![Tamil Film Jolly O Gymkhana OTT Review in Telugu](/styles/webp/s3/article_images/2025/02/14/Jolly-O-Gymkhana.jpg.webp?itok=alQ5-p_K)
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం జాలీ ఓ జిమ్ఖానా(Jolly O Gymkhana) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
కదలని బొమ్మ చిత్రమైతే, కదిలే బొమ్మ ఓ విచిత్రం. అటువంటి విచిత్రానికి వినోదం తోడైతే అదే మనం చూసే సినిమా. సినిమాలలో దర్శకుడు తన కాల్పనిక ధోరణితో ఓ కథను అనుకొని ఆ కథకు అనుగుణంగా పాత్రలను సృష్టించి ఆ పాత్రలచే ప్రేక్షకులకు విచిత్ర వినోదాన్ని అందిస్తాడు. ప్రస్తుతం వచ్చే సినిమాలలో ఔరా అని అబ్బురపరిచే సినిమాలనుండి అయ్యో అనే సినిమాల వరకూ పుష్కలంగా ఉన్నాయి. సన్ నెక్ట్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘జాలీ ఓ జిమ్ఖానా’(Jolly O Gymkhana) సినిమా ఔరా అనిపించే ఓ అద్భుతమని చెప్పాలి. ఈ సినిమాకి శక్తి చిదంబరం దర్శకత్వం వహించారు.
ప్రముఖ కథానాయకుడు, కొరియోగ్రాఫర్ అలాగే దర్శకుడు అయిన ప్రభుదేవా(Prabhu Deva) ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక అంతలా ఏముంది ఈ సినిమాలో... ఓసారి కథ గురించి చెప్పుకుందాం. భవానీ అనే అమ్మాయి తను చేసిన ఓ తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన కథ చెప్పుకోడానికి ఓ చర్చిలోని ఫాదర్ దగ్గరకు రావడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. తంగసామి తన కూతురు చెల్లమ్మ, మనవరాళ్ళైన భవానీ, శివానీ, యాజినీతో ఓ హోటల్ నడుపుతుంటాడు. తెన్ కాశీకి చెందిన రాజకీయవేత్త అడైక్కళరాజ్‌తో హోటల్‌లో జరిగిన ఓ ఘర్షణ వల్ల తంగసామి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతాడు.
తంగసామి ఆపరేషన్ కోసం దాదాపు రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుందని భవానీ అక్కచెల్లెళ్లకు చెబుతాడు డాక్టర్. అనూహ్యంగా ఆ డబ్బు భవానీ అకౌంట్‌లో డిపాజిట్ అయి, ఆపరేషన్ ఏ అవరోధం లేకుండా జరిగిపోతుంది. కానీ ఆ డబ్బు కోసం ఓ గ్యాంగ్ వీళ్ల వెంటపడి వేధిస్తూ ఉంటుంది. మరో పక్క ఇదే అడైక్కళరాజ్ ఓ కేస్ విషయమై న్యాయవాది పూన్‌గుండ్రన్‌తో పెద్ద విరోధం పెట్టుకొని ఉంటాడు. ఇంకో పక్క ఈ విషయం తెలిసిన తంగసామి హోటల్ విషయమై పూన్‌గుండ్రన్‌ని కలవమని భవానీ వాళ్లకి చెప్తాడు. భవానీ వాళ్ళు న్యాయవాదిని కలిసే సమయంలో అతను చనిపోయి ఓ హోటల్ గదిలో పడి ఉంటాడు.
ప్రపంచానికి మాత్రం పూన్‌గుండ్రన్ బ్రతికే ఉన్న విషయం తెలుస్తుంది. మరి ఆడవాళ్ళైన భవానీ అక్కచెల్లెళ్ళు న్యాయవాది శవంతో తమ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారన్నదే ఈ ‘జాలీ ఓ జిమ్ఖానా’ సినిమా. ఈ సినిమా ప్రారంభం నుండే సరదా సరదాగా సాగిపోతుంది. అనూహ్యమైన మలుపులకు చక్కటి వినోదం మేళవించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. నాటి ఆడవాళ్లకు మాత్రమే సినిమాలోని అప్పటి నటుడు నగేశ్ నటించిన ఓ సన్నివేశం ఈ సినిమా కథకి ఓ స్ఫూర్తి అని చెప్పవచ్చు. సూపర్ ఎంటర్‌టైనర్ ఫర్ ది కంప్లీట్ ఫ్యామిలీ. వర్త్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment