విడాకులు తీసుకుంటున్నాం: హీరోయిన్
ముంబై: 2017కొత్త ఏడాదిలో బీ టౌన్ లో విడాకులు వార్తలు అపుడే మొదలయ్యాయి. హ్యాపీ న్యూఇయర్ సంబరాలు ఇంకా ముగియక ముందే మరో విషాదకర వార్త బాలీవుడ్ అభిమానులను కలవరపర్చింది. బాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్ (47) ఏడేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టు ధృవీకరించారు. త్వరలో తన భర్త శుభోద్ మస్కారాతో విడిపోనున్నట్లు ఆమె ప్రకటించారు. విడాకులకు సిద్ధపడిన మాట వాస్తవమేననీ, ఇందులో రహస్యమేమీ లేదని నందితా దాస్ తెలిపారు. ఈ విషయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను కోరారు.
‘విడిపోవడం అంటే అంత ఈజీ కాదు, ముఖ్యంగా పిల్లలు ఉన్నపుడు మరింత క్లిష్టంగా ఉంటుంది. కానీ మాకు కుమారుడి భవిష్యత్తు ముఖ్యం. విడిపోయినా అతని భవిష్యత్తుకు ఎలాంటి లోటూ లేకుండా చూడాలని నిర్ణయించుకున్నాం. చాలా సామరస్యపూరకంగా విభేదాలను పరిష్కరించుకుంటున్నట్టు’ నందిత తెలిపారు.
కాగా ఫైర్, ఎర్త్ లాంటి సినిమాలతో సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించిన నందితా దాస్ అమృత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. నటుడు శుభోద్ మస్కారా ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి విహాన్ అనే ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. 2002లో సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లాడిన నందితా దాస్ 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శుభో్ద్ ను పెళ్లాడారు.