జన జ్వాలాదీప్తి | Suddala Ashok Teja Poetry On Tarimela Nagi Reddy | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 28 2018 1:18 AM | Last Updated on Sat, Jul 28 2018 1:19 AM

Suddala Ashok Teja Poetry On Tarimela Nagi Reddy - Sakshi

మన తరిమెల నాగిరెడ్డి – మానవతా మూర్తి
మనందరి స్ఫూర్తి
జగమెరిగిన నాగిరెడ్డి – జగజగీయమూర్తి/
కీర్తి జన జ్వాలాదీప్తి
అరుణారుణ వజ్రఖచిత ఖడ్గధితర నాగిరెడ్డి 
అణువణువున కరిగె దయా
కరుణధార నాగిరెడ్డి
క్షణం – క్షణం అనుక్షణం –
రణరంగంలాగా కదిలినాడు
దినం – దినం జీవితాన్ని –
పణం పెట్టి నిలిచినాడు
జననం – మరణం – మధ్యన
జనం కొరకు బతికినాడు    ‘‘మన‘‘

తెల్లవాడు – నల్లవాడు ఇద్దరి పరిపాలనలో
రాజద్రోహి ముద్రపడిన
మాతృభూమి ప్రేమికుడు
జీవితమే భారతీయ కమ్యూనిస్టు చరిత్రగా
విప్లవజెండా పట్టిన అనంతమహాత్ముడతడు
కటకటాల జైలులోన మల్లెలు పూయించినాడు
స్నేహం – స్వేచ్ఛా–
విప్లవ కపోతమై బతికినాడు

బావమరిది – ముఖ్యమంత్రి పీఠంపై ఉంటేనేం
కడదాకా తనది ప్రజా హృదయ పీఠమన్నాడు
వర్గ శత్రువుల వైపున –
కన్న తండ్రి ఉన్నా సరే
‘ఖబడ్దార్‌’ అని చెప్పిన
కమ్యూనిస్టు నిబద్ధుడు
బాతాఖాని షాపని – అసెంబ్లీని వదిలిపెట్టి
ఆఖరి ఊపిరిదాకా ఆగని రణ యాత్రికుడు
స్పష్టత – సమకాలీనత–
నిజాయితీ – దూరదృష్టి
సమరూపుడే నాయకుడని
ఆచరణలో చూపినాడు       ‘‘మన‘‘

విదేశీ అప్పులను తెచ్చి –
స్వదేశీ పత్రికలలోన
సదా పోజుకొట్టే
ముఖ్యమంత్రి – ప్రధానమంత్రులను
ఎన్నాళ్లీ – భారతాన్ని తాకట్టులో పెడతారని
ఏనాడో ప్రశ్నించిన ఎరుపెక్కిన కాలజ్ఞాని
మార్క్స్‌ చెప్పే సమసమాజ భావనకై పోరాడే
కమ్యూనిస్టులెప్పుడు జాతి
వ్యతిరేకులు కాదంటూ
విదేశీయ కంపెనీల –
ప్రపంచబ్యాంకు దళారుల
ఆజ్ఞలకు తలవంచిన – నాటి – నేటి పాలకులే
భారత జాతీయతకు విఘాతకులు అన్నాడు
మిత – అతి – అవకాశవాదాలకు ఎదురునిల్చి
పూలను – రాలను ప్రేమగా అందుకున్న 
స్థితప్రజ్ఞుడు ప్రజానేత          ‘‘మన‘‘

చీలినారు కమ్యూనిస్టు వీరులని
స్వార్థపరులు తమ చంకలు గుద్దుకొని
గద్దెలపై వుండనిండి
ఏదో ఒక రోజు –
మన కమ్యూనిస్టు పార్టీలు 
ఏకమై ఎర్రజెండ ఎగరేస్తాయన్నాడు
మార్క్సిజాన్ని మన దేశపు
ప్రజల సంస్కృతులతోని
కలగలిసిన నాడె ప్రజలు కలిసొస్తారన్నాడు
నిజం – కమ్యూనిజం – 
భువిని పాలించుట తథ్యమన్నాడు
కమ్యూనిస్టు విశ్వరూప
కదన గీత పలికినాడు           ‘‘మన‘‘
(నేడు తరిమెల నాగిరెడ్డి 42వ వర్ధంతి సందర్భంగా)
– సుద్దాల అశోక్‌తేజ
ప్రముఖ కవి, గీత రచయిత
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement