Vaazhai Movie Review: ఈ అరటిపండు చాలా చేదు!! | OTT Movie Reviews: Tamil Blockbuster Vaazhai Movie Review In Telugu, Check Story Details Inside | Sakshi
Sakshi News home page

Vaazhai OTT Movie Review: తమిళ్‌ మూవీ ‘వాళై’ రివ్యూ

Published Fri, Oct 18 2024 8:40 AM | Last Updated on Fri, Oct 18 2024 9:30 AM

OTT Film: Tamil Blockbuster Vaazhai Movie Review In Telugu

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే  ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘వాళై’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
మనం తినే అరటిపండు నోటికి ఎంత తియ్యగా ఉంటుందో, అది మన నోటి దాకా రావడానికి ఎన్ని జీవితాలను చేదు చేస్తుందో చెప్పిన చిత్రం ‘వాళై’. ఈ సినిమా మాతృక తమిళమైనా తెలుగులో డబ్‌ అయి హాట్‌ స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. 1999 ఫిబ్రవరి 22న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీ వాయుగుండం ప్రాంత పరిధిలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో బతికి బయటపడ్డ వ్యక్తి అందించిన సమాచార రూపమే ఈ ‘వాళై’ సినిమా. ఈ విషయాన్ని సవివరంగా దర్శకుడు సినిమా ఆఖర్లో చెప్పారు. ఈ సినిమాకి మారీ సెల్వరాజ్‌ దర్శకుడు. ప్రముఖ వర్ధమాన తమిళ నటులు కలైరాసన్, నిఖిలా విమల్‌ ఈ సినిమా ముఖ్య తారాగణం. 

ఇక కథాంశానికొస్తే... శివానందన్, శేఖర్‌ మంచి స్నేహితులు. బాగా పేద కుటుంబం నుండి వచ్చిన పిల్లలు. ఇద్దరూ ప్రభుత్వ బడిలో ఎనిమిదో తరగతి చదువుతూ ఉంటారు. వారమంతా బడికి వెళ్ళి వారాంతంలో ఓ రూపాయి సంపాదించడం కోసం అరటి గెలలు కోసే పనికి ఊరితో పాటు వెళుతూ ఉంటారు. శివానందన్‌ చదువులో మంచి తెలివిగలవాడు, ఈ అరటిపండ్లు కోసే పని అస్సలు నచ్చదు తనకు. క్లాసులో సైన్సు పాఠాలు చెప్పే పూంగొడి టీచర్‌ అంటే శివానందన్‌కు చాలా ఇష్టం. ఇక అరటిపండ్లు కోయడానికి ఆ ఊరి తరఫున ఖని అనే వ్యక్తి నాయకత్వం వహిస్తుంటాడు. అరటి గెలల వ్యాపారికి, ఊరికి మధ్యలో బ్రోకర్‌గా ముత్తురాజ్‌ వ్యవహరిస్తుంటాడు. 

ముత్తురాజ్‌కు, ఖనికి కూలీ డబ్బుల మధ్య వైరం ఏర్పడి ఖని మీద ముత్తురాజ్‌ ద్వేషం పెంచుకుంటాడు. ఓ రోజు శివానందన్‌ అరటి గెలల పని నుండి తప్పించుకొని ఆకలితో ఓ అరటి తోటలోకి వెళ్ళి అరటిపండ్లు తినబోతాడు. అంతే... ఆ తోట యజమాని శివానందన్‌ను పట్టుకుని తీవ్రంగా కొట్టగా స్పృహ తప్పి ఓ కొలనులో పడిపోతాడు. తను లేచి కళ్ళు తెరిచేసరికి ఊరంతా ఏడుస్తుంటుంది. శివానందన్‌ తల్లితో పాటు అక్క, తోటి స్నేహితుడు శేఖర్, ఖనితోపాటు దాదాపు 19మంది ఊరువాళ్ళు చనిపోయి పడి ఉంటారు. అసలు వీళ్ళంతా ఎలా చనిపోయారు? ఆ తరువాత శివానందన్‌ పరిస్థితి ఏంటి అన్నది ‘వాళై’ సినిమాలోనే చూడాలి. 

రోజు వారీ కూలీ చేసుకుని బతికే జీవితాలు ఎలా ఉంటాయన్న స్థితిగతులను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు దర్శకుడు. ఈ సినిమాని మనం తెర మీద చూస్తున్నట్టుండదు...  జీవితాలను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. సినిమాలో కొంచెం ల్యాగ్‌ ఉన్నా మనసుకు హత్తుకుంటుంది. తినే పండు మనకు తియ్యగా ఉన్నా ఆ పండు మన దాకా రావడానికి ఎంతమంది జీవితాలను చేదు చేసిందో అని చెప్పేదే ఈ ‘వాళై’ సినిమా. 
– ఇంటూరు హరికృష్ణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement