History Of Poetry: మనకు చిన్నప్పటి నుంచే కవిత్వంతో పరిచయం ఏర్పడుతుంది. తల్లులు పాడే లాలిపాటల్లో సంగీత మాధుర్యమే కాదు, కవన మర్మమూ ఉంటుంది. బుడిబుడి అడుగుల వయసులో బడిలోకి అడుగుపెట్టాక, అక్కడ చెప్పే నీతిపద్యాలు కవిత్వం కాక మరేమిటి? వాల్మీకిని పూజిస్తారు, కాళిదాసును కొలుస్తారు, వేమనను పొగుడుతారు, గురజాడను గురువులా ఆరాధిస్తారు, శ్రీశ్రీని నెత్తినెత్తుకుని మరీ ఊరేగుతారు. తమ ఇళ్లలోని కుర్రాళ్లెవరైనా కవిత్వం గిలికితే మాత్రం కసురుకుంటారు, చిన్నబుచ్చుతారు.
‘కవిత్వమూ కాకరకాయలూ కూడు పెడతాయా? గుడ్డ పెడతాయా? ఎందుకొచ్చిన వెర్రిమొర్రి రాతలు’ అంటూ కవిత్వం రాసే కుర్రకారును ఈసడించుకునే మర్యాదస్తుల మంచిలోకం మనది. ఆరంభ దశల్లో నానా రకాల దూషణ తిరస్కారాదులను తట్టుకుని, కవిత్వంలో స్థితప్రజ్ఞతో ముందుకుసాగే ధీరులే కవియోధులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఆటుపోట్లను తాళలేని అర్భకులు అదే చరిత్రలో ఆనవాలైనా లేకుండా కొట్టుకుపోతారు. కవిత్వంలో కాకలుతీరినా, దక్కాల్సిన గుర్తింపు దక్కని కవిపుంగవులూ తక్కువేమీ కాదు.
అసలు కవిత్వం ఎందుకు? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం దుస్సాధ్యం. ‘సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?/ చంద్రికలనేల వెదజల్లు చందమామ?/ ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?/ ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అన్నాడు కృష్ణశాస్త్రి. ప్రకృతి« సహజ ధర్మాలు కొన్ని ఉంటాయి. ‘ఎందుకు?’ అని ప్రశ్నించినంత తేలికగా వాటికి సహేతుకంగా సమాధానం చెప్పడం కుదరదు. కవిత్వం కూడా కవికి సహజధర్మం. సత్కవుల ఘనతను కీర్తించడమూ, కుకవులను నిందించడమూ ఒకానొక కాలంలో కవిత్వ సంప్రదాయంగా ఉండేది. ఇప్పుడైతే కవులుగా చలామణీ అవుతున్న అకవులను కనీసం విమర్శించే పరిస్థితులు కూడా సాహితీలోకంలో లేవు.
ఇంగ్లిష్ కవివరేణ్యుడు షెల్లీ తన ‘ఎ డిఫెన్స్ ఆఫ్ పొయెట్రీ’ వ్యాసంలో ‘కవులు ఈ ప్రపంచానికి ఎన్నికవని శాసనకర్తలు’ అన్నాడు. ఆయన కవులను బాగానే వెనకేసుకొచ్చాడు. కవుల గురించి షెల్లీ వకాల్తా పుచ్చుకున్నాడు సరే, మరి కవిత్వం గొప్పదనమేమిటి? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. బహుశా అలాంటి వారికి సమాధానంగానే కాబోలు గ్రీకు తత్త్వవేత్త ప్లేటో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలోనే ‘చరిత్ర కంటే కవిత్వమే పరమసత్యానికి చేరువగా ఉంటుంది’ అని తేల్చిచెప్పాడు.
‘ప్రపంచమొక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. అలవాటు పడితే ఒకపట్టాన తీరని దాహమది! ఒకసారి కవిత్వంలో మునిగాక ఒడ్డున పడటం అంత తేలిక కాదు. మునకీతలు కొడుతూ ముందుకు సాగాల్సిందే! కొందరు బాల్యంలోనే కవిత్వంలో పడతారు. ఇంకొందరు యౌవనావస్థలో కవిత్వంలో పడతారు. కవిత్వంలో పడ్డవారు కవిత్వాన్ని తమ ప్రియతముల కంటే గాఢంగా ప్రేమిస్తారు. ‘వాణి నా రాణి’ అన్నాడు పిల్లలమర్రి పినవీరభద్రుడు. పదిహేనో శతాబ్దిలో ఆయన ఆ మాట అంటే, ఆనాటి జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఇరవయ్యో శతాబ్ది ‘అహంభావ’కవి పఠాభి ‘కైత నా దయిత’ అంటే జనాలు పెద్దగా ఆశ్చర్యపడిపోలేదు.
ఇన్ని శతాబ్దాల వ్యవధిలో కవిత్వంలోనూ మార్పులు వచ్చాయి, కవుల్లోనూ మార్పులు వచ్చాయి, కవిత్వాన్ని అర్థం చేసుకుని, ఆస్వాదించే పాఠకుల్లోనూ మార్పులు వచ్చాయి. ఎన్ని మార్పులు వచ్చినా, కవిత్వానికి గల మౌలిక లక్షణం ఒక్కటే! దాని గురించే– ‘కవిత్వం ఒక ఆల్కెమీ/ దాని రహస్యం కవికే తెలుసును/ కాళిదాసుకు తెలుసు/ పెద్దన్నకి తెలుసు/ కృష్ణశాస్త్రికి తెలుసు/ శ్రీశ్రీకి తెలుసు’ అన్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఈ మర్మం కనిపెట్టిన తిలక్‌కి మాత్రం కవిత్వంలోని ఆల్కెమీ తెలీదనుకోగలమా? తిలక్‌కి కూడా కవిత్వ రహస్యం తెలుసు. అందుకే ఆయన ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు/ నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అనగలిగాడు.
కవిత్వం గురించి చాలా చరిత్రే ఉంది. చరిత్రలో కవిత్వానికి తనదైన పాత్ర ఉంది. అయితే, చరిత్ర కంటే ఘనమైనది కవిత్వమేనంటాడు గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్. ‘చరిత్ర కంటే కవిత్వం మెరుగైనది, మరింత తాత్తికమైనది. కవిత్వం విశ్వజనీనమైన విషయాన్ని వెల్లడిస్తుంది. చరిత్ర నిర్దిష్టమైన విషయాన్నే వెల్లడిస్తుంది’ అన్నాడాయన. ఎంతైనా ప్లేటో శిష్యుడు కదా! చాలామంది కవులు ‘కృత్యాద్యవస్థ’ను ఎదుర్కోవడం కద్దు. ఈ అవస్థ ఆదిలోనే కాదు, అంతంలోనూ ఉంటుందంటారు కొందరు. కవిత రాయడం మొదలుపెట్టిన ఏ కవీ తన కవితను ముగించడు, దానిని అర్ధాంతరంగా వదిలేస్తాడనే అభిప్రాయమూ ఉంది. ‘ఒక కవిత ఎన్నటికీ పూర్తి కాదు, అర్ధాంతరంగా విడిచిపెట్టబడుతుందంతే!’ అంటాడు ఫ్రెంచ్ కవి పాల్ వాలెరీ.
కవిత్వానికీ సత్యానికీ అవినాభావ సంబంధం ఉంది. అలాగని కవిత్వం నిండా సత్యవాక్కులే ఉంటాయనుకోవడానికి లేదు. కవిత్వం ధ్వనిప్రధానమైన కళ. స్తుతినింద, నిందాస్తుతి, శ్లేషలాంటి నానా అలంకార ప్రయోగాలు ఉంటాయి. ‘కన్నొక్కటి మిగిలెగాని కంతుడు గావే’నని ఒక కవి నేర్పుగా ఎత్తిపొడిస్తే, తనను పొగిడాడనుకొని మురిసిపోయాడు మతిలేని మారాజొకడు. ఒక్కొక్కసారి కవి మాటలు అబద్ధాల్లా కూడా అనిపించవచ్చు. అది కవి పొరపాటు కాదు. ‘ఎల్లప్పుడూ నిజాలే చెప్పే అబద్ధాలకోరు కవి’ అన్నాడు ఇంగ్లిష్ కవి జీన్ కాంక్టో. అదీ సంగతి!
Comments
Please login to add a commentAdd a comment