
కోలీవుడ్‌లో మరచిపోలేని చిత్రాల్లో అళగి ఒకటని చెప్పుకోవచ్చు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తంగర్ బచ్చన్ తెరకెక్కించిన తొలి చిత్రం ఇదే. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. హృదయాలను హత్తుకునే కథా, కథనాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. నటుడు పార్తీపన్, నందితాదాస్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఉదయగీత సినీ క్రియేషన్స్ పతాకంపై ఉదయకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.
2002లో విడుదలైన ఈ వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రం అప్పుట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా చెప్పాలంటే కమలహాసన్ నటించిన పంబల్ కే.సంబంధం, అజిత్ హీరోగా నటించిన రెడ్ వంటి భారీ చిత్రాల మధ్య విడుదలైన అళగి చిత్రం అన్నింటికంటే పెద్ద విజయం సాధించింది. ఇళయరాజా సంగీత బాణీలు సంగీత ప్రియులను అలరించాయి.
తీరం దాటని పాఠశాల ప్రేమకథా చిత్రంగా అళగి తెరకెక్కింది. ఈ తరం ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన చిత్రం అళగి. ఈ తరం యువతకు అందించాలనే ఉద్దేశంతో అళగి చిత్రాన్ని 22 ఏళ్ల తరువాత మళ్లీ ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో కొత్త హంగులు అద్ది.. ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఉదయకుమార్ తెలిపారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులందరూ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ తరం యువత చూడాల్సిన కథా చిత్రం అళగి అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడాన్ని దర్శకుడు తంగర్‌బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారన్నారు. దీనికి ఆయన సహకారం చాలా ఉందని చెప్పారు. ఇకపోతే అళగి చిత్రానికి సీక్వెల్‌ను కూడా చేసే ఆలోచన ఉందని నిర్మాత ఉదయకుమార్ చెప్పారు.