాగణం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. చిత్రీకరణ పూర్తయ్యేవరకూ చిత్రబృందం మొత్తం వికారాబాద్‌లోనే ఉంటుందని తెలిసింది. -
ఆమెను వింటున్నామా?
‘సమస్య ముందు నుంచీ ఉంది. ఇప్పుడు ఎక్కువైంది’ అని గుసగుసగా కంగారుగా చెబుతుంది అవతలి కంఠం ‘లిజన్ టు హర్’ షార్ట్‌ఫిల్మ్‌లో ఫోన్ ఎత్తిన నందితా దాస్‌తో. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నందితా దాస్ ఒక వర్కింగ్ ఉమన్. ‘లాక్డౌన్’ వల్ల ఇంట్లో నుంచి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ లో ఉంటుంది. కాని పిల్లవాడు మాటిమాటికి వచ్చి ఏదో ఒకటి అడుగుతుంటాడు. భర్త మరో గదిలో పెద్ద సౌండ్‌తో వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. మధ్యలో కాఫీ అడుగుతుంటాడు. ఇద్దరూ ఆమెను పని చేసుకోనిస్తే కదా. ఈ హడావిడిలో ఎలాగోలా వీడియో కాన్ఫెరెన్స్ మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ‘సఖి ఆర్గనైజేషన్’ కావాలి అవతలి వాళ్లకు. కాని రాంగ్ నంబర్‌గా నందితా దాస్‌కు వస్తుంది. ‘ఏవండి.. నాకు హెల్ప్ కావాలి. ఇంట్లో నా భర్త నన్ను హింసిస్తున్నాడు’ చిన్న గొంతుతో హడావిడిగా చెప్పబోతుంది అవతలి ఆమె. కాని ఇంతలో ఆమె భర్త తలుపు కొడుతుంటాడు. ఫోన్ ఆన్ లోనే ఉంటుంది. ఆమె వెళ్లి తలుపు తీసిన వెంటనే ‘ఇలానా వొండేది. నేనే దీనిని తినాలా’ అని కొట్టడం మొదలెడతాడు. చిన్న పిల్ల ఉన్నట్టుంది ఆ చిన్నారి కూడా ఏడుపు అందుకుంది. ఫోన్ ఇటువైపు పట్టుకొని ఉన్న నందితా దాస్‌కే కాదు చూస్తున్న ప్రేక్షకులకు కూడా గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. ఎలాగోలా వెళ్లి ఆ కొట్టడాన్ని ఆపాలని అనిపిస్తుంది. నందితాదాస్ పోలీసులకు ఫోన్ చేస్తుంది. వాళ్లు నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ దెబ్బలు తిన్న ఆమె మళ్లీ ఫోన్ చేస్తుంది. ‘ఉదయం సరుకుల కోసం వెళ్లి మూడు గంటలు క్యూలో చిక్కుకుపోయాను. వచ్చినప్పటి నుంచి కొడుతున్నాడు. నాకు సాయం కావాలి’ తన్నులు తిని గొంతు పూడుకుపోయి ఉంటుంది. పెగలని గొంతుతో గుసగుసగా మాట్లాడుతూ ఉంటుంది. నందితా దాస్ ఈసారి ఆమె కష్టం వినడానికి, ఓదార్పు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. కాని ఈలోపు భర్త ఏదో ఒకదానికి అదిలిస్తూ ఉంటాడు. అతనికి జడుస్తూ ఆమె అడ్జస్ట్ అవుతున్నదని అర్థమవుతుంటుంది. ఫోన్‌కు అవతలి పక్క ఆమె తన్నులు తింటోంది. ఇవతలి పక్క ఆమె తినడం లేదు. అంతే తేడా. చివరకు తాను ఎవరితో మాట్లాడుతూ ఉందో భర్తకు తెలియకుండా ఉండేందుకు నందితా దాస్ బాత్రూమ్లోకి వెళ్లడంతో షార్ట్‌ఫిల్మ్ ముగుస్తుంది. ‘గుసగుసగా చెప్పు. బయటకు చెప్పు. అరచి చెప్పు. కాని ఎలాగోలా చెప్పు’ అనే సందేశం ఇస్తుంది ఈ షార్ట్ ఫిల్మ్. లాక్డౌన్ సమయంలో గృహహింస పెరిగిందని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. దాని గురించి ఫిర్యాదు చేస్తున్నవారి కంటే మౌనంగా భరిస్తున్నవారి సంఖ్య అధికంగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించింది. గృహహింస ఎదుర్కొంటున్నవారు మౌనంగా భరించాల్సిన పని లేదని ఎవరికో ఒకరికి చెప్పుకుని ఊరట చెందాలని, సహాయం కోరాలని, ఫిర్యాదు చేయాలని ఈ షార్ట్ ఫిల్మ్ చెబుతోంది. నందితా దాస్ తాను నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన 7 నిమిషాల ఈ షార్ట్‌ఫిల్మ్ యూ ట్యూబ్‌లో ఉంది చూడండి. -
కేంద్రంపై బాలీవుడ్ నటి ఘాటు వ్యాఖ్యలు
జైపూర్ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా సాగుతున్న నిరసన జాబితాలో మరో ప్రముఖ నటి చేరారు. ప్రజా వ్యతిరేకమైన సీఏఏను స్వాగతించేది లేదంటూ ప్రముఖ బాలీవుడ్ నటి, దర్మకురాలు నందితా దాస్ స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజల పోరాటాన్ని ఆమె ప్రశంసించారు. వివిదాస్పద చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనల్లో ఎలాంటి రాజకీయ పార్టీలు పాల్గొనడంలేదని, పోరాటాలు స్వచ్ఛందంగా జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. గురువారం జైపూర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్ (జెఎల్ఎఫ్)లో నందితా దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా షాహీన్ బాగ్ వంటి మరిన్నో ప్రదేశాలు ఏర్పడబోతున్నాయని ఆమె జోస్యం చెప్పారు. నాలుగు తరాలుగా షాహీన్ బాగ్‌లో నివసిస్తున్న వారిని భారతీయులిగా నిరూపించుకోవాలిని కేంద్ర ప్రభుత్వం కోరాడం సరికాదన్నారు. ఇది చాలా విచారకరమని,దీనిపై ప్రతి ఒక్కరు మాట్లాడాలని, వాస్తవాలు తెలియజేసి పౌరులను ఆందోళనల్లో భాగస్వామ్యం చేయాలని నందితా పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీల రద్దుపై జరుగుతున్న ఉద్యమాలు విద్యార్థులు, సామాన్య ప్రజలు నడిపిస్తున్నారని, యువత చేస్తున్న పోరాటం అభినందనీయం అన్నారు. షాహీన్ బాగ్ పోరాటం దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలని, మిగతా ప్రాంతాలు కూడా షాహీన్ బాగ్ మాదిరిగా అవ్వాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే దేశ ఆర్థిక సంక్షోభంపై కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం, నిరుద్యోగ సమస్యతో దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన చెందారు. ఈ రకమైన నిరుద్యోగాన్ని ఎప్పుడూ చూడలేదని, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని ఆమె వాపోయారు. సినీ పెద్దలు దీనిపై స్పందించాలని ఆమె కోరారు. -
కేరాఫ్ కేరళ అడవులు
కేరళ అడవుల్లోకి మకాం మార్చారు రానా దగ్గుబాటి. మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారని తెలిసింది. తన కొత్త చిత్రం ‘విరాట పర్వం’ షూటింగ్ కోసమే ఈ కేరళ మకాం. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. నందితా దాస్, ప్రియమణి కీలక పాత్రలు చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్ ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: డాని సాంచెజ్–లోపెజ్. -
‘విరాటపర్వం’లో నందితా దాస్
నీది నాదీ ఒకే కథ చిత్రంలో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తదుపరి చిత్రంగా ‘విరాటపర్వం’ను ఎంచుకున్నాడు. 1990ల నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా, సాయి పల్లవిలు నటిస్తున్నారు. ఇటీవలె చిత్ర షూటింగ్‌ను ప్రారంభించింది యూనిట్. ఈ మూవీలోని ఓ కీలక పాత్రకు టబును ఎంచుకున్నట్లు, ఆమె కాదన్నాక ఆ క్యారెక్టర్‌ను ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్ దగ్గరకు వచ్చిందనే వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అయితే వాటిపై స్పందిస్తూ.. ఒకరి వదులుకున్న పాత్ర మరొకరు చేస్తే తప్పేంటి? నాకు కథ నచ్చింది, నా పాత్ర నచ్చింది అందుకే చేస్తున్నానటంటూ తేల్చిచెప్పింది. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్న నందితా దాస్ మాట్లాడుతూ.. ‘ చాలా కాలం తరువాత తెలుగు మాట్లాడుతున్నా.. కొంచెం కష్టంగా ఉన్నా ఒక్కసారి సెట్లోకి వచ్చాక అంతా బాగుంది. నాకు ఎంతో దగ్గరైన పాత్ర ఇది. ఇక్కడి బృందం ప్రొఫెషనల్‌గానే కాకుండా ఎంతో స్నేహంగా ఉంది. సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ యాక్టర్‌తో నటించడం చాలా ఆనందంగా ఉంది. రానా కోసం నేను ఎదురుచూస్తున్నా’ను అంటూ తెలిపింది. -
నేనూ.. మృణాల్‌దా
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారతీయ సినీదర్శకులు మృణాల్ సేన్ డిసెంబర్ 30న తొంభై ఐదేళ్ల వయసులో కన్నుమూశారు. అప్పటికి కొన్నాళ్లుగా ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. సేన్ చివరి శ్వాసకు కొన్ని రోజుల ముందు నటి నందితాదాస్ ఆయన్ని ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సంగతిని ఆయన మరణానంతరం.. నివాళిలో రాస్తూ, ‘నిశ్శబ్ద ఆత్మీయత’ అంటూ ఆయనతో తనకున్న ఇరవై ఏళ్ల అనుబంధం గురించి నందిత వెల్లడించారు. ఆ నివాళిలోని విశేషాంశాలివి. ‘‘మృణాల్సేన్ని కలవకపోతే నా కోల్‌కతా ట్రిప్ పూర్తి అయినట్లు అనిపించదు నాకు. చివరిసారిగా ఆయనను నేను 2018 నవంబరు 11 న ఇంటికి వెళ్లి కలిశాను. అది కూడా మా అబ్బాయిని వెంట తీసుకుని వెళ్లాను. అప్పుడు కోల్‌కతాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. నన్ను చూసిన ఆయన నా వైపు వచ్చి ఆప్యాయంగా నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. ఆ రోజంతా ఆయన సమక్షంలోనే గడిపాను. ఇప్పుడిక ఇటువంటి ఆప్యాయతతో కూడిన నిశ్శబ్దాలు లేవు. ఆ రోజున నన్ను.. నేను నటించిన ‘మంటో’ సినిమా గురించి అడిగారు. మా అబ్బాయి చదువు గురించి తెలుసుకున్నారు. ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని బయలుదేరడానికి ముందు, ఆయనతో ఫొటోలు తీయించుకున్నాను. అవే ఆయనతో గడిపే ఆఖరి క్షణాలు అవుతాయని నేనెలా ఊహించగలను? ఆయన మౌనంగా నిశీధిలోకి వెళ్లిపోయారని తెలిసి నా మనసు మూగబోయింది. ప్రేమ మీద నమ్మకం కలిగేది మృణాల్దాతో 20 సంవత్సరాలుగా నా హృదయం ఆప్యాయతను పెనవేసుకుని ఉంది. ఆయన జీవిత భాగస్వామి ‘గీతాదీ’ నిజంగానే ఆయన జీవితంలో భాగస్వామ్యం వహించారు. ఆయనకు బలమైన సహచరిగా నిలిచారు. ఆయన మౌనంగా ఉంటే, ఆవిడ ఆ నిశ్శబ్దాన్ని తన చిరునవ్వుతో కళకళలాడించేవారు. వారి ప్రేమానురాగాలు, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం చూస్తుంటే, నాకు నిజమైన ప్రేమ మీద నమ్మకం కలిగేది. రెండు సంవత్సరాల క్రితం గీతాదీ మమ్మల్ని వదిలేసి, మృణాల్దాని ఒంటరిని చేశారు. అప్పుడే ఆయన మనసు, ఆత్మ ఆవిడతో వెళ్లిపోయాయి. ఆవిడ నిష్క్రమణతో నిత్యం తనను వెన్నంటి ఉన్న ఆత్మవిశ్వాసం కూడా నిష్క్రమించిపోయింది. పారితోషికం ఇవ్వలేనన్నారు నాకు మృణాళ్‌దా పరిచయం అయిన రోజు నుంచి ఆయన నాతో ‘‘నేను నీతో ఒక సినిమా తీయబోతున్నాను. నువ్వు నాకు స్మితాజీని గుర్తు చేస్తున్నావు. ఒక నటిగా కాదు, ఒక వ్యక్తిగా ఆవిడ నాకు గుర్తుకు వస్తుంది’’ అనేవారు. 2002లో ఎట్టకేలకు ఆయన నాతో చిత్రం చేశారు, ఆమార్ భువన్. అదే ఆయన చివరి సినిమా. బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక ముస్లిం కుటుంబానికి చెందిన కథ ఇది. ఇదొక లవ్ ట్రయాంగిల్ కథ. అందులో నేను సకినా పాత్ర ధరించాను. ఇద్దరు అన్నదమ్ములకి, సకినాకి మధ్య జరిగిన సంఘర్షణ ఈ కథ. షూటింగ్ ప్రారంభం కావడానికి పదిహేను రోజుల ముందు, మృణాళ్‌దా నాకు ఫోన్ చేశారు, నిర్మాతలు ముస్లిం కుటుంబానికి చెందిన కథకు డబ్బులు పెట్టడానికి అంగీకరించట్లేదన్నారు. నాకు చాలా బాధ వేసింది. ఆ కథ గుజరాత్ అల్లర్లు జరిగిన రోజులు కావడంతో, మత విద్వేషాలు బయలుదేరతాయని భావించి ఉంటారు. ముస్లిం సెట్టింగ్ వేసినంత మాత్రాన గొడవలేమీ జరిగిపోవని నేను అన్నాను. ఆయన నా మాటలకు స్పందిస్తారని అనుకోలేదు. ‘‘మనం మన దగ్గర ఉన్న డబ్బుతోనే ఈ సినిమా తీసేద్దాం. నేను నీకు పారితోషికం ఇచ్చుకోలేను’’ అన్నారు. ఇచ్ఛామతి నది ఒడ్డున టాకీ అనే గ్రామంలో షూటింగ్ ప్రారంభించాం. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు షూటింగ్ పూర్తయ్యాక, రిలాక్సేషన్ కోసం ఎవరో ఒకరి ఇంటికి వెళ్లేదాన్ని. ఆ రోజు నేను టాకీ గ్రామానికి చేరుకునేసరికి, గ్రామమంతా ఈ షూటింగ్లో ఇన్వాల్వ్ అయ్యారని అర్థం చేసుకున్నాను. మాలో ఐదుగురు.. మృణాళ్‌దా, ప్రధాన తారాగణం.. ఒక గెస్ట్ హౌస్‌లో ఉన్నాం. దీనికి ఎదురుగా ఇచ్ఛామతి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుంది. నదికి ఆవలి ఒడ్డున బంగ్లాదేశ్ ఉంది. మృణాల్‌దా బంగ్లాదేశ్‌లో సూర్యోదయం, భారతదేశంలో సూర్యాస్తమయం చూశారు. ఇందుకు ప్రత్యేక కారణం ఉంది. మృణాల్‌దా ఫరీద్పూర్ (బంగ్లాదేశ్)లో జన్మించారు. అప్పుడప్పుడు మృణాల్‌దా తన జీవితానికి సంబంధించిన ఎన్నో కథలు చెప్పేవారు. ఆయనకు ప్రతి విషయం మీద ఆసక్తి ఎక్కువ. డిన్నర్లో మేం తినే చేప గురించి కూడా తెలుసుకునేవారు. తన మనసుకు నచ్చిన ప్రతి విషయాన్ని నాతో పంచుకునేవారు, కళాకారులంటే ప్రత్యేకమైన వారు కాదు, వారు కూడా నిత్య జీవితంలో భాగమే అని ఆయన నమ్మకం. ఆయన పెట్టిన జ్ఞానభిక్షే నేను ఆయన ఇంటికి చేరేసరికి, ఆ ఇల్లు గీతాదీ, మృణాళ్‌దా లేకుండా నిర్జీవంగా కనిపించింది. కాని నేను అక్కడకు వెళ్లాను. ఆయనను కడసారి చూడటానికి మాత్రమే కాదు, ఆయన ఏకైక కుమారుడు కునాల్ సేన్‌ను కలవడానికి. తండ్రి ఔన్నత్యాన్ని, తల్లి శక్తిని తనలో ఇముడ్చుకున్నాడు కునాల్సేన్. కునాల్ తన తండ్రిని బొంధు (స్నేహితుడు) అని పిలిచేవాడు. ఆయన కునాల్‌కి మాత్రమే కాదు ఎంతో మందికి బొంధు. అందరికీ కాకపోవచ్చు. నాకు మాత్రం ఆయన అసలుసిసలైన స్నేహితుడు, మార్గదర్శకుడు, గురువు.. ఇంకా ఎన్నో. సామాన్యులకు సంబంధించిన కథలను చిత్రాలుగా తీయడమే మనం ఆయనకు సమర్పించే నిజమైన నివాళి. మృణాల్‌దా మహాభినిష్క్రమణంతో ఒక శకం ముగిసింది. నేను ఆయనను తరచుగా కలిసి ఉండకపోతే, ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయి ఉండేదాన్ని. ఆయన ఎప్పటికీ జీవించి ఉండాలనేదే నా స్వార్థమైన కోర్కె. ఆయనను, ఆయన పనులను మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. – స్వేచ్ఛానువాదం: వైజయంతి పురాణపండ నిరాడంబర జీవితం... మృణాళ్‌దా చాలా సామాన్య జీవితం గyì పారు. మరణంలోను అదే ఎంచుకున్నారు. తనకు అభిమాన సంఘాలు వద్దని తన కుటుంబీకులకు స్పష్టంగా చెప్పారు. ఆయన స్థాయికి ఎంతో గౌరవం పొందవచ్చు. గన్ శాల్యూట్, లక్షలాది మంది అభిమానుల ప్రేమ, బొకేలు, ప్రణామాలు అన్నీ అందుకోవచ్చు. ఆయన అవేవీ వద్దనుకున్నారు. ఆయనను ప్రేమించేవార ంతా ఆయన కోర్కెను నెరవేర్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న వారంతా నిశ్శబ్దంగా ఆయన వెంట నడిచారు. ఒక సామాన్య వ్యక్తిలాగే ఆయన అంతిమయాత్ర ముగిసింది. -
మీటూ : తండ్రి మీద ఆరోపణలు.. బాధితులకే మద్దతంటున్న నటి
నా తండ్రిపై ఆరోషణలు వచ్చినప్పటికి కూడా నేను మీటూ ఉద్యమానికే మద్దతిస్తాను అంటున్నారు ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్. మీటూ ఉద్యమం విస్తరిస్తోన్న నేపథ్యంలో నందితా దాస్ తండ్రి జతిన్ దాస్ మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి. పేపర్ తయారు చేసే ఓ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు జతిన్ దాస్‌పై లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 14 ఏళ్ల క్రితం జతిన్ దాస్ తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆయన చేష్టలు చాలా ‘వల్గర్’గా ఉన్నాయంటూ సదరు మహిళ ఆరోపించారు. ఈ ఆరోపణలపై జతిన్ దాస్ కుమార్తె నందితా దాస్ స్పందించారు. ‘నా తండ్రి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అయినా ఇప్పటికి కూడా నేను మీటూకే మద్దతిస్తున్నాను. వేధింపులు ఎదుర్కొన్న బాధితులందరికి తోడుగా ఉంటాను. ఇక నా తండ్రి మీద వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. వాస్తవాలను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఆరోపణలు చేస్తున్న మహిళలు తమ మాటల పట్ల ఖచ్చితంగా ఉండాలి. తప్పుడు ఆరోపణలు చేస్తే ఈ ఉద్యమం దెబ్బతినే ప్రమాదం ఉంది’ అన్నారు. -
‘వారితో కలిసి పని చేయం’
దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిల్చేందుకు ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీలోని ప్రముఖ మహిళలు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని ఓ 11 మంది ప్రమఖులు ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో.. నిరూపితమైన నేరస్తులతో ఇక మీదట కలిసి పని చేసేది లేదని తీర్మానించారు. ఇందుకు అనుగుణంగా సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. అంతేకాక కిరణ్ రావ్, కొంకణా సేన్ శర్మ, నందితా దాస్, మేఘ్న గుల్జార్, నిత్యా మిశ్రా, రీమా కగ్తీ, రుచి నరైన్, అలంక్రితా శ్రీవాస్తవ, గౌరి షిండే, షోనాలి బోసే, జోయా అఖ్తర్ వంటి ప్రముఖులు ఈ లేఖ మీద సంతకం చేశారు. #metooindia pic.twitter.com/19a6Duj6IR — Konkona Sensharma (@konkonas) October 14, 2018 ఈ లేఖలో ‘ఓ మహిళగా, చిత్ర పరిశ్రమకు చెందిన వారిగా మేము ‘మీటూ ఉద్యమా’నికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము. వేధింపుల గురించి బయటకు వెల్లడించిన వారికి అండగా నిలుస్తాము. వారి ధైర్యాన్ని అభినందిస్తున్నాము. ఇక మీదట పరిశ్రమలో ఒక సురక్షితమైన, వివక్షకు తావులేని వాతావరణాన్ని సృష్టించాడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాము. నిరూపితమైన నేరస్తులతో పని చేయకూడదని నిర్ణయించుకున్నాము. మా సహచరులను కూడా అదే విధంగా చేయమని కోరుతున్నామం’టూ లేఖలో తెలిపారు. మీటూ ఉద్యమం ఫలితంగా ఇప్పటికే అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు పలు చిత్రాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
స్త్రీల కోసం చిందిన సిరా చుక్క
చాలా పాత మొహల్లా అది.టాంగాలు నడుస్తున్నాయి. తాగుబోతులు తిరుగాడుతున్నారు. స్త్రీలను వేటాడేవారు జుబ్బాల జేబుల్లో చిల్లర పడేసుకొని కొనడానికి తిరుగుతున్నారు. ‘సార్.. అమ్మాయి కావాలా సార్’ అడిగాడతను ఒక పెద్దమనిషిని. ‘రండి సార్.. పైనే ఉంది’ తీసుకెళ్లాడు. మురికిగా ఉన్న మహల్ అది. చిన్న చిన్న గదులు. మురికి పనుల కోసంగా ఉన్న గదులు. మురికి సమయాలలో రద్దీగా ఉండే గదులు. మెట్ల మీదుగా నడిపించుకుంటూ తీసుకెళుతున్నాడు. ‘ఇటు... ఇటు..’గడప దగ్గర నిలబెట్టి లోపలికెళ్లాడు. కొద్దిగా తెరిచిన తలుపు నుంచి లోపల ఏముందో కనిపిస్తూ ఉంది.కుక్కి మంచం. దాని మీద ఒక ప్రాణం లాంటి ప్రాణం. స్త్రీ ప్రాణం.‘లెయ్వే... లెయ్... గిరాకీ వచ్చింది లెయ్’ లేవలేదు. నిద్రపోతూ ఉంది. మొద్దుగా నిద్ర పోతూ ఉంది. శవంలా నిద్రపోతూ ఉంది. ‘లెయ్మంటున్నానా’ నీళ్లు మొహాన కొట్టి బలవంతంగా లేపాడు. ‘వద్దు.. ఓపిక లేదు... పంపించెయ్’ ‘ఇదే ఆఖరు... ఆ తర్వాత నిద్ర పోదూగానీ’ ‘అయ్యో.. నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా. నేను నిద్రపోయి ఎంత కాలం అయ్యింది. నాకు నిద్ర వస్తోంది.దండం పెడతాను. పంపించేయ్’ ‘ఇదొక్కటే అన్నానా. ఏం తమాషాగా ఉందా’ జుట్టు పట్టుకున్నాడు. స్త్రీ. నలిగి నలిగిపోయి ఉన్న స్త్రీ. నలిపి వేయబడిన స్త్రీ. శవంలా జీవచ్ఛవంలా మారిన స్త్రీ. ఏమడుగుతోంది. మణులా మాణిక్యాలా. నిద్ర. గుక్కెడు నిద్ర. బాధల్ని క్షోభల్ని కాసేపైనా మర్చిపోయేలా చేయగలిగే నిద్ర. ఇవ్వట్లేదే రాక్షసుడు. ‘చెప్పినమాట వింటావా లేదా’ ఛెళ్లున కొట్టాడు.‘ఒరేయ్ రాక్షసుడా’ కాళి అయ్యింది. అపరకాళిలా తిరగబడింది. రక్కింది. ముఖాన పీకింది. తల మంచానికేసి బాదింది. కింద పడ్డాడు. పోయాడు. ఊపిరి తీసుకునే వ్యవధి కూడా లేనట్టుగా పోయాడు. శవం. కాని అదంతా ఆమెకు ఎందుకు. ఆమెకు కావలసింది నిద్ర. హాయిగా పట్టే నిద్ర. అప్పుడిక ఆమె ఆ కుక్కిమంచం మీద, మగాళ్లు నిద్రపోనివ్వని మంచం మీద, దారుణ ఆక్రమణల మంచం మీద తన కోసం తాను తన కోసంగా తాను నిద్ర పోయింది.మంటో రాసిన కథ ఇది. ఇప్పుడు కాదు 60 ఏళ్ల క్రితం. దేశ విభజన జరిగింది. ఇరు ప్రాంతాల వాళ్లు కత్తులు ఝళిపిస్తున్నారు. నెత్తురు చిందిస్తున్నారు. శవానికి శవంతో జవాబు చెబుతున్నారు. ద్వేషాన్ని ద్వేషంతో నూరుతున్నారు. తలల్లో స్పృహ లేదు. చేతుల్లో కత్తులు మాత్రమే ఉన్న కాలం అది. పురుషుడు దొరికితే సంహరించు. స్త్రీ దొరికితే చెరిచెయ్.అలాంటి సమయంలో సరిహద్దు మీద ఒక తండ్రి వెతుకులాడుతున్నాడు. కూతురుని. కన్నకూతురిని. ‘నా కూతురుని చూశావా బాబూ’‘నీ కూతురు ఎలా ఉంటుంది ముసలాయనా?’‘ఎర్రగా తామరపువ్వులా ఉంటుంది. కురులు విప్పితే అప్సరసలా ఉంటుంది. బుగ్గన పెద్ద పుట్టుమచ్చ. అందమైన కూతురు. అమాయకమైన కూతురు. పదహారేళ్ల కూతురు...నాకూతురుని చూశారా బాబూ’...బిడారుల్లో ఏడుపులు... శిబిరాల్లో శోకాలు... వలస పోయేవాళ్ల ఏడ్పులు... వలస వస్తున్నవాళ్ల ఆర్తనాదాలు... కూతురు కనిపించడం లేదే...ఎక్కడో ఒక మూలన ఆ అమ్మాయి కనిపించిందని ఎవరో చెప్పారు.తండ్రి పరిగెత్తాడు. పరిగెత్తి కూతురిని చూశాడు. గుండెలకు హత్తుకుంటూ చూశాడు. కన్నీళ్లను ఆ అమ్మాయి గొంతులోకి ఒంపుతూ ప్రాణాలు దక్కించుకోవడానికి చూశాడు. భుజాల మీద వేసుకొని హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. హాస్పిటల్ బెడ్ మీద కూతురు పడి ఉంది. కొనఊపిరితో ఉంది. ‘డాక్టర్ సాబ్... నా కూతురిని బతికించండి డాక్టర్ సాబ్’ పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్‌ను తీసుకొచ్చాడు.డాక్టర్ వచ్చి నాడీ పట్టుకుని చూశాడు. పేరు పెట్టి పిలిచాడు. కదలిక లేదు. కేసు అర్థం కావడం లేదు. పరికించి చూద్దామంటే గది చీకటిగా ఉంది. గాలాడక చిరాగ్గా ఉంది. పక్కనే ఉన్న కిటికీ రెక్కను చూపిస్తూ ‘విప్పు’ అన్నాడు. తండ్రికి సరిగ్గా వినపడలేదు. ‘దానిని విప్పు’ అన్నాడు.అప్పుడు అనూహ్యంగా ఒకటి జరిగింది.ఆ మాటకు ఆ అమ్మాయిలో కదలిక వచ్చింది. మెల్లగా చేతులు రెంటిలోనూ సత్తువ తెచ్చుకుని వణుకుతూ భయం భయంగా తన పైజామా బొందును ‘విప్పడం’ మొదలుపెట్టింది.కథ ముగిసింది.ఇది కూడా మంటో రాసిన కథే. మంటోగా పిలువబడే ప్రపంచాన ప్రసిద్ధమైన ‘సాదత్ హసన్ మంటో’ స్త్రీల కోసం రాశాడు. స్త్రీ దుఃఖాన్ని లోకానికి చెప్పడానికి రాశాడు. స్త్రీ నిజమైన వేదనను చూస్తే షాక్ అవుతారని చెప్తూ షాకయ్యే పద్ధతిలో రాసి నేల కదిలిపోయేలా చేశాడు. స్వాతంత్య్రం వచ్చే సమయాన బాంబే (ముంబై)లో ఉన్న మంటో అక్కడి వేశ్యల జీవితాల్ని పరిశీలించాడు. అప్పటి వరకూ ఉర్దూ కథా సాహిత్యంలో మర్యాదకరమైన కథలు వస్తున్న సమయంలో వారి జీవితాన్ని కథా వస్తువుగా తీసుకుని లోకాన్ని హడలెత్తించాడు. అందుకు కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగాడు. అయినా భయపడలేదు. ‘వేశ్యల దగ్గరకు వెళ్లడానికి మనకు పర్మిషన్ ఉందిగానీ వారి జీవితాన్ని రాయడానికి పర్మిషన్ లేదా’ అని మంటో ప్రశ్నించాడు. ‘దేశభక్తి కథలు, కార్మికుల కథలు రాయమని అందరూ నన్ను అడుగుతుంటారు. కాని వేశ్యావాటికలో మూసిన తలుపుల వెనుక ఉన్న హింసకు మించిన వస్తువు నా వద్ద లేదు. వాళ్లు మన సమాజంలో భాగం. వారి గురించి రాయాలి’ అన్నాడు మంటో. ఆ రోజులలోనే ఆయన బాంబే శ్రీమంతులు తమ లైంగిక విశృంఖలత్వం కోసం నిరుపేద పసిపిల్లలను ఎలా ఉపయోగించుకునేవారో రాసి సమాజపు పైపై పూతల పరదాలను చీలికలు పీలికలు చేశాడు. అమృత్‌సర్‌లో పుట్టిన సాదత్ హసన్ మంటో భారతదేశాన్ని అందునా బాంబేని విపరీతంగా ప్రేమించాడు. ఆరాధించాడు. బాంబేలో హీరో అశోక్ కుమార్ కీలకపాత్ర పోషించిన ‘బాంబే టాకిస్’ స్టుడియోలో స్క్రిప్ట్ రైటర్‌గా ఉండేవాడు. కాని దేశ విభజన సమయంలో ‘ముస్లిం ఉద్యోగులు’ ఎక్కువ మంది బాంబే టాకిస్లో పని చేస్తున్నారు కనుక ఆ స్టుడియోను తగులబెడతాం అని ఆ రోజులలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. అవి విని మంటో కలత చెందాడు. అంతేకాదు ‘హృదయంలో ఉండవలసిన మతం తలకెక్కి’ విషం చిమ్ముతున్న సమయాలను చూసి విషాదపడ్డాడు. ‘నా దేశం పాకిస్తానా?’ అనే ప్రశ్నతో అతడు లాహోర్ చేరుకున్నాడు. కాని అక్కడకు వెళ్లినా అతడు అనుక్షణం బాంబేను కలవరిస్తూ బతికాడు. 1948లో మంటో పాకిస్తాన్ వెళితే ఆ దేశంలో అతను కేవలం ఏడేళ్లే జీవించగలిగాడు. ‘నా తల్లిదండ్రులు ఖననమైన మట్టి భారతదేశంలో ఉంది. నన్ను ముక్కలు చేసి ఇచ్చిన ఈ స్వాతంత్య్రం శోకమే మిగిల్చింది’ అన్న మంటో 1955లో మరణించాడు. ∙∙ మంటో రాసిన కథల్లో ‘ఠండా గోష్’ (చల్లటి మాంసం) అతడికి విశేషమైన పేరును, కీర్తిని, పీడకలలను మిగిల్చిన కోర్టు కేసులను ఇచ్చింది. ఆ కథలో అతడు వాడిన భాష, తీసుకున్న కథాంశం ఇప్పటికీ యథాతథంగా ప్రచురించడం కష్టం– మెయిన్‌స్ట్రీమ్ పత్రికలలో. మానవ ప్రవర్తనలోని పశుత్వాన్ని, కర్కశత్వాన్ని, స్వార్థాన్ని, పర్వెర్షన్ను మంటో చెప్తూ వెళ్లాడు. నగ్నంగా చూపుతూ వెళ్లాడు. ‘ఇలా రాయడం తప్పు కాదా... రచయితకు బాధ్యత ఉండక్కర్లేదా’ అనంటే ‘వేపాకులు చేదుగానే ఉంటాయి. కాని అవి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి’ అని జవాబు చెప్పాడు. అతడి ఒక కథలో ఒక ముసలి దంపతుల ఇంట్లో ఒక వేరే మతస్తుడు శరణుజొచ్చుతాడు. ఆ ముసలి దంపతులు చాలా మంచివాళ్లు. చీమకు కూడా అపకారం తలపెట్టరు. కాని తమ ఇంట్లో శరణుజొచ్చింది అన్య మతస్తుడు. అప్పుడు వాళ్లు బాగా ఆలోచించి తాము మంచివారం గనక ఒక నిర్ణయం తీసుకుంటారు. ‘మనకెందుకు ఆ పక్కింటి వాళ్లకు ఇతణ్ణి అప్పజెబుదాం. వాళ్లయితే రోజుకొరిని చంపుతున్నారు. ఇతడి సంగతి వాళ్లే చూసుకుంటారు’.ఇలా చెంపకు పట్టి కొట్టినట్టు అతడు కథలు రాశారు.అతడి కథల్లో ఇవాళ్టి మనుషులు కనిపిస్తారు. రేపటి మనుషులు కనిపిస్తారు. నైచ్యం వదులుకోని మనిషి ఉన్నంత కాలం మంటో కథ ఉంటుంది. ‘మంటో’ మీద అనేక నాటకాలు, వ్యాసాలు వచ్చాయి. భారతదేశంలో సినిమా రావడం ఇదే మొదటిసారి. సుప్రసిద్ధ నటి, దర్శకురాలు నందితా దాస్ ‘మంటో’ జీవితకథను తెరకెక్కించింది. మంటో మీద ఉన్న గౌరవంతో నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కేవలం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్‌తో ఈ సినిమాలో నటించాడు. ఒక రచయిత జీవితం, సత్యం పలకాలనుకున్న ఒక రచయిత జీవితం, సత్యానికి నిలబడి సమాజపు నిర్దాక్షిణ్యతను చవి చూసిన ఒక రచయిత జీవితం, తన నేలకు దూరమయ్యి అస్థిమితత్వం పొందిన రచయిత జీవితం ఈ జీవితాన్ని మాత్రమే కాదు... దేశ విభజన ఈ దేశ ప్రజల మీద ఎటువంటి గాయాన్ని కలిగించిందో కూడా ఈ సినిమా చూపుతుంది.మనిషి కోసం మాట్లాడే రచయితలకు బెదిరింపులు, మరణ సందేశాలు వస్తున్న ఇవాళ్టి రోజులలో, ఏ ఉన్మాదాన్నైనా ఖండించాల్సిందే అని కలం పట్టుకునేవారి నోళ్లు మూయించాలనుకుంటున్న ఈ రోజులలో, ప్రజల మధ్య ద్వేషాన్ని కడిగిపారేయడానికి సిరాను నింపుకునేవాళ్ల కలాల ములుకు విరగ్గొడుతున్న ఈ రోజులలో మంటో అవసరం ఉంది.వంద మంటోల అవసరం ఉంది. వేయి మంటోలు ప్రభవించాల్సిన అవసరం ఉంది.సినిమా థియేటర్స్‌లో ఉంది. వెళ్లి మంటోతో పాటు ఒక కథకు కన్నీరు కార్చండి. ఒక కథకు దగ్ధమవ్వండి. నందితా దాస్ ఇచ్చిన మరో కానుక స్త్రీల కోసం రాసిన రచయిత జీవితాన్ని ఒక మహిళా డైరెక్టర్ తెర మీదకు అనువదించడం విశేషమైన అంశం. మంటో జీవిత కథను తెరకెక్కించడానికి నటి, దర్శకురాలు నందితా దాస్ దాదాపు నాలుగు సంవత్సరాలు వెచ్చించారు. రీసెర్చ్ చేశారు. పాకిస్తాన్ వెళ్లి మంటో ముగ్గురు కుమార్తెలను, స్నేహితులను కలిసి మంటో జీవితాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మంటో జీవితం గురించి చూపుతూనే ఆయనకు విశేషమైన పేరు తెచ్చిన కథలకు ఈ సినిమాలో చోటిచ్చారు. ‘ఖోల్దో’, ‘టొబా టేక్సింగ్’, ‘ఠండా గోష్’ కథలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇది పిరియడ్ ఫిల్మ్. ఆ కాలం వాతావరణం కల్పించడానికి 1950ల నాటి బాంబే, లాహోర్ల వాతావరణం సృష్టించడానికి నందితా అథెంటిక్ బ్యాక్‌గ్రౌండ్‌ను సృష్టించడంలో ప్రతిభ చూపారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల మంటోతో పాటు నందితాకు కూడా ఆలింగనం ఇస్తారు. – ఖదీర్ -
మైమరపించిన ‘మాంటో’
-
పాకిస్తాన్లో రాజమౌళి, నందితా దాస్
కరాచీ: పొరుగుదేశం పాకిస్తాన్‌లోని కరాచీలో జరుగుతున్న ‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’కు ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ, నటులు నందితా దాస్, వినయ్ పాఠక్ తదితరులు హాజరయ్యారు. ‘జానర్ బస్టర్స్’ అనే అంశంపై వీరు మాట్లాడారు. ఓ సినిమాకు గొప్ప కథ ఉంటే అది వాణిజ్య పరమైన చిత్రమైనా, కళాత్మకమైనదైనా కచ్చితంగా విజయం సాధిస్తుందని రాజమౌళి అన్నారు. భారత్‌లో ప్రస్తుతం కళాత్మక, స్వతంత్ర సినిమాలకు స్థానం లేకుండా పోతోందనీ, వాణిజ్య చిత్రాలకు మాత్రమే రోజులు ఉన్నాయా అన్నట్లు పరిస్థితి తయారైందని నటి నందితా దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అన్ని రకాల సినిమాలూ రావాలి. ప్రతి సినిమాలోనూ పాటలు, పోరాట సన్నివేశాలు ఉండి కథ సుఖాంతమే అవ్వాల్సిన అవసరం ఉండకూడదు’ అని ఆమె పేర్కొన్నారు. -
ఫిరాఖ్, ఫైర్ సినిమాలను తీయగలమా?
సాక్షి, కోల్‌కతా: నటి, దర్శకురాలు నందితా దాస్ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. నటులు, రచయితలకు ఇది గడ్డుకాలమని వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమని పేర్కొన్నారు. గతంలో తీసిన కళాత్మక, ఉత్తమ సినిమాలను ఇపుడు తీయగలమా అనే భావం కలుగుతోందన్నారు. సంజయ్ లీలా బన్సాలీ చిత్రం పద్మావత్ వివాదంపై స్పందించిన నందితా దాస్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టాటా స్టీల్ సాహిత్యోత్సవంలో పాల్గొన్న ఆమె ఫిరాఖ్,(గుజరాత్ మతవిద్వేషం,మానవహననం నేపధ్యంలో సాగే కథ, నందితా దాస్ దర్శకత్వంలో తొలి చిత్రం, ఉత్తమ చిత్రం అవార్డు ) (2008) , ఫైర్(1996) లాంటి చిత్రాలు తీయడం తనకు ఇపుడు సాధ్యమో కాదో తెలియదుకానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మూవీలు తీయడం ఎప్పటికీ సాధ్యంకాదని అన్నారు. అలాగే ఎన్నోఏళ్ల క్రితం శ్యాం బెనగల్ తీసిన భారత్ ఏక్ ఖోజ్ సినిమాలో పద్మావతికి సంబంధించిన అంశం ఉంటుందని తెలిపారు. ఇష్టం ఉన్నా లేకపోయినా.. అలాంటి చిత్రాలను స్వాగతించాం, కానీ ఇపుడు నటులు, రచయితలు భయానక సమయంలో ఉన్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా..ముందుగానే రచయితలు మరింత బాధ్యతగా, సెల్ఫ్ సెన్సార్‌గా ఉండాలని సూచించారు. దురదృష్టవశాత్తూ సమాజంలోని కొన్ని వర్గాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికీ అసమ్మతి , భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిని పెంచినప్పటికీ , హింసను ప్రేరేపించడం దారుణమన్నారు. మనకు ప్రతీ సినిమా నచ్చాలని లేదు. అలాగే నచ్చని అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసే ప్లాట్‌ఫాంలు కూడా చాలానే అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆ స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది. అలాకాకుండా హింసామార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ మాంటోకు సంబంధించన వివరాలను పంచుకున్నారు. విభజన సమయంలో (1946-50) రచయిత సాడాత్ హసన్ మాంటో జీవితంపై ఆధారపడి తీస్తున్న చిత్రానికి సంబంధించి కంటెంటే తనకు ప్రధానమని చెప్పారు. -
భయం మంచిది కాదు
నందితాదాస్ విలక్షణమైన నటి, దర్శకురాలు. పది భాషల్లో 40 సినిమాల్లో నటించారు. దీపామెహ్‌తా తీసిన ‘ఫైర్’ (1996) చిత్రంలో యాక్ట్ చేసినందుకు ఎన్నో మాటలు పడ్డారు. భారతీయ సంస్కృతిని మంటకలిపేసిందని సంప్రదాయవాదులు ఆమెను దూషించారు. హోమోసెక్సువల్ రిలేషన్స్‌ని అందులో చూపారు. అదీ కోపం. అయితే ‘‘అప్పుడే నయం. ఇప్పటి మనుషుల్లో ఆ మాత్రం సహనమైనా లేకుండా పోయింది’’ అని ఇటీవల ముంబై ఐ.ఐ.టి.లో జరిగిన ‘సౌత్ ఏషియన్ కాన్ఫరెన్స్ ఆన్ జెండర్ అండ్ సెక్సువాలిటీ’ సదస్సులో నందిత అన్నారు. ఆమె మాటలు నిజమేననిపిస్తోంది.. ఇప్పటికింకా చల్లారని ‘పద్మావతి’ వివాదాన్ని చూస్తుంటే. ‘‘ఎందుకనో మనుషుల్లో భయం పెరిగిపోయింది. మౌనంగా ఉండిపోతున్నారు. మనసులో ఉన్నది చెప్పడమే నేరమౌతున్న రోజులు వచ్చిపడ్డాయి. పడుతుందో లేదో తెలియని దెబ్బ నుంచి ముందే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’’ అని నందిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ భయం సమాజానికి మంచిది కాదు’’ అన్నారు. నిజమే. భయం నాగరిక లక్షణం కూడా కాదు. -
పెళ్లి రోజే విడాకులు!
బాలీవుడ్లో విడాకుల పరంపర కొనసాగుతోంది. ‘హృతిక్ రోషన్–సుజానే ఖాన్, అర్భాజ్ ఖాన్–మలైకా ఆరోరా’ జంటలు ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్, నిర్మాత సుభోద్ మస్కరా ఈ జాబితాలోకి చేరనున్నారు. ఈ ఇద్దరూ జనవరి 2న పెళ్లి చేసుకున్నారు. 2010లో వివాహం జరిగింది. కట్ చేస్తే... ఈ జనవరి 2కి తాము విడిపోతున్న విషయాన్ని ప్రకటించారు. అందరూ న్యూ ఇయర్ సంబరాల్లో ఉంటే.. నందిత మాత్రం భర్త నుంచి తాను విడిపోతున్న విషయం ప్రకటించి, కొత్త సంవత్సరంలో తాను తీసుకున్న కీలక నిర్ణయం గురించి పేర్కొన్నారు. ఏడేళ్లుగా కలసి ఉన్న ఈ జంట కొంత కాలంగా వేరుగా ఉంటున్నారు. విడిపోతున్న విషయం గురించి నందిత మాట్లాడుతూ –‘‘అవును మేము విడిపోతున్నాం. ఈ విషయం చెప్పటం కొంచెం కష్టంగానే ఉంది. సుభోద్‌తో ఇక మీదట కలసి ఉండాలనుకోవడంలేదు. మేం స్నేహపూర్వకంగానే విడి పోవాలనుకుంటున్నాం. మా అబ్బాయి విహాన్ కంటే మాకేదీ ఎక్కువ కాదు. తన కోసమే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయం గురించి చిలవలు పలవలు చేసి, మాట్లాడొద్దని విన్నవించుకుంటున్నాను. నేను కూడా దీని గురించి మళ్లీ మాట్లాడదల్చుకోలేదు. ఇక మీదట నా కొడుకుతో, కుటుంబసభ్యులతో ఉండాలనుకుంటున్నాను’’ అన్నారు. జన వరి 2... నందిత జీవితంలో మర్చిపోలేని రోజవుతుంది. పెళ్లి తాలుకు ఆనందాన్ని, విఫలమైన పెళ్లి తాలూకు చేదు అనుభవాన్ని మిగిల్చిన రోజుగా మిగిలిపోనుంది. నందిత సినిమా కెరీర్ విషయానికొస్తే.. ‘ఫైర్’, ‘ఎర్త్’, ‘బిఫోర్ ద రైన్స్’ వంటి ఆఫ్‌బీట్ చిత్రాల్లో నటించిన ఆమె ‘ఫిరాక్’తో పాటు పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఫిరాక్’ చిత్రం ఆమెకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఓ తమిళ చి్రతంలో నటిస్తున్నారు. -
విడాకులు తీసుకుంటున్నాం: హీరోయిన్
ముంబై: 2017కొత్త ఏడాదిలో బీ టౌన్ లో విడాకులు వార్తలు అపుడే మొదలయ్యాయి. హ్యాపీ న్యూఇయర్ సంబరాలు ఇంకా ముగియక ముందే మరో విషాదకర వార్త బాలీవుడ్ అభిమానులను కలవరపర్చింది. బాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్ (47) ఏడేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టు ధృవీకరించారు. త్వరలో తన భర్త శుభోద్ మస్కారాతో విడిపోనున్నట్లు ఆమె ప్రకటించారు. విడాకులకు సిద్ధపడిన మాట వాస్తవమేననీ, ఇందులో రహస్యమేమీ లేదని నందితా దాస్ తెలిపారు. ఈ విషయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను కోరారు. ‘విడిపోవడం అంటే అంత ఈజీ కాదు, ముఖ్యంగా పిల్లలు ఉన్నపుడు మరింత క్లిష్టంగా ఉంటుంది. కానీ మాకు కుమారుడి భవిష్యత్తు ముఖ్యం. విడిపోయినా అతని భవిష్యత్తుకు ఎలాంటి లోటూ లేకుండా చూడాలని నిర్ణయించుకున్నాం. చాలా సామరస్యపూరకంగా విభేదాలను పరిష్కరించుకుంటున్నట్టు’ నందిత తెలిపారు. కాగా ఫైర్, ఎర్త్ లాంటి సినిమాలతో సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించిన నందితా దాస్ అమృత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. నటుడు శుభోద్ మస్కారా ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి విహాన్ అనే ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. 2002లో సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లాడిన నందితా దాస్ 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శుభో్ద్ ను పెళ్లాడారు. -
'తమిళ సినిమాలో నటించడం లేదు'
చెన్నె: తాను తమిళంలో ప్రస్తుతం సినిమాలేవి చేయడం లేదని నటి, దర్శకురాలు నందితా దాస్ తెలిపారు. కొత్త సినిమాలేవి ఒప్పుకోలేదని వెల్లడించారు. తన కుమారుడితో కలిసి ఆమె వేసవి సెలవులు గడుపుతున్నారు. కుట్టి రేవతి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో తాను నటించనున్నట్టు వచ్చిన వార్తలపై నందిత స్పందించారు. 'ఈ వార్తలు నా దాకా వచ్చాయి. రేవతి సినిమా గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ప్రస్తుతం మా అబ్బాయితో కలిసి వేసవి సెలవులు గడుపుతున్నా. తిరిగి వచ్చాక నా ప్రాజెక్టుల్లో పాల్గొంటా'నని నందిత పేర్కొంది. అయితే రేవతి సినిమాలో తనను నటింపజేయాలనుకున్నారో, లేదో తనకు తెలియదని చెప్పింది. ‘ఫైర్’ వంటి సంచలన చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత.. ‘అమృత’, ‘కమ్లి’ వంటి చిత్రాలతో దక్షిణాదిన కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 2008లో దర్శకురాలిగా మారి ‘ఫిరాక్’ సినిమా తీశారు. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందించేందుకు ఆమె సమాయత్తమవుతున్నట్టు సమాచారం. -
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్!
చెట్టు పొదల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకునే పాత్రలు కాకుండా వాటికి పూర్తి భిన్నంగా ఉండే పాత్రలు చేసే కథానాయికలు అరుదుగా ఉంటారు. చెప్పాలంటే... ఈ తరహా నాయికలు వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది కూడా ఉండరు. అందుకే అలాంటి పాత్రలు చేసే తారలు ఎప్పటికీ గుర్తుండిపోతారు. నందితా దాస్ అలాంటి నాయికే. ‘ఫైర్’ వంటి సంచలన చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నందిత. ‘అమృత’, ‘కమ్లి’ వంటి చిత్రాలతో దక్షిణాదిన కూడా భేష్ అనిపించుకున్నారామె. ఆర్ట్ తరహా చిత్రాల పైనే నందిత ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. చివరికి తాను దర్శకురాలిగా మారి, తీసిన తొలి చిత్రం ‘ఫిరాక్’ కూడా ఆ కోవలోనే ఉంటుంది. 2002లో గుజరాత్లో జరిగిన మారణకాండ ఆధారంగా నందిత తీసిన ఈ చిత్రం దర్శకురాలిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. 2008లో ఆమె ఈ చిత్రం తీశారు. ఆ తర్వాత మళ్లీ డెరైక్షన్ జోలికి వెళ్ల లేదు. ఈ ఏడాది మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యారు. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందించ నున్నారు. 1912లో జన్మించిన మంటో 1955లో చనిపోయారు. నందిత దర్శకత్వం వహించిన ‘ఫిరాక్’ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చు కున్న నవాజుద్దీన్ సిద్ధిఖి టైటిల్ రోల్ చేయనున్నారు. ‘‘మంటోలాంటి చాలెంజింగ్ రోల్ నవాజుద్దీనే చేయగలుగుతారు’’ అని నందిత పేర్కొ న్నారు. గత మూడేళ్లుగా ఆమె కథను వర్కవుట్ చేస్తున్నారు. మంటో కుటుంబ సభ్యులను కలిసి, ఆమె కొంత సమాచారం సేకరించారు. -
ఆ ప్రయాణంలో నాతో నేను మాట్లాడుకున్నాను
లైఫ్ బుక్ మా నాన్నగారు బొమ్మలు గీస్తారు. కవితలు రాస్తారు. వంట బాగా చేస్తారు. తోటపని చేస్తారు...ఈ అన్నిట్లోకి నాకు నచ్చిన విషయం ఆయనలోని సున్నితత్వం. సున్నితంగా ఉన్న వాళ్ల దగ్గరికి బొమ్మలైనా, కవిత్వమైనా ఆప్యాయంగా వస్తాయి! వేసవి సెలవుల్లో మా నాన్నమ్మ వాళ్లు ఉండే బారీపడ(ఒడిషా) అనే ఒక మోస్తరు పట్నానికి వెళ్లేవాళ్లం. ఎన్ని నగరాలకు వెళ్లినా... బారీపడ జ్ఞాపకాలు మాత్రం ప్రత్యేకమైనవి. రైలు నుంచి బస్సు, బస్సు నుంచి రిక్షా... ఇలా దీర్ఘ ప్రయాణం చేసిన తరువాతగానీ ఆ పట్నానికి చేరడానికి వీలయ్యేది కాదు. ఇప్పుడు మాత్రం విమానం ఎక్కి ఆ తరువాత కారు ఎక్కితే చాలు అది వస్తుంది. కానీ దీర్ఘమైన ప్రయాణమే నాకు నచ్చుతుంది. ఆ ఊళ్లో ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. అవి పేరుకు మత సంబంధమైన ఉత్సవాలుగా అనిపించినా నిజానికవి... సామాజిక, సాంస్కృతిక ఉత్సవాలు. ఆలయ ఉత్సవాల సందర్భంగా ఊరంతా కొత్త కళతో శోభించేది. నేను బాగా ఆలోచించిగానీ నిర్ణయం తీసుకోలేను. ఈ క్రమంలో నెల కావచ్చు...ఆర్నెల్లు కావచ్చు...సంవత్సరం కూడా కావచ్చు. ఉదా: భౌగోళికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత...దేనిలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేయాలో అర్థం కాలేదు. ‘‘ఓ ఏడాది విరామం తీసుకోవాలనుకుంటున్నాను’’ అని నాన్నతో చెప్పి చాలా ప్రాంతాలు ప్రయాణించాను. నాతో నేను మాట్లాడుకున్నాను. నా ఇష్టాన్ని వెతుకున్నాను. ప్రయాణం తరువాత ఒక పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధించాను. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలు తిరిగినా పుట్టి పెరిగిన ప్రాంతం అంటేనే ఎవరికైనా ఇష్టం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే...తల్లి నుంచి దూరమైనట్లు అనిపిస్తుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన నాకు ఆ నగరాన్ని వదలాలంటే ఇబ్బం దిగా ఉంటుంది. ఢిల్లీకీ నాకూ మధ్య బలమైన ఆకర్షణ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. - నందితా దాస్, ప్రముఖ నటి -
స్పానిష్ మూవీలో నందితాదాస్
ఉత్తరాదిన ఫైర్, ఎర్త్, దక్షిణాదిన అమృత, కమ్లి తదితర చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నందితాదాస్ ‘ఫిరాక్’తో దర్శకురాలిగా కూడా తన ప్రతిభ నిరూపించుకున్నారు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వస్తున్న నందిత ఇటీవల ఓ స్పానిష్ మూవీని అంగీకరించారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్నప్పుడే విడిపోయే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది ప్రధానాంశం. ఈ చిత్రం షూటింగ్‌ని సగభాగం ముంబయ్, మిగతా భాగాన్ని బార్సిలోనాలో జరపనున్నారు. లేడీ డెరైక్టర్ మరియా రిపోల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అక్కాచెల్లెళ్లు విడిపోయి, మళ్లీ కలుసుకునే చిత్రాలు చాలా వచ్చినా, కథనం వినూత్నంగా ఉంటుందని, సినిమాలోని మలుపు చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. అందుకే నందిత ఈ చిత్రానికి పచ్చజెండా ఊపారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి సంబంధించి తెరవెనుక పనిచేసేవాళ్లందరూ ఆడవాళ్లేనట.