స్త్రీల కోసం చిందిన సిరా చుక్క | woman turned to the corpse | Sakshi
Sakshi News home page

స్త్రీల కోసం చిందిన సిరా చుక్క

Published Sat, Sep 22 2018 12:08 AM | Last Updated on Sat, Sep 22 2018 4:12 PM

 woman  turned to the corpse - Sakshi

చాలా పాత మొహల్లా అది.టాంగాలు నడుస్తున్నాయి. తాగుబోతులు తిరుగాడుతున్నారు. స్త్రీలను వేటాడేవారు జుబ్బాల జేబుల్లో చిల్లర పడేసుకొని కొనడానికి తిరుగుతున్నారు. ‘సార్‌.. అమ్మాయి కావాలా సార్‌’ అడిగాడతను ఒక పెద్దమనిషిని. ‘రండి సార్‌.. పైనే ఉంది’ తీసుకెళ్లాడు. మురికిగా ఉన్న మహల్‌ అది. చిన్న చిన్న గదులు. మురికి పనుల కోసంగా ఉన్న గదులు. మురికి సమయాలలో రద్దీగా ఉండే గదులు. మెట్ల మీదుగా నడిపించుకుంటూ తీసుకెళుతున్నాడు. ‘ఇటు... ఇటు..’గడప దగ్గర నిలబెట్టి లోపలికెళ్లాడు. కొద్దిగా తెరిచిన తలుపు నుంచి లోపల ఏముందో కనిపిస్తూ ఉంది.కుక్కి మంచం. దాని మీద ఒక ప్రాణం లాంటి ప్రాణం. స్త్రీ ప్రాణం.‘లెయ్‌వే... లెయ్‌... గిరాకీ వచ్చింది లెయ్‌’ లేవలేదు. నిద్రపోతూ ఉంది. మొద్దుగా నిద్ర పోతూ ఉంది. శవంలా నిద్రపోతూ ఉంది. ‘లెయ్‌మంటున్నానా’ నీళ్లు మొహాన కొట్టి బలవంతంగా లేపాడు. ‘వద్దు.. ఓపిక లేదు... పంపించెయ్‌’ ‘ఇదే ఆఖరు... ఆ తర్వాత నిద్ర పోదూగానీ’ ‘అయ్యో.. నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా. నేను నిద్రపోయి ఎంత కాలం అయ్యింది. నాకు నిద్ర వస్తోంది.దండం పెడతాను. పంపించేయ్‌’ ‘ఇదొక్కటే అన్నానా. ఏం తమాషాగా ఉందా’ జుట్టు పట్టుకున్నాడు. స్త్రీ. నలిగి నలిగిపోయి ఉన్న స్త్రీ. నలిపి వేయబడిన స్త్రీ. శవంలా జీవచ్ఛవంలా మారిన స్త్రీ. ఏమడుగుతోంది. మణులా మాణిక్యాలా. నిద్ర. గుక్కెడు నిద్ర. బాధల్ని క్షోభల్ని కాసేపైనా మర్చిపోయేలా చేయగలిగే నిద్ర. ఇవ్వట్లేదే రాక్షసుడు.

‘చెప్పినమాట వింటావా లేదా’ ఛెళ్లున కొట్టాడు.‘ఒరేయ్‌ రాక్షసుడా’ కాళి అయ్యింది. అపరకాళిలా తిరగబడింది. రక్కింది. ముఖాన పీకింది. తల మంచానికేసి బాదింది. కింద పడ్డాడు. పోయాడు. ఊపిరి తీసుకునే వ్యవధి కూడా లేనట్టుగా పోయాడు. శవం. కాని అదంతా ఆమెకు ఎందుకు. ఆమెకు కావలసింది నిద్ర. హాయిగా పట్టే నిద్ర. అప్పుడిక ఆమె ఆ కుక్కిమంచం మీద, మగాళ్లు నిద్రపోనివ్వని మంచం మీద, దారుణ ఆక్రమణల మంచం మీద తన కోసం తాను తన కోసంగా తాను నిద్ర పోయింది.మంటో రాసిన కథ ఇది. ఇప్పుడు కాదు 60 ఏళ్ల క్రితం. దేశ విభజన జరిగింది. ఇరు ప్రాంతాల వాళ్లు కత్తులు ఝళిపిస్తున్నారు. నెత్తురు చిందిస్తున్నారు. శవానికి శవంతో జవాబు చెబుతున్నారు. ద్వేషాన్ని ద్వేషంతో నూరుతున్నారు. తలల్లో స్పృహ లేదు. చేతుల్లో కత్తులు మాత్రమే ఉన్న కాలం అది. పురుషుడు దొరికితే సంహరించు. స్త్రీ దొరికితే చెరిచెయ్‌.అలాంటి సమయంలో సరిహద్దు మీద ఒక తండ్రి వెతుకులాడుతున్నాడు. కూతురుని. కన్నకూతురిని. ‘నా కూతురుని చూశావా బాబూ’‘నీ కూతురు ఎలా ఉంటుంది ముసలాయనా?’‘ఎర్రగా తామరపువ్వులా ఉంటుంది. కురులు విప్పితే అప్సరసలా ఉంటుంది. బుగ్గన పెద్ద పుట్టుమచ్చ. అందమైన కూతురు. అమాయకమైన కూతురు. పదహారేళ్ల కూతురు...నాకూతురుని చూశారా బాబూ’...బిడారుల్లో ఏడుపులు... శిబిరాల్లో శోకాలు... వలస పోయేవాళ్ల ఏడ్పులు... వలస వస్తున్నవాళ్ల ఆర్తనాదాలు... కూతురు కనిపించడం లేదే...ఎక్కడో ఒక మూలన ఆ అమ్మాయి కనిపించిందని ఎవరో చెప్పారు.తండ్రి పరిగెత్తాడు. పరిగెత్తి కూతురిని చూశాడు. గుండెలకు హత్తుకుంటూ చూశాడు. 

కన్నీళ్లను ఆ అమ్మాయి గొంతులోకి ఒంపుతూ ప్రాణాలు దక్కించుకోవడానికి చూశాడు. భుజాల మీద వేసుకొని హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. హాస్పిటల్‌ బెడ్‌ మీద కూతురు పడి ఉంది. కొనఊపిరితో ఉంది. ‘డాక్టర్‌ సాబ్‌... నా కూతురిని బతికించండి డాక్టర్‌ సాబ్‌’ పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్‌ను తీసుకొచ్చాడు.డాక్టర్‌ వచ్చి నాడీ పట్టుకుని చూశాడు. పేరు పెట్టి పిలిచాడు. కదలిక లేదు. కేసు అర్థం కావడం లేదు. పరికించి చూద్దామంటే గది చీకటిగా ఉంది. గాలాడక చిరాగ్గా ఉంది. పక్కనే ఉన్న కిటికీ రెక్కను చూపిస్తూ ‘విప్పు’ అన్నాడు. తండ్రికి సరిగ్గా వినపడలేదు. ‘దానిని విప్పు’ అన్నాడు.అప్పుడు అనూహ్యంగా ఒకటి జరిగింది.ఆ మాటకు ఆ అమ్మాయిలో కదలిక వచ్చింది. మెల్లగా చేతులు రెంటిలోనూ సత్తువ తెచ్చుకుని వణుకుతూ భయం భయంగా తన పైజామా బొందును ‘విప్పడం’ మొదలుపెట్టింది.కథ ముగిసింది.ఇది కూడా మంటో రాసిన కథే.

మంటోగా పిలువబడే ప్రపంచాన ప్రసిద్ధమైన ‘సాదత్‌ హసన్‌ మంటో’ స్త్రీల కోసం రాశాడు. స్త్రీ దుఃఖాన్ని లోకానికి చెప్పడానికి రాశాడు. స్త్రీ నిజమైన వేదనను చూస్తే షాక్‌ అవుతారని చెప్తూ షాకయ్యే పద్ధతిలో రాసి నేల కదిలిపోయేలా చేశాడు. స్వాతంత్య్రం వచ్చే సమయాన బాంబే (ముంబై)లో ఉన్న మంటో అక్కడి వేశ్యల జీవితాల్ని పరిశీలించాడు. అప్పటి వరకూ ఉర్దూ కథా సాహిత్యంలో మర్యాదకరమైన కథలు వస్తున్న సమయంలో వారి జీవితాన్ని కథా వస్తువుగా తీసుకుని లోకాన్ని హడలెత్తించాడు. అందుకు కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగాడు. అయినా భయపడలేదు. ‘వేశ్యల దగ్గరకు వెళ్లడానికి మనకు పర్మిషన్‌ ఉందిగానీ వారి జీవితాన్ని రాయడానికి పర్మిషన్‌ లేదా’ అని మంటో ప్రశ్నించాడు. ‘దేశభక్తి కథలు, కార్మికుల కథలు రాయమని అందరూ నన్ను అడుగుతుంటారు. కాని వేశ్యావాటికలో మూసిన తలుపుల వెనుక ఉన్న హింసకు మించిన వస్తువు నా వద్ద లేదు. వాళ్లు మన సమాజంలో భాగం. వారి గురించి రాయాలి’ అన్నాడు మంటో. ఆ రోజులలోనే ఆయన బాంబే శ్రీమంతులు తమ లైంగిక విశృంఖలత్వం కోసం నిరుపేద పసిపిల్లలను ఎలా ఉపయోగించుకునేవారో రాసి సమాజపు పైపై పూతల పరదాలను చీలికలు పీలికలు చేశాడు.

అమృత్‌సర్‌లో పుట్టిన సాదత్‌ హసన్‌ మంటో భారతదేశాన్ని అందునా బాంబేని విపరీతంగా ప్రేమించాడు. ఆరాధించాడు. బాంబేలో హీరో అశోక్‌ కుమార్‌ కీలకపాత్ర పోషించిన ‘బాంబే టాకిస్‌’ స్టుడియోలో స్క్రిప్ట్‌ రైటర్‌గా ఉండేవాడు. కాని దేశ విభజన సమయంలో ‘ముస్లిం ఉద్యోగులు’ ఎక్కువ మంది బాంబే టాకిస్‌లో పని చేస్తున్నారు కనుక ఆ స్టుడియోను తగులబెడతాం అని ఆ రోజులలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. అవి విని మంటో కలత చెందాడు. అంతేకాదు ‘హృదయంలో ఉండవలసిన మతం తలకెక్కి’ విషం చిమ్ముతున్న సమయాలను చూసి విషాదపడ్డాడు. ‘నా దేశం పాకిస్తానా?’ అనే ప్రశ్నతో అతడు లాహోర్‌ చేరుకున్నాడు. కాని అక్కడకు వెళ్లినా అతడు అనుక్షణం బాంబేను కలవరిస్తూ బతికాడు. 1948లో మంటో పాకిస్తాన్‌ వెళితే ఆ దేశంలో అతను కేవలం ఏడేళ్లే జీవించగలిగాడు. ‘నా తల్లిదండ్రులు ఖననమైన మట్టి భారతదేశంలో ఉంది. నన్ను ముక్కలు చేసి ఇచ్చిన ఈ స్వాతంత్య్రం శోకమే మిగిల్చింది’ అన్న మంటో 1955లో మరణించాడు.
∙∙ 
మంటో రాసిన కథల్లో ‘ఠండా గోష్‌’ (చల్లటి మాంసం) అతడికి విశేషమైన పేరును, కీర్తిని, పీడకలలను మిగిల్చిన కోర్టు కేసులను ఇచ్చింది. ఆ కథలో అతడు వాడిన భాష, తీసుకున్న కథాంశం ఇప్పటికీ యథాతథంగా ప్రచురించడం కష్టం– మెయిన్‌స్ట్రీమ్‌ పత్రికలలో. మానవ ప్రవర్తనలోని పశుత్వాన్ని, కర్కశత్వాన్ని, స్వార్థాన్ని, పర్వెర్షన్‌ను మంటో చెప్తూ వెళ్లాడు. నగ్నంగా చూపుతూ వెళ్లాడు. ‘ఇలా రాయడం తప్పు కాదా... రచయితకు బాధ్యత ఉండక్కర్లేదా’ అనంటే ‘వేపాకులు చేదుగానే ఉంటాయి. కాని అవి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి’ అని జవాబు చెప్పాడు. అతడి ఒక కథలో ఒక ముసలి దంపతుల ఇంట్లో ఒక వేరే మతస్తుడు శరణుజొచ్చుతాడు. ఆ ముసలి దంపతులు చాలా మంచివాళ్లు. చీమకు కూడా అపకారం తలపెట్టరు. కాని తమ ఇంట్లో శరణుజొచ్చింది అన్య మతస్తుడు. అప్పుడు వాళ్లు బాగా ఆలోచించి తాము మంచివారం గనక ఒక నిర్ణయం తీసుకుంటారు. ‘మనకెందుకు ఆ పక్కింటి వాళ్లకు ఇతణ్ణి అప్పజెబుదాం. వాళ్లయితే రోజుకొరిని చంపుతున్నారు. ఇతడి సంగతి వాళ్లే చూసుకుంటారు’.ఇలా చెంపకు పట్టి కొట్టినట్టు అతడు కథలు రాశారు.అతడి కథల్లో ఇవాళ్టి మనుషులు కనిపిస్తారు. రేపటి మనుషులు కనిపిస్తారు. నైచ్యం వదులుకోని మనిషి ఉన్నంత కాలం మంటో కథ ఉంటుంది.

‘మంటో’ మీద అనేక నాటకాలు, వ్యాసాలు వచ్చాయి. భారతదేశంలో సినిమా రావడం ఇదే మొదటిసారి. సుప్రసిద్ధ నటి, దర్శకురాలు నందితా దాస్‌ ‘మంటో’ జీవితకథను తెరకెక్కించింది. మంటో మీద ఉన్న గౌరవంతో నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ కేవలం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్‌తో ఈ సినిమాలో నటించాడు. ఒక రచయిత జీవితం, సత్యం పలకాలనుకున్న ఒక రచయిత జీవితం, సత్యానికి నిలబడి సమాజపు నిర్దాక్షిణ్యతను చవి చూసిన ఒక రచయిత జీవితం, తన నేలకు దూరమయ్యి అస్థిమితత్వం పొందిన రచయిత జీవితం ఈ జీవితాన్ని మాత్రమే కాదు... దేశ విభజన ఈ దేశ ప్రజల మీద ఎటువంటి గాయాన్ని కలిగించిందో కూడా ఈ సినిమా చూపుతుంది.మనిషి కోసం మాట్లాడే రచయితలకు బెదిరింపులు, మరణ సందేశాలు వస్తున్న ఇవాళ్టి రోజులలో, ఏ ఉన్మాదాన్నైనా ఖండించాల్సిందే అని కలం పట్టుకునేవారి నోళ్లు మూయించాలనుకుంటున్న ఈ రోజులలో, ప్రజల మధ్య ద్వేషాన్ని కడిగిపారేయడానికి సిరాను నింపుకునేవాళ్ల కలాల ములుకు విరగ్గొడుతున్న ఈ రోజులలో మంటో అవసరం ఉంది.వంద మంటోల అవసరం ఉంది. వేయి మంటోలు ప్రభవించాల్సిన అవసరం ఉంది.సినిమా థియేటర్స్‌లో ఉంది. వెళ్లి మంటోతో పాటు ఒక కథకు కన్నీరు కార్చండి. ఒక కథకు దగ్ధమవ్వండి.

నందితా దాస్‌ ఇచ్చిన మరో కానుక
స్త్రీల కోసం రాసిన రచయిత జీవితాన్ని ఒక మహిళా డైరెక్టర్‌ తెర మీదకు అనువదించడం విశేషమైన అంశం. మంటో జీవిత కథను తెరకెక్కించడానికి నటి, దర్శకురాలు నందితా దాస్‌ దాదాపు నాలుగు సంవత్సరాలు వెచ్చించారు. రీసెర్చ్‌ చేశారు. పాకిస్తాన్‌ వెళ్లి మంటో ముగ్గురు కుమార్తెలను, స్నేహితులను కలిసి మంటో జీవితాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మంటో జీవితం గురించి చూపుతూనే ఆయనకు విశేషమైన పేరు తెచ్చిన కథలకు ఈ సినిమాలో చోటిచ్చారు. ‘ఖోల్‌దో’, ‘టొబా టేక్‌సింగ్‌’, ‘ఠండా గోష్‌’ కథలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇది పిరియడ్‌ ఫిల్మ్‌. ఆ కాలం వాతావరణం కల్పించడానికి 1950ల నాటి బాంబే, లాహోర్‌ల వాతావరణం సృష్టించడానికి నందితా అథెంటిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ను సృష్టించడంలో ప్రతిభ చూపారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల మంటోతో పాటు నందితాకు కూడా ఆలింగనం ఇస్తారు.
– ఖదీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement