'తమిళ సినిమాలో నటించడం లేదు'
చెన్నె: తాను తమిళంలో ప్రస్తుతం సినిమాలేవి చేయడం లేదని నటి, దర్శకురాలు నందితా దాస్ తెలిపారు. కొత్త సినిమాలేవి ఒప్పుకోలేదని వెల్లడించారు. తన కుమారుడితో కలిసి ఆమె వేసవి సెలవులు గడుపుతున్నారు. కుట్టి రేవతి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో తాను నటించనున్నట్టు వచ్చిన వార్తలపై నందిత స్పందించారు.
'ఈ వార్తలు నా దాకా వచ్చాయి. రేవతి సినిమా గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ప్రస్తుతం మా అబ్బాయితో కలిసి వేసవి సెలవులు గడుపుతున్నా. తిరిగి వచ్చాక నా ప్రాజెక్టుల్లో పాల్గొంటా'నని నందిత పేర్కొంది. అయితే రేవతి సినిమాలో తనను నటింపజేయాలనుకున్నారో, లేదో తనకు తెలియదని చెప్పింది.
‘ఫైర్’ వంటి సంచలన చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత.. ‘అమృత’, ‘కమ్లి’ వంటి చిత్రాలతో దక్షిణాదిన కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 2008లో దర్శకురాలిగా మారి ‘ఫిరాక్’ సినిమా తీశారు. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందించేందుకు ఆమె సమాయత్తమవుతున్నట్టు సమాచారం.